అమెరికాలో ఏం జరుగుతోంది?

తం వేరు మతస్థులు వేరు. 

మతం మతస్థులు ఒకటే అనుకోవడమంటే, మతాన్ని అతిగా గౌరవించడమే.

ఇందిరా గాంధీ కాలంలో ఒక జోకు వుండేది.

‘గరీబీ హఠావో’ అంటే గరీబుల్ని హఠాయించడమని.

అది జోకు.

గరీబీ వేరు గరీబులు వేరు. గరీబీ పోవాలి. గరీబులు వుండాలి. గరీబీ పోయాక గరీబులు ఎలా వుంటారు? వుండరు. అప్పుడు గరీబులు మనుషులుగా వుంటారు.

మతం పోవాలి, మతస్థులు వుండాలి. మతం పోయాక మతస్థులు ఎలా వుంటారు? వుండరు. అప్పుడు మనుషులుగా వుంటారు.

ఈ లోగా మనకు మతం కాకుండా మరెన్నో పనులున్నాయి.

ప్రచారంలో వున్న కథ ప్రకారం, హిరణ్యకశిపుడు పొద్దస్తమానం విష్ణు నామ స్మరణ చేస్తుంటాడు, విష్ణు వ్యతిరేకంగా.

ఆ పనికిమాలిన పని కోసం సొంత కొడుకును కొట్టి తిట్టి శతృ పక్షానికి అప్పగించేస్తాడు. ఏనుగుల చేత తొక్కిస్తాడు, కొడుకు చావడు గాని. చివరికి తనే కొడుకు మెంటర్ల చేతిలో మరణిస్తాడు.

ఔను, అది కథ. పుక్కిటి పురాణం. ఏమన్లేం. హిరణ్య కశిపుడు విష్ణువుతో పాటు, పితృస్వామ్య అహంకారాన్నీ వొదిలేసి కొడుకా ఏ బజన పాట కావాలంటే అది పాడుకో గాని, రాజ్యంలో జనం కోసం ఈ పనులు నేర్చుకో, పెద్దయ్యాక ఈ పనులు చెయ్యి అని ప్రేమగా చెప్పాల్సింది.

హిరణ్యకశిపుడిలా మనకు పొద్దస్తమానం అదే పని కాదు.

మతం పోయాక మతస్థులు మతస్థులు కారు, మనుషులవుతారు.

అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వాళ్లు కేవలం మతస్థులు కారు.

మొగుళ్లు, పెళ్లాలు; కొడుకులు,.కూతుళ్లు; స్థానికులు, వలస వచ్చిన వాళ్ళు; ధనికులు, పేదలు… ఓహ్, చాల వేషాలు మనుషులకు.

పూజలు, తీర్థయాత్రలు, క్రూసేడ్ లు, ఖడ్గధారి ప్రచారాలు, పుక్కిటి కథలు, పుస్తక దహనాలు, చంపడాలు, చావడాలు… ఇవి కాకుండా, మతస్థులకు…. ముఖ్యంగా పేదలకు వేరే చాల  పనులుంటాయి. వాళ్లు ఎట్టాగో ఒకలాగు పని చేసి బువ్వ సంపాదించుకోవాలి. డాక్టర్ల ఫీజులకు. పిల్లల బడి ఫీజులకు డబ్బు సంపాదించుకోవాలి. ఇతరులు తమ మీద చేసే దాడుల నుండి ‘కాపాడే’ పోలీసులకు, గూండాలకు ఇచ్చుకోడానికి కూడా వాళ్ళే సంపాదించుకోవాలి. ఇవన్నీ వూరికే రావు… ‘పని చేసి’ సంపాదించుకోవాలి.

వాళ్ళకు అవ్వ తాతలు అమ్మ నాన్నలు పోగేసి పెట్టిన ఆస్తిపాస్తులుండవు. అలాంటివి లేని వాళ్ళనే పేదలని అంటారు.

పేదల మీద జరిగే దాడులు ఎలా వుంటాయి? అవి ప్రధానంగా ధనికులు చేసే దాడులు. అనగా, ఫ్యూడల్ లార్డులు లేక పెట్టుబడి దారులు చేసే దాడులు.

99 కోట్లు ఖర్చు పెట్టి కూతురుకు ప్యూర్ డైమండ్ డ్రెస్ తొడిగించి మురిసిపోయే వాణిజ్య వంశజులు ఆ నీచ భోగ విలాసాల కోసం, హీన సౌకర్యాల కోసం చేసే దాడులు చాల సటిల్ గా వుంటాయి.  పోలీసు దెబ్బల్లా చాలా సార్లు బయటికి కనిపించవు.  

వీటి నుంచి కాపాడుకోడమంటే… సాంఘికార్థిక సంపదలో తమ వాటా తాము అడిగి లేదా లాక్కుని తీసుకోడమే. 

ఆ పనికి మతం ఒక పోరాట వేదికగా పనికొస్తే దాన్ని కూడా పేదలు వాడుకుంటారు. అమెరికాలో ఇప్పుడా పని జరుగుతోంది.

నిజమే. ఏసుక్రీస్తు తన కాలంలో బానిసత్వాన్ని సమర్థించాడు. కనీసం ఖండించలేదు. క్రైస్తవ మతం తరువాత్తరువాత ఫ్యూడల్ లార్డులకు, పెట్టుబడిదారులకు అండదండలు అందించింది. బానిసత్వాన్ని సమర్థించింది. అన్ని మతాల్లాగే క్రైస్తవ మతం కూడా మానవ-వ్యతిరేకమే. అనగా, మనుషులు మనుషులు కావడానికి వొదులుకోవలసిన ఒక సాంఘిక విశేషమే.

కాని, ఈలోగా, ఇప్పుడు, అశేష జనావళి.. మంచికైనా చెడుకైనా అందరొక చోట జమగూడే స్థలంగా మతాన్ని వాడుకుంటున్నారు. అదెంత ప్రమాదకర స్థలమో, అక్కడే వుంటే ఎంత ప్రమాదకరమో మనల్ని మనం హెచ్చరించుకుంటూనే… ఆ సామూహితను సైతం సాంఘికార్థిక దౌష్ట్యం మీద సమరానికి వాడుకోవలసిందే.

బహుశా అదే జరుగుతోంది…ఇవాళ అమెరికాలో ‘న్యూ పూర్ పీపుల్స్ క్యాంపెయిన్’ అనే వుద్యమంలో.

ఆధునిక యుగంలో కాదు గాని, భారతీయ సంప్రదాయంలో కూడా ఈ ప్రయోజనకర ఛాయ వుంది.  కులాల రూపంలో సాగిన హైన్యాన్ని ఎదిరించడానికి బసవని వంటి వీరశైవులు మతాన్ని వాడుకోడం, బాబా సాహెబ్ అంబేడ్కర్ నవ బౌద్ధం వైపు పయనించడం ఈ కోవలోని సత్ ప్రయత్నాలే. చివరకు ఆ పోరాడిన వాళ్లు మళ్లీ కొన్ని కులాలుగా మతచ్చత్రం కింద స్థిరపడడం అనే విషాదం విస్మరణీయం కాదు.

కత్తిని ఎలా పట్టుకోవాలో అలాగే పట్టుకోవాలి. ఎంత వీరావేశంలోనైనా అది కత్తి అని మరిచిపోరాదు. పనయ్యాక దాన్ని దాచి పూజలు చేయరాదు. కత్తి మీది తుప్పు మరింత ప్రమాదం.  

అది మతమైనా, వాదమైనా చివరికి కమ్యూనిస్టు ‘పార్టీ’ అయినా కత్తి వంటి పనిముట్టు మాత్రమే.  

వామ పక్షాలతో తమ పని జరగదని అనుకుంటున్నారివాళ ఇండియాలో కూడా పేద జనం. అందుకు వూరక దిగులు పడక మనల్ని మనం సరిదిద్దుకోడం ఎలాగో ఆలోచించాలి.

ఈలోగా, ఖాళీని చీకటి శక్తులు పూర్తిగా ఆక్రమించాయి. అంధకారం అధికారమై మతాన్ని కంఠదఘ్నంగా వాడుకుంటోంది. ఈ ‘వైరుధ్యం’ లోంచి మతం గొడుగు కిందనే కొందరు పేదల యోధులు ముందుకు రావొచ్చు ఇండియాలోనూ. అవి పేదల డిమాండ్లు కావడమే మనకు క్రైటీరియన్.

మా వామ పక్షాలు కూడదీసుకుని లేచే వరకు ఆగండని ప్రజలను అభ్యర్థించనక్కర్లేదు.

ఎస్ సర్, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం కాదు; పెట్టుబడిని కట్టుకథను అడుగడుగున టూత్ అండ్ నెయిల్ ఎదిరించడమే ఇవాళ గీటురాయి.

దాని మీదే నిగ్గు తేలాలి విప్లవాలు.

ప్రతి దాని మీద… ప్రజల పక్షాన… విమర్శ, మద్దతు అనే రెండు కాళ్లతో మనం నడవాలి ముందుకు.

***

జులై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం.

అమెరికా అనగానే పలు రకాల ఆలోచనలు ముప్పిరి గొంటాయి. పెట్టుబడి దారీ అభివృద్ధికి, ఆ అవగాహనకు, దానికి మూలకందమైన వ్యక్తి స్వేచ్చకు ఎత్తిన పతాక అమెరికా. ప్రభుత్వం అనేది వ్యక్తి స్వేచ్చను కాపాడడానికే గాని, దాన్ని నియంత్రించడానికి కాదని భావించిన వాళ్ళు తయారించిన రాజ్యాంగం అమెరికాది. రెండొందల ఏండ్లు పైన గతించాయి. ఆ రాజ్యాంగం ఇంకా ప్రయోగ దశలోనే వుంది.

అంతకు ముందు ఆధునిక మానవుడు (ఐరోపా నుంచి వొచ్చి) అమెరికా ఖండాల్లో కాల్మోపడమే స్థానిక జాతి హననంతో మొదలయ్యింది. తరువాత ఆఫ్రికా నుంచి ఎత్తుకొచ్చిన నల్ల జాతీయుల జీవితాల్ని… వాళ్ళు బతికుండగానే… హరించిన ఘోర చరిత్ర అమెరికాది.

ఇలా జాతి హననాలు జరగని ప్ర’దేశాలు’న్నాయా? అవి జరగాలని కాదు, అవి జరగని స్థలాలున్నాయా?

నిన్న మొన్నటి వరకు… అవి సో కాల్డ్ స్వర్ణ యుగాలైనా, అంధ యుగాలైనా… రాజరికాలన్నీ కత్తి వాదరల మీద కరుకు ప్రయాణాలే.  ఛెంఘిజ్ ఖానూ తామర్లేనూ మాత్రమే కాదు.. చంద్ర గుప్తుడు, సముద్రగుప్తుడు సైతం ప్రాంతాలను కలిపి రాజ్యాల్ని తయారు చేసింది జనం కుత్తుకల మీద కత్తుల రాపిడితోనే. భారతీయులు గర్వపడే కౌటిల్యం/అర్థశాస్త్రం చెప్పింది … ఎదిరించిన వాళ్ళందరినీ, ముఖ్యంగా గణతంత్ర ప్రాంతాలను.. హతమార్చి, కరప్ట్ చేసి, నిర్జించి రాజ్యాలు విస్తరించడమే.

అమెరికా ఖండాల్లో జరిగింది కూడా అదే. కేవలం అందుగ్గాను… అమెరికాను.. ప్రత్యేకించి నిరసించనక్కర్లేదు. రాజకీయంగా ‘సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్’ ప్రయోగ భూముల్లో ఒకటి అమెరికా.

ఎవరి సర్వైవల్ కోసం వాళ్ళు పోరాడాల్సిందే, వ్యక్తులుగానో సమూహాలుగానో.

దానికి అమెరికా వాళ్ళు తయారు చేసుకున్న రాజ్యాంగం ఎలా వుంది? దాని రచయితల మనో భావాలేమిటి? వాళ్లలో కొందరు నాస్తికులు, బానిస విధానానికి వ్యతిరేకులయినా మతానికి, బానిస హక్కులకు ఆ రాజ్యాంగంలో చోటు ఎందుకు దొరికింది? అనే సంగతులు ఈ సందర్భంగా అధ్యయన యోగ్యాలు.

సరిగ్గా ఈ సమయానికి గుర్తు రావలసిన కవులున్నారు. అందులో మొదటి పేరు వాల్ట్ విట్మన్. అమెరికా రాజ్యాంగం వ్యక్తి స్వేచ్చకు ఎత్తిన పతాకమయితే, వాల్ట్ విట్మన్ దాని సాహిత్య ప్రతినిధి.

మితృలేమంటారో ఏమో, మన గురజాడ లోని ‘మనుషులు’ కూడా వాల్ట్ విట్మన్ కవనంలోని ‘వ్యక్తులే’. 

కేపిటలిస్ట్ డెమాక్రసీ ముందుకు తెచ్చిన వ్యక్తి స్వేచ్చలోంచి వుబికి వచ్చిన అద్భుత గీతాలే ఒక గురజాడ, ఒక వాల్ట్ విట్మన్.

వాళ్ళను ఆవాహన చేసుకుని, అక్కడితో ఆగిపోకుండా, ముందడుగేయాలి; వ్యక్తి నుంచి (శ్రామిక ) సమూహానికి; ‘స్వేచ్చ’ను కాపాడుకుని, విస్తరిస్తూ.

స్వేచ్ఛ కామన్ డినామినేటర్.

ఇండియా సహా సకల దేశాల నుంచి వొచ్చి స్థిరపడిన వారితో పాటు,

అమెరికా ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు… … …

హెచ్చార్కె

12 comments

 • కమ్యూనిజం ఒక టూల్ … India కి ఆ టూల్ అవసరం ఇప్పుడు కానీ దాన్ని ఉపయోగించే సత్తా ఇప్పుడున్న కుల గజ్జి కమ్యూనిస్ట్ లకు లేదండీ ?

 • అవును ‘కత్తిపైన పట్టే తుప్పూ అంతే ప్రమాదకరం’ . సందర్భోచిత సంపాదకీయం.

 • ప్రజాస్వామ్యం గురించి, ప్రస్తుత సాంఘిక స్థితి గురించి బాగా విశ్లేషించారు. సంపాదకులకు ధన్యవాదాలు.

 • ప్రజా స్వామ్యం గురించి ప్రస్తుత ప్రజల స్థితి గురించి బాగా విస్లేఆశించారు. సంపాదకులకు ధన్యవాదాలు

 • “…మతం కూడా మానవ-వ్యతిరేకమే. అనగా, మనుషులు మనుషులు కావడానికి వొదులుకోవలసిన ఒక సాంఘిక విశేషమే.”
  చాలా చక్కటి విశ్లేషణ.. థాంక్యూ సర్..

 • మరీ సముద్రగుప్తుని, చెంఘీజ్ ఖాన్ నూ పోల్చడం.

  • తప్పయితే, ఎందుకు తప్పో చెప్పండి. తెన్నేటి సూరి చెంఘిజ్ ఖాన్ చదివారుగా? తను సముద్ర గుప్తుని కంటె బెటరే. కత్తి పట్టి మంగోలు తెగలను ఏకం చేశాడని అతడి కీర్తి చారిత్రకం.

 • మీ సంపాదకీయం చదివాను..వేలు పెట్టే అవకాశం వస్తుందేమో…అని చూశాను..రాలా..! ఈ వయసులో కూడా..సముద్రాల అవతల ఉంటూ మీరు చేస్తున్న కృషిని శ్లాఘించకుండా ఉండ‌లేను..ఇక్కడ బతుకుతున్న వాళ్ల సంగతేమో కానీ..నా మటుకు నాకు సిగ్గుగా ఉంది సార్..మీ “రస్తా” కు నాదైన శైలిలో తప్పకుండా వ్యాసం పంపుతాను..ప్రచురించడం…ప్రచురించక పోవడం సంపాదకులుగా మీ ఇష్టం..ఈ రాత్రికి సెలవు..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.