‘ పిల్లల్ని తల్లుల్ని విడదీసే అమానుషం’: అమెరికాలో  హోరెత్తిన నిరసన

  స్కూలుకో, ఆడుకోడానికో వెళ్లిన పిల్లలు ఇంటికి రావడం అరగంట ఆలస్యమైనా, పిల్లలు కనిపించడం లేదని, ఏమైందోనని తల్లడిల్లుతాం. కోడిపిల్లను గద్ద ఎత్తుకెళ్ళడానికి వస్తుంటే, తల్లికోడి పిల్లను కాపాడుకోడానికి గద్దనే తరుముతుంది. కానీ నిస్సహాయులైన తలిదండ్రులు తమ చంకలోని పసికందుల్ని, చేయిపట్టుకొని నడుస్తున్న అన్నెం పున్నెం ఎరుగని, ఐదారేడుల పిల్లల్ని అధికారులు లాక్కుపోతుంటే  చేష్టలుడిగి నిలబడ్డారు. కన్నీరు మున్నీరై విలపించారు. లాటిన్ అమెరికాకు చెందిన గ్వటిమాల, ఎల్ సాల్వడోర్, హండూరస్   దేశాల ప్రజలు సొంత దేశంలో నిరాశ్రయులై, ఏ రక్షణ లేకనే ప్రాణాలకు తెగించి మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలోకి వస్తున్నారు. ఆశ్రయం ఇవ్వకపోగా చట్ట విరుద్ధంగా దేశంలోకి వస్తున్నారని తల్లుల్ని, పిల్లల్ని విడదీసే దుశ్చర్యలకు పాల్పడింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. లాక్కున్న పిల్లల్ని బంధించి, తలిదండ్రుల్ని వెనక్కి( డిపోర్టేషన్) పంపడమో,, జైళ్లకు తరలించడమో చేసింది ప్రభుత్వం. అమ్మానాన్నల నుంచి తమనెందుకు లాక్కుపోతున్నారో తెలియని పిల్లలు ‘’మామా’’ (అమ్మా), “పాపా’’(నాన్న) అంటూ ఏడుస్తున్న ఫొటోలు, వీడియోలు చూసిన అమెరికా ప్రజల గుండెలవిసిపోయాయి. 2వేల 300 మంది పిల్లల్ని తలిదండ్రుల నుంచి వేరు చేసి అధికారలు తమ అధీనంలో ఉంచుకున్నారు. పిల్లలు ఏడ్వకుండా నిద్రపోవడానికి డ్రగ్స్ కూడా వుపయోగించినట్టు వార్తలు వెల్లువెత్తాయి.

అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో ప్రజల వలసలను(ఇమ్మిగ్రెన్స్)ను ఆపడం కోసం అమెరికా ప్రభుత్వం ఒక పక్క గోడలు కడుతున్నది. మరో పక్క “జీరో టాలరెన్స్” పేరిట తలిదండ్రుల నుంచి పిల్లల్ని లాక్కోవడం మొదలుపెట్టింది. అలా లాక్కున్న పిల్లల్ని  అమెరికాలో అనేక నగరాల్లో వున్న ఐ.సి.ఇ.( ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్) ఏజెన్సీలకు తరలించింది. టెక్సాస్, ఆరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, …వంటి అనేక రాష్ట్రాలకు తరలించారు.

తల్లుల నుంచి పిల్లల్ని విడదీసే  అమానుష చర్యలు మే నెలలో మొదలయ్యాయి. ‘ఉమెన్ మార్చ్’, ‘న్యూ పూర్ పీపుల్ కాంపెయిన్’లో కలిసి పని చేసిన  సంఘాలు అనేకం చెదరు మదురుగా అనేక నగరాల్లో అప్పటికప్పుడు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మండే ఎండలను లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు తమ పిల్లల్ని వెంటబెట్టుకొని వీధులకెక్కి నిరసన తెలిపారు .  ప్రారంభంలో ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నగరాల్లో, దేశ రాజధాని వాషింగ్టన్ డి.సి.లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వేలాది మంది స్త్రీలు అరెస్టులు అయ్యారు. వాషింగ్టన్ డి.సి.లో 7 వేలమంది పాల్గొంటే న్యూయార్క్ లోనూ 6 వేల మంది పాల్గొన్నారు, కొందరు  ట్రంప్ టవర్ ముందు నిలబడి “నీకు పిల్లలు లేరా?” అని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాల్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి. ట్రంప్ భార్య, కూతురు కూడా ఈ చర్య సరికాదన్నారన్న వార్తలు వెల్లువెత్తాయి. అమెరికా ప్రథమ మహిళ “ఐ డోంట్ కేర్” అనే కోట్ ధరించి  టెక్సాస్ కు వెళ్లి వేరు చేయబడి కేజ్ లలో వున్న పిల్లల్ని చూసి వచ్చింది. అమెరికా ప్రజల్లో పెద్ద ఎత్తున చెలరేగిన నిరసనలకు తలవొగ్గి, పిల్లల్ని తల్లుల నుంచి వేరుచేయడం ఆపి వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించక తప్పలేదు.

ఇప్పటి వరకు వేరు చేసిన 2300 మంది పిల్లల్ని తిరిగి తలిదండ్రులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు పోరాటాన్ని ముందుకు తీసుకవెళ్లారు. ఈ పోరాటంలో  న్యాయవాదుల (లాయర్ల) పాత్ర గురించి కూడా చెప్పుకోవాల్సి వుంది. ఇమ్మిగ్రేషన్ సమస్యపై పని చేస్తున్న అనేక మంది అడ్వకేట్లు… యాక్టివిస్టులకూ, మీడియాకూ సమాచారం అందిస్తూ సహకరించారు. అనేక చోట్ల జరిగిన నిరసన ప్రదర్శనల్లో తాము కూడా పాల్గొన్నారు.

అనేక సంఘాలు అరెస్టులకు వెరువక ట్రంప్ ప్రభుత్వ చర్యలకు నిరసనగా  ఒక పక్క ర్యాలీలు జరుపుతూ, “ఫామిలీస్ బిలాంగ్ టుగెదర్”(కుటుంబాలు కలిసి వుండాలి) అనే పేరుతో ఐక్య సంఘటనగా ఏర్పడి పోరాటాన్ని ఉధృతం చేశాయని చెప్పవచ్చు. జూన్ 30 న దేశ వ్యాప్తంగా 700 పైగా  ప్రదర్శనలు నిర్వహించి ఐ.సి.ఇ. ఏజెన్సీని రద్దు చేయాలని, కుటుంబాల్ని కలపాలని, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశాయి. ఆ రోజు వాషింగ్టన్ లో 70 వేలమందితో ప్రదర్శన జరిగితే న్యూయార్క్ లో 30 వేలమందితో జరిగింది. ఆ రోజు 90- 110 డిగ్రీల వరకు వేడి వుంది. అయినా మండే ఎండల్లో ఒక చేత్తో ప్లేకార్డ్, మరో చేతిలో నీళ్ల బాటిల్ పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్ కు వ్యతిరేకంగా ఏడాదిన్నర క్రితం జరిగిన స్త్రీల మార్చ్ ని ఈ ప్రదర్శనలు తలపించాయి. దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ అన్ని ముఖ్య నగరాల్లో, చిన్న పెద్ద పట్టణాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి.

ఇదే సమయంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ డీగో( San Diego) ఫెడరల్ జడ్జి ఒకరు రెండు వారాల్లో 5 ఏళ్ళ లోపు పిల్లల్ని తలిదండ్రులకు అప్పగించాలని, మరో నాలుగు వారాల్లో అంటే జులై 26 కు పిల్లలందర్నీ  తలిదండ్రులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తీర్పు తమకు అనుకూలంగా వచ్చింది కదా అని ప్రభుత్వం పై వత్తిడి చేయడం విరమించుకోలేదు యాక్టివిస్టులు.

సంఘాల ప్రమేయం లేకుండా వ్యక్తులుగా నిరసనను తెలిపిన వారూ వున్నారు. జులై 4 అమెరికా స్వాతంత్ర్య దినం నాడు థెరెసా పాట్రాసియా ఒకౌమౌ అనే ఆఫ్రికన్ యువతి న్యూయార్క్ లోని లేడీ లిబర్టీ స్టాచ్యూ పాదాల వద్ద కూర్చొని పిల్లలందర్నీ విడుదల చేసి తల్లులకు అప్పగించే వరకు అక్కడ్నుంచి దిగి రానని వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

” డెముక్రసీ నౌ  ” టీవీ ఛానల్, దాదాపు ప్రతి రోజు ఈ సమస్యపై వార్తలు, ఇంటర్య్వూలు ప్రసారం చేసింది. ఈ ఛానల్ నిర్వహకురాలు ఏమి గుడ్ మాన్ (Amy goodman) సమస్య ఎక్కడుంటే తానక్కడుంటానని మరోసారి నిరూపించుకున్నారు.  ఆమె స్వయంగా అమెరికా- మెక్సికో సరిహద్దులో వున్న అనేక ప్రాంతాల్ని సందర్శించడమే గాక, అనేకమంది పేరెంట్స్ ను, అడ్వకేట్లను, ఇమ్మిగ్రేషన్ సమస్యపై పనిచేస్తున్న యాక్టివిస్టులను ఇంటర్య్వూ చేసి ఎంతో సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. ఒక పక్క సమాచారం అందిస్తూ, మరో పక్క ఈ సమస్యపై సాగుతున్న నిరసన ప్రదర్శనలను, అరెస్టులను కూడా ప్రసారం చేశారు.

నాలుగు రోజుల క్రితం  ఎమీ గుడ్ మాన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రపంచ ప్రజల ధిక్కార స్వరం నోమ్ చామ్ స్కీ  ఇలా అన్నారు “లాటిన అమెరికా ( దక్షిణ అమెరికా) దేశాలైన గ్వటెమాల, హండూరస్, ఎల్ సాల్వడోర్ లో 50,60 ఏళ్ళుగా అమెరికా వెన్నుదన్నుతో  ఏర్పడిన సైనిక ప్రభుత్వాలు నిరంకుశంగా పాలిస్తూ ప్రజల హక్కుల్ని హరిస్తున్నాయి. ఈ దేశాల్లో కొనసాగుతున్న నిర్భందాలు, అలజడుల కారణంగా తమ ప్రాణాలకు రక్షణలేక ప్రజలు ఆశ్రయం కోసం అమెరికాకు వస్తున్నారు. న్యూయార్క్ మురికి వాడల్లో(slums) బతకడం వాళ్లకు మాత్రం ఎందుకు ఇష్టముంటుంది. వారు తమ దేశంలో వుండడమే ఇష్టపడతారు. అమెరికా పేరుకు  సంపన్న దేశం కానీ నిరాశ్రయుల్ని ఆదరించకపోగా దేశంలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తున్నారు. బంగ్లాదేశ్ లాంటి పేద దేశం వలస వచ్చిన బర్మా ప్రజలను అక్కున చేర్చుకుంది. అమెరికా, యూరప్ దేశాల జోక్యం వల్లే పేద దేశాల్లో అలజడులు జరుగుతున్నాయి. శరణార్థులై వస్తున్న పేద ప్రజలను ఈ సంపన్న దేశాలే నిరాకరిస్తున్నాయి. ‘’

ఇంటర్య్వూ చూస్తుండగా ఇటీవల స్వీడన్ లో ఒక ఎయిర్ పోర్ట్ లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఎలిన్ ఎర్సన్ అనే 21 ఏళ్ళ అమ్మాయి, గోథెన్ ఫర్గ్ నుంచి టర్కీ వెళ్ళే విమానం ఎక్కింది. అదే ఫ్లయిట్ లో వున్న ఆఫ్ఘన్ దేశస్థుడ్ని విమానంలోంచి దించితే కానీ తను సీట్లో కూర్చోను అని పైలెట్ తో  పేచికి దిగింది. “ఎందుకీ పేచీ, టైమయిపోతున్నది” అని తోటి ప్రయాణికుడు కల్పించుకోబోయాడు. “నీకు ప్రాణం ముఖ్యమా?టైమా” అని ఎదురు ప్రశ్నించింది. ‘’ఈ అఫ్ఘన్ ఇక్కడి నుంచి పోవడమంటే, ఆయన నేరుగా నరకానికే పోయేది. తన దేశంలో రక్షణలేకే మన దేశానికి వచ్చాడు. ఇక్కడ్నుంచి ఆయన్ని వెనక్కి పంపడమంటే మీ చావు మీరు చావండి అని నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడమే. స్వీడన్  ధనిక దేశమే. చట్టం మాత్రం ఒప్పుకోదా? అయితే చట్టం మార్చుకునే దాకా పోరాడతాను’’ అంది. చివరికి ఆ 50 ఏళ్ళ ఆఫ్ఘన్ ను విమానం నుంచి దించారు. అంటే ఆయనకు స్వీడన్ లో ఆశ్రయం లభించింది.

చట్ట విరుద్ధ వలసలను నివారించండం కోసమంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న చర్యలను యునైటేడ్ నేషనన్స్ కు చెందిన మానవహక్కుల సంఘం తప్పుపట్టింది. “కుటుంబాల్ని విడదీయడం అంటే వ్యక్తుల కుటుంబ జీవితంతో జోక్యం చేసుకోవడం. ఇది నిరంకుశం, చట్ట విరుద్ధం. పిల్లల హక్కులను కాలరాయడం” అని తీవ్రంగా విమర్శించింది

పిల్లల్ని తల్లులకు అప్పగించాల్సిన గడువు దగ్గరపడే కొద్దీ నిరసన  రూపాలను సరికొత్తగా రూపొందుంచుకుంటూ ప్రదర్శనలు, బైటాయింపులు నిర్వహించారు. న్యూయర్క్ లో అనేక వేల మందితో జులై 25న  బ్రూక్లీన్ బ్రిడ్జ్ మీదగా ప్రదర్శన సాగిస్తూ “ఈ బ్రిడ్జ్ ని నిర్మించింది ఇమ్మిగ్రెంట్ శ్రామికులే” అని నినదించారు.

జులై 26న  దోగాడే పిల్లలతో, మూడు నాలుగులేళ్ల పిల్లలతో దాదాపు 100 యువ జంటలు వచ్చి  వాషింగ్టన్ డి.సి.లోని హార్ట్ సెనేట్ ఆఫీసు బిల్డింగ్ మధ్యలో బైటాయించారు. పిల్లలకు “ఐ యామ్ ఏ చైల్డ్” (I am A Child) అని రాసిన తెల్లని టీషర్ట్ లు వేశారు. ఈ బిల్డింగులో 50 మంది సెనేటర్ల ఆఫీసులున్నాయి. అయితే బైటాయించింది చిన్నపిల్లలు ఎవరినీ అరెస్ట్ చేయలేకపోయారు. ఇదే బిల్డింగు ముందు 7 వేల మందితో జూన్ 28 న జరిగిన ఉమెన్ మార్చ్ లో పాల్గొన్న వారిని దాదాపు 500 మందిని అరెస్టు చేశారు..

“ఐ యాం ఏ చైల్డ్” అని రాసి వున్న టీషర్ట్ లు పిల్లలకు ధరింపజేయడం అంటే మార్టిన్ లూథర్ కింగ్ పోరాటాన్ని గ్నాపకం చేయడమే. ఆయన నాయకత్వంలో 1968 లో  మింఫిస్ ( Mimphis, Tennessee) పారిశుద్ధ్య శ్రామికులు సమ్మె చేస్తున్న సమయంలో “ఐ యాం ఏ మాన్(“I am A Man”) అని రాసి వున్న షర్టులు ధరించారు. ఇమ్మిగ్రెంట్  పిల్లల్ని పేరంట్స్ నుంచి విడదీసిన విషాద సందర్భాలను తమ పిల్లలకు తెలియజెప్పడానికి ఈ తలిదండ్రులు చూపిన శ్రద్దకు ఆశ్చర్యం వేస్తుంది. ‘’జరుగుతున్న సంఘటనలు పిల్లలకు చెప్పాలి, ఎన్నాళ్లో పిల్లల కళ్లు కప్పి కాపాడలేం. పిల్లలకు జరుగుతున్న  అన్యాయాల్ని చూపుతూ, వాటిని ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా’’మని ఆయా టీవీ ఛానళ్లకు, పత్రికలకు ఇచ్చిన ఇంటర్య్వూలలో వారు పేర్కొన్నారు.

కోర్టు ఇచ్చిన గడువురోజు జులై 26 న  1600 మంది పిల్లల్ని మాత్రమే తలిదండ్రులకు అప్పగించగలిగింది ట్రంపు ప్రభుత్వం. దాదాపు 2 వందల మంది తలిదండ్రులకు క్రిమినల్ రికార్డులున్నాయని, మరో 450 మంది పిల్లల పేరంట్స్ ను వారి దేశాలకు తిప్పిపంపడం ( డిపోర్టేషన్ చేయడం) జరిగిందని వెల్లడించింది. సుమారు 700మంది పిల్లలు  ఇంకా అమెరికా అధీనంలోనే ఉన్నారు. అమెరికా అనుకుంటే ఆ తలిదండ్రులను రప్పించి పిల్లల్ని వారికి అప్పగించగలుగుతుంది.

డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తి అయింది. ఆయన పదవి చేపట్టిన మరునాడే, అమెరికా స్త్రీలు లక్షలాది మంది దేశవ్యాప్తంగా చిన్న పెద్ద నగరాల్లో  రోడ్ల మీదకు వచ్చి వందలాది నిరసన ప్రదర్శనలు చేశారు. అది మొదలు అనేక సమస్యలపై అమెరికా ప్రజలు ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొంటున్న నిరసన ప్రదర్శనలు అనేకం జరిగాయి. ఇంత తక్కువ కాలంలో ఇన్ని రకాల సమస్యలపై ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడం అమెరికా చరిత్రలోనే మొదటిసారని చెప్పవచ్చు.

రాజకీయాలు, పోరాటాలు మగవారు నిర్వహించేవి. స్త్రీలు ఇళ్లల్లో వుండి పిల్లా పాపల్ని చూసుకుంటూ ఇల్లు చక్కబెట్టుకుంటే చాలనే సూక్తులు ఇక చెల్లవని రుజువు చేస్తున్నారు. ఇల్లు ఎంత ‘’సురక్షితమో’’, బయలూ అంతే కదా! ఇంటా, బయటా వున్నది మనమే కదా! రాజకీయాలే ఇప్పుడు జీవితాల్ని శాసిస్తున్నాయి. రాజకీయాల్లో కల్పించుకోవడానికి స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. పిల్లలను హక్కుల కోసం నిలబడాలని నేర్పిస్తూ, చేయి పట్టుకొని రోడ్లపై నడిపిస్తున్నారు.

 

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

1 comment

  • ఇలాటి అరాచకాల్ని బయటిప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఎంతో వుంది. అభినందనలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.