చిటారు కొమ్మను మిఠాయిపొట్లం

దేవదాసు తరువాత వినోదాసంస్థ గురజాడ మహాకవి కన్యాశుల్కం నాటకాన్ని తెరకెక్కించి నిర్మించిన మరో కళాఖండం ‘కన్యాశుల్కం’.  

తెలుగువారు మరచిపోలేని పాత్రల్లో గిరీశం ఒకటి.  గురజాడ సృష్టించిన రక్తమాంసాలు కలిగిన సజీవపాత్ర గిరీశం.  ఈ సినిమాలో గిరీశం బుచ్చెమ్మనుద్దేశించి పాట పాడితే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా మల్లాది రామకృష్ణశాస్త్రి గారు వ్రాసిన పాట ‘ చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా’ అన్నపాట.  

(గిరీశం పాటలు పాడటం ఏమిటి అన్న మీమాంస అవసరంలేదు.  కన్యాశుల్కం’ నాటకంలోనే గిరీశం అపుడప్పుడు పాటలు పాడుతుంటాడు.  ‘కొంచెం మ్యూజిక్ విసురుదాం’, అని ‘ఎటులోర్తునే చెలియా’ అని జావళి లంకించుకుంటాడు ఒకసారి బుచ్చెమ్మనే ఉద్దేశించి….)

చిటారుకొమ్మను మిఠాయిపొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి ఒడుపు చేసి… వంచర కొమ్మను నరుడా

పక్కను మెలిగే చక్కనిచుక్కకు… చక్కిలిగింత లేదేం గురుడా
కంచు మోతగా కనకం మోగదు… నిదానించరా నరుడా
వాటం చూసి ఒడుపు చేసి… వంచర కొమ్మను నరుడా

పండంటి పిల్లకు పసుపు కుంకం  నిండుకున్నదేం గురుడా
దేవుడు చేసిన లోపాన్ని… నీవు దిద్దుకురారా నరుడా
కొద్దిగ హద్దు మీరరా నరుడా

విధవలందరికి శుభకార్యాలు… విధిగా చెయమంటావా గురుడా

అవతారం నీదందుకోసమె… ఆరంభించర నరుడా

వాటం చూసి ఒడుపు చేసి… వంచర కొమ్మను నరుడా

గిరీశంకున్న లక్షణాల్నీ, అవలక్షణాల్నీ ఈ  చిన్నపాటలో మల్లాదివారు ఎలా బంధించారో చూద్దాం.  

చిటారు కొమ్మను మిఠాయిపొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి ఒడుపు చేసి… వంచర కొమ్మను నరుడా

గిరీశానికి అతని మాటల్లోనే బుద్ధి అప్పుడప్పుడు దాట్లేస్తూంటుంది.  దానికి తోడు స్త్రీలోలత్వం ఉంది. తననుతాను ఒక ప్రేమికుడిలా భావించుకుంటూంటాడు.  ఇక బుచ్చెమ్మను ఒక తేనెపట్టులా భావించి పాట ప్రారంభించడంలో ఆశ్చర్యం ఏముంది? కొమ్మను వంచమని అనడంలో కొమ్మకు ఉన్న నానార్థాల్ని చక్కగా వాడుకున్నారు మల్లాది.  వాటం చూసి ఒడుపు చేసి అన్నప్పుడు గిరీశం తెలివితేటలు, అవకాశవాదం, ఇంతకుముందు అతను సాగించిన ప్రేమాయణాలు అన్నీ ధ్వనిస్తాయి.

పక్కను మెలిగే చక్కనిచుక్కకు… చక్కిలిగింత లేదేం గురుడా
కంచు మోతగా కనకం మోగదు… నిదానించరా నరుడా

బుచ్చెమ్మకు ‘లౌ సిగ్నల్స్ రామరామ’  బొత్తిగా తెలీవు. అందుకే చక్కనిచుక్కకు… చక్కిలిగింత లేదు.  ఈమె ‘ప్యూర్ డైమండ్’ అయితే మధురవాణి రంగువేసిన గాజుముక్క.  కంచు మోతగా ‘పజ్యండో వన్నె బంగారం’ మోగదు . అందుకని జాగ్రత్త పడాలి, నిదానించాలి, ‘కొత్తదారి కొంత న్యాయనైన దారి’ తొక్కాలి.   ఇవన్నీ నాటకంలో గిరీశం అనుకునే విషయాలే.

పండంటి పిల్లకు పసుపు కుంకం  నిండుకున్నదేం గురుడా
దేవుడు చేసిన లోపాన్ని… నీవు దిద్దుకురారా నరుడా
కొద్దిగ హద్దు మీరరా నరుడా

పండంటి పిల్లకు పసుపు కుంకం నిండుకున్నదేం అని గిరీశం పాడితే అతనిలో మనం ఊహించని సున్నితత్వం కనబడుతుంది.  మోసాలుచేసి, ఆలోచించకుండా అబధ్ధాలుచెప్పి బ్రతికే గిరీశానికి నిజంగా బుచ్చెమ్మ పరిస్థితి అంటే కొంత జాలి, బాధ ఉన్నయ్యా అని సందేహం రావచ్ఛు.  అగ్నిహోత్రావధాన్లు తనుతినే విస్తరాకును వెర్రికోపంతో ఆమె నెత్తిమీద రుద్ది వెళ్ళిపోతే రివాల్వర్తో అతన్ని చంపిపారెయ్యాలన్నంత కోపంవస్తుంది గిరీశానికి.  కాబట్టి అవుననుకోవచ్చు.

అతనిలో మరోగుణం తనుచేసే పనులన్నిటినీ తెలివిగా సమర్థించుకోవటం.  బుచ్చెమ్మను ప్రేమలో దించడానికి దేవుడు చేసిన అన్యాయమే కారణం కాబట్టి కొద్దిగ హద్దు మీరినా తప్పులేదని అతని సమర్థన.  అంతకుముందే నిదానించాలని, మళ్ళీ అంతలోనే హద్దుమీరమని అనుకోవడం కూడా అతని అవకాశవాదానికి ఉదాహరణలే. పైగా ‘ఒపీనియన్స్ అపుడపుడూ చేంజి చేస్తుంటేనే గానీ’ పోలిటీషన్ కాలేవని కూడా శలవిస్తాడు వెంకటేశంతో.  

విధవలందరికి శుభకార్యాలు… విధిగా చెయమంటావా గురుడా

అవతారం నీదందుకోసమె… ఆరంభించర నరుడా

వాటం చూసి డుపు చేసి… వంచర కొమ్మను నరుడా

విధవలందరికీ శుభకార్యాలు విధిగా చెయమంటావా అన్నప్పుడు, అవతారం అందుకోసమే అన్నప్పుడు, తానో మహా సంఘసంస్కర్త అని తనను తాను బడాయిగా చెప్పుకోవడం జ్ఞాపకం రాకమానదు.  అతను ఆషాఢభూతి అయినా, కుహనా సంస్కర్తే అయినా, కొంత సానుభూతితోనే వితంతు సమస్యను పట్టించుకున్నట్టనిపిస్తుంది. ఉదాహరణకి చిన్నపిల్ల సుబ్బితో లుబ్ధావధాన్లు పెళ్ళి చెడగొట్టటానికి కొంచెం సహాయపడతాడు.  

పూటకూళ్ళమ్మ వంటి గట్టిపిండాల విషయం అలావుంచి, అందంగా అమాయకంగా యెర్రగాబుర్రగా ఉన్న విడోలంటే మాత్రం అతనికి మరీ జాలి .. హార్ట్ మెల్ట్ అయిపోతుందిట.  

గిరీశం తత్వాన్ని గురజాడ చిత్రించినంత సజీవంగానూ ఈ పాటలో మల్లాది చిత్రించారు.  జవజవలాడే తెలుగంటే మల్లాదివారి కథలలో భాషను చెప్పేవారు. సామెత, పొడుపుకథ, సహజసుందరమైన మాటలు, సౌకుమార్యం, నరుడితో గురుని సంవాదం, విరామయతులు, ఇవన్నీకూడిన ఈ పాట శిల్పాన్ని చూస్తే మనంకూడా అంగీకరించకుండా ఉండలేం.  

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.