ఎన్నో యేండ్లు గతించి పోయినవీ… కానీ

 “ఎన్నో యేండ్లు గతించి పోయినవీ..” పొద్దున్నే కిటికీ తెరవగానే హరిశ్చంద్ర పద్యం చెవుల్ని తాకి, హాంగోవర్ మూడ్ మరింత పెంచేసింది. రాత్రి ఎవడో పోయినట్టున్నాడు భగవద్గీత బోరొచ్చిందనుకుంటా శవాల బండి సామేల్ “కాటిసీను” పద్యాలు పాడుతున్నాడు. వీడికి రోజు రోజుకి నిర్లక్ష్యం పెరిగి పోతోంది. నిన్న పొద్దున్నే వంద తీసుకుంటూ చెప్పాడు… “అర్రే..! గంటల వస్తా ఉస్తాద్.,  ఇల్లు మొత్తం అద్దం, ఏందీ..! అద్దం లెక్క మెర్వాలే” అనుకుంటూ. వెళ్లినవాడు పత్తా లేడు… రాత్రేదో స్మశానం బేరం తగిలినట్టుంది, మందెక్కువై ఆ శవాల బండిలోనే పడి పొద్దున్నే పద్యాలు మొదలు పెట్టాడు.

            విసురుగా కిటికీ క్లోజ్ చేసి వెనక్కి తిరిగా. యాష్ ట్రే నిండిపోయి పక్కనే మరికొన్ని పీకలు, రాత్రే తలతెగిన మూడు పావురమ్ములు, తోడుగా స్మిర్నాఫ్ హాఫ్., ప్లేట్లో మిగిలిపోయిన ఎముకలూ, మాంసమూ. నిన్న పొద్దునవరకూ స్వేచ్ఛగా ఎగరాలనుకున్న రెక్కలు రాత్రి మా పళ్ళ కింద నలిగిపోయాయ్… కౌజుపిట్టలట అపార్ట్మెంట్ వాచ్మెన్ కొడుకు రాజుగాడు తెచ్చిచ్చాడు. “బాబీ వచ్చింది కదన్నా అంటూ”..

               కాస్త పక్కగా కిందే వేసిన పరుపు మీద కాళ్ళ మీదకి తన్నేసిన దుప్పటి, మొహం సగం కప్పేసిన జుట్టు.. మధ్యలో ఇంకేమీ లేదు… అంటే ఒంటిమీద నేను తప్ప ఇంకేమీ లేకుండా నిద్రపోయిన శ్రావని. ముప్పయ్యేళ్ళ జీవితానికి మూడేళ్ళ కింద దొరికిన బహుమతి.. నాలుగు బంధాలు విరిగిపోయి ఎక్స్ లయ్యాక మిగిలిన ఐదో ప్రాణం. కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్కిల్ లో ముద్దుగా “మిస్ శ్రావ్స్” అనిపిలుచుకునే ఇరవ్వయ్యేడేళ్ల “శ్రావణి”… సాహిత్యం మీద ఇష్టంతో నాకుదగ్గరగా వచ్చి నాలో భాగమైపోయిన శ్రావణి…

దుప్పటి మెడవరకూ కప్పి, ముద్దొచ్చే మొహంమీద మరింత ముద్దొచ్చిన పెదాలన్చూస్తూ.. నుదుటి పై ముద్దు పెట్టుకుంటే.. కళ్ళుతెరవకుండానే నా మెడ మీద చెయ్యేసి మళ్లీ పైకి లాక్కుని…

రెన్నిమిషాలు అలాగే ఉండిపోయా.

“శ్యామ్…!”

“ఊ..”

“ఆంటీ ఎప్పుడొస్తుంది?”

“రేపు పొద్దున్న 4 కి”

“సో..!”

“హా… సో…!!?”

“ట్యూబ్ లైట్ సాలే” అంటూ ఇంకో అరగంట పాటు ఉదయాన్ని మళ్లీ రాత్రి చేసి.. గుండెలమీద చేరి.. తలవెంట్రుకల్లో చేతిని పోనిచ్చి..

“శ్యామ్..!

“హ..”

వెళ్ళాలిరా..”

తన మొహాన్ని రెండు అరచేతుల్లో పట్టుకొని కళ్ళలోకి చూస్తూ “వెళ్ళు.. నేనొద్దన్నానా?”

నవ్వుతూ ముద్దు పెట్టుకుంది……. మెడ మీదుగా జారే చెమట చుక్క నా కంటికింద రాలింది…

           ***  *** ***     ***

సరిగ్గా మరో గంట తర్వాత అంటే… 10:50 AM కి డెనిమ్ జీన్స్, టైట్ టీషర్ట్… ఓల్డ్ ఫ్యాషన్.,నో..! శ్రావణి వేస్కుంటే ఏదీ ఓల్డ్ కాదు. హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీస్కొని వెనక్కి తిరిగి, ఇంకా బెడ్ మీదే కూచుని ఉన్న నన్ను చూసి.. ఎడమ కనుబొమ్మ ఒకటే ఎగరేసి.. “ఏమైంది?”

ఏమీ లేదన్నట్టు తలూపాను.. పక్కనే వచ్చి కూచుని.. మెడ మీద చెయ్యేసి దగ్గరకి లాక్కొని..

“ఏమైంది బేటా?.. పొద్దున్నే వచ్చేస్తా.. ఆంటీ ని కూచోబెట్టి మొత్తం చెప్పేద్దాం”

“చ..! మరీ “మొత్తం” చెప్తే ఎలా?” తన కళ్ళలోకి చూస్తూ..

“షటప్ సాలే…! అదికాదు. మన రిలేషన్ సంగతి”

“హ్మ్..!”

“ఆ లోపు ఫ్లాట్ మొత్తం క్లీన్ చేసేయ్… ముఖ్యంగా ఇవీ” సిగరెట్, ముందూ అవశేషాలతో బాటూ ఎక్స్త్రా డాటెడ్ టెన్స్ ప్యాకెట్ వంక కళ్ళతోనే చూపించి..

“ఒకే… సామేల్ గాడు వచ్చేలా లేడు నేనే చేసేయ్యాలి”

“హ్మ్ మీరిద్దరా? ఇక పని అయినట్టే… సరే నాకు టైమ్ అవుతోంది. ఏదో ఒకటి చేసేయ్ అండ్ ఆంటీని రిసీవ్ చేస్కోగానే ఒక మెసేజ్ పెట్టు”

“హే…! ఐ ఫర్గాట్ రే..” తలమీద మునివేళ్ళతో తట్టుకొని “డాడ్ నీ బర్త్ సర్టిఫికెట్ అడిగారు అని చెప్పానా. ఇవ్వు.. నీ జాబ్ కోసం చాలానే ట్రై చేస్తున్నట్టున్నారు. ఫ్రెండంటేనే ఇంత అయితే రేపు అల్లుడైతే ఇంకెలా ఉంటుందో.”

ఒకటిన్నర నిమిషం తర్వాత…సెల్లార్ మొత్తం వణికిపోయేలా స్టార్టైన తండర్ బర్ద్ సౌండ్.. డబ్..డబ్..డబ్బబ్బబ్బబ్…

‌          *****      ***** *****         *****

“బొట్ల బొట్లా చీరగట్టీ.. బొమ్మంచూ రైక తొడిగీ….” పాడుతూనే ఉన్నాడు సామేల్ గాడు. సరిగ్గా శ్రావణి  వెళ్లిపోయిన గంటకి వచ్చాడు. పాత బాటిల్సన్నీ సంచుల్లోకి చేరి వాచ్మేన్ రాములు ఖాతాలోకి, సిగరెట్ పీకలు, కిచెన్ వేస్ట్ సెల్లార్ డస్ట్ బిన్ లోకి, నా మాసిన బట్టలన్నీ ఉతికి ఆరేయబడి బాల్కనీ లోకి వెళ్లిపోయాయ్.

మొత్తం అయ్యాక… రెండు కార్ల్స్ బర్గ్, ఒక ఒరిజినల్ ఛాయిస్ హాఫూ, చిప్సూ పట్టుకొచ్చాడు. కుర్చీ పక్కనే బాసింపట్టు వేసుక్కూర్చొన్నాడు.

టైమ్ రాత్రి 10:30..

ఒకటో బీర్  చివరికొచ్చింది. హాఫ్ లో  క్వార్టర్ మిగిలింది. అప్పుడు అడిగాడు.

“ఆ పిల్లని లవ్ జేస్తున్నవా ఎట్లా?, పెండ్లి జేసుకుంటారా?” గ్లాసులో మందు ఒంపుకుంటూ.

“హ్మ్..! ఏం పిల్ల బాలేదా? పెళ్లి అనేది అమ్మ కోసం, మాకైతే పెళ్లి ఉన్నా లేకున్నా ఒకటే”

“అగో అట్లెట్ల…!?”

“అది అంతేలే”

కొంచం దగ్గరికి వచ్చి అడిగాడు. “మీ కులమేనా?”

“తెలీదు.. మేమ్ ఎప్పుడూ కులాల గురించి మాట్లాడుకోలేదు”

గ్లాసులో ద్రవాన్ని మొత్తంగా గొంతులోకి వంపుకున్నాడు. గాభరాగా వెతుక్కుంటున్నట్టు చూసుకొని మళ్లీ గ్లాసు నింపి. మరింత దగ్గరగా వచ్చి..

“మీ కులం కాకుంటే.. కులం కాకున్నా చేస్కుంటావా..?”

వణికి పోతూ.., కదిలిపోతూ.. నన్ను గట్టిగా పట్టుకొని సామేల్.. డబ్బున్న వాడైతే శామ్యూల్.. క్రిస్టియన్.. కిరాస్తానీ.. మాలోడో.. మాదిగోడో.. కులాన్ని తప్పించుకోబోయి.. పేరు మాత్రం మార్చుకోగలిగిన సామేల్.. సివిలైజ్డ్ సిటిజన్స్ కి శవాల మోతగాడు.. తాగుబోతోడు అయిన సామేల్…

“చెప్పు  కులం కాకున్న, తక్కువ కులమైనా చేస్కుంటవా? మీ అమ్మ ఒప్పుకోకున్నా, పిల్ల నాయిన ఒప్పుకోకున్నా చేస్కుంటవా?”

ఎందుకో వాడి మొహం చూస్తే భయంగా అనిపించింది. నెమ్మదిగా చేతులు విడిపించుకొని. సిగరెట్ వెలిగించాను.

“సమాధానం చెప్పవేంది?” మరింత బిగ్గరగా అరిచాడు.

“కులం మీ లాంటోళ్లకి సామేల్ ఊళ్లలో ఉండొచ్చిన వాళ్ళకి, మేమ్ సిటీలో పెరిగిన వాళ్ళం. ఈ కులాలూ, ఎక్కువ తక్కువలూ మాకు లేవు. నేను తననెప్పుడూ కులం అడగలేదు, తానూ ఎప్పుడు తన కులమెంటో చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు, మా ఇంట్లో అసలు సమస్యే లేదు అమ్మ నాన్నలది కులాంతర వివాహమే కదా” సిగరెట్ చివరికొచ్చింది. బీరు బాటిల్ ఫుల్లుగా గాలిని తాగేసింది.

“నిజంగా కులం లేదా ఇప్పుడు? నిజంగానే అంటున్నవా? ఇగ నేనూ మా ఊరికి పోవచ్చా ?” ఎదో గోణుక్కున్నట్టు అడిగాడు. కళ్ళలో నీళ్ళు. వణికిపోతున్న చేతులతోనే గ్లాసు లేపి గటగటా తాగేశాడు.. రా విస్కీ ఒరిజినల్ ఛాయిస్ భుగ భుగ లాడుతూ గొంతులోకి జారింది. మూతి తుడుచుకుని మండుతున్న గొంతు మీద చెయ్యెసుకొని.. మళ్లీ.. అడిగాడు.

“మా ఊరికి పోవచ్చా ఇప్పుడు నేనూ…?? చెప్పు సార్.! కులం లేదంటే ఇప్పుడు నేను.. నేను మా ఊరికి పోవచ్చా..?” కళ్ళలో నీళ్ళు ధారాపాతమై దుఃఖం ఏడుపులోకి దిగి. నా కాళ్లదగ్గర కి జరిగి ఏడుస్తూనే ఉన్నాడు.

       ***      *** ***               ***

మాటల్లోనే ఒక దృశ్యం.. ఒకే దృశ్యం.. ఒక్కటంటే ఒక్కటే కానీ. అనేకసార్లు మళ్లీ మళ్లీ కనిపించిన దృశ్యం ఏమిటంటే. కులం తక్కువ సామేల్, మతం మారిన సామేల్, ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన పెద్ద పాలేరు పెద్దకొడుకు సామేల్ ఊరుమధ్యలో గుంజకు కట్టేయబడి…కొంగు నోట్లో పెట్టుకొని తల్లి, దుఃఖంతో కళ్ళు ఎర్రగా చేసుకొని అపరాదిలా నిలబడ్డ తండ్రీ.. ఏమైంది…!??

     ****        *****   *****   *****

ఎప్పటి మాదిరే ఆ ఊరికి ఒక సాధారణ సాయంత్రం అది.  ఆమె గడీ దాటి వచ్చింది.. అతను గుడిసె నుంచి వచ్చాడు. వేరు వేరు దారులనుంచీ ఒకే చోటికి.. ఒకే సమయానికి. పొలాల నుంచి జనం, పొలిమేరల నుంచి పశువులు ఊళ్ళోకి వస్తూ మోసుకొచ్చిన వాసన, దుమ్మూ, బురదా, పచ్చిగడ్డి వాసనలతో కలిసిపోయిన వింత వాసన. అల్లంత దూరం నుంచే ఒకరినొకరు చూసుకున్నా కళ్ళు తప్ప పెదాలు కదలలేదు, కాళ్ళు కదలకుండా ఆగలేదు.  అక్కడక్కడా కనిపించే మనుషులు కనిపించకుండా పోయేదాకా… మసక చీకటి మరింత చిక్కబడేదాకా. కాస్త కనుమసక అయ్యేదాకా….

కొంత సేపటి తరువాత చేతులు తగిలేంత దగ్గిరగా. గుసగుసగా మాటలు, కనీ కనిపించని కళ్ళలోకి చూపులు. అంతలోనే చీకటి పడుతోందంటూ ఆమె, ఆమెని వదల్లేక అతనూ దారులు మారి వెళ్లిపోయారు. అతను – సామేలు గడీ పేద పాలేరు కొడుకు. ఆమె- గిరిజ ఆ పాలేరుకి యజమాని కూతురు..

కథ కొత్తదికాదు. ముగింపు అంతకన్నా ప్రత్యేకమైనదీ కాదు. ఎవరో బంగ్లా చెవుల్లో ఈ అందమైన ప్రేమకథని మరొకరకంగా చెప్పారు. రాత్రికి రాత్రి అమ్మాయి ఇంట్లో బందీ అయిపోతే,  సామేలు మాత్రం అర్ధరాత్రే గుంజకు కట్టేయబడ్డాడు..

****               ***** *****         *****

సగం కాలిన సిగరెట్ మధ్యలోనే ఆరిపోయింది.. చివరి కార్లస్బెర్గ్ నేలమీద దొర్లుతోంది. సామేల్ కళ్ళలో నీళ్ళు, నా కళ్ళలో క్యూరియాసిటీ….

“తర్వాత?”  గాబరాగా అడిగాను. సామేల్ మాత్రం సమాధానం చెప్పలేదు కిటికీ వైపే నిస్చూస్తూ అలాగే ఉండి పోయాడు

“సామేల్ చెప్పు తర్వాత ఏమైంది?”  చేతులు పట్టి కుదుపుతూ అడిగాను మళ్ళీ

ఖాళీ సీసాని గ్లాసులోకి వొంచి చివరన వెళ్ళాడే చుక్కనే చూస్తున్నాడు. అన్ లక్కీ డ్రాప్ టప్పున శబ్దం చేస్తూ డిస్పోజబుల్ గ్లాసులో పడింది.

“ఆ రోజు రోజంతా నన్ను కొడుతూనే ఉన్నారు. అమ్మ ఏడుస్తూనే ఉంది. మా అయ్య మొట్టులెక్క నిల్సోని సూస్తనే ఉన్నడు. “నీళ్ల మోటర్ దొంగతనం” చేసినందుకు 10,000 జుల్మానా ఏశింది పంచాయితీ. అసలు అక్కడ లేని మోటార్ ని నేను ఎత్తుకుపోయిన అని. ఇది జరిగిన మూడురోజులకు గిరిజ వాళ్ళింటి దూలానికి ఏల్లాడింది. ఆ రోజు రాత్రే మా ఇల్లు కాలిపోయింది. అమ్మా నాయిన నేనూ అదే రాత్రి  పట్నం అచ్చెశినం. అచ్చిన వారానికి నాయిన లారీ తలిగి సచ్చిపోయిండు. నాయిన పీనుగుని కాల్చేటందుకు వచ్చి ఇక్కన్నే బొందలగడ్డల పనికి కుదిరిన. పోయినేడాది అమ్మ కూడా సచ్చిపాయే పోయే ముందు ఊరు..ఊరు.. అని కల్వరిస్తుండే. కానీ మళ్లీ ఊరు మొఖాన పోవాలంటే భయమైంది. ఇరవై ఏండ్ల సంది ఇక్కణ్ణే ఉండిపోయిన” చెప్తూనే గ్లాసులూ, సిగరెట్ ముక్కలూ డస్ట్ బిన్ లో వేసి వచ్చాడు.

సరిగ్గా నెలకిందట బార్లో సురేష్ గాడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. “ఐదేళ్లు అయినా ఇప్పటికీ వాళ్ళ ఊరు వెళ్ళటానికి భయంగానే ఉందిరా.. వినితా వాళ్ళ అమ్మ ఇప్పటికీ ఫోన్ ఎత్తితే చాలు తిట్ల వర్షమే, ఇంకో పక్క అమ్మ కూడా వినితని వేరే మనిషిలాగే చూస్తుంది. వేరే కులం అమ్మాయిని చేసుకున్నా అని తనముందే దెప్పి పొడుస్తుంది. అసలు ఒక్కోసారి మేమే తప్పు చేసామా అన్న ఫీలింగ్ తట్టుకోలేకపోతున్నా…” అంటూ వాడు చెప్పినప్పుడు.  హమ్మయ్యా..! మా అమ్మ మాత్రం అలా కాదు అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు శ్రావణి గురించి చెప్తే. “నీ ఇష్టం” అంది తప్ప ఇంకేం అడగలేదు.

షిట్..! ఈ విలేజ్ పీపుల్ ఎప్పటికి మారతారు. ఈ కులాలూ, ఎక్కువలూ తక్కువలూ ఎప్పటికి పోతాయి? చ..! అనుకుంటూనే కిటికీ దగ్గరికి వచ్చి. రంగు రంగుల సిటీ లైట్స్ చూస్తూ మళ్లీ సిగరెట్ వెలిగించి, ఎంతసేపయిందో తెలీదు ఆలోచనల్లోంచి బయటపడి, వెనక్కి తిరిగి చూస్తే.  శవాల సామేల్, నల్లని నలబయ్యేళ్ళ సామేల్. కులం తక్కువ అని ఊరు క్రూరంగా చూసిన సామేల్. బెడ్ పక్కనే ఫ్లోర్ మీద తలగడ మాత్రం పెట్టుకొని నిద్రపోతూ..

     ****           ***** *****       ****

“హలో…! శ్రావణి ”

“హ చెప్పు”

“అమ్మొచ్చింది, నిన్ను చూడాలనుకుంటుంది”

“నేను బిజీ శ్యామ్… ఇప్పుడు కుదరదేమో”

“వాఁట్??”

“నేను మళ్ళీ మాట్లాడతాను…” కాల్ కట్ చేసేసింది.

రెండు రోజుల తర్వాత…..

“శ్యామ్! నేను రేపు ఊరెళ్తాను, ఆ అమ్మాయేమందీ?” టిఫిన్ ప్లేట్ చేతికిస్తూ చెప్పింది అమ్మ.

“వర్క్ బిజీలో ఉన్నట్టుందమ్మా… అయినా అంత అర్జెంట్ ఏముంది?”

“శ్యామ్…! ఇంతకీ శ్రావణి వాళ్ళ డాడీ ఎం చేస్తారు? సిటీకి రాకముందు వాళ్లదేఊరు?”

“హి ఈజ్ ఏ లెక్చరర్ అమ్మా ఇంగ్లీష్ అనుకుంటా,  వాళ్ళమ్మ కూడా ఇక్కడే ఏదో ప్రైవేట్ కాలేజ్ లో చేస్తున్నారు. సిటీకి రాకముందు వాళ్ళది  కర్నూల్ దగ్గర ఒక పల్లెటూరు”

“అది కాదు వాళ్లేమిటి? ఐమీన్… వాళ్ళ క్యాస్ట్..?”

“వాఁట్… అమ్మా నువ్వేనా ఇలా అడిగేది !?”  అమ్మ అలా అడుగుతుందని కూడా ఊహించలేదు. కానీ అది నిజమే మా అమ్మే శ్రావణి వాళ్ళ కులం గురించి అడుగుతోంది.

“కూల్ శ్యామ్ కులం కాదని వచ్చి నేను ఫేస్ చేసిన ప్రోబ్లెమ్స్ నీకర్థం కావు. మా వాళ్ళతో మీ డాడీ పడ్డ మాటలు ఇప్పటికీ మర్చిపోలేను. కేవలం నాకోసం చాలా అవమానాలని భరించాడు. యు నో..! మా అమ్మ అదే మీ అమ్మమ్మ మనింటికి రాకుండా నిన్నూ నన్నూ మాత్రమే ఎందుకు పిలిపించుకునేదో, మీ నాన్న ఎప్పుడూ మా ఇంటికి రాలేదో గమనించావా?”

ఏదైతే లేదనుకున్నానో… ఎప్పుడో కాలం లో కలిసిపోయేంతగా బలహీన పడిందనుకున్నానో ఒక్కసారిగా బహిర్గతమై కల్లోల లోలకమై కళ్ళ ముందే పడగలా ఊగుతున్నట్టు. కులం..వివక్ష.. అమ్మ… అమ్మమ్మా… నాన్న… సామేల్.. శ్రావణి .. అప్రయత్నంగా తల విదిలించి. సిగరెట్ తీయబోయి ఆగిపోయి అమ్మ వైపు చూస్తే…

“శ్యామ్…! తీసేయలేవు, కాదనలేవు, అలా అని భరించనూ లేవు, ఇంతకీ ఆ అమ్మాయికి మన క్యాస్ట్ ఏమిటో తెలుసా?”

“మా…! ఎప్పుడూ మా మధ్య ఈ టాపిక్కే రాలేదు.. తనకు అసలు కులం అన్న ఆలోచన కూడా వచ్చిండదు, తనూ అడగలేదూ నేనూ అడగలేదు. అమ్మా నీ భయాలు కాదనలేను గానీ మీ జనరేషన్ వేరు ఇప్పుడు మా టైం వేరు”

కాలింగ్ బెల్ మోగింది. పాలు పేపర్ కుర్రాడు. పేపర్ అమ్మ చేతిలో పెట్టి కాఫీ చేయటానికి వెళ్ళాను.  

      ****            **** *****          *****

అమ్మ వెళ్ళి వారం రోజులూ, శ్రావణి కలిసి పదిరోజులూ అయ్యింది.  ఎలాగైనా కలిసి మాట్లాడాలని మెసేజ్ పెడితే ఆఫీస్ దగ్గరలో ఉన్న కాఫీడే కి రమ్మని రిప్లై వచ్చింది.

సాయంత్రం 4:30

కేఫ్ కాఫీడే, మైత్రీ వనం సారధి స్టుడియో ఎదురుగా… టేబుల్ మీద రెండు ఎస్ప్రెస్సో డబల్ షాట్ కప్పులు., షుగర్ కలుపుతూ తానూ… తననే చూస్తూ నేను  

“శ్రావణి…!”

“హ…”

“ఏమైంది బే..!” ముద్దొచ్చినప్పుడల్లా తనని పిలిచే పిలుపదే

“నథింగ్ శ్యామ్…! “

“నో సమ్తింగీజ్ దేర్. యుఆర్నాట్ లుకింగ్ఫైన్”

“హ్మ్మ్..! ఒకనిమిషం” అంటూ కాఫీ కుర్రాన్ని పిలిచిచి టిష్యూ పేపర్ తెమ్మని చెప్పి.. నావైపు తిరిగి..

“శ్యామ్..! మనమెప్పుడూ మాట్లాడుకోలేదు గానీ ఎందుకని నువ్వు కూడా క్యాస్ట్ గురించి చెప్పలేదు మీరు నాయీ బ్రాహ్మిణ్ అని?”

“శ్రావణి…!” ఒక్కసారిగా ఏవేవో కళ్ళముందు కదిలి.. అసలేం వింటున్నానో కొద్ది కొద్దిగా అర్థం అవుతూ…

అర్థం కాలేదు శ్యామ్… డాడ్ నీ బర్థ్ సర్టిఫికెట్ అడిగింది కులం తెలుసుకోవటానికే అని , నిన్న సాయంత్రమే చెప్పారు. అక్కడ ఇమడ గలవా అని అడిగారు కూడా? టిష్యుతో మూత్తుడుచుకొని

హ్మ్మ్…! నువ్వలా కాదనీ, నాకే సమస్యా లేదనీ చెప్పాను.. బట్ నాన్న కన్విన్స్ కాలేకపోతున్నారు..  మేమూ బీసీనే అనుకో. కానీ..! కులం ఒకటికాదు కదా… అన్నదే ఆయన అభ్యంతరం, అమ్మ అయితే ఖచ్చితంగా చెప్పేసింది. నువ్వో వాళ్ళో తేల్చుకొమ్మని. నిజానికి ఇక నీకు బ్రేకప్ చెప్పేద్దామనిపించింది, అలా చూడకు అప్పుడున్న ఆలోచన అది. అందుకే ఆంటీ ఉన్నప్పుడు నేను రాలేదు కానీ నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోయాను. లెట్దెమ్ గో టు హెల్విత్ దట్ కులం అనిపించింది .”

“శ్రావ్స్..! ఏం మాట్లాడుతున్నవ్? ఈ కాలం లో ఇంకా కులమా???”

అప్పటికి జరిగిందేమిటో పూర్తిగా అర్థమయ్యింది.. శ్రావణికీ నాకూ మధ్య క్యాస్ట్..కులం.. అమ్మా నాన్నా మధ్య , సామేల్ గిరిజల మధ్య ఉన్నదే. ఏళ్ళు  గడిచినా ఇంకా ఉన్నదీ, ఉండబోయేదీ కులం… కులం.. కులం మాత్రమే… అన్న నిజం అర్థమవుతూ. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఎఫ్సీ, మాల, మాదిగా, బ్రాహ్మిణ్, కమ్మ, రెడ్డీ వీళ్ళకి మధ్యలో కొన్ని వర్గాలు ఇంకా ఒక  దగ్గరగా చేరలేకపోయాయన్న నిజం కళ్ళముందు నిలిచి, ఇంటర్నెట్ కాలం, విశ్వనగరాలూ, కార్పోరేట్ కల్చర్లూ ఎన్ని వచ్చినా ఇంకా పాత మరకలు మాత్రం పోలేదు… ఇక ఎప్పటికి పోతాయో కూడా తెలియదు. కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తూ సామేల్ కనిపించి. అలా ఎన్ని నిమిషాలు గడిచాయో కూడా అర్థం కాలేదు…

సప్లై కుర్రాడొచ్చి “ఎనీ ఆర్డర్ సర్”, మీరొచ్చి చాలా సేపయ్యింది ఇంకో ఆర్డర్ చెప్పండీ లేదా వెళ్ళిపోండీ అని ఇండైరేక్ట్ గా చెప్పాడు.

“వన్మోర్ వాటర్ బాటిల్ అండ్ బిల్ ప్లీజ్” అతనికి చెప్పి…

శ్రావణి వైపు చూస్తే…. కళ్ళలో నీళ్ళతో తలదించుకొని నిశ్చలంగా ఉండిపోయి…

“సారీ శ్యామ్..! బట్ నేను వాళ్ళని వదిలి రావటానికే నిర్ణయించుకున్నా, కానీ శ్యామ్..! నిజంగా ఈ కులం ఇంకా ఎలా నిలిచి ఉందంటావ్??” సమాధానం తెలిసీ పరిష్కారం మాత్రం దొరకని ప్రశ్న అడిగి…. నన్నే చూస్తూ శ్రావణి. ఇక అక్కడ ఉండలేక విసురుగా బయటికి నడుస్తూ నేను

****             ******          ***** *****       

కాఫీ డే తర్వాత డేస్ గడిచిపోగా సరిగ్గా వారం తర్వాత శ్రావణి,  నేనూ రిజిస్టర్ ఆఫీస్లో కలుసుకొని అప్లికేషన్ ఫామ్స్ నింపేసాం. వాళ్ళ ఫాదర్  నన్ను బెదిరించీ, ఫోన్లో వాళ్ళ అమ్మ బండ బూతులు తిట్టీ ఇక మమ్మల్ని ఆపలేమని అర్థమయ్యీ ఊరుకున్నారు. అన్నీ అర్థం చేసుకుంటుందన్న అమ్మ కూడా పెళ్ళికి రానని ఖచ్చితంగా చెప్పేసింది. లోపల్లోపల అమ్మకి కూడా తనో పెద్దకులానికి చెందిన స్త్రీననే భావన ఇంకా ఉందేమో అనిపించింది.  పెళ్ళికి అన్నీ సిద్దం చేసుకున్నాం. కొంచం షాపింగ్ చేసుకొనీ నా ఫ్లాట్ దగ్గరకి వస్తూంటే అపార్ట్మెంట్ దగ్గరలో చెట్టుకింద జనం గుమిగూడి, మనసులో ఏదో అనుమానం ప్రవేశించీ, బండాపి దగ్గరగా వెళ్ళి చూస్తే. అచేతనంగా పడి ఉన్న సామేల్. నో..! శవం, సామేల్ శవం. నిజంగా ఆనాడు వాడికి కావాల్సింది దక్కి ఉంటే, కనీసం ఇల్లుకాలిపోకుండా, కాల్చేయబడకుండా, ఊరు వదిలేయకుంటే ఇప్పటికి బతికుండాల్సిన సామేల్, ఊరినుంచీ, కులం నుంచీ పారిపోవాలనుకొని బతుకంతా చావులమధ్య బతికిన సామేల్, తాగీ..తాగీ..తాగీ.. ఇలా ఇప్పుడు ఒక అనాధ శరీరమై మిగిలిన సామేల్, ఇంకా కనిపించకుండా ఉన్నకులం తన అదృశ్య కోరలతో పీక్కు తిని చంపేసిన సామేల్. నిర్జీవంగా పడి..   కళ్ళుమసకలు కమ్మి నేనూ అక్కడే కూలబడిపోయి…..

  

నరేష్కుమార్ సూఫీ

22 comments

 • సూఫీ నాకు ఇష్టమైన రచయిత. చాలా పదునైన వాక్యాన్ని రాయగలవాడు. ఈ కథలోని వస్తువు తానే ఓ చోట చెప్పినట్టు పాతదే. కానీ సూఫీ రాసిన స్టైల్ కట్టి పడేసింది.
  కార్పొరేట్ కాలం లో కూడా కులం కింది కులాల్ని గాయ పరుస్తున్న తీరుకు ఇదొక సజీవ సాక్ష్యం.
  మంచి కథను రాసిన సూఫీ కి, ప్రచురించిన సంపాదక వర్గానికి ధన్యవాదాలు.

 • నాకు నచ్చిన వర్తమాన కవులలో నరేష్ కమార్ సూఫిది అగ్రస్థానం అనడంలో నేను ముందుంటాను .ఈ కథ వాస్తవానికి అతి దగ్గరగా నడిచి వుంటుంది .లేకుంటే ఇతను ఊహిస్తూ కథలు రాసే కథకుడు
  మాత్రం కానే కాదు .ఇప్పటికీ అంటే మోడ్రన్ కల్చర్ అంటూ మతాలు ,కులాలు ఈ దేశాన్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి అనడంలో సందేహంలేదు . ఈ కథ మరింత పత్రికలలో వస్తే మరింత మంది పాఠకులకు చదవడానికి వీలుగా వుండేది .ప్రచూరించిన వారికి ,రచయితకు అభినందనలు

  • తాంక్యూ మామ..! ఈ కథ మరింత పత్రికలలో వస్తే మరింత మంది పాఠకులకు చదవడానికి వీలుగా వుండేది కానీ ఇంటర్నెట్ లో వస్తే ఇంకా బెటర్ అనే అనిపించింది 🙁

 • నాకు నచ్చిన వర్తమాన కవులలో నరేష్ కమార్ సూఫిది అగ్రస్థానం అనడంలో నేను ముందుంటాను .ఈ కథ వాస్తవానికి అతి దగ్గరగా నడిచి వుంటుంది .లేకుంటే ఇతను ఊహిస్తూ కథలు రాసే కథకుడు
  మాత్రం కానే కాదు .ఇప్పటికీ అంటే మోడ్రన్ కల్చర్ అంటూ మతాలు ,కులాలు ఈ దేశాన్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి అనడంలో సందేహంలేదు . ఈ కథ మరింత పత్రికలలో వస్తే మరింత మంది పాఠకులకు చదవడానికి వీలుగా వుండేది .ప్రచూరించిన వారికి ,రచయితకు అభినందనలు

 • వస్తువు అనాదిదే ! ప్రపంచం మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ది. అద్దె ఇంటి కోసం ఓ జంట పడ్డ యాతన్ని రవీందర్ కధలా మలచింది గుర్తొచ్చింది. నరేష్ మంచి భావుకుడు. కధ చదువుతున్నా, కవియే కనిపించాడు. ఆవేశపు, అమాయక శామ్ పాత్ర ఇంట్రావర్ట్. శ్రావణి మాత్రం ఉఫ్… ఈ కులం ఎప్పటికి నాశనం అవుతుందని ఎవర్ని అడగాలి ? నరేష్. గుడ్ వర్క్. కంగ్రాట్స్.

  • అద్దె ఇంటి కోసం ఓ జంట పడ్డ యాతన స్కై బాబా డి అనుకుంటా సార్.! అయితే ఔట్ఆఫ్ కాలింగ్ ఏరియా ప్రభావమూ లేదని చెప్పనూ లేం. ఏమో ఇంకో ఇరవయ్యేళ్ళ తర్వాతైనా ఇక ఇలాంటి సబ్జెక్ట్ మీద కథలు రాకూడదనే కోరుకుందాం… థాంక్ యు

 • పిచ్చి నాన్నా.. నరేష్..,
  హూ..కులం పోతుందా.. పోదు. పోనివ్వరు. ఒక వైపు కులనిర్మూలన సంఘాలు హెచ్చుతగ్గుల సమాజం ఉండకూడదని కులాంతర, మతాంతర వివాహాలు ప్రోత్సహిస్తుంటే మరో వైపు మన పార్టీ, ప్రభుత్వాలు కులరాజకీయాలు చేస్తుంటే కులం ఎక్కడికి పోతుంది?
  ఒకప్పటి ఇప్పుడు కులానికి మరింత ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తున్నదే.. అది పల్లె అయినా.. పట్నం అయినా అంతే.
  నిజానికి మనమెవరము ఫలానా కులంలో పుట్టాలని గానీ, పుట్టొద్దని కానీ అనుకోలేదు. మనకు తెలియకుండా పుట్టుకతోనే కులం కోరల్లో చిక్కుకుపోయాం. విలవిలలాడుతున్నం
  కులం విషయం పక్కకు పెడ్తే కవిత్వం ఎంత బాగారాస్తావో అంతే బాగా కథ రాశావ్. అభినందనలు. మరిన్ని కథల కోసం ఎదురుచూస్తూ..
  మంచి కథకుడిని పరిచయం చేసిన రస్తా కి అభినందనలు.

  • జరిగే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి… పరువు హత్యల వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి అగ్ర, నిమ్న కులాల మధ్య మాత్రమే ఉందన్న కులం బీసీల్లో ఇంకా ఎక్కువే ఉంది. మారుతుందనే ఆశ మాత్రం ఇప్పటికిప్పుడు కనిపించటం లేదు 🙁
   థాంక్ యు మేమ్

 • మంచి కథ . భిన్నమైన కథనం. సాంద్రత గల గత/ వర్తమాన/ భవిష్యత్ కు రిలవెంట్ ఇతివృత్తం. కులం ఉన్నంతకాలం నిలిచిపోయే కథ. చెప్పే తీరులో ముక్క వాసన లేదు. చాలా కొత్తగా ఉంది. కథ చెప్పడంలో మూస పద్ధతిని బద్దలు కొట్టినట్టు ఉంది.
  “.. ఇంకో అరగంట పాటు ఉదయాన్ని మళ్ళీ రాత్రి చేసి .. ”
  ” బీర్ బాటిల్ ఫుల్లుగా గాలిని తాగేసింది ..”
  లాంటి వాక్యాలు కథకుడిలోని కవిని దర్శింపచేశాయి.
  రచయితకు అభినందనలు. మంచి కథ ఇచ్చిన సంపాదకులకు ధన్యవాదాలు.

 • లోపల ఇంత అగ్ని ఉన్న మనిషి కావడం వల్లనే కావొచ్చు, బయటకి అంతేసి పొగని వదులుతున్నాడు.

  బావుంది నరేష్.
  నాకు బాగా నచ్చిందీ కత.
  లవ్యూ.
  ఇంకా కథలరాయాలి నువ్వు.

  • థాంక్ యు రవి సాబ్…! ఇట్లా ఒక భుజం మీద చెయ్యి ఉంటుందీ అంటే రాయాలనే ఉంది

 • నరేష్.. పెరఫెక్ట్ స్టోరీ… ట్రూ స్టోరీ…. ఇంకా రగిలిపో! వాస్తవం అక్షరాల్లోకి యదాతథంగా మారిపోయింది.

 • Anna….exlnt gaa kadhani nadiparu…
  Kottagaa play chesaaru….
  “Enno ellu gurinchi poyinaa…” Ee kula sarpam….kaatu vestunna vunnadi….
  Eppatiki maarutundo…?

 • కులం కుంపట్లో కాలే శవాలు ఇంకా మనమధ్య తిరుగుతూనే ఉన్నయ్ భయ్య చాలా బాగుంది 😊

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.