స్త్రీలకు అత్యంత ప్రమాదకర దేశం

ఈ భూమండలం మీద స్త్రీలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని తేలింది. సంఘర్షణాత్మక ప్రాంతాలలో వున్న ఈ తీవ్రతకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో థామ్సన్ రాయిటర్ పౌండేషన్ 2018 లో నిర్వహించిన సర్వేలో ఆఫ్ఘానిస్తాన్, సిరియా, సోమాలియా, యెమెన్ దేశాలు ఇండియా తర్వాత వున్నాయి.  ఆరోగ్య భద్రత, వివక్ష, సాంస్కృతిక ఆచారాలు, లైంగిక హింస, శారీరక హింస, అక్రమ రవాణా వంటి ఆరు అంశాల మీద 548 మంది నిపుణులు ఈ గ్రేడింగ్ ఇచ్చారు. అయితే ఇందులో ఆరోగ్య భద్రతలో నాలుగు, వివక్షలో మూడవ స్థానాల్లో మనం నిలిచాం! ఈ నేపధ్యంలో ఈ సర్వే తర్వాత అయినా… ‘వార్ జోన్ రేప్’ మీద ఇక్కడ అధ్యయనం జరగాలి.

మానవ ఇతిహాసంలో స్త్రీ మీద జరిగిన మొట్టమొదటి అత్యాచారం ఏది? అందుకు మనం ‘బైబిల్’ చూడాలి. అలా అంటే, అది మతం గురించి మాటలాడ్డం కాదు. అటు కూడా చూస్తేనే, ఇటువంటి సంక్షుభిత కాలంలో చరిత్ర – జాగ్రఫీలు మనకు మార్గదర్శనం అవుతాయి. ఎందుకు ఈ మాట అనడం అంటే – ‘బైబిల్ ల్యాండ్’ ఉన్నదీ, ఇండియా ఉన్నది ఆసియా లోనే. కనుక అటు వైపు కూడా చూస్తే, అక్కడ మనకు కనిపించే వాటితో మనకు సరిపోలిక ఉంటె, అప్పుడు – దాని గురించి తెలుసుకోవడం తెలివైన పని. ఒకప్పుడు ఆసియాను ఖండం అంటే, భారత్ ను ‘ఉప ఖండం’ అనేవారు. కారణం – ఆసియాలో సగం పైగా ఒకనాటి అఖండ భారత్ వుండేది. ఆనాటి ప్రాదేశిక సరిహద్దులను బట్టి ఇరుగు పొరుగుల మధ్య – ఆదాన ప్రదానాలు కూడా అలాగే ఉండేవి. భిన్న జాతులు వాటి సంస్కృతులు వేర్వేరు అయినప్పటికీ, స్త్రీ పురుష సంబంధాలు మాత్రం – భౌగోళిక, శీతోష్ణ స్థితి కేంద్రితంగా సారూప్యతతో వుండేవి. ఉష్ణ మండలమైన ఆసియాలో ఆ తాపం ఎక్కువ. స్త్రీలు ఇంటి పనులు పిల్లల్ని సాకడంతో పాటు – పశుపోషణ, పాడి, సాగు పనులకు చేదోడుగా ఉండే వారు. బావుల నుంచి నీళ్ళు తేవడం కూడా వీరి పనే. దాంతో ఇక్కడ ఏదో ఒక అవసరంతో ‘ఆమె’ గడప దాటి బయటకు రావడం తప్పనిసరి.

పశుగణాలతో సాగిన నాటి సంచార జీవనంలో ఒంటెలు, ఎద్దులు, ఆవులు, గాడిదలతో పాటు అడ-మగ బానిసలు కూడా కలిసి ఒక యజమాని ఆస్తి లెక్కల్లో భాగమై వుండేవారు. అలా బానిసలు కూడా ఒక ‘కమోడిటీ’ కావడంతో, ఒక దాసి తన యజమానితో శయనించడానికి అక్కరలేనిది కనుక అయితే, చివరిగా ఆమె ఆ ఇంటిలో పనిచేసే మగ బానిసల సొత్తు అయ్యేది. అప్పుడు ‘ఆమె’ వారికి లొంగకపోవడానికి మరే ఇతర కారణాలు ఆమెకు ఉండవలసిన అవసరం లేదు. సంపన్న, కులీన కుటుంబ స్త్రీలు మాత్రం ఇటువంటి కామ పీడనలకు ఒక మినహాయింపు.

దీనా ఎత్తుకుపోతున్న దృశ్యం

‘ఆమె’ పై తొలి అత్యాచార ఘటన – రెండు భిన్నజాతులకు చెందిన సంపన్న కుటుంబాల్లో జరిగింది. దీని బాధితురాలు జేకబ్, లేయా ల కుమార్తె – దీనా. ఇది చరిత్రలో మొదటి ‘రేప్’ సంఘటనగా బైబిల్లో (ఆదికాండం 34 అధ్యాయం) రికార్డు అయింది. అంతేకాదు ఇది అపారమైన హింసకు, ఒక జాతి హననానికి కారణం అయింది. జరిగింది ఇది – సంపన్నుడైన జేకబ్ కు ఇద్దరు భార్యలు, మరో ఇద్దరు  దాసీలకు కలిపి మొత్తం 12 మంది కుమారులు, ఒక కుమార్తె. తానున్న చోట కరువు రావడంతో జేకబ్ తన పరివారంతో కనాను చేరి, ఆ పట్టణ నాయకుడు హమోరు వద్ద భూమి కొని అక్కడ స్థిరపడతాడు. జేకబ్-లేయ ల ఏకైక కుమార్తె దీనా అందమైనది. ఆమె హమోరు కూతుళ్ళ వద్దకు స్నేహంగా వెళుతుంది. తమ ఇంటికి వచ్చిన దీనా మీద హమోరు కొడుకు షేకేము అత్యాచారం చేస్తాడు. దీనాను తన బందీగా ఉంచుకుని, ఆమెను నాకిచ్చి పెళ్ళి చేయమని తన తండ్రిని జేకబ్ వద్దకు పంపుతాడు.

కీ.పూ. నాటి ఈ సంఘటన, కాలక్రమంలో స్త్రీ పురుష సంపర్క సంబంధాలకు ఒక ‘కోడ్ ఆఫ్ కాండక్ట్’ ఏర్పడడానికి హేతువయింది. అప్పటికి ‘స్టేట్’ గాని ‘లా’ గాని  లేకపోయినప్పటికీ, ఇది జరిగింది సంపన్నుల ఇంట్లో కనుక తక్షణ న్యాయం (ఇనిస్టెంట్ జస్టిస్) అమలయింది. జేకబ్ ఇద్దరు కుమారులు షిమ్యోను లేవీ లు (వీరిద్దరికీ దీనా తోడపుట్టినది) తమ తండ్రికి కూడా విషయం తెలియకుండా పధక రచన చేస్తారు. ‘మా చెల్లి దీన ను నీ కొడుకు కు ఇచ్చి పెళ్ళి చేస్తాం, మీరు కూడా మా తెగ మాదిరిగా సున్నతి చేయించుకుంటే’ అని షరతు పెడతారు. కొడుకు కోసం షేకేము తండ్రి అందుకు ఒప్పుకుంటాడు. వారు సున్నతి చేయించుకుని, కదలలేని స్థితిలో వున్న మూడవ రోజు కత్తులతో దాడి చేసి, హమోరు కుమారుడు షెకేమును చంపి తమ చెల్లెలు దీనాను ఇంటికి తీసుకువస్తారు. ఆ పట్టణానికి వారు కొత్త అయినప్పటికీ, కుటిల నీతితో పకడ్బందీ ప్రణాళిక వేసి మరీ దాన్ని అమలు చేస్తారు. ఒక్కడు – శారీరిక వాంఛకు లోనై నిగ్రహాన్ని విచక్షణను కోల్పోయినందుకు, అతని తెగ మొత్తం హతమవుతుంది. ఆ పట్టణం జేకబ్ స్వాధీనం అవుతుంది. కొడుకులు చేసింది చూసి హతాశుడైన తండ్రితో – “వాడు, వేశ్యతో జరిగించినట్టు, మా సహోదరితో ప్రవర్తించ వచ్చునా?” అని కొడుకులు అడుగుతారు.

ఇది జరగడానికి కొద్ది రోజులు ముందే జెహోవా జేకబ్ ను ఇక ముందు నీవు ‘ఇజ్రాయెల్’ గా పిలవబడతావు అని ప్రకటిస్తాడు. అలా జేకబ్ 12 మంది కుమారులు 12 ఇజ్రాయెలీ యూదు తెగలుగా విస్తరిస్తారు. ఈ అత్యాచార ఘటనకు ప్రతీకార వ్యూహం అమలుకు సూత్రధారి అయిన లేవీ పేరుతో ‘లేవీయ కాండం’ ఒక అధ్యాయంగా బైబిల్లో నిక్షిప్తమైంది. యూదు 12 తెగల్లో ఒక్క లేవీ పేరుతోనే బైబిల్ పాత నిబంధనలో 27 అధ్యాయాలతో ఒక భాగముంది. ఈ లేవీలు – యూదు జాతికి అర్చక వర్గం. కనుక దీన్ని బైబిల్ పండితులు –Hand book of priests అంటారు. ఈ లేవీయులతో మన వద్ద బ్రాహ్మణులకు పోలికలు ఎక్కువ వుంటాయి. ఈ లేవీ మనవడు, ఇజ్రాయెలీ ప్రజలను ఈజిప్ట్ ఫరోల దాస్య చెర నుంచి విడిపించిన విముక్తి ఉద్యమ నాయకుడు –మోజెస్. ఈ 12 తెగలు వేర్వేరు దిక్కులకు విడిపోవడానికి ముందు, జెహోవా మానవ జాతికి ‘సివిల్ కోడ్’ గా ఇచ్చిన ‘టెన్ కమాండ్ మెంట్స్’ అమలు చేయమని ఈ మోజెస్ కు అప్పగించాడు. వాటిలో ఏడవ ఆజ్ఞ –వ్యభిచారం చేయవద్దు. (You shall not commit adultery) అలా అది, నేరము-శిక్ష అనే (రాజ్యం) పరిధి బయట ప్రజా జీవనంలో ఒక నైతిక రుజువర్తనంగా మారింది.

మానవాళి సంచార జీవనంలో దీనా విషయంలో ఆమె అన్న లేవీ అమలుచేసిన  తక్షణ న్యాయ సిద్దాంతమే (Instant justices), వేలాది ఏళ్ళు ‘పంటికి పన్ను.. కంటికి కన్ను’ గా ‘మోజెస్ లా’ పేరుతో అమలయింది. అయితే కీ.శ. 26-27 శతాబ్దిలో కూడా జేరుసలేము పీఠాధిపతులు దానినే అమలు చేస్తాము, వ్యభిచరించిన స్త్రీని పట్టణ కూడలిలో రాళ్ళతో కొట్టి చంపాలి అన్నప్పుడు –జీసస్ ‘మీలో ఆ పని చేయనివాడు, ఆమె మీద మొదటి రాయి వేయండి’ అనడం ద్వారా – ‘ఆజ్ఞల’ అమలులో ప్రజాస్వామీకరణ మొదలయింది. ఒకానొక దశలో ‘ఆ’ దృష్టితో ‘ఆమె’ ను చూడ్డం కూడా వ్యభిచారమే అవుతుంది, అని దానిపై వివరణ కూడా ఇవ్వబడింది.

ఇటువంటి నేపధ్యమున్న పశ్చిమ ఆసియాలోని ‘బైబిల్ ల్యాండ్’ నుంచి, దక్షిణ ఆసియాలో ఉన్న’భారత్’ ను ఇప్పుడు వేరుచేసి చూడ్డం కుదిరే పనికాదు. ఎందుకంటే వేలాది ఏళ్ల పాటు మన పైకి వచ్చిన మొఘలులు, సుల్తానుల మంగోలుల దండయాత్రలకు ఇదే నడవ (కారిడార్) అయింది. మరొక నైసర్గిక చిత్రం ఏమంటే, భారత్ మూడు వైపులా సముద్రమున్న ద్వీపకల్పం కావడంతో విదేశీయులు మన లోపలికి రావడానికి, తిరిగి బయటకు వెళ్ళడానికి ఒక్కటే మార్గం అయింది! ఈ రాకపోకలకు ముఖ ద్వారమైన డిల్లీది ఐదు వేల ఏళ్ల చరిత్ర. సుల్తానులు 700  ఏళ్ళు పాటు డిల్లీని పరిపాలించారు, వీరు 1206 లో డిల్లీ నగరాన్ని నిర్మించారు. డిసెంబర్ 1398 లో తైమూర్ డిల్లీని నేలమట్టం చేసాడు. జైళ్ళలో వున్న లక్ష మంది యుద్ద ఖైదీలను చంపాడు. లక్ష కుటుంబాలకు యజమానులు లేకుండా బిడ్డలకు తండ్రి లేకుండా పోయారు. ఆ తర్వాత మొఘలు, బ్రిటిష్ ఇలా ఈ నేల మీద విదేసీయులది సుదీర్ఘ కాల పాలన. దీనిని మానవ శాస్త్రం (అంత్రోపాలజీ) దృష్టితో మనం చూడాలి. అలా చూసినప్పుడే భారతీయులుగా చలామణి అవుతున్న తదనంతర తరాల ‘బిహేవియర్ ప్యాట్రన్స్’ మూలాలు ఏ కొంచమైన మనకు అర్ధమవుతాయి. అప్పుడు, గత చరిత్రలో ఇక్కడ ‘స్త్రీ’ పట్ల వెల్లువెత్తిన లైంగిక కాంక్షలో వైపరీత్యాల చరిత్ర మనకు తెలుస్తుంది.

‘నిర్భయ’ సంఘటన జరిగిన తర్వాత, డిల్లీలోనే పుట్టి పెరిగి, యూనివర్సిటీ ఆఫ్ కో పెన్ హెగాన్ లో దక్షిణ ఆసియా స్టడీస్ సెంటర్ డైరక్టర్ గా పనిచేస్తున్న రవీందర్ కౌర్ అప్పట్లో ‘సూర్యాస్తమయ భయాన్ని గెలవాలి’ శీర్షికతో ప్రముఖ ఆంగ్ల పత్రికలో ఒక వ్యాసం రాసారు. అందులో- “సూర్యాస్తమయ వేళకు ఇంటికి చేరుకోవాలి, ఇది నేను 90 దశకంలో యూనివర్సిటీలో చేరినప్పుడు మా అమ్మ నా వద్ద తీసుకున్న మాట. నియమంగా కాదు, భద్రత కోసం. అప్పట్లో ఇక్కడ ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటా ఇదే పరిస్థితి” అంటారామె. ఎక్కడైనా యుద్దకాలంలో పిల్లలు స్త్రీలు దురాక్రమణదారుల తొలి లక్ష్యాలు అవుతారు. కానీ, ఆనాటి ఈ యుద్ద ప్రాంతాలు వేల ఏళ్ల తర్వాత కూడా అప్పటి ‘చీకటి చరిత్ర’ ను ఇంకా వీపున మోపుగా మోయడం ఆధునిక కాల విషాదం. దీని మీద నిఘా ఉంచిన భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో 2009 తర్వాత మన దేశంలో స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో క్రూరత్వం పెరుగుతున్నట్టు గుర్తించింది. ఈ సంఖ్య 2013 తర్వాత 50 శాతం పెరిగింది. ప్రతి రోజు 848 మంది వేధింపులకు గురికావడమో, లేదా అఘాయిత్యాలకు గురై చనిపోవడమో, లేక అక్రమంగా అమ్మివేయబడడమో జరుగుతూవుంది.  

అయితే దీన్ని, అభివృద్ధి చెందిన ‘జి -8’ దేశాలు అంతర్జాతీయ వేదిక మీద చర్చకు పెట్టడం మనకు కొంత ఊరట. 2013 ఏప్రెల్ 11 న లండన్ లో -సంఘర్షణాత్మక ప్రాంతాల్లో లైంగిక హింస (సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫిఫ్లిక్ట్ జోన్) మీద ‘హిస్టారిక్’ పేరుతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. “ఇందులో ‘వార్ జోన్ రేప్’ అంశాన్ని ఈ అంతర్జాతీయ వేదిక మీద ఉంచుతున్నాము. ఇక మీదట దీని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గడానికి వీలులేదు. 17,18 శతాబ్దాల నాటి బానిస వ్యాపారం మళ్ళీ తిరిగి సంఘర్షణాత్మక ప్రాంతాల్లో లైంగిక హింసగా కొత్త రూపం తీసుకుంది” అని ఆ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ అటువంటి పీడనకు బలయ్యే వర్గాలు ఎవరు అని చూసినప్పుడు వచ్చే జవాబు – నిరుపేదలు. ఎవరు వాళ్ళు అన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాక వర్గాలు, సంచార జాతులు. పరిపాలనా భాషలో వీరిని ‘వనరబుల్ గ్రూప్స్’ అంటున్నారు. ఇప్పుడు వీరి పిల్లలు, స్త్రీల భద్రత ఆ కుటుంబాలకే కాదు, ప్రభుత్వాలకు సైతం అలివి కాని పని అవుతున్నది. ‘ట్రాఫికింగ్’ వల్ల వీరు సరికొత్త “క్యాష్ – క్రాప్” అయ్యారు. ఇది చాప కింద నీరులా సాగే – విపణి. ‘రేప్’ మాదిరిగా ఇవి పత్రికల్లో పతాక వార్తలుగా రావు. స్థిరాస్తుల దన్ను లేని సామాన్య కుటుంబాల్లో – ఈడు వచ్చిన పిల్లలు వుంటే, వారి వల్ల ఎప్పుడు ఎటువంటి సమస్య ఇంటి మీదికి వస్తుందో అని వారి తల్లి దండ్రులు బిక్కు బిక్కు మంటున్నారు. ఎదుగుతున్న కులాల్లో ఆర్ధిక సమస్యల తీవ్రత తగ్గినప్పటికీ, సామాజిక భద్రత ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నకొత్త సమస్య. ఇక్కడే మరొక ప్రాధాన్యత సంతరించుకున్న అంశం వుంది. ఈ ‘వనరబుల్ గ్రూప్స్’ కొరకు ‘రాజ్యం’ అమలు చేసే సంక్షేమ భద్రత రాజ్యాంగపరంగా ఉన్నప్పటికీ, ప్రధాన స్రవంతి సమాజం నుంచి వారిని వేరుచేసి వాటిని అమలు చేయడం వల్ల, ఉన్నత – నిమ్న జాతుల మధ్య ఆదాన ప్రదానాలు ఇప్పటికీ లేవు. అది వారి సాంఘిక – సాంస్కృతిక వెనుకబాటుకు హేతువు అయింది. అయితే ఈ పరిస్థితికి మూలాలు విడిచి, ప్రభుత్వాలు ఇంకా వీటిని శాంతి భద్రతల సమస్యగా చూడ్డం నిరాశ కలిగిస్తున్నది.

జాన్సన్ చోరగుడి

జాన్సన్ చోరగుడి... ఆయన మాటల్లోనే చెప్పాలంటే గత మూడు దశాబ్దాలుగా తెలుగునాట ఏ గుంపు రంగు ‘ఐడెంటి’ అంటించుకోకుండా,  తన స్వంత స్వరంతో మాట్లాడుతూ కూడా... పాఠకుల గౌరవం పొందిన రచయిత. కృష్ణాజిల్లా, కోలవెన్నులో 1956 లో జన్మించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్ గా రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడలో నివాసం. 'సిటీ ప్రొఫైల్', 'మన విజయవాడ', 'స్వంత సంతకం', 'ఇండియన్ ఇంక్', 'చివరి చర్మ కారుడూ లేడు'-పుస్తకాలు ప్రచురించారు.                                 

1 comment

  • భారత దేశంలో ఇటీవలి పరిణామాలు జనసమూహంలో, ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాలు, బలహీనవర్గాలకు చెందిన వారికి తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిర్భయ రేప్ ఘటన తర్వాత పలు ప్రాంతాల్లో గత ఆరేడేళ్ళుగా అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు పత్రికల పేజీల్లో ఒక మూల (నిర్భయ ఉదంతానికి ఇచ్చినంత ప్రాధాన్యతలో కాదు) వేస్తూ వస్తున్నారు. రోజువారీ నేరవార్తల విషయంలో మహిళలపై అత్యాచారాలే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనల్లో బాధితులు అల్ప సంఖ్యాకులో, బలహీనవర్గాలకు చెందినవారు ఉంటున్నారు. నేరానికి పాల్పడిన వారిలో అత్యధికులు పాతికేళ్ళ లోపు వయసువారే వుండడం చూస్తే సమాజం ఎటుపోతోందనే ఆందోళనా వ్యక్తం అవుతుంటుంది. నిర్భయ తర్వాత పత్రికల హెడ్ లైన్లను ఆకర్షించింది (పత్రికా భాషలో తప్పనిసరైన పదంగానే భావించాలి) దిశపై అత్యాచారం, సజీవదహనం, పోలీసుల ఎన్.కౌంటర్.
    2014 నుండి చూస్తే మహిళలపై జరిగిన అత్యాచారాలలో రేప్ తదనంతర హింసే ప్రధానంగా చర్చకు వస్తుంది. దీనిని నిరోధించడానికి యువతను సరైన దారిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వపరంగా శూన్యమనే చెప్పాలి. కఠోర సత్యం ఏమంటే ప్రభుత్వాలు ఇటువంటి నేరాలు జరిగినప్పుడు ప్రజల ఆవేశాన్ని అణచేందుకు తాత్కాలిక చర్యలు అంటే నిందితులను అరెస్టు చేయడం కోర్టుకు పంపడం, ఏదుకుకాల్పులలు జరపడం (ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామం) వంతి చర్యలతొ సరిపుచ్చుతున్నాయి. యువతలో పెరిగిపోతున్న అసంతృప్తి, దారి తప్పడం, హింశాత్మక చర్యలకు పాల్పడడం వంటి వాటిని ఏ విధంగా నిరోధించాలి, యువత ను ఏ విధంగా సరైన దారిలో పెట్టాలనే విషయాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.