భాషను అ-పరిమితం చేసేదే కవిత్వం

కవిమల్లుడని మేము ముద్దుగా పిలుచుకొనే ఒక మిత్రుడితో ఇటీవల ఒక సంభాషణ జరిగింది. మాటలు రకరకాల చోట్లకు తిరిగి వచ్చి మోదుగు శ్రీసుధ రాసిన ‘అమోహం’ పుస్తకం దగ్గర ఆగాయి. ఆ పుస్తకం ముద్రణకు సంబంధించి నాకూ కొంత ప్రమేయం ఉండటంతో అతని అభిప్రాయం కోసం ఆసక్తిగా ఎదురు చూశాను.

ఏమోనన్నా! అందరూ బాగుందంటున్నారు కాబట్టి నేనూ బాగుందనడమే కానీ, నాకా కవిత్వం అసలేమీ అర్ధం కాలేదుఅన్నాడు కుండబద్దలు కొట్టినట్టు.

సరే! భిన్నాభిప్రాయాలుంటాయి. కానీ ఒక కవిత్వం నాకు గొప్పగా నచ్చి మరొకరికి అసలు అర్ధమే కాకపోవడం ఏమిటి? నామిత్రుడు ఈర్ష్యాసూయలతో మాట్లాడే మనిషి కాదు. అతనిమాట కాదనడానికి లేదు. పోనీ అతనే సబబనుకోవడానికి మనసు అంగీకరించలేదు.

“ఆకాశం నుంచి అలసటగా వచ్చి వాలిందో పాలపిట్ట. గింజల కోసం పిచ్చి మొక్కలలో గడ్డి మధ్యలో వెదుక్కుంటోంది. అనాలోచితంగా కొన్ని గింజలు, నీళ్ళు ఇవ్వాలని తలుపు తెరుస్తావు. అలికిడికి రివ్వున ఎగిరిపోయింది వెనక్కి తిరిగి చూడకుండా.” ఇదొక దృశ్యం. తర్వాత ఏమైందో చెప్పడంలో కవిత్వం ఉంది, “గింజలు, నీళ్ళు పిచ్చిమొక్కల మధ్య ఒంటరిగా మిగిలిపోతాయి.” ఒక అర్ధం కాని బాధ మనసును మెలిపెడుతుంది. ఆ తర్వాత ముగింపులో ఒక తత్త్వం ప్రదర్శితమౌతుంది. “అప్రమేయంగా కలిగే స్పందనలకు ప్రశ్నలు సమాధానాలూ సంజాయిషీలూ మినహాయించ బడతాయి.” ఇదెందుకు అర్ధం కాని కవిత్వమైందో నాకర్ధం కాలేదు.

ఇప్పుడతని అభిప్రాయాన్ని నేనెలా అర్ధం చేసుకోవాలి? అమోహం కవి ప్రయోగించిన భాష, ప్రదర్శించిన ప్రతీకలు, అంతర్లీనంగా ప్రవహింప చేసిన తాత్వికత తెలుగు కవిత్వంలో అరుదుగా కనిపిస్తాయి.

***

భాషకు కమ్యూనికేషన్ ను మించిన ప్రయోజనం ఉంది. మనిషి ఎదిగే కొద్దీ భాష ప్రయోజనం కూడా విస్తృతి పొందింది. మనిషి తన భావాల క్లిష్టతను సరళంగా వ్యక్తం చేయడానికి భాష ఉపకరిస్తుందని కన్గొన్నాక కవిత్వం పుట్టి ఉంటుంది. మనిషి భావం అనంతం. భాష పరిమితం. విస్తరించగలిగినంత వరకూ విస్తరించాక, తన సంపూర్ణ భావజాలం భాషలో ఇమడదని మనిషి కనుగొన్నాక, పరిమితమైన భాషతోనే అపరిమితమైన భావాన్ని వ్యక్తం చేసే టెక్నిక్ అవసరమౌతుంది. ఈ టెక్నిక్కే అచ్చమైన కవిత్వానికి దారితీస్తుంది. ఇలాంటి టెక్నిక్ ద్వారా కవిత్వం చెప్పాలంటే కవికి చాలా ప్రతిభ అవసరమౌతుంది. తానొక ఉన్మత్త భావావేశం లాంటిది పొందాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రతీకలు తన భావాన్ని స్పష్టంగా పాఠకుడికి అందిస్తాయో అవగాహన కలిగి ఉండాల్సి వస్తుంది. కవి తనకోసం తాను కవిత్వం రాసుకున్నప్పటికీ అది సమాజానికి చేరాల్సిన అవసరం ఉంది. అవ్యక్తమైన, అస్పష్టమైన భావాలతో సతమతమయ్యే వారికి తన కవిత్వంతో మమేకత్వాన్ని సాధించాల్సిన బాధ్యతా కవి మీద ఉంది. కనుక కవి తన హృదయాన్ని తనతో సమంగా స్పందించే వ్యక్తులకు కూడా అర్ధమయ్యేలా తన కవిత్వంలో విప్పాల్సి ఉంటుంది. భాష తెలియకపోయినా ఒక్కొక్క రాగం వింటున్నప్పుడు మన మనసు ఆ గాయకుడి హృదయాన్ని చదువుతుంది. అందులో లీనమౌతుంది. అలాగే ఒక చిత్రాన్ని చూసినప్పుడు కూడా ఆ చిత్రకారుడి హృదయంతో మనం మమేకమౌతాం. అలా ఒక కవిత్వం కూడా పాఠకుడిని తనలోకి లాక్కుని తీరాలి.

మరి ఇదెలా సాధ్యమౌతుంది?

ఎలా సాధ్యమౌతుందో శ్రీసుధ తన అమోహం పుస్తకంలో చూపించారు. మనిషి తాను అంతరంగంలో అనుభవించే వేదన, వెలితి, తపన, ఎరుక వంటి భావాలు మనసునెలా కుదుపుతాయనేది అత్యంత సున్నితంగా చిత్రిస్తూ, అంతిమంగా హృదయశాంతిని కలిగించే ప్రయత్నం ఈ పుస్తకంలో మనకు కనబడుతుంది. తాను చెప్పదలుచుకున్న విషయం పట్ల కవికి స్పష్టత ఉంది. అందుకే తానీ పుస్తకంలో చెప్పదలుచుకున్న అంశాన్ని ముందుమాటలో ఇలా రాస్తారు.

కిటికీకి అవతల కురుస్తున్న వర్షాన్ని తడిమే కన్నుల మౌనమిది

ఆకుల మధ్యన లేత చివురుల నవ్వు ఇది

వసంతాన్ని మోసుకొచ్చిన వెదురుపువ్వు పరిమళమిది

నీళ్ళని గులకరాళ్ళు దాహంతో మింగేస్తే అల్లాడిన కాకిపిల్ల కావ్ కావ్ శబ్దమిది

తీరంపై బెంగతో నావ విడిచిన నిట్టూర్పు ఇది

చెట్టునుంచి వేరుచేయబడ్డ కొమ్మ బల్లకట్టై నడిరాతిరి వేదనతో పాడుకొనే పాట ఇది

పుట్టలో నిద్రించిన పామును కరవలేని, పుట్టను వదులుకోలేని చీమల కోపమిది

కాళ్ళకు అడ్డుపడి తిరిగే పిల్లి హృదయంలో ఏముందో తెలుసుకోలేని నిస్సహాయత ఇది

నాటకంలో హృదయాన్ని పరచిన నగ్న రంగస్థలమిది

అంతులేని రహస్య గాఢతల్లో దరిదొరకని అతిచిన్న జీవితమిది

భాషకెరుగని భావాన్ని చిక్కించుకోలేని హృదయమిది

*****

పొట్లాలకు కట్టిన కాగితాలతో సహా అన్నిటినీ చదివేస్తాను. అదొక అలవాటు. అంతే! ఐతే ఎప్పుడో ఒక పుస్తకం లోపలికంటా వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది. తెలుస్తూ ఉంటుంది. ఇదొక ప్రత్యేకమైన పుస్తకం అని. కొత్తభాష నేర్పిస్తుంది అని. కొత్త చూపు ప్రసరిస్తుంది అని.

అమోహం. మోహం కానిది. ఆ మాటలోనే మనం మోహం అనుకొనేది మోహం కాదనే ధ్వని ఉంది. మోహానికి అమోహానికీ మధ్య ఉండే సన్నని సరిహద్దు రేఖను గుర్తుచేయడం ఉంది.

ఇంతకూ మోహం అంటే ఏమిటి? నేను అనుకోవడమే మోహం, నాది అనుకోవడమే మోహం. ఇది కేవలం సాటి మనుష్యులనుంచి మనల్ని మనం విడదీసుకోవడమే కాదు, మొత్తం ప్రకృతి నుంచి మనల్ని మనం విడదీసుకోవడంలోనూ ఉంది. మొత్తం ప్రకృతి ధ్వంసమయ్యాక మనిషి ఒంటరితనంతో మరణిస్తాడని ఒక తత్వవేత్త అంటాడు. మనిషి సామాజికత కేవలం సాటి మనుషులతోనే కాదు మొత్తం ప్రకృతితో ముడివేసుకొని ఉందని అనుకోవాలి. మనం, మనది అనే భావం మొత్తం ప్రకృతితో మనిషి అన్వయించుకోవాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం కాదు, మొత్తం ప్రకృతిని ప్రేమించాలి. మొత్తం జీవ, జడ వైవిధ్యాన్ని ప్రేమించాలి. ఆ క్రమంలోనే మనకు మనం అర్ధమౌతాం. మొత్తం సృష్టి విన్యాసం అర్ధమౌతుంది. మన పాత్ర పరిధి తెలుస్తుంది. దానికి అవధి లేదని కూడా తెలుస్తుంది. నేను మనంగా మారుతుంది. మోహం అమోహమౌతుంది. అమోహం గ్రంధం మొత్తం ఈ ఎరుకతో రాసిన కవిత్వం. అందుకే ఇది తెలుగులో వచ్చిన కవిత్వం మొత్తంలో తనదైన ఒక విలక్షణతను ప్రదర్శిస్తుంది. ఇందులో ప్రకృతిని కేవలం ఒక భావుకతను ప్రదర్శించే వస్తువుగా చూపడం ఉండదు. మన అంతరంగపు అలజడులకు ప్రకృతిలోని భిన్న సందర్భాలతో పోలిక చూపే ప్రయత్నం ఉంటుంది. అందువల్ల పాఠకుడు మొత్తం ప్రకృతితో తాదాత్మ్యం చెందుతాడు. సైద్ధాంతిక భావజాలాలూ, ఆధ్యాత్మికప్రసంగాలూ చెప్పలేని చూపలేని అనేక నిగూఢ మార్మిక అంశాలు తేటతెల్లమౌతాయి. మోయలేని బరువు దిగిపోయినట్టు మనసు తేలిక పడుతుంది. ఒంటరితనం అంతరిస్తుంది. హృదయం ఊరడిల్లుతుంది.

అమోహం కవిత్వం మొత్తం ఒక సంభాషణ. తెల్లారుజామున కలలో పాలపుంత కమ్మేసి నక్షత్రధూళిని రాల్చిపోయి నపుడు మెరిసే కన్నులతో ప్రపంచాన్ని తాను చూస్తూ మనకు చూపిస్తూ కవిచేసే సంభాషణ అమోహంగా రూపు దిద్దుకుంది. “నిశ్శబ్ద ప్రవాహాలూ, క్షణాల ఏకాంతాలూ, ఏదీ పట్టని నిశ్చలత్వం, పూచే పూల ఆనందం ఎగిరే సీతాకోకల స్వేచ్ఛ నిండిఉన్న ఆకాశం; మరింకేం కావాలి నీకైనా నాకైనా!” అంటూ సంభాషణ మొదలౌతుంది. “కొన్ని సందర్భాలు ప్రత్యేకమైనవి. సముద్రం నీలో నీ చుట్టూ అంతుచిక్కదు. చేతుల్లోంచి దయ నీలాగే ప్రవహిస్తుంది. మనుషుల్ని మన్నించేలా పాడే పక్షుల్నీ పారే సెలయేళ్ళనీ ప్రేమించేలా చేస్తుంది. ప్రవాహమే ప్రపంచమౌతుంది, భాషే లేని భావం మనకు మిగులుతుంది.” అని చెప్తుంది. ఈ మాటలు మనలోని అనాదిత్వాన్ని తట్టిలేపుతాయి. ప్రాచీనమైన మట్టివాసన మనల్ని చుట్టుముడుతుంది. బహుకాలంగా తెచ్చిపెట్టుకున్న భావాలు తమ కృత్రిమత్వాన్ని నిలుపుకోలేక ధ్వంసమౌతాయి. ఒక చిన్న అలజడితో చుట్టూ చూస్తాం. కవి మనచేతిని పట్టుకొని ధైర్యం చెప్తున్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ మనల్ని మనలోకి నడిపిస్తుంది. “మనం మనంగా ఉండటం, కనురెప్పల సంగీతం వింటూ కంటికొసలను చిరునవ్వుతో తాకడం, యుగాల ఏకాంతాన్ని తుడుస్తున్న సవ్వడి, అపురూపంగా హత్తుకొనిపోయే గాఢనిద్ర, ఎంత తలచుకున్నా తరగని వెన్నెల; మనకే ప్రాప్తమైన ఒక స్వప్నం ఒక మెలకువ” అని చెప్తుంది. “బెంగను దాచుకున్న పిల్లవాడిలా వెతికి వెతికి అలసిపోయి ఉంటావు. ఆ తీరంలో పాప కురిసే వాననీ వెలిసిన వెన్నెలనీ పక్షుల హృదయాల్నీ శ్రద్ధగా మూటలు కడుతోంది” చూడమని చూపిస్తుంది. భుజంపై వాలి ఆదిమరహస్యాన్ని చెప్పిపోయే పిచ్చుకా, మనుషుల్ని వెలేసి వెళ్ళిపోయే పావురమూ రెండు రెక్కలకై ప్రపంచాన్ని భరిస్తున్నామనే నిజాన్ని వెల్లడిస్తాయి. జీవితాన్ని నిర్వచిస్తాయి. “ఉన్నది కొద్ది

సమయం. మసకలోకపు మాయలో జీవితాలు కడతేరుతున్నాయి. అబద్ధాలూ నిజాలూ అంటూ తేల్చేదేమీ ఉండదు. ఇసుకగూళ్ళన్నీ సముద్రం తీసుకుపోయిందని రోదించకు. నక్షత్రాలకే నాయకుడివని, ఆకాశమంతా మనదేనని ఆనందించు” అని చెప్తుంది.

సంభాషణ సాగుతూనే ఉంటుంది. విస్మయాలు, విషాదాలు, వేడుకోళ్ళు, కలవరింతలు, ఆనందాలు, అయోమయాలు, సత్యాలు, అసత్యాలు ఒకటేమిటి, జీవితాన్ని కదిలించే ప్రతి అంశమూ ఎక్కడో ఒకచోట కవితామయమై కనువిప్పై ఎరుకపడుతుంది. మనసు అతి సున్నితంగా ఉద్వేగాలకు అతీతంగా ప్రతిస్పందిస్తుంది. ఎందుకో ఒకసారి కవిని చూడాలని తలెత్తుతాము. అక్కడ తను ఉండదు. ఆ లేకపోవడం మనల్ని బాధించదు.

అసంకల్పితంగా మళ్ళీ మనం ఆ కవిత్వంలోకి ప్రయాణం కడతాం. “మార్పుకై కలలుకన్న అడవొకటి నగరమై దుఃఖిస్తుంది. నువ్వు నేను ప్రేమగా పెంచుకున్న పాముకి ఆకలి ఎక్కువై మనల్నే మింగేస్తుంది” ఎందుకో నిన్నటి కేరళ వరదలు, మొన్నటి తమిళనాడు, ఆ ముందటి ఈశాన్య రాష్ట్రాల వరదలూ గుర్తుకొస్తాయి. “అలసిపోయి ఆవేదనతో బాధతో ఆగని దుఃఖంతో గొంతు పూడుకుపోతూ చేతులుపట్టుకొని కుమిలిపోతూ అర్ధంకాని రోదనలో గొణుక్కుంటాం ఏమి మిగిలిందని. ఎప్పటికో గాలివాన తెరిపిన పడుతుంది. పసిపాప నవ్వినట్టు సన్నటి ఇష్టమైన జలదరింపు మనసులోకి చేరినట్టు. అప్పుడొకటే అనిపిస్తుంది. నడవడానికి ఓ దారుంటే చాలేమో అని.” ఇదంతా ఎప్పటికప్పుడే! “లోకమంతా దుఃఖగీతం పాడుతుందని మనమే ఓదార్చాలని దయను భుజానేసుకొని బయల్దేరతాం. కాని పొలమారినప్పుడు గ్లాసెడు నీళ్ళ కోసం అదేపనిగా వెతుక్కుంటాం”

మానవ ఉద్వేగాలన్నిటికీ ప్రధానమైన కారణం భయం. భయాన్ని జయించాలంటే దాని స్వరూపం తెలియాలి. భయం ప్రతిప్రాణికీ మౌలిక లక్షణం. “గూడు కట్టుకుంది. వ్రక్కలైంది. చిన్నాభిన్నం చేసింది. లోపలి అమీబాలా వ్యాపించింది. వెనక్కి తెచ్చింది. దూరం పెట్టింది. దగ్గర చేసింది. దేహాన్ని ముక్కలు చేసి పంచింది. దీపాన్ని గూట్లోనే పెట్టి ఊపిరి అందక మరణించేలా శపించింది భయమే. లోపల గూడు కట్టుకుపోయిన భయమే.” ఒక్కోసారి ఈ భయాన్ని జయించే ప్రయత్నం చేస్తాం. “అక్కడంతా పాములని వెళ్ళద్దని అందరూ చెబుతుంటారు. మనం తెలివిగలవాళ్ళమని ధైర్యవంతులమని మనల్ని మనం నమ్మించుకొని వెళ్తాం. అకస్మాత్తుగా పాము ఒళ్లోకి జారి పడుతుంది. దొరికిన చోటల్లా కాటువేస్తుంది. ఎగిరిదూకి మాయమౌతుంది. విషం ఉందో లేదో తెలియదు. కాటు భయం విషం కంటే ముందే నరనరాల్లో పాకిపోతుంది. దుఃఖం పొర్లి ఒళ్ళు తూలిపోతుంది. అందరినీ శాపిస్తావు. నీ పిరికితనాన్ని ఒప్పుకుంటావు. కనబడిన రాయికల్లా రక్షించమని మొక్కుతావు. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. భయం నొప్పిని తెలివిని జయిస్తుంది.” “ప్రశ్న తీరాన్ని చేరనందుకు దుఃఖం. కల నిద్రలోకి రానండుకే నింద. ఋతువుల స్పర్శల ఉలికిపాటు దుఖపునీడలో సమాధానాలు. తుఫాన్లు దిక్కుతోచని దిగుళ్ళు. ఇప్పుడంతా ఒక్కటే మాట. భయం.”

ఎక్కడో ఒకచోట ఏదైనా ముగిసిపోవాలి. ఇది కేవలం ఒక మజిలీ. కదలాల్సి వచ్చిన ప్రతిసారీ దుఃఖం. తెలిసి వస్తామో లేదో కానీ పోవడం మాత్రం తెలుస్తుంది. దుఃఖం మిగులుతుంది. “తోలుబొమ్మలాట అద్భుతమైన విన్యాసాలతో నడుస్తుంది. మబ్బులు పట్టినవేళ నెమళ్ళు నర్తించినట్టు, సరస్సులో అలలు సంగీతం పాడినట్టు, సాగుతుందొక విభ్రాంతికరమైన ఆట. ఆట ఆగిపోయింది. అందరూ ఏడుస్తున్నారు. ఆట కావాలని పాప. ప్రాణం కావాలని బొమ్మలు.” దుఃఖమే కాదు. దానితో పాటు ఒక ఎరుక మిగులుతుంది. Every beautiful lie burries bitter truth. Reality is nothing but life and lie”.

పుస్తకం పూర్తవుతుంది. అనేక ఉద్వేగాలతో చిలకబడిన హృదయం తేరుకుంటుంది. ఇదివరకు బాధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు అర్ధరహితంగా కనిపించడం మొదలౌతుంది. ఒకానొక శాంతి నిలువెల్లా ఆవరిస్తుంది. కవికి ధన్యవాదాలు చెప్పాలని పక్కకు తిరుగుతాం. అక్కడ కవి ఉండదు. చిత్రంగా మనమే ఉంటాం. అవును. ఈ పుస్తకం చదువుతూ మనతో మనమే మాట్లాడుకుంటాం. ఊరట పొందుతాం. ఇదీ ఈ పుస్తకం ప్రత్యేకత. ఇదీ శ్రీసుధ తెలుగు కవిత్వానికి అందించిన అరుదైన కానుక.

*****

ఈ కవిత్వం మొత్తం చదివాక కవి పాఠకులనుంచి తానేమి ఆశిస్తుందో మనకు చివర్లో చెప్తుంది.

“మన హృదయ వైశాల్యాలలో పగుళ్ళలో ఏమూలో పూసిన గడ్డిపూల దుఃఖం తాకే ఉంటుంది ఈపాటికి.

చేతికొచ్చిన పంటను నీదిగా చేసుకునేప్పుడు భూమినెందుకు ఓదార్చాలో తెలిసిపోయే ఉంటది.

మనం చేసుకున్న చిన్న కాగితపు పడవ ప్రయాణిస్తుందని, దాన్ని ప్రేమించాలని అర్ధమయ్యాక దాన్నో వర్షం కురిసిన సాయంత్రానికి ఇచ్చి హృదయం సంబరపడే ఉంటుంది.”

ఇంతటి స్పష్టతతో ఉన్న కవిత్వం మా కవిమల్లుడికి ఎందుకు అర్ధం కాలేదు? బహుశా ఒకందుకు. మనం మట్టినుంచి ప్రకృతి నుంచి చాలా దూరం వచ్చేశాం. అవి ఇప్పుడు కేవలం ఆలంకారిక కవిత్వ వస్తువులుగా మిగిలిపోయాయేమో. ఐతే నిజానికి గమనించాల్సింది మనందరం మట్టి రాసుకున్న కవిత్వంలో పాదాలం. ఆ నాదంలో శబ్దాలం. ఆ ఎరుక బహుశా ఇప్పటి వారికి ముఖ్యంగా మట్టి నేపధ్యం లేని వారికి అర్ధం కావడం కష్టం.

గుంటూరు జిల్లా పల్నాటిసీమలోని మట్టివాసన కవిత్వమై శ్రీసుధ పుస్తకమైనప్పుడు బహుశా అందుకే అది చాలామందికి అర్ధం కాలేదు. ఇప్పుడు కాకపోయినా మరోసారి చదివినప్పుడైనా అర్ధం అవుతుంది. అయితీరుతుంది.

మృత్యుంజయ రావు పిన్నమనేని

మృత్యుంజయ రావు పిన్నమనేని: ప్రభుత్వోద్యోగం, సాహిత్యమంటే అభిరుచి. ముఖ్యంగా నాటకాలు, కథలు, కవిత్వం, జీవితచరిత్రలు ఇష్టంగా చదివే అంశాలు. ఖలీల్ జిబ్రాన్ శాండ్ అండ్ ఫోం, ది ఓత్ అనే ఆంగ్ల నవల, ఒకటవ శతాబ్దికి చెందిన గ్రీకు రచయిత లూషియన్ రాసిన మైమ్స్ ఆఫ్ ది కోర్ట్జాన్స్ అనే సంభాషణలు తెలుగులోకి అనువదించారు. కన్యాశుల్కం నాటకాన్ని సంక్షిప్తకథా రూపంలో రాశారు. కొద్ది కథలు, మరి కొద్ది వ్యాసాలూ...

4 comments

 • Beautiful review..poetry is an art the pleases us beyond rationality..one just need to feel the beauty rather than understanding it.

 • ఇంతటి స్పష్టతతో ఉన్న కవిత్వం మా కవిమల్లుడికి ఎందుకు అర్ధం కాలేదు? —ఎందుకా ఎందుకంటే …నేను హార్లిక్స్ తాగాను తింటాను అనే ఒకానొక కాలపు వ్యాపార ప్రకటన జ్ఞాపకం వచ్చింది ఎందుకో. మీ కవి మల్లుని అభిప్రాయం ప్రకారం కావ్యానందం ఇవ్వని కవిత్వాన్ని గౌరవించి హత్తుకోవలసిన ఖర్మ పాఠకునికి లేదు. అది చాలా మంది కవులు మీతో సహా గుర్తించటం లేదు. ఇప్పుడు శృంగార నైషధం చదివి వినిపించి మీకు నచ్చాలి అని బలవంతం చేస్తే నచ్చుతుందా. అలాగే అడవిరాముడు సినిమా చూసి ఆనందించే వారికి శంకరాభరణం కూడా నచ్చింది ఆ రోజుల్లోగా కారణం ఆ స్థాయి సినిమాలో దర్సకుడు తీసుకు రాగలగడం. కవిత్వం రాసుకు పోవడమేల కాదు నాకు పాఠకుని మెప్పు కావాలి అనుకున్నప్పుడు రాసే ఇతివృత్తంలో పదాలలో అగాధాలు ప్రహేళికలు సృష్టించడం ఒక వ్యసనం గా మారి కవితా స్ఫూర్తి దెబ్బ తీసే విధంగా రచనలు సాగుతున్నాయి. నాకు నామొహం నచ్చడానికి కారణం చాలా కాలం తరువాత పూర్తి తెలుగులో లలితా పదాలతో అద్భుతంగా ప్రకృతిని వర్ణించడం ఒక్కటే కాకుండా ప్రకృతిని కాపాడుకోవలసిన భాద్యత అద్భుతంగా చెప్పారు. ఆ అగాధాలలో దిగకుండా కవిత్వాన్ని ఆనందిద్దాము అనుకునే వారికి అమోహం నచ్చకపోతే మీలాంటి సమీక్షకులు ఆ భాద్యత మీరు నిర్వర్తించాలి.. అది చెయ్యని నాడు మీరు కూడా అమోహం మీద మోహ పడ్డారు తప్పా మీ భాద్యత మీరు నిర్వర్తించనట్టే. నిజం చెప్పాలంటే నాకు ముందు కుంచెం అదోలా అనిపించినా ఆ పదాల మధ్య లోతు సృశించిన నాడు తప్పకుండా కావ్యానందం కలుగుతుందని నా నమ్మకం.

 • మీరు శ్రీసుధగారి కవిత్వాన్ని విభజించిన పద్దతి, దృశ్యం,, కవిత్వం,. తత్వం లేదా తనదైన దృష్టి అనే మూడు సోపానాలు అమోహంలోని చాలా కవితల్లో స్పష్టంగా కనిపిస్తాయేమో సర్. ఇక్కడ కవి ఉద్దేశ్యపూర్వకంగా ఆ టెక్నిక్ ను అనుసరించి ఉంటారని అనుకోను. బహుశా, అది తన సహజపద్దతై ఉండచ్చు.

  అమోహం చదివాక, ఆ శైలి ప్రభావం పడకుండా రాయడం కొంత కష్టమే, కొంత నేనూ ఇబ్బంది పడ్డాను ఆ విషయంలో, రాయడానికి తను ఎన్నుకున్న పద్దతిలో ఉన్న ప్రత్యేకతేమో అది. చాలా సరళమైన బాష, ఎక్కడా జఠిలమైన డాంబిక పదజాలం కనపడదు,. ఆ చిన్నచిన్న పదాలతోనే ఉద్వేగాలు, అనుభూతులు తనదైన భావసాంద్రతతో కూడిన వాక్యాలుగా ప్రవహిస్తాయి.

  వస్తువులేదు, అసలు ఏం చెప్పాలనుకున్నారో అర్థంకావడంలేదు, కవిత్వపు నడక సరిగాలేదు, ఆత్మలేదు, అమోహం అనే తెలుగు పదమే లేదు లాంటి మాటలు విన్నప్పుడు, నేనూ కొంత ఆశ్చర్యపోయాను. మీరు దాన్ని ఓపెన్ చేసి మాట్లాడటం ఓ రకంగా అమోహంకు కొంత మేలే చేస్తుందనే బావిస్తున్నానండి.

  జీవితాన్ని, పరిస్థితులను, ప్రకృతిని తమలోకి ఒంపుకోకుండా ఇలాంటి కవిత్వం రాయలేము, అమోహం కవిత్వంలో కాలస్పృహ. వస్తు స్పృహ పెద్దగా కనబడినట్లు తోచదు ఒక్క హృదయస్పృహా తప్ప. ఏ కాలానికై అది ప్రకృతిలా మన చుట్టూనే తిరుగుతూ మన హృదయాలను పలకరిస్తూనే ఉంటుంది. ఇలాంటి కవులు ఒక ప్రత్యేక వర్తమానాన్ని వారిలో కలిగి ఉండి కవిత్వాన్ని వెలువరిస్తారేమో బహుశా. ఈ కవిత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు పాఠకుడి ఆలోచన, మనసు రెండు ఒకదానితో ఒకటి లయిస్తూఉండాలి. ఆ లయ దొరకనప్పుడు దీన్ని అనుభూతి చెందడం అర్థం చేసుకోవడం కాస్తంత కష్ట సాధ్యమేనేమో అనిపించిది పైన ఉదహరించిన లాంటి మాటలు విన్నతరువాత,

  తెలుగు కవిత్వంలో అమోహం తనదైన ముద్రవేయాలని ఆశిస్తూ, కవయిత్రి సుధగారికి, మంచి సమీక్షను అందించినందుకు మీకు అభినందనలు సర్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.