విస్మృతి లోనికి ఎగిరిపోతున్న బట్టమేకపిట్ట

తెల్లవారుజామునే మొదలయ్యే కువకువ శబ్దాలు చెవులలోకి ప్రవహించి శరీరాన్నీ మనసునూ జాగృతం చేస్తే, బద్దకంగా వొళ్ళు విదిలించుకుని బయటకొచ్చి చిరువెలుతురులో గాలికి వూగుతున్న చెట్ల కొమ్మలనూ కొమ్మల మాటున కూర్చుని పదే పదే అరుస్తున్న పక్షులనూ చూస్తే వొంట్లోని బద్ధకం ఒక్క సారిగా ఎగిరిపోయి ఆ రోజు చేయాల్సిన పనులు హడావిడిగా వరుసకట్టి అదిలిస్తే, చకచకా తయారైపోయి పనిలో పడిపోయే జీవితానికి ఈసారి వారాంతంలో ఒక కుడుపునిచ్చి కాంక్రీట్ జంగిల్ నుండి బయటికీ బయలుదేరాం.

కర్నూలు స్టడీ సర్కిల్ మిత్రులతో కలిసి 22.07.18 ఉదయం బస్సులో కర్నూలుకు నలభై కిలోమీటర్ల దూరంలోని రోళ్ళపాడు పక్షుల అభయారణ్యానికి ప్రయాణం. రోళ్ళపాడు పేరు వినగానే గుర్తుకు వచ్చే పేరు బట్టమేక పిట్ట. సుమారు మూడున్నర అడుగుల ఎత్తు ఉండి తెల్లని మెడతో పొడవైన కాళ్ళతో భూమి మీద ఉన్న అతి బరువైన పక్షుల జాతులలో ఒకటి బట్టమేక పిట్ట. బట్టమేక పిట్ట అనగానే నందికొట్కూరులో గడిపిన పాత రోజులూ, అక్కడి షికారి పేటా, షికారి పేటలోని నీలి షికారి యువకుల వేటా, వేటలో వాళ్ళు తెచ్చే బట్టమేక పిట్టా మదిలో చకచకా మెదిలాయి.

భూమి మీద ఉండే అతి అరుదైన పక్షి జాతులలో ఒకటి బట్టమేక పిట్ట. భూమిపై అతివేగంగా అంతరించి పోతున్న పక్షి జాతులలో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బట్టమేక పిట్టల సంఖ్య రెండు వేలకు మించి లేదని ఒక అంచనా. భారత దేశంలో బట్టమేక పిట్ట కనిపించే ఐదు ప్రాంతాలలో (రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్) రోళ్ళపాడు ఒకటి. ఆదివారం బద్దకాన్ని అనుభూతి చెందుతూ ఆలస్యంగా నిద్ర లేచి అతి నిదానంగా ఉదయపు కార్యక్రమాలు పూర్తి చేసుకుని మేము కర్నూలులో బయలుదేరేసరికే పదకొండు గంటలు. పక్షులను చూడడానికి వెళ్ళే వాళ్లకు బద్ధకం ఉండకూడదనీ, ఉదయాన్నే వెళితే తప్ప పక్షులేవీ వాటి నివాస ప్రాంతాలలో కనిపించవనీ, నాకూ నాలాంటి ఒకరిద్దరికీ తెలిసినా స్టడీ సర్కిల్ సమూహంలోని మిత్రులందరూ వారి వారి పనులు చూసుకుని బయలుదేరేవరకు వేచి ఉండాల్సి వచ్చింది. కర్నూలునుంది బస్సు ప్రయాణంలో నాతోపాటు ఇంకో ఇరవైనాలుగు మంది, వాళ్ళంతా రకరకాల ఉద్యోగాలకోసం ఉన్న ఊళ్ళను వదిలి ఉద్యోగప్రాంతంలో ఉంటున్న వాళ్ళు. రోళ్ళపాడు పక్షుల అభయారణ్యం గురించి అందులోని కొందరికి ప్రాధమిక పరిజ్ఞానం కూడా లేదు. అయితే స్టడీ సర్కిల్ ఇచ్చిన ఉత్తేజం, కొత్త ప్రాంతాలను చూడడంలోగల ఉత్సాహం అందరినీ బస్సులోకీ రోళ్ళపాడుకూ చేర్చాయి.

రోళ్ళపాడు పక్షుల సంరక్షణకు సంబంధించిన అటవీ శాఖ ఉద్యోగులతో మాట్లాడినప్పుడు వర్షాలు ఆలస్యమైన కారణంగా ఇంకా గడ్డి మైదానాలు ఏపుగా పెరగలేదనీ, చుట్టూ పక్కల ఉన్న పొలాలలో ఇంకా విత్తనాలు వెయ్యడమే పూర్తి కాలేదనీ అందువల్ల బట్ట మేక పిట్టలు రావడం ఆలస్యమైందనీ చెప్పడం కొంత నిరుత్సాహానికి గురి చేసింది. అయితే రోళ్ళపాడు పక్షుల అభయారణ్యంలో అనేక ఇతర పక్షి జాతులూ జంతు జాతులూ ఉన్నాయనీ అడవిలో జీవన సమతుల్యాన్ని పాటించే పరిస్థితులు అక్కడ ఉన్నాయనీ తెలిశాక మళ్ళీ ఉత్సాహం వచ్చింది. రోళ్ళపాడు పక్షుల అభయారణ్యం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అధ్వర్యంలో నడుస్తోంది. అక్కడ అటవీ శాఖ వారు విశ్రాంతి గ్రుహాలనూ ఒక ప్రదర్శనశాలనూ దృశ్య శ్రవణ కేంద్రాన్నీ నిర్వహిస్తున్నారు.

వేగంగా అంతరించి పోతున్న పక్షి జాతులలో ఒకటైన బట్టమేకపిట్టలు ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలలో సుదూర ప్రాంతాలనుండి ఇక్కడికి చేరుకుంటాయి. ఇక్కడ ఉన్న గడ్డి మైదానాలలో గుడ్లను పెట్టి పొదుగుతాయి. ఒక ఆడ బట్టమేక పిట్ట సంవత్సరానికి ఒక గుడ్డును మాత్రమే పెడుతుంది. ఒక గుడ్డును పొదగడానికి సుమారు 23 నుండి 26 రోజులు పడుతుంది. రోళ్ళపాడుకు వచ్చే బట్టమేక పిట్టల సంఖ్య సుమారు 30 వరకు ఉంటుంది. ఆడ బట్టమేక పిట్టలు పెట్టే 23 నుంచి 25 గుడ్లలో 15 నుంచి 16 మాత్రమే పిల్ల బట్టమేక పిట్టలకు జన్మనిస్తాయి. ఇది కూడా predators బారిన పడకుండా బట్టమేక పిట్టలు గుడ్లను రక్షించుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. వీటి ఉనికికి ప్రమాదకరంగా పరిణమించే ప్రకృతి అనర్ధాలైన తోడేళ్ళూ, నక్కలతో పాటు చుట్టుపక్కల గ్రామాలనుండీ పరిసర ప్రాంతాలనుండీ వచ్చే వేటగాళ్ళు కూడా వీటి జనాభా విస్తరణకు ఆటంకాలు. దీనికి తోడు నాగరికత విస్తృతిలో భూమినంతా అలుముకుంటున్న విద్యుత్ తీగలూ టెలిఫోన్ తీగలూ కూడా బట్టమేక పిట్టలకు ప్రమాదకారులే. పెరిగిన ఒక బట్టమేక పిట్ట బరువు సుమారు 13 నుండి 16 కిలోలు ఉంటుంది. ఆ బరువుతో అవి ఒక్క ఉదుటున పైకెగరలేవు. విమానాలవలె రెక్కల సహాయంతో ఏటవాలుగా గాలిలో తేలుతూ భూమినుండి పైకెగరాలి. అవి ఎగిరే సమయంలోనో కిందికి వాలే సమయంలోనో అడ్డువచ్చే తీగలు వాటిపాలిత యమకూపాలు. (ఈ సంవత్సరం గుజరాత్ లో మాత్రం ఒకే ఒక మగ బట్టమేక పిట్ట కనిపించిందనీ అది కూడా అతి చిన్న వయస్సులో ఉందనీ బట్టమేక పిట్టల అంతర్ధానానికి ఇది ఒక సూచన అనీ 23.07.18.న ఒక అమెరికా నుండి వచ్చే వార్తా కథనం (Scientific American) చెప్పింది.)

సమాజం ఆర్ధిక వలయంలో చిక్కుకుంటున్న కొద్దీ ప్రకృతి సహజత్వానికి దూరం కావడం వల్ల ప్రకృతిలో జరిగే నష్టానికి ఒక ఉదాహరణ బట్టమేక పిట్ట అంతర్ధానం. పొలాలలో పంట కోతల తరువాత మిగిలిన వేరుశనగ, త్రుణ ధాన్యాల పరిగలు బట్టమేక పిట్టకు ఆహారంగా ఉండేవి. ఆ పంటల స్థానంలో ఇప్పుడు వస్తున్న వాణిజ్య పంటలు మనుషులకే కాదు పక్షులకు కూడా ఆహార కొరతను పెంచుతున్నాయి.

బట్టమేక పిట్ట ప్రదర్శనశాలనూ, అటవీశాఖ వారు పర్యావరణ పరిరక్షణ మరియు బట్టమేక పిట్టపై తయారు చేసిన లఘు చిత్రాలనూ చూసినతర్వాత అటవీశాఖ వారి బర్డ్ వాచర్ తో కలిసి బస్సులో అభయారణ్యాన్ని చూసేందుకు బయలుదేరాం. ఆ అభయారణ్య ఆవరణ అంతా ఒక అడుగు వరకు పెరిగిన గడ్డి మైదానం. వర్షాకాలంలో అది మరింత ఏపుగా పెరిగి అనేక సహజ క్రిమి కీటకాదులకూ పక్షులకూ చిన్న చిన్న క్రూర జంతువులకూ (తోడేలూ నక్కా వంటివి) జింకలకూ ఆలవాలమవుతుంది. దారి పొడవునా మేము ఎన్నో జింకల సమూహాలను చూసాం. మాలో కొందరు ఆ జింకలను చూడడానికి వాటివైపు పరుగెత్తడం, అవి ఇంకా దూరంగా పరిగెత్తడం, చిరుగాలులతో కూడిన సన్నటి వర్షం స్టడీ సర్కిల్ సభ్యులందరినీ ఉత్సాహ పరిచాయి.

ఈ పక్షుల అభయారణ్యంలో తిరుగుతున్నప్పుడు డాక్టర్ సలీం ఆలి కృషి ఒక జ్ఞాపకంలా మమ్మల్ని వెన్నంటే ఉంది. ఒక బట్టమేక పిట్ట గుడ్డును పొదుగుతున్నదని తెలిసిన ప్రతిసారీ ఆయన బొంబాయి నుండి రోళ్ళపాడు వచ్చిన పలుసందర్భాలను అక్కడి అటవీశాఖవారు వివరించారు. ఈ పక్షుల అభయారణ్యంలో మేం తిరుగుతున్నప్పుడు, ఉన్న వూరు వదిలి జీవనం కోసం వలస వెళుతున్న మనుషులు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆధునిక సమాజంలో రెక్కలు వచ్చిన పిల్లలందరూ ఉన్న వూరు నుంచి సముద్రాలు దాటి ఇతర ఖండాలకు వలస పోవడం, అందులో అధికభాగం అక్కడే ఉండిపోవడం వారి రాక కొరకు ఇక్కడ ముసలి తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉండడం వంటివెన్నో గుర్తుకు వచ్చి మనసు ఆర్ద్రమైంది. ఒక్కటే తేడా సుదూర తీరాలకు ఖండాంతరాలకు వలస వెళుతున్న పక్షులు ఏ ఆటంకమూ ప్రమాదమూ ఎదురు కాకపోతే క్రమం తప్పకుండా అనుకూల కాలంలో ప్రతి సంవత్సరం తమ ప్రాకృతిక నివాస ప్రాంతాలకు తరలి వెళుతున్నాయి. పక్షులకన్నా జ్ఞానవంతులైన మనుషులు తమను చుట్టేస్తున్న ఆర్ధిక సుడిగుండాలనుండి బయటపడి తమ వారితో కలిసి ఉండే కాలం ఎప్పుడైనా వస్తుందా?

(రోళ్ళపాడు పక్షుల అభయారణ్యం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో ఉంది. అతి అరుదైన బట్టమేక పిట్ట ఇక్కడ జూలై నుండి అక్టోబర్ మాసాలలో కనిపిస్తుంది. ఇది కర్నూలు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పక్షుల ప్రేమికులకూ పర్యావరణ ప్రేమికులకూ ఇక్కడి విశేషాలు విందు చేస్తాయి. కర్నూలు జిల్లా అటవీశాఖవారి అనుమతితో అభయారణ్యాన్నీ చూడొచ్చు. అక్కడ వసతిని కూడా పొందవచ్చు.)

  • గాయత్రి& చంద్ర శేఖర్

 

గాయత్రి దేవి

గాయత్రీ దేవి: పుట్టడం, చదవడం, పెళ్ళీ, ఉద్యోగం... అన్నీ కర్నూలు పట్టణంలో. ప్రస్తుతం ఒక ప్రైవేటు స్కూలులో టీచర్ గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. 50 కి పైగా పిల్లల కథలతో కలిపి సుమారుగా 60 కథలు వ్రాశారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో డజనుకు పైగా వ్యాసాలూ వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన కథలూ ప్రసారమయ్యాయి.

1 comment

  • ఒక్కోసారి మనిషే ప్రకృతికి దూరమౌతున్నాడా ? లేక ప్రకృతే మనిషికి దూరమౌతుందా? అర్ధం కాదు అభివృద్ధి పేరుతొ
    పక్షుల్ని జంతువులని ప్రకృతిలో లేకుండా చేయడమే ఒక పెద్ద పనిగా పెటుకున్నామనిపిస్తుంది. మనిషి తప్ప ఈ భూమి మీద మరో జీవికి చోటు లేకుండా ఎవరో అదృశ్యంగా ఇచ్చిన ఆదేశాల్ని అందరు పాటిస్తున్నట్టుగానే ఉంది.మాంసము ఉన్న ప్రతి దాన్ని తినాలనే కోరిక. నోరు లేని వాటినన్నిటిని ఆహారంగా మల్చుకొంటున్న కాలంలో
    బట్టమేక పిట్ట అతివేగంగా అంతరించి పోతున్న పట్టింపు ఎవరికి ఉంటుంది? చైనా లాంటి కమ్యూనిస్టు దేశమే పావురాలు పిచుకలు ఆహారపు పంటలను తినివేస్తున్నాయి అనే కారణంతో విశేక్షణ రహితంగా చంపి దేశంలోనే లేకుండా చేసిన చరిత్ర ఉంది. దేన్నీ కాపాడుకోలేని వ్యవస్థలో మనం ఉంటున్నాము. డబ్బుకు తప్ప మన మెదడు గదుల్లో మరో వాటికి చోటే లేనప్పుడు బట్టమేక పిట్టలాంటివి ఎన్నిఅంతరించి పోతున్న చూస్తూ ఉండటం తప్ప చేసేది ఏముంది మేడం ……మంచి వ్యాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు దాసరి రాజబాబు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.