కౌముది

ఉదయం నుండీ  తన వెలుగు, వేడి  అందరికీ పంచి అలసిన సూర్యుడు ఎర్రబడిన శరీరంతో ఇక విశ్రాంతి కోసం వెళ్ళడానికి సిద్ధంగా  ఉన్నాడు.  క్రమంగా చీకటి కమ్ముకొస్తోంది. లేగదూడలు పాలకోసం ఎదురు చూస్తాయని పశువులు పరుగెడుతున్నాయి. చీకటి పడ్డాక మేం మాత్రం  ఏంచేస్తాం అని పక్షులు గూళ్ళు వెతుక్కుంటున్నాయి.  అదే సమయానికి ఒక అశ్వ శకటం మీద  కొంత సామగ్రితో ఒక   వర్త  యువకుడు తన కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి పూలుకోస్తున్న దృశ్యాన్ని చూస్తూ అలాగే  మైమరచి నిలిచాడు.  ఒక వైపు మొగిలి పూల వనం, ఇంకొక వైపు  మల్లెపూల  తీగలుకొలనులో కలువలు ఇంకా విచ్చుకోలేదు.   పూల గుబాళింపులు ఒకవైపు, మత్తెక్కించే అందంతో అందమైన అమ్మాయి ఇంకో వైపుఒక అద్భుత, సుందర దృశ్యం.   ఎవరిలోనైనా భావొద్వేగం కలిగించే దృశ్యం. అస్తమిస్తున్న సూర్యుని ముదురు నారింజ కిరణాలు ఆ అమ్మాయి అందమయిన శరీరాన్ని స్పృశిస్తుంటే,  ఆకర్షణీయమైన పట్టు పరికిణీ ధరించిన ఆ యువతి అందానికి దాసోహం అయ్యాడతడు. ఇంతకుముందూ ఎప్పుడూ చూడని అందం.  క్రమంగా శకటం ఆ యువతిని సమీపించింది.  కళ్లెం వేసి తన అశ్వాలను ఆపగలిగాడు కానీ, కళ్ళాల్లేని  ఆ మనసుని ఎవరు  అదుపుచేయగలరు? 

అదే సమయానికి ఒక నల్లటి విష సర్పం  పూలు కోస్తున్న అమ్మాయిని సమీపిస్తోంది.  యువకుడు విషయం  చెప్పే లోపే  ఆ యువతి  వెనుక అలజడిని గ్రహించి,  సర్పాన్ని పసిగట్టి,  పూలు కోయడానికి ఉపయోగిస్తున్న కర్రతో  త్రాచుపాము తల దగ్గర మోది  దూరంగా విసిరింది. త్రాచు పాము తోకముడుచుకొని,  కుయ్యో మొర్రో అని  పారిపోవడం, యువకుడు అలాగే నోరు తెరచుకొని చూస్తున్నాడు.  పాము.. పాము అని అరిస్తే వెళ్లి దాన్ని చంపి పరాక్రమం చూపాలనుకొన్న యువకుడి  ఊహలకందకుండా, రెప్పపాటున భయంకర విషసర్పాన్ని తరమిన  అమ్మాయి సాహసానికి  ఆశ్చర్యపడడం  అతడి వంతు అయ్యింది.

అలా చూస్తూ శకటం నుండి దిగి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు.   ఏమిటీ.. ?అన్నట్టు కను బొమలెగిరేసింది  ఆ అమ్మాయి.   

“ఓ యువతీ !  మిథిలా నగరానికి  దారి చూపుతావా?”  అడిగాడు యువకుడు ఆ ఆశ్చర్యంలో నుండి తేరుకుని. 

“కళ్లెదుట కనపడుతున్న నగరానికే దారి అడుగుతున్నవే! నీ కళ్ళకు మసక కానీ లేదు కదా? అంది యువతి.

“నిన్ను, నీ అందాన్ని,  నీ ధైర్యాన్ని  చూసిన మరుక్షణం నీవు తప్ప ప్రపంచమంతా మసకగానే కనిపిస్తుంది సుందరీ” అన్నాడు

ఆటపట్టిస్తున్నట్టుగా.  “ఎంత ధైర్యం? ఒంటరి ఆడపిల్లను చూసి అలా అనడం మంచిది కాదు.  మా రాజ భటులెవరయినా చూస్తే నిన్ను బ్రతకనివ్వరు వెళ్ళిపో, అసలే విక్రముడు మహామంత్రి గా  ఏలుతున్న రాజ్యమిది”  అంది ఆ అమ్మాయి కొంచెం కోపంగా.

“నా మనసును దోచిన వెన్నెల దొంగవు,  నిన్ను వదలి నేనెక్కడికి పోను?”  మర్యాదగా  మరి కొంత ధైర్యంగా అన్నాడు యువకుడు. 

విక్రముడి పేరు చెప్పినా వెళ్ళలేదంటే అతనెవరో గ్రహించింది ఆ యువతి.  వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా  “యువరాజా…  తండ్రి గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకు, దయచేసి వెళ్ళిపో!”  అని నాలుక కర్చుకుంది యువతి.  ఖంగుతిన్నాడు వ్యాపారి  వేషంలో వున్న విక్రముడు, ఒకింత ఆశ్చర్యానికి  గురయ్యాడు.  ఆ వెంటనే తేరుకొని తన ఎంపికకు తానే మురిసిపోయాడు.  ఇలాంటి బుద్ధి  కుశలత, సాహసం గల యువతి  కోసమే తాను ఇన్నాళ్లుగా ఎదురుచూసేది.  బలిష్టమయిన శరీరం, ఆరడుగుల అందగాడు,  యువరక్తం  ఉరకలు వేస్తున్నవాడు,  సకల విద్యాపారంగతుడు, ఏ మగువ అయినా తను కోరుకునే భర్తకు  ఉండాల్సిన లక్షణాలన్నీ న్నవాడు, ఇరవై రెండు వసంతాల  కుర్ర వయసులో మహామంత్రి స్థానాన్ని అలంకరించిన యువరాజు విక్రముడు. ఆతడు రాజ్యక్షేమం కోసం మారు వేషంలో కూడా ప్రజల్లోకి వెళ్లి , ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు.  ఆ విధంగా వ్యాపారి వేషంలో బయలు దేరిన యువరాజు విక్రముడి కంట పడింది ధైర్య సాహసాలు  కల్గిన యువతి.

“ఓ సుందరీ , ఇంతవరకూ ఎవ్వరూ కనిపెట్టని నా రహస్యం నీవెలా  కనిపెట్టగలిగావు?  నా వేష ధారణలో లోటు ఏమి? నీకంతటి ప్రతిభ ఎలా వచ్చింది?” ఆ యువతికి దగ్గరగా నడిచి ప్రశ్నల వర్షం కురిపించాడు విక్రముడు. “ఓ రాజా,  మీరు మహామంత్రిగా ఏలుతున్న ఈ రాజ్యానికి ఏలోటు లేదు పౌరుల మాన, ప్రాణ రక్షణకు  ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రజలందరూ చాలా సంతోషంగా వున్నారు. ఒంటరిగా వున్న యువతిని వేధించే ధైర్యం  ఈ రాజ్యంలో ఏమగానికి  లేదు. చిన్నప్పటి నుండి మా నానమ్మ అనేది, నన్ను ఏ రాకుమారుడో అశ్వం మీద వచ్చి తీసుకు పోతాడు అని. నాలో అదే   బలంగా నాటుకు పోయింది.   నేను అందగత్తెననే  గర్వం నాతో గాలి మేడలు కట్టించింది. యువరాజు తప్ప నాతో మాట్లాడే ధైర్యం ఎవరికీ  లేదు అని ఒక నిర్ణయానికి వచ్చాను. తప్పే, నేను అంతగా ఆశించాల్సింది కాదు, నన్ను క్షమించండి యువరాజా నేను ఒక సాధారణ మధ్య తరగతి యువతిని”  ఏమాత్రం తడుముకోకుండా అందామె.  రాజుల మనస్తత్వం ఎప్పుడు ఎలా మారుతుందో తెలిసిన యువతి, యువరాజు అని తెలియక తప్పుగా మాట్లాడానేమో అని కొంత భయానికి లోనయ్యింది.

“భయపడకు  సుందరీ,  ఒంటరిగా ఉన్న స్త్రీని సమీపించి అసందర్భంగా మాట్లాడింది నేనే!  నన్ను క్షమించు.  ఇంతకీ నీ నామధేయమేమి?” అభయమిచ్చినట్టు అన్నాడు విక్రముడు.  “కౌముది” కళ్ళు  తుడుచుకుంటూ చెప్పింది అమ్మాయి, అవి కన్నీళ్ళో,  ఆనంద  భాష్పాలో తెలియదు. వంచిన తల పైకెత్తకుండా అక్కడి నుండి పారిపోవడానికి సిద్ధం అయ్యింది. ఆమె ఊహకందనంత  వేగంగా యువరాజు చేతిలో కౌముది ఎడమచేయి చిక్కుకుంది. “కౌముదీ! ఒక్క మాట, అన్ని విద్యలలో ఆరితేరిన నాకు  నిగ్రహం పెద్ద సమస్య కాదు. అది ఈ రోజు నావశం తప్పింది. మీ నాయనమ్మ కోరిక తప్పక నెరవేరుతుంది”  ధీమాగా అన్నాడు విక్రముడు కౌముది చేయి వదిలేస్తూ! 

 “మహారాజా!  ఏదో బాటసారి వేషంలో ఉన్న మీ అందం, శారీరక సౌష్టవం ముందు నేను సరితూగ లేకున్నా… ఇంకా మిమ్మల్లి యువరాజు  వస్త్రధారణలో,  హంగు, ఆర్భాటాలు ఊహించుకుంటేనే… నేను మీకు ఏ విధంగానూ నరితూగను!  దయచేసి నన్ను పోనీయండి.. మీ తండ్రి గారి పరువు ప్రతిష్టలకు భంగం కలుగచేయకండి”  అంది మహారాజు పరువు ప్రతిష్టలకు ఎంత విలువ ఇస్తాడో,  భంగం కలిగిస్తే దాని పర్యవసానమేమిటో తెలిసిన  కౌముది.  “కౌముదీ!  మనసు పవిత్రంగా  లేనప్పుడు ఏ పరువు ప్రతిష్ట మనుషుల్ని కాపాడలేవు.  మనకు కావాల్సింది  నిజాయితీ. జీవితాంతం ఒక మంచి తోడు.  అధికారం, ధనం  ఉన్నపుడు,  లేనప్పుడు ఎప్పుడూ  ఒకేలా ఆదిరించే భాగస్వామి. అంతే కానీ పరువు ప్రతిష్టలు ఒక జీవితాన్ని నిలబెట్టలేవు” అన్నాడు విక్రముడు.
“మరి మహారాజు  గారు …?  అందరూ అనగా విన్నాను ..” ఇంకా ఏదో చెప్పబోయింది కౌముది.  “అదే నేనూ ఆలోచించేది. ఒకసారి జరిగిన ఘోరం ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది, మళ్ళీ ఆలా జరగడానికి వీల్లేదు.  అప్పుడు నేను నిస్సహాయుణ్ణి, పరువు ప్రతిష్టలకు ఆయన ఇచ్చే విలువని, ఆయన అభిప్రాయాన్ని మార్చాలి. అవన్నీ సాధ్యం కావడానికి నువ్వే… నీలాంటి  చురుకైన, గుణవంతురాలే  నాకు కావాలి!  ఇప్పటికైనా నమ్ముతావా?” అంటూ కౌముదికి ఇంకొంచెం దగ్గరకు వెళ్ళాడు. “విక్రమా! నీపై నమ్మకం లేక కాదు,  చంద్రుడిలోనైనా మచ్చ ఉందేమో కానీ, నీలో… నీ.. పరిపాలనలో ఒక్కటంటే  ఒక్క మచ్చ కూడా లేదు”  అంటూ విక్రముని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ  అంది కౌముది. మరింత ఉత్సాహం వచ్చింది  విక్రముడికి.

అప్పటికే చంద్రుడు  తన వెన్నెలను ఆ వనమంతా కురిపించడానికి సిద్ధమవుతున్నాడు.   కొలనులో కలువలు, ఎప్పుడెప్పుడు వెన్నెల కురుస్తుందా, ఎప్పుడు చంద్రుడిని అందుకోవాలా అన్నట్లు  పోటీ పడుతున్నట్లున్నాయి. కౌముది, విక్రముడితో. కొలనులో  కలువలు సిగ్గుతో. గులాబీల గుమగుమలకు తుమ్మెదలు రాత్రి అని మరచిపోయి ఇంకా ఝుమ్మంటూ తిరుగుతూనే వున్నాయి.  విరబూసిన మరుమల్లెల సువాసనల గుభాళింపులకు తాళలేక  మల్లెపొద నేలపై తన  బరువును ఆపింది. కౌముది  ఎప్పుడు  తన దగ్గరగా జరుగుతుందా అని మనసులో తపనపడుతుంటే,  ఎప్పుడెప్పుడు విక్రముని కౌగిలిలో  ఒదిగిపోవాలా  అన్నట్లుగా వున్నాయి తోడు కోసం ఎదురు చూస్తున్న కౌముది చూపులు. కౌముదిని తన కౌగిలిలో  బందీగా చేసుకున్నాడు విక్రముడు. ఇద్దరూ ఈ లోకాన్ని పూర్తిగా మరచి ఏదో లోకంలో విహరిస్తున్న అనుభూతికి లోనైతే,  వెన్నెల కురిపించాల్సిన చంద్రుడు ఇక బాగోదని మబ్బుల చాటుకెళ్ళాడు.  అక్కడంతా చీకటి ఆవరించింది.  కౌముదిని  గాంధర్వ వివాహం చేసుకొని సంతోషంగా తన అశ్వాలను రాజభవనం వైపు దౌడు తీయించాడు విక్రముడు.
***   *** ***   

శకటంలో కూర్చున్నట్టే కానీ, అశ్వాలకన్నా వేగంగా పరుగెడుతోంది విక్రముని మనసు.  ఏదో ఆందోళన కలవర పెడుతుంది.   కౌముదికి మాటనయితే ఇచ్చాడు కానీతన తండ్రి మెప్పు పొంది, కౌముదిని  సగర్వంగా  కోటకు ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు.  చిన్నప్పుడు జరిగిన సంఘటన, తన తండ్రి పట్టుదల గుర్తుకు వచ్చింది.  అది  వైజయంతీపుర రాజకొలువు. అప్పుడు విక్రముడికి పన్నెండు సంవత్సరాల వయసుంటుంది. రాజు పరాక్రమ వర్మ, పేరుకు తగ్గట్టే  పరాక్రమానికి తక్కువేమి కాదు. రాజ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సుసంపన్నంగా ఉంది.  శత్రురాజుల గొడవ అసలే లేదు. పరువు ప్రతిష్టలు రాజుకు ఆరోప్రాణం. ప్రతి అవకాశాన్ని తన పరువు, ప్రతిష్టలు, సంపాదన, రాజ్య విస్తరణ కోసమే  ప్రయత్నిస్తాడు. స్వంత ప్రయోజనం కోసం ఎంతటి దుర్మార్గానికి అయినా వెనుకాడడు.  కూతురుని అడ్డు పెట్టుకొనితన కన్నా బలవంతుడైన పల్లవ రాజుతో వియ్యమంది  ఇతర రాజుల ముందు తన గొప్ప తనాన్ని చాటాలనుకున్నాడు.   కానీ పల్లవ రాజ కుమారునితో జరిగిన నిశ్చితార్థాన్ని కాదని మహామంత్రి కుమారుణ్ణి వలచి వివాహమాడినందున, కన్న కూతురు అని కనికరం లేకుండా, ఇద్దరికీ మరణదండన విధించాడు. అలాంటి  తండ్రికి ముద్దుల కొడుకు విక్రముడు. అప్పుడు తాను చిన్న వయసు వాడైనందున కళ్ళ ముందు ఘోరాన్ని చూస్తూ, అది తప్పు అని గ్రహించినప్పటికీ  ఏమీ చేయలేక పోయాడు.  మిగతా అన్ని విషయాల్లో తండ్రి పట్ల నలేని గౌరవం విక్రమునికి.  

అత్యంత కఠిన దీక్షతో  అతి చిన్న వయసులో అన్ని విద్యలలో ఆరితేరాడు. మహామంత్రి పీఠాన్ని అధిరోహించిన మరుక్షణం  విక్రమునికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు పరాక్రమవర్మ,  తన పరువు ప్రతిష్టకు ఏ మాత్రం తగ్గని రాజకుమార్తెల వివరాలు తెలుసుకుంటున్నాడు.  తనకన్నా అంగబలం, అర్థబలం  ఎక్కువగా వున్న కుంతలరాజుతో సంప్రదింపులు జరుపుతున్నాడు. విక్రముడు మాత్రం  తనను తానుగా, ఒక రాజులా కాకుండా ఒక సామాన్య మనిషిగా గౌరవించి ఇష్టపడే మగువను, సాధారణ కుంటుంబం నుండి వచ్చిన అమ్మాయిని అర్థాంగి  చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.  అది అంత సులభం కాదు అనీ కూడా తెలుసు.

           ***  ***  *** ***

రాజభవనం చేరిన విక్రముని మనసంతా  కౌముది జ్ఞాపకాలతో నిండిపోయింది. కలిసింది ఒక్కసారే గానీ, ఎన్నో రోజులుగా పరిచయం ఉన్నట్టు  అనిపిస్తుంది,  ఎన్నో సందేహాలు తన మనస్సులో  తిరుగాడుతున్నాయి. ఎందరో రాజుల కథలు  విన్నాడు,  చూశాడు. ఏ ఒక్క రాజు జీవితం కూడా  వడ్డించిన విస్తరి కాదు. బలవంతుని చేతిలో బలహీనుడు ఎప్పుడు సామంత రాజుగా బ్రతకడమో, లేక బలవన్మరణం చెందడమో! ఏ ఒక్క రాజు ప్రశాంతగా జీవితం గడిపినట్లు లేదు. విక్రముడికి ఈ అధికారం మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఎందరో  యువరాణులు తనకు వివాహమాడడానికి ముందుకు వస్తున్నారు. రేపు ఏదన్నా జరగరానిది జరిగితే  వారు తనతో  ఉంటారా? కౌముది తనను,  మహారాజుగా కాకుండా, సామాన్య పౌరుడిగా  అధికారం లేనప్పుడు  కూడా గౌరవిస్తుంది.
                                             *** *** **** ****

కొన్ని రోజుల తర్వాత:  

యువరాజుకు అస్వస్తత అనే వార్త నగరమంతా వ్యాపించింది.  వైద్యులెవరూ కనీసం వచ్చి యవరాజుని పరీక్షించడానికి భయపడుతున్నారు. ఆస్థాన వైద్యుడు నగరంలో ఉండీ లేనట్లు చెప్పుకున్నాడు. రాజు పరాక్రమ వర్మ కేమీ అర్థం కావడంలేదు. ఏ వైద్యుడూ యువరాజుని చూసేందుకు ధైర్యం చెయ్యట్లేదు, అసలు యువరాజుకు ఏమయిందన్న నిజం చెప్పట్లేదు.   చివరకు ఒక సైనికుని ద్వారా భయంకర నిజం రాజు చెవిన బడింది.  అదేమంటే “యువరాజుది  నయం చేయలేని వ్యాధి అని, అతని  దరిదాపుల్లో వెళ్లిన వారికి  అది గాలి ద్వారా సోకి వాళ్ళు కూడా ఆ వ్యాధిన పడతారని”. అది విని  తీవ్ర దిగ్భ్రాంతి గురి అయ్యాడు రాజు. యువరాజు అతి  కొద్ది రోజుల్లో మరణిస్తాడని  చేదు నిజం విని మహా రాజు తీవ్ర మనస్తాపానికి  లోనయ్యాడు. కుంతల రాజు నుండి వర్తమానం వచ్చింది,  తమ యువరాణికి  యువరాజు విక్రమునికి జరగబోయే నిశ్చితార్థం  రద్దు చేసుకుంటున్నామని. రాజుకు పుండు మీద కారం చాలినంత పనయ్యింది. మహారాజు ఆలోచనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.

  కొడుకును చూడడానికి,  భద్రతా  సిబ్బంది  కూడా ప్రాణ భయం వల్ల ఏదో సాకుతో నిరాకరించారుఉన్న ఒక్క కుమారుడు చనిపోతే..? తన భవిషత్తు, తన రాజ్యం భవిషత్తు ఏమి  కాబోతుంది? ఏ మిత్ర రాజులూ కూడా కనీసం సానుభూతి సందేశం పంపలేదు. ఇలా రాజు మదిలో ఎన్నో  జవాబు లేని ప్రశ్నలు. మొట్ట మొదట సారి  తాను ఆనాడు చేసిన పని తప్పు అని కొంత పశ్చాత్తాప పడ్డాడు. యువరాజు వ్యాధిని నయం చేసిన వారికి అర్థ రాజ్యం ఇస్తానని ప్రకటించాడు.   అయినా రెండు మూడు రోజుల వరకు ఎవ్వరూ రాజు కోట వైపు కన్నెత్తి చూడలేదు. ఆస్తుల కన్నా, అంతస్తులకన్నా,  పరువు ప్రతిష్ఠలకన్నా ప్రాణమే తీపి అని అర్థం అయ్యింది మహా రాజుకి  

సరిగ్గా ప్రకటించిన నాలుగవ రోజు ఒక పద్దెనిమిది ఏళ్ళ యువతి,  తాను యువరాజుకు వైద్యం చేస్తానని కోటలోకి ప్రవేశించింది.  ఆమె అలసిపోయిన ముఖం చూస్తుంటే  చాలా దూరం నుండి ప్రయాణించి వచ్చినట్టు తెలుస్తుంది, చాలా ఆందోళనగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరో చేయి తిరిగిన  వృద్ధ వైద్యుడు వస్తాడనుకుంటే  ఇంత అందమయిన యువతి రావడంతో మహారాజుతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు.    “నీకు యువరాజు జబ్బు సంగతి తెలిసే వచ్చావా? నీ ప్రాణానికి హాని”  అన్నాడు రాజు ఆశ్చర్యంలో నుండి  తేరుకొని. ఏదైయినా జబ్బు నయం చేసే మార్గం దొరకవచ్చు అనే ఆశ, మహారాజుకి .
“ఔను  మహారాజా, అన్నీ  తెలిసే వచ్చాను! ఆలస్యంగా ఈ విషయం తెలిసినందుకు  నేను విచారిస్తున్నాను” అన్నది చాలా నమ్మకంగా,  స్థిరంగా. “సరే, యువరాజును  కోలుకునేట్టు చేస్తే నీకు అర్థ  రాజ్యం ఇస్తాం” అన్నాడు రాజు.   “రాజా.. నేను మీరిచ్చే అర్ధ రాజ్యనికో, బహుమతులకో ఆశపడి రాలేదు.” అన్నది ఆ యువతి.  మనసులో మాత్రం ఎప్పుడెప్పుడు యువరాజును కలావాలా అన్నట్లుంది.  “సరే, అయితే అన్నీ తెలిసే వచ్చావన్న మాట”  ఒకింత ఆనందంతో, ఆశతో  అన్నాడు రాజు,   మాటలో ఇంతకు ముందు లాంటి అధికార దర్పం, గర్వము కనపడట్లేదుయువరాజుకు వచ్చిన జబ్బేదో, ఎలాంటి వైద్యం తెలియని ఆమె వచ్చింది యువరాజును  కలవడానికి మాత్రమే.  రాజుకు అసలు విషయం తెలిస్తే దాని పర్యవసనాన్ని  ఊహించలేదు. చావుబ్రతుకుల మధ్య , ఆశ-నిరాశల మధ్య ఊగిసలాడే యువరాజు మందిరానికి రాజ భటులను  అనుసరించి వెళ్లింది ఆ యువతి .

              *** **** **** *** ***

సరియైన ఆహరం లేక, బాగా బక్క చిక్కి పోయాడు విక్రముడు.  మాసిన గడ్డంతో, దయనీయ స్థితిలో ఉన్న విక్రముని చూడగానే ఆ యువతిలో దుఃఖం పొంగు కొచ్చింది.  కళ్ళలో నీళ్లతో వెళ్లి విక్రముడి కౌగిలిలో వాలిపోయింది. విక్రముని ఆనందానికి హద్దుల్లేవు,  కళ్ళ నిండా ఆనందభాష్పాలు. “కౌముదీ ..” అన్నాడు సంతోషంగా ఆమెను కొంచెం దూరంగా జరుగుతూ.  
“విక్రమా, ఏమిటీ శిక్ష?  నేను విన్నది నిజమేనా ?”  అంది బోరున విలపిస్తూ.   “పిచ్చిదానా లే, ఎందుకు అలా ఏడుస్తున్నావ్?  అయినా నీవెందుకిలా వచ్చావ్?  నేను రేపో,  మాపో  పోయేవాన్ని నాపై నీకెందుకు ప్రేమ? పో.. వెళ్లి పో!  హాయిగా ఇంకెవరినయినా పెళ్లి చేసుకొని కాపురం చేసుకో!” అన్నాడు ఇంకొంచెం దూరం జరుగుతూ. “విక్రమా ! అలా అనకు, మీకేమీ కాదు. మిమ్మల్ని ఇలా ఒంటరిగా  వదలి వెళ్ళలేను” అంది కళ్ళలో నీరు తిరుగుతుండగా.  విక్రముడి  ఆనందానికి అంతులేదు, తను  ఏదయితే ఆశించాడో అదే జరిగింది. అధికారం, ధనం కన్నా  మనిషికి, మనసుకే ఎక్కువ విలువ అవ్వడంఅయిన వాళ్లందరినీ విడిచి  తన కోసం కోట లోకి ధైర్యంగా ప్రవేశించడం… కౌముది మనస్తత్వతం ఏమిటో అర్థం అయ్యింది.   ఇలాంటి తోడు జీవితాంతం ఉంటె , ప్రపంచాన్నే  జయించ వచ్చు అని అర్థం అయ్యింది విక్రముడికి.


“ప్రియా, ఇలా రా!” అని ఇంతవరకూ  దూరంగా జరిపిన కౌముదిని తన కౌగిట్లోకి దగ్గరగా లాక్కుని చెవిలో ఏదో విషయం చెప్పాడు విక్రముడు. “నిజంగానా..  నేను వింటున్నది నిజమా….” అని  నవ్వుతూ, బిగ్గరగా ఏడుస్తూ విక్రముడి వొడిలో వొదిగిపోయింది. పట్టరాని సంతోషంతో విక్రముడు మాత్రం దగ్గరుకు తీసుకొని, తన కౌగిలిలో బంధించాడు కౌముదిని.   అమ్మాయి ఏమి వైద్యం చేస్తున్నదో,  ప్రస్తుతం యువరాజు పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియక కోటలో మాత్రం చాలా ఉత్కంఠత  చోటు చేసుకున్నది.

రెండు రోజుల తర్వాత:

నగరమంతా పర్వదినం, యువరాజు పూర్తిగా కోలుకున్నాడని ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. రాజ కొలువు ప్రారంభమయ్యింది.  మహారాజు కూడా చాలా సంతోషంగా,  ఉత్సాహంగా ఉన్నాడు. విక్రముడిపుడు పూర్తిగా కొత్తగా,  ఇంతకుముందు కంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. అతనికి దూరంగా కౌముది  బంగారు వస్త్రాల్లో రాకుమారిలా మెరిసిపోతుంది. “మా సుపుత్రుని ఆరోగ్యాన్ని బాగుచేసిన ఈ యువతి కి మేము ఇచ్చిన  మాట ప్రకారం అర్థ రాజ్యాన్ని ఇవ్వనున్నాము. ఓ యువతీ మాకు ఈ రోజు చాలా శుభదినము.  మీరు చేసిన సహాయం, త్యాగము ఎన్నటికీ మేము మరువలేము. అడుగు, నీకు  ఇంకా ఏమైనా కోరికలుంటే, తీర్చగలం” అన్నాడు  మహారాజు.
“మహారాజా, నేనేదో ఆశించి మీ దగ్గరకి రాలేదు.  ప్రాణాంతక వ్యాధి అని తెలిసి,  ప్రాణాలు రక్షించాల్సిన వైద్యులే  పారిపోయినప్పుడు, ఇంక ఆ యువరాజు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి.  నా దగ్గర ఎలాంటి ఔషదాలు లేవు,  అసలు నా దగ్గర ఎలాంటి వైద్యం లేదు.  జబ్బు చేసిన మనిషికి కావాల్సింది  సేవ, ఓదార్పు, ప్రేమ ఇవి లేనివి ఏ ఔషదాలు పని చేయవు.  నేను అవి ఇచ్చి యువరాజును మళ్లీ మనిషిని చేద్దామని వచ్చాను.  మనసిచ్చిన వానితో సుఖాన్ని, కష్టాన్ని కూడా పంచుకునేదే అసలైన స్త్రీ! నేను అదే బాధ్యతగా, చావైనా, బ్రతుకైనా యువరాజుతోనేనని ఈ కోటకి వచ్చాను”  కళ్ళలో నీరు తుడుచుకుంటూ…  నిజం తెలిశాక, పరిణామాలు ఎలా ఉంటాయో  అనే  భయంతో అన్నది కౌముది.

 మహారాజు తాను ఒకింత కోపోద్రికుడై ఏదో చెప్ప బోయేంతలో “మహారాజుల వారు క్షమించాలి,  నేను ఈ యువతీ పరస్పరం ప్రేమించుకోవడమే కాక గాంధర్వ వివాహం కూడా చేసుకున్నాము,  జబ్బు పడినట్లు నేను ఆడిన చిన్న నాటకం,  ఆ విషయం తెలిసి, ఒక్క క్షణం కూడా ఆగకుండా తన ప్రాణాలను సైతం లెక్క చేయక, ఎవరెన్ని చెప్పినా వినకుండా ఎంతో ధైర్యంగా నన్ను చూడడానికి వచ్చింది” అన్నాడు  విక్రముడు.  

మహారాజులతోనే పరిహాసమా ?”  కోపంతో అన్నాడు రాజు.

“ప్రభువులు మన్నించాలి,  ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించాను.  నేను తప్పు చేసినప్పటికీ,  మీరు ఒక విషయం గ్రహించాలి. మీ పరువు ప్రతిష్టలకు నేను భంగం కలిగిస్తే క్షమించండి.  అయితే ఒక్క విషయం,  నేను మీకు  కొన్ని విషయాలు స్పష్టం చేయడానికే నాటకం ఆడింది. నేను జబ్బు పడిన విషయం తెలిసి నిశ్చితార్ధం రద్దు చేసుకున్నాడే ఆ  కుంతలరాజు, అతని నిజ స్వరూపం బయట పడింది కదా!  ఆయనకు మన సైనిక బలం కావాలి, మన  పేరు ప్రతిష్టలు కావాలి, కానీ ఆపదలో,  అనారోగ్యంతో ఉన్నప్పుడు  గడ్డి పోచలా పక్కకు పెట్టాడు నన్ను. ఇంత అధికారం వుండి, ఇంత సైన్యం ఉండీ  కూడా ఒక్క మనిషన్నా నన్ను చూడడానికి రాలేదే! ఇన్ని రోజులు నేను ఎవ్వరికీ కనిపించకుంటే, కనీసం  మనిషి  చచ్చాడా..  బ్రతికాడా అని కూడా తెలుసుకోలేక పోయిన  మీ  ప్రత్యేక  భద్రతా  సిబ్బంది  ఉండి కూడా ఏమి లాభం?” నిండుసభలో కఠోర  నిశ్శబ్దం ఆవరించింది, మహారాజు తో సహా అందరూ  విక్రముని మాటలని శ్రద్ధగా వింటున్నారు.

“నేను ఆడిన ఒక్క అబద్దం, అందరికీ ప్రాణభయం. ఇంత అధికారం, హంగూ ఉండి  కూడా ఏ ఒక్కరూ ముందుకు రాని తరుణంలో, తెలిసిన మరుక్షణం  నేనే జీవితమని, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక ఈ రోజు నన్ను మీ ముందు నిలబెట్టిన ఈ యువతీ నేను గాంధర్వ వివాహం చేసుకున్నాము.  జీవితాంతం  ఒకరికి ఒకరు తోడుగా  ఉండాల్సిన వారు, వారి వారి మనస్సులను అర్థం చేసుకొన్న తీరుపై ఉంటుంది కానీ,  వారి ఆస్తులు, అంతస్తులు, పరువు ప్రతిష్టలపై కాదు అని మాత్రం నేను చెప్పదలచుకున్నాను.” అని నిల్చున్నాడు విక్రముడు.

కొంచెం సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది సభలో,  యువరాజు సోదరి  సంఘటన ఎవరూ మరవక ముందే మల్లీ ఈ రోజు యువరాజు ముద్దాయిగా సభలో నిలబడడం సభికుల్లో ఎవరికీ నచ్చలేదు. మహారాజాఇందులో యువరాజు దోషం ఏమాత్రం లేదుప్రజా  క్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతున్న యువరాజు సేవలు రాజ్యానికి చాలా అవసరం.  మీ పరువు ప్రతిష్టలకు ఎమైనా భంగం జరిగింది అనుకుంటే అదంతా నావల్ల మాత్రమే, నన్ను శిక్షించండి,  నేను శిక్షకైనా సిద్ధమేవేడుకోలుగా అన్నది కౌముది.  రాజు చేసింది అన్యాయం అని అందరికీ తెలిసినా రాజు తీర్పును ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేక పోయింది,   రోజు తన కూతుర్ని శిక్షించినప్పుడు, ఈ రోజు తన కుమారుడు ముద్దాయిగా నిలబడినప్పుడు కూడా! అందరిలో ఉత్కంఠ. ఇప్పుడు అందరూ భయాందోళనలకు లోనయ్యారు. ఇద్దరికీ మరణ శిక్ష తప్పదని ఇన్నకొందరి  గుసగుసలు.  కన్న కూతుర్నే కఠిన శిక్షకు గురిచేసిన రాజుకి ముక్కూ  మొహం  తెలియని యువతీ ఒక లెక్కాఅని అనుకుంటున్నారు  సభలోని జనం.   మరొక్క సారి నిశ్శబ్దం రాజ్యమేలింది సభలో!  

సభలో అందరినీ ఒకసారి కలయచూసాడు రాజు.  కౌముది వైపు, యువరాజు వైపు చాలా పరిశీలనగా చూసి,  ముఖం లో గాంభీర్యం తగ్గకుండా  ... ఎవరక్కడ ?” అని   ఒక సైనికుని పిలిచి ఎవరికీ వినిపించకుండా ఏదో విషయం చెవిలో చెప్పాడు రాజు.   చరిత్ర పునరావృతమవుతుంది అని అర్థం అయ్యింది సభికులకు.   ఏదో దారుణం జరగ పోతుంది అని అందరూ  మనసులో అనుకుంటుండగా  సైనికుడు ఒక పెద్ద బంగారు పళ్లెంలో  ఏవో  వస్తువులపై  వస్త్రాన్ని కప్పి తీసుకువచ్చాడు.   పళ్లెంలో ఒక పదునైన కత్తి మాత్రం బయటకు కనిపిస్తుంది.   అందరిలో మరింత ఉత్కంఠత చోటు చేసుకుంది. కత్తిని చూసి మరింత భయాందోళనలకు లోనయ్యారుఇంక మాత్రం ఆశ లేదు, ఇద్దరికీ మరణశిక్ష తధ్యం  అనుకున్నారు సభికులు.   సభలోని  నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ

“నా అవివేకానికి  ఇప్పటికే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.  చూస్తూ చూస్తూ, అదే తప్పు నేను మళ్ళీ చెయ్యలేను.  విక్రమా.. నీవు ఆడిన నాటకం వల్ల,  కౌముది చూపిన సాహసం, తాను నీ మీద చూపిన ప్రేమ వల్ల, నా కళ్ళు తెరుచుకున్నాయి.  “ఓ యువతీ,  నీ వెవరివో, నీవెక్కడ యువరాజుల వారిని కలిసావో కానీ … పరువు ప్రతిష్టలే  ప్రాణంగా బతుకుతున్నమా కళ్ళు తెరిపించావ్.  నీవే  మా విక్రముడికి సరియైన జోడీ!  ఈ సభాముఖంగా మీ వివాహం జరిపించెదము”  అనగానే సభలో ఒక్కసారి గా వాతావరణం మారిపోయింది.  అందరి ముఖాల్లో ఆనందం వెళ్లి వెరిసింది.   బంగారు పళ్లెం పై నుండి వస్త్రాన్ని తొలగించిదానిలోఉన్న  రెండు పూలమాలలను ఇద్దరినీ మార్చుకో మన్నాడు రాజు.   సాంప్రదాయం ప్రకారం , వరుడు  కత్తితో విన్యాసాలు చేయాలి  వివాహంలో.     సభికుల ఆనందోత్సాహాల మధ్య విక్రముడి  విన్యాసం పూర్తి అయ్యింది.  

వెంటనే విక్రమువైపు తిరిగి  ” ఒక మనిషి తెలిసి తప్పుచేయడం ఎంత నేరమో, తప్పు చేస్తున్న మనిషిని సమర్థించడం, ఆ తప్పును ఎత్తి చూపక పోవడం కూడా నేరమే!  సభలో ఇంత మంది ఉండి కూడా  ఆ రోజు నేను చేసిన తప్పును ఎవరూ ప్రశ్నించలేదు,  ఈ రోజు ఇంత మంది సభలో వుండి  కూడా నా నిర్ణ యం  ఏమిటో తెలుసునే ప్రయత్నం  చేయలేదు. మనిషికి పరువు ప్రతిష్టలే గొప్ప అని తప్పుడు అభిప్రాయంతో వున్న నా కళ్ళు  తెరిపించావు చాల ధైర్యంగా,  అదీ నీ ప్రాణాలకు తెగించి! చిన్నవాడివయినా  నీ ప్రయత్నానికి  మేము హర్షిస్తున్నాము”  రాజు ఉపన్యాసం తో సభలో  చప్పట్ల మ్రోత మ్రోగింది.

“ఈ రోజునుండి  ఈ సభలో ఎలాంటి నిర్ణమయినా పలువురు సభ్యులతో లేదా నిపుణులతో  చర్చించి అందరి అభిప్రాయం వెలువరించిన  తర్వాతే రాజ నిర్ణయం ప్రకటించ బడుతుంది”  మరొక్కసారి సభ చప్పట్లతో  మారు మ్రోగింది. 

వేణు నక్షత్రం

వేణు నక్షత్రం: ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా ఎంసీఏ పూర్తి చేసి 1998 లో జీవన భృతికై అమెరికావచ్చారు. సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం స్పూర్తితో రాయడం అలవాటు చేసుకున్నారు. కథలు మౌనసాక్షి (సుప్రభాతం 1992) , పర్యవసానం ( ఆంధ్రజ్యోతి 1993) మరి కొన్ని కవితలు రాశారు. గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ రంగం లో పని చేస్తున్నప్పటికీ, సాహిత్యం రంగాలు ప్రవృత్తి అయ్యాయి. అమెరికాలో పలు సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేసి, ఆ తర్వాత తీసిన మూడు కథల సమాహారం "నక్షత్రం - మూడు హృదయాల చప్పుడు' ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆత్మీయంగా పలకరించింది . ఇటీవల ప్రారంభించిన పిలుపు టీవీ కూడా అనతి కాలంలోనే జన రంజకమయింది. .

email: nakshatram@gmail.com

3 comments

 • కథ బావుంది.
  ఈ కథకి ప్రేరణ ఏమైనా వుందాండీ?-
  అభినందనలతో..
  -ఆర్.దమయంతి.

  • ధన్యవాదములు దమయంతి గారు.
   ప్రేరణ అంటే .. “కథల్లో ఇంగ్లిష్ పదాలు వాడకుండా రాయగలరా?” అని నా పై ఉంచిన ఒక మిత్రుని సందేహాన్ని సవాలు గా స్వీకరించి రాయడం జరిగింది. అలాగే నేను రొమాంటిక్ స్టోరీలు కూడా రాయగలను అని నిరూపించుకునే ప్రయత్నం.

 • చాలా చక్కటి కథ .. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు, చందమామ కథలను గుర్తుకు తెచ్చింది . అసలయిన ప్రేమను వెతుక్కుంటూ వెళ్లడం, అధికారం , హోదా మన అవసరాల్లో పని చేయదని, కేవలం ప్రేమతోనే ప్రపంచాన్ని జయించ వచ్చు అని చాలా అందంగా చెప్పారు. చాలా రోజుల తర్వాత మనసును హత్తుకొనే ఆహ్లాదకర మయిన కథ చదివిన అనుభూతి . ఇలాంటి మరీను కథలు మీనుండి రావాలని ఆశిస్తున్నాను.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.