గానిగిల్లు

నీలగుంట కాడ  చెరకు గానిగ ఆడతా ఉండారట . మా నాగ తాత  బయిదేలతా ఉండాడు. నేనూ పోవాలనుకుంటా ఉండాను. గానిగల కాలం వచ్చిందంటే నెలగానీ రెణ్నెల్లు గానీ మా తాత ఇంటికి రాడు. మా తాతే కాదు, ఏ ముసిలోడూ ఇంట్లో ఉండడు. గానిక్కి పొయ్యికట్టి  వేసేకి ముసిలోల్లే పోయేది, పాయపోల్లు పోరు . పగలు పొద్దుగూకులూ గానిగి పొయ్యి మండతా ఉండాల్సిందే! అంత సేపు పొయ్యి కాడ కుచ్చుని పొయ్యికట్టి వేయాలంటే కాళ్ళు పట్టకపోతాయి . ముసిలోళ్లు అయితేనే ఓపిగ్గా కుచ్చోనుంటారు

మా తాత ఉగాది పండక్కు ఇంటికి వచ్చి నీళ్లు పోసుకుని, పెద్దలకు గుడ్డలు పెట్టి,

ఓలిగలు తిని, మావిటాల కాడ  మల్లా గానిగిల్లు కాడికి బయదేలినాడు. మా తాతతో  పాటు ఇక్కన పక్కన ఉండే గంగతాతా ,పోలతాత లు కూడా యెలబారినారు . “తాతా తాతా నేనూ వస్తాను తాతా ” అంటా వాళ్ళ వెనకంటి పోతిని .

“వద్దే అమ్మా, గానిగింటికి  పైన కప్పు గూడా సదరంగా లేదు. సలికి ఎట్ల పనుకుంటావు ” అన్నాడు తాత. అయినా వినకుండా వెంటపడితిని. ఏలంటే, గానిగింటికి పోతే లక్కిళ్ల బెల్లం తినచ్చు.

లక్కిళ్ళ బెల్లం అంటే బెల్లందోణి  గోడలకు అంటుకోనుండే పాకంబెల్లం. అదంటే పిల్లోళ్లకీ పెద్దోళ్ళకీ అందరికీ చానా ఇష్టం . సాగతా ఉండే దానిని పీక్కుని చుట్టలు చుట్టుకుని నోటినిండా వేసుకుని నమిలి నమిలి మింగచ్చు. ఆ రుచి చెప్తే తెలిసేది కాదు గానిగింటికి పొయి తింటేనే తెలస్తాది.  

“సరే రాయే కున్నిముండా” అని నన్ను పిలుచుకొని పొయినాడు మా తాత. మేము

పోయే తలికే ఇంకొక తాత పొయ్యికట్టి ఏస్తా ఉండాడు. నేను దోణి కాడికి పొయి, దోణికి అంటుకోనుండే లక్కిళ్లను పీకతా ఉండాను. పొయ్యి మీద బెల్లం పొంగు  ముదిరి గాతాలు పడి గమగుడతా, వంట దించే దానికి అమిరిగ్గా ఉండాది . పొయ్యికి ఆ పక్క ఇద్దురూ ఈ పక్క ఇద్దురూ నిలబడుకొని, పొయ్యిమీది పెనుమును దించి, బెల్లాన్ని దోణిలోకి పోసిరి. గోరతో దోణిలోని బెల్లాన్ని దుద్దతా ఉంటే, బెల్లం గట్టిపడి ముద్దలకు వస్తా ఉండాది. అట్లే ముద్దలు చేసి ఆరపెడతా ఉండారు. నేను ఆయాలకే ఓపినంత లక్కిళ్లు తిని నీళ్లు తాగి, బెల్లం ముద్దల పక్కనే గుడ్డ పరుసుకొని పనుకొంటి .                                                               *

మా తాతకి ఓలిగులంటే  చానా ఇష్టం. పండక్కి చేసిన ఓలిగుల్ని గొంతులు  కానా తినేసి వచ్చినాడు కదా, నడిజాము కాడ బయిటికి పోవాల్సి వచ్చి పెదబండ  దగ్గిరికి పొయినాడు. ఆ బండ కాడ నీళ్లుంటాయి. ఆడ కుచ్చుని ఆ నీళ్లతో కడుక్కుని సెరాయి కట్టుకుంటా  ఏమిటికో నీల్లగుంట కల్లా ఎగ చూసినాడు. ఆడెవరో కోలాట్లు, జక్కీకూ ఏస్తా కనిపించినారు. ఈ యప్పకు కోలాట్లన్నా, జక్కీకన్నా చానా చానా ఇష్టం. ఎంత దూరాన ఆడతా ఉండారని తెలిసినా యెలబారి పోతుంటాడు. అట్లాంటిది దగ్గిరిలోనే కనపడుతుంటే గమ్మునుంటాడా! అదరాబదర సెరాయి కట్టుకొని ఆడకి పోయినాడు .

‘ఈడిగోళ్ల  ఈలకత్తి సై, మాదిగోళ్ల  మొచ్చుకత్తి సై ‘ అని పాట పాడతా ఆడతా ఉండారు . మా తాత గబగబా దగ్గరికి పొయి చూస్తే, వాళ్ళ నాయినా, వాళ్ళ నాయినోళ్ల నాయిన తిక్కతాత, వాళ్ళమ్మా, వాళ్ళమ్మమ్మ బోయకొండమ్మా, వీరతాత పెండ్లాము నాగమ్మా, మా ముత్తవ్వా, ముత్తాతా అందరూ చేరి ఆడతా  కనిపించినారు. నాగవ్వ వాళ్లకూ మా నాగ తాత వాళ్లకూ పట్టేది కాదు, ఒకర్ని చూస్తే ఒకర్కి అయ్యేదే లేదు . ఆడ మటుకు రెండు ఇండ్లోళ్లూ ఒకటై పొయి కేళీ విలాసంగా ఆడతా పాడతా ఉండారు .

దాన్ని చూసి మా తాతకి కోపం వచ్చేసే . వాళ్ళమ్మ దగ్గరికి పొయి, “మోవ్ , మనకూ మీ నాయినోళ్ళకూ పడదు కదా, నువ్వు వాళ్ళతో మాట్లాడతా ఉండావేల” అని అడిగినాడు . ఆయమ్మ బదులు చెప్పకుండా ఆడతానే ఉండాది. గంగులవ్వ, బోయకొండవ్వలు సవుతులు. వాళ్లకు కాసుకు కూడా పడేది కాదు, వాళ్ళు కూడా బుజాల మింద చేతులేసుకుని నగునగుతా ఆడతా ఉండారు.

మా తాతోళ్ళ అమ్మ తాతను చూసి “ఒరే నాగడూ నీకు కోలాటమంటే ఇష్టం కదా, రారా కోపులు యేద్దువు” అనింది. మా తాత  ఆ మాటల్ని విని “వాళ్లకూ మనకూ పడదు , నువ్వు రామ్మా పోదాము” అని వాళ్ళమ్మ చెయ్యి పట్టుకుని పెరకతా ఉండాడు .

గానిగింటి కాడ ఉండే మిగిలిన ముసిలోళ్లు నాగతాత కోసం చూస్తా ఉండారు. “నాగయ్య పొయి ఇంచేపు అయింది, ఏమయినాడో చూద్దాము పదండి”  అని ముగ్గురు ముసిలోళ్లూ ‘ఒరే నాగడూ … ‘ అని అరస్తా బయిదేలిరి. వెతకతా వెతకతా పెదబండ కాడికి పోయేతలికి, అక్కడ ఒక పెద్ద గుండుకు వేలాడుతుండే తీళ్లతీగల్ని పట్టుకొని పెరకతా” రామ్మా పోదాము … ” అంటా ఉండాడు నాగతాత. ఆ పెద్దగుండు ఉండే తావు ఒలుకులు. మా ఊర్లో సచ్చినోల్లను పూడ్సి పెట్టేతావు అదే!

ఈ ముసిలోళ్లు పొయి “రేయ్ నాగా ,ఏమయిందిరా, ఎవర్ని పిలుస్తుండావు” అని తాతని పట్టుకుని లాగినారు. అప్పుడు సొరణ వచ్చిన నాగతాత చుట్టూ చూసి కండ్లు తిరిగి పడిపొయినాడు.

వాళ్ళు ముగ్గురూ నాగతాతను ఎత్తుకొని గానిగింటికి  తీసుకొచ్చిరి. ఆ రెయ్యి జరిగిన ఈ కతనంతా తెల్లారి లేసి నాకు చెబతా ఉంటె వినిన నాకు ఉచ్చలు పడిపోయే! దేనికంటారా? నాగతాతకు కనపడింది ఒలుకుల్లోని దెయ్యాలు. ఆ దెబ్బతో నేను గానిగింటికి పొయ్యేదే చాలించేస్తిని .

  –  ఎండపల్లి భారతి

 

 

ఎండపల్లి భారతి: 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి తాలూకా లోని దిగువబురుజు గ్రామంలో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు.  గత  15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక ‘నవోదయం’లో పనిచేస్తున్నారు. ముప్పై కథలతో  ‘ఎదారి బతుకులు’ పేరుతో వీరి కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు. ఫోన్ నెంబర్ : 9652802460 mail id :navobharathi@gmail.com

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి: 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి తాలూకా లోని దిగువబురుజు గ్రామంలో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు.  గత  15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక 'నవోదయం'లో పనిచేస్తున్నారు. ముప్పై కథలతో  'ఎదారి బతుకులు' పేరుతో వీరి కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు. ఫోన్ నెంబర్ : 9390803436 mail id :navobharathi@gmail.com

4 comments

  • పల్లెపట్టులలో పెరిగినవారికి దెయ్యాలు సుపరిచితాలే.దెయ్యాల గురించి సింబాలిక్ గ రాసిన వాళ్ళు వున్నారు . కె యెన్ వై పతంజలి వంటివారు. దెయ్యాలని గురించి అచ్చమైన పల్లెటూరి భాషలో నేపథ్యంలో యిలా రాసినవారు అరుదు. దెయ్యాల గురించి పలవరిస్తూ రచనలు చేసిన నేను, యిలా సహజ గ్రామీణ నుడికారంతో కూడిన మరిన్ని దయ్యం కథల కోసం వేచిచూస్తాను.
    యింతకీ దెయ్యాలు ఎవరికి కావాలి చెప్పండి. వాటివల్ల ఏమి సామాజిక ప్రయోజనం ఉంది అని భావించే వారు ఉంటారు.ధైర్యం చేసి దెయ్య౦ కతని రస్తాపైకి తెచ్చిన సహృదయ సంపాదకవర్గానికి కృతజ్ఞతలు.

  • రాయలసీమ యాస ఎంత తియ్యగా ఉండి. బెల్లం జీడిలా

  • చెడ్డి జేబులో అతుక్కు పోయిన లక్కుళ్ళ బెల్లం లాగా మనసును పట్టిన కథ భారతీ అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.