చీకటి నాటకం – వెలుగుల కవిత్వం

అన్ని కళా రూపాలలోకీ ఉత్తమమైనది నాటక రచన అన్నారు ప్రాచీన అలంకారికులు. ఒక జాతి యొక్క సాహిత్య పరిణతికి కొలమానం నాటక రచనే అంటాడు లియో టాల్ స్టాయ్. నాటకీయతకు అతి ముఖ్యమైన ధర్మాలలాంటివి కొన్ని ఉండి తీరాలి. మొదటిది నాటకాభినయానికి కావాల్సిన రంగస్థలం. పాత్రలు పరోక్ష పద్దతిలో కాక ప్రత్యక్షంగా ఉండి చలద్రూపాలుగా ఉండాలి. మూల పాత్రల స్వభావాలను మరచిపోకుండా సందర్భోచిత మనోభావాలు వ్యక్తం చేయాలి. రూప చిత్రణం, స్వభావ చిత్రణం ఉండాలి. కథా వస్తువు ప్రారంభమై క్రమ వికాసంతో పరిణతి చెంది ఫలితాంశాన్ని సాధించాలి. ఈ అంశాలన్నీ కావ్యంలో కనిపిస్తే అది నాటకీయత అనిపించుకుంటుంది. అటువంటి ఒక సన్నివేశం ప్రతిభావంతుడైన సృజనకారుడికి  దొరికినప్పుడు ఇక దానికి రససిధ్ధి కల్పించకుండా తేలికగా వదలివేస్తాడా? అందునా అంధ్రులందరిచే కావ్యరసమనే అమృతాన్ని తాగిస్తానని శపధం చేసి కవిత్వ దీక్షా కంకణధారుడై గద్య పద్య కృతులను సమున్నతంగా రచించగలిగిన ఒక మహాకవికి దొరికితే ఊరుకుంటాడా ? ఆ రంగ స్థలం నర్తనశాల. పాత్రధారులు మారు రూపాలలో ఉన్న ద్రౌపది, భీముడు. సన్నివేశం కీచకవధ. రక్తి కట్టించిన ఆ కవి అమలోదాత్త మనీషి , ఉభయభాషా కావ్య ప్రౌఢి, ఆంధ్ర మహాభారత కర్త  కొట్టరువు తిక్కన.
సూర్యాస్తమయం జరిగింది. అక్కడ ప్రేక్షకులు లేరు , వెలుతురూ లేదు. అదొక చీకటి నాటకం. సైరంధ్రి అనే మారుపేరుతో ఉండి తెర మరుగున దాగి నాయిక పాత్రను పోషిస్తున్న ద్రౌపది, నాయిక వేషధారణలో ఉన్న భీముడు , మద్యపానం సేవించి  మన్మధ వికారానికి లోనై ఉన్న కీచకుడు. శృంగార రసాభాస జరిగి తుదకు భీభత్స రసంగా పరిణమించబోయే ఒక సన్నివేశం. పాత్రల కదలిక మొదలయింది. కీచకుడు సంకేత స్థలానికి చేరుకున్నాడు.  భీముడి వైపు చేయిచాచి సైరంధ్రిగానే భావించి మన్మధ భావాలతో చలించి పోయాడు. నాయిక వేషంలో ఉన్న నాయకుడితో చతుర సంభాషణ సాగిస్తున్నాడు.
“వనితా , అందమైన వస్తువులన్నీ కోరి ఏరి తెచ్చాను సంతోషంతో తీసుకో. కమల వదనా, నా రూపం చూసిన ఏ స్త్రీ అయినా మరొక మగాణ్ణి లెక్క చేస్తుందా? నా అందాన్ని మెచ్చుకున్న విలాసవతి తనంత తానుగా వచ్చి మీద పడకుండా ఎలా ఉండగలదు? నా వివేకాన్ని గమనించిన ఏ స్త్రీ అయినా విరహాగ్నిలో కాగిపోదా ? ఇంత కాలానికి నువ్వొక్కత్తివే  నన్ను ఏలుకున్నావు , లోబరచుకున్నావు , వెయ్యి మాటలు ఎందుకులే ” అంటాడు . కీచకుడు అలా తనను తాను పొగుడుకుంటూ ఉంటే భీముడికి అసహ్యం వేసింది. మనసులో అసహనం పుట్టింది. అపుడే ఇంకా సరదా కూడా పుట్టింది. ద్రౌపదికి వినపడేలా ఆమె ఆనందించేలా నిగూఢ సంభాషణ చేయలనుకున్నాడు.
తే.
     ఇట్టి వాడవు గావున నీవు నిన్ను
     పొగడికొనదగు; నకటా! నా పోల్కి ఆడు
     దాని వెదకియు నెయ్యెడనైన నీకు
     పడయ వచ్చునె యెఱుగక పలికితిట్లు
ఇట్టి వాడవు గావున = ఇటువంటి వాడవు కాబట్టి; నీవు నిన్ను = నీవు నిన్నే ; పొగడికొనన్ తగున్ = పొగడుకొనటం సబబే;  అకటా! = ఔరా!; నా పోల్కి = నన్ను పోలిన ; ఆడు దానిన్ = స్త్రీని; వెదకియున్ = వెదకినా కూడా ; ఏ + ఏడన్ + ఐనన్ = ఎక్కడైనా ; నీకున్ పడయవచ్చునే = నీవు పొందగలవా; యెరుగక పలికితిట్లు = తెలియ ఇట్లా మాట్లాడావు .
తాత్పర్యం = ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను నీవే పొగడుకొనడం సమంజసమే. నావంటి స్త్రీ ఎక్కడ వెదకినా నీకు దొరకదు. తెలియక నీవు ఇట్లా మాట్లాడావు.
కం.
     నాయొడలు సేర్చినప్పుడ
     నీ యొడలెట్లగునొ? దాని నీ వెరిగెదు న
     న్నే అబలల తోడిదిగా
     జేయ దలంచితివి తప్పు సేసితి కంటె
నా ఒడలు + చేర్చిన + అప్పుడు + అ = నా శరీరంతో నీ శరీరం దగ్గరచేస్తే ; నీ ఒడలు = నీ శరీరం; ఎట్లు+అగునో = అట్లా ఔతుందో ; దానిన్ = దానిని ; నీవు + ఎఱిగెదు =  నీవు తెలుసుకుంటావు ; నన్నున్ + ఏ + అబలల తోడిదిగాన్ = నన్ను మిగిలిన ఏ స్త్రీలతో సమానంగా; చేయన్ + తలంచితివి = చేయాలనుకున్నావో ; తప్పు+చేసితి(వి) = తప్పుచేశావు; కంటే = చూచావా!; (తెలిసిందా? చూడు! అనే హెచ్చరికలకు సమానార్ధం )
తాత్పర్యం =  నా శరీరంతో నీ శరీరం తగిలినప్పుడు నీ శరీరం ఏమవుతుందో అది నీవే తెలుసుకుంటావు. నన్ను మిగిలిన సామన్య స్త్రీలతో సమానంగా చేయ దలచుకున్నావో, తప్పు చేసినట్లే సుమా!
మొదటి పద్యంలో పైకి స్తుతి చేస్తున్నట్టుగా ఉన్నా లోపల స్ఫురించేది నింద. ఇంతటి అధికుడని ప్రశంస. ఇటువంటి వాడివి కాబట్టి అనడంలో వ్యతిరేకత స్ఫురించి అధముడవనే నింద ఉన్నది. పద్యంలోని రెండవ వాక్యం హాస్యోక్తి. “నా వంటి స్త్రీ ఎక్కడ వెదకినా నీకు దొరకదు” అనడంలో “తనంతటి వాడు లేడు” అని చెప్పుకున్న కీచకుడికి ప్రతి సమాధానం. ఇక్కడ ద్రౌపదికీ పాఠకులకీ హాస్యంగా అనిపిస్తుంది. కానీ ఈ హాస్యం శృంగార సంబధమైన లలిత హాస్యం కాదు. శత్రువు పై విసరే అధిక్షేపరూప గంభీర హాస్యం. ఒక్క సారి విరుచుకు పడబోతున్న భీముడి రౌద్రాగ్నికి సంకేతం.
నా శరీరం నీ శరీరంతో తగిలినప్పుడు నీ శరీరం ఏమవుతుందో అనడంలో శ్లేషార్ధమున్నది. కీచకుడికది శృంగారంగా తోస్తుంది, పాఠకుడికి ద్వంద్వ యుద్దం కొరకు నీ పై తలపడ్డప్పుడు నీ శరీరం ఏమవుతుందో అన్న రౌద్ర రసరూపమైన అర్ధం వస్తుంది. నన్ను మిగిలిన స్త్రీలతో సమానంగా భావిస్తే తప్పు చేసినట్లే సుమా, నేను ఆడుతనంలేని ఆడుదానిని అన్న వ్యంగ్యోక్తి ఉన్నది. ఇక్కడ స్త్రీకి పర్యాయ పదంగా అబలను వాడి నేను సబలుడనైన పురుషుడిని సుమా అని కవి ధ్వనింప జేశాడు.
ఇటువంటి నాటకీయ సన్నివేశలనెన్నో తిక్కన భారతంలో మనం చూడవచ్చు. “తెలుగు పలుకుల తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన” అంటే ఇదే. అందుకనే కావ్య శిల్ప ప్రస్తావన వస్తే తిక్కన మాటనే ఆధారంగా గ్రహిస్తారు నేటికీ పరిశొధకులు. 800 ఏళ్ళ క్రితం రాసిన తెలుగది. అయినా ఎంత నవ్యంగా నిర్మలంగా ఉందో! ప్రతిపదార్థం ప్రత్యేకించి చెప్పకపోయినా అర్థమయ్యే తెలుగు పద్యాలు. కవిత్వరచనను ఒక దీక్షగా చేపట్టానన్నాడు తిక్కన. కావ్యరస ప్రస్థానం ద్వారా నిర్మల చిత్తవృత్తిని సాధించవచ్చు అని ప్రభోదించాడు తిక్కన. ఆ మహాకవికి వందనాలు.

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

3 comments

  • చాలా ఉపయోగమైన పోస్ట్ అండి, ఆస్వాదించడానికి హ్రదయం ఉండాలిగాని ఎంత చిక్కని రచనలు

  • తెలుగు పలుకుల తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన – ఈసారి మనం కలిసినప్పుడు దీని గురించి మాట్లాడాలి లెనిన్! వ్యాసం చాలా బాగుంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.