దిక్కుల్లేని వాడు

చల్లటి మలయపవనాల్లో విహరిస్తున్నవాడికి, కార్చిచ్చు సెగేదో మెల్లగా సమీపిస్తున్నట్లు అసౌకర్యంగా అన్పించి, నిద్రనుంచి తటాలున మేల్కొన్నాను.
తెరిచిన కిటికీలోంచి, రోజూ నాపైన దయగా వ్యాపించే చల్లటి నీడ బదులు, ఉదయకిరణాలు కళ్ళల్లోచురుగ్గా గుచ్చుకున్నాయి. జోలపాటలాంటి పక్షుల కలకలరావాలు బదులు కఠోరమైన గొడ్డలిచప్పుళ్ళు వినిపిస్తున్నాయి.
కిటికీలోంచి పక్కింటి ఖాళీస్థలంలోకి చూపు సారించిన నేను అక్కడి దృశ్యం చూసి నివ్వెరపోయాను.
నిద్రకళ్లతోనే గబగబా అక్కడికి చేరుకున్న నన్ను చూసి, శామ్యూల్ నవ్వుమొహం తో నావద్దకి వచ్చాడు. ఆ ఖాళీస్థలంలోని పెద్ద వేపచెట్టుని నరికేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఇద్దరు కూలీలు. అప్పటికే దాని కొమ్మలన్నీ నరికేసారు. ఇక మొదలు తవ్వి, తొలగించే కార్యక్రమం మొదలౌతూంది. ఇరుగుపొరుగు నిశ్శబ్దంగా నిలబడి చూస్తున్నారు. వారిలో తెల్లటి లాల్చీ, పంచెతో, విభూతి బొట్లతో ఉన్న ఒక వృద్ధుడిని చూసాక, విషయం అర్ధమైంది.
అయినా, శామ్యూల్ ని ఏమైందని అడిగాను.
ఆ విశాలమైన స్థలం మొన్నటివరకూ అతడిదే. ఆర్థిక ఇబ్బందుల వల్ల సగం స్థలం అమ్మేశాక, దానికి హద్దుగా, మధ్యలో చిన్న గోడ వెలిసింది. అప్పుడు,ఉత్తరం దిక్కున ఉన్న చెట్టు కాస్త ఇప్పుడు తన భాగంలో ఈశాన్య దిక్కుకి వచ్చింది.. ఈశాన్యాన మరి బరువైనవి ఉండరాదు గనుక, ఇప్పుడు ఆ చెట్టుకి ఆయుస్సు మూడింది.
ఆతడు చెప్పింది విన్నాక, దాన్నెలా ఆపాలో తెలీక, నిస్సహాయంగా అన్నాను. “శామ్యూల్. ఇలాంటి నమ్మకాలు మీకు ఉండవనుకుంటాను. మరి నువ్వెంటి ఇలా…?”
“మంచి ఎక్కడున్నా పాటిస్తే, తప్పేముందండీ? ఆ మాటకొస్తే, మీరు నమ్మే సిద్ధాంతాలు మాత్రం ఇక్కడివా?”
ఆ మాటలకి నోరు తెరిచిన నేను, చుట్టూ అందరూ గోలగా అరిచేసరికి, స్పృహలోకి వచ్చాను. ఇంకా నాతో మాట్లాడే ధ్యాసలో ఉన్న శామ్యూల్ రాబోతున్న ప్రమాదం గమనించలేదు.
మొదలు కూలుతున్న చెట్టు సూటిగా అతని తలపైకి దూసుకువస్తోంది. ఒక్క అంగలో సమీపించి, అతడ్ని వేగంగా పక్కకి లాగేసాను. అది ఫెళఫెళ మంటో శబ్దం చేస్తో, సరిగ్గా అతను ముందు నించున్న స్థలంలో కూలింది. అతడి ముఖం పాలిపోయింది.
” చూసావా శామ్యూల్. దాని జోలికి పోకుండా వుంటే, నీకీ ప్రమాదమే ఎదురయ్యేది కాదేమో. పాపం సిద్ధాంతి నీకీ విషయం చెప్పుండరు” అన్నాను, దగ్గర్లోనే వున్న వృద్ధుడి వంక చూస్తూ.
నా వెటకారం ఏమీ పట్టించుకోకుండా, ” ఇదుంటే, ఇలాంటి ప్రమాదాలు ఇంకెన్ని వచ్చుండేవో ఎవరికి తెల్సు సార్ ” అన్నాడు అతను.
“అది కాదు శామ్యూల్. భూమి నలుచదరంగా లేదని చిన్నప్పుడే చదువుకున్నావు కదా. కొన్ని కొండగుర్తులుగా, మన సౌకర్యం కొద్దీ పెట్టుకున్న పేర్లే తప్ప, గుండ్రంగా వుండే వస్తువుకి దిక్కులంటూ ఉంటాయా?”
అతడు తేలిగ్గా నవ్వేశాడు. ” మీతోటి మేమేం వాదించగలం? మానవహక్కులంటూ అలాగే ఉండిపోయారు గానీ, లేదంటే రాంజెఠ్మలానీ అంతటి పేరు తెచ్చుకునేవారు కాదూ!”
నాక్కావాల్సింది ఆ ప్రశంస కాదు గనుక, ఇక మారుమాట్లాకుండా, బయటికి నడిచాను.

* * * *

“వీడి దుంపతెగ. రాంజెఠ్మలానీతో పోల్చాడు. కనీసం కృష్ణయ్యర్ తోనన్నా పోల్చాడు కాదు” సణుగుతో ఇంట్లోకి వెళ్తోంటే, మాధవి ఫక్కున నవ్వింది.
ఆమె అంతా గమనించిందని అర్ధమయింది.
“…ఇలా మనింట్లోనే వాస్తు విద్వాన్లు బయల్దేరి, కొంపలతో పాటు చెట్లూచెమలూ కూలుస్తారని నేనెన్నడూ ఊహించలేదు” అన్నాను.
నా ధుమధుమలకి ఏమాత్రం జంకకుండా, తండ్రిని వెనకేసుకొస్తూ అందామె. “చెప్పేవాళ్ళు సరే! వినేవాళ్ళు తర్కించుకుండా, అవన్నీ నమ్మేయడమేనా?”
“అయినా అనారోగ్యంతో ఉన్న మనిషి , విశ్రాంతి తీసుకోకుండా తెయ్యిమని పొద్దుటే బయల్దేరక పోతే ఏమైంది?” అన్నాను.
ఆమె ఏదో జవాబు చెప్పేలోపు, బయట మావగారు వచ్చిన అలికిడి విన్పించడంతో మా సంభాషణ ఆగింది.
పిల్లలిద్దరూ ఆయన మీదకు ఎగబాకి, ఆ చెట్టుగూర్చి, తమ ప్రశ్నలు గుప్పించడం, ఆయన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి ఆవుతున్నట్లూ తెలుస్తోంది.
అయినా, మేమిద్దరం పిల్లల్ని ఏమీ వారించలేదు. ఆయనకి సరైన జవాబు ఏ సంకోచమూలేని పిల్లల ప్రశ్నలే అని మా అభిప్రాయం.
మావగారిలో నాకు నచ్చేది ఆయన మెత్తటి స్వభావం. మూగజీవాలన్నా, చెట్లూచేమలన్నా ఆయనకి తగని ఆపేక్షే. వాటిని తన ఊళ్లో ఎంతో ప్రీతిగా పెంచేవారని మాధవి చెబుతూంటుంది. ఆయన చిన్నవయసులోనే కూలీగా తన జీవనయానం ప్రారంభించి, చివరకి తన ఊర్లోనే భవననిర్మాణ మేస్త్రిగా ఎదిగారు. మొదట్లో తనకున్న కొద్దిపాటి అక్షరజ్ఞానంతో, మెల్లగా వాస్తు కూడా చెప్పనారంభించారట. ఈయన పైన గురివున్న కొంతమందికి కలిసిరావడంతో, అసలు వృత్తి కన్నా ఈ ప్రవృత్తి వల్ల పేరు సంపాదించుకున్నారు. ఆ పేరు కాస్త ఇక్కడికీ పాకడంవల్ల, మా ఇష్టాలతో నిమిత్తం లేకుండా, చాటుమాటుగా సలహాల కోసం శామ్యూల్ లాంటివారు ఎవరో ఒకరు బయటికి తీసుకుపోతూవుంటారు.
ఆయన దాన్ని ఒక ఆదాయపు వనరుగా ఎన్నడూ చూడలేదనీ, అదో సేవగా ఆయన అభిప్రాయమని తెల్సు. మా అత్తగారు చనిపోయాక, చాన్నాళ్లు ఒంటరిగానే ఆ ఊళ్ళో ఉండిపోయారు తప్ప, మా వద్దకి రాలేదు. ‘కూతురింట్లో వుండడమేమిటి, లోకవిరుద్దం కాకపోతే ‘ అనేవారట. మరి లోకసహజంగా ఉండాలంటే, ప్రవాసంలో ఉన్న కొడుకు వద్దకి వెళ్ళాలి. అది అయ్యేపని కాదు. కానీ తర్వాత్తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కిడ్నీలు పాడైపోయి, వారం వారం డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయారు. ఆ క్రమంలోనే ఆయనకి ఇష్టంలేకున్నా, మావద్దకి వచ్చారు. వచ్చాక, ఆయనకి తరచూ ఎదురయ్యే ఇన్ఫెక్షన్లకి, డయాలసిస్ సమయంలో ఆయన బాధ చూసి, నాకు చాలా యాతనగా ఉండేది. మాధవి అయితే కన్నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటుంది. ఆయన మాత్రం అంతగా బెంబేలు పడినట్లు కన్పించరు.
ఆయనలో ఆ స్థితప్రజ్ఞతా, మెత్తటి స్వభావం నచ్చినట్లే, శాస్త్రం పేరిట ఇలా కర్కశంగా మసలుకోవడం నాకు నచ్చదు. దానికి నావైపు నుండి వాదనుంటుంది. ఆయనవైపు నుండి ప్రతివాదనగా చిన్న చిరునవ్వు ఉంటుంది అంతే!
ఇలా ఒకే ఇంట్లో భిన్న దృక్పథ స్రవంతులు విడిపాయలుగా సాగుతున్నాయి.

* * * *

‘ఒక తీతువు పిట్ట అరచుకుంటూ, దక్షిణం దిక్కుగా సాగిపోయింది’ అన్న వాక్యం చదువుతూనే, పుస్తకం విసుగ్గా పక్కన పడేసి, కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాను. ఎవరో క్లయింట్ కాలక్షేపానికి తెచ్చుకుని, మర్చిపోయిన పుస్తకం అది.
అప్పుడే సారధి లోపలికి వచ్చాడు. నాకో బుక్ ఫెస్టివల్ దగ్గర పరిచయం ఆతడు. అభిరుచులు ఒకటే కావడంతో, క్రమేణా కుటుంబ స్నేహితుడిగా మారాడు.
నేను చెప్పింది విని, “సాంఘిక నవలల్లో కూడా ఇలాంటివి చదువుతూంటే, నాకయితే దవడ కండరం బిగుసుకుంటుంది” అన్నాడతను.
నేను బిగ్గరగా నవ్వాను. “అదలా ఉంచు సారదీ! మా చుట్టాల్లో ఒకాయన యవ్వనంలో ఫక్తు మసాలా సాహిత్యం సృజించి, ఇప్పుడది లాభసాటిగా లేకపోవడంతో, కాషాయం, బవిరిగడ్డంతో వాస్తుమహర్షి అనే స్వీయ బిరుదాంకితులై, ప్రజానీకానికి ఇప్పుడు జ్ఞానబోధ కావిస్తున్నాడు తెలుసా?”
“ఓ.. భక్తవత్సలం గారా! “అన్నాడతను.
ఆ స్వరంలో మర్యాద పాళ్లు హెచ్చుగా ఉండటంచూసి నవ్వొచ్చింది నాకు.
దానికి అతనేమంటాడో నాకు తెలుసు. ‘ఆయన డబ్బు కోసం కాకుండా, సమాజానికి నాలుగు మంచిమాటలు చెప్పాలనే తపన ఉన్నట్టుంది’ అంటాడతను, డబ్బు కాపీనం లేకపోవడమే సమాజ పురోగతికి కావాల్సిన ముఖ్య లక్షణం అన్నట్టు!
కొన్ని భావాలపైన వ్యతిరేకతని గట్టిగా చూపించడని అతడిపైన నాకు కొంచెం విమర్శ ఉంది.
మా మాటలు వింటున్న మాధవి ఆఫీస్ గదిలోకి వచ్చింది.
“తీతువు పిట్ట దక్షిణానికే ఎందుకు సాగిపోతుంది? తూర్పుదిక్కుకి ఎందుకు సాగిపోకూడదు? తూర్పు దిక్కు పరమ పవిత్రమూ, దక్షిణం దిక్కు అపశకునమైనదీ ఎలా అయ్యాయి?” అంటో ప్రశ్నలు గుప్పించింది
“చనిపోయినవారి ఆత్మలు దక్షిణం దిక్కుకే సాగిపోతాయట మాధవీ. అరణ్యవాసంలో ధర్మరాజుకి మునులు ఆ విధంగా దిక్కుల ప్రాశస్త్యాన్ని వివరిస్తారట. అందుకే కామోసు” అన్నాను.
“ఇలాంటి పిచ్చి నమ్మకాల వల్లే మన స్థలం అమ్ముడు కావడం లేదు. ముందుకి వచ్చిన కొద్దిమందీ లోకువగా తక్కువ ధరకు అడుగుతున్నారు” బాధగా చెప్పిందామె.
గదిలోని వాతావరణం కొంచెం బరువుగా మారింది.
….మావగారి లైఫ్ స్పాన్, డయాలసిస్ తో ఎన్నాళ్ళో పెంచలేమని చెబుతూ, డాక్టర్లు సూచించిన మార్గం ట్రాన్స్ ప్లాంటేషన్! డోనార్ రక్తసంబంధీకులైతే ఫలితాలు బాగుంటాయన్నప్పుడు , తన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో మాధవి నిరాశపడింది. చిత్రంగా, సముద్రాలకావల ప్రవాసంలో ఉన్న మాధవి అన్నగారిదీ మావగారి బ్లడ్ గ్రూపే. కానీ, అతడికి అసలు ఆ ఆలోచనే నచ్చలేదు. కేరళ ఆయుర్వేదం మందు వాడమనీ, అదే ఉత్తమమనీ సలహా ఇచ్చాడు. దాంతో ఆ ఉత్తముడిని పక్కన పెట్టి , మా ఆలోచన మేం సాగించాం. బయటి డోనార్స్ గురించి ప్రయత్నిద్దామని అన్నది మాధవి.
దానికి మావగారు ఒప్పుకోలేదు.
“ఈ ముసలాడికోసం మరొకరైనా అవయవదానం చేయడం ఎందుకు? వారిదీ విలువైన జీవితమే కదా. దాన్ని రిస్కులో పెట్టడం న్యాయం కాదు” అంటో నిరాసక్తత ప్రదర్శించారు.
తండ్రిపైనున్న ప్రేమతో, మాధవి ఆయన్ను ఎంతో అనునయించింది. తనపేరిట ఉన్న స్థలం అమ్మేస్తామని, మనం ఇచ్చే ప్రతిఫలం వారికీ ఒక ఆర్థిక వనరుగా అక్కరకొస్తుందనీ నచ్చచెప్పింది. కూతురి వేదన చూసి, ఆయన ఇక మౌనం దాల్చారు…
లోపల మావగారు వూపిరి తిరగని దగ్గుతో సతమతం అవ్వడం విన్పిస్తోంది.మాధవి గబగబా లోపలికి వెళ్ళింది.
సారధి మౌనంగా కాస్సేపు కూర్చుని, తర్వాత తన కేసు వాయిదా వివరాలు నా అసిస్టెంట్ వద్దనుంచి తెలుసుకుని, వెళ్ళిపోయాడు.
అతనికీ,అతని దాయాదులకీ మధ్య ఆస్తి వివాదం ఒకటి చాన్నాళ్లుగా నడుస్తోంది.నాకలాంటివి ఆసక్తి లేకపోయినా, అతను పట్టుబట్టడంతో, దాన్ని మధ్యలో నేను టేకప్ చేసాను.
“నా కేసుకు త్వరలో సిల్వర్ జూబ్లీ చేస్తాను, మా పిల్లలు గోల్డెన్ జూబ్లీ చేస్తారేమో” అంటూ తన కేసుతీరు పైన , విచారంగానే చెణుకులు విసురుతూ ఉంటాడు అతడు.
నాదీ అదే అభిప్రాయం అయినప్పటికీ, లాయర్ గాంభీర్యంతో అతడికి ధైర్యం నూరిపోస్తూంటాను.
కానీ, నేనుకూడా ఆశ్చర్యపోయేలా, కథని ఒక మలుపు తిప్పింది అతని ఆస్తి కేసు.!

* * * *
ఆరోజు కేసుల పని ఒత్తిడిలో బాగా బిజీగా వున్నాను. ఎవరో స్ధలంగూర్చి ఫోన్ చేశారు. మాధవి ఫోన్ అందుకుని, చొరవగా ఆయన్ను ఆహ్వానించింది. అప్పుడే సారధి కూడా వచ్చి కూర్చున్నాడు. వచ్చినాయనకి మావగారికన్నా పెద్ద వయస్సు.
ఆయనకి స్థలం ఫోటోలు చూపించి, వివరాలు చెప్పింది మాధవి.
అవి చూసి, అందరూ అన్నట్లే ఆయనా అన్నాడు. “అబ్బే .దక్షిణం దిక్కు స్థలం కలిసిరాదమ్మా! ”
మాధవి తన హేతువాద జ్ఞానాన్ని అంతా రంగరించి మాట్లాడింది. వచ్చినాయన అంత పిడివాది కాకపోవడంతో, ఓపిగ్గా వినడం అయితే విన్నాడు కానీ, అదంతగా పని చేయలేదు.
ఆయన ‘ ఇది మన సంస్కృతి ‘ అన్నాడు. ‘వేల సంవత్సరాల క్రితమే ఋషులూ, మహర్షులూ ఈ శాస్త్రాన్ని కనుక్కుని మహోపకారం చేశార’ న్నాడు. ‘ ఇప్పుడొచ్చే నకిలీలు తప్పుడు శాస్త్రం చెబ్తున్నార ‘న్నాడు.
” మత విశ్వాసాలతోటి, అరిష్టాలూ అనర్ధాలూ అంటూ భయభ్రాంతులను చేసే పరిభాష తోటీ ఉన్నదే మీ అసలైన శాస్త్రం! సౌకర్యాల బట్టి నిర్మాణాలే గానీ, దిక్కులబట్టి నిర్మాణాలు కాదని చెప్పే శాస్త్రం కలికానికి కూడా కానరాదు గనుక, మీ అసలుని , నకిలీని రెంటినీ పూర్తిగా తిరస్కరించడమే మానసిక ఆరోగ్యానికి, ఆర్ధిక ఆరోగ్యానికి ఉత్తమం.” అన్నది మాధవి.
ఆయన హడలిపోయి, “అలా అనకమ్మా. వంశక్షయం జరుగుతుంది.” అన్నాడు.
మాధవి నవ్వింది. ” మాకలాంటి భయాలేమీ లేవులెండి. ఇక మీ మాట ప్రకారం అయితే, దక్షిణం దిక్కున ఏ నిర్మాణమూ చేయరాదు. అంతా ఖాళీ గానే ఉంచాలి. అంతేకాదు, ఆదిక్కున ఇల్లు కట్టినవారు ఏ సుఖశాంతులూ లేక, దరిద్రంతో కునారిల్లుతూ ఉండాలి. అలా జరుగుతుందా మరి? ”
ఆయన నీళ్లు నమిలాడు. ” కొంతమందికి కలిసొస్తుందమ్మా జాతకం ప్రకారం”.
“ఏ జ్యోతిర్వాస్తు పండితుల సర్వేలో తేలిందది? డాక్టర్ కోవూరు విసిరిన సవాల్ తెలుసా అసలు మీకు?”
ఆయన మొహమాటంగా నవ్వి, ” అమ్మా! ఈ ఇంట్లో వకీలుగారు ఒక్కరే అనుకున్నాను. కాదు, ఇద్దరున్నారని ఇప్పుడే తెల్సింది.” చెప్పాడు.
అంతా ఆలకిస్తున్న మావగారి మొహంలో నవ్వు విరిసింది.
ఏ సంగతీ ఆలోచించుకుని చెప్తానని వెళ్లిన ఆ వృద్ధుడు మర్నాడు ఫోన్ చేసాడు.
‘ఆ స్థలాన్ని చూశామని, పక్కనే గుడి ధ్వజస్థంభపు నీడ ఆ స్థలంపైన పడుతోందనీ, అది అరిష్టం గనుక, వద్దని అనుకుంటున్నామనీ’ చెప్పాడు.
నిస్పృహగా తల పట్టుకుంది మాధవి.

* * * *

పిల్లలకి సెలవురోజు కావడంతో, గుల్జార్ రాసిన ‘ హాబూ కీ ఆగ్’ హిందీ కథని వారికి చదివి విన్పిస్తున్నాను. ఆదిమ మానవులు నిప్పుని ఒక జంతువుగా ఎలా భావించారో, అదెక్కడ ఉంటే అక్కడ అన్నింటినీ భక్షించేస్తుందని ఎలా అనుకున్నారో చెబుతూంటే, ఆసక్తిగా వింటున్నారు. ఆదిమమానవులు మేఘ గర్జనని ఎలా ఊహించుకున్నారో చెప్పాను. ‘ఆకాశంలో ఉన్న దేవతలు తమలో తాము కొట్టుకునేటప్పుడు, ఒకరినొకరు ఎట్టి కుదేసుకున్నప్పుడల్లా, వారి ఎముకలు విరిగి, అలాంటి శబ్దాలు వస్తాయని ఊహించారనేసరికి, పిల్లలు పడీపడీ నవ్వారు.
చివరగా, వానపడి, నిప్పు చల్లారిపోయి, పొగ పైకి వెళ్తోంటే, జంతువు ఆత్మ పైకి వెళ్తోందని అనుకున్నారనేసరికి… మంచం పై నీరసంగా పడుకుని వింటున్న మావగారు ” చనిపోయిన వారి ఆత్మలు పైలోకాలకి చేరుకుంటాయనే నమ్మకం అలా పుట్టి ఉంటుందేమో! ” అన్నారు, సాలోచనగా.
ఆయనకూడా ఆలోచించడం సంతోషమన్పించింది. “మరి దక్షిణ దిక్కు అరిష్టమనే నమ్మకం ఎలా పుట్టివుంటుందో, అదీ చెప్పండి ” అన్నాను.
” ఏముంది నాన్నా! దక్షిణపు దిక్కునున్న హాబూ గుడిసెని ఏ నిప్పురవ్వో బూడిద చేసేసి ఉంటుంది. దాంతో, ఆ దిక్కు కలసిరాదనీ, రాక్షసులు ఆ ఇంటి ఈ తినేస్తారనీ హాబూ తన తండాలో నమ్మకం పుట్టించి ఉంటాడు.” అంది మా పదేళ్ల పాప గబగబా.
మనవరాలివంక అబ్బురంగా చూసారు మావగారు.
అప్పుడే బంధువు ఒకాయన, ఒక మధ్యవయస్కుడిని ఇంటికి తీసుకువచ్చాడు. అతడి వాలకం బతికిచెడ్డ మనిషి లా ఉంది.
అతడు కిడ్నీ డోనార్ అని గ్రహించాను. వచ్చిన వ్యక్తిని మావగారు పరికించి చూసి, “నువ్వా రాములూ!” అన్నారు.
అతడు మౌనంగా నమస్కరించాడు. అతడు ఒకప్పుడు మావగారి వద్ద పనిచేసిన వ్యక్తేనట. వ్యవసాయం గిట్టుబాటు కాక, కూలీగా పనిచేసి, అది మనస్కరించక, మళ్లీ అప్పులు చేసి, బోర్లు వేసి, నీళ్లు పడక, పైరునికాక అప్పుని పెంచుకున్న కరువుప్రాంతపు సగటు రైతు అతడు!
మావగారు అతడితో వాస్తుగురించి ఏదో అన్నట్లున్నారు. రాములు విరక్తిగా ” అదంతా పిచ్చి భ్రమ బాబూ. మాలాంటివారిని ఏ శాస్త్రాలూ ఆదుకోవు ” అన్నాడు.
తర్కించడానికి సాహసించలేక, ధిక్కరించలేక, ఒక ఊరట కోసం, ఒక అభయం కోసం, అహేతుకమైన విశ్వాసాలకు లొంగిపోతూ, దగాపడే మధ్యతరగతి మానవుడి ఆక్రందన అది!
అతడ్ని పక్కనే కూచోపెట్టుకుని, మావగారు ఏదో నచ్చచెబుతున్నట్లున్నారు
“ఏ పురుగుల మందో తాగి చావడం కన్నా ఇది మంచి పనే కదయ్యా! ” అని రాములు అనడం విన్పించి, నోరంతా ఎందుకో చేదుగా అయిపోయింది.
నాకళ్లముందు ఏవేవో దృశ్యాలు కదలాడాయి. పదిహేనేళ్ల క్రితం, లా పరీక్షలకి ఫీజు కట్టడానికి సైతం డబ్బు చాలక, దిక్కుతోచక, రక్తం అమ్ముకోవడానికి సైతం సిద్దపడ్డ దుర్భరమైన రోజులు మనసులో మెదిలాయి. ఎంత కష్టపడైనా సరే, చదువు పూర్తిచేయడం ఆనాటి లక్ష్యం. ఆనాటి నా ముఖం లోని దైన్యం , ఈరోజు రాములు ముఖంలో మళ్లీ చూస్తున్నాను. కళ్ళు ఒక్కసారిగా వర్షించబోయి, మధ్యతరగతి మర్యాదలు గుర్తొచ్చి ఆగాయి. రాములు అసహాయస్థితి ని అడ్డం పెట్టుకుని, ఎక్స్ ప్లాయిట్ చేస్తున్న భావన కలాగ్గానే, నా శరీరం కంపించింది. నేను స్వార్ధపరుణ్ణి అయ్యాననే విషయం కూడా తొలిసారి తట్టింది నాకు.
టెస్టుల్లో రాములు డోనార్ గా సూటవుతాడని తేలినప్పుడు, ఆనందంతో ఉప్పొంగిన మాధవిని చూసి, నా భావాలు వెల్లడించి తననికూడా కలత పరచడం ఇష్టం లేక ముభావంగా ఉండిపోయాను.
కానీ తర్వాత మాధవి మనసులో సర్జరీకి డబ్బు ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళన ప్రారంభమైనట్లు గ్రహించాను. తను నెట్ ద్వారా ఏవో ఛారిటీ సంస్థల్ని సంప్రదిస్తోంది గానీ, మావగారి టర్న్ వచ్చేసరికి ఆలస్యమయ్యేలా ఉంది.
తుఫాన్ హోరేదో సమీపిస్తున్నట్లు అన్పించింది నాకు.

* * * *

నాదగ్గర అప్రెంటిస్ గా చేరాలని వచ్చిన కొత్త కుర్రాడు ఆజాద్ తో మాట్లాడుతుండగా, బయట కలకలం వినబడింది. శిష్యులని బైట ఉంచి , లోపలికి అడుగుపెట్టాడు వాస్తు మహర్షి భక్తవత్సలం.
“రండి బావగారూ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?” అంటూ మావగారు మర్యాద చేశారు.
” ఇంకేం చేస్తారు…” అంటో నేను ఏదో అనబోతూండగానే, మధ్యలోనే అందుకుని, “అవున్నాయనా! కొంపలు చల్లగుండేలా చూస్తున్నాను ” అన్నాడు భక్తవత్సలం.
ఆ స్పాంటేనియటీ కి అదిరిపోయాను. అయినా తగ్గకుండా, “దానికి కావాల్సింది వాస్తు కాదండీ, చెట్లు!” అన్నాను.
“కాదనేదెవరు నాయనా! అవీ కావాల్సిందే. ” అని మాట దాటేసి, మర్నాడు రాబోయే తన టీవీ ఇంటర్వ్యూ గూర్చి, రాయబోయే వాస్తు గ్రంథం గూర్చి చెప్పసాగాడు. ఇప్పుడు కూడా, ఓ మంత్రిగారి ఆఫీస్ కి వాస్తు చెప్పి, దాని రూపురేఖలు మార్చడానికి వెళ్తూ, ఇటు వచ్చినట్లు చెప్పాడు.
కానీ, అదంతా ఎవరూ ఆసక్తి గా వినకపోవడంతో, అతడి అహం దెబ్బతింది.
ఇంతలో, “అయితే… ప్రజల సొమ్ము రాళ్లపాలేనన్న మాట” అని ఆజాద్ లోగొంతుకతో అన్నమాట విన్పించి, అతడి భృకుటి ముడిపడింది.
తర్వాత మావంక చూసి, “ఇంట్లో ఒక లాఫింగ్ బుద్ధ బొమ్మ పెట్టుకోండి. మీ ఖాళీస్థలంలో కూడా , చుట్టూ గోడ కట్టించి, దానిపైన ఆ బొమ్మ పెట్టుకోండి. అది అమ్ముడవ్వక పోతే, అప్పుడడగండి” అన్నాడు.
దానికి ఎంత తడిసి మోపెడయ్యేది తెల్సు గనుక, కోపాన్నాపుకుని, ” తమరు ఈ విదేశీవాస్తు ఎప్పట్నుంచి ప్రచారం చేయడం మొదలెట్టారు?” అడిగాను.
అతడు నావంక జాలిగా చూసాడు. ” బుద్ధుడు మనవాడే. కనుక అతనికి సంభందించినదంతా స్వదేశీయే” అన్నాడు.
అప్పుడు ఆజాద్ అన్నాడు. “అతడు బుద్దుడు కాదండీ. అతడి పేరు బుదాయ్. ఒక చైనీస్ మాంక్ మాత్రమే.”
ఖంగు తిన్న భక్తవత్సలం సర్దుకుని, ” నీలాంటి పిల్లకుంకలకి ఆయన బుద్ధుడి అవతారమని తెలిసే అవకాశం లేదు. వదిలేయ్ ” అన్నాడు.
ఆజాద్ నవ్వి, ” నాకు తెలీదు గానీ, ఇస్రో ఛైర్మన్ లాంటి పెద్దకుంకలకి బాగా తెలుస్తుందేమో. వాళ్ళు పంపించే రాకెట్ల పైన లాఫింగ్ బుద్ధాని పెట్టమనీ, అవి ఇక కూలిపోవనీ చెప్పండి.” అన్నాడు.
మావగారి ముఖంలోకూడా సన్ననినవ్వు కన్పించేసరికి, దిగ్గున పైకి లేచాడు భక్తవత్సలం. ” పెద్దవాణ్ణి ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకోండి. శాస్త్రాన్ని నమ్మనివారూ, దిక్కుల్ని ఆక్షేపించేవారూ దిక్కులేకుండా పోతారు . సెలవు.” అనేసి, బయటికి వెళ్ళిపోయాడు.
ఔచిత్యం మర్చిపోయి, శపించి వెళ్ళిపోయిన ఆ తీతువు పిట్టని తలచుకుని, నవ్వాను. ఆజాద్ ఆరోజే అప్రెంటిస్ గా చేరాడు.

* * * *

సారధి తన దాయాదులపైన కేసు గెలిచాడు.!
ఎందరో వైద్యులు ప్రయత్నించి, విరమించుకున్నాక, చివరగా ప్రయత్నించి వ్యాధి నయం చేసిన వైద్యుడికే మొత్తం ఘనతను ఆపాదించినట్లు సారధి సంబరం అంబరాన్ని తాకుతుండగా, నా చేతులు పట్టుకుని, ” మీరు లేకపోతే ఈ కేసు గెలిచేవాడినే కాదు.నేను ఉత్త సారధిని. మీరు విజయసారధులు.” అన్నాడు, ఉద్వేగంగా.
నేను అన్యమనస్కంగా తల పంకించాను. అప్పటికి రెండ్రోజులనుంది మావగారికి నలతగా ఉంది. డాక్టర్లు సర్జరీకి త్వరపడాలంటున్నారు. మాధవి నెట్లో ఏవో కిడ్నీ ఫౌండేషన్స్ ద్వారా ప్రయత్నిస్తూనే ఉంది.కానీ, కాలయాపన తప్ప ఫలితం కనిపించడంలేదు.
సారథి ఉత్సాహంలో పాలుపంచుకోకపోవడంతో, చిన్నబుచ్చుకోవడం గమనించి, మావగారి విషయం టూకీగా చెప్పాను.
అప్పటికి సానుభూతి తెలిపి, వెళ్ళిపోయిన సారధి రాత్రి బాగా పొద్దు పోయాక, ఫోన్ చేసుకువచ్చాడు.
అతడు చెప్పిన విషయం విని చకితుడినయ్యాను.
‘ ఎనరిదాకానో ఎందుకు, తనే మా స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటానని, ఆ డబ్బుతో మావగారికి వైద్యం చేయించమని ‘ అంటున్నాడు అతడు.
ఇప్పుడు అతడు బాగా స్థితిమంతుడయ్యాడు, అది తెలుస్తూనే ఉంది. కానీ, గురుదక్షిణ ఈరకంగానైనా ఇచ్చి, సంతోషపెట్టాలనేదే అతడి భావోద్వేగం నుండి పుట్టిన ఆలోచన కావచ్చు.
అతడు నాతో కొన్ని భావాలమేరకు ఏకీభవిస్తూ, తర్కాన్ని ఇష్టపడే వ్యక్తి మాత్రమేనని అనుకున్నాను. అయినా నా మాటల ప్రభావం అతడిపైన పడుతుందని ఊహించని నేను, కంటిరెప్ప వెనుక తడి కదులుతూండగా, ‘థాంక్యూ! ‘ అంటూ గొణిగాను.

* * * *

డాక్టర్ తో మాట్లాడి, మావగారి సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయాను. సారధినుండి అడ్వాన్స్ గా అందిన యాభై వేలు ఖర్చులకివాడాను. రిజిస్ట్రేషన్ తర్వాత చూసుకోవచ్చు, ముందు అత్యవసరంగా సర్జరీ విషయం చూడండని భరోసాగా మాట్లాడాడు సారధి.
సర్జరీ రోజు ఉదయం, సగం మొత్తం డిపాజిట్ గా కట్టమన్నారు హాస్పిటల్ సిబ్బంది. అనుకున్న మాట ప్రకారం, సారధికి ఫోన్ చేసాను. ఫోన్ చాలాసేపటిదాకా ఎత్తలేదు. రెండు మూడు ప్రయత్నాల తర్వాత, ఫోన్ ఎత్తాడు. ఎందుకోగానీ, అతడి స్వరంలో సౌహార్ద్రత లేదు.విసుగ్గా మాట్లాడినట్లు అన్పించింది. మధ్యాహ్నం కల్లా డబ్బు తెచ్చిస్తానన్నాడు. అప్పటివరకూ చూసి, మళ్ళీ ఫోన్ చేశాను. ఈసారి ఫోన్ స్విచ్చాఫ్ ! ఏమైందో నాకేమీ అంతుపట్టలేదు.

మాధవి సలహా పైన, సారథి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. వీధి మొదట్లో ఎవరిదో గృహప్రవేశం జరుగుతోంది. అంతేకాదు, భక్తవత్సలం ప్రవచనాలు మైక్ లో గట్టిగా వినబడుతున్నాయి. నేను అంతగా ఆసక్తి చూపించక, అది దాటుకుని ముందుకి వెళ్ళాను.
అక్కడ సారధి అద్దె ఇంటినైతే పోల్చుకోగలిగాను గానీ, అక్కడెవరూ లేకపోవడంతో, చుట్టూ చూస్తుండగా, తెల్సిన క్లయింట్ ఒకరు కనిపించాడు
అతడు చెప్పిన విషయానికి, నెత్తిపైన పిడుగు పడినట్లయింది. హాస్పిటల్ కి తిరిగి ఎలా వచ్చానో, నాకే తెలీదు. హాస్పిటల్ బయట అందరూ ఆదుర్దాగా నిలబడి, నా కోసమే ఎదురుచూస్తున్నారు. వారి నుండి మరో వార్త అందింది.
మావగారు రూంలో కనిపించడంలేదు. వంటి పైని ట్యూబ్స్, నీడిల్స్ అన్నీ తీసేసి కనిపించకుండా, ఎటో వెళ్లిపోయారు!
భరించలేని నిస్సత్తువ ఆవరించింది. గుండెలు అదురుతుండగా, అన్నిచోట్లా వెదికాము. అర్ధరాత్రయినా, జాడ తెలీకపోయేసరికి, మిస్సింగ్ కేసు కింద రిపోర్ట్ ఇచ్చి, ఇంటికొచ్చాము. రోదిస్తున్న మాధవిని సముదాయించడానికి నా ప్రయత్నం సరిపోలేదు.

* * * *

పూర్తిగా తెల్లారాక, నిస్సత్తువుగా కూర్చున్న మాకు, శామ్యూల్ నుండి ఫోన్ వచ్చింది. అతను చెప్పింది వినగానే, ఒక్క గెంతులో లేచి నిలుచున్నాను. అప్పటిదాకా ఆ ఆలోచనే తట్టనందుకు నిందించుకుంటూ, వేగంగా బయలుదేరి, శివార్లలో ఉన్న మా స్థలం వద్దకి చేరుకున్నాం.
అక్కడ … మట్టిగొట్టుకుపోయిన దుస్తులతో నేలమీద సోలిపోయి ఉన్నారు మావగారు.సపర్యల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచారు.
ఆయన చుట్టూ చూస్తుండటంతో, నా దృష్టీ అటు మళ్లింది. అప్పటిదాకా, నేనూ గమనించలేదు. స్థలం చుట్టూ ఏవో మొక్కలు నాటివున్నాయి. నావంక చూసి, బలహీనంగా నవ్వారాయన.
” మీ ఇష్టప్రకారమే చేస్తాం నాన్నా. ఇంటికి పదండి ” అన్నది మాధవి కన్నీళ్లతో.
” మిమ్మల్ని ఎలా కాదనాలో, ఏం చేయాలో అర్ధం కాలేదమ్మా! చనిపోవాలని రైలు పట్టాలపై కూడా పడుకున్నాను. కానీ దిక్కులేకుండా పోవడం ఇష్టం లేక, తిరిగి, తిరిగి ఇక్కడికి వచ్చాను.” అన్నారాయన.
తర్వాత నావైపు తిరిగి, ” అల్లుడూ. రేపు ఇల్లు కట్టుకున్నప్పుడు, గాలీ వెలుతురు బట్టే కట్టుకోండి. సౌకర్యాలబట్టే నిర్మాణాలు గానీ, దిక్కులబట్టి కాదని ఆడిగినవారికి చెప్పండి” అంటో ఏవిటేవిటో ఉద్వేగంగా చెప్పసాగారు.
శామ్యూల్ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు.
నేను ఆయన్ను అడ్డుకుని, ” మీరు దిక్కులేనివారు కాదండీ. దిక్కుల్లేనివారు ” అంటూ, చెమ్మగిల్లిన కళ్లతో ఆలింగనం చేసుకున్నాను.
చిత్రంగా, ఆయన్ను ఇంటికి తెచ్చిన రెండోరోజే, ఒక కిడ్నీ ఫౌండేషన్ నుండి కబురు వచ్చింది. ఎవరో రోడ్ ఆక్సిడెంటులో బ్రెయిన్ డెడ్ అయ్యారనీ, మావగారికి కిడ్నీ మార్పిడి చేస్తామనేదే ఆ కబురు.
మావగారు సున్నితంగా… కానీ స్థిరంగా తిరస్కరించారు.
” నాకన్నా యోగ్యుడికీ, ఆలోచనలో వేడీ, వాడీ తగ్గనివాడికి అవకాశం ఇమ్మని చెప్పండి” అన్నారు.
మాధవి మాట్లాడకుండా, ఆయనవంకే చూస్తుండి పోయింది.
బహుశా ఆయనకీ, మాకూ ఉన్న తేడా ఏమిటో అవగతం అయిందో ఏమో, ఇక తర్కించకుండా, మౌనంగా అన్ విల్లింగ్ మెసేజ్ పంపేసింది.
తర్వాత వారంరోజులకే కన్నుమూశారు మావగారు.

* * * *

సారథి గూర్చి వివరాలు మెల్లగా తెలిశాయి. భక్తవత్సలం, సారధికి బ్రెయిన్ వాష్ చేసాట్ట. ఆ స్థలంవల్లే మావగార్కి అనారోగ్యం చుట్టుకుందనీ, నేనూ ఆర్ధికంగా ఎదగలేకపోయాననీ, ఆఖరికి రెండు నెలల క్రితం నాకు జరిగిన బైక్ ఆక్సిడెంట్ కూడా దానివల్లేనని తేల్చాడట. అంతేకాదు, అదేవీధిలోని తూర్పు ముఖం ఉన్న తన శిష్యుడింటిని అతడే కుదిర్చిపెట్టి, గృహప్రవేశమూ జరిపించేసాడని తెలిసింది.
లోకానికి వెరచో, ప్రవాహానికి ఎదురొడ్డే స్థైర్యం మరిచో, అన్నింటా రాజీ పడేవారి జాబితాలో ఈ సారధి పేరూ చేరిపోయింది.
నా ఆలోచనలు గ్రహించినట్లు మాధవి చెప్పింది. ” గొప్ప గొప్ప విప్లవకారులమని చెప్పుకునేవారికే ఎన్నో పిచ్చి విశ్వాసాలున్నాయి. భక్తిరసం డ్రైనేజీలా పొర్లుతోందని కవిత్వాలు రాసినవారు, తిరిగి ఆ డ్రైనేజీ కంపునే ఇష్టపడడం తెలీదూ ! ఇక్కడ ఒక సారధిలాంటివాడు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కీ నడిస్తే, అందులో వింత ఏముంది! వదిలేయండి.”
నేను అనుకున్నట్టుగానే, ముఖం చెల్లకో ఏమో, సారధి డబ్బుకోసం మళ్ళీ రాలేదు.
అతడి కేసు కోసం, ఫీజేమీ తీసుకోకుండా, స్నేహధర్మంగా పనిచేసి పెట్టానని అతడికి బాగా తెలుసు.. అందుకే నేనూ అతడికి కబురు పంపలేదు. రాములుకి కబురు పంపి, ఆ డబ్బును బలవంతాన అతడి చేతిలో పెట్టాను. అతడు మావగారిని గుర్తు చేసుకుంటూ, కన్నీరు పెట్టుకున్నాడు. మావగారి కోరిక మేరకు, మళ్లీ తాను ఆత్మవిశ్వాసంతో నూత్నజీవితం వైపు అడుగులు వేస్తానన్న అతడి మాటలు విన్నప్పుడు ఎంతో సంతోషంగా అన్పించింది. మావగారు బ్రతికున్నప్పుడే, రాములుకి ఈ సాయం చేసుంటే, ఆయనెంత సంతోషించివుండేవారోనని అన్పించి, ఒక అపరాధభావన గుండెని మెలితిప్పింది.
ఆరోజే ఒక నిర్ణయం తీసుకున్నాం. మరణానంతరం మా శరీరాలని అవయవదానం చేసేందుకు ఒప్పుకుంటూ , గిప్ట్ యువర్ ఆర్గాన్ అనే ఛారిటీ సంస్థకు డిక్లరేషన్ ఇచ్చాము.

* * * *

తర్వాతెప్పుడో ఓ రోజు, సారధికి తన కొత్తింట్లో మెట్లు జారి, కాలు ఫ్రాక్చర్ అయిందని తెల్సింది. తూర్పు దిక్కు ఇల్లు కావడంచేతే, ఏ తలకాయో చితక్కుండా, తక్కువ ప్రమాదంతో బ్రతికి బయటపడ్డానని అన్నాట్ట అతడు!.

పి సాంబశివ రావు

పి. సాంబశివ రావు:  పుట్టిందీ, పెరిగిందీ, చదివిందీ గుంటూరులో. పూర్వీకులది మాత్రం విశాఖ జిల్లా. ఉద్యోగం రైల్వేలో స్టేషన్ మాస్టర్ గా!  మొదట 11ఏళ్ళు కర్ణాటకలో పనిచేశాక, గత ఏడేళ్లుగా తెలుగుప్రాంతంలో పనిచేస్తున్నారు.  రాసింది చాలా తక్కువ, 9 కథలు మాత్రమే.  వాటిలో శివచంద్ర అనే కలం పేరుతో రాసినవి కొన్ని ఉన్నాయి. చిత్రకళలో స్వల్పంగా ప్రవేశం ఉంది. ఇక కథలకన్నా చక్కటి చిక్కని కవిత్వం అంటే చాలా ఇష్టం. Email id :  pshiva9090@gmail.com

9 comments

 • కథ బాగుంది. కానీ ముగింపు యిలా సామాన్యంగా కాకుండా కొత్తగా ఉంటే పాఠకుడి ఆలోచన సైన్ టిఫిక్ ఆలోచన వైపు మళ్లేదేమో….ప్రభు

  • మీ సూచన రాయబోయే కథలకు గుర్తుంచుకుంటాను.
   థాంక్యూ!

 • దిక్కుల్లేనివాడు కథ బాగుంది. ఆసాంతం ఆసక్తిగా చదివించింది. ఇలాంటివెన్ని కథలు చదివినా ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది మూఢనమ్మకాలు తొలగిపోతాయా? రచయిత కథ చెప్పిన విధానం బాగుంది. ఆయనకు నా అభినందనలు తెలుపండి. రస్తా పత్రిక పత్రిక నడుపుతున్న హెచ్ ఆర్ కే గారికి నమస్కారములు .
  శొంఠి జయప్రకాష్ ,
  హిందూపురం,అనంతపురము జిల్లా (ఆం.ప్ర.)

  • థాంక్యూ!
   తొలగిపోతాయా… అంటే, మన ప్రయత్నం మనం చేస్తూవుండటమే!

 • దిక్కుల్లేనివాడు కథ బాగుంది. ఆసాంతం ఆసక్తిగా చదివించింది. ఇలాంటివెన్ని కథలు చదివినా ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది మూఢనమ్మకాలు తొలగిపోతాయా? రచయిత కథ చెప్పిన విధానం బాగుంది. ఆయనకు నా అభినందనలు తెలుపండి. రస్తా పత్రిక పత్రిక నడుపుతున్న హెచ్ ఆర్ కే గారికి నమస్కారములు .
  శొంఠి జయప్రకాష్ ,
  హిందూపురం,అనంతపురము జిల్లా (ఆం.ప్ర.)

 • PSR గారూ ,
  కథని,సుత్తి లేకుండా రాశారు. బాగా వచ్చింది. మీరు ఎన్నుకొన్న పాత్రలు బాగున్నాయి. సారధి లాంటి వారు మన మాటలు ఎన్ని విన్నా కూడా, సమాజ ప్రభావమే అతనిపై ఎక్కువ పనిచేసింది. సారధి లాంటి వారు,మనలో( అభ్యుదయ) చాలా మంది ఉన్నారు. ఇంట్లో వారి,బంధువుల వత్తిడి వల్ల అని వంకలు చెబుతారు. మనం గట్టిగా ఉంటే, వాళ్ళేం చేస్తారు.

  • మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. థాంక్యూ.!

 • కధనం బాగా నడిచింది. పాఠకుడు ఆలోచించుకోవడానికి, ఏమీ అవకాశం లేదేమో అనిపించింది.మంచి ప్రయత్నం p. saambasiva rao గారూ. — ksr spartacus.

  • ఈసారి పాఠకుడు ఆలోచించుకోవడానికి అవకాశం ఉన్న కథతో ,మరో ప్రయత్నం చేస్తాను స్పార్టకస్ గారూ! 🙂 Thanq!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.