సత్యానికి మరో కొలత…. !

  “బావా….!”

“చెప్పు బావా.”

“అసలు అనంతం అనేది ఉంది అంటావా..!? లేక లెక్కపెట్టడానికి బరువెక్కి  కనిపెట్టామంటావా?”

తుంగా తీరంలో, నిండు పున్నమిలో  ఖాలీ గ్లాసు పక్కన పెడుతూ వాడు అన్న మొదటి మాటలు అవి…మా 70 రూపాయల సరుకుకీ, మావాడి ప్రశ్నకీ ఎలాంటి పొంతన కనపడకపోవచ్చు చూసే వాళ్లకి.

“ఏమో బావ!నాకు తెలీదు.” నది లో నీళ్లు తక్కువున్నా రాళ్లు చూసి తరిస్తున్న నా ముక్తసరి సమాధానం.

“మన మస్కుగాడున్నాడు చూడు…అదే రా స్పేస్ ఎక్సు..మనం బతికే బతుకంతా సిమ్యులేషన్ అంటాడేంటీ? నువ్వేమంటావు?” మావాడు గణితం లోంచి సైన్సు ఫిక్షన్ లోకి దూకాడు.

“ఏమో బావ! నాకు తెలీదు. త్వరగా వెళ్దామా? లేటైతే పెట్రోలింగ్ వాళ్లు వస్తారు.”

“పోనీ..థియరీ ఆఫ్ ఎవిరిథింగ్ అనేది ఉందంటావా?”

“దీనికి కూడా ఏమో నే నా  సమాధానం.” నాకు వెలిగింది టాపిక్ ఎటు తీస్కెళ్తున్నాడో.  మావాడు నెమ్మదిగా దగ్గరికి జరిగాడు ఏదో చెప్పడానికన్నట్టు.

“ఇకపై ఏమోలు చెప్పటానికి వీళ్లేదు….”

“సరే.అడుగు”

“దేవుడు ఉన్నాడా?”

“నా పుస్తకం చదివావా?” నా అనుమానం బలపడింది.

“ముతక పేపర్లను సూదితో కుట్టేసి పుస్తకం అంటావా..? ముందు సమాధానం చెప్పవోయ్.”

“అదే తెలుసుకోవాలి.”

“మళ్లీ అదే పలాయనం లోకి దిగుతా అంటావ్? మారు బావా. ఏదో ఒక వైపుకు మొగ్గటం..ఉన్న ఆధారాలూ, గ్రంథాలూ నిరూపణగా చూపడం, ఏవీ దొరక్కపోతే ఉన్న వాటినే వక్రీకరించి అనుకూలంగా మలచుకోవటం ఎప్పటికి నేర్చుకుంటావ్? నీ పుస్తకం లో ‘ప్లేటొ గుహ ‘ నుంచి ‘మేరీ గది ‘ దాకా, ‘స్క్రోడింజర్ పిల్లి ‘ నుంచి ‘పావ్లోవ్ కుక్క ” దాకా అన్నీ రంగాల విషయాలు ఉన్నాయి. కానీ వేటికీ ముగింపు లేదు! అదేంటదీ…క్వాంటం మెకానిక్సు చివర్లో ‘పరిశీలకుడూ, పరిశీలించే వస్తువూ వేరు కాదు ‘ అనే జిడ్డు కృష్ణమూర్తి గారి మాట రాసావు!!! ఏదో ఒక వాదం లో కళ్లు మూసుకుని దిగెయ్…దాన్ని సమర్థించేవారి అండ దండలూ పెరుగుతాయ్. ఏమంటావ్?” అన్నాడు భుజాలెగరేస్తూ..

“నీ మాటలు నువ్వే ఒకసారి మళ్లీ విను..ఎవరిది పలాయనమో నీకే అర్థమవుతుంది.” అన్నాను ఈసారి కాస్త టోను పెంచి.

“అది కాదు బావా..నీ, నా మాటలు జనాలు వినుకోవడానికి మనమేమీ పేరు మోసిన వ్యక్తులమా చెప్పు? బయటికి చెప్పకపొయినా మనకంటూ ఒక క్లారిటీ ఏడవాలి గా? లేకపోతే పిచ్చి అంటారు.”

“ఈ క్లారిటీలూ, నిరూపనలూ మనిషి మనిషికీ, చోటు చోటుకూ మారిపోవడం చూస్తూనే ఉన్నాం గా బావా..! అయినా విశ్వసత్యాలు మాట్లాడేవారిని పిచ్చివాళ్ళనడం సమాజానికి కొత్తేమీ కాదుగా.. ఇంతగా అడుగుతున్నావ్ కాబట్టి నీకొక కథ చెప్తా. అది విని నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు.”

“అంటే నేను విక్రమార్కుడూ, నువ్వు భేతాళుడూ అన్నమాట!”

“కథ కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. అందుకే తల జాగ్రత్త…ముందు ఆ పేపర్ అందుకో.”అన్నాను స్టఫ్ఫు పొట్లం చూపిస్తూ…” అలాగే గుండ్రంగా ఉందే రాయి…అదిగో..అక్కడ..అది కూడా..!”

“అబ్బో…ఆడియో విజువల్సూ, స్పెషల్ ఎఫెక్టులూ కూడా ఉంటాయా?”

“విను, నీకే తెలుస్తుంది. ముందే చెప్తున్నా…పాత్రలూ, సంఘటనలూ పూర్తిగా కల్పితం.”

“కాంట్రవర్సీలొద్దు..కథ చాలు.”

“కథలోకి వెళ్లేముందు నీకు 0-D, 1-D, 2-D, 3-D అంటే ఏంటో చెప్పాలి.”

“నాకు తెలియకపొవడం ఏంటి? ఐనా…కథ అంటే ఏ ఫిలాసఫర్ చేసిన థాట్ ఎక్స్పెరిమెంటో చెప్తావ్ అనుకుంటే ఈ ఉచిత గణితబోధ ఏంటి బావా..?”

“నిజానికి ఇది కూడా అలాంటిదే. 1884లో ఎడ్విన్ ఎబ్బొట్ అనే రచయిత రాసిన నవల. నాకు అర్థమైనంతవరకు చెప్తాను.”

“అలాగైతే సరే…”అని ఒక చెవి, ఒక కన్నూ ఇటు పడేసాడు.

“D అంటే డైమెన్షన్…తెలుగులో మితి, కొలత, పరిమాణం అని సమానార్థకాలు,

0-D అంటే బిందువు (point)…దానికి అదే ప్రపంచం. దానికదే సత్యం,

1-D అంటే రేఖ (line)…బిందువులతో నిండి ఉంటుంది,

2-D అంటే తలం (plane)… రేఖలతో నిండి ఉంటుంది,

3-D అంటే అంతరాళం (space)…తలాలతో నిండి ఉంటుంది… ఇదే మన ప్రపంచం అన్నమాట…”అంటూ కాగితం పై గీయసాగాను పెన్నుతో..

“ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇవి ఒక పాటర్న్ ని పాటిస్తున్నట్టు లేదూ…? దాన్ని బట్టి మనం 4-D, 5-D…లని కూడా ఊహించొచ్చు బావా..”

“అవును నిజమే బావో!!! అంటే 4-D అంరాళాలతో నిండి ఉంటుంది…మరి ఆ 4-D ఎలా ఉంటుందో తెల్సుకోవడమెలా?” ఒక్కసారిగా వాడి మొహం యురేకా నుంచి థింకర్ కి మారింది..

“ఏముందీ..ఒక 2-D జీవి, 3-D వస్తువుని ఎలా అర్థం చేస్కోవడానికి ప్రయత్నిస్తుందో…అలాగే మనం కూడా 4-D ని తెల్సుకోవడానికి ప్రయత్నించాలి…అందుకే కథని 2-D ప్రపంచం లో మొదలు పెడుతున్నా…”అంటూ కొనసాగించా..

అదొక ఏక తల(single plane) ప్రపంచం..దాని పేరు ఫ్లాట్ ల్యాండ్.అక్కడ రేఖలూ, వృత్తాలూ, త్రిబుజాలూ, చతుర్భుజాలూ ….మొదలైన మనలాంటి తెలివిగల బహుభుజి జీవులు ఒక సమాజంగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నాయి.”

ఏక తలం అంటున్నావూ..ఎదుటి వారు ఎలా ఉన్నా వారి ఆకారం రేఖాఖండం లాగానే కనిపిస్తుంది కదాఎలా గుర్తిస్తారు బావా ఒకరిని ఒకరు?” వాడి లాజికల్ బ్రెయిన్ వెలిగింది కథలో కూడా.

మనకు ముఖ కవలికలూ, గొంతూ ఉన్నట్టుగానే వాళ్లకి కూడా వాయిస్ ఫ్రేక్వెన్సీ, రంగుల తేడా ఉంటుంది అనుకో..”

అలా అన్నావ్ బాగుంది.కంటిన్యూ

అంతా ఆనందంగా ఉంటే కథేముందీ..అందుకేస్క్వేర్-Aఅని పేరు గల చతుర్భుజం ఎప్పుడూ ప్రపంచానికి ఆవలా, లోపలా ఏదో ఉంది అనీ, దాన్ని తెలుసుకుంటే  మనల్ని మనం సరిగ్గా అర్థం చేస్కోవచ్చనీ మథనపడుతూ దారిలో రహస్యాలు తెల్సుకోవడానికి ఎన్నో విఫలయత్నాలు చేయసాగింది..”

ఇంతలో ఒకరోజు బాగా మందెక్కువై ఇంటికి వెళ్తూ ఉండగా..ఒక ఆకారం మిణుకు మిణుకు మంటూ వెలిగి మాయమవుతూ కనిపించింది. ఇదేదో దెయ్యమో, భూతమో అని మన స్కేర్-A భయపడుతూ ఉండగా ఆకారం డిటియస్ ఎఫెక్టులో మాట్లాడటం మొదలు పెట్టింది

భయపడకు మిత్రమా.. నేనొక గోళాన్ని. స్పేస్ ల్యాండ్ నుండి వచ్చాను. స్పియర్-A నా పేరు.’

భయపడకూ అంటావేంటీ..మా శాస్త్రఙ్ణులంతా అసలు స్పేస్ ల్యాండ్ అనేదే లేదూ అని చెప్తారు.అయినా దాని గురించి మాట్లాడటమే ఇక్కడ నేరం తెల్సా.. మరి అక్కడి నుంచే వచ్చానంటూ కంటికి కనపడని నిన్నెలా నేను నమ్మేది?’వణికిపోతోంది స్క్వేర్-A.

నా రూపాన్ని మీ ఫ్లాట్ ల్యాండ్ లో చూడటం సాద్యం కాదు.అయినా సరే నువ్వడుగుతున్నావ్ కాబట్టి చూడు ఇక్కడ ఇలా కనిపిస్తాను.’ అంటూ ఇలా ఫ్లాట్ ల్యాండ్‌లోకి దూరి బిందువుగా మొదలై పలు సైజుల వృత్తాలుగా పెరుగుతూ తగ్గుతూ అదృశ్యం అయ్యింది.

అవును, బంతి నీడ గొడపై ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే సర్కిల్సు ఏర్పడతాయి కదా బావా!”

ఇప్పుడొచ్చావ్ దారికి.అది చూసిన స్క్వేర్-A కి భయం, భక్తిలోకి కన్వర్ట్ అయ్యింది..’నీ విశ్వరూపం చూపించు అని అడిగే లోపే స్పియర్-A తనను పట్టుకొని ఫ్లాట్ ల్యాండ్ నుండి పైకి లాగడం మొదలెట్టింది.మూర్ఛపొయిన మన స్క్వేర్-A సంభ్రమాశ్చర్యాలతో కూడిన స్పేస్ ల్యాండ్‌లోకి  ఎత్తబడింది.

కొత్త ప్రపంచంలోకి రావటంతోనే తన అసలు రూపం,తనవాళ్ల రూపాలు,ఇన్నిరోజులూ తను బ్రతికిన అల్ప జీవితం తెలుస్తున్నాయి.తన గతకాలపు ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికేస్తున్నాయి.ఉన్నట్టుండి కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.ఇక ఆపుకోలేక స్పియర్ ను అడిగేసిందినాకు 4-D ,5-D ,..ప్రపంచాలను కూడా చూడాలని ఉందిఅని.”

అత్యాశ కదా బావ…”

అత్యాశ అని నువ్వంటే..ఙ్ణానతృష్ణ అని నేనంటా.” అంటో కొనసాగించా..

వాటి గురించిన అవగాహనా,అవసరమూ లేని స్పియర్-Aవున్న దానితో తృప్తి పడక, నాకు కూడా అందని ఙ్ణానాన్ని కోరతావా…’అంటూ కోపంతో ఊగిపొతూ మన స్క్వేర్-A ని లైన్ ల్యాండ్ లోకి విసిరేసింది.

అక్కడున్న జీవులేమొ ఆటవిక, అనాగరిక బిందువులాయే..”

అంటే భాష రాదన్న మాట…”మావాడు అందుకున్నాడు.

ఎక్జాక్ట్లీ..అకస్మాత్తుగా తమ లోకం లోకి ఊడిపడి తమకు భిన్నంగా ఉన్న స్క్వేర్-A ని చూడగానే వీడేదో విచిత్ర భూతం అనుకొని చంపడానికి వెంటపడ్డాయి.

వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ,పరిగెడుతూ….పరిగెడుతూ..చివరికి తన మెదడు లోనే ఉన్న పొయింట్ ల్యాండ్‌లోకి కుచించుకుపొతాడు మన స్క్వేర్-A గాడు.”

సొలిప్సిజం అన్నమాట..ఊ., తరువాత?” తాగినప్పుడు మా బావకి తత్వశాస్త్రం తన్నుకొస్తుంది లెండి.

ఏముందీ..తెల్లారి తెలివొచ్చె సరికి అంతా కల అని తెలుస్తుంది. అంత ఙ్ణానం వచ్చాక ఎవడైనా ఊరికే ఎందుకుంటాడూఊర్లో కనిపించిన ప్రతీ ఒక్కడికీ తన కలని కథలు కథలు గా చెప్పసాగాడు. తాను 3-D లోకాన్ని చూసినట్టూ..,4-D, ఆపైన కూడా డైమెన్షన్స్ ఉండవచ్చు అంటూ,తనకి తెల్సిన మాటల్లో వివరించడానికి ప్రయత్నించాడు.కొంతమంది విన్నారు,కొంతమంది ప్రవక్త అన్నారు,ఇంకొంతమంది పిచ్చోడన్నారు.కానీ ప్రభుత్వం వారు వీడు చేసే ట్రిక్కులను,మాటలను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా తీస్కెల్లి జైలు లో పడేసారు. దాంతో కథ కంచికి చేరింది.”

అంతా కలా..!అయినా…” వాడి కళ్లలో వందల ప్రశ్నలు.

ఆగాగు.. ఇప్పుడు మన 3-D  ప్రపంచానికి రా.కొంతమంది నాల్గో డైమెన్షన్ కాలం అంటారు, నోలన్ గాదుఇంటెర్స్టెల్లర్లో ఇంకోటంటాడు.కానీ ఎలాగైతే 3-D బంతి నీడ, గోడ మీద 2-D వృత్తం లాగా ఏర్పడుతుందో..అలాగే 4-D వస్తువు యొక్క ఆకారాం 3-D లో ప్రొజెక్షన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఊహించవచ్చన్నమాట.

అంటే?”

అంటే,ఉదాహరణకి ఒక సమఘనం (cube)  తీస్కుందాం.అది ఏర్పడాలంటే 6 చతురస్రాలు (squares) కావాలి,ఒక చతురస్రం ఏర్పడాలంటే 4 రేఖాఖండాలు (line segments) కావాలి.మరి ఒక రేఖాఖండం ఏర్పడాలంటే?”

కనీసం రెండు బిందువులు కావాలి.”

గుడ్. వరుస ప్రకారం వీటికి సంబందించిన హైపర్ క్యూబు ఏర్పడాలంటే 8 సమఘనాలు కావాలి.దీన్నే టెసరాక్ట్ అంటారు.దీని 3- D ప్రొజెక్షన్ ఇలా ఉంటుంది.

లోతుగా ఆలోచిస్తే మనం లేని వాటి నీడలు వెతుకుతున్నామో..?ఉన్న వాటి నిజ రూపాలే గుర్తించలేకపోతున్నామో..?మనకన్నా పై తరగతి లోకం ఉందో..లేక మనం అందులోనే ఉన్నామో..తెలుసుకోవాలని ఉంది.”

అంటే అక్కన్నించి ఎవరో వచ్చి మనల్ని ఎత్తాలంటావా?”అన్నాడు వాడు ఆకాశం లోకి చూస్తూ..పున్నమి రాత్రి బృహస్పతిని వెతుకుతున్నడేమో..

సరుకు ఖాళీ అయింది.గమనించలేదు మాటల్లొ.ఇక వెళ్దామని నేను లేవబోతూ వాడికి కూడా చెయ్యిచి లేపా.నెమ్మదిగా ఇంటి బాట పట్టామిద్దరం.దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నాడు వాడు.నాకేదో గుర్తొచింది.

ఐనా ప్రశ్న అడగాల్సింది నువ్వు కాదు నేను.ఇప్పుడు చెప్పు.అసలీ దేవుడనేవాడు ఉన్నాడంటావా?”

చాలాసేపటి వరకూ వాడేమీ మాట్లాడలేదు.నేను కూడాఇళ్లొచ్చేసింది.ఇంట్లోకి వెళ్తూ వెనక్కితిరిగాడు.

ఏమో బావ..తెలీటం లేదు.”

అదే ఆరోజుకి వాడు మాట్లాడిన చివరి మాట.

లతా పుత్ర మనోజ్

లతా పుత్ర మనోజ్:  మనోజ్ బొగ్గుల. తల్లి లతమ్మ, తండ్రి కీ.శే భాస్కరన్న గార్ల ప్రథమ సంతానం.జనణం 1995 ఏప్రిల్ 6. సొంత ఊరు గద్వాల జిల్లా ఐజ..పెరిగింది వనపర్తి జిల్లా పెబ్బేరు..ఇప్పుడు ఉంటోంది కర్నూలు. కృతుంగ ప్రాంత బిడ్డ. వృత్తి  రిత్యా ఉపాధ్యాయుడు.అగ్గిపెట్టె నుండీ అంతరిక్షం దాకా అన్నీ  ఆసక్తే

4 comments

  • లతా పుత్ర మనోజ్ గారు మీ గల్పిక అద్భుతం మీరు కలకాలం ఈ కళను కొనసాగిస్తారని కోరుతూ మీ శ్రేయోభిలాషి

    • మీ ఆశీస్సులు ఉంటే… తప్పకుండా.

  • చాలా ఆసక్తికరంగా రాశారు.సమాంతరవిశ్వాలలో geometrical shapes లో విశ్వం concept వుంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.