బస్ నంబర్ 113K

సాయంత్రం ఆరుగంటలు

ఏషియన్ జిపీఆర్ ముందు ఉన్న బస్ బే దగ్గర నించున్నాను.

అసలు బస్సు ఎక్కడానికి కారణం కాబ్ లు చాలా ఎక్కువ రేట్ చూపించటమే. పోనిలే పూల్ లో వెళదామా? అనుకుంటే అదీ ఎక్కువ చూపిస్తుంది. సరేలే చాల రోజులయింది బస్ ఎక్కి పోదాములే అని డిసైడ్ అయ్యా! అదీ కాక, ఈ రూట్ నెంబర్ బస్ తో పాత అనుబంధం ఉంది నాకు.

ఎనిమిదేళ్ల క్రితం ఆఫీసుకి వెళ్ళేప్పుడు ఇదే బస్సు ఎక్కి పంజాగుట్ట లో దిగి, నాగార్జునహిల్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళడం, మళ్ళి సాయంత్రం ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ వరకు ఆటో లో వెళ్లి అక్కడ ఈ 113k బస్ కోసం వెయిట్ చెయ్యడం, అప్పుడు పడిన అవస్థలు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి.

సెలవు రోజు కాబట్టి జనం తో కిటకిటలాడుతోంది బస్సు. అసలు ఈ కూకట్ పల్లి, మియాపూర్ ఇక్కడ ఒకప్పుడు జనసంచారం ఉండేది కాదు.

పెద్దమ్మ కొడుకు బిహెచ్ ఇఎల్ లో ఇంజనీరుగా పనిచేసేవాడు. వాళ్ళింటికి ఎక్కువగా వెళుతూ ఉండేవాళ్ళం. అప్పుడు ఇవన్నీ పొలాలతో ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్ళు. బసులో వెళితే పర్వాలేదు గాని, పిల్లల్ని తీసుకుని స్కూటర్ లో వెళ్ళినప్పుడు భయమేసేది. అవన్నీ మరపురాని జ్ఞాపకాలు

ఇదంతా ఓ ఇరవయి ఐదేళ్ళ క్రితం, అప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు, ఇంత డెవలప్మెంట్ కూడా లేదు. చూస్తుండగా నగరం పెద్దదయింది. దానితో పాటు ఇరుకు కూడా అయింది. రోడ్లను మింగేస్తూ దుకాణాలు వచ్చాయి.

ఒకటే హడావుడి ,గందరగోళం,రకరకాల మనుషులు …. ఏంటో అంతా ఊపిరి సలపనట్లుగా ఉంది. దేని కోసం ఈ ఆరాటం ? అంతా నటన, బిజీ అనే ఆచ్ఛాదన. లోపల చూస్త్రే అంత వట్టిదే ఏమి ఉండదు. ఖాళీ . డొల్ల.

అవన్నీ చూస్తూ ఆలోచిస్తూ నిలబడిన నేను రెండు మూడు బస్సులు వచ్చి వెళ్ళిపోవడం చూడనే లేదు. అరే ఏదో బస్ వస్తోంది అని కొంచెం ముందుకు వెళ్ళా, తీరా చూస్తే అది కోఠీ కి వెళ్ళే బస్, ‘అబ్బా’ అనుకొని నిట్టూరుస్తూ…

సరే ఇంకొంచెం సేపు చూద్దాం, ఇంకా టైం ఆరు గంటలే, పర్వాలేదు అనుకుని వెనక్కి వెళ్లి మాల్ వైపు తల తిప్పి చూసా, కొత్త సినిమా హోర్డింగ్స్ కనిపించాయి.

నిజం చెప్పద్దూ ఏదో పంతంతో నించున్నాను కానీ, గత పదేళ్లుగా అస్సలు బస్ ఎక్కలేదు. వెళితే కారు, కాబ్ తప్పితే ఆటో, దాని కి తోడు వయసు కూడా పెరిగింది. జవానీ లో ఉన్న జోష్ ఇప్పుడు ఉండదు కదా ! పిల్లలకి తెలిస్తే తిడతారు. ఇంత పిసినారి తనం ఏంటి అని.

ప్చ్ తొందరగా వచ్చేస్తే బావుండును. ఏ బస్ వచ్చినా పరవాలేదు. పోనీ ఆర్డినరీ వచ్చినా సరే అనుకున్నాను

ఇంతలో నా పక్కనే ఇద్దరు మధ్య వయస్కులు నించొని మాట్లాడుకుంటున్నారు. పంచె కట్టులో ఉన్నారు.

“రేయ్, పిల్లలను కస్టపడి చదివించా, కాని లాభమేంటి? ఉద్యోగాలు దొరకటం లేదు, పాపం మంచిగానే చదువుకున్నారు? ఏనాడూ ఇది కావాలని అడగలేదురా వాళ్ళు, నేను ఏం తెస్తే దానితోనే బతికారు రా” అంటున్నాడు

“ఏం బాధ పడకురా అన్ని మంచిగానే జరుగుతాయి. పెద్ద సారు చేస్తానని చెప్పాడు కదా !”

“అదేరా అనుకుంటున్నా, అన్ని మంచిగా జరగాలని, ఆ దేముడికి మొక్కుకున్నా, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి ఎప్పటికీ”

తుది, మొదలు తెలియకుండా మధ్య లోంచి వాళ్ళ మాటలు వింటున్న నాకు జీవితమంటే ఇదే కదా! స్టగ్రుల్, కాన్ ఫ్లిక్ట్స్. పోరాటం చెయ్యడమే .

దూరం నుంచి వరుసగా మూడు బస్ లు వస్తున్నాయి. అందులో ఒకటి కొత్త ఎసి ది కూడా ఉంది. తీరా దగ్గరకు వచ్చాక చూస్తే మొదటి రెండు నేను ఎక్కాల్సినవి కావు.

చివరగా వచ్చిన బస్సు లింగపల్లి నుండి ఉప్పల్ పోయే 113K, అది మెట్రో ఎక్ష్ప్రెస్స్. అమ్మయ్య అనుకొని ఎందుకైనా మంచిదని డ్రైవర్ ని అడిగి మరీ ఎక్కాను.

‘హు’ మెట్రో అయినా అప్పటికే బస్ నిండిపోయింది. ముందు ఉన్న అన్ని రకాల రిజర్వడ్ సీట్లు కూడా నిండిపోయాయి. చేసేది లేక పైనుంచి వేలాడే హేండిల్ గట్టిగ పట్టుకుని నించున్నాను.

బయటకు చూస్తుంటే అనిపించింది. నా పక్కన నించున్న వాళ్ళు ఏ బస్సు ఎక్కారో ? ఎక్కడ్నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడకి వెళుతున్నారో కూడా తెలియదు.

చావుపుటకలు ఇంతే కదా అనిపించింది.

ఆలోచనల నుంచి బయట పడి చుట్టూ చూశా.

ముందు సీట్లో ఓ యువతి చిన్న బాబు ని ఒళ్లో కూర్చో పెట్టుకుంది. ఆమె పక్కన విండో దగ్గర ఒక పెద్దాయన కూర్చున్నాడు.

ఆ పెద్దాయన మొహం ఎక్కడో చూసినట్లుంది. నిజానికి ఇద్దరు అపరిచితులు మళ్ళి కలుసుకోవడం సాధారణంగా జరగదు. కానీ మెదడు పొరలలో ఏదో గుర్తుస్తోంది..

కండక్టర్ వచ్చి ఎక్కడికి అని అడిగింది , తిలక్ నగర్ ఛే నెంబర్ అని చెప్పా, టికెట్ ఇచ్చింది, తీసుకొని బాగ్ లో పెట్టుకున్నాను

బస్ కదిలిన కాసేపటికీ ఓ ముగ్గురు హడావుడిగా, నెక్స్ట్ స్టాప్ లో దిగడానికి ముందుకి వెళుతున్నారు, ఆ వైపుగా చూస్తే అక్కడ సీట్ ఖాళీ అయింది. అమ్మయ్య అనుకుంటూ వెళ్లి కూర్చున్నాను.

ఆ సీట్లో కూర్చొన్న అమ్మాయి నాకు విండో సీట్ ఇచ్చేసింది. తను ముందుకు వచ్చి కూర్చుంది. చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. కొంచెం సేపు అంతటా నిశ్శబ్దం!

శబ్దాలు ఆగిపోతే ఎంత గొప్పగా ఉంటుందో? ఈ నిశ్శబ్దాన్ని, రోజులో ఒక్క క్షణమైనా అందరూ ఆస్వాదించండి అని ఓ చట్టం వస్తే భలే ఉంటుంది. నా ఆలోచనకు నాకే నవ్వు వచ్చింది.

కిటికీ పక్కనే కూర్చున్నానేమో, చల్లని గాలి మొహానికి తగులుతూ ఉంది ఆ హాయిని, ఆ నిశ్శబ్దాన్ని అనుభవిస్తూ, పారవశ్యం లో ఉన్న నా చెవులకు, వెనుక నుంచి సన్నటి గొంతు, ఒక ఆలాపనలా మృదువుగా, స్వప్నంలో లా మధురంగా వినిపించింది. అంతర్లీనంగా ఏదో తెలియని విషాదం కూడా ధ్వనిస్తోంది ఆ స్వరం లో

‘నందూ ప్లీజ్ రా, అలా అనకు రా’, ప్రేమతో కూడిన అర్థింపు, అవతల వైపు నుంచి, దానికి సమాధానంగా ‘నువ్వు నిద్రపోతున్నావు నందూ, ఎంత పిలిచినా పలకలేదు అందుకే నీకు చెప్పకుండా వచ్చేసినా’ ఆ మాటలకు బదులు ఏమొచ్చిందో మళ్ళి ఏడుపు, అంతలోనే ‘నా బుజ్జి కద, నా కన్నా కదా, ఐ లవ్ యు రా బంగారం, గొంతులో ప్రేమ అంతా నింపుతూ మాటలు. మళ్ళీ, అవతలనుంచి వచ్చిన జవాబుకి ‘ఏంటి నందూ నీకు నేనంటే ప్రేమే లేదు, ప్లీజ్ రా నందూ, ఇప్పుడు ఈ బస్సులోంచి ముద్దు ఎలా ఇవ్వను. అర్ధం చేసుకో.. సరే ..మ్చు..మ్చూ’ అని ముద్దులు పెట్టింది.

మళ్ళి సంభాషణ నడుస్తోంది.

బస్సులో అప్పటికే రష్ పెరిగింది.

ఒక్క క్షణం నేను కంగారు పడ్డాను. అసలు ఎక్కడున్నా నో అర్ధం కాలేదు ?

నా పక్క సీట్లో అమ్మాయి కి నా మొహం లో ఏం భావాలూ కనిపించాయో? ఇయర్ ఫోన్స్ తీస్తూ ఏం జరిగిందన్నట్లుగా చూసింది. ఏం లేదన్నట్లుగా తలూపాను.

ఈ అయోమయం స్థితి లో ముందు సీట్లో కూర్చున్న చిన్నపిల్లాడు ఏడుపు మొదలుపెట్టాడు. పక్కనే ఉన్న ముసలాయన అసహనంగా కదిలి, పిల్లలని ఎలా సముదాయించాలో ఆ పిల్లాడి తల్లికి లెక్చర్ ఇస్తున్నాడు.

పాపం ఆమె కొడుకు ఏడుపుని సముదాయిస్తూ, ఆయనిచ్చే ఉచిత సలహా వింటోంది

అసహనం … ఎస్ గుర్తొచ్చింది. ఈయన్ని బ్యాంకు లో చూశాను. ఆ రోజు లైన్ లో ఉన్నప్పుడు, ఇలాగే .. అసహనంగా.. బ్యాంకు స్టాఫ్ తో అనవసరంగా గొడవపడ్డాడు.

మళ్ళి అలాగే ఇక్కడ కూడా ఈ సారి నాకు ఊరుకోబుద్ధి కాలేదు ‘ముందు, మీరు జరిగి ఆమెకు కిటికీ పక్క సీట్ ఇవ్వండి’ అన్నాను.

ఆమాటకు పక్క సీట్ వాళ్ళు కూడా ‘అవును..అలా చెయ్యండి, బాబు కి గాలి తగిలితే మంచిది’ అన్నారు .

ఆ మాటలకి వెనక్కి తిరిగి నన్ను మింగేసేలా చూస్తూ, ఇక తప్పదన్నట్లు జరిగాడు. ఆ యువతి పిల్లాడిని కిటికీ వైపుకి తిప్పి నించో పెట్టింది

అప్పటికి టైం ఆరున్నర అయింది. మూసాపేట్ బస్ స్టాప్ వచ్చింది. దిగే వాళ్ళు దిగారు. అక్కడ ఎవరూ ఎక్కలేదు. అంతకంతకు పిల్లాడి ఏడుపు ఎక్కువ అవుతోంది. వాళ్ళ అమ్మ నాన్న , మార్చి మార్చి ఎత్తుకుంటున్నారు. వాడు అసలు ఏడుపు ఆపటం లేదు.

నాకు చికాకు అనిపించింది. అంతవరకూ ఉన్న నిశ్శబ్దాన్ని ఆ ఇద్దరూ బద్దలు కొట్టారు.

వెనకాల నుంచి ఈ అమ్మాయి మొగుడు తో మాట్లాడుకునే ఇంటిమేట్ మాటలు పబ్లిక్ గా మాట్లాడుతోంది.

పక్క మీద వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసినవి ఇప్పుడు ఇలా అందరికీ తెలియడం వల్ల వాటి విలువ పోతుందనే గ్రహింపు లేనట్టుంది

ఏడుస్తూ మరీ, ’ఫో నందూ నీకు నేనంటే అస్సలు ప్రేమ లేదు’ అంటూ అలుకలు పోతూ మొదలు పెడుతుంది. ఆ రోజు అది చేయలేదు, మీ అమ్మ తిట్టింది కదా అప్పుడు నన్ను దగ్గరకు తీసుకుంటావు అనుకున్నా, కానీ నువ్వు సైలెంట్ అయ్యావు’ అంటూ అదే మాటలు తిప్పి తిప్పి చెబుతూ ‘ఫోన్ లో బాలన్స్ అయిపొయింది’. అంటూ కొంచెం సేపు ఆపింది .

అప్పుడే సభ్యత కూడా పక్కకు పెట్టి ఆ అమ్మాయిని చూద్దామని వెనుకకు తిరిగా,

ఎంత వద్దన్నా చెవిలోకి ఆ మాటలు వెళుతున్నాయి, ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా ప్రాబ్లం లో చిక్కుకుందా? ఏమయినా సాయం కావాలేమో?, ఇదిగో ఇలాంటి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతోంది.

అసలు నేను ఇక్కడకు వచ్చింది. బావ ఇంటికి. పది రోజుల క్రితం మా మేనత్త పోయారు. ఈ రోజు పెద్దకర్మ అయింది. బావ, వదినలు అందరం కాసేపు కూర్చొని చిన్నప్పటి విషయాలు మాట్లాడుకున్నాము.

నాన్నగారి కి ఒక్కతే చెల్లెలు. నాన్న పోయాక ఆవిడే మాకు పెద్ద దిక్కు ఇప్పుడు ఉన్న ఒక్క అనుబంధం కూడా తెగిపోయిందే అని బాధ, దుఖం కూడా వచ్చాయి.

ఆ ఆలోచనలతో ఉన్న నాకు ఈ అమ్మాయి మాటలు తెలియని చికాకు కలిగిస్తున్నాయి

పోనీ తను ఎలా ఉందో చూద్దామనుకుంటే ఆ అమ్మాయి మొహాన్ని కప్పేస్తూ, వళ్ళో ఒక పెద్ద బ్యాక్ ప్యాక్ ఉంది. వాటి మీద చేతులు వేసి కిటికీ వైపు పూర్తిగా ఒదిగి ఉంది.

తను వేసుకున్న బేబీ పింక్ డ్రెస్, పక్క నుంచి కనిపించే చెక్కిలితో పోటీ పడుతోంది.

ఇద్దరు కూర్చొనే ఆ సీట్లో ముగ్గురు కూర్చొన్నారు.

పిల్లాడు మళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు.

నిండుగా, కిక్కిరిసి ఉన్న ఆ బస్సులో గాలి రావటం లేదు. పాపం ఆ చిన్నపిల్లవాడికి ఊపిరి అందటం లేదు. చొక్కా విప్పి, నించో పెట్టినా వాడు ఏడ్పు ఆపటం లేదు.

మంచి నీళ్ళు పట్టారు, చాకొలేట్ ఇచ్చారు, వాడి ఏడుపు ఆపే అన్నీ ప్రయత్నాలు చేశారు తల్లి, తండ్రి, నాయినమ్మ కూడా. అయినా దేనికి లొంగలేదు.

ఇంక వాళ్ళ నాన్నకు విసుగు వచ్చి, ‘వచ్చే స్టాప్ లో దిగి బాబు నేను వస్తాం. మీరు వెళ్ళిపొండి’ అని భార్యకి, తల్లికి చెప్పాడు.

వాళ్ళు సరే అన్నారు.

పక్క ప్రయాణికులు కూడా ‘అదే మంచిదిలే, లేకపోతె పిల్లవాడు ఏడ్చి ఏడ్చి సృహ తప్పేలా ఉన్నాడు’ అని అన్నారు.

కొంతసేపటికి లకడికాపూల్ స్టాప్ లో అతను పిల్లాడి తో సహా దిగిపోయాడు. భార్యకి, తల్లికి జాగర్తలు చెబుతూనే ఉన్నాడు దిగేవరకు

అమ్మయ్య ఆ తల్లికి కాస్త రిలీఫ్.

పిల్లవాడి ప్రహసనం ముగిసినా నా వెనుక అమ్మాయి కధ కంటిన్యూ అవుతూనే ఉంది.

ఆ అమ్మాయి మళ్లీ ఫోన్ లో మాట్లాడుతోంది.

ఒక రోజు రాత్రి వాళ్ళ ఊళ్ళో అందరూ డాబా మీదకి వెళ్లి పడుకున్నప్పుడు ఆ వెన్నెల్లో అతను మొదట ఎక్కడ చూసాడో, ఆ విషయాన్ని యెంత రొమాంటిక్ గా చెప్పాడో గుర్తు చేస్తూ ‘ఇప్పుడు నా మీద ప్రేమ తగ్గి పోయింది నీకు అంటూ’ మళ్ళి ఏడుస్తుంది.

ఆ అమ్మాయి వ్యవహారం చికాకుగా ఉన్నా, ఏం చెయ్యలేని స్థితి. ఆ మాటలతో ఆమెని ఊహించుకుంటున్నాను. ఏదో నవలలో రచయిత వర్ణించినట్లు “అరవిరిసిన మల్లెపువ్వులా ఆమె అందంగా వంగి చుక్కల ముగ్గులు పెడుతూ, భలే గమ్మత్తుగా వేళ్లు తిప్పుకుంటూ ఆ చేత్తోనే నుదుట అల్లరి చేసే అలకలు అలవోకగా సర్దుకుంటూ, ముగ్గంతా పూర్తి కాగానే అంతదాకా పాడుతున్న కూని రాగాన్ని హఠాత్తుగా ఆపి అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోవడం”

హటాత్తుగా నా ఊహలకి బ్రేక్ వేస్తూ వెనకాల నుంచి ఆ అమ్మాయి “ఆ నేనే ఇంటికి వస్తున్నా, చాల సామాను ఉంది. బస్సు స్టాప్ కి ఎవరినన్నా పంపు. ఇంటికి వచ్చి చెబుతా .. ఆ అదే లాస్ట్ స్టాప్’ అంటోంది.

ఈ అమ్మాయి ఇల్లు ఉప్పల్ కాబోలు. అక్కడ దిగుతుందన్నమాట

అది విన్న నాకు ఈ హడావుడిలో నేను దిగాల్సిన స్టాప్ మర్చిపోతానేమో అన్న భయం తో, కండక్టర్ ని అడిగా ఛే నెంబర్ స్టాప్ వచ్చినప్పుడు చెప్పండి అని .

ఆ లేడీ కండక్టర్ నా వేపు నవ్వుతూ చూసి “ఇప్పుడు వచ్చేది నారయణగూడా, ఇంకా టైం ఉందని” చెప్పి వెళ్ళిపోయింది.

నిజానికి ఈ బస్సు ఎక్కినప్పటి నుండి నన్ను నేను మర్చిపోయాను. నాకో ఇల్లు, సంసారం ఏమి గుర్తుకి రావటం లేదు. ఏదో మాయ కమ్మినట్లు ఉంది. అప్పుడు బాగ్ లోంచి ఫోన్ తీసి చుస్తే పది మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఆయన దగ్గర్నుంచి.

ఎందుకైనా మంచిదని డేటా ఆన్ చేసి వాట్సప్ ఓపెన్ చేస్తే బోలెడు మెసేజ్స్ ఉన్నాయి. అఖిల్ దగ్గరనుంచి, సియాటల్ నుంచి అరుణ్ కూడా మెసేజ్ చేసాడు.

అందరి సారాంశం ఒక్కటే! అమ్మా ఎక్కడున్నావు ? అదీ రకరకాల ఎమోజీ లతో

‘అబ్బా!’ అనుకుని ముగ్గురికి కలిపి అరగంటలో ఇంట్లో ఉంటా అని మెసేజ్ చేసి ఆవి వాళ్ళు చూశారని బ్లూ టిక్స్ ద్వారా కన్ఫం(confirm) చేసుకున్నాక ఫోన్ లోపల పెట్టాను.

అప్పటికి బస్సు కోరంటీ హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. అంటే వచ్చే స్టాప్ నాదే!

ఈ స్టాప్ లో చాల మంది ఎక్కారు. బహుశా హాస్పిటల్ కి వచ్చిన వాళ్ళయి ఉంటారు

అప్పుడయినా ఆ అమ్మాయి ని చూడాలని వెనక్కి చూశా! ఉహు.. లాభం లేదు ఆ అమ్మాయి మొహం అంతా చున్నీ కప్పేసుకొని కిటికీ లోంచి బయటకు చూస్తోంది.

మరో ఐదు నిమిషాలకి కండక్టర్ వచ్చి ‘మేడం మీ స్టాప్ వస్తోంది’ అని చెప్పింది. ఆమెకి థాంక్స్ చెప్పి ముందుకు వెళ్లి నిలబడ్డాను.

స్టాప్ వచ్చింది. దిగి ఆటో కోసం చూస్తున్నాను.

రాత్రి ఎనిమిది గంటలు

ఖాళీగా వెళుతున్న ఆటో ని ఆపి ఇంటి అడ్రస్ చెప్పిఎక్కేసాను.

కొద్ది క్షణాలకి గాని నాకు గుర్తుకు రాలేదు. అరెరే, ఇప్పుడయినా ఆమె మొహం చూడలేదే అనుకున్నాను. ఆ క్షణం లో అనిపించింది బస్సు లో ఉన్న రెండుగంటలు కూడా ఎక్కువగా ఆమె గురించే ఆలోచించాను.

ఎప్పుడయితే బస్ దిగానో అప్పుడు నా గురించి ఆలోచించడం మొదలు పెట్టాను.

ఆటో దొరుకుతుందా? రాత్రి తినడానికి ఏం చేసుకోవాలి. ఇ..లాం..టివి.

ఆమెతో ఉన్నంత సేపు అలోచించి, కనుమరుగయ్యే.సరికి మర్చిపోయాను.

అప్పుడు స్పురించింది. మనిషి జీవితం కూడా ఇంతే కదా! ఉన్నంత సేపే. తరువాత ఏమీ ఉండదు.

అంతా…..

……….బ్లాంక్.

మణి వడ్లమాని

మణి వడ్లమాని: స్వస్థలం రాజమండ్రి .బి.కాం చదివి కొంతకాలం హెచ్ ఆర్ రంగం లో పని చేశారు. సాహిత్యాభిలాష ఉన్న కుటుంబ వాతావరణం కావడం వల్ల చిన్నతనం నుండే చదువరి. అదే ఇప్పుడు రచనలు చేయడానికి ఉత్ప్రేరకం అయింది. ఇప్ప దాక దాదాపు 60 కధలు రెండు నవలలు రాసారు. ఇటివలే కొత్తకథ -2018), యుద్ధనపూడి సులోచనారాణి గారి స్మరణ సంకలనం లో వీరి కధలు చోటు చేసుకున్నాయి. కొన్ని కధలకు బహుమతులు కూడా అందుకున్నారు. ఒక కధా సంపుటి ‘’ వాత్సల్య గోదావరి ని , ఒక నవల 'కాశీ పట్నం చూడరబాబు' జాగృతి వార పత్రికలో వచ్చిన ధారావాహికను పుస్తకాలుగా వెలువరించారు.

9 comments

 • కథ చాలా బాగుంది. మీ ఆఖరి పేరా హైలైట్.
  ‘ఇవాళ పోతే రేపు రెండో రోజు’ అని సామెత.

 • కాల ప్రవాహం లో పడి తిరుగుతూ ఉంటాం కదా మనమంతా

 • బ్రతుకంటేనే ఒక బండి ప్రయాణం. అనుభవాలే జీవన సారం. అని అర్ధమయ్యేలా చెప్పారు కథని.
  బావుందండి.
  అభినందనలు.
  ఆర్.దమయంతి

 • ఎనిమిదేళ్ల క్రితం ఆఫీసుకి వెళ్ళేప్పుడు ఇదే బస్సు ఎక్కి పంజాగుట్ట లో దిగి, నాగార్జునహిల్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళడం, మళ్ళి సాయంత్రం ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ వరకు ఆటో లో వెళ్లి అక్కడ ఈ 113k బస్ కోసం వెయిట్ చెయ్యడం, అప్పుడు పడిన అవస్థలు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి.
  నిజం చెప్పద్దూ ఏదో పంతంతో నించున్నాను కానీ, గత పదేళ్లుగా అస్సలు బస్ ఎక్కలేదు.

 • “చివరగా వచ్చిన బస్సు లింగపల్లి నుండి ఉప్పల్ పోయే 113K, అది మెట్రో ఎక్ష్ప్రెస్స్. అమ్మయ్య అనుకొని ఎందుకైనా మంచిదని డ్రైవర్ ని అడిగి మరీ ఎక్కాను. అప్పటికి టైం ఆరున్నర అయింది. మూసాపేట్ బస్ స్టాప్ వచ్చింది.” -ఉప్పల్ వెళ్లే దారిలో మూసాపేట్ ఎలా వచ్చింది?

  “ఆమెతో ఉన్నంత సేపు అలోచించి, కనుమరుగయ్యే.సరికి మర్చిపోయాను. అప్పుడు స్పురించింది. మనిషి జీవితం కూడా ఇంతే కదా! ఉన్నంత సేపే. తరువాత ఏమీ ఉండదు. అంతా…..……….బ్లాంక్.” -అదే కదా జీవితం. ఆత్మీయులు మరణించినప్పుడు కాలం స్థంభించినా, ఏదీ ఎవరికోసం ఆగదు. జీవిత సత్యం ఎంత చక్కగా చెప్పారు?

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.