నిరుడు విరిసిన కవిత్వం: కవిత -2017

ఒక మాయా వస్తువు. తనని గుర్తించేవారిని అది మైమరిచిపోయేలా చేస్తుంది. ఊరిస్తుంది, లాలిస్తుంది, వెన్ను తడుతుంది, చెంపమీద లాగి పెట్టి కొడుతుంది కూడా. దారి చూపుతుంది, కాని ఆ దారి కావాల్సిన వారికే కనబడుతుంది. కవిత్వం ఒక అభూత కల్పన అనడానికి లేదు.  అమూర్తమైన ఒక భావవని చాలా నేర్పుగా లోపలికి పంపగల నేర్పు కవిత్వానికి ఉంది. ఒక దశాబ్దం అంటే ఒక తరం , దాదాపుగా 14 ఏళ్లనుంచి కవిత్వాన్ని హత్తుకుంటున్న విజయవాడ సాహితీమిత్రులకి అది ఒక బాద్యత. 2003 లో ఒక చిన్న కార్యక్రమం లా మొదలైన ఒక పని ఇప్పుడు యావత్ సాహితీ లోకం పని కోసం ఎదురుచూసే స్థాయి కి వచ్చింది , పని సుళువా కష్టమా కాదా  అనే మాటలు పక్కన పెట్టేసి, గత ఏడాది అంటే 2017 సంవత్సరం లో తెలుగు దినపత్రికలలో అచ్చైన కవిత్వాన్ని , ఇద్దరు సంపాదకుల సమక్షంలో  వాటిని మరలా వడపోసి ఒక సంకలనంగా తెచ్చారు.

  పుస్తకం లో మొత్తం 92 కవితలు ఉన్నాయి , అకరాది పట్టీ లో పేర్లని బట్టి కాకుండా కవిత్వం అచ్చైన నెలలని బట్టి నిర్ణయింఛారు. అదెలా ఉన్నా ఈ92 కవితల్లో సారం ఏమిటీ , 2017 మొత్తం కవులు అంశాన్ని చర్చించారు , మొత్తంగా ఒక ప్రవాహంలా సాగితే ప్రవాహం మొత్తం వాలుగానే పోయిందా లేక ఎదురెళ్ళిందా అనే ప్రశ్నలు  ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే నాలుగు వాక్యాలు , ప్రాసతోనో లేక, ఒక ఏకమొత్త వచన రుపాన్ని లైన్లుగానో విడగొట్టి , అదే కవిత్వం అని నమ్మబలుకుతున్న రోజుల్లో నిజంగా కవులు దేన్ని కలగన్నారో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది .

2017 కవిత నిండా సామాజిక సంవేదన ఉంది , మన చుట్టునే తిరుగుతూ మనకి కనిపించకుండా ఉన్న ఒక సన్నని రేఖ కవులకు చాల స్పష్టంగా కనబడింది . పైడికొండల వెంకటేష్  అనే కవి ఇలా రాస్తాడు

మా నాన్న వ్యవసాయం  చేస్తాడు

 ప్రపంచం ఆయనతో తో వ్యాపారం చేస్తుందిఅంటాడు.

ఎన్ని రోజులుగా నడుస్తున్న దందా ఇది. ఎక్కడా చూడని విషయం కాదు కాని బిట్వీన్ లైన్స్ ఒక విషాదం ఉంది. ఎంత విషాదం అంటే నోటికాడ కూడు లాక్కుంటు దానికి వ్యాపారం అనే పేరు పెట్టడమూ, ప్రపంచం దానిని సమర్ధించడము.

ఎన్నిసార్లు మొలకెత్తానో

అన్ని సార్లు మరణించాను

అని గుంటూరు మిర్చిరైతుల ఆవేదనని తన కలం లోనించి కాగితంలోకి ఒంపేశారు డాక్టర్ పాపినేని శివశంకర్. మిర్చిరైతులకి గిట్టుబాటు ధర చాల తక్కువ పలికింది ఆ ఏడు , క్వింటాళ్లకు క్వింటాళ్ళు నేలమీద పారబోసి నిరసన తెలిపారు రైతులు. ఎవరు పట్టించుకోకపోతే ఘాటు ప్రజలకి ఎలా తెలుస్తుంది. అందుకే ఆయన రైతుకష్టాలన్నీ కలిపి కుట్టి ఒక కవితలా రాశారు , ఇదే కవిత చివరలో ఇలా అంటారుపాదాలుగా నిలిచిన సింహాసన విరూపాల్ని ఎప్పుడు తలకిందులు చేయాలో అది కూడా నువ్వే చెప్పు” అంటారు. ఏమి చెయలేని స్థితిలోకి ఒక సందర్భం వచ్చాక తనని ఏమి చేయాలో కూడ తనని మోసం చేసే వాడినే అడగడం అనేది ఒక దీనావస్థ. అదే కవిత నిండాపరుచుకుంది అని చెప్పొచ్చు. జీవితం క్షణబంగురం అని ఎవరు చెప్పారు  అది తాత్వికంగా రైట్ కావొచ్చేమో గాని భౌతికంగా మాత్రం అది సరి అయినంది కాదు, ఒక శ్రమజీవి లేదా సమాజం లో ఎక్కడో ఒక చిన్న మెట్టు దగ్గర జీవితం ఆరంభించి జీవితం లో ఎదగాలనుకుని , ఒక పరిశ్రమని నమ్ముకున్న ఒక యదార్ధ గాధ “????” కవిత, వేణు ఉడుగుల రాసిన కవిత, ఎదగడం లోని సంఘర్షణను, అందులోని తృప్తిని, పొందే హేళనలను , కారుతున్న కన్నీళ్ళను ఒడిసిపట్టి మనకు  అందిస్తుంది. ఇలాంటి కొత్త అనుభవాల్ని రాస్తున్న వారిని కవిత వార్షిక పట్టుకుంటుంది, జనాల నాడి పట్టుకునేలా చేస్తుంది.

నిత్యం మనం మన చుట్టూ బతుకుతున్న బతుకు భయాల మధ్యన చిక్కుకు పోయి ఉంది. పిల్లలు పెద్దవారు అందుకు మినహాయింపేమీ కాదు, అప్పట్లో ఆంధ్ర దేశంలో , రిషితేశ్వరి మరణం ఒక సంచలనం , చట్టం కొందరికి చుట్టమై కాపాడుతుంటే తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు కళ్లు అప్పగించి చూస్తూ ఊరుకోవడం వినా చేగలిగింది ఏమిలేకపొయింది , అలాంటి సందర్భాన్ని “కోసూరి రవి కుమార్కవిత్వీకరిస్తూ ఇలా అంటాడుక్రోధం ఎలా పుడుతుందో…! కొన్ని సందర్భాలనుంచి …. కొన్ని పంటి బిగువుల భరింపబడే దుఖాల నుంచీ…” అని నిజానికి అక్కడ అమ్మాయికి చావుకి కారణం కేవలం ర్యాగింగ్ అనబడే ఒకానొక దుశ్చర్య. కనీసం దానిని కూడా చేదించలేని వ్యవస్థలో ఉంటూ మనం మనల్ని మోసం చేసుకుంటూ బతుకుతున్నాం, అదే గుర్తు చేస్తూహైనాల్ని బహిష్కరించి  నీలాంటి నెమళ్ళని పోగేయకుండాఇంత అమాయకం గా నిన్ను నువ్వెందుకు తల్లీ బలిచేసుకున్నావ్అంటాడు ఇది ఒక సామాజిక సంవేదన…. సమాజం పట్ల బాద్యత , తల్లిదండ్రులకి ఒకింత స్వాంతనఇది కవిత్వం చేయవలసిన పనే.

మరో కవిత లో అరసవిల్లి క్రిష్ణ ఇలా అంటారు

నా రూపాయి నాకు ఇమ్మన్నాను /

కోటా  బియ్యం కొనాలి అనుకున్నాను /

నా దేశానికి ఆకలేస్తుందని అరిచాను , అతనేదో మాట్లాడాడు /

అతని భాష నాదికాదు , అతను నావాడు కాదు /

మళ్లీ ఆకాశం నవ్విందిబహుశా 2017 లో ఏడాది అంతా దేశంలో ప్రతీ వ్యక్తి తాను దాచి పెట్టుకున్న రూపాయి కోసం ఎంతగా ఏటీఎం దగ్గర ఎదురు చుశారో , ఎన్ని ప్రాణాలు కోల్పోయారో మనం చూశాం కాని ఇవేమి అర్ధం కాని ప్రధాని మాత్రం మన్ కీ బాత్ అని రేడియోలో తెగ ఊదరగొట్టిన సందేశాన్ని వినిపించారుజనం భాష అతనికి అర్ధం కాదు అతని భాష జనానికి అర్ధం కాదు . ఇదో రకమైన వంచన , ఇందులో బాగా ఇబ్బంది పడింది దిగువ తరగతి మద్య తరగతి ప్రజలే. అదే కవిత కు ఆత్మ . ఒకప్పుడు భారతదేశం పరపీడన నుంచి విముక్తి కోరుకుంది. ఎంతో మంది మేధావులు చదువుకుని ఎందరికో దారి చూపించిన దేశం మనది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఇక్కడ పాఠశాలలు బరువైపొయాయి , ఒకేసారి ఆంధ్ర దేశాన ప్రభుత్వం 9 వేల బడులని మూసేస్తూ అట్తడుగు  వర్గాల పిల్లల చదువుకి ఆసరాగా ఉండే ఒకే ఒక ఆశని నేలకూల్చి  ప్రైవేట్ ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేసింది. దీన్ని నిరసిస్తూనూకతోటి రవి కుమార్ఒక కవిత రాసారు అందులో ఇలా అంటారు

నా అక్షరాల తల్లీ/

నా బతుకు బావుటాని ఎగరేసిన కల్పవల్లీ/

ఇకనుంచి నువ్ గతానివి/

నేనునీకోసం ఏమీ చేయలేని నడుస్తున్న శవాన్ని/ .

ఎంతోమంది  బాధని ఇలా వ్యక్తం చేసిన ప్రొఫెసర్ జనం పక్షాన నిలబడి  చేస్తున్న నిస్సహాయ యుద్ద ప్రకటన ఇది. ఇలాంటివి కూడా కవితా-2017 ఒడిసి పట్టింది.

వర్తమానం సంక్షుభిత వర్గాలలో ముస్లిం , మైనార్టీలదీ. యాభయేళ్ల స్వతంత్ర్యం ఇంకా గుమ్మాల దాకా కూడా చేరని వర్గాలవి. పైగా మతం మారమంటూ చేస్తున్న దాష్టికాలు. ఈ నేపధ్యంలో  “ఘర్ వాపసిఅనే కవితలో వరవర రావు గారు ఇలా అంటారు

చిదిమితే పాల్గారే శిశువు/

నెత్తురు కళ్ల చూసే కరడుకట్టిన ద్వేషం ఇప్పుడే అనుభవానికొస్తుంది /

ఒకే ఆకాశం నీడలో  బతికే నేల మీద /

ఒకే దేశం ద్వేషంగా ఆవహిస్తుంది / .

ప్రతీ ఏడాది ఉండే బాధే ఇది , ప్రతీ ఊరు పడే ప్రసవవేదనే ఇది .

నువ్వెప్పుడన్నా డ్యాన్స్ చేసావా అంటూ సాగేనరెష్కుమార్ సూఫికవిత ది రెయిన్ డ్యాన్స్ ఒక విభిన్న ప్రక్రియ తో కూడిన కవిత. నూతన కవిత్వం తనని తాను ఎలాంటి పదాలతో అలంకరించుకుంటుందో తెలిపిన కవిత. జీవితాన్ని  జీవించడం అంటే మన చుట్టూ ఉన్న జీవితాల్ని కలుపుకు పోవడం అని చెపుతాడు ఇంకా రాస్తూ

సుక్షేత్ర స్వప్నమోకటి

నీ దొంగ ప్రజాస్వామ్యపు  నమ్మకంలా కుప్పకూలినప్పుడు ,

నీ వంటింట్లో రక్తం మరిగిన వాసన,

నీ వళ్లంతా శవం కాలిన దుర్గంధం,

వొళ్లంతా కారిన చీపూ, రక్తపు చారలు

జీవితాన్ని జీవితంలా జీవిస్తున్నప్పుడు తగిలిన ఎదురు దెబ్బల తాలుకా ప్రతిస్పందన కవిత.

నల్లజండాలు కవితలో గరగపర్రులో జరిగిన సంఘటన తాలూకా బాధలన్నీ అగపడతాయిశ్రీరాం పుప్పాల“కు.  ఇలా అంటారు తన కవితలోపనిముట్లకి కంచెకట్టి ఆకలిమీద ఊచకోత కోసిన ప్రతిసారీ , పచ్చగా పండిన మండువా లోగిళ్లలో మరక్కాగిన పొలిమేరే ఊపిరి తెగ్గోసుకుందిఅని ఇదే కదా జరిగింది అక్కడ. బయట జనం లోపలికి పోవడానికి వీల్లేదు లోపలి  జనం బయటకి రావడానికీ వీల్లేదు , ప్రజాస్వామ్యం నిజంగా అపహాస్యం జరిగిన చోటును స్పృశిస్తూ ఇలాంటి కవిత్వం రావడం ఒక కాలాణుగుణ సందర్భం అని చెప్పొచ్చు .

ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతీ అక్షరం నిండా సదాశయాలుంటాయి , ప్రతి కవి వెనుకా అతీతమైన వేదనలుంటాయి అందుకే వరవర రావు గారు తన కవితలో ఘర్ వాపసి గురించి తపన పడ్డారు, గొరటి వెంకన్న తనదైన శైలిలోజీవన బంధాన్నిముడివేశారు, భారత దేశం అంతటిని ఒక ఊపు ఊపినగౌరీ లంకేశ్హత్య పై కూడా కవులు రాసారు, జీవితాలు కేవలం సమస్యలలోనే ఉండవని కొంత అనుభూతులకి కూడా లోనై ఉంతాయని కొంతమంది అనుభూతిని వ్యక్తం చేశారు. కొంతమంది గతంలోకి వెళ్లి వచ్చారు. మరికొంతమంది వర్తమానంలో ఉంటూనే భవితని కలగన్నారు. కొంతమంది పిల్లలకి ఎలా బతకాలొ చెప్పారు. మరి కొంతమంది పల్లెటూళ్ళు ఎలా ఉండడంలేదో అని పలవరించారు. ముఖ్యంగా దళితుల వాయిస్ ఇక్క బాగా వినిపించిందిఅరుణ గోగులమండరాసిననీడ్స్ వర్సెస్ చాయిస్అనే కవిత, అలాగే తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్ రాసినకలడంబేద్కర్……” అనే కవిత తరతరాల అణిచివేతని మరో కోణంలో చూపుతాయి. ఇలా ఒక్కరేమిటీ కొత్తగా రాస్తున్న వారినుంచి పాత తరానికి చెందిన కవులదాకా అందరూ ఇక్కడ ఒద్దికగా ఒదిగిపోయారు . ఇంత గొప్ప సంకలనానికి సంపాదకత్వ వహించడం చాలా కఠినమైన పని అలాంటి పనిని చాలా ఇష్టం గా చేశారు. ప్రముఖ కవయిత్రి శ్రీమతి.కొండేపుడి.నిర్మల, ప్రముఖ కవి విమర్శకులు, లక్ష్మినరసయ్య గారు తమ అనుభవాన్నంతా జోడించి పని పూర్తి చేశారు అది చాలా గొప్ప విషయం.

కవితా చేస్తున్న ప్రతీ ఏడాది పత్రికల్లో అచ్చుకాబడిన కవిత్వాన్ని మరలా ఒడబోస్తుంది. పత్రికలు కొంత కవిత్వం వైపు చిన్న చూపు చూస్తున్నాయి. విరివిగా రాసే కలాల్ని కొత్తగా చూసే చూపుల్ని ఇవి అంతగా పట్టించుకోవడం లేదు. తెలుగునాట ఒక ప్రధాన దినపత్రిక కవిత్వాన్ని పూర్తిగా నిషేదం చేసి ఆ స్థానంలో ప్రతీ వారం ఒక వ్యంగ్య బాణం వదులుతుంది. ఇది సాహిత్యానికి మంచి పరిణామం కాదు , కాని ఈ స్థానాన్ని వార పత్రికలు, మాసపత్రికలు మోస్తున్నాయి , అరుణతార, మాత్రుక, సాహితీ ప్రస్థానం లాంటి పత్రికలు కవులకు కవిత్వానికి పెద్ద పీట వేస్తున్నాయి. కవులు కూడా కేవలం సంఘటనా కవిత్వమే కాకుండా వస్తు నిర్మాణాలఫై కొంత దృష్తి పెట్టవలసిన అవసరం ఉంది. కవిత్వం కాస్త పట్టున్నా కదిలించగలిగే వాక్యమున్నా, కవితా వారికి తన స్నేహ హస్తం చాస్తుంది. అందుకే ఈ సంచికలో దాదాపు చాలా మంది  కొత్త కవులని కవియిత్రులని చూస్తాం.

అన్ని కవితలు ప్రస్తావనార్హాలే , ఏదీ వదిలి వేయదగినది  కాదు కాకపొతే మొత్తం ఇక్కడే పరిచయం చేస్తే మరలా చదివేప్పుడు రుచి తెలియదు అందుకే కాస్త పరిచయం.

కవితా -2017,  ప్రచురణసాహితీమిత్రులు“-విజయవాడ

వెల :150/- (పోస్టేజ్ ఖర్చులు కలిపి)

ఆన్లైన్: కినిగే లో లభ్యం

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

5 comments

  • మంచి పరిచయం చేశావు డానీ. కంగ్రాచ్యులేషన్స్.

  • థ్యాంక్స్ టూ ఎడిటర్స్ …. నా సమీక్షని ఇక్కడ తీసుకున్నందుకు

    • థాంక్స్, అనిల్, అడిగి మరీ తీసుకున్నది కదా?!

  • చక్కని సమీక్ష ..చిక్కనైన కవిత్వ పుస్తకానికి.. చాలా బాగుంది అనిల్ గారు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.