ఒక తన్నులాట…

ఒరే-

తంతే తప్పా?

‘తప్పా.. తప్పున్నారా’ అని నాన్న నన్ను పట్టుకు తన్నారు. నాన్న పట్టుకు తన్నడం తప్ప, ఏదీ తప్పు కాదనిపిస్తోంది.

బంటిగాడ్ని బాదేసాను. అది తప్పంటే నేను ఒప్పుకోను.

తంతే తప్ప, ఎవరూ మన మాట వినరు కదా?

‘ఇలాంటి యెదవ బుద్దులన్నీ యెక్కడ నేర్చుకున్నావురా’ అని అమ్మా నాన్నా అత్తయ్యా తాతయ్యా పక్కింటి పిన్నీ మేడ మీది చిన్నీ మా స్కూలు టీచరూ.. ఒక్కరేంటి అందరూ చెప్పేవాళ్ళే. కాని ఎవరికయినా బుద్దులు ఎక్కన్నుంచి వస్తాయి?

అయినా కొట్టడంలో మంచి మజా వుంది.

ఆ సంగతి వుయ్యాల్లో వున్న చెల్లాయికి కూడా తెలుసు.

చెల్లి తప్పడ తప్పడ అడుగులు వేస్తూ నడుస్తూ పడిపోయిందా? అప్పుడు అమ్మేం చేసింది? చెల్లిని లేపి ఎక్కడ పడిందో అక్కడ ఆ నేల మీద ఒక్కటి కొట్టింది. మళ్ళీ  ఒకసారి తలుపుకు గుద్దుకొని తల బొప్పి కడితే, తలుపు మీద ఒక్కటి కొట్టింది. అలా కొట్టినప్పుడల్లా ‘హన్నా’ అంటుంది.

‘హన్నా.. హన్నా..’ అని కొడుతుంటే చెల్లి ఏడుపు ఆపేసి మరీ చూస్తుంది. మళ్ళీ కొడితే నవ్వుతుంది.

కొట్టడంలో మజా వుందని మరి చెల్లికి తెలిసినట్టే కదా?

చెల్లి కూడా టెడ్డీబేర్ని కొడుతుంది. దానికి ‘హన్నా’ అనడం ఇంకా రాదు.

ఎప్పటికప్పుడు వాచీ ఆగిపోతోందని నాన్న ‘కీ’ ఇస్తూ దానిమీద చేత్తో తడుతూ కొడుతూ వుంటారు.

మరి అత్తయ్యో.. డబ్బా మీద మూత రాకపోయినా- టిఫిన్ బాక్సు మూతరాకపోయినా గోడకి టపా టపా మని గుద్ది కొడుతుంది. అలా కొట్టగానే మూతకూడా ఈజీగా వచ్చేస్తుంది. అంచేత కొడితే ఏదైనా మనమాట వింటుంది.

అంతెందుకు రిమోట్ సరిగ్గా పనిచెయ్యకపోతే మావయ్య తిడుతూ దానివెనకాల కొడుతూ వుంటాడు. అప్పుడది ఆటోమేటిక్కుగా టెక్కు మానేసి బుద్దిగా పనిచేసేస్తూ వుంటుంది.

ఊ.. పాత రేడియోని మనం పాడించలేంగాని.. తాతయ్య దాని టెంకి మీద ఒక్కటేస్తే రామకీర్తనలేంటి?.. అన్ని కీర్తనలూ పాడేస్తుంది.

మరి పక్కింటి పిన్ని? పేద్ద నీతులు చెప్తుంది గాని.. ఆవిడ పిల్లల్ని కొడుతుంది. ‘పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలంటే కొట్టక తప్పదక్కయ్యా’ అని అమ్మతో చెప్తుంది. పిన్నిని కంట్రోల్లో పెట్టడానికేమో వాళ్ళాయన కొడుతూ వుంటాడు. ఆ సంగతి అమ్మతో చెప్పదు. కాని నాకు తెలుసు.

ఆ.. మా తెలుగు టీచరుకన్నా మేథ్స్ టీచర్ మాట వినాలనిపిస్తుంది. ఇచ్చిన హోం వర్కు చెయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ సారు చేతిలో బెత్తంస్టిక్ వుంటుంది. ‘బెత్తం చూస్తే బుద్ది బువ్వతింటుంది’ అని అంటుంటారు. మేం వింటుంటాం.

సో.. తంతే తప్ప ఎవరూ మన మాట వినరు!

ఈ విషయం మనందరికీ బోధ పడింది కదా?, అందుకే బంటిగాడ్ని బాదా.

‘ఆడుకుందాం రారా..’ అంటే, ‘నేను నీతో ఆడను’ అంటాడా?

‘ఆడనంటే కొడతావా?’ అని అమ్మా నాన్నా అంత ఇన్నోసెంటుగా అడుగుతారేంటి?

నేను రీజనుండే బంటిగాడ్ని కొట్టా, ఏ రీజనూ లేకుండానే నాన్న నన్ను కొట్టారు.

మీరయినా చెప్పండి…

తంతే తప్పా?  

-పహిల్వాన్, (అందరూ నన్నలానే పిలుస్తారు)

ఫస్ట్ క్లాస్, సారీ మూడో తరగతి, ‘మ్యూ’ సెక్షన్, రోల్ నెం. ఫార్టీ,

భాష్యం స్కూల్.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

4 comments

 • తన్నులాట , అప్పుడప్పుడు టీచర్ల మద్య కూడా అవుతుంటాయి.

 • పిల్లల్ని కొట్టే పెద్ద వాళ్ళనీ, టీచర్లనీ జైల్లో పెట్టాలి. ఇదంతా ఒక తప్పుడు సంస్కృతి.
  ఏడ్చే చంటి పిల్లని మరిపించడానికి, నేలని తట్టడమూ, గోడని తట్టడమూ, వేరే విషయాలు. వాటిని మనుషులని కొట్టడంతో పోల్చకూడడు. భర్త, భార్యని కొట్టడంతో అసలు పోల్చకూడదు. ఇది చాలా దరిద్రమైన విషయం.

  డబ్బాని కొట్టడమూ, రెమోట్‌ని తట్టడమూ, వగైరా లన్నీ, మనుషుల్ని కొట్టడంతో పోల్చకూడదు.

  చంటిపిల్ల, టెడ్డీ బేర్‌ని కొడుతుందని చెప్పడంలో అర్థం ఏవిటంటే, అది చాలా ప్రకృతి సహజమైన విషయం అని. అది చాలా తప్పు. కొట్టడం అనేది సాంఘీక విషయం. చంటి పిల్లలు పెద్ద వాళ్ళని చూసి నేర్చుకుంటారు.

  కొట్టడం అనే చెత్త సంస్కృతి లేకుండా, అనేక కుటుంబాలు వున్నాయి.
  ఇదేమీ హాస్యానికి సంబంధించిన విషయం కాదు.

  తల్లిదండ్రులు, పిల్లల్ని కొట్టడం చెత్త.
  టీచర్లు విధ్యార్థుల్ని కొట్టడం చెత్త.
  భర్త, భార్యని కొట్టడం మరీ చెత్త. అసహ్యించుకోవల్సినంత చెత్త.
  పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం తప్పయినప్పటికీ, వాళ్ళకి బుద్ధి చెప్పడం వల్ల వాళ్ళు ఆ చెత్త అలవాటు పోగొట్టుకుంటారు.

  ఈ వ్యాసం అస్సలు సరిగా లేదు.

  – పాఠకుడు

  • పాఠకుడు గారికి..
   ఇది వ్యాసం కాదు, పిల్లల కంప్లైంట్. మీరనే చెత్త కుప్ప దానికదిగా పేరుకు పోదు. మన చేష్టలకూ చేతలకూ నడవడికీ మీరనే చెత్తకీ సంబంధం ఉంది. అది అర్థమయినప్పుడే పిల్లలు అర్థమవుతారు. మీ ఆవేశం అవసరమైనది. ఆహ్వానించవలసింది. కానీ మీరు ఉపరితలం మీద అంటే పైపైన చూస్తున్నారు. మూలమైన పునాదిలోకి చూడలేక పోయారు. అందుకే హాస్యం మీకు కనిపించిందే కానీ దాని వెనుక అనర్థం కనిపించలేదు. సూక్షమైన విషయాలను పిల్లలు గ్రహిస్తారన్న ఎరుక లేకపోవడమే పెద్దలకూ మీలాంటి వాళ్ళ రాతలకూ కారణం. పిల్లల్లా స్వచ్ఛంగా వుండి పిల్లలనుండి నేర్చుకోవడం ముఖ్యం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.