బ‌తికే హ‌క్కుకి బ‌తుకెక్క‌డ‌? (కె. బాబూరావుతో ముఖాముఖి)

  • యురేనియం భూమిలో ఉంటేనే భ‌ద్ర‌త‌
  • తుమ్మలపల్లిలో యురేనియం ఖనిజం తవ్వ‌కాలు ఆ ప్రాంతానికి శాపమే
  • పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే వృత్తులకు బదులుగా ఉద్యోగాలు
  • ప్రస్తుత ధోరణి కొనసాగితే మనిషి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మే

– మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త కె.బాబూరావు

వ్యాపారమే ప్రాధమిక హక్కుగా మారిన వేళ బ‌తికే హక్కుకి బ‌తుకెక్కడ.. అని హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త కె.బాబూరావు ఆవేద‌న‌. ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌గా, మాన‌వ హ‌క్కుల ఉద్య‌మ‌కారుడిగా నిరంత‌రం సంచ‌రిస్తూ వాటి ప‌రిర‌క్ష‌ణ కోసం పోరాడ‌డం బాబూరావు వృత్తి, ప్ర‌వృత్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని వేముల స‌మీపంలో UCIL అధ్వర్యంలో నెల‌కొల్పిన యురేనియం మైనింగ్ వ‌ల్ల అన‌ర్థాల‌ గురించి ప్రజలను చైత‌న్య‌ప‌ర‌చ‌డంతో పాటు పాల‌కుల ద్వంద్వ ప్ర‌మాణాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. ప్ర‌జ‌లే త‌మ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు ఉద్య‌మించాల‌ని పిలుపునిస్తున్నారు. ప్రజా పాత్రికేయులు సోదుం రమణా రెడ్దితో మాట్లాడుతూ అణు ఉత్పాద‌కాలు క‌లిగించే అన‌ర్థాల్ని వివరించారు.

అణు ఉత్పాద‌కాల‌తో ఎదురైన స‌మ‌స్య‌లేంటి?

బాబూరావుః అణు కేంద్రంలో అనంత శక్తి కేంద్రీకృతమై వుంటుంద‌ని, దాన్ని విచ్ఛిన్నం చేసి అపార శక్తిని ఉత్పత్తి చేయ‌వ‌చ్చ‌ని  ఐన్ స్టీన్ మహాశయుడు ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం ఆధారంగానే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణు బాంబు తయారయ్యింది. జపానుపై ప్రయోగించి అప్పటికి కనీ, వినీ ఎరుగని మారణహోమం సృష్టించారు. అణుబాంబు సృష్టికర్తలైన శాస్త్రవేత్తలు తమ మేధాశక్తి కలిగించిన విషాదానికి ఖిన్నులై అణుబాంబులను వ్యతిరేకించడం ప్రారంభించారు. అణ్వాయుధాల పోటీ పెరిగి సముద్ర గర్భంలో, వాతావరణంలో అణ్వాయుధ పరీక్షలు పెచ్చుమీరడంతో ప్రముఖ శాస్త్రవేత్తలెందరో పరీక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఫలితంగా  1963, ఆగస్టులో మొదట మూడు దేశాలు ‘పాక్షిక అణు పరీక్ష నిషేధ ఒప్పందం’, తరువాత 1996 లో 183 దేశాలు ‘సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం’ చేసుకున్నాయి.

ప్రపంచ ప్రజలలో అణ్వాయుధాలపై వ్యతిరేకతను అధిగమించడానికి 1953 లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ “శాంతి కోసం అణువు” ప్రతిపాదనతో అణుశక్తి ఉత్పత్తికి నాంది పలికారు. అనతి కాలంలోనే అణుశక్తి ఉత్పత్తిలో ఉత్పన్నమయ్యే సమస్యలు బయట పడ్డాయి, ఘోర ప్రమాదాలు జరిగాయి. వీటిని గమనించిన ప్రముఖ శాస్త్రవేత్తలు జార్జి కిస్తియాకౌస్కి, థియడోర్ టేలర్, హెర్బర్ట్ స్కోవిల్, జార్జి రాథ్ జెన్స్, బెర్నార్డ్ ఫెల్డ్ లు 1976 లో అణ్వాయుధాలూ, అణు శక్తీ ఒకే నాణేనికి బొమ్మ-బొరుసు లాంటి వనీ, అణుశక్తి ఉత్పత్తి జరిగినంత కాలం అణ్వాయుధాలను అరికట్టలేమని ప్రకటించారు.

ప్రధానంగా ఏ దేశమూ వాడేసిన అణు ఇంధనాన్ని శుధ్ధి చేసే కర్మాగారాలను అమ్మకూడదు.

అణు బాంబు తయారీకి అవసరమైన ప్లుటోనియం వున్న, వాడిన అణు ఇంధనాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణలో వుంచాలని వారు సూచించారు. లేదంటే అణుయుద్ధ ప్రమాదాన్ని ఆపలేమన్నారు.

 

వైఎస్ఆర్ కడప జిల్లాలో UCIL నిర్వహణలో ఉన్న యురేనియం మైనింగ్‌ను మీరు గత కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు ప్రధాన కారణాలేమిటి?

బాబూరావుః  యురేనియం భూమిలో ఉండడమే భద్రం. దాన్ని తవ్వి వెలికి తీసి శుధ్ధి చేసే క్రమంలో జరిగే కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో బలిగొంది. ఇంకా పరిసర ప్రజలను రకరకాల యిక్కట్ల పాలు చేస్తూనే వుంది. ఆస్ట్రేలియాలో ఆదిమ తెగల ప్రజలూ, అమెరికాలో నవాహో తెగ జాతీయ అమెరికన్లూ, కెనడా, ఆఫ్రికాలలోని వివిధ తెగల ప్రజలూ యురేనియం తవ్వకాల వల్ల అనుభవించిన వ్యధలపై వచ్చిన వార్తలనూ, నివేదికలనూ, అధ్యయన సాహిత్యాన్ని చదివిన వారెవరూ తవ్వకాలను సమర్ధించ లేరు. బాధితులు ప్రధానంగా బలహీన వర్గాల బీదలు. వీరు యురేనియం తవ్వకాల వల్ల పొందిన ప్రయోజనాలు శూన్యం, అనారోగ్యం, ప్రమాదాలు అధికం. యురేనియం తవ్వకాలు జరిగిన ప్రతి చోటా నీటి కాలుష్యం, వాయు కాలుష్యం విస్తారంగా జరిగాయి. మన దేశంలోని జాదుగూడ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలు  యురేనియం తవ్వకాల వ‌ల్ల అనుభవిస్తున్న విషాదం దయనీయం. ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి యురేనియం కార్పొరేషన్, ప్రభుత్వ వ్యవస్థలు చేస్తున్న ప్రయత్నం అమానవీయం. దీన్నే ‘పర్యావరణ అన్యాయం’ అంటారు. తుమ్మలపల్లిలో యురేనియం ఖనిజం తవ్వి, దాన్ని శుధ్ధి చేసి యురేనియం ను తయారు చేసినపుడు వచ్చే అణు ధార్మిక వ్యర్ధాలు ఆ ప్రాంతానికి శాపంగా మారతాయనీ, వందల వేల సంవత్సరాలు ప్రజలకు హాని చేస్తూనే వుంటాయనీ, భూగర్భ జలాలు కలుషితమౌతాయ‌ని, అడుగంటుతాయనీ తెలిసి, దాన్ని వ్యతిరేకించాల్సిన‌ అవసరాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం.

ప్ర‌శ్నః యురేనియం తవ్వకాల వల్ల‌ ఏ ఏ దశలో ఏ విధంగా పర్యావరణంపై గానీ, గని కార్మికులపైన గాని, స్థానిక ప్రజలపైన గాని దాని ప్రభావం ఉంటుందో వివరిస్తారా?

బాబూరావు: గనిలో తవ్వకాలు మొదలు పెట్టినపుడు కార్మికులు సిలికా ధూళి ప్రమాదానికి గురౌతారు. తవ్వకాలు యురేనియం ఖనిజ పొరను చేరే సరికి రాడాన్ వాయువు తదితర అణుధార్మిక పదార్ధాల ప్రమాదం వుంటుంది. వాటి వ‌ల్ల క్యాన్సర్, నపుంసకత్వం వస్తాయి. భూగర్భ జలాలు గనిలోకి కారి పోయి నీటి పొరలు అడుగంటు తాయి. దాంతో ప్రజలకు నీటి లభ్యత, తరువాత నాణ్యతా సమస్యలు మొదలవుతాయి. ఖనిజాన్ని గని నుంచి మిల్లుకు ట్రక్కుల ద్వారా తరలించే సందర్భంలో వాయు కాలుష్యం, అణుధార్మిక పదార్ధాల విస్తరణ జరుగుతాయి. కన్వేయర్ బెల్టులపై తరలిస్తే ఈ ప్రమాదం తగ్గుతుంది. మిల్లులో మొదట ఖనిజాన్ని పొడిగొడతారు. అప్పుడు ధూళికి కార్మికులు శ్వాస కోశ వ్యాధులు పొందే ప్రమాదం వుంది. ఖనిజాన్ని శుద్ధి చేసే క్రమంలో వివిధ రసాయనాలను వాడతారు. పెద్ద మొత్తంలో ఘన వ్యర్ధాలు మిగులుతాయి. రసాయనాలతో కూడిన ఘన వ్యర్థాలని ఒక వ్యర్ధాల చెరువులో పోస్తారు. వ్యర్ధాల చెరువులతో తీవ్ర సమస్య లుంటాయి. రసాయన నీరు ఇంకి భూగర్భ జలాలు కలుషితమౌతాయి. చెరువు కట్టలు తెగి ఘన అణుధార్మిక వ్యర్ధాలు పరిసరాలకు ప్రవహించి ధన ప్రాణ నష్టం కలిగించిన ఉదంతాలెన్నో. చెరువు నుంచి నిరంతరంగా అణుధార్మిక కిరణాలు వెలువడుతూనే వుంటాయి. అవి పరిసర ప్రజలకు అనారోగ్యాన్ని ప్రసాదిస్తాయి.

ప్ర‌శ్నః ప్రజలు కోల్పోతున్న భూమికి తగిన నష్ట పరిహారం చెల్లిస్తున్నామని, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాల వాదన. అసలు ప్రభుత్వాలు ఇచ్చే నష్ట పరిహారాన్ని ఏ విధంగా చూడాలంటారు?

బాబుః ఇది నయా ఉదారవాద వాదన. అన్నిటినీ విలువకట్టగలిగిన వస్తువులుగా చూసే తాత్విక దృక్పధం నుంచి పుట్టిన వాదం. జీవులకు  ప్రకృతి అందించే సేవలకు విలువ ఎలా కడతాం? అ సేవల విధ్వంసం జరిగినపుడు ఆ లోటును డబ్బులతో భర్తీ చేయగలమా? అమెరికా ఆదివాసి తెగల ముఖ్య నేత సియాటిల్ అమెరికా అధ్యక్షుడికి 1852లో రాసిన లేఖలో చెప్పినట్లు, “గాలి తాజాదనానికీ, నీటి ధగధగలకీ యజమానులం కానపుడు వాటినెలా అమ్మగలం.” ప్రకృతి పై ఆధిపత్యమే ప్రగతి అని ఆధునిక పారిశ్రామిక నాగరికత నుంచి సంక్రమించిన దౌర్భాగ్యపు ఆలోచనా ధోరణే, ప్రజలను భూమి నుంచి తొలగించి పరిహారంగా డబ్బివ్వ వచ్చనే విధానాలకు కారణం. ఉద్యోగమనేది ఉత్పత్తి విధానానికి ప్రతీక. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే వృత్తులకు బదులుగా ఉద్యోగాలొచ్చాయి. మానవ సమాజ మెప్పుడూ స్థిరంగా లేదు. మార్పు అనివార్యం.

ప్ర‌శ్నః పర్యావరణ విధ్వంసాన్ని లెక్కగట్టే కొలబద్ద ఈ ప్రభుత్వాల వద్ద ఉందంటారా?

బాబూరావు: ప్రస్తుత ఆర్ధిక విధానంలో పర్యావరణానికి స్థానంలేదు. వ్యర్ధాల చెరువున్న కొట్టాల గ్రామం ఆ పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు విషమయం అయ్యాయి. దానికి యు సి ఐ ఎల్‌ను జవాబుదారీ చేసి, నీటిని శుధ్ధి చేయించే విధాన మేమీ లేదు. పర్యావరణ విధ్వంసాన్ని జాతీయం చేసి, కంపెనీలు లాభాలు దండు కోవడాన్ని సుగమం చేయడమే ప్రభుత్వాల విధానం. సామాన్య ప్రజల జీవన భద్రతతో ప్రభుత్వాలకు పని లేదు. ప్రజల తరపున మీరెన్ని వాదనలు చేసినా UCIL మాత్రం అవన్నీ సత్యదూరమని కొట్టి పారేస్తుంది.

ప్ర‌శ్నః ఒక‌వేళ UCIL పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు గత ఏప్రిల్ లో BARC నుంచి కొందరు అధికారులు వచ్చినప్పుడు, వాళ్లతో మీ వాదన వినిపించకుండా మిమ్మల్ని, మానవ హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ జయశ్రీ గారిని వేముల పోలీస్ స్టేషన్ లో నిర్బంధించాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది?

బాబూరావు: అవినీతిలో కూరుకు పోయిన యు సి ఐ ఎల్ అధికారులు, సాంకేతిక పరంగా అసమర్ధులు కూడా. నిర్మాణ, నిర్వహణ విషయాలలో ఎన్నో తప్పులు చేశారు, చేస్తున్నారు. సరిదిద్దుకోవడానికి బదులుగా అణుశక్తి వ్యతిరేక ఎన్ జి ఒ పెనుభూతాన్ని సృష్టించి, తమ విధి నిర్వహణకు విఘాతం కల్పిస్తున్నారనే కల్పిత కధతో, బుర్ర లేని జిల్లా అధికారుల మద్దతు కూడగట్టుకుని, ప్రజలకు ప్రశ్నించే అవకాశం కల్పిస్తే తమ లొసుగులు బయట పడతాయనే భయంతో మ‌మ్మ‌ల్ని అడ్డుకుని, నిర్బంధంలోకి తీసుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. కంపెనీ నడుపుతున్న అధికారులకు BARC సహాయం అవసరమైనపుడు, బాధిత ప్రజలకు సహాయం అవసరముండదా అన్న ఇంగిత జ్జానం జిల్లా అధికారులకు లేక పోవడం శోచనీయం.

ప్ర‌శ్నః టైలింగ్ పాండ్ నిర్మాణం, నిర్వహణలోనూ UCIL సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటున్నారు. దాని గురించి కొంచెం వివరిస్తారా?

బాబూరావు: ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం, వ్యర్హాల చెరువు, రూప కల్పన, నిర్మాణం, నిర్వహణ విషయాలలో పర్యావరణ మంత్రిత్వ శాఖ, అంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, అణుశక్తి నియంత్రణ సంస్థలకు సమగ్ర నిబంధనలు లేవు. నిబంధనలే లేనపుడు సరైన జాగ్రతలకు నిర్వచనమే వుండదు. యు సి ఐ ఎల్ అధికారులు తమ మిడి మిడి జ్జానంతో వ్యర్ధాల చెరువును మునిసిపల్ చెత్తకుప్పలాగా నిర్వహిస్తున్నారు. అడిగే నాధుడు లేక కట్టుకధలు చెబుతున్నారు.

కాలుష్య నియంత్రణ మండలి అర మీటరు మందం బెంటోనైట్ మట్టి పూత పొర, దానిపైన హెచ్ డి పి ఇ  పొరని కప్పమని ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయక నేలపైనే వ్యర్థాల‌ను కుమ్మరించడం చేస్తూ వచ్చారు. దాని పర్యవసానమే భూగర్భ జల కాలుష్యం. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను అమలు పరచినా భూగర్భ జలాలు తక్కువ మేర కాలుష్య మయ్యేవి అన్నది మరో విషయం. ఎందుకంటే, కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలకు శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. అ రంగంలో ప్రావీణ్యం ఉన్నవారు, యు సి ఐ ఎల్ లో లేరు, నియంత్రణ సంస్థలలోనూ లేరు.

ప్ర‌శ్నః టైలింగ్ పాండుకు కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లె గ్రామంలో నవ్వలు ఎక్కువయ్యాయని , పశువులు చనిపోతున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనికి రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉండటమే కారణమై ఉంటుందంటారా?

బాబూరావు: కొట్టాల గ్రామంలో పిల్లలకు, పెద్ద వాళ్ళకు చర్మవ్యాధులు అధికంగా ఉన్నాయనే సమాచారం వుంది. మాకు కొన్ని ఫొటోలు కూడా పంపారు. ఇప్పుడు ఎవరి దగ్గరా మేకలు లేవు. చనిపోయిన‌వి పోగా మిగిలిని వాటిని చనిపోతాయనే భయంతో ముందుగానే అమ్మేశారు. వృత్తి పరమైన అనారోగ్యాలలో చర్మవ్యాధులది అగ్ర తాంబూలం. ఇవి రేడియేషన్ డెర్మాటిటిస్ నుంచి కలిగే నవ్వలు (దురదలు) కావచ్చు. యు సి ఐ ఎల్ గ్రామాలలో రేడియేషన్ స్థాయి సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు తప్పుగా యిస్తోంది. వారి నిర్వహణ అబద్ధాల పునాదులపైనే.

ప్ర‌శ్నః నీళ్లు వ్యవసాయానికే కాకుండా తాగడానికి కూడా పనికిరాకుండా పోయాయంటున్నారు. పొలాల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఉప్పు మేట వేసి అరటి తోటలు దెబ్బ తింటున్నాయి. దానికి కారణం యురేనియం తవ్వకాలేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అది ఎంతవరకు వాస్తవమంటారు?

బాబూరావు: పూర్తి వాస్తవం. ఐతే అధికార వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ యు సి ఐ ఎల్ ను బాధ్యులను చేయడానికి అవసరమైన నిర్ద్వంద సమాచారాన్ని సేకరించడానికి ఏర్పాట్లు చేయడం లేదు.

ప్ర‌శ్నః ఈ సమస్యలపై జిల్లా అధికారుల స్పందనేమిటి?

బాబూరావు: నేను కలెక్టర్లకు ఎన్నో లేఖలు రాశాను. సమాచారం పంపాను. కాని ఎలాటి చర్యలూ లేవు. ఇంతకు ముందు కలెక్టర్‌ను అయన పేషీలో కలిశాను. కొంచెం విని వేరే సమావేశం వుంది, మా ఎఒకి చెప్పండి అని వెళ్లి పోయాడు. ప్రస్తుత కలెక్టర్‌తో మాట్లాడిన ప్రజల నుంచి నాకు వచ్చిన సమాచారం ప్రకారం, సమస్య తీవ్రత వాళ్ళకు అర్ధమైంది. కాని, కంపెనీ తప్పుడు ప్రచారపు భ్రమ నుంచి బయట పడలేక పోతున్నారు. ఇది దేశ రక్షణకు అత్యవసర పరిశ్రమ. దానిని ఎలాగైనా కొనసాగించాలనే ఆలోచన ప్రబలంగా వున్నట్లు ప్రజల అభిప్రాయం. యురేనియం ఉత్పత్తితో దేశ రక్షణ జరగదు. నిజమైన దేశ రక్షణ బలమైన ప్రజాస్వామ్య నిర్మాణంలో వుంటుంది. కేవలం అయుధాలలో కాదనే సదవగాహన వారికే కలగాలి.

ప్ర‌శ్నఃఇంతా చేసి ఇక్కడ ఉత్పత్తి అవుతున్న యురేనియంను విద్యుత్ ఉత్పాద‌న‌ కోసం వినియోగిస్తున్నాం అంటున్నారు. అందుకు ప్రత్యామ్నాయమైన సౌర, పవన విద్యుత్ పై ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టవు?

బాబూరావు: అణు విద్యుత్ పరిశ్రమ ఆంపశయ్యకు జేరిన సమయంలో, భూతాపం ప్రమాదం ప్రధాన అంశంగా ప్రభుత్వాల ముందుకు  రావడంతో, ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా అణుశక్తి పునరుజ్జీవం పొందడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే భారత ఇంధన విధానంలో అణుశక్తికి కల్పించిన పునః వైభవం. ఐనా ప్రపంచవ్యాప్తంగా మొత్తం విద్యుదుత్పత్తిలో అణువిద్యుత్ భాగం తగ్గిపోతోందే త‌ప్ప‌ పెరగడంలేదు. వేగంగా తగ్గిపోతున్న సౌర, పవన విద్యుత్ నిర్మాణ వ్యయం, విద్యుత్ ధర తాకిడికి ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా అణు విద్యుత్ పరిశ్రమ నిలువ జాలదు. ప్రభుత్వాలని నడిపే రాజకీయ నేత‌లది  హ్రస్వదృష్టి. ఎన్నికల నుండి ఎన్నికల వరకూ ప్రజ‌లను ఏ పార్టీ ఎంత విజయవంతంగా మభ్య పెట్టగలదో వారిదే అధికారం. వారి విధానాలు అందుకు తగ్గట్టు గానే వుంటాయి.

ప్ర‌శ్నః ప్ర‌జలు తిరగబడి వాళ్ల హక్కులకోసం పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాల నిరంకుశ వైఖరిలో మార్పుండదని మీరంటుంటారు. కానీ ప్రజలు రాజకీయ పార్టీల ప్రాతిపదికగానో మరో రకంగానో చీలిపోయిన సంక్షోభ సందర్బంలో వాళ్లను సంఘటితం చేసే పాత్ర ఎవరు పోషించాలి(ఉద్యమకారులు, ప్రజా సంఘాలు)?

బాబూరావు: ప్రజలు తమ ఓటు ద్వారా తమ సార్వభౌమాధికారాన్ని తామెన్నుకున్న ప్రతినిధులకు కట్టబెడుతున్నారు. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా నిరంతర నిఘా ఉన్నపుడే ప్రజాస్వామ్యం బలంగా వుంటుంది. కాని ఇప్పుడు రాజకీయానిది పైచేయిగా వుంది. మేథావి వర్గం రాజకీయ వంధిమాగధంలో జీవిస్తోంది. రేపు ఆశాజనకంగా లేదు. కాని ప్రస్తుత నాగరికతకు కాలం చెల్లిందన్న సంకేతాలెన్నో. భువిపై మానవ మనుగడ కొనసాగాలంటే నూతన మానవ సమాజ నిర్మాణం అనివార్యమని చెబుతోంది సైన్స్. ఈనాటి ఆర్ధిక, సామాజిక సంబంధాలు ప్రకృతి నియమాలకు కట్టుబడి లేవు. ప్రకృతి సూత్ర బద్ధంగా నడుచుకునే సమాజానికే రేపు అనేది వుంది. ప్రస్తుత ధోరణి కొనసాగితే మనిషి ఈ శతాబ్దం దాటగలడా… అన్న అందోళన ప్రముఖ శాస్త్రవేత్తలను కలవర పరుస్తోంది.

ప్ర‌శ్నః యురేనియం మైనింగ్ వల్ల తలెత్తే విధ్వంసకర పరిణామాలను ఇది వరకే ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల స్థానికులు చవి చూశారు. మనదేశంలోకి వస్తే జాదూగూడలో స్థానిక ఆదివాసీలు ఈ మైనింగ్ వలన జన్యుపర సమస్యలను ఎదుర్కొంటున్నారని International Doctor’s for Peace and Development అనే నోబుల్ బహుమతి పొందిన ప్రతిష్టాత్మక సంస్థ ఆరోపిస్తోంది. అలాంటి విషమ పరిస్థితులు తుమ్మలపల్లె యురేనియం తవ్వకాల వలన చుట్టు పక్క ప్రాంతాలలో నెలకొనవచ్చా?

బాబూరావు: పదార్ధం దాని భౌతిక, రసాయన ధర్మాల ప్రకారమే తన ప్రభావాన్ని చూపుతుంది. మనుషుల లాగా కుటిల లౌక్యం చూపదు. అణు వికిరణం ఎక్కడైనా జీవులకు ప్రమాదకరమే. తుమ్మలపల్లిలో ప్రభావాలు భిన్నంగా ఉంటాయనుకోవడం భ్రమ. ఇప్పటికే కొందరు గని కార్మికులు  క్యాన్సర్ వ్యాధితో కాలం చేశారు. మున్ముందు పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగా మారతాయి. అసమర్ధ నిర్వహణ, నియంత్రణ సమస్యను జటిలం చేస్తాయి.

ప్ర‌శ్నః ఇవ్వన్నీ చూస్తుంటే మన రాజ్యాంగం పౌరులకిచ్చిన ప్రాథమిక హక్కైన ‘బతికే హక్కు’ను కాపాడవలసిన ప్రభుత్వాలే దాన్ని కాలరాస్తున్నట్లు అనిపిస్తోంది!

బాబూరావు: జీవించే హక్కు ఇప్పటికే “సులభతర వ్యాపార” విధానం (Easy of doing business) ముందు వీగి పోయి బలి పీఠమెక్కింది. వ్యాపారమే ప్రాధమిక హక్కుగా మారిన వేళ బ‌తికే హక్కుకి బ‌తుకెక్కడ?

ప్ర‌శ్నః దీనికి పరిష్కార మార్గమేమైనా ఉందా?

బాబూరావు: మనది ప్రేక్షక ప్రజాస్వామ్యం. మైఖేల్ మూర్ అన్నట్లు “ప్రజాస్వామ్యం చూసే ఆట కాదు. అది పాల్గొనే ఘటన. మనం పాల్గొనక పొతే అది ప్రజాస్వామ్యమే కాదు.” (Democracy is not a spectator sport, it’s a participatory event. If we don’t participate in it, it ceases to be a democracy.) పాల్గొనడమే పరిష్కారం.

ప్ర‌శ్నః మీ నేపథ్యం ఏమిటి? మీరు ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రయాణానికి కారణమైన పరిస్థితులేమిటి?

బాబుః నేను స్వతంత్ర భారతంలో సామాన్య రైతు కుటుంబంలో చిన్న వాడిగా పుట్టాను. అప్పుడే విద్యావకాశాలు గ్రామాలకు చేరుతున్న నేపధ్యంలో బడికి వెళ్లే అవకాశం వచ్చింది. అప్పటికే మా పైతరం బోధనా రంగంలోకి ప్రవేశించిన కారణంగా ఇంట్లో చదివించాలనే ఆలోచన బలంగానే ఉండేది. చదువులో చురుకుగానే ఉండడంతో ఉన్నత విద్యకు వెళ్ళే అవకాశాన్ని మా అన్నయ్య కల్పించాడు. స్కాలర్షిప్ రావడంతో చదువు సులభమయింది. ఆనాడు విద్యార్ధి లోకంలో వున్న సామాజిక చింతన ప్రభావంతో తెలుసు కోవాలనే తపన కలిగింది. ఇతరుల కష్టాలకి స్పందించే గుణాన్ని పెంపొందించింది. పరిశోధనా రంగంలో చేరడం శాస్త్రీయ దృక్పధాన్ని అవగాహన చేసుకునే అవకాశాన్నిచ్చింది. శాస్త్ర రంగంలో దిగజారుతున్న విలువలకు వ్యతిరేకంగా నిలవాల్సిన‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగ పరంగా నష్టపోయాను. ఐనా పోరాడాను. పెద్దగా మార్పులేమి రాక పోగా విలువల క్షీణత విస్తృతమౌతోంది.

తెలిసిన సైన్సుని ప్రజల కోసం ఉపయోగించడం మెరుగని భావించి పర్యావరణ రంగంలో అడుగు పెట్టాను. పర్యావరణ హక్కులు మానవ హక్కులేననే అవగాహన మానవ హక్కుల ఉద్యమాలకు దగ్గర చేసింది. ఈ క్రమంలో 2006 లో తుమ్మలపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగక ముందు నుంచి ప్రజలకు యురేనియంతో కష్టాలు తెలియ జెప్పీ ప్రయత్నం చేశాం. అ నాటి రాజకీయ పరిస్థితులు ప్లాంటు నిర్మాణాన్ని ప్రోత్సహించాయి. ప్రజలు నిమ్మకున్నారు. యిప్పుడు కష్టాలు తరుముకొస్తున్నపుడు వారు పునరాలోచించు కోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నా సహకారం ప్రజలకెప్పుడూ వుంటుంది. తమ ఉనికిని కాపాడుకోవడానికి కదల వలసిన బాధ్యత ప్రజలదే. తమ స్వశక్తి పైనే ఆధార పడి ముందడుగు వేయాలి. ఏ రాజకీయ పార్టీకీ పర్యావరణ సమస్యలపై అవగాహనా లేదు, నిబద్ధతా  లేదు. వారు సహకరిస్తే మంచిదే. కాని వారి వెనుక పరుగుతీయడం వృధా శ్రమ.

 

సొదుం రమణా రెడ్డి

సొదుం ర‌మ‌ణారెడ్డి:  స్వస్థలం క‌డ‌ప జిల్లా వీర‌పునాయునిప‌ల్లె మండలం ఉరటూరు గ్రామం. జ‌ర్న‌లిస్టుగా 17 ఏళ్ల అనుభ‌వం. రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగునీటిని సాధించే మ‌హ‌త్త‌ర కార్యానికి చాతనైన సాయం చేయాల‌ని ఆకాంక్ష.

2 comments

  • చాలా మంచి ఇంటర్వ్యూ. పర్యావరణం పైన అవగాహన పెరగాలి. ఆర్థిక సామాజిక సంబంధాలు ప్రకృతి నియమాలకు కట్టుబడి లేవు అనే అంశాన్ని విపులంగా అధ్యయనం చేయాలి.-ప్రభు

  • అణువిద్యుత్తుకు సంబంధించీ, యురేనియం మైనింగ్ గురించీ మెజారిటీ జనాలు(including well educated) అపోహల్లో ఉన్నారు. చాలా ఎక్కువమందికి రీచ్ కావాల్సిన ఇంటర్యూ.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.