కలవడమెలా?

మొహమాటాలొదిలి మాట్లాడుకుందామా?

పోయినోళ్ళందరూ పోయాక, పోకుండా మిగిలినోళ్లమైనా …

మాట్లాడితే అన్య ధోరణి అని ముద్ర వేస్తారని భయపడకుండా మాట్లాడుకుందామా?

మాట్లాడుకోవాల్సిందే గాని, ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం కష్టాల్లో వున్నాం… అంటారా?

మనం కష్టాల్లో లేనిదెప్పుడు? ఎన్నుకున్న జీవితంలో కష్టాలు అవినాభావం.

కష్టాల్లో వుండకపోతే  జనం మనల్ని గుర్తించరని సందేహం కూడా.

ఏ ప్రజా పోరాటాలు చేయడం వల్ల ప్రత్యేకించి ఇప్పుడు కష్టాల్లో వున్నామో కాస్త చెబుతారా, ఎవరేనా?

‘వునికి’ నిరూపణ కోసం మనల్ని నమ్మిన వాళ్ళను కష్టాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నామో ఒక సారి చూసుకుందామా?

***

ముక్కలు ముక్కలయిపోయాం.

ఎవరి ముక్క మీద వాళ్ళం కూర్చుని ఇదే విముక్తి అంటున్నాం.

ఇప్పుడు కాకుంటే రేపైనా ఇదే… ఇదొక్కటే విముక్తి, మరో మాట లేదంటున్నాం.  

మనకు మనమే… వున్న స్థలానికి జిగురు రాసుకుని అతుక్కుపోతున్నాం. జనాల్ని మనం వున్న స్థలానికి అతికించి వుంచడానికి తంటాలు పడుతున్నాం.

మన్లాంటి వాళ్ళే మరి కొందరు. ఎవరి ఘెట్టో వాళ్ళది. పేర్లు వేరంతే.

నువ్వు తప్పంటే నువ్వు తప్పని.. ఒకర్ని ఒకరం అనుకోడం కేవలం ఒక ఆట.

అదేమంత సీరియస్ విభేదం కాదు. అందుకే, సీరియస్ చర్చ కూడా వుండదు.

అప్పుడప్పుడు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటానని ‘పాజిటివిజా’లు ఒలకబోస్తుంటాం. సహకరించుకుంటాం, ఒకరి సెక్టేరియనిజానికి ఒకరం.

అప్పుడప్పుడు, మనకు వాళ్ళు, వాళ్ళకు మనం పూల దండలేసి సమరస భావ గీతాలేవో పాడుకుంటాం.

మనకు మరీ కష్టం వొచ్చినప్పుడు ఎవరితో కరచాలనానికైనా, ఎవరితో స్వరచాలనానికైనా సిద్ధపడుతున్నాం.

అది ఏ ఆదివాసుల కోసమో అయితే, సరే. అక్కడ, ఒక ఇస్యూ అయినా వుంటుంది, నిజంగా ఉన్నట్లయితే, ఆదివాసులు కేవలం ‘బ్యారికేడ్లు’ కానట్టయితే.

***

ఎప్పటికప్పుడు, అప్పటికి మిగిలిపోయిన గ్రామీణ అమాయకత్వాన్ని కొద్ది కొద్దిగా తోడి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళం వాడేసుకుంటున్నాం, వేటాడే సింహాలుగానో, సింహాల పంచన చేరిన నక్కలు గానో, సింహరాజుల వేటకుక్కలుగానో. ఆ పై ప్రజలూ ప్రజలంటూ మైకు విస్ఫోటాలు.

మనం సమాజ సమస్యల పరిష్కారాలం కాము. సమస్యలం. పాలకులకే కాదు, ప్రజలకూ సమస్యలం.

ప్రజల మస్తిష్కాల మీద దయ్యపు భారాలమయ్యాం. ప్రజలు మనల్ని దాటి పోవాలి, తమను తాము కనుక్కోడానికి.

‘మనం ప్రజల కోసం’ అనడం నిజం కాదు. ‘ప్రజలు మన కోసం’… మన నిష్ఫల ప్రయోగాల కోసం అనేది నిజం.

ఈ నిజం తనను తాను రుజూ చేసుకుని చాల కాలమైంది.

నిజం తెలిసింది, మరిక, ఇప్పుడేమిటి?

***

ఆడవుల్లోని వాళ్లు సరే. ఆడివిలోకి వెళ్లినంత సులువు కాదు దాన్ని వొదిలి రావడం. కంప మీద తువ్వాలు విసిరినంత సులువు కాదు, కంప మీంచి తువ్వాలు తీసేసుకోడం.

ఎంత చిరిగిన తువ్వాలైనా తీసేసుకోడం ఒక యజ్ఞమే. వాళ్లు ఆ యజ్ఞంలోనే వున్నారనుకుందాం.

ముక్కలు ముక్కలై పోవడం, సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చూడడం ఆడవుల వాళ్ల పని మాత్రమే కాదు. ‘వూళ్ళ’ల్లోని వాళ్ళు ఆ తానులోని ముక్కలే.

అవే టాక్టిక్స్.

ముక్కలు ముక్కలయిపోవడం లోనే  వీళ్ళకూ సుఖం. పేర్లు ‘మాహానాడు’లు, ‘దండోరా’లు, ‘దళిత బహుజనులు’. అంతే. పేర్ల తేడా.

ఎవరో అన్నారెక్కడో… దళిత, బహుజన, తెలంగాణా వాదులందరూ ఏకం కావాలని. వెరసి ఒక్కటై బిజేపీని ఓడించాలని. భలే బాగుంది. నినాదం.

తెలంగాణ వాదుల్లో రెడ్లు, కమ్మలు, వెలమలు వుంటారు. రెడ్డి, కమ్మ, వెలమలందరూ అగ్రవర్ణులు, అందువల్ల జన్మతః బ్రాహ్మణవాదులు అనేశాం కదా?!

మరి యిప్పుడు బహుజనుల పిలుపందుకుని వాళ్ళు వొచ్చి కలిస్తే… ‘దళిత బహుజన…’ శిబిరంలో వాళ్ళ స్థానాలేమిటి? ఈ శిబిరంలో తమ చోటు జన్మతః.. అనగా ఎప్పటికీ… కేవలం అనుచరత్వమేనంటే, ఎందుకు వొస్తారు వాళ్ళు, వాళ్ళేమైనా పిచ్చోళ్ళా? కులం పేరిట మేమిన్నాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు చేసిన వూడిగాలు చాలు, ఇప్పుడు అదే వూడిగం దిగువ నుంచి మొదలెట్టాలా అని వాళ్ళలో వాళ్ళయినా మాట్లాడుకోరా?

ఇలా ఎవరినో వ్యతిరేకించడానికి పరిమితమయ్యే ‘ఐక్యత’ ఎన్నాళ్లుంటుంది.

ఏదైనా ఒక పని చేయడానికి కలుపుకున్న ఐక్యత అయితే,  ఆ పని జరిగినంత కాలమయినా వుంటుంది.

ఇప్పుడు మీరు ఉవాచించే ఐక్యత ఎలాంటిది? ఈ ఐక్యత చేసే ‘పని’ ఏమిటి, కేవలం ఒక వ్యతిరేకత. 

***

మొత్తంమీద ఇప్పుడున్నది పాలకుడికి బాగుంది.

ఆదివాసుల వెనుక కొందరు, మాల మహానాడు వెనుక కొందరు, మాదిగ దండోరా వెనుక కొందరు, ముస్లిం/ఇస్లాం వాదం వెనుక ఇంకా కొందరు.. ఎవరికి వారై వుండడం బాగుంది. ముక్కలు ముక్కల రాజకీయాల మీద అధారపడిన వాళ్ళూ… ఏదో కాసేపటి కోసం… బహుశా ఎన్నికల వరకు… ఈ ముక్కలు కలవాలనడం శుష్క నాదమని పాలకుడికి బాగా తెలుసు.  

పాలకుడికి ఇది ఇట్టాగే బాగుంది.

మన వల్ల వాడికి నష్టమేమీ లేదు. పోగా బోల్డంత లాభం.

నువ్వూ, నేనూ, వాడు… ఇలా… నువ్వూ, నేనూ, వాడుగా వుండడం బాగుంటుంది పాలకుడికి.

మనం ‘మనం’ అయిపోకుండా విడి విడిగా, ఫ్రాగ్మెంటెడ్ గా వుండడం బాగుంటుంది పాలకుడికి.

ఇలాగైతేనే వాడి పబ్బం గడుస్తుంది.

వాడు తనలో తాను నవ్వుకుంటున్నాడు.

మనల్నిచూసి. పెద్ద పెద్ద మాటలు చెప్పే మన కొద్ది మనస్సులను చూసి. వైశాల్యపు మాటల మన ఇరుకు మనస్సులను చూసి నవ్వుకుంటున్నాడు శత్రువు.

‘మీరు బయటికి ఏదో అంటారు గాని మీకు మేము బాగా నచ్చాం, అందుకే మేము వుండగలుగుతున్నాం’ అంటున్నారు డొనాల్డ్ ట్రంపులు, నరేంద్ర మోడీలు.

‘మీక్కూడా మా లాగే వుండాలని వుంది. వీలు కాలేదు గాని మీకూ మాలాగే గడించాలని వుంది, గడించిన దానితో గద్దెలు తయారు చేసుకుని కూర్చోవాలని వుంది’.

‘ఎందుకో, ఏ పొరపాటున్నో, ఏ బలహీనతల వల్లనో, అప్పటి ఏ ప్రలోభాల వల్లనో అటువేపు వెళ్ళారు, ఎప్పుడు ఫెన్సింగు దూకేసి ఇటు వద్దామా అని చూస్తున్నారంతే’ అంటారు ట్రంపులు మోడీలు మనల్ని చూసి.

అందుకు సందేహమేల అన్నట్టు ఫెన్సింగ్ దూకేసి పాలక శిబిరాల్లో చేరిపోయిన నిరుటి ‘మనోళ్ల’ను చూడరాదూ?!

వాళ్ళే కదా ఇప్పుడు మన హీరోలు? 

‘టాక్టిక్స్’.

మనలో కొందరికి నిజమైన ‘పని’ లేదు. తమ ఉనికికి అర్థం లేదు. తాము మునుపట్లాగే వీరోచితంగా కనిపించాలి. అలా వుండకపోయినా ఫర్లేదు, కనిపించాలంతే, బై హుక్ ఆర్ క్రుక్.

ఇలా డ్లు పూండ్లు గడుస్తాయి. ఇంఖా వందలు, వేల వ్యర్థ బలిదానాలు. 

పాలకుడికి ఇది బాగుందని మనకు అర్థమవుతోందా?

జనం మీద… ఆదివాసి జనం మీదా, పల్లెటూరి జనాల మీదా… హింస కోసం… వాడికి వున్న పలు సాకులలో మనమూ ఒక సాకు కావడం వాడికి బాగుందని మనకు అర్థమవుతోందా? అసలు మనం వాడి షడ్యంత్రంలో ఒక పాచిక అయ్యామేమోనని అనిపించడం లేదా?

అనిపించదు. అర్థం కాదు. అర్థమయితే, ఇప్పటి మన పేరు ప్రతిష్టలు మనకు వుండవని భయం. అందుకే, ఇది మనకు అర్థం కాదు. కీర్తి కాంక్షను బేఖాతరు చేస్తే అర్థమవుతుంది.

***

నేను ఫలానా వర్గం అని చెప్పుకుంటే నీకు ఆ వర్గం రాదు.

నేను ఈ వర్గంలో పుట్టాను అని కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే, వుద్యోగం రావొచ్చు కాని, ఆ వర్గం రాదు.

దళిత కలెక్టరు కొడుకు శ్రామిక ‘వర్గం’ అయ్యుండాలని గ్యారంటీ లేదు.

ఎవరైనా సరే ఒక వర్గంలో ‘వుండడ’మే అతడి/ఆమె వర్గ వునికికి గుర్తు.

పని చేస్తూ వుండడమే నువ్వు పనివాడివి.. శ్రామికుడివి… అనడానికి రుజువు.

ఎప్పుడో పని చేసి వుండడం కాదు. రేపు పని చేయబోవడమూ కాదు. పని చేసిన వాళ్ళకు పుట్టి వుండడం కూడా కాదు. పని చేస్తూ వుండడమే పనివాడివిగా ఉనికి/గుర్తింపు.

నిజమైన ‘ఉనికి’ ఒక్కటే ప్రాతిపదిక జనం కలవడానికి.

ఈ కలయికలో కలవనిది ఇక పెట్టుబడిదారులు మాత్రమే.   

ఒక పని… ఒక వుత్పత్తి లేదా సర్వీస్… ఎలా జరగాలో ఆ పని చేస్తున్న పనివాళ్ళే వుమ్మడిగా నిర్ణయించాలి.  

ఆ పనిలో కార్మికులెవరు, స్కిల్డ్ వర్కర్లు ఎవరు, మేనేజర్లు ఎవరు అనే నియామకాల్ని  కూడా పని చేసే వాళ్ళే నిర్ణయించాలి. అన్నీ పనులే. అందరూ పనివాళ్ళే. అన్ స్కిల్డ్ నుంచి స్కిల్డ్ వర్కర్లు, మేనేజర్ల వరకు ఎవరు లేకపోయినా ‘పని’ నడవదు. పని చేసి జీతం తీసుకునే అందరూ కార్మికులే. వాళ్ళే నిర్ణయించాలి… తమ శ్రమ ఫలాన్ని ఎలా పంచుకోవాలో. కార్మికులను మేనేజర్లు నియమించడం కాదు. కార్మికులే సంఘంలో చర్చించి ప్రజాతంత్రయితంగా మేనేజర్లను నియమించాలి.

అలాంటి లోకం సాధ్యమే.

ముందుగా మనల్ని మనం పనివాళ్లుగా గుర్తించుకుందాం. ఇప్పుడు ఇది రాస్తున్న, దీన్ని రాయడానికి మథన పడుతున్న నేను కూడా ఒక పని వాడినే. మా ‘రస్తా’ కమిటీ నిర్ణయిస్తుంది మేం ముగ్గురం ఎవరెవరం ఏం చేయాలో, ఎలా చేయాలో. 

పనివాళ్ళుగా గుర్తింపే అన్ని గుర్తింపులకు కేంద్రబిందువు కావాలి. 

అందరం పని వాళ్ళమే అయినప్పుడు, పని చేయడంలో, పనులను నేర్చుకోడంలో, పని ఫలాన్నీ పంచుకోవడంలో, అదనపు విలువ ఎలా ఖర్చవాలో నిర్ణయించడంలో… అందరం భాగస్వాములే అయినప్పుడు మనమెందుకు విడిపోతామిక? వై ది ఫ్రాగ్మెంటేషన్?

నాది రాయలసీమ అయినా నీది కోస్తాంధ్ర అయినా తేడా ఏముంది నాకూ నీకూ మధ్య. ఇద్దరం పని వాళ్ళం కాదూ, పనివాళ్ళుగా వుండడం గొప్ప అనుకునే వాళ్ళం కాదూ?!

మనం ఎవరం ఏ కులంలో పుట్టి పెరిగినా పని వాళ్ళమయి వుండడమే మన వునికికి మొదటి గుర్తింపయితే, అది కాదూ మన మధ్య కృత్రిమ తేడాలు ఆవిరై పోవడానికి.

అది జరిగే వరకు ఇప్పటి ఫ్రాగ్మెంటేషన్ కి ధోకా లేదు. ముక్కలు ముక్కలుగానే వుంటాయి, ఇంత బాధాకరంగానే వుంటాయి.

అది జరిగే వరకు, ఈలోగా వ్యక్తులుగా ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవలసిందే. ఏ నినాదాన్నయునా అది ‘నాకు’ పనికొచ్చేదేనా అని ప్రతి ఒక్కరం తరచి చూసుకోవలసిందే.

పని ఎలా జరగాలో కార్మికులే నిర్ణయించే కో ఆపరేటివ్స్  కల ఇప్పటికే అమలు జరుగుతోంది. వాటి అనుభవాలు తీసుకుని, ఎవరి ప్రయత్నాలు వాళ్లు చెయ్యొచ్చు/

వ్యక్తివాద ప్రపంచంలో ఎలా కోపప్ కావాలో ఎవరి పోరాటం వాళ్ళం చేస్తూనే, కలిసినప్పుడంతా కలబోసుకోవాల్సిన స్వప్నమిది. ఫ్యాక్టరీ కౌన్సిళ్ళ పేరిట ఆంటోనియో గ్రాంసీ కన్న కల దాదాపు ఇదే.  

14-9-2018

 

హెచ్చార్కె

15 comments

 • బావుంది. ఒక పని కోసం కలిసే కలయిక ఆ పని పూర్తయ్యేవరుకుంటుంది .nice qoute sir.
  ఐక్యత అన్న పదానికి అసలు సిసలైన నిర్వచనం చెప్పారు.

 • చాలా బాగుంది అండీ. రచయిత పేరు చూడకుండా చదివా. అయినా మీదే రచన అనిపిస్తూనే ఉంది.
  అవును..కంపమీద తువ్వాలేస్తే తీయడం కష్టమే మరి!

 • నిరాశ వాదం ఎక్కువ కనిపించింది . అంతే కాక పూర్వ దిఫ్ఫరెన్సెస్ కూడా కనిపించాయి.

 • ‘ఏం చెయ్యాలి?’ అని ఆలోచించుకోవడానికి మూలాధారంగా నిలుస్తుంది,ఈ సంపాదకీయం.
  ” నిజం తెలిసింది,ఇక ఇప్పుడేమిటి?” అన్నారు. ఏమానిజం?ఇప్పుడు ఉన్న స్తితి లోని నిజమా?లేక సరికొత్త విముక్తి మార్గమా?
  “……..కో ఆపరేటివ్స్ ఇప్పటికింకా కలలే.ప్రయోగాలే” అంటూ నిస్పృహను తెలిపారు. సోషలిజం లోజరిగే పనులు ఇప్పుడే జరగాలంటే ఎలాగండీ!
  ఇప్పుడున్న ప్రధానసమస్యల్లో ఒకటి అసలైన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం,రెండవది దళిత బహుజన వాదాలపై ఇంకా సరైన సైద్ధాంతిక పోరాటం లేకపోవడం.

 • 1 . ప్రీతమ్ గారు, ప్రశ్నగా ఆడిగారు కాబట్టి ఈ పునశ్చరణ: ‘నిజం తెలిసింది’ అనే మాటకు ముందు వున్నదంతా విముక్తి మార్గానికి సంబంధించి ఇప్పుడున్న స్టితి మీద నా వ్యాఖ్యానమే కదా?! నిజం తెలియడం దాని గురించేనని ఇంకొంచెం మనసు పెట్టి చదివితే మీకే తెలిసేదేమో. 🙂
  2. మీరు ‘నిస్పృహ’ అని రాశాక, సంపాదకీయంలో ఆ వాక్యాన్ని తిరుగ రాయాలనిపించింది. నిజానికి కార్మిక సహకార సంఘాలు కేవలం ప్రయోగం కూడా కాదు. ప్రారంభం కదా అని అలా రాశానంతే.
  3. మీ కోసం ఇతర స్నేహితుల కోసం ఈ రెఫరెన్సు:
  https://en.wikipedia.org/wiki/Mondragon_Corporation

  ఆ వాక్యాన్ని తిరుగ రాశాను, ఈ విషయమై నాలో వున్నది ఒక గొప్ప ఆశ. నిరాశ, నిస్పృహ కాదు.

 • ఈ ముక్కలు క్షిణించి కూడా చాల కాలం ఐంది . ఇప్పుడు చెయ్యవలసింది కొత్త నిర్మాణం. బ్యాక్ టూ బేసిక్స్. చరిత్ర, తత్వశాస్త్రం, లాజిక్ పాటలు మళ్ళి నేర్చుకొని విమర్శనాత్మక పరిశీలనకు నిలబడని వాటిని ఆన్-లెర్న్ చేసుకొని కొత్త ప్రయత్నం చేయడం.

  • ఔను, నరేంద్రమోహన్, ఓడిపోయిన చోటనే కూలబడి వుండాల్సిన అవసరం లేదు. ఉన్న అనుభవాల లోంచి జ్ఞానాన్ని తోడుకుని, ఎప్పటి దారి అప్పుడే వేసుకోవాలి. మనకు ఏ కావాలనుకుంటున్నామో దాన్ని మరిచిపోవద్దు. చతికిల పడి వుండడాన్ని కొనసాగించడమే పోరాటం అయిపోరాదు. కార్మికుల ఇనీషియేటివ్ + కార్మికుల నాయకత్వం చెడనంత వరకే ఏదైనా సరైనది. కార్మికత్వం లేనిది ఏదీ సరైనది కాదు.

 • కమ్యూనిస్టులు,,కమ్మ్యూనిస్ట్ పార్టీలలో చీలికలు,తిరిగి ఐక్యత కోసం కృషి,ఆ కృషిలోచిత్తశుద్ధిలేకపోవడం. అష్టావధానం లో అక్షర నిబద్ధి?ప్రక్రయలో ఫలానా అక్షరం రాకుండా పద్యం చెప్పాలనే షరతుంటుంది.అలా నామవాచకాలు వాడకుండా భలే రాశారు. ఇలా రాయాల్సిన పరిస్థితి ఏముందోమరి.కొంతమంది శ్రోత్రీయులకు అర్ధమైనా, చాలాసులభంగా చెప్పగలిగిన విషయం సాధ్యమైనంత క్లిష్టమైన శైలిలో రాశారనిపించచింది

 • అయ్యో కష్టపడి చాలా కామెంట్ రాశాను.మళ్ళీ కనిపించలేదు బహుశా సాంకేతిక లోపమైవుండాలి….చాలా మొహమాటం గా రాశారని నా అభిప్రాయం.

  • గంగాధర రావు గారూ, సాంకేతిక లోపం ఏమీ లేదు. మీరు కామెంట్ రాశాక సంపాదక వర్గంలో ఎవరమైనా చూసి, దాన్ని అప్రూవ్ చేశాకే అది బహిరంగంగా కనిపిస్తుంది. మేము అప్రూవ్ చేయకపోతే కనిపించదు. దీన్ని మోడరేషన్ అంటారు. అబ్యూజివ్ వ్యాఖ్యలను నివారించడానికి ఈ మెకానిజం. మీ వ్యాఖ్యకు థాంక్స్. మొహమాటం లేకపోలేదు. కాని, విషయంలోనే కొంత క్లిష్టత వుంది. ఇందులో ఇంతవరకు ముందుకు రాని కొన్ని విషయాలున్నాయి. అంతే. 🙂

 • ఈ సంపాదకత్వం లో నిరాసా వాదనే కాక కొంతమంది వ్యతిరేకత కనిపిస్తోందని నేనీ ఇదివరకే చెప్పాను.
  ఫేస్ బుక్ లో మీకూ కూర్మనాధ్ గారికి జరిగిన చర్చకూడ పూర్తిగా చూశాను. మీరక్కడ ఒక విషయం చెప్పారు, ఇప్పుడు ఆడవులలో జరుగుతున్నా పోరాటాలకు అర్ధం లేదని. అవన్నీ ఖనిజ సంపత్తి తో నిండివనీ, వాటి కోసం చాలా పెద్ద ఖనిజ కంపెనీలు, vedantha, ఎస్సార్ లాంటివి ప్రయత్నం చేస్తున్నాయని మీకూ తెలిసే ఉండచ్చని అనుకుంటున్నాను. తెలియక పోతే తెలుసుకోవాలి. Iron Ore, coal, bauxite, manganese , క్రోమ్ వగయిరాలు ఉన్నాయి. అక్కడనుంచి ఆదివాసులను తప్పించి ఆ అడవులను ఛేదిస్తే కానీ ఈ వనరులు పెట్టుబడి వారికి దొరకావు.

  ఇవన్నీ ఎక్కువగా, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో, ఛత్తీస్ ఘర్ , జార్ఖండ్, కొంత్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయని, ప్రభుత్వ సంస్థ Indian Bureau అఫ్ Mines వారి గణాంకాలు చూస్తే తెలుస్తుంది.

  మరి అడవులమీదే ఆధారపడి బతుకుతున్న ఆదివాసుల బతుకులేమవుతాయి. మీరు 24 గంటలూ కార్మికులే అంటున్నారు, కానీ ఇప్పటికే బతకడం కష్టమయిన గిరిజనుల బతుకెలా. .ఇది మీ ఆలోచనలో పెద్దలోపం.

  • దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు అడవులలో పోరాటం చేస్తున్నారనే భావిదాం. ఎన్ని బాంబులు పేల్చి, ఎన్ని ఎకరాలు పంచి ( దున్నేవారికి పంచింది ఏమేమి లేదు ఎందుకంటే అడవి ) ఎన్ని “వర్గ శత్రువులను” నిర్ములించి రిలయన్స్ , వేదాంత , ప్రపంచ బ్యాంకును స్వాధీనం చేస్తుకుంటారు ? ఇప్పటికి కనీసం అడవి అంచున ఉన్న చందరపూర్ణో, ఏలేశ్వరన్నో కనీసం ఒక్క రోజు చుట్టుముట్టిన అధరాలు లేవు. మరి ఈ వ్యవసాయిక విప్లవం యొక్క ఇరుసు లేదు బండి లేదు. మావోయిజం దాని పెద్దన్న స్టాలినిజం అనే గుదిబండలు మేడలో మోసుకొవటం తప్ప సాధించింది స్వల్పం.

 • సుబ్రహ్మణ్యం గారు, మరోసారి మీ అభిప్రాయాన్ని వివరంగా రాసినందుకు, దాన్ని అక్కడా ఇక్కడా ప్రచురించినందుకు చాల కృతజ్ఞతలు.

  1. మీరిది వరకు ఏం చెప్పారో అది పూర్తిగా తప్పు. సంపాదకీయంలో నిరాశ లేదు. మీరు ఏది ఆశ అనుకుంటున్నారో ఆ ఆశ ఆశ కాదు. ప్రజలకు ప్రాణాంతకమైన ఒక అబద్ధం. సంపాదకీయం సగంలో వాస్తవికత (భ్రమ నిరాకరణ) మరో సగంలో గొప్ప ఆశ వున్నాయి. గ్రాంసీ కాలం నుంచి చర్చల్లో, ప్రయత్నాల్లో వుండిన వర్కర్స్ కౌన్సిళ్లలో, నేడు కొందరు ప్రయత్నిస్తున్న కార్మిక సహకార సంస్ఠల్లో లేని సోషలిస్టు ఆశ మీ చంపుడు దాయాల ‘పులిజూదం’లో వున్నదనడం… ఇది నేను మీ వంటి పెద్దవారి నుంచి ఆశించే విజ్ఞత కాదు.

  2. అడవులలో మైదానాలలో ఖనిజ సంపద గురించి నాకు తెలుసు. దాన్ని కాపాడ్డం కూడా ప్రజాతంత్ర యుతంగానే జరగాలి. అది సాధ్యం. మీరు చెబుతున్నట్లు ఈ హత్యల ద్వారా అది జరిగితే బాగుండునేమో గాని, జరగదు, ఇంకా పలువురి ప్రాణాలు పోవడం తప్ప. ఈ పద్ఢతిలో కొన్ని సందర్భాలలో ఆడవుల దోపిడీ తాత్కాలికంగా ఆగితే ఆగొచ్చు గాని, వాస్తవంగా అగదు. పెట్టుబడిదారీ శక్తులు, ఆదాయ వ్యయాల లెక్కలు చూసుకుని, తమ బలగాల్ని కూడ దీసుకుని తమ పని తాము చేసుకుంటాయి. అక్కడా, బయటా ప్రజలను కూడగట్టి ప్రజాతంత్ర వుద్యమాలు నిర్మించడం ద్వారానే అడవుల రక్షణ, పర్యావరణ రక్షణ సాధ్యం. కొన్ని దళ చర్యలతో, కొందరు బినామీ ఆదివాసుల హత్యలతో ఈ పని జరగదు.

  3. ‘అక్కడా బయటా ప్రజలను కూడగట్టి …’ అని అనడం ఎందుకంటే, పర్యావరణ పరిరక్షణ కేవలం ఆదివాసుల కర్తవ్యం కాదు. కేవలం వాళ్ళు మాత్రమే దీనికి బలి కావాలనడం పరమ అన్యాయం. ప్రర్యావరణ పరిరక్షణ… మైదానాలతో సహా ప్రజలందరి కర్తవ్యం. దానికి సుందర్ లాల్ బహుగుణ, మేధా పాట్కర్ వంటి పర్యావరణోద్యమకారుల మార్గమే సరైనది. ఆ మార్గాన్నే ప్రోత్సహించాలి. దానికి మించి మీ దళ చర్యలు సాధించేది ఏమీ లేదు. అమాయక జనాల ప్రాణ హరణం తప్ప.

  4. గిరిజనులు అడవుల్లోనే వుండాలా? అటవీ వుత్పత్తుల మీద ఆధారపడి మాత్రమే, వారి పాత జీవన విధానాలతోనే వుండాలా? కొత్త నైపుణ్యాలు నేర్చుకుని బూర్జువా సమాజంలో కలవగూడదా? వారి జీవితాలు ప్రీ ఫ్యూడల్, ఫ్యూడల్ దశల వద్దనే ఆగిపోవాలా? అలా ఆగిపోవడం అవాంఛనీయం, అసాధ్యమని మీకు తెలీదా? అది తెలీకపోతే మార్క్సిజం నుంచి ఏమి నేర్చుకున్నట్లు? కాస్త ఆలోచించండి.

  5. పర్యావరణ రక్షణ అందరి పని అనుకున్నప్పుడు, ఇక ఆదివాసుల బతుకులు ఏమవుతాయి? అంటారు మీరు. ఏం ఒక నాడు మనందరం ఆదివాసులం కామా? ఒకనాడేమిటి… నా బోటి వాళ్ళం మూడు నాలుగు తరాల కిందటి వరకు ఆదివాసులమే అనుకుంటాన్నేను. (మన ఇళ్ళలో మిగిలిన ట్రైబల్ సాంస్కృతిక విశేషాలు దానికి సాక్ష్యం.)

  5. అభివృద్ధి క్రమంలో పునరావాసం, స్థానిక అభివృద్ధి సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది తప్పక చూడాలి. ఇది మైదాన ప్రజలకైనా అడివి ప్రజలకైనా అవసరమే. అది కూడా ప్రజాతంత్రయుతంగానే సాధ్యం. అంతే గాని జనం అడవులకు, లేదా పల్లెటూళ్ళకు, లేదా చెప్పులు కుట్టడం, బట్టలు నేయడం వంటి పనులకు జిగురు పెట్టుకుని అతుక్కుపోవాలని మనమెందుకు కోరుకోవాలి. ప్రకృతితో సహజీవనం సరైనదే గాని, అతి అటాచ్మెంటు మంచిది కాదని మీకు తెలీదా? ఆహా! మీకెందుకు తెలీదు, వున్న వూరు వొదిలి, రాష్ట్రం వొదిలి, దేశం కూడా వొదిలి టింగు రంగా యని ఎక్కడంటే అక్కడ బతికేస్తున్న వాళ్ళం కదా మనం. మధ్యలో ఏ మందు కొట్టినప్పుడో కవిత్వం రాస్తున్నప్పుడో పల్లెకు పోదాం, పారును చూదామని రాగాలు తీయడం వొట్టి వుబుసుపోక కాకుండా నిజమా? నిజమైతే ఎందుకు పోం పల్లెకు? కబుర్లు. 🙂

 • కార్మిక సహకార సంస్థలు ఇప్పటికే ఉన్నాయ్ కానీ అవి రాజ్యాన్ని స్పాంటేనియస్ గా తొలిగించలేవు కావలసింది వర్కింగ్ క్లాస్ – ప్రధానంగా పారిశ్రామిక కార్మికుల – నాయకత్వంలో విప్లవం. అంతిమంగా రాజ్యం మీది అధికారం ఎవరిదీ అన్న సమస్య పరిష్కారం కావాలి. దగ్గర దారి అడ్డదారి వేరే ఏది లేదు.

 • ఇంపీరియలిజం అనేమాట వదిలేశాం.ఓ.కే ఫరవాలేదు లేదు.తెల్లవాడి పెత్తనం అనే మాట కూడా public discourse లో. విన బడికూడ చాన్నాళ్ళయింది.ఎంత sub-altern ఐనా మరీ ఇంతా!!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.