కొత్తాంధ్రపదేశ్ లో నాలుగేళ్ళ నాటకం

ఇరవయ్యో శతాబ్దంలో నోటి మాటకు విలువ లేకుండా పోయిందంటారు. నేటి దేశ పాలన విధానాలను నిశితంగా పరిశీలిస్తే నోటిమాటకే కాదు, రాత కోతలకు కూడా విలువ లేకుండాపోతోంది.

2014 మేలో ఆంధ్రప్రదేశ్ లో మూడవ పర్యాయం…  కొత్తాంధ్రప్రదేశ్ లో మొదటి సారి… తెలుగుదేశం పార్టీ పాలన అట్టహాసంగా మొదలయ్యింది.

సంఖ్యా పరంగా రెండు లక్షల ఓట్ల తేడానే అయిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లను సంపాదించుకుంది. అనూహ్యంగా టిడిపికి మెజారిటీ రావడం వెనుక నూతన రాజధాని ప్రాంత ఎంపికపై ప్రజల్లో వుండిన సందేహాలు, కులాల మధ్య పోరు వంటి కారణాలే కాకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలుముఖ్యంగా రుణమాఫీ వంటివి ప్రజలను బాగా ఆకర్షించాయి.

రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి నెరవేర్చలేని హామీలిచ్చి గెలిచిన తర్వాత మాట తప్పడం ఇష్టం లేకనే అధికారానికి దూరమయ్యామని ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష నేత సమర్ధింపు. ఇది కొంత మేరకు సమంజసమే. అటుతొమ్మిదేళ్ల నా పాలనానుభవం, ప్రతిపక్ష నాయకునిగా పదేళ్ళ అనుభవం, హైటెక్ అభివృద్ధి వల్ల అధికారంలోకి వచ్చామ’’ని ముఖ్యమంత్రి గారి వాదం.

ఓడిన వారి మాటలెలావున్నా గెలిచినవారే ప్రజలకు ప్రతినిధులు. జవాబుదారీ.  అధికారంలోకి వచ్చినవాళ్ళు తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అడగడానికి ప్రజలకు హక్కు ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ హక్కుల కోసం గొంతెత్తడానికి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. నమ్మకాలను వమ్ముచేసి తమను వంచించేవారిని మరోసారి యెవరూ కోరుకోరు.

ఇవాళ రాష్ట్రంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలే కాకుండా (నిజానికి విభజన చట్టంలోనివి హామీలు కాదు; పార్లమెంట్ ఆమోదించిన అంశాలు ) 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పక్షం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న ఆలస్యం పట్ల మెజారిటీ జనాలు అసంతృప్తిగా వున్నారన్నది వాస్తవం. నిత్య జీవితంలో ప్రాథమికావసరాలైన కూడుగుడ్డ, నీడ కోసం శ్రమించే వారు తమను మోసం చేసిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్లెక్కుతారనుకోవడం కల్ల. ఖచ్చితంగా ఇది ఆత్మహత్య ప్రేరేపణే. తిక్కోని పెళ్లిలో తిన్నవాడిదే సొమ్మన్నట్లు వుంది. ప్రభుత్వం తన హామీల పట్ల జవాబుదారీగా వ్యవహరించడం కాదు కదా ఆడిగినవాడిపైనే కేసులు బనాయిస్తోంది. తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, తమను ప్రశ్నించకుండా వుండడానికి కింది స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. ఎవరైనా నిజాయితీ గల అధికారులు యీ అక్రమాలను నిరసిస్తే వారిపై సాక్షాత్తు ఎమ్మెల్యేలే దాడికి తెగబడుతున్నారు. గ్రామీణ పరిపాలనలో ప్రజల చేత ఎన్నుకోబడిన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ వుండగా, దాన్ని నిర్వీర్యం చేస్తూ, అస్మదీయులతో గ్రామానికొక జన్మభూమి కమిటీని ఏర్పరిచి వాటికే పెత్తనం అప్పగించారు. ఈ జన్మభూమి కమిటీల పనేమిటంటే ప్రభుత్వ పథకాలు తమ పార్టీ మద్దతుదారులకే వర్తింపజేసుకోవడం, ఫించన్లు, రేషన్ కార్డుల వంటివి తమకు నచ్చిన వారికి ఉంచి, నచ్చని వారివి తీసిపారేయడం.

ఇచ్చిన హామీల గురించి ప్రజలు అడిగే ధైర్యం చేయరని అధికార పార్టీ ధీమా. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ అధికారాన్ని కలిసి పంచుకున్నాయి. రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ మంత్రులు, కేంద్రంలో ఇద్దరు టీడీపీ మంత్రులు కొలువుదీరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని కేంద్రం బాహాటంగానే సమర్ధిస్తూవచ్చింది. రాజధాని ఎంపిక, ప్రభుత్వ సంస్థల స్థాపన, హైకోర్టు ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు వంటి వాటిపై నిర్ణయాల్లో నిరభ్యంతరంగా సహకరించుకున్నారు. మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా, ఏపీ కి ప్రత్యేక హోదా అంశం పేరుతో బీజేపీ తో టీడీపీ మైత్రిని తెగదెంపులు చేసుకుంది. కారణాలు మరేవో వుండొచ్చు. బంధం చెడిన తర్వాత ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

నాలుగేళ్ళ మిత్రుత్వాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 2014 తర్వాత జరిగిన పరిణామాలు, అభివృద్ధిలో అయినా నిర్లక్ష్యంలో అయినా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సమానమైన క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే నాలుగేళ్ళ పొత్తు వరకు ఎటువంటి నిందారోపణలు లేకుండా వుండి బంధం చెడగానే ఒకరిపై ఒకరు శ్వేత పత్రాలు విడుదల చేసుకోవడం మొదలుపెట్టారు. మేమిచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో ఖర్చు చేయలేదని కేంద్రం, కేంద్రం తగినన్ని నిధులు కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. వారి వ్యాఖ్యలు సాంతం వింటే ఆరోపణల్లోని నిజాలు తమకు నాలుగేళ్లుగా తెలుసునని ఇరువురు బహిరంగంగానే ప్రకటించుకుంటున్నట్టు ఉందిఒక్క ప్రత్యేక హోదా అంశం చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోపాయికారి పొత్తు బయలుకావడానికి. నాలుగేళ్లుగా మన ముఖ్యమంత్రి గారు హోదా ఏమైనా సంజీవనా  అని, హోదాతో యేమి జరగదని చెబుతూ హోదా డిమాండును నీరుగార్చుతూ  పబ్బం గడిపాడు. ఇప్పుడు హోదా హోదా అంటూ గొంతు చించుకుంటున్నాడు. పైగా 2019 లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించి తెస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. కొనుగోలు చేసిన ఎంపీలతో కలుపుకుని పద్దెనిమిది మంది సభ్యులు వున్నా కూడా యీ అంశాన్ని ఒక్క అడుగు ముందుకు తీసుకుపోలేని యీ ప్రభుత్వం ఇరవై ఐదు మంది ఎంపీలతో ఏకంగా హోదా తెస్తామని ప్రగల్భాలు పలకడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం.

రాష్ట్ర ప్రభుత్వం… సంవత్సరకాలం పాటు హైదరాబాదు లోనే పాలన సాగించి క్యాంప్ ఆఫీసుల రిపేర్లకు లక్షలు తగలేసింది. ఈ కాలంలోనైనా, రాజధాని ప్రాంతం ఎంపికలో అన్ని ప్రాంతాలవారి డిమాండ్లు కనీసం వినాల్సింది. అవేవీ వినకుండా ఎకా ఎకిన  విజయవాడ ఖాయమైపోయింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టర్ల మార్పులు, టెండర్ విలువల పెంపు దగ్గరే ఆగింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఉపాధి హామీ పథకంలో కూలీలకు చెల్లించవలసి బకాయిలు 550 కోట్లు వుంటే వాటి నిధులను ఇతర పథకాలకు మళ్లించకూడదని చట్టంలో వున్నా 9 వేల కోట్లు రోడ్ల నిర్మాణానికి బదలాయింపు చేశారు. ఇది అస్మదీయ కాంట్రాక్టర్ల కోసమని వేరే చెప్పనవసరం లేదు.

పాలన సౌలభ్యం పేరిట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేసి తిరిగి అదే పాలన కేంద్రీకరణకు పునాది వేస్తున్నారు. కనీసం హైకోర్టునైనా రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతున్న సీమవాసుల డిమాండుపై అస్సలు పట్టించుకోడం లేదు.

నాలుగేళ్లుగా హైకోర్టు విభజన కోసం ఎటువంటి అభిప్రాయ సేకరణ జరపలేదు.

రాజధాని నిర్మాణానికి సంబంధించి డిజైన్ల తయారీ కోసం ఒక నిర్దిష్ట పద్ధతి లేదు. ముఖ్యమంత్రి గారు ఏదేశ పర్యటనకు పోతే దేశం తరహా భవనాలను అమరావతిలో నిర్మిస్తామని ప్రకటించేయడం ఆనవాయితీ అయిపోయింది. డిజైన్ల తయారీ పేరుతో వివిధ దేశాల కంపెనీల జేబులు నింపడానికి కన్సల్టేషన్ ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు వాటిలో ఒక్కదాన్ని కూడా అధికారికంగా ధ్రువీకరించకపోవడం గమనార్హం. చివరకు సినిమా డైరెక్టర్లను పిలిపించి సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు.

ప్రజలు ఏదైనా కోరినప్పుడు లేదా ఉన్న పథకాలకు నిధులు విడుదల చేయమన్నప్పుడు మనది లోటు బడ్జెట్ రాష్ట్రం అని గుర్తు చేసే ముఖ్యమంత్రి గారికి రాజధానిలో తాత్కాలిక భవనాలకు, నీటి పారుదల రంగ నిపుణులు పెద్ద ఉపయోగం లేదంటున్న పట్టిసీమకు అవసరమయ్యే నిధుల విషయంలో లోటు బడ్జెట్ గుర్తుకురాదు. ఎప్పుడో టెండర్లు పూర్తయిన పనులకు ఇప్పుడు మళ్ళీ అంచనా విలువలు పెంచడానికి కూడా లోటు బడ్జెట్ గుర్తుకురాదు.

రాజధానికి అవసరమయ్యే భూములను సేకరించటంలో కూడా గందరగోళమే. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో సరైన ప్రకటన ఏదిలేదు. 2018 లో చేసే చట్ట సవరణ 2014 నుంచే అమలులోకి వస్తుందంటూ జీవో విడుదల చేసి రాజధాని ప్రాంత రైతులను అయోమయానికి గురి చేశారు.

నిర్మించబోయే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఖాతరు చేయడంలేదు. మునిగితే వాళ్లదేం పోయింది. మళ్లీ కట్టడం పేరుతో మరింత ప్రజాధనం దండుకోవచ్చు.

‘వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్నది యీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రధానమైనది. ప్రజలు యీ ప్రభుత్వ పాలన వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇదే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనిలో కూడా అడుగడుగునా మాట తప్పడమే. ముఖ్యమంత్రి మొదట డ్వాక్రా రుణాలన్నీ కాదు కేవలం ఒక్కొక్కరికి పదివేలు మాత్రమే అన్నారు, తర్వాత అవి కూడా ఒకేసారి కాదు అయిదు విడతలుగా ఇస్తామని చెప్పుకొచ్చారు. ఆకలితో ఉన్నవారికి రోజుకో మెతుకు అన్నం పెడతా అన్నట్లుగా ఇలా సంవత్సరానికి రెండువేల చొప్పున విదిలించి అవి ప్రజలకు ఎందుకూ పనికిరాకుండా చేశారు. ఇవే కాకుండా ఒక్కొక్క పొదుపు మహిళకు లక్ష రూపాయల వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామని చెప్పి మొండిచేయి చూపించారు.

వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో కర్నూలులో ఎయిర్ పోర్టు, మెగా సీడ్ పార్క్, ఉర్దూ యూనివర్సిటీ; అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ వంటివి శిలాఫలకాలపై రాతలకే పరిమితమయ్యాయి.ఇక ఉక్కు ఫ్యాక్టరీ, గూడ్స్ వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీ వంటి వాటి ఊసేలేదు. సీమలో హైకోర్టయినా ఏర్పాటు చేయండంటూ సీమ న్యాయవాదులు, ప్రజలు సంవత్సరకాలం నుండి ఆందోళనలు చేస్తుంటే కనీసం వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నమైనా చేయకుండా ఏకపక్షంగా అమరావతిలోనే హైకోర్టుకు శంకుస్థాపన చేసేశారు.

నమ్మి ఓట్లేసిన ప్రజల ప్రాథమిక అవసరాల అమలులో కూడా ఎనలేని నిర్లక్షాన్ని ప్రదర్శిస్తున్న యీ ప్రభుత్వం విజన్ 2020 అంటూ ప్రచారాలు చేసుకోవడం హాస్యాస్పదం. ఈ ప్రభుత్వం ఒక్కోసారి ఒక మాట చెబుతూ నాలుగేళ్లుగా కాలయాపన చేస్తోంది. అడిగేవారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తులను బతికిస్తోంది. జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ కార్యకర్తలకు పెత్తనాలిచ్చి అన్ని ప్రభుత్వ పథకాల అమలులో నచ్చిన వారికే లబ్ది చేకూరుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తోంది.

ప్రజలు ఇటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడడానికి కేవలం ఎనిమిది నెలలే ఉన్న నేపథ్యంలో యీ ప్రభుత్వం రోజులో ఇరవై నాలుగు గంటలూ పనిచేసినా సాధారణ వృద్ధి రేటు అందుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొంది.

 

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

5 comments

    • Thanks anna. యీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు త్వరలోనే వస్తుంది.

  • ఆంధ్ర ప్రదేశ్లో అన్ని రకాల వనరులతోబాటు మానవ వనరులు కరువయ్యాయి అని ఆందోళన చెందుతున్న వారికీ ఇటువంటివి కొంత ఊరట. ఆంధ్ర ప్రదేశ్ లో సభ్య సమాజం ఇప్పుడు ఒక గంతు వెయ్యక తప్పదు. చరిత్రని మళ్ళి పరిశీలించక తప్పదు.

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేటి పరిస్థితులను గురించి 100% వాస్తవాలు రాశారు. ఇలాంటి చక్కటి విశ్లేషణలను కొనసాగించండి.

  • పూర్తిగా ఏకీభావిస్తున్నాను. టీడీపీ పాత బహిరంగ మిత్రులు, ఇప్పటి రహస్య మిత్రులు, తోడు దొంగల్లో ఒక దొంగ అయిన బీజేపీ కి ఎలాగూ ఆంధ్రాలో కాలు పెట్టడానికి జాగా లేదు. టీడీపీ ఒడిపోవడమే ముందు కావలిసింది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.