ఫెమి’నిజపు పురా పరిమళాలు

షులామిత్ ఫైర్ స్టోన్ రాసిన “ the dialectics of sex” లో వొక చాప్టర్ అయిన “ love (ప్రేమ ) “ ను పద్మావతి బోడపాటి గారు అనువాదం చేశారు. ఈ వొక్క చాప్టర్ మీద నా అభిప్రాయం – సాయి పద్మ

ప్రేమ, రాజకీయం వొకే ఊపున వినాలంటే , మనసు వొప్పుకోదు. ముఖ్యంగా అమ్మాయిల/మహిళల మనసు అసలు వొప్పుకోదు. “ ఊహూ .. మా ప్రేమ అలాంటిది కాదులే, కానీ , సరే విందాం ఈవిడ ఏం చెప్తుందో “ అనే మైండ్ సెట్ తోనే మొదలుపెడతాం. ఉదాహరణ కి , మొగుడూ పెళ్ళాల , లేదా రిలేషన్ షిప్ కౌన్సెలింగ్ కి వచ్చిన సగం మంది, మా ప్రాబ్లం ఇలాంటిది కాదులే.. చాలా విచిత్రమైన కొత్త విషయం, అయినా నాకీ కౌన్సెలింగ్ అవసరం లేదు గానీ.. ఎందుకన్నా మంచిది ఆయన లేదా ఆవిడ మారతారేమో అనుకోని వచ్చినట్లు. చాలా విషయాలు తరచి చూడటానికి, అర్ధం చేసుకోవటానికి మనసు వొప్పుకోదు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి, ఫెమినిజం లో నిజం, ప్రేమ , ప్రేమ యొక్క రకరకాల రంగు ,రుచి వాసనాలూనూ.

షులామిత్/పద్మావతి “ ప్రేమ రాజకీయాలు “ 24 పేజీల చిన్న పుస్తకం. ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ పి. సత్యవతి గారు ఇలా అంటారు “ స్త్రీ , పురుషుడిని ప్రేమించే విధంలోనూ, పురుషుడు, స్త్రీని ప్రేమించే విధంలోనూ ఉండే అంతరాన్ని షులామిత్ అద్భుతంగా ఆవిష్కరించింది , దానికి పద్మావతి చేసిన ఆసక్తికరమైన అనువాదం మనల్ని ఆలోచింప జేస్తుంది.“ నిజానికి ఇది గొప్ప పరిశీలన, వొక్క మాటలో చెప్పాలంటే , ఈ అంతరమే రాజకీయం, అది ఏరకంగా ప్రభావితం అవుతుందో ప్రేమ అనే చాప్టర్ చెపుతుంది. షులామిత్ ఈ పుస్తకాన్ని సిమోన్ డి బావా కి అంకితం ఇస్తూ .. “ ఇది సిమోన్ కి అంకితం, ఆమె సహించినందుకు అంటుంది….. ఈ చిన్నమాట లో ఎంతో అర్ధం ఉంది . తరాల దుఖం ఉంది .

ఇక పుస్తకంలోకి వెళితే, ప్రేమ గురించి చర్చించని ఏ రాడికల్ ఫెమినిజం పుస్తకం అయినా రాజకీయంగా విఫలం అయినట్లే అని మొదలుపెడుతుంది షులామిత్. ఇది కేవలం వొక స్టాండ్ అలోన్ చాప్టర్ గా చూస్తే, ఇంకా రాడికల్ నెస్ లేదనే అనిపిస్తుంది నాకు. లైంగిక సంబంధాల విషయంలో ఇంకా ఫెమినిజం తనని తాను ఆదర్శీకరించుకోవటం లోనే ఉంది. బలాల ఆధారంగా డిమాండ్/కమాండ్ చేసే స్థాయిలో స్త్రీ ఇంకా లేదు. ఆ విషయంలో గందరగోళం ఉన్నట్లే, ఈ చాప్టర్ లో కొన్ని అంశాల లోనూ గందర గోళం ఉంది. ఇంగ్లీష్ లో టెక్స్ట్ బుక్ తరహాలో చదువుకొని వెళిపోయే విషయాల్ని, పద్మావతి గారు అనువాదం చేయటం వల్ల తెలుగులో ఆలోచించటం జరిగింది. అది మన కల్చర్ కీ, జరుగుతున్న విషయాలకీ అన్వయం చేస్తే తెలిసిన విషయాలు మనల్ని వొక కుదుపు కుదిపేస్తాయి. ఆ paradigm shift కి తయారు కావలసిందే.

జెండర్ స్పష్టతలు, సరిహద్దులు … నలుపు తెలుపు గీతల్లా స్పష్టంగా ఉండే కమ్యూనిటీలలో పనిచేశాను నేను. ఉదాహరణకి “ప్రేమ” అనే విషయం పెద్దగా రాజకీయం లేదా ఏ పరమైన సమస్య కాని , ట్రైబల్ కమ్యూనిటీలలో, ఈ రకమైన అంతరం చాలా తక్కువ ఉండటం చూశాను. అక్కడ చాలావరకూ రిలేషన్స్ ఇచ్చి పుచ్చుకోవటం , వ్యవసాయ లేదా ఇతర పనుల ఆధారంగానే అధికారాలూ, ఆదారపడటాలూ ఉన్న సమాజంలో స్త్రీ, ఉత్పత్తి లో భాగంగానే ఉంది తప్ప, తనను తాను తక్కువ చేసుకొని, ఎమోషనల్ గా ఆధారపడుతూ లేదు. కానీ, అలాంటి బలాల ఆధారంగా , సమానత్వంతో ఉండే జంటలు, సమూహాలు చాలా చాలా తక్కువ. గిరిజన విలువలను , సమానత్వాన్ని తక్కువగా చూడకపోతే మనగలిగే స్థితిలో మన మధ్య తరగతి భారతీయ విలువలు లేవు. కాబట్టి.. గిరిజనులు అంటే .. ఏమీ తెలియని వాళ్ళు , అనాగరికులు అనే విధంగా ముద్ర వేశారు. దీని వెనుక ఉన్న రాజకీయ, ఆర్ధిక కారణాలు వేరే మాట్లాడుకుందాం.

ఇక, షులామిత్ నిర్వచించిన “ ప్రేమ “ దానితో పెనవేసుకొని ఉన్న రాజకీయాల గురించి చర్చిస్తే.. నా వరకూ నచ్చిన , మార్పు వచ్చిన, లేదా పాత వాసన వేసిన విషయాలు , వొకటీ వొకటీ చర్చించే ప్రయత్నం చేస్తాను.

“తానెంతగా ప్రేమిస్తున్నాడో తెలియపరుస్తూ, అదే ప్రేమను తిరిగి అందించమని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాడు “ – షులామిత్ ఈ పుస్తకం 1970 లో రాసింది. చాలావరకూ ఈ మానసిక పరిశీలనలు అన్నీ , వోకల్ గా చెప్పేవి మగవారి వైపు, ఊహించుకొనే విషయాలు ఆడవారివైపు గా చెప్పబడ్డాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఏభై ఏళ్ళలో .. తాము ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేయటం ఇద్దరి వైపు నుండీ ఊపిరాడనంత పెరిగింది.

“తన భాగస్వామిని ఆదర్శ వ్యక్తిగా ఊహించి ప్రేమించటం మగవాళ్ళ తో పోలిస్తే , ఆడవాళ్ళ లో తక్కువ కనబడుతుంది “ – “మగవారు ప్రేమించిన ఆడవారిని తాము ఊహించుకున్న ఆదర్శ స్త్రీ గా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అధికార ప్రకటనలే “ – నిజానికి ఇవి పరస్పర వ్యతిరేక ప్రకటనలు. ఈ ఆదర్శీకరణ అనేది నాకు చాలావరకూ అవుట్ డేటెడ్ గా అనిపించింది. బహుశా , ఫ్రాయిడ్ నుండీ , థియోడార్ రీక్, రిజ్మంట్ ల పరస్పర వ్యతిరేకమైన , ముఖ్యమైన వాదాల వల్ల కావచ్చు. అన్నీ, ఆడా , మగ మధ్య ఉండే ప్రేమకి అలాగే వర్తిస్తాయా అంటే , ఇదమిద్ధంగా మాత్రం చెప్పలేం.

“వొక స్త్రీ సృజనాత్మక జీవితంలోని శక్తివంతమైన ముఖ్య భాగం అంతా వొక మగవాడ్ని ఆకట్టుకోవటానికి, మిగతా భాగం అతన్ని తనతో నిలుపుకోవటానికే ఖర్చయిపోతుంది. “ -ఇది ఎంత నిజమైన గొప్ప నిజం అంటే, ఈ రోజుకి కూడా, ప్రేమ పరంగా కాకుండా, భద్రత పరంగా మగవాడ్ని కోరుకొనే తన శక్తిని, తెలివితేటల్ని, అన్ని వనరులనీ  ఖర్చు పెట్టేసే ఆడవాళ్లే ఎక్కువ.

“ఆడవాళ్లకే కాదు, చాలామంది మగవాళ్ళకి కూడా ప్రేమ లేని జీవితం గడపటానికి కావలసిన ధైర్యం ఉండదు “ – షులామిత్ చాలావరకూ ప్రేమ , వొనర్ షిప్ , ఆర్ధిక కారణాల వల్ల వచ్చిన ధైర్యాలూ, ఇన్సెక్యూరిటీ ల గురించి ఎక్కువగా చర్చించలేదు. కొంతవరకూ పెళ్ళికీ, స్వేచ్చ కీ మధ్య ఏదో వొకటి ఎంచుకోవాల్సి రావటం ఎలాంటిది అంటే, వ్యక్తిగత ఆస్తి కీ, ఉమ్మడి ఆస్తి కీ మధ్య ఎంచుకోవటం లాంటిదే అంటుంది షులామిత్. ఆర్ధిక పరమైన ప్రేమ రాజకీయానికి ఇది తెర లేపినట్లు అనిపించింది నాకు.

సెక్సువల్ రిలేషన్ షిప్స్, దాని తాలూకు స్వేచ్చ లేదా అభద్రత, వాటి ఆధారంగా భాగస్వామిని ఓన్ చేసుకోవటం లాంటి విషయాలపై షులామిత్ దృష్టి పెట్టలేదు. అడ, మగ లకు రెండు డిఫరెంట్ విలువలు, ఎక్పెక్తేషన్స్ ఉన్నప్పుడు, జరిగే ఓనర్ షిప్/ స్వంత భావన యుద్ధం , దాని పరంగా వచ్చే , ఆర్ధిక , సామాజిక అసమానతలు కూడా ప్రేమని ప్రభావితం చేస్తాయి.

ట్రివియా’ – అనేది నాకు చాలా ఇష్టమైన పదం. నిజానికి ట్రివియా అంటే నాకు గౌరవం కూడా, ట్రివియా అంటే , స్వల్పమైన విషయం, పెద్దగా ప్రాధాన్యం లేని విషయం అని చెప్పుకోవచ్చ్చు. కానీ, ఏ సైకాలజిస్ట్ అని అడిగినా చెప్తారు.. మానవ సంబంధాలలో ట్రివియా , అంటే చిన్న చిన్న విషయాల యొక్క ప్రాధాన్యం, దాని వల్ల వొక్కోసారి పూర్తిగా ఆ బంధమే నిలబడవచ్చు, తెగిపోవచ్చు కూడా. ఆడ, మగ మధ్య ట్రివియా ని అర్ధం చేసుకోవాలంటే , ఈ చాప్టర్ చదవాలి. నేను ఇన్నాళ్ళూ ఎందుకు చదవలేదా అనిపించింది నాకు. కానీ, ట్రివియా చాలా వరకూ , ప్రతీ రిలేషన్ షిప్ లోనూ ఉంది. ఎవరు, ఏ ట్రివియల్ బ్యాక్ గ్రౌండ్ నుండి మాట్లాడుతున్నారు, వాదిస్తున్నారు అనేది అర్ధం చేసుకుంటే , చాలా మంది ఫెమినిస్ట్ లకీ , రాసే ప్రతీదీ ఫెమినిజమే అనే అపోహలో ఉండే సాహిత్య కారులకీ వొక క్లారిటీ వస్తుంది అని నాకు అనిపించింది.

చివరగా , ఇన్ని గందరగోళాల మధ్య “ ప్రేమ ‘ అంటే ఏమిటీ అనేది బేరీజు వేసుకుంటే ..
వొక చిన్నపాటి నమ్మకం ,
మోసాల పరుగుల మధ్య వొక మనిషికి నిజం చెప్పగలం అనే నిశ్చింత ,
సమాజం మనమీద పెట్టిన స్టీరియో టైప్స్ మధ్య మనల్ని మనలాగే చూసి వోప్పుకోగలిగే ఆర్ద్రత ,
అడ, మగ అనే బాక్సులు, అధికారం, నియంత్రణ అనే జైళ్ళు దాటి
మాచో పవర్ స్టేట్మెంట్లు,
మార్కెట్ నిర్దేశించిన ఫెమినైన్ కొలతల విలువలని
దాటి, మనిషికి మాత్రమే సొంతమైన కరుణ
ఇలా అవగాహన చేసుకోలేకపోతే
అడ, మగ, థర్డ్ జెండర్ … అందరూ ప్రేమ అనబడే నమ్మకం లేని
ఊచలు కనబడని బందిఖానా లో జీవితకాలపు ఖైదీ లే
మనిషిగా మాత్రమే చూడగలిగితే ప్రేమించగలం
అడగానో, మగ గానో , లేబుల్ తగిలిస్తే
బ్రాండ్ వెనుక నాణ్యత లేని వస్తువు మాత్రమే ప్రేమ

Hope, books like these are rude awakenings to come out boxes, conditioned to be self-locked by society..!!
Thank you so much shulamith / padmavathi for great read.. !!

 

సాయి పద్మ

సాయి పద్మ: వృత్తి అడ్వొకేట్ , సోషల్ వర్కర్. ప్రవృత్తి -సంగీతం, సాహిత్యం . గ్లోబల్ ఎయిడ్ అనే సంస్థ ని గత పది సంవత్సరాలు గా, నడుపుతున్నారు. ఏ వాదంలోనూ, వర్గం లోనూ, ఇమడలేకపోవటం, సాహిత్యానికి ఎక్సైట్ అవటం తన బలం , బలహీనతానూ.. అంటారు.

2 comments

  • మంచి విశ్లేషణ. ఈ పుస్తకం నా దగ్గర కొన్ని రోజులుగా ఉన్న ఇంకా చదవలేకపోయాను. ఇప్పుడు తప్పక చదివేలా చేసారు సాయిపద్మ గారు.

  • ఓ పద్మ గారి అనువాదానికి ఇంకో పద్మ సమీక్ష బావుంది. ఫెమినిజం అనేది నాకు అర్ధమయ్యినంత వరకు ఒక అస్తిత్వ ఆకాంక్ష దానికి ప్రేమకి సంబంధం లేదు. తరువాత సమీక్ష నాకర్ధమయ్యినంత వరకు అనువాదాన్ని అనుసరించి జరిగినట్టుగా ఉంది. అందులో పెద్దగా ఆక్షేప్పించ వలసింది లేదు. కాకపోతే డయలెక్ట్స్ ఆఫ్ సెక్స్ అంటే అర్ధం నాకర్ధం అయ్యినంత వరకు లింగ బేధం పైన ఒక సమగ్ర అవగాహన ఒక సమగ్ర చర్చ ద్వారా అని అనుకుంటున్నా. అందుకేనా కాబోలు చాలా మంది రచనలని ప్రస్తావించారు. ఎక్కడో చదివాను పుట్టిన ప్రతీ జీవి ఏదో ఒక బాధకి గురి కాకుండ ఉండదు అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అంటే ఒకరి కష్టాలు ఒకరితో పోల్చడం అనేది హాస్యాస్పదం. అలాగే స్త్రీ కష్టాలు స్త్రీవి పురుషుడి కష్టాలు పురుషుడివి.. ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉండాలి అని నిర్వచించడంలో ప్రేమ అనే పదం చాలా విరివిగా ఒక అపోహకి గురి చెసారు. అది స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ప్రేమను పునాదిగా నిర్వచించడం. అది కేవలం ఒక తప్పుడు అవగాహన మాత్రమే. సమాజంలో భాద్యతలు బంధాలు అనేవి అనుబంధాలతో నిర్వచించడానికి చేసే మూర్ఖపు మరియూ అసంబద్ధ అవివేకమూ కలబోసినా విశ్లేషణలు అపరిపక్వతని మరింత అయోమయాన్ని కలిగించే ప్రయత్నాలలో పాశ్చాత్యుల ఆలోచనల పునాదిగా అర్ధం చేసుకోవడమే ఈ రణగొణ ధ్వనుల కాలుష్యం. అసలు ఇలాంటి పరిస్థితికి కారణం నా దృష్టిలో కళాకారులు తమ ఆలోచనలని చరిత్రలో చిరస్థాయిగా ఉండాలనేది దురుద్దేశ్యం తో చేసిన అభూత కల్పనలు ప్రేమని స్త్రీ పురుషల సంబంధాలని తీర్చి దిద్దిన విధానాలు అవి నిజముగా అవలంబించాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే అసలు సమస్యలని మాత్రం మరుగున పెట్టడమే ఈ సమస్య మూల కారణం కాల క్రమేణా ఆ నిజాలు నిర్భయంగా చర్చించే వారు రాగానే ముసుగులు తొలిగి నిర్వచనాలు మారిపోసాగాయి. ఈ అవగాహనా క్రమం స్త్రీ వాదం అనే కొత్త పుంతలు తొక్కడం ఒక విపరీతము అది మానవ వాదం గా మారిన నాడు కూడా సమస్య మిగిలే ఉంటుంది కారణం జంతువులకు భావ ప్రకటన ఉంటె అవి కూడా వివక్షతకు గురి అయ్యాయని చెప్తాయి ఆ రోజు ఈ వాదానికి చెల్లు బాటు ఉండదు. కాబట్టి జాలి కరుణ అనేవి పునాదిగా అన్ని బంధాలు సంబంధాలు నిర్వచించ గలిగితేనా ఈ వాదాలు ఉండవు.
    కాకపొతే అనువాదం మీద సమీక్ష అంతంత మాత్రంగా ఉంది. కూలంకషంగా లేదు కారణం పద్మ గారు ఒక పరిమితికి లోబడి రాసిన కథనానికి ఇంకో పద్మ గారు చేసిన సమీక్ష ఆ పరిమితుల్లోనే వివరించారు. కాబట్టి కొంత మంది అభిప్రాయాలు అనేవి పాఠకులకి తెలుస్తుంది చరిత్ర పరంగా తప్పా మారే కాలాన్ని బట్టి సమస్యలు కూడా మారిపోయేటాయి కాబట్టి ఒకప్పటి సమాజం మీద ఒక అవగాహన కల్పిస్తారు ఇరువురు. కాకపోయితే స్త్రీ పరిస్థితిలో కాలాలు మారినా అలాగే ఉంది అనే భ్రమ కల్పించడం నేను అంగీకరించ లేక పోతున్నాను. అది కూడా తిమ్మిని బమ్మిని చేసే కళా ప్రక్రియ తప్పా అసలు నిజం కాదు. అసలు నిజం జంతు ప్రవృత్తి అందరిలోనూ ఉంది అని ఒప్పుకొని ఆ దిశగా అడుగులు వెయ్యాలి. అది వప్పుకోకుండా స్త్రీ శరీర నిర్మాణం ఆధారంగా చేసే వాదనలు ఎప్పుడూ నాణానికి ఒక్క వైపే చూపిస్తాయి. ఇది నా అవగాహన వ్యక్తిగత అభిప్రాయం తప్పా ఆఖరి వాక్యం ఎప్పుడూ కాదు ఎందుకంటే ప్రతీ సమస్యని ఒక లింగ వివక్షతగానో మరో వివక్షతగానో ఒక సమూహపు అవగాహనాల్లోకి నెట్టకుండా విడి విడిగా పరిశీలించాలి అనేది మాత్రమే ఒక విజ్ఞప్తి ఇక్కడ.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.