ఒక రహస్తంత్రీ నిషాదం

కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు శ్రీ శ్రీ . వచన కవిత్వం గ్రాంథిక భాషా సంకెళ్లని తెంపుకుని  సామాన్యుల గుమ్మాలలో నడవడం  మొదలైనాక, తమ అద్భుతమైన శైలి తో కవిత్వం రాసిన శ్రీ శ్రీ , తిలక్ ప్రభ తగ్గిపోకుండా ఉండడం తెలుగు కవిత్వం చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు. ప్రాచీనాంధ్ర సాహిత్యం తన స్థానం నుంచి  కొంచం వెనక్కి జరిగినప్పుడు వచన కవిత్వం ఖాళీని పూరించి  నిలదొక్కుకుంది, ప్రబంధాలని వెనక్కి నెట్టిన కవిత్వం తరవాత  తెలుగు కవిత్వం అంతా ఒకే ధోరణిలో ఉందా లేక ఏమైనా మార్పొచ్చిందా అని తరచి చూస్తే, వస్తు రూపేణా, శిల్ప ప్రధానంగా కొంత మార్పు వచ్చిన మాట వాస్తవమేగాని  అందరూ శిల్పానికో రూపానికో , ఏదో ఒక వాదానికో  అదే ధోరణి లో కొట్టుకు పోవడమే అసలైన సమస్య కూర్చుంది, మరి నిజానికి ఔట్ ఆఫ్ ది బాక్స్ రాసిన వాళ్లెవరూ లేరా అనే అసలైన ప్రశ్నకి తెలుగు కవిత్వం దగ్గర ఒకే ఒక సమధానం  అప్పటికీ ఇప్పటికీ ఒకటే అదేవేగుంట మోహన్ ప్రసాద్అనబడుమో” .

అబ్బే కష్టం అండీ అర్ధంకాదు, అంటే అలా కాదు బాగా స్టడీ చేసి చదవాలి  అని సుదీర్ఘ నిట్టూర్పు లు   వినబడతాయి  మో ని చర్చకి తీసుకు రాగానే , ఎందుకు ఇంత అవస్థ పడతారు . నిజమే కాస్త సంఘర్షణ పడాలి , సులువుగా  కూడా చెప్పవలసిన చోట , పదాలకి ఒక పెద్ద తాళం కప్ప తగిలిస్తారు, దాని తాళం చెవి కింద ఇస్తారు , వెతుకులాటలోనే కవిని పాఠకుడు పట్టుకోలేకపోతాడు, దీన్నే మరో కోణం నుంచి చూస్తే ఒకానొక అసంబద్దమైన కవిత్వ చర్యలా గా కనబడుతుంది,  పాఠకుడికి ప్రాపంచిక విషయాల మీద సర్వ జ్ఞానమూ ఉండాలని కూడా నియమం ఏమీ లేదు . కవిత్వం కప్పి చెప్పాలనే నియమాన్ని దృష్టిలో ఉంచుకునే ఇంతకాలం కవులు కవిత్వాన్ని రాయడం మొదలు పెట్టారు. కానీమోవిషయంలో చూస్తే ఆయన కప్పవలసిన విషయాన్ని అత్యంత ధృఢంగా కప్పి చెప్పడం వలన పాఠకుడు  కాస్తంత ఆందోళనలో పడతాడు .

కాలు కేవన్నా బోధపడుతుందా? బోద కాలైతే కాలేవన్నా బాధపడుతుందా? కాలు కేవన్నా ప్రేమాయనణమో, దోమాయణమో బోధపడుతుందా? హెట్రోజాన్, హెట్రోజాన్ మేరీ జాన్…!

పైన వాక్యాలు ఎక్కడైనా కనపడితే పాఠకుడి మనసు పరి పరివిధాలా పోతుంది , వెంటనే కవి అనుకునే సన్నివేశాన్ని పట్టుకోవడం కాస్త ఆలస్యం అవుతుంది, మనం ముందు అనుకున్నట్టే ఇక్కడ ఒక తాళం పడింది కాని తాళం చెవి మాత్రం కింద మరో స్టాంజా లో కనబడుతుంది

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ప్రతీవాడికీ బొధపడడమంటే బాధ పడడమే“. రామచంద్రాపురంలో బోదకాలు  బాదితులు ఎక్కువగా ఉంటారు, దానికి మందు హెట్రొజాన్ , వీటన్నికీ కారణం దోమ . ఒక వాక్యాన్ని ఇన్ని చుట్లుచుట్టి  చెప్పగలగడమూ ఒక అసామాన్యమైన అలవాటు, వర్తమాన కవిత్వం నిజానికి ఇంకా సాంప్రదాయ చట్రంలోనే ఉన్నా దాన్ని దాటి రాసినవారిలో మో  ముందు వరసలో ఉంటారు. సాధారణంగా కవులు భాషతోనో, శైలితోనో కాస్త మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తారు, కొండకచో సఫలీకృతమూ  అవుతారుమో’ తాను కవిత్వం రాస్తున్నప్పుడు ఒక రసాస్వాదనలోకి వెళ్లిపొతారు. అక్కడ తనకి పరిచయం ఉన్న  కవులని , రచనలని అన్నీ సహజాతి సహజంగా ఇక్కడ కాగితం పైకి తెస్తారు, కవిత్వంలో తాను మోస్తున్న బరువూ కనబడుతుంది  పాఠకుడు బరువుని భరించలేడు అయితే ఇక్కడ భావ పరంగా కవి ఎదగగలిగాడా, పాఠకుడు ఎదగ గలిగాడా అనే తూకం వేస్తే మొగ్గు కవి వైపే మొగ్గుతుంది, పాఠకుడి స్థాయి పెరగడం అనేది కవి చేతుల్లో ఉండదు గాక ఉండదు, అలాంటప్పుడు ఒక నూతన నిర్మాణం జరిగితే కవిత్వంలో అది అంతగా రుచించకపోవచ్చు, దానికి అర్ధంకాని కవిత్వం అని పేరు పెట్టారు ఆధునిక సంప్రదాయవాదులు  అందుకే మొట్ట మొదట పేరు వినగానే కనిపించే లేదా వినిపించే పెదవి విరుపు. కవిత్వం కేవలం కర్త, కర్మ క్రియా రూపాల స్తితిలో ఉన్నప్పుడు శబ్దానికీ ఒక క్రియాత్మకం  చేసినవారు మో, మెటఫర్ కి కేవలం అలంకారకంగా మాత్రమే చూడొద్దని దానికి కవిత్వపు  పూత పూసి కొత్త రకమైన అర్ధాన్ని ఇచ్చి ఒకానొక నిఘంటువుని తయారు చేశారు. ఆనందానికి బాధకీ మధ్యలో హాయిని అనుభవించడమే మనకి తెలిసింది ఇప్పటి వరకు కాని నొప్పి, బాధ , సౌఖ్యం  వంటివి మనకి వంటబట్టాలంటే మనమూ కాస్తంత బాధపడితే గాని రాయలేమని, అలా రాస్తే చాలామంది అర్ధం కాలేదని  అడిగారని, అలా అయితే నాకెన్ని తాళాలు అవసరమ పడతాయో అని వాపోయారు. శిల్ప సమన్వయం  ఉంటే అధివాస్తవికత కూడా అర్ధమౌతుందని చెప్పిన మాట ఎన్నటికీ మనం మరిచిపోకూడదు.

‘మో’కి సంగీతం మీద చాలా పట్టు ఉంది ఆయన సంగీత ప్రదమైన ప్రస్తావనల్ని చాలా చోట్ల ఉపయోగించారు , ఆయన ఒక సంపుటికి “నిషాదం” అనే పెట్టుకున్నారు, ఆయన రాసిన చాలా మంచి కవితల్లో “షెహనాయ్” ఒకటి, స్త్రీ పురుషుల మధ్యన సంబధాన్ని రెండు సంగీత పరికరాల మధ్య సమన్వయం చేసి రాయడం కత్తి మీద సాము. దాన్ని ఆయన అతి సూనాయాసంగా కవిత్వీకరించారు. స్ర్త్రీ అంటే బాధామయ రూపానికి ప్రతీకగా తీసుకుని పురుషుడు అంటే ఒక ఆధిపత్య ధొరణీ అని రాసే కాలం లో ఇలాంటి ఒక సమన్వయ కవిత ఒక పెద్ద సంచలనం .     

సాగరంలో వయోలీన్ లీనమైపొతుంది
ఇకనా ఒంటరి షహనాయ్ ‘పహాడి ధున్’ రాగంలో
సముద్రం ఒడ్డున చతికిలబడిఏడుస్తూ
తన దీనాలాపన
అలల నురగలో కలుపుతుంది
అలల బుడగలు పగిలిపోతాయ్
గాలి అడుగులు పడి
కరుణా రసానందాన్ని భరించలేక
మనం బాసింపట్లేసుకు కూర్చుని
కన్నీళ్లతో తలలూపుతూ
తొడలమీద చేతులతో తాళం వేస్తుంటాం“.

విరుద్ద శక్తుల  ఐక్యత ని చెప్పానని మో నే చెప్పారు ఇందులో, ఘర్షణ ఉన్నప్పుడే ఐక్యత కోసం పొరాటం ఉంటుందని చెప్తూ, దీనికి కూడా ఒక తాళం చెవిని మన కోసం వేలాడ దీశారు.హెగెల్ మాటల్లో  చెప్పాలంటే ఇదోక రకమైన ట్రాజిక్ డైలెక్టిక్అని. చాలా లోతుగా దీర్ఘంగా ఆలోచిస్తే గాని మనకి, ఆయన కవిత్వాన్ని ఎంత దూరం  తీసుకెళ్లారనే విషయం అర్ధం కాదు, అందుకే ఆయన్ని రేపటి కవి అని చెప్పొచ్చు.

ఆధునిక వచన కవిత్వం ప్రధానంగా శ్రామికుల పక్షాన, అణగారిన వ్యక్తుల పక్షాన నిలిచింది, అర్ధంకాని లంకె వేసి కవిత్వీకరిస్తారని పేరున్నమోకూడా జనామోదం పొందిన కవిత్వాన్ని రాశారు 

కనబడుట లేదుఅనే కవితా ఖండికలో ఇలా అంటారు 

కనుగొన్నారా మీరెవరైనా నన్ను 
కనీసం ఏదో ఒక వీధిలోనో, విధిలోనో
కంపించకపోతాననుకున్నారా 
పుటోగ్రాఫ్ వేలాడే మెడమీద నంబరుతో గానీ 
>దాగుడుమూతా దండాకోర్ ఆటల్లో గానీ 
చీటికీ మాటికీ మార్చే వీసాలు మోసాల్లో గాని“.
వీటిని అన్వయించుకుంటూ పోతే ఇప్పటి వర్తమానానికీ పనికొస్తాయి . మరి ఇంకా ఏమిటీ మనకి పేచీ, ఒక్క నాలు లైన్ల కవిత్వంలో మెటఫర్లని ఒంపలేదనా లేక మనకి నచ్చినట్టు తనని తాను ఒంచుకోలేదనా, మోహన్ ప్రసాద్ తనతో తాను విభేదించి, తర్కించి, ఒక వాక్యాన్ని మన మీదకి వదుల్తారు, మనం సిద్దంగా లేకపొతే (ఎలాగూ ఉండము కాబట్టి) దెబ్బ కాస్త గట్టిగానే తగుల్తుంది, మో పుస్తకాల వలన సాహితీ ప్రియులకి కాస్త గట్టి దెబ్బలే తగిలాయి తద్వారా ఆయనన్ని కవుల జాబితాలోకి ఎక్కించడానికీ చాలా సమయం పట్టిందిఆయనకి కూడా అందుకే ఒక దశలో దాదాపు దశాబ్దం పాటుచితిచింతతరవాత మౌనంగానే ఉన్నారు.

శ్రీశ్రీ నుంచి నేటి కాలం శివారెడ్డి దాకా తాము చూసి అనుభవించి పలవరించిన కవిత్వాన్ని రాసారు, మో అందుకు అతీతుడేమీ కాదు , ఆయనకూడా అలానే రాశారు కానీ ఆయన శైలి గమ్మత్తుగా ఉంటుంది. హఠాత్తుగా ఒక వాక్యం  వెంబడి కుదురుగా మరో సన్నివేశం అమరిపోతుంది అమలాపురం చెరకు తీపికీ హాలివుడ్ నటీమణికీకి పోలిక పెట్టి ఆలొచింపజేస్తారు, కావాలంటే క్రింది లైన్లు చూడండి 

బత్తాయి పళ్ళు , బలం బుడ్డీ ,( బలానికి డాక్టర్ రాసిచ్చే టానిక్)

ఆబగా వాళ్ల చూపులు 
నులకమమంచం మీద లేచిన వంశ వృక్షాన్ని చూచి 
నేనుది క్రైచిత్రంలా 
భయమేసి  , భయమేసీ
నేను ఓంకార్ నాధ టాగూర్ లా 
భయంవేసి కేక వేస్తాను 
హేయం హేయం హేయం ” 

నిజానికి చాలాకాలం గా తన మూలాల్ని చూడని ఒక వయక్తిక బాధ కవిత అంతా, హటాత్తుగా జర్మన్ చిత్రకారుడి  పొర్ట్రైట్, బెనారస్ విద్వాంసుడు, ఆడిన్ కవిత ఇలా తనకి  చెప్పాలనిపించిన వస్తువుల్నీ అలా వాడుకుంటూ  వెళ్ళిపోతారు అదే గదా చిక్కు సమస్య. అందుకు టిప్పణి లు తాళపు చెవుల్లా కవిత కింద వేళ్ళాడుతూ ఉంటాయి. సరే ఇంతకీ వస్తుగతమైన కవిత్వాన్నే రాశారా లేదా అనే సాంప్రదాయ కొలబద్ద వేసి చూస్తే మాత్రం కళ్లు బైర్లు గమ్మే వస్తు నిర్మాణం ఉంటుంది , “మోనా లీవ్ యూఅనే కవితలో ఒక వయక్తిక అనుభవాన్ని రాస్తారు, చదుతున్నంత మేరా ఎక్కడో మనల్ని మనమే తన్నుకుంటున్న భావన కలుగుతుంది కాసిన్ని వాక్యాల్ని మనమూ ఇక్కడ చూద్దాం

నా మంత్రాలయంలో నేనెప్పుడూ ఒంటరి తుంటరిని
యంత్రాలయంలో నేనెప్పుడూ వడ్డెరచండీదాసుని

కవిత మొత్తం కూడా రహస్యంగా ఎక్కడో కాకుండా మన చుట్టూరానే జరుగుతున్న ఒక ప్రపంచాన్ని చూపిస్తారు. వక్షోజాలా మీద కారాకిళ్ళీ ముద్దుల్నీ,  అన్ని బజార్లూ మూసుకున్నాక అన్ని బార్లూ కట్టేశాక

నేను దొంగ సారా సరఫరా చేస్తాను అంటారు, ఇలా ప్రతీ దాన్ని చూపిస్తూ కవిత్వం లో ఒక కొత్త డిక్షన్ రాబట్టడం కోసం చాలా శ్రమించారు, ఆధునికంగా ఒక కొత్త వాక్యం కనబడితేనో లేక శైలి కనబడితేనో ఆధునీకుడూ అని మెడలో దండవేస్తాం, ప్రపంచ సాహిత్యం మొత్తాన్ని మరగ కాచి మీగడ తరకల్ల్ని ఇక్కడ మన కవిత్వం మీద కలిపేసిన మరింత ఆధునికుడు మోహన  ప్రసాద్, ఆరంభానికి ప్రారంభమేదని అడిగినవాడు, తన మొదటి గుర్తు కర్వేపాకు, దాని కాయ వాసనా, రెమ్మ దూయడం లాంటి బతికి క్షణాలనీ తలపోసినవాడు, చిన్నా ఇలా రా ఈ వీపు మీద పొక్కులన్నీ గిల్లిపో అని బతిమాలిన తండ్రిని ఈ వీపుమీద ఇంత పెద్ద పొక్కు ఏమిటని  అంటే అదే బాధని నాన్న అనడం జీవితాన్ని కవిత్వంలోకి ఒంపడానికీ మో అందించిన కొత్త సింటాక్స్ .

అట్లా అని పెద్ద బాధా ఉండదు  అంటూ అప్పటివరకూ ఉన్న ఒక సాంప్రదాయ ఎత్తుగడల్ని విరగగొట్టినవారు , దేహానికీ ఆత్మకి పోలికనీ తీసేసి అసలు ఆత్మే లేదని దేహమొక్కటే శాస్వతమని నమ్మినవాడు  

“నేనసలే దు:ఖపు లాగూని తిరగేసి
>తొడుక్కుంటున్నవాడిని
తడిపి పిండేసి  ఉతికి ఆరేసి మరగేసి
‘మరో సూర్యోదయాన్ని  ఎండేసుకుంటున్న వాడ్ని’

అంటూ వ్యాకుల పడ్డాడు, ఇంతటి వ్యాకులతని తాత్వీకతని ఎందుకు ఒంపుకుంటున్నాడో అని అని అనిపిస్తుంద . బహుశా పాశ్చాత్య దేశాల  సాహిత్యాన్ని విపరీతంగా అధ్యయనం చేయడం వలన, కవిత్వ్వాన్ని ఎలా ఉన్నతీకరించాలో తనకి తానుగా బాగుగా ఎరిగి ఉండడం వలన, ఇలా అనేకానేక జవాబులు చొచ్చుకు వస్తాయి, ఇది పట్టుకోలేని విమర్శకులు కూడా మో ని అర్ధం కాడు అని ఒక్క మాటలో తేల్చేశారు. మో తన జీవితకాలం లో ఎక్కడా ఏ వాదన వైపు మొగ్గు చూపలేదు కాని సామాజిక చిత్రణ మాత్రం వదిలి పెట్టలేదు.

ఇంకేమి చేశాడు మో తన తాళం చెవులన్నిటినీ కలిపి కరచాలనం అనే పుస్తకంలో చాలా మంది కవులని పరిచయం చేశారు , ఈ నేల మీద రాస్తున్న కవులని ప్రేమగా కౌగలించుకున్నాడు, ప్రపంచ దేశాల కవిత్వాన్ని తెలుగు నేలకి చూపించారు, మనకి శ్రీ శ్రీలు , తిలక్ లు కొన్ని రోజులదాకా ఇంకా భూమి మీద నడవొచ్చు గాక  అయినప్పటికీ కొన్ని ఏళ్ల తరవాతనైనా మోహన్ ప్రసాద్ ని తెలుగు కవిత్వం ఖచ్చితంగా ఉంచుకుంటుంది అంతటి ఆధునీకుడు మోహన్ ప్రసాద్ గారు . ఇన్నాళ్ళుగా నా కవిత్వం మీద వచ్చిన అధిక్షేపణ లిస్ట్ ఇవ్వనా సారి అంటూ తనకి తానే చెప్పుకోగలిగిన కవి మోహన్ ప్రసాద్ గారు, అనంతానంత కవి సమయాలని కవిత్వం చేశారు మో, బెంగాలి కవి ని మన వేమనని , రెండు ప్లేస్ ల జీవితాన్ని చూసిన చలం ని  “తావొఇజాన్ని” తెలుగు నేలకిపరిచయం చేశారు. మనకెందుకు ప్ర్రాపంచిక విషయాలు , మనకెందుకు వివిధ దృక్పథాలు, మనచూపు ఎప్పుడూ దూరంగానే ఉండాలని మన చూపు విస్తరించాలని మో చేసిన ప్రయత్నం అనిపిస్తుంది, బహుశా అందుకే ఇంత తపన పడ్డారేమో. చిమ్మ చీకటిలో రహస్తంత్రీ గానం చేశారు, దాన్ని మనం శబ్దం అనుకున్నాం తప్పా , దానికి పూర్తిగా ఆస్వాదించలేదు, మనకు చీకటంటే భయం కాని, శబ్దం అంటే మక్కువ, చీకటికి భయపడి ఆ నాదాన్ని వదిలేసుకున్నాం, ఇప్పటికీ మించిపోయింది లేదు, ఒక్కసారి, ఆ ప్రవాహంలో పడి కొట్టుకు పోదాం, సమయం వచ్చినప్పుడు కవిత్వమూ, కవి ఎక్కడో ఒకచోట పట్టుబడక తప్పదు, దొరికే వరకు వెతకాలి.

 

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

20 comments

 • ఏ’మో’ ! గళాసులో ఇంకాస్త ఎక్కువ పోయాల్సింది అనిల్. నువ్వూ ఆయన లాగే తాళం చెవులివ్వవు. ట్రైన్ ఇంకా రాలేదు. వర్షం ఆగదు. గోదావరి పొంగుతున్నప్పుడు బ్రిడ్జీమీద నిలబడి చూశావా ? పొలసల గుసగుసలు చెవులకి కాదు. నాలికమీద తగువులు పెడతాయి.

  ఏమోబ్బా ! ఏమో ! మో, మో, మో. కొండపల్లి మీంచి పారే కృష్ణా నదిని కాస్త ఎసట్లో పొయ్యరాదూ ! ఆకలిగా ఉంది. ఆకలి, ఆకలి, అక్షరాల్ని తినేయాలనేంత !!!!

  • సారూ దాహం మొత్తం ఒకే సారి తీరితే ఆ గోదావరి ఇంకెందుకు ప్రవహించడం , అందుకే కాస్త కాస్త ఓంపుకోవాలి , నా మీద కొంచం ఆయన ప్రభావం ఉంది సారూ అయితే నా శైలి మాత్రం నాదే

 • అద్భుతంగా రాశారు అనిల్ గారూ..
  మీ వచనం చాలా నచ్చింది. కవిత్వం మీద మీ విశ్లేషణ లు మరిన్ని రావాలని కోరుకుంటాను.

 • మో…! ఏమో..! ఇట్లా కొన్ని వాక్యాలనీ, పదాలనీ మో’సుకొని ఏమవుతా’మో. మహా నిషాదుని స్వరమొక్కటీ ధునిలా మారి ఇట్లా డానీ లోంచి ప్రవహించి…. మస్త్ రాసినవన్నా 👍👍

 • మంచి ప్రయత్నం చేసావు అనిల్… మో కవిత్వం తోడుకున్న వారికి తోడుకున్నంత అన్నది ఆలోచించాల్సిన విషయమే…..ఎవరు రాసినా ఇంకా చాలా మిగిలే ఉండవచ్చు…. ఈ ప్రయత్నం ద్వారా నువ్వు సఫలీకృతమయ్యావు

 • మో తాళంం చెవిని ఆ తాళంం కప్ప చెవిలోనే దాస్తాడని తెలుసుకున్నవాడికి …ఆ చెవిలోంంచి మన చెవిలోకి నాదాన్ని ఒంంపుకుని మో కవనాన్ని ఆస్వాదింంచొచ్చు…కథల్లో మల్లాది రామకృృష్ణ శాస్త్రిని,కవిత్వంంలో మో శైైలి అనుకరింంచలేనంంత కష్టమైైనవనడంం నిస్సంందేహంం.marvellous essay anil anna

 • MO.. ni chadavaledhu. Konchem.. Inkaastha… Kudirithe purthiga.. Chadiveyaalani..! Mee vyasam metlu dhiguthunnappudu.. Manasuki ekkina aalochanlu. O kavi maro Kavini inthagaa parichayam chesthaadani anukole. Veelaithe Edhaina MO saahithyanni pampandi. Rahasthanthri Nishaadanni kallu moosukuni vinaalanukuntunnaa. Appudu chikatitho e pechee ledhu. Endhuko aayana kavithveekarana naa alavaatuu laanu anipisthondhi. Kaastha ontarithanam nunchi bayatapadesi aksharam kattukondi.

 • శ్రీశ్రీ , తిలక్ , బైరాగి తర్వాత నన్ను బాగా కదిలించి, గొప్ప అలజడిని సృష్టించిన కవి ‘మో ‘. ఆయనవేసిన తాళాలు తెరుచుకుంటూ పోవడం ఓ అడ్వెంచర్ గా ఉండేది.
  అనిల్ మీ ప్రయత్నం చాలా బాగుంది . అభినందనలు.

  • సార్ ఆలస్యంగా చూసా , అవును నిజంగా అదొక అనిర్వచనీయ అనుభూతి ,ధన్యవాదాలు

 • అవును కవి ఎక్కడో ఒకచోట పట్టుబడక తప్పదు. ‘మో’ లాంటి కవిని ఎలాగైనా వెతికి దొరికించుకోవాలి. మో లాంటి కవిని దొరికించుకోవాలంటే చాలా సమయాన్నే వెచ్చించాలి. అయినాసరే ఆ కవిత్వంలో మునకలు వేయాల్సిందే లేదా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే అనిపిచ్చే కవిత్వం ఆయనిది. ఆయన ‘సారాంశం’ చదివేప్పుడు కలిగిన ఫీలింగ్ అది. నిజానికి మీరు’మో ‘కవిత్వాన్ని విశ్లేషించడం సాహసమే. అయినా, ఎంతో బాగా లోతుగా అధ్యయనం చేసి చాలా చక్కగా రాసారు.అభినందనలు!

 • Anil garu, MO ni Aswadinche Adhyayananni chesinananduku……inka chestunanduku chaala happy ga vundi. Congrats. Mee nundi Vachche repati kavitha pravahaaniki idi oka punadi avutundi…..

 • ఏ’మో’ ఇప్పటికీ మించిపోయింది లేదు.ఒకసారి, ఆ ప్రవాహంలో పడి కొట్టుకు పోదాం, సమయం వచ్చినప్పుడు కవిత్వమూ, కవి ఎక్కడో ఒకచోట పట్టుబడక తప్పదు, దొరికే వరకు వెతకాలి…సూపర్బ్ అనిల్ గారు..తాళం, దానికిందే తాళంచెవి ఉంచి వెదికించడం మోహన్ ప్రసాద్ గారి శైలి అని తెలిశాక నిషాదం మరోసారి చదివి విషదపరుచుకుంటాను…చాల బాగుంది సర్ మీ వ్యాసం అభినందనలు..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.