“కాల్వ”

మొన్న మాయమ్మ ఫోను సేసి వర్యా దరేసా సచ్చిపోనిక్య వచ్చెడ్యంట ఒకసారి ఊరికి పోయి సుసిరాకుడదా నిన్ని శానా మతికి సేసుకున్న్యాడంట అనె. సర్లేమా అని ఆయిత్వారం నాడు ఇల్లిడిస్తి. . పేనవున్న ఫోటో సూస్తిరా . అది ఏ మనుకుంట్రి . మావూరు కాల్వ. ఏ అంతా సుళ్ళ సెబుతావు యానా బట్టన్నా దీన్ని కాల్వ అంటాడా, సెప్పినోనికన్న సిగ్గు లేదు ఇనేటోనికన్న అరువుండొద్ద అనుకునేరు కదా. నిజన్గప్పా సామితోడు. అది మావూరి కాల్వనే. ఇంగ నాకైతే సూడు కండ్లల్ల నీల్లొచ్చ. కడుపులో ఎవుల్లో దేవినట్ల్లయ్యిడిస్య. ఎట్లా కాల్వని ఈనా బట్లు ఇట్ల సేసిడిసేరు కదప్పా అనుకొనిడిస్తి.

మేం సిన్నగున్నప్పుడు ఎట్లుండ్య. నిండా పారుతుండ్య . నిండుమంచి నడిసినట్ల పారుత వుండే. ఆంజినేయ సామి గుడి కాట్నించి పోతుండ్య. ఇంక మావూరు అయంమొల్ల వగులు సేప్పనీక్య లేదుల్య. ఒగాయమ్మ గిన్నిలిని కడిగితే ఒగాయమ్మ బొట్లు ఉతికితే ఇంగోగాయమ్మ పీతి బట్లు ఉతుకుతుండ్య. ఒగుడు ఎనగొడ్లు కడుగుతుంటే, ఒకాయప్ప కొక్కెరగ కూసోని ___ కడుక్కుంటుండె. పెద్ద మరీడు సాకలోల్లు మావూరికి వొస్తుండ్రి బట్లుతికేకి. పైటల్యకి సేన్లో కలుపులు తీసేటొల్లు కాల్వ పక్కన్నే ఇగిలిచ్చుకుంట , కువ్వాడం సేసుకుంట బువ్వ తింటుండ్రి . మచ్చన్న సేనుకాడ కొంచిమి లోతెక్కువుండె . పిల్లగాండ్లన్తా పొద్దుగూకులు ఆడ్నే. ఈత గొట్టి గొట్టి ఎంటికిలు ఎర్రగా తాటి పండు లక్క అయితుండ్య . ఇంగ సూడు నాయన మేమంతా కర్రినా బట్లు కదా . పై అంతా కర్రిగా , అరిసేతులు అరికాళ్ళు తెల్లగా వుంటుండ్య. కొండ్లు సూడి బట్టి సారాయి తాగినోల్లకున్నట్ల ఎర్రగుంటుండ్య. ఉరూరె కాల్వ సుట్టు తిరుగుతుండ్య.

ఒకసారి మా నాయనకి , ఈడిగ కాజన్నకి కొట్లాట పడిడిస్య. ఆయప్పెమో మా నాయన్ని మావూరు పున్న్యాన బతుకుతున్నావనే. మా నాయనేమో నువ్వు గంగమ్మ పున్న్యాన బతుకుతున్నావనిడిస్య . మా నాయిన అనింది నిజమే సూడప్ప. మా వురంతా గంగమ్మ పున్న్యాన బతుకుతుండ్య. మా ఇస్కులు యనక మేం పుండుకూర, సెవులకాయిలు ఏసింటిమి. ఇస్కులు పక్కనే దరేసా సేనుండ్య. ఆయప్పోల్లు సేనికి నీళ్ళు పెట్టేటప్పుడు జతగాల్లంత కలిసి నీళ్ళు దొంగులుకోని ఇస్కులు ఎనకాల వున్న పున్డుకూర సెట్లకి పెడుతుంటిమి. సేనుకి నీళ్ళు కట్టుకుంటా దరేసా కొడుకు పెద్ద కాసిమి ఏమప్ప నీళ్ళు తగ్గేవ్యా అనుకొంటా పిల్లకల్వెమ్బడి వస్తుండ్య. ఇంగ సూసుకో ఎక్కడోల్లక్కడ పారుతుంటిమి. ఇంగ ఆయప్ప వొచ్చి తురక సారుకి పితూర్లు సెపుతుండ్య. తురకసారు మక్కాకి పోయి వచ్చిండ్యనంట. మాయమ్మకి ఐస్క్రీం సాయిబు సెప్పెడ్యనంట. మాము ఎంత అల్లరి చేసినా ఏమి అనకుండె. మామంతా ముందు కూసుంటే మా ఎనకాల తురకసారు నమాజు సెసుకుంటుండ్య. నమాజుని సూసి మాము ముసి ముసిగా నవ్వుకుంటాంటిమి. మావూర్లో తురకొల్లు లేకుండ్రి. పింజరోల్లు ఉండ్రి. పింజరోల్లకి నమాజు సెసేది తురకసారే నేర్పిస్తావుండ్య. రెడ్డమ్మని సేసుకున్న తురకాయన ఒకాయన కర్నాటకము నుండి మా వురికి వచ్చిండ్య. ఆయప్పని మాము తురకరెడ్డని అంటుంటిమి. పింజరి లొడ్డ బావ గాడు నా న్యాస్తుడు. ఓలే నామాజు ఏమి సదువుతార్లె అని అడిగితి. ఏమోలే నానైతే ఊక్య పలుముతాను సూడ్ర అనిడిస్య.

కాల్వ కత సెప్పకుండ వగులోనిలెక్క ఈయప్ప ఏమేమో సెపుతా ఉన్నడనుకొంట్రి గదా . అవును నిజిమే. మా వుర్ని తల్సుకుంటే నాకు శానా కుశాలు. ఎం జేయాల మల్ల. ఆ వూరు అట్లాంటిది. ఇంగ ఇప్పుడు ఈ కాల్వని సూస్తే ఏడుపొస్తాన్ది. మొత్తుము పూడిపోయిడిసేద్య. కాల్వంతా పరంగి సెట్లు మోలిసేవ్య. మావుర్లో ఇదోతరగతి వరకే ఉండ్య. కొంత మంది ఆరో తరగతి సదువేకి గోనిగండ్లకి, కొంత మన్దేమో ఎమ్గానూర్కి పోతుండ్రి. ఎవుడు ఎట్ల బోయినా రెండు అమాడాలు కాల్వెంటె నడుసుకుంటా పోతే రోడ్డొస్తావుండ్య. ఏమ్మునూర్లోగ్యాని, గోనిగండ్లలో గ్యాని బస్సెక్కి కాల్వ అనిడిస్తె సరిపాయ టికట్టు కొడతావుండ్రి. మా కాల్వ అంత ఫ్యామస్సు. రోడ్డు మీద కాల్వ మోరికి రాసింది ఇప్పిటికి నాకి గురుతుండాది. “అనేక కోట్లు వెచ్చించి వ్యయ ప్రయాసాలతో అందజేసిన నీటిని పొదుపుగా వాడండి” అని రాసిండిరి. ఇప్పుడు ఆ మోరి లేదు. పాండు రోగం వచ్చినోని మాదిరి అయిపోయిడిసింది మా కాల్వ .

నా న్యాస్తుడు బోయ అన్జినయ్య కనపడిడిస్య. రే బొప్పోడా (వాని అడ్డ పేరు అది) గురుతు పడితివ్యా వర్యా అంటి. పైకి కిందికి సూసి అనుమేసప్ప కదా అనిడిస్య. అవులే అంటి. ఎమిలే ముసులోనిమాద్రి అయ్యిడిసెవ్య అంటి. నువ్వంటే పట్న వాసమోడివి, ఇంగ మీము ఇట్ల గాకుంటే ఇంగెట్లా వుంటామనిడిస్య. ఎం లే సేన్లో ఏమేసేవ్య అనిఅడిగితి. ఎమేయ్యాల నీళ్ళు లేవు గీల్లు లేవు. ఎం ఏసేది అనిడిస్య. మలి ఎట్లా లే అంటి. ఎంఎట్ల. ఆటో నడుపుతుండాను అన్య. యాదో ల్యాప్ప బతికేకి అంటి. ఏమ్లే కాల్వని ఇట్లసేసేర్య అంటి. ఎవురు సేసేర్య, మామ్ సేసేమ్నా. ఎవుడన్నా నోటికాడి కూడిని సెడుపుకుంటారా? పైన్నిండి నీళ్ళే రాకపోతే మేమేం సేయాల? కర్నాటకం లోన గుంటూర్నబట్లు గుత్తకి సేన్లు తీసుకోని పైకాల్వకి గాలి పైపులు ఎసికాసి నీళ్ళు దొంగులుకుంటుంటే యాడ వస్తాయి కిందికి అని ఇడిస్య. ఇంగ కాల్వ కి రిపేరు ల్యా గిపేర్లుల్యా . యానాకొడుకన్నా పట్టిచ్చుకునేడనా . కాల్వ పోయినప్పట్నుంచి బోర్లు కుడా ఎండిపాయ. ఎమో ల్యాప్పా మా దరిద్రం ఇట్లుండాది అనె. ఏమి సేయాలో , ఏమి సెప్పాలో అరుతం కాల్యా. పిల్లలెంతమంది రా అంటి. టాపిక్కు తిప్పిడిస్తి. ఒక బిడ్డ ఒక కొడుకు అని సెప్పె. బిడ్డ్ని గంజిల్లకి ఇచ్చెనని సెప్పి ఊరకాయ. ఏమ్లే కొడుకు సంగతి సెప్పవాలే అంటి. కండ్లల్ల నీళ్ళు పెట్టుకొనిడిస్య. ఎం సెపుతావులే వాని కత అనె. ఏమ్లే అట్లాంటివి అంటి. ఏమి కొడుకు వాడు పనికిరానోడు అనె. ఆయప్ప కర్నూల్లో యాదో పెద్దకాలేజిలోన సదువుతున్నడ్లె. ఆయప్ప సదువుకోరా ముండమోపిగా అంటే మనకి అన్నేయం జరిగేద్య, మన నీళ్లన్నీ దొంగులుకుంటుండారు, మనూరి కాల్వ సూసి కుడా నీకి బుద్ధి రాల్యా కదా నాయినా అంటండాడు. వాడు అదేందో రాయలసీమ అంటాని తిరుగుతా వున్నాడు . ఎవురికి పట్టంది ఆయప్పకు ఏంటికి?  అంతా నాసావుకి వోచ్చేద్య సుడప్పా అనె . లే నీ కొడుకు మన మాదిరి ఎక్కడతప్పినోడు కాదులే , వాడు మొనగాడులే అంటి. ఎదలో వున్న భాదల్లా తీరినట్లాయ నాకి.

మారుతి పౌరోహితమ్

మారుతి పౌరోహితం: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నివాసి. అప్పుడప్పుడు రాస్తుంటారు.

5 comments

  • స్యానా వ్రాసిన్యావ్ అన్న,సిన్నపుడు సేసినవి అన్ని మళ్లీ గుర్తుకు తెచ్చిన్యావన్నో,మాకొట్టము కూడా## వంక పక్కనే ఉన్డ్డేది,మాయబ్బాను వంక్లో రామ్ల అనే వాళ్లు,వానోచ్చే అన్థే యిన్కా….

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.