కకాకికీ

నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయం కోసం యెదురుచూస్తున్నాను.  సముద్రాన్నీ ఆకాశాన్నీ వేరుచేసే క్షితిజరేఖ స్పష్టా స్పష్టంగా ఆకృతి నేర్పరచుకుంటోంది. వెలుతుర్లో ముందుకెళ్ళిన కొద్దీ వెనక్కు వెళ్ళిపోతున్న క్షితిజరేఖ చీకట్లోనైనా నిలకడగా వుంటుందో లేదో తెలియదు. వెలుతుర్లో క్షితిజరేఖకు నిలకడ వచ్చాక గానీ సూర్యోదయం ప్రారంభం కాదు.

తూర్పు ఆకాశంలో నల్లరంగు పలచబడి  క్రమంగా నీలిరంగుగా మారుతోంది. తెల్లటి మేఘాలు అక్కడక్కడా వేలాడుతూ కదులుతున్నాయి.

నేను వాలిన గోపురం కింది నుంచీ గంటమోగడం మొదలయ్యింది. మూడు సముద్రాలూ కలుస్తున్న సంగమానికివతల తీరం చుట్టూ యిసకేస్తే రాలనట్టుగా గుమికూడిన మనుషులు పెద్దగా గోలచేస్తున్నారు. దూరంగా సముద్రంలో పెద్ద బండపైనున్న మందిరమూ, దానిపక్క బండపైనున్న పెనుమనిషి బొమ్మా నల్లటి నీడల్లా కనబడుతున్నాయి. ఆ వుదయపు ప్రశాంతతను మనుషుల రావిడి భగ్నం చేస్తూండగా తూర్పు ఆకాశంలో నీలిరంగులోంచీ యెరుపుడాలు పుట్టుకురాసాగింది.

గుడిలోంచి శంఖం మోగసాగింది. మనుషుల గోల పెరుగుతూనే వుంది. క్షీతిజరేఖ పైన వాలిన మేఘం యెర్రబడింది. కాస్సేపటి తర్వాత పొట్టంలోంచీ బయటికొచ్చే గుడ్డులా, మేఘంపైన్నుంచి సూర్యబింబం పిదులుకొచ్చింది. 

పగిలిన  జిల్లేడు కాయలోంచీ విసురుకెళ్ళే గింజల్లా, విచ్చుకున్న వెలుతురులోంచి జనాలు దూరంగా కదిలారు. వాళ్ళ నిట్టూర్పులూ, విసుగుళ్ళూ, చీకాకులూ క్రమంగా నీరసించసాగాయి.

నేనూ మూల్గుతూ తోకపైకెత్తి, మెడను ముందుకు వొంచి, యెగరడానికి సిద్ధమయ్యాను. నిరాశ గుచ్చినప్పుడు గానీ నాకు నేను గుర్తుకురాలేదు.

నా పేరు కకాకికీ.

మూడు సముద్రాలూ కలిసే యీ చోటికొచ్చి యిలా యెన్ని వుదయాలుగా యెదురుచూస్తున్నానో నాకే లెక్క తెలియదు. ప్రతిరోజూ క్షితిజరేఖపైన వొకటో రెండో మేఘాలు ముట్టడి చేయడం, సూర్యుడు సముద్రంలోంచి పైకి రావడాన్ని దాచిపెట్టడం జరుగుతూనే వుంది.

చాలా చాలా సూర్యోదయాలకు ముందో రోజు వుదయాన యీవూరి కొచ్చాన్నేను.

యిదిగో, యిక్కడ, యీ మూడు సముద్రాలూ కలిసే సంగమానికి యెదురుగా, యీ మేడపైన, యీ మట్టి గోడపైన తాయిలం కనిపించగానే యిక్కడ వాలాను. కాస్త దూరంలో పిట్ట గోడ నానుకుని యిద్దరు మనుషులూ, వొక పిల్లమనిషీ నిలబడి  తూర్పు ఆకాశంకేసి కళ్ళార్పకుండా చూస్తున్నారు. నేను తాపీగా తాయిలం తినసాగాను. కాస్సేపటి తర్వాత, యీరోజు జరిగినట్టుగానే, సముద్ర తీరంలో గుమిగూడిన జనాలూ, పిట్టగోడ దగ్గర నిల్చున్న ఆ ముగ్గురు మనుషులూ నిట్టూర్పులు విడవసాగారు. వాళ్ళెందుకలా నిరాశ రాగం తీస్తున్నారో తెలుసుకుందామని మరునాడు అదే సమయంలో యిక్కడికొచ్చి, యీ పిట్టగోడపైన వాలాను. మళ్లీ అదే యిద్దరు మనుషులూ, ఆ పిల్ల మనిషీ అక్కడికొచ్చారు. తన చేతిలోంచీ కిందపడిన తాయిలాన్ని గూడా పట్టించుకోకుండా ఆ పిల్ల మనిషి గూడా తూర్పు ఆకాశంకేసి చూడసాగింది. అప్పుడు కూడా యిలాగే తూర్పు ఆకాశంలో నల్లరంగు నీలి రంగుగా మారసాగింది. గుడిలోంచి గంటలు మొగాయి. శంఖం అరిచింది. క్షితిజరేఖ పైన మేఘాలను వెండి వెలుతుర్లూ ఆ తరువాత యెర్రడాలూ ముంచెత్తాయి. మేఘాలపైన్నుంచీ ఆలస్యంగా సూర్యుడుపైకొచ్చాడు.

ఆ పిల్ల మనిషి తూర్పుకేసి చేయి చాపి యేడవసాగింది.

ఆ పెద్దమనుషులు – బహుశా దాని అమ్మానాన్న లయివుంటారు – దాన్ని బలవంతంగా లాక్కుని మేడ దిగేశారు. నిన్నటి జనాల నిరాశ రాగపు తీరుకూ, ఆవాల్టి జనాల నిరాశ గానానికీ కాస్త తేడా వుంది. క్షితిజరేఖ పైన యివ్వాళ సూర్యుడ్ని కప్పేసిన మేఘాలు నిన్నటి మేఘానికంటే చిన్నవి.

ఆ మరునాటి వుదయాన మళ్లీ అదే పిట్టగోడ పైన వాలాను. ఆ ముగ్గురు మనుషులూ రాలేదు. ఆ పిల్లదాన్ని దాని అమ్మానాన్నా వాళ్ళ వూరుకు బలవంతంగా లాక్కెళ్ళి పోయినట్టున్నారు. ఆరోజు సూర్యోదయానికి మొన్నటికంటే పెద్ద మేఘం అడ్డుతగిలింది. జనాల నిరాశ గానం మొన్నటికంటే యెక్కువ బలంగా నా గుండెలో గుచ్చుకుంది. ఆ మనిషిపిల్లకైతే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు  లేవు. ఆ రెండూ వుండే నాకూ దానికీ తేడా వుండాలి గదా! అందుకే దానికీ, అక్కడి నుంచీ నిరాశగా నిట్టూర్పులు వదులుతూ వెళ్ళే మనుషులకూ దొరకని ఆ సంతోష రాగాన్ని, ఆనంద గానాన్ని ఆలాపించేటంత వరకూ, ఆ చోటును విడిచిపోనని ప్రతిజ్ఞ చేశాను. అప్పటి నుంచీ ప్రతి వుదయమూ సరిగ్గా గుడిలోంచి గంటలు మోగే సమయానికి, గోపురం \కింద శంఖారావం మొదలయ్యే తరుణానికి, సముద్రతీరంలో మనుషులరావిడి ముసురుకునే వేళకు, యిక్కడికొచ్చి వాలుతూనే వున్నాను. క్షితిజరేఖ పైన యే మేఘాలూ అడ్డుపడకుండా, నిశ్శబ్దంగా మండే నెగడులా, యే మరకాలేని యెర్రటి యెరుపురంగులో, కణ కణమని, తళతళమని వుదయించే నిండైన సంపూర్ణమైన పరిపూర్ణమైన సూర్యుడికోసం….

కొన్ని వుదయాలు వూరించి యేమార్చాయి.

మరికొన్ని వుదయాలు యేమార్చి వూరించాయి.

వొకదాని వెంట వొకటిగావచ్చి వెళ్ళిన వుదయాలు నిరాశను కొలిచే కొలమానాలుగా మాత్రమే తయారయ్యాయి.

కానీ అంతలోనే విసిగి పారిపోతే నాకూ మిగిలిన జీవరాసులకూ తేడా యేముంది? ఆ నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయాన్ని పొందేటంతవరకూ యీ సముద్రతీరాన్నీ యీ పిట్టగోడ దగ్గరి గోపురాన్నీ, యీ నిరీక్షణనూ వదలనుగాక వదలను.

గోపురం కింద మనుషులు గొల్లుగొల్లుమంటున్నారు.

చివాలున పైకెగిరాను.

సముద్రపు అలలు పైకి తోలుతున్న చల్లటిగాలుల్లో తేలుతూ గోపురాల బండను దాటి, పెనుమనిషి శిలపైనొక చిన్న మజిలీవేసి, సముద్రంపైనో పెద్ద ఆవృత్తాన్ని మొదలుపెట్టాను. తమ పని ముగిసిపోయినట్టుగా మేఘాలు క్షితిజరేఖపైన వాలనూ లేదు, పై కెక్కివచ్చిన సూర్యుడ్ని పట్టించుకోవడమూలేదు. క్షితిజరేఖ దగ్గర బుద్ధిగా తోకలు ముడుచుకున్న అలలు తీరాన్ని మాత్రం పెద్దగా బాదుతూనే వున్నాయి. యెగరడం యెగరడం కోసమేనన్నట్టుగా వో పావురాల గుంపు దక్షిణానికెగిరి పోతోంది.

అలలు తీరానికి మోసుకొస్తున్న  చేపపిల్లలు నా నోరూరించాయి. కడుపులోని పేగులు ఆకలితో అరుస్తున్నాయి. అటూ యిటూ జాగ్రత్తగాచూసి యే గద్దా కనిపించని చోటుకెళ్ళి వాలాను. కొన్ని అలలు నాకాళ్ళను తడిపాయి. మరో అల వొక చేపపిల్లను నాదగ్గరికి తీసుకొచ్చింది. అదొక ఆటగా మెడవంచి దాన్ని ముక్కుతో పట్టేసుకున్నాను.

”రోజూ యీ చేపపిల్లలే తింటావా నువ్వు?” అప్పుడే నాపక్కకొచ్చి వాలుతూ అడిగిందో కాకి మా కా భాషలో.

నేను మెడ తిప్పిచూశాను.

”మూడు రోజులుగా చూస్తున్నాను నిన్ను. సరిగ్గా యిదేే సమయానికి, సరిగ్గా యిక్కడికే వచ్చి, యీరకం చేపపిల్లల్నే రోజూ మింగుతున్నావు. రోజూ యివే తినడం  విసుగ్గా లేదా నీకు?”

”నువ్వు చెప్పేటంత వరకూ నేనిలా యీ చేపల్నే రోజూ తింటున్నానని నాకే తెలియదు. ఆకలేసినప్పుడు తింటున్నానేగానీ, యేంతింటున్నానో పట్టించుకునే తీరిక లేదు నాకు”. అన్నాను విసుగ్గా.

”తినడం కంటే గొప్ప పనేముంది లోకంలో? బతుకంటే తిండే! బతికిన చేపపిల్లలేం రుచిగావుంటాయి? ఆ వూరినిండా యెంత రుచికరమైన భోజనం దొరుకుతోందని? ఆ వీధుల్లో, కాలవల్లో, దిబ్బల్లో, యెక్కడపడితే అక్కడ ఆ మనుషులు పారేసే రకరకాల తిండి తింటానికీ చిన్న పొట్ట చాలటం లేదు. వండినవీ, పండినవీ, మురిగినవీ, మరిగినవీ, పాచినవీ…. ఆ తిండిని తనివి తీరా మెక్కాక అరగడం కోసం యెగరడమే యెగరడం. అరిగాక మళ్లీ మేయడమే మేయడం… నువ్వేమో యీ బతికిన నీచు చేపలతో సగం కడుపు కూడా తినకుండా అగోరిస్తున్నావు” అందది కావుమని యెగతాళి నవ్వు నవ్వుతూ.

”నాకు తిండిని గురించిన ధ్యాస లేదు. వొక నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయాన్ని పొందడం కోసం మండలాలుగా యీ వూర్లో వుంటున్నాను” అన్నాను.

”నీ మాటల్లో రెండు విచిత్రాలున్నాయి. వొకటి అదేదో పరిపూ, సంపూ, నిండూ అనేది. యేమొస్తుంది నీకలాంటి దాన్ని చూస్తే? రెండోవిచిత్రం, యిదే కొంపలో మండలాలుగా వుండడం. యెంత రుచికరమైన తిండి దొరుకుతూ వున్నా వొకే తావులో అయిదు రోజులుండను నేను. అసలొకే వూర్లో మండలాలుగా వుండే దాన్ని కాకని అంటారా యెవరైనా? నిన్ను తోటి కాకని అనుకోడానికే కంపరంగా వుంది నాకు. ఆ పచ్చి చేపల్ని తిని తినీ నీకు పిచ్చి పట్టిపోయినట్టుంది”. చెబుతూనే పైకెగిరి అది వుత్తరదిశ కేసి వెళ్ళిపోయింది.

కెరట మొకటి  నా ముందుకో చేపపిల్లను తెచ్చి పడేసింది. దాన్ని పట్టుకోడానికి నేను సందేహిస్తూండగా మరో కెరటం దాన్ని లాక్కెళ్ళిపోయింది. యింకో అల చిన్న పురుగును పట్టుకొచ్చింది. దాన్ని మింగి, తేన్చుతూ పై కెగిరాను. సముద్రపు గాలి తగలనంత పైకెళ్ళాను. గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్న మేఘాల మధ్య సూర్యుడొక్కడు మాత్రం స్థిరంగా ఆకాశాని కంటుకు పోయి వున్నాడు. అలసట వచ్చే వరకూ పెద్ద ఆవృత్తాన్ని చుట్టి తీరంలోకొచ్చి వో కొబ్బరిచెట్టు కొమ్మపైన వాలాను. తూర్పు నుంచీ యేటవాలుగా పడుతున్న యెండను ముక్కలు ముక్కలు చేస్తున్న అలలు మినమిన లాడుతున్నాయి. టపటపమని శబ్దం వచ్చేలా రెక్కలల్లారుస్తూ వచ్చి నా పక్కన వాలిన కాకి ”యేవూరు తమరిది?” అన గద్దించింది.

నేను బెదరకుండా ”నీ పేరేమిటి? నీదేవూరు?” అని యెదిరించాను.

”నా పేరు చెప్తే విని తట్టుకునే ధైర్యముందా నీకు? కెకేకొకో. అదీ నాపేరు” అందది నన్ను యెగాదిగా చూస్తూ. అయితే యేమిటన్నట్టుగా కావుమని ”యీ వూర్లో మండలాలుగా వుంటున్నాను. నీ పేరెప్పుడూ వినలేదు” అన్నాను.

”మనవాళ్లు ముందుకెగిరి పోయినప్పుడల్లా మన కటవలు మారిపోతాయి. యెల్లల్ని దాటకుండా వొకే కటవలో వుంటూ అపరాధం చేస్తున్నావు నువ్వు. ప్రతి కటవకూ వొక నాయకుడుంటాడనైనా తెలుసా నీకు? కటవాధికకు కప్పం గడుతున్నావాలేదా?” అని దబాయించిందది.

”గుంపులుగా యెగిరే కాకులతో విసిగిపోయి వొంటరిగా వుంటున్నాన్నేను వొంటరిగా, ప్రశాంతంగా, దీక్షగా…” అన్నాను నిర్లక్ష్యంగా.

”మా సేనకు బయపడే గద్దలూ, రాబంధులూ కటవల్లోకి రావటం లేదు. నువ్విక్కడ ప్రశాంతంగా వుంటున్నావంటే అందుకు మా కటవాధికులే కారణం. యిలా హాయిగా, ప్రశాంతంగా బతకాలంటే ముందు కప్పం గట్టు. లేకపోతే కటవల్లేని అడవుల్ని వెదుక్కుని వెళ్ళిపో”. అందది కోపంతో రొప్పుతూ.

”ఆ కటవలేంటో, కప్పమేమిటో నాకింతవరకూ తెలియదు. అయినా యీ వూరు మీ కటవలోకే వస్తుందనీ, దీనికి నువ్వే నాయకుడనీ నమ్మకమేమిటి?” అని ముఖం తిప్పుకున్నాను.

”నిన్ను బహిష్కరించానని ప్రకటిస్తే అప్పుడు గద్దలతో, రాబందులతో నీకే ప్రమాదమొచ్చినా కాపాడ్డానికెవరూ  రారు. అప్పుడు తెలుస్తుంది నీకు కటవంటే, కప్పమంటే” అని కీపెట్టిందది.

”అయిదు రోజుల కోసారి యెల్లలు మార్చుకునే నీకటవల్తో నాకేంపని? వొక నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయాన్ని పొందేవరకూ నేనీచోటును విడిచేదిలేదు” అన్నాను నిక్కచ్చిగా.

”వొకేతావులో వుండడంతో నీకేదో కొత్తరకం పిచ్చిపట్టింది. కాకుల సంస్కృతికీ, నాగరికతకూ అప్రతిష్ట తెస్తున్నావు నువ్వు. యీ చెట్టుపైనే వుండీ రాత్రికి. మా వైద్యుడు ముసలి కొకోకౌకంను వచ్చిచూసి సరైన మందివ్వమంటాను. యీపిచ్చి ముదిరితే ప్రమాదం. జాగ్రత్త!” అది నన్ను అదోలా వింతగా చూస్తూ యెగిరిపోయింది.

ఆ కటవకాకి కనుమరుగు కాగానే ఆ ముసలివైద్యుడు వచ్చేస్తాడేమో నన్న కంగారుతో గబగబా నేనూ ఆకాశంలోకెగిరాను. యెప్పుడు యెగబాకాడో కనిపించలేదు గానీ యిప్పుడు సూర్యుడు నడినెత్తిపై కొచ్చేశాడు. నీలిరంగు సముద్రానికీ, బూడిదరంగు ఆకాశానికీ మధ్య క్షితిజరేఖ స్పష్టంగా, దగ్గరగా కనబడుతోంది. సముద్రంపైన యెండపడిన చోట్లలో వెలుగుతున్న వెండి అలలు ముందుకొస్తున్నట్టుగా వూరిస్తున్నాయి. తీరంలో అలలు వొడ్డుపైకి యెంతగా విసిరి కొడుతున్నా తెల్లటి నురగలు వాటి వెంటపడుతూనే వున్నాయి. మూడు ఆవృత్తాలు తిరిగాక వొడ్డుకొచ్చి వో పెద్దగుండు పైనవాలి అలసట తీర్చుకోసాగాను. నా పక్కకొచ్చి వాలాక గూడా రెక్కలు టపటపాకొట్టుకుంటూ ”నువ్వు అడవి కాకివా, కాక వూరి కాకివా, కాక…” అని పలకరించిందో కాకి.

”నేను సముద్రం కాకిన్లే” అన్నాను వెంటనే

”ఆ మాదిరి పెడసరంగా మాట్లాడేవి అడవి కాకులేననీ కాకుల్లో వూరుకాకులూ, అడివి కాకులూ అనే రెండు తెగలుంటాయనీ, అడివి కాకులేది దొరికితే దాన్ని తినేస్తాయనీ, వూర కాకులు మనుషులు వండి పడేసే తిండి మాత్రమే తింటాయనీ, వూరకాకుల్లో శుభ్ర కాకులనే  మరో వుప తెగ వుంటుందనీ, అవి మనుషులు గౌరవంగా పిలిచిపెట్టే తిండిని మాత్రమే తింటాయనీ, అడివి కాకులకీ తేడాలు తెలియవనీ, వాటిని మాలాంటి శుభ్ర కాకులు తాకకుండా దూరంగా పెడతాయనీ…” అది ముక్కెగరేస్తూ చెప్పుకు పోసాగింది.

”నీ అనీలూ కానీలూ నాకనవసరం. వొక నిండైౖన సంపూర్ణమైన పరిపూర్ణమైన సూర్యోదయాన్ని పొందడం కోసం యిదే తావులో మండలాలుగా యెదురు చూస్తున్న నాకంటే శుభ్రమైన కాకి యెక్కడుంటుంది? బుద్ధిగా నీ యెగురు నువ్వెగిరిపో” అని కసిరాను.

యిలా వొకే చోటులో వుండేవి అడివి కాకులేననీ, ఆ పరిపూ, సంపూ, నిండూ నీ పిచ్చేగానీ సూర్యుడిదిగాదనీ, నీతో యింకా మాట్లాడితే నీ పిచ్చి తాకి నేనూ మైలపడతానని భయంగా వుందనీ…” అది పైకెగిరిపోయాక గూడా దాని కావులు  నాకు వినబడుతూనేవున్నాయి.

సూర్యుడు పడమటి ఆకాశంలోకి వచ్చేశాడు. యెండ వేడిగానూ, సముద్రం నుంచీ వీస్తున్నగాలి పొడిగానూ వున్నాయి. అలలపైన వొక పడవ వూగుతోంది. నేను పైకెగిరి, సముద్రానికి దగ్గరగా వచ్చి, నీళ్ళకు సమాంతరంగా యెగరసాగాను. నా నీడ అలలపైన పడుతూలేస్తూ ప్రవహించసాగింది. తీరంలో కొందరు మనుషులు గవ్వలేరు కుంటున్నారు. అలల దగ్గర నాలుగు నత్తలు నీటిలో తడుస్తున్నాయి. నేను వెళ్ళి వాటి మధ్యవాలి నీళ్లతో ఆడుకోసాగాను.

”యేం చేస్తున్నావురా నువ్వు? యెగురుతున్నావా లేక తడుస్తున్నావా కాక తింటున్నావా?”

చిక్కిన కడుపును కప్పిన రెక్కల్ని సగం వరకూ పైకి తెరుచుకుని, మూసిన తోకను వెనక్కు వంచి, యిసుకలో కూరుకుపోయిన కాళ్ళను పైకి లాక్కుంటూ పొడవైన ముక్కును నాకేసి తిప్పి వో బూడిదరంగు కాకి ప్రశ్నిస్తోంది. యెండలో మిలమిలలాడుతున్న దాని కళ్ళను చూడగానే నేను అసంకల్పితంగా ముక్కులు తెరిచాను ”వొక సూర్యోదయం నుంచీ మరో సూర్యోదయం దాకా వేచి చూడక తప్పని సమయంలో యెగురుతున్నాను. తడుస్తున్నాను, తింటున్నాను. మరేమీ చేయలేని సుషప్తిలో నాలో నా స్పృహ నిండుగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా వుదయించేది తెల్లవారి ఆ కాస్సేపు మాత్రమే! ఆ నిండుదనం, సంపూర్ణత, పరిపూర్ణతలేని సూర్యోదయాలు యెన్నో మండలాలుగా నాకూ తూర్పుకూ మధ్య వుండే సంబద్ధతను విడదీస్తున్నాయి. కానీ నేను మాత్రం సంబద్ధత నెలకొనే వుదయం కోసం, నిండుగా, సంపూర్ణంగా. పరిపూర్ణంగా తూర్పుయిపోయే తరుణంకోసం నిరీక్షిస్తూనే వున్నాను” అన్నాను.

”యెంత వృధాగా పాడుచేసుకుంటున్నావురా జీవితాన్నంతా పిచ్చికాకీ” ఆకాకి కావుమంటూ నిట్టూర్చింది” ”నేర్చుకోరా నన్ను చూసి రోజంతా యెగురుతూ ఆకాశంలో సాధనెలా చేస్తున్నానో వుత్కృష్టమైన పరిణతి కోసం. నక్షత్రాల్లో నక్షత్రమయిపోవడమే లక్ష్యంగా పైకి, పైపైకి, యింకా పైపైపైకి యెగిరి, రెక్కలు చాపి, కదలిక లేకుండా, నిశ్చలంగా నిలిచిపోయి. సాధనరా, నిరంతరశోధన రా జీవితమంటే! దాని కనుకూలమైన గాలీ, వాతావరణమూ కూడా వుండాల్రా సాధన ఆ మహత్తరమైన స్థాయిని పొందాలంటే. తిరుగుతున్నాను యెగరడంలో స్థాయిని పెంచుకుంటూ, అలాంటి చోటును వెదుక్కుంటూ. శుభ్రమైన, బలవత్తరమైన తిండి యెంతకావాలో అంతే తినాలి ఆ స్థాయిని అందుకునేలా యెగరాలంటే. కమండలాలుగా సముద్ర తీరాల్లో దొరికే నత్తల్ని మాత్రమే తింటున్నానందుకే… యీశరీరం యింత తేలిగ్గా, నాజూగ్గా తయారయిందందుకే నీలా నల్లగా, బరువుగా, తిండి దిబ్బలా కాకుండా…”

”మీ వుచిత ప్రవచనాలు నాకెందుకు స్వామీ! నేను నా నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన…”

”మాట్లాడద్దురా అజ్ఞానంతో కాకీ! బతకద్దు చీకట్లో… తెరువు లోపలి నిన్ను… రా వెలుగులోకి… వెదుక్కోరా పిల్ల కాకీ బతుక్కు అర్ధాన్నీ పరమార్థాన్నీ… కాకుండా పోవద్దురా యీ లోకానికీ ఆలోకానికీ…”

”యింకో లోకమా? అదెక్కడుంది?” వులిక్కిపడుతూ అడిగాను.

”మాయరా నీకు కనిపించే యీలోకం. నీకీ అధోగతి తప్పదు ఆ నిజం తెలియనంతకాలం. నువ్వు నీ లోపలికన్ను తెరిచి ఆ సత్య లోకాన్ని చూడనంతకాలం నా చేత కాదురా నిన్ను బాగుపరచడం. అఘోరించు. కనీసం చూడు నేనెలా యెగురు తున్నానో… తరించు కొన్ని క్షణాల పుణ్యాన్నయినా పొంది….”

ఆ బూడిద రంగు కాకి దక్షిణం వైపుకు కొబ్బరాకులా యెగిరి, యీకలా గాలిలో తేలి, పైకి పైపైకి వెళ్ళి, చిన్న చుక్కగా మారి, తరువాత బూడిద రంగు ఆకాశంలో కలిసిపోయింది.

నింపాదిగా వెళ్తున్న మేఘాన్ని యింకో మేఘం వేగంగా దాటుకుని ముందుకెళ్ళిపోతోంది. పావురాలు కొన్ని గుంపుగా పెద్ద పావురం ఆకారంలో తూర్పువైపుకు యెగిరిపోతున్నాయి. అలలపైన వెళ్తున్న పడవలో మనుషులు అటూ యిటూ కదులుతున్నారు. పెద్ద చేపలు కొన్ని నీళ్ళలోంచి గాల్లోకెగురుతున్నాయి. పడమటి ఆకాశంలో సగం వరకూ చేరుకున్న సూర్యుడు మాత్రం ప్రయాణమే చేయని వాడిలా నిశ్చలంగా కనబడుతున్నాడు.

సముద్రతీరంలో యిసుకలో కూరుకు పోయిన కొమ్మపైన వాలాను. అలలు నాముందుకు విసిరిన పురుగునొకదాన్ని ముక్కున కరుచుకోబోయాను. నాముక్కులోంచి దాన్ని లాక్కుంటూ నా పక్కన వాలిన కాకి ”యేంవాయ్‌ యేవూరు మనది? నీ వాళ్ళంతా యెక్కడ?” అని సరాయించింది.

నేను బుద్ధిగా మెడతిప్పి ”నేను పుట్టింది మాకులగడ్డ. మాఅమ్మా నాయినా యిప్పుడెక్కడున్నారో తెలియదు” అని చెప్పాను.

”మన కాకుల్ని తల్లిదండ్రుల చిరునామా చెప్పమని అడిగేటంత పిచ్చోడుగా కనబడుతున్నానా నేను? నేనడిగింది నీజోడీ యెక్కడ అని” అంటూ అది ముక్కుగీటింది

”నాకు జోడీగట్టాలనే కోరికెప్పుడూ కలగలేదు” అన్నాను. అది మరోసారి ముక్కుగీక్కోగానే, ”నేను పుట్టిన గూట్లోనే కోయిల పిల్ల ఒకటి పుట్టింది. ఆ గుడ్డు మా గూట్లోకెలా వచ్చిందని మానాన్న మా అమ్మను నిలేసినాడు. తనకు తెలియదని మా అమ్మెంత మొత్తుకున్నా  వినకుండా, మమ్మల్నంతా దిగదొలికి యెటో వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు నన్ను పెంచిన అమ్మ నాకు యెగిరే శక్తి రాగానే గూట్లోంచి కిందికి తోసేసి యెగిరిపోయింది. నాకు అమ్మా నాన్నల పైనే గాదు, సంసారం పైనే విరక్తి పుట్టింది” అని వివరించాను.

”వొరే  పిచ్చోడా! మొగకాకిగా పుట్టిగూడా నీకింత చిన్న విషయం అర్ధంగాలేదా? కోయిల గుడ్డు అసలు సాకు మాత్రమే? యెగిరిపోయి యింకో కొత్త దాంతో జతగట్టేదానికది వుపయోగ పడిందంతే! ఆ కొత్త దాంతో మోజు తీరిపోయాక, దాన్నుంచీ విడిపోవడానికింకో కోయిల గుడ్డు దొరికే తీరుతుంది. మొగోడుగా పుట్టిందే మన అదృష్టం. దొరికిన అవకాశాల్ని వాడుకోవడం నేర్చుకోరా కాకిపిల్లాడా!” అది పురుగు రుచికి పరవశిస్తోందో, లేకపోతే  నన్ను యెగతాళిచేస్తూ సంతోషిస్తోందో తెలియడంలేదు.

”పుట్టి బుద్దొచ్చిన తర్వాత నన్ను మురిపించిన మొదటి విషయం సూర్యోదయమే! యీ మూడు సముద్రాలూ కలిసే చోటులో, మండలాలుగా, వొక నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయం కోసం, నేననే నేనంతా ఆ తూర్పు దిక్కుగా మారే మహత్తరమైన క్షణం కోసం యెదురుచూస్తున్నాను” అన్నాను.

”నువ్వు మగాడివనే తెలుసుకోలేక పోయినవాడివి, యింకేదో యెలా తెలుసుకుంటావ్‌? మగకాకిగా పుట్టినందుకు వీలయినన్ని యెక్కువ ఆడకాకుల్తో జతగట్టి, పిల్లల్నికని, వూర్లూ సంసారాలూ మారుస్తూ జల్సాగా బతకాల్రా సన్నాసి కాకీ! నీకీ సముద్రం గాలి పడినట్టులేదు. కొన్నాళ్ళపాటు యే కొండల్లోకైనా వెళ్ళిగడుపు. నీ పిచ్చికదే మందు…”

నేను విసుగ్గా ముక్కు తిప్పుకున్నాను.

”నా సలహా వింటే సుఖపడతావు. వినకపోతే నీ ఖర్మ. కొత్త జత కోసం రెండుదినాలుగా కరువులో పడివున్నాను. వెతుక్కోవాలి” అంటూ ఆ మగకాకి రెక్కలు టపటపలాడించి, అదొక హేళగా, ఆర్ధ ఆవృత్తపు దారిలో యెగిరిపోయింది.

నేనో రెండు నీటి పురుగుల్ని తిని సముద్రంపైన రెండు ఆమడల దూరం యెగిరిపోయాను. సూర్యుడు పడమటి దిక్కున మబ్బుల్లో యెక్కడో తప్పిపోయాడు. ఆకాశంలో మబ్బులు గజిబిజిగా తిరుగుతున్నాయి. అలలు పెద్దగా యెగిరి దూకుతూ తీరాన్ని బాది పారేస్తున్నాయి. వొడ్డుపైని జంబు తీగలు పిచ్చిగా వూగుతున్నాయి. కొమ్మల్ని తీవ్రంగా వూపుతున్న చెట్టు బోదెపైకొచ్చి వాలాను. గీపెడుతున్న గాలిని కోస్తున్నట్టుగా పెద్ద మూలుగొకటి వినబడసాగింది. బెదురుతూ మెడవంచి చూశాను. జంబు పొదల్లో చిక్కుకుపోయి పడివున్న ముసలి రాబందు వొకటి మూలుగుతోంది. దాని కాళ్ళు యిసుకలో కూరుకుపోయి వున్నాయి. దాని మెడ దాని పొట్టపైకి జారి వేలాడుతోంది. అక్కడక్కడా యీకలు రాలిపోయి యెర్రటి శరీరం బయట పడటంతో అది వికృతంగా, భీకరంగా తయారైవుంది.  నేను రెక్కలాడించగానే అది బలవంతంగా కళ్ళు విప్పే ప్రయత్నం చేస్తూ ”ఆకలి… ఆకలి” అని గొణిగింది.

”అటు సముద్రంలోనూ, యిటు నేలపైనా, యెటు చూస్తే అటు తిండే… అటో యిటో కదిలి, ముక్కువంచి, దొరికిన దాన్ని తినడానికి కూడా బద్దకమా? ఆ తిండేదో తనంతట తానుగా నీ ముక్కులోకే రావాలా?” అని కసిరాను.

అది కష్టపడుతూ మెడతిప్పి, పెద్దగా మూల్గి ”మీలా బతికిన జీవాల్నంతా మేసే మరిడీ బతుకు గాదు నాది. చచ్చిన జంతువుల కుళ్ళిన మాంసమే తింటాను నేను. మాక్కావలసిన మంచి తిండి సక్రమంగా దొరక్క నాజాతే అంతరించిపోతోంది. యేది పడితే అది తినలేక, నాక్కావలసింది దొరక్క అలమటించి పోతున్నాను. కానీ నాక్కావలసింది వెదికి తిని నాజాతిని నేను నిలబెట్టుకోవాలి. తిండంటే బతుకేగాదు నాకు, తిండంటే నాకు నా జాతి”.

”నీదేం నామర్దా బతుకు?” రాబందుకు వినిపించేలా గొంతుపెంచాను ”వొక నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయాన్నిచ్చే తూర్పు దిక్కుతో నాబతుకును లయింప జేసుకోసుకోవడమే నా లక్ష్యం. నా కోరిక తీరే వరకూ బతకడం కోసమే తిండి కావాలి నాకు. కానీ తిండేనా లక్ష్యం గాదు?” అని యెలుగెత్తి కావుమన్నాను. తరువాత దానికేసి మెడ తిప్పయినా చూడకుండా పైకెగిశాను. యెక్కడికక్కడ తన యెల్లల్ని స్పష్టంగా చూపెడుతున్న భూమికీ, తన అవతల హద్దెక్కడో తెలియనివ్వని ఆకాశానికీ మధ్య, భూమికీ సముద్రానికీ తగిలించిన లంకెలాంటి పెద్ద ఆవృత్తాన్ని చుట్టుతూ యెగిరాను. అలసట రాగానే వొడ్డుకొచ్చి చెట్టుపైన వాలాను. మరో రెండు ఆవృత్తాల్ని తిరిగినా సంగమస్థలం కనబడలేదు. పడమటి మబ్బుల్లోంచీ యెప్పుడో సూర్యుడు దొంగతనంగా సముద్రంలోకి కుంగిపోయినట్టున్నాడు. చీకట్లో దిగంతరేఖ మాయమైపోయింది. సంగమ స్థలం సూర్యాస్తమయాన్ని చూడలేకపోయిన మనుషుల నిట్టూర్పుల్లో వూగిపోతూ వుండివుంటుంది. నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయాలకోసం నిరీక్షిస్తున్న నాకు సూర్యాస్తమయాలపైన ధ్యాసలేదు. కానీ సాయంత్రానికల్లా అక్కడికి చేరుకుంటే మరునాటి వుదయానికి సిద్ధమవడం సులభమవుతుంది. పైగా సూర్యాస్తమయ సమయాల్లో ఆశాభంగం చెందిన  మనుషుల నుంచీ వచ్చే నిరాశా రాగాన్ని వినడంలో నాకేదో చెప్పలేని స్వాంతన కూడా దొరుకుతుంది.

పొద్దుటి నుంచీ నన్ను కలిసిన ప్రతి కాకీ నన్ను చాలా విసిగించినట్టే వుంది. వాటిపైన వైమనస్యంతో సంగమం నుంచీ దూరంగా యెగిరిపోతున్నానన్న సంగతిని నేను గమనించలేదు. యిప్పుడిలా యెగిరి యెగిరి అలసిపోతున్నానేగానీ సంగమం దగ్గరి దీపాలు దగ్గరవడమేలేదు. చీకటి రాగానే అలలెందుకంత పెద్దగా గొల్లుమంటాయో తెలియదు. నీరసంగా వో చెట్టు పైకి వాలి అసలటతో రొప్పసాగాను. అమాంతంగా నా పైనేదో పెద్ద బరువుపడింది. రెక్కలు కొట్టుకుంటూ తప్పించుకోడానికి పెద్దగా ప్రయత్నించాను. గుక్క తిప్పుకునే వీలయినా దొరకలేదు. కొమ్మ పైన్నుంచీ జారి కింద పడుతున్నట్టుగా మాత్రమే అనిపించింది.

* * *

చీకటి అంతా అలుక్కుపోయినట్టుగా చిక్కటి చీకటి వొళ్ళంతా పచ్చి పుండులా మంట పెడుతోంది. రెక్కలు సలుపుతున్నాయి. మెడ పైకెత్తలేకపోతున్నాను. చలిలో వణుకుతున్నాను. ముక్కును బలవంతంగా తెరిచాను. కొన్ని నీళ్ళు గొంతులోకెళ్ళాయి. మసక మసకగా యేదో అస్పష్టంగా కనబడసాగింది. నా వొళ్ళు సగం వరకూ తడి యిసుకలో పూడుకుపోయివుంది. నేనో జంబుపొదలో చిక్కుబడి పోయివున్నట్టు చాలా సేపటికి గానీ గుర్తించలేకపోయాను. రెక్కలపైనా, కడుపుపైనా రక్తం గడ్డగట్టి బంకగా తయారైపోయింది.

బలవంతంగా  రెక్కలు విప్పడానికి  ప్రయత్నించాను. ప్రాణమంతా వుగ్గబట్టుకుని  పైకి లేవడానికి చూశాను. కడుపులో పేగులు గోలచేస్తున్నాయి. తినడానికేమైనాకావాలి. తిండి తిండి శరీరమంతా కడుపే  అయినట్టుగా తిండికోసం పరితపించ సాగింది. తిండేబతుకు. బతకంటే తిండే. ముక్కుకు సవ్వగా యేదో తగిలింది. జంబువేర్ల దగ్గరిమట్టి… మట్టిరసం కాస్త మింగాను. ముక్కును పైకి లేపగలిగాను. యీసారి జంబువేర్ల దగ్గర చిన్న పురుగేదో దొరికింది. దాన్నిమింగాక వొంట్లోకి యింకొంచెం త్రాణ వచ్చింది. ముందు ప్రాకుతున్న క్రిముల్ని  తనివి తీరా మింగాను. పొదల్లోంచీ అవతలకి పాకాను. సముద్రతీరమూ. అలలూ కనిపించాయి. మరికాస్త ముందుకు పాకాను.

నా ముందున్న యిసుక గింగిరాలు తిరుగుతూ పైకెగసింది. పెద్ద గద్దొకటి నాముందు వాలి నన్ను పొడవబోయింది. అంతవరకూ యెక్కడున్నాయో తెలియదుగానీ, చాలా కాకులు గుంపుగా వచ్చి నా చుట్టూ యెగురుతూ పెద్దగా అవరసాగాయి. వాటి దాటికి గద్ద రెండు గంతులు వెనక్కుగెంతింది. చుట్టూ యెగురుతున్న తోటి కాకుల్ని చూడగానే నాకూ ఆవేశం తన్నుకొచ్చింది. అరుస్తూ మెడ ముందుకు వొంచి దాన్ని పొడవటానికి ప్రయత్నించాను. కాకులు మరిన్ని వచ్చి కలిశాయి. గద్ద చుట్టూ రెక్కలు కొట్టుకుంటూ రభస చేస్తూ తుఫానే సృష్టించాయి. గద్ద తోకముడుచుకుని పై కెగిరిపోయింది. నేను బలమంతా వుపయోగించి పైకెగిరి గట్టు పైనుండే మొక్కపైకి వెళ్ళాను. ఆ రోజు రాత్రంతా కాకులు నాకు పహరా కాసాయి. మరునాటి వుదయానికి నేను మరికాస్త మెరుగ్గా యెగరగలిగాను.

రెండు కాకుల్ని నాకు తోడుగా మిగిల్చి మిగిలినవన్నీ ముందుకెళ్ళి పోయాయి. ఆ ఇద్దరు స్నేహితులతో బాటూ యెగురుతూ ”మన జాతిని కాపాడుకోవడంకంటే మించిన బతుకేముంది? నన్నూ మీ సైన్యంలో చేరనివ్వండి” అని వేడుకున్నాను.

”నీలో శక్తి పూర్తిగా వచ్చాక చేరుదువులే గానీ మన కవాటికకు కప్పంగడితే సైన్యంలో చేరినట్టే” అందొకటి

ఆ రెండు కాకులతో బాటూ గట్టుకవతలుండే మనుషుల ఆవాసం దగ్గరికెగిరాను. అక్కడి కాలవల్లో దిబ్బల్లో మనుషులు పారేసిన వండిన తిండి తినగానే నాకు మరింత శక్తి వచ్చింది. వూరి శివార్లలో కొందరు మనుషులు పెద్ద పెద్ద తిండి వుండల్ని చేత బట్టుకుని ”కాకా” అని ఆహ్వానిస్తున్నారు. మేమటువెళ్ళగానే ప్రేమగా మా ముందు తిండిని వడ్డించారు. ఆ తిండి భలే రుచిగా వుంది. ”యిప్పుడు మనం శుభ్ర కాకులమై పోయాం” అని కేరింతలు గొడుతూ మేం ముగ్గురమూ పైకెగిరాం.

ఆకాశం నీలి రంగులో మెరుస్తోంది. మాముందో పెద్ద కొండ పచ్చని చెట్లను వూపుతూ పిలుస్తోంది. లోకమంతా తన్మయంలో మునిగి పోయివుంది.  పక్షులూ జంతువులూ మధురంగా అరుస్తున్నాయి. రుచికరమైన ఆహారం తింటే లోకమింత అందంగా సంతోషంగా తయారవుతుందని యిప్పుడే అర్థమయ్యింది.

”మీ రిద్దరూ ఆడకాకులని యిప్పుడే గమనించాను” అన్నాను కొంటెగా. నాతో యెగురుతున్న కాకులు రెండూ సిగ్గు పడ్డాయి. ”భలేవాడివే! నీకిన్ని సపర్యలు యెందుకు చేస్తున్నా మనుకున్నావు?” అందొకటి.

”కానీ మీ రిద్దరు… ముందెవరితో జోడుగట్టాలి?” అని అడిగాను వోరగా చూస్తూ.

”యెవర్ని ముందుగా పట్టుకుంటావో దానితో” అంటూ యింకొకటి వేగంగా యెగరసాగింది.

వేగంగా యెగురుతున్నదే అందంగా వుంది. నేనూ వేగంగా యెగురుతూ దాన్ని పట్టుకునేశాను. మరొకటి దూరం నుంచే నిట్టూరుస్తూ వెళ్ళిపోయింది. చిన్న దానితో బాటూ వో చెట్టుపైకి వాలాను. ముందుగా మనం గూడు గట్టుకోవాలి” అందది. పుల్లల్ని సేకరించి గూడు గట్టుకున్నాం. పగల్లో తిండికోసం యెగరడమూ, రాత్రుల్లో చిన్న దానితో సంసారం చేయడమూ, యీ ఆనందంలో యెన్ని రోజులు గడచిపోయాయో తెలియనేలేదు.

నా జోడుది గుడ్లు పెట్టి పొదగసాగింది. కొన్ని రోజుల తర్వాత వొక గుడ్డు లోంచీ కోయిల పిల్ల బయటికొచ్చింది. ”యిది యెవరి బిడ్డ?” అని మండి పడ్డాను. అది నా ముక్కావేళ్ళాపడింది. నేను పట్టించుకోకుండా యెగిరి దూరంగా వచ్చేశాను. యే బంధాలూ లేకుండా యిలా స్వేచ్ఛగా యెగిరి చాలా రోజులైపోయిందని గుర్తుకొచ్చింది. పైకి, పైపైకి, పైపైపైకి యెగిరి ఆకాశంలో రెక్కలల్లార్చకుండా అలాగే నిలిచిపోయి, నక్షత్రాల్లో నక్షత్రంగా వుండి పోవాలన్న కోరిక పుట్టింది. కానీ కొన్ని రోజులు యెగురుతూ వుండి పోయాక నామనస్సూ, శరీరమూ, కొత్త జోడు కోసం కలవరించసాగాయి. మా కాకుల గుంపుని వెతుక్కుంటూ యెగరసాగాను.

ఆకాశంలో పెద్ద పెద్ద ఆడకాకుల్లాంటి నల్లటిమేఘాలు యెగురుతున్నాయి. చాలా రోజుల ముందు వో చీకటి రాత్రిలో నన్ను ముట్టడించిన గుడ్లగూబ కూడా ఆడదే అయివుండాలి. లేకుంటే ఆ అలజడిలో స్పష్టాస్పష్టంగా కనిపించిన దాని రూపం అంత అందంగా వుండే అవకాశంలేదు. తూర్పుదిశలో యెర్రటి ఆడకాకిలా పుడుతున్న సూర్యుడ్ని చూడగానే నాకేదో లీలగా జ్ఞాపకానికొస్తూ అంతలో  మరుపులో కెళ్ళి పోతోంది.

యెగిరి యెగిరీ విసుగుపుడుతోంది

మేఘాల్లోంచీ సగం విరిగిన గుడ్డులా బయటికొచ్చిన సూర్యుడూ, రెండు కొండల మధ్యలోంచీ యివతలికో విరిగిన రెక్కలా పొడుచుకొచ్చిన సముద్రపుపాయా, ఆ చిన్న సముద్రపు పాయలో తునిగి పడిన ముక్కలా కనబడుతున్న కొండ చరియలనీడా…

”యేమిటంత నీరసంగా యెగురుతున్నావు యెవరినో వెతుకుతూ అలసిన వాడిలా?…”

మెడ తిప్పాను. దూరంగా వో కాకుల గుంపు యెగురుతోంది. వాటిల్లోంచీ యిటొచ్చిన దానిలాగున్న ఆడకాకొకటి నన్ను  పలకరిస్తోంది.

”ఆ కొండ చరియల నీడను పట్టుకోవడం కోసం చొచ్చుకొచ్చిన ఆ కొండలూ, మేఘాల కోసమే సముద్రంలోంచీ బయటికొచ్చిన సూర్యుడూ,” అంటూ వోసారి మెడ గుం డ్రంగా తిప్పి అన్నిటినీ చూశాక” ”యిప్పుడు నువ్విలా వచ్చి నన్ను పలకరించగానే అంతా సామరస్యంగా, సమతూకంగా, సమగ్రంగా మారిపోయిందే…!” అని సంతోషంగా కా గానంచేశాను.

నామాటలు వినబడనట్టుగా అది అదోలా కీకారం చేస్తూ నవ్వి ముందుకెగిరిపోతోంది.

వశం తప్పిపోయిన నా రెక్కలు నన్నా దిశకే వేగంగా  తిప్పేశాయి.

మధురాంతకం నరేంద్ర

మధురాంతకం నరేంద్ర: సుప్రసిద్ధ కథకులు. తిరుపతిలో నివాసం. అక్కడే యూనివర్సిటీలో పని చేస్తారు.

1 comment

  • బాగుంది నరేంద్ర గారూ. చాలా ఆలోచనల్ని రేకెత్తించింది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.