ముగ్గు

నవరి నెల కావడంతో చలి బాగానే వణికిస్తోంది. దానికి తోడు తెల్లవారుజామున బాగా మంచు కురిసినట్లుంది. మరింత చురుగ్గా పదునుగా శరీరాన్ని తాకిన చల్లని గాలులు వణుకు పుట్టిస్తున్నాయి.

ఈ రోజునుంచి తనకు సంక్రాంతి శలవులు అన్న విషయం గుర్తుకు వచ్చిన సంతోషం లోపల్నుంచి తన్నుకు వస్తుంటే బయటి చలిగాలి వణుకు పుట్టిస్తుంటే వెంటనే కాఫీ పెట్టుకుని తాగేసి శరీరాన్ని వెచ్చబరుచుకోవాలనిపించింది స్వాతికి. వెంటనే వంటింట్లోకి వెళ్లి స్టౌ వెలిగించి కాఫీ తయారు చేస్తూ, ”ఇవాళ ఏమేం పనులు చెయ్యాలా” అని ఆలోచిస్తూంది. అమ్మకు ఫోన్ చెయ్యాలి, చాలా రోజులైంది కనుక జయంతితో కలిసి సినిమాకు వెళ్ళాలి. ఇలా ఈ రోజు చెయ్యవలిసినవి వరుసగా జ్ఞాపకం వచ్చేసరికి నవ్వొచ్చింది. శలవుల్లో ఏమేం పనులు చెయ్యాలో ముందునుంచే ఆలోచిస్తూ ఉండడం, ఆ శలవులు వచ్చిన తరువాత ఏ ఒక్క పనీ చెయ్యలేక పోవడం ఎన్నో సార్లు జరిగింది. ఈ రోజూ ఇక ముందూ అలా జరగదని చెప్పడానికి వీలు లేదు కనుక నాయినమ్మ చెప్పినట్లు దేవుడు ఈరోజు ఏమేమి చెయ్యమంటే అవి చెయ్యాలి. అంతేగానీ మనం ముందుగా ఏమీ చెయ్యలేం అనుకుని నవ్వుకుంది స్వాతి.

‘దేవుడు కాఫీ చేసుకోమన్నాడు. చేసుకున్నా. కప్పులో పోసుకోమ్మన్నాడు పోసుకున్నా. ఇంకా స్టౌ ఆపెయ్యమనడా? అంటాడు. ఆమాత్రం దేవుడికి తెలియదా ఏమిటి?’ ఆఫ్ చేసింది. ‘ఇక పేపర్ చూసుకోమ్మన్నాడు చూద్దాం.’ ఈ మాటలు మనసులో అనుకోకుండా బయటికే అనేసి మనసారా నవ్వుకుంది స్వాతి. కప్పు చేత పట్టుకుని గేటు దగ్గర పడేసిన పేపర్ కోసం వెళ్ళింది. గేటు దగ్గర్నుంచి వీధికేసి చూస్తే ఇరువైపులా వాళ్ళ వాళ్ళ గుమ్మాల ముందు ఆడవాళ్ళు శ్రద్ధగా ముగ్గులేసుకుంటున్న దృశ్యం. కొన్ని ఇళ్ళ ముందు తెల్లవారక ముందే పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. వేసిన వాళ్ళు తమ కళాప్రతిభను పక్క వాళ్లకు ప్రదర్శించి, పక్క వాళ్ళ కళా ప్రతిభను తాము పరిక్షిస్తున్నట్లుగా పక్కన వేస్తున్న ముగ్గులను దీక్షగా చూస్తున్నారు. మొత్తం మీద ఆ వీధి ఆడవాళ్ళంతా చీర కుచ్చిళ్ళను పైకి చెక్కి ముగ్గు పిండిని చేత్తో పట్టుకుని చలిని లెక్క చెయ్యకుండా క్రమశిక్షణ కలిగిన సైనికుల లాగ ముగ్గులు వేసుకోవడంలో మునిగి పోయారు.

‘హు’ అని నిట్టూర్చి పేపరందుకుని వచ్చి ముందుగదిలో కూర్చుంది. కాఫీ తాగుతూ ఒక్కో పేజీ తిరగేసింది. కొత్త రాజధాని ఎంతవరకు వచ్చింది. రాయలసీమ గొప్పదనమెంత, రాజకీయాలలో కొత్త మలుపులూ ఇలా రకరకాల వార్తలతో సింగిల్ కాలం వార్తల వరకు వచ్చింది. ఆ వరుసలోనే “మహిళలకు ముగ్గుల పోటీ” కూడా కనబడింది. వచ్చే ఆదివారం ఎక్జిబిషన్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీ, స్థానిక మహిళా మండలి వారు ఈ ముగ్గులపోటీని నిర్వహిస్తున్నారు. విజేతలకు కలెక్టర్ గారి భార్య చేత బహుమతి ప్రధానం.

కాఫీ రుచి లేనట్లుగా అనిపించింది స్వాతికి. ఈ కలెక్టర్ల భార్యలకూ, స్థానిక మహిళా మండలిలోని ఆడ వాళ్లకూ ముగ్గు వేయడం కూడా వచ్చి వుండదు. వాళ్ళ ఇళ్ళముందు పనిమనుషులు వేస్తూ వుంటారు. ముగ్గు వేయడం తెలియక పోయినా, తెలిసి వేయక పోయినా ముగ్గు కళను పోషించే హృదయం మాత్రం వీరికుంది. అవును మరి! లలితకళలు స్త్రీల సొత్తు. వొంటికి కొంచం వెచ్చదనం ఇచ్చేందుకు తను కాఫీ చేసుకుని తాగింది కానీ కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువ వెచ్చదనం వచ్చేసినట్ట్లుంది. పైగా ఈ వెచ్చదనం ఒక్క వంటి మీదే కాదు ఆమె మనసు మీదా ఆలోచనల మీదా మొత్తం జీవితాన్నంతా కమ్మినట్లనిపించింది.

స్వాతి పెళ్లి పెద్దలు చూసి చేసిన సాంప్రదాయ బద్దంగా జరిగిన పెళ్ళే. అయితే వారు చట్ట బద్దంగా విడిపోయారు. తన భర్త ప్రభాకర్ కన్నా తనకు తెలివితేటలూ చదువూ ఎక్కువ ఉన్నందున తను పడవలసిన నరక యాతనంతా పడింది. ఆ శిక్ష కూడా చాలదనుకున్నాడేమో, మరో పెళ్ళాన్ని వెతికి తెచ్చుకుని తన ముందే సంసారం పెట్టాడు. దాంతో వారిద్దరూ కోర్టు ద్వారా విడిపోయారు. మనసు స్థిమితం చేసుకుని ఉన్న చదువుతో టీచర్ ఉద్యోగం సంపాదించుకుంది తను. తన వూరికి కొంచం దూరంలోనే వున్న పల్లెటూరిలో తన వుద్యోగం. “వుద్యోగం వద్దూ ఏమీ వొద్దు. వున్న కొద్దిపాటి పొలంతో ఎలాగో బ్రతుకుదాం రమ్మ”ని అమ్మ మొదట్లో బాగానే గొడవ చేసింది. తరువాత కాలం గడిచేకొద్దీ సర్దుకోక తప్పలేదు అమ్మకు. వుద్యోగం వచ్చిన వూరిలో ఒక చిన్న ఇల్లును అద్దెకు తీసుకుని అక్కడికే మకాం మార్చింది.

ఓనర్ పేరు చిట్టెమ్మ. ఆమె పేరుకు మాత్రమే చిట్టెమ్మ. బుద్ధిలోనూ, ఆకారంలోనూ చాలా పెద్దమ్మ. కాలక్షేపం కోసమని ఊరిలోని పిల్లలకు ట్యూషన్లు చెప్పేది స్వాతి. ఆ పిల్లల తలిదండ్రులు వచ్చి మాట్లాడే వారు. ఇక చిట్టెమ్మ ఆరాలు తీయడం ప్రారంభించింది. “పెళ్లి అయిందా? ఐతే హాయిగా సంసారం చేసుకోకుండా ఉద్యోగం చేయడం ఎందుకు? అమ్మానాన్నలు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?” ఇలా మొదట్లో ఏదో మామూలుగానే అడుగుతోందని అన్ని వివరాలు చెప్పింది కానీ తన మాటల్ని ఆమె నమ్మినట్లు లేదని అవే ప్రశ్నలు మార్చి మార్చి అడగడంతో స్వాతికి విసుగేసింది.

ఇంతకుముందు అడిగారు, చెప్పాను, అనడంతోపాటు ఇక చెప్పను అన్న సూచన కూడా చేసింది స్వాతి. దాంతో చిట్టెమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. తనతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చాటుగా వినడం ప్రారంభించింది. ఇలా చిట్టెమ్మ జబ్బు రకరకాల సైడ్ ఎఫ్ఫెక్ట్లకు దారి తీసింది. అందులో ముఖ్యమైంది ఇంటిముందు రోజూ ముగ్గు వేయాలన్న షరతు. చిట్టెమ్మ మొగుడు చిట్టెమ్మ ఇంటికి ఓనరేకాక నాలుగు ఆటోలకు కూడా ఓనర్. ఒకటి తను నడిపేవాడు. మూడు అద్దెకిచ్చేవాడు. రోజంతా పట్నంలో ఆటో నడిపి సాయంత్రానికి ఇంటికి చేరేవారు అతని ఆటో సిబ్బంది. ఆ ఇంటిముందు రోడ్డుమీదనే ఉంటారు కనుక మగాళ్ళ కళ్ళకు ముగ్గు లేని గుమ్మం కనబడుతుంటే చిట్టెమ్మకు చచ్చేంత సిగ్గుగా ఉంటుందట. మొదట్లో అలాంటి షరతు ఏదీ లేదని గుర్తుచేస్తే “వీధి ముందు గుమ్మం ఉన్నప్పుడు ఆమాత్రం తెలీదా? ఆడదానివి కాదూ?” అంది.

ముగ్గు వేయడమన్నది ఆడవాళ్ళకు సంబంధించిన పనే ఐనప్పుడు ఆ సంగతి మగాళ్లకు ఎందుకూ? గుమ్మం ముందు ముగ్గు వేస్తే అంత బాగుంటుందని అనుకున్నప్పుడు వాళ్ళెందుకు వేయకూడదూ? ఈ వాదనతో చిట్టెమ్మకు పిచ్చేక్కిపాయింది. మరింత దురుసు తనానికి దిగి దేనికో ఒక దానికి పోట్లాట పెట్టుకునేది. జయంతి సలహా ప్రకారం పనిమనిషితో ముగ్గు వేయిద్దామా అని ఒక బలహీన క్షణంలో అనుకుంది కూడా. వెంటనే తనను తాను తిట్టుకుంది. స్వాతి తన పరిధిలో ఉంచుకోవాలని చిట్టెమ్మ ఆశ. పనిమనిషి కూడా ఆడదే. ముగ్గు వేసేది తను కాదు గదా అని సరిపెట్టుకోలేదు. ఇల్లు ఖాళీ చెయ్యకుండా ఉండేందుకు ఇంత దిగజారిపోవలసిన అవసరం లేదు. వేరే ఇంటికి మారాలని నిశ్చయించుకుంది. ఇంటికోసం వెతికేటప్పుడు “గుమ్మం ముందు రోజూ ముగ్గు వేయాలి”. అనే షరతు కూడా కొన్ని చోట్ల ఎదురైంది. “అది మాత్రం కుదరదు, నేను వేయను” అందొకచోట. ఆ ఇంటావిడ చాలా సౌమ్యంగా నవ్వుతూ “ముగ్గు వేయడం మీకు రాదేమో. పోనీ మా పనిమనిషితో వేయిద్దాం” అని సలహా ఇచ్చింది. “ముగ్గు వెయ్యడం రాకేం? వచ్చినా వేయను, పనిమనిషిచేతా వేయించను” అంది. అప్పుడు తెలిసింది తనకు, ముగ్గు అనేది పైకి చిన్నదిగా కనిపించినా అది చాలా పెద్ద విషయమని.

స్త్రీకి స్త్రీయే శత్రువంటే ఏమిటో అర్థమైంది స్వాతికి. లేకుంటే వొక చిన్న ఇంటి కోసం అన్వేషణలో ఇన్ని కండిషన్లా? మనుషులకు ఏవేవో కస్టాలు రావడం చూసింది. కానీ ఇలాంటి ముగ్గు కష్టాలుంటాయని తనకు తెలియదు.

చివరకు పక్క వీధిలోనే వొక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని దాంట్లోకి మారిపోయింది స్వాతి. అద్దె కొంచం ఎక్కువైనా ఇంటి వాళ్ళు కొంచం దూరంగా ఉండడం, ముగ్గు షరతు పెట్టకపోవడం తనకు నచ్చింది. అయితే తన అంచనా తప్పని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. ఆడవాళ్ళలో మోతాదులో తేడా తప్పితే ఎక్కువమంది చిట్టెమ్మలే వున్నారని తెలిసి పోయింది తనకు. పక్కింటావిడా, డిగ్రీ చదువుతున్న ఆమె కూతురూ ఎప్పుడు చూసినా ఇంటిని కడుక్కుంటూనో, చిన్న చిన్న గుడ్డ పేలికలు పట్టుకుని గోడల్ని తుడుస్తూనో కనిపిస్తారు. ఏ పుస్తకమో పేపరో పట్టుకోగా చూడలేదు వాళ్ళను.

రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు చేసే ఇంటి చాకిరీ చూస్తే జాలేస్తుంది. ఇటుకలూ సిమెంటుతో కట్టిన ఆ ఇల్లే వాళ్ళ జీవితసర్వస్వమైనట్లు వేరే జీవితం ప్రపంచం లేనట్లు కనిపిస్తారు. “ చూశారా, ఎలాంటి పిల్లను తెచ్చి పెట్టారో, నా ముఖాన ముగ్గు లేదు, వారానికోసారైనా కడగడం లేదు” అని ఇల్లు కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళతో చెప్పుకున్నట్ట్లుగా, వారానికోసారి ఇల్లు కడగమని స్వాతికి చెప్పడం మొదలు పెట్టారు.

“చూడండీ, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం నాకే మంచిది. నా సామాన్లు ఎంత నీటుగా ఉంటాయో మీరే చూడండి. ఇంకా గదిని కడుక్కుంటూ ముగ్గులు వేయడం అంటారా, నాకు కుదరదు. నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఎన్నో వున్నాయి”. అని తెగేసి చెప్పింది స్వాతి. దానితో వాళ్ళ ముఖాలు ముడుచుకున్నాయి.

వాళ్ళు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అనడం మొదలు పెట్టారు. “ఇల్లు శుభ్రంగా లేకపోతే మా ఆయనకు మహా కోపం” లాంటి సూచన నుంచి ఇంటిముందు ముగ్గు లేకపోతే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అని ఆ దరిద్రం స్వాతినే అన్నట్ట్లు ముఖం వికృతం చేసుకుని చూడడం వరకు వెళ్ళింది. కొన్ని సార్లు విననట్లు ఊరుకున్నా వాళ్ళ ఇంటి చాకిరి చూసి కంపరమెత్తినప్పుడు తనూ కసిగా పోట్లాడేది.

“ఆ దరిద్రమేదో ఈ ఇంట్లో ఉంటున్న నాకే వస్తుంది, మీకేం?మీ అదృష్టం మీకుందిగా” అంది. అలా కాదట. దరిద్రం తనను వదిలేసి పక్క వాళ్ల మీదకు పోతుందట. ఆ విధంగా అనలేదుకానీ వాళ్ళ సారాంశం అదే.

“నిజమే, దరిద్రం పట్టుకోక పోతే అస్తమానం అలా చాకిరీ చేస్తూనే ఉంటారా” అనుకుని నవ్వుకుంది. “మా ఆయనకు మహా కోపం” అన్న మాటకు తనకు ఆయన లేదు. కోపమొచ్చినా ఏదొచ్చినా తన సొంతమే అని ఇంకా రెచ్చగొట్టింది. ఫలితంగా మళ్ళీ ఇల్లు వెతుక్కోడం మొదలైంది.

అప్పుడే ఏడున్నర కావడం చూసి స్వాతి మిగతా పనులకోసం కాఫీ కప్పు అందుకుని చటుక్కున లేచింది. ఈ లెక్కన ఈ రోజు చేయవలసిన పనుల్లో ఇల్లు వెతుక్కోడం కూడా ఒకటి. తను ఇందాక దీన్ని మరచిపోయింది. ఇలా ఆలోచిస్తూ కూచుంటే ఏపనీ చేయకుండానే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది.

సంక్రాంతి ఇక రెండు రోజులే ఉంది. ఈ సంక్రాంతి శలవుల్లో ఇల్లు వెతుక్కోడమే జరగలేదు. అయినా వీళ్ళ మాటలు విని వోనర్ ఇంకా ఇంటిని ఖాళీ చేయ్యమనలేదు కదా అనుకుంది.అప్పుడు గుర్తొచ్చింది. ఐదారు రోజులుగా పక్కింటావిడ కనిపించడంలేదనీ కూతురోక్కటే ఇంటి చాకిరీ చేస్తూందనీ. పుట్టింటికి వెళ్లిందేమో. కూతుర్ని వదిలేసి ఒక్కతే వెళ్లి ఉంటుందా.

కూరగాయలు కొంటూ వుంటే ఆ వీధిలోనే ఉండే సరోజమ్మ కలిసింది. సరోజమ్మ చెప్పిన వివరాల ప్రకారం ఆమె పుట్టింటికే వెళ్ళింది. అయితే పండుగకు కాదు. వాళ్ళ నాన్న దగ్గర ఏడ్చి పోట్లాడి యాభై వేల డబ్బు తేవడానికి వెళ్ళింది. కాదు వెళ్ళగొట్టబడింది. ఈమె తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలే. ఈ మధ్య కాలంలో ఈమె అక్క కూతురుకు రెండు లక్షల కట్నంతో పెళ్లి చేశారు. ఆ కట్నం డబ్బులో యాభై వేలు ఈమె తండ్రి ఇచ్చాడని ఈమె మొగుడికి తెలిసింది.

“నువ్వూ నీ కూతురు కట్నానికి మీ నాన్ననడిగి యాభై వేలు పట్టుకొస్తే నా గుమ్మం తొక్కు. లేకుంటే మీ అమ్మా నాన్నల దగ్గరే ఉండు” అని గెంటేసాడట.

“”స్త్రీకి స్త్రీయే శత్రువు” ఎలా అవుతుందో అర్థమవుతోంది. “ఆడదానివి కాదూ, ముగ్గు వేయడం రాదా?” అన్నా “ఇల్లు శుభ్రంగా లేకపోతే మా ఆయనకు మహా కోపం” అన్నా స్త్రీలు ఏ నేపథ్యంలోంచి ఏ పంజరంలో వుండి ఆ చిలక పలుకులు నేర్చుకుని వల్లె వేస్తున్నారో అర్థమవుతూనే వుంది.

“ఇల్లు చూసి ఇల్లాలిని చూడు.” అవునవును, ఇల్లాలు ఇలా అనుకునే మురిసి పోతూ వుంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే మొగుడు బయట పడతాడు. అప్పుడా ఇల్లాలు వీధిలో పడుతుంది. అంతవరకూ ఇంటి సామ్రాజ్యమంతా ఇల్లాలిదే.

పక్కింటావిడ కూతురు ఒక చేత్తో బకీటూ మరొక చేత్తో అలుకు గుడ్డా పట్టుకుని వరండా తుడుస్తూంది. ఇలా అస్తమానం వ్యసనం పట్టుకున్నట్లు చాకిరీ చేసిన ఇల్లాలు హీన స్థితిలోకి వెళ్లి పోయింది. యాభై వేలు పట్టుకొస్తే మొగుడు మళ్ళీ ఈమెకు గృహసేవా భాగ్యం ఇస్తాడు. తన కట్నం డబ్బుకోసమని తల్లిని అంత అవమానించి తరిమితే ఆ తండ్రిని అసహ్యించుకుని తల్లి వైపు నిలబడకుండా డిగ్రీ ఈ కాబోయే ఇల్లాలు యధాప్రకారం చాకిరీ చేస్తూనే వుంది. ఆ ఇల్లాలికీ ఈ కాబోయే ఇల్లాలికీ ఇదేమీ ఘోరంగా కనిపించక పోవచ్చు. సంసారం చక్కబెట్టుకోవడంగానే అనిపించవచ్చు.

ఇక ఆ అమ్మాయిని చూడలేనట్లు స్వాతి వీధి వైపుకోచ్చింది. వీధిలో ప్రతి ఇంటిముందూ తీర్చిన ముగ్గులు.

పద్మవ్యూహంలాంటి ముగ్గులవి. ఎంతో తెలివితో ఎంతో నేర్పుతో ఒక గీత నుండి ఇంకో గీతకు, ఒక చుక్కనుండి ఇంకొక చుక్కకు ఎలా కలిపిందీ ఎంత నిశితంగా పరిశీలించినా కనిపెట్టలేనంత గొప్పగా వేసిన ముగ్గులు.

ఈ ముగ్గులు వేయడం అంతరాయం లేని నిరంతర ప్రక్రియ. ఈ ముగ్గుకు పూర్తి, అసంతృప్తి అన్నదే లేదు. సుందరమైన సుకుమారమైన వేళ్ళు కాదు ముగ్గు వేస్తున్నది, బలంగా వున్నా మొగ వేళ్ళు. ఆ ముగ్గు మధ్యలో, పూల మధ్యలో పేడ గొబ్బిళ్ళు. కాదు… ఆడ పేడ గొబ్బిళ్ళు గొబ్బి దేవతలు, ఆ దేవతలలో చిట్టెమ్మ, పక్కింటావిడ, ఆమె కూతురు తన లాంటి మాజీ ఇల్లాలు, ఇందులోనే… ఇందులోనే… ఇందులోనే…

(ఈ కథలో బొమ్మ రాజశేఖర చంద్రం గారు గీసి పంపినది, వారికి ‘రస్తా’ కృతజ్ఞతలు… ఎడిటర్)

– గాయత్రి దేవి

 

 

గాయత్రీ దేవి: పుట్టడం, చదవడం, పెళ్ళీ, ఉద్యోగం… అన్నీ కర్నూలు పట్టణంలో. ప్రస్తుతం ఒక ప్రైవేటు స్కూలులో టీచర్ గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. 50 కి పైగా పిల్లల కథలతో కలిపి సుమారుగా 60 కథలు వ్రాశారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో డజనుకు పైగా వ్యాసాలూ వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన కథలూ ప్రసారమయ్యాయి.

గాయత్రి దేవి

గాయత్రీ దేవి: పుట్టడం, చదవడం, పెళ్ళీ, ఉద్యోగం... అన్నీ కర్నూలు పట్టణంలో. ప్రస్తుతం ఒక ప్రైవేటు స్కూలులో టీచర్ గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. 50 కి పైగా పిల్లల కథలతో కలిపి సుమారుగా 60 కథలు వ్రాశారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో డజనుకు పైగా వ్యాసాలూ వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన కథలూ ప్రసారమయ్యాయి.

2 comments

  • నిజంగా చాలా బాగుంది మేడం, ముగ్గు లో కూడా ఇంత లోతు ఉంటుందా అని ఫీల్ అయ్యాను. బట్ ఇట్స్ ట్రూ…. ఎట్ ది సేమ్ టైం ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు పోద్దున్నే లేచి ముగ్గు వేయడం కంటే ఎక్సాంస్ కి ప్రిపేర్ అవడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని నా అభిప్రాయం.

  • ఈ మధ్యే నాకు తగిలిన ఒక పిల్ల ఇల్లు సర్దుకోవడం టైం వేస్ట్ అనేసింది.. వామ్మో అనుకున్నా కానీ మెల్లిగా ఆలోచిస్తే నేను చాలా సమయం కేటాయిస్తున్నట్టు అనిపించింది. చిన్న పిల్లయినా చక్కగా చెప్పింది అనుకుని నేను కూడా కొంచెం లయిట్ తీసుకుంటున్నా.. 🙂

    కథ బాగుంది అండీ..మంచి విశ్లేషణ …

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.