తిమ్మప్ప పార

దాదాపు ఐదేండ్ల తర్వాత పొద్దుటూరికి పోతి. గాంధీ రోడ్డు కాపక్క ఈపక్క ఉండే పెద్ద షాపుల్ను చూసుకుంటా ‘టౌను శానా మారిపోయిందిబ్బా’ అనుకుంటి మనసులో. పెట్రోలు బంకుకాడికొచ్చాలకు యాన్నో తెలిసిన ముఖం నాకు అదాటు పడ్య. కానీ ఆడ ఎవ్రో తటిక్కెన మతికి రాల్య.

ఆయన్న నన్ను సూల్య. ఆయన్న లోకంలో ఆయన్న మునిగి పోయి తలకాయ వంచుకోని నడుచ్చా నన్ను దాటుకుని పాయ. రోంత దూరం పొయ్యాలకు ‘వార్నీ పాసుగుల.. ఆడ తిమ్మప్పగారి నడిపన్న గదూ’ అనుకోని మళ్లా ఎనిక్కి మళ్లి గబగబా పోతి.  ఆంత దూరంగా ఉండగానే ‘న్నోవ్…ఓ నడిపన్నా…’అని కేకేసి పిలిచ్చి. ఎవ్రుబ్బా అనుకుంటా ఆయన్న ఎనిక్కి తిరిగి చూస్య. అంతలోకే నేను ఆయన్న కాడికి పొయ్ ఎదురుగా నిలబడ్తి. ఆయన్న ముఖంలోకి సూచ్చా ‘ఏన్నా బాగుండావా నా..?’ అని పలకరిచ్చి- ఎవ్రని సెప్పకుండా. ఆయన్న గూడా నా ముఖంలోకి తేరిపార చూస్య.  రోంచేపటికి ఆయన్న ముఖం సెండు మల్లె పువ్వాయ. ‘వార్నీ..బ్బీ సీకాంతూ …’’ అని సంబరం పట్టల్యాక నన్ను గట్టిగ కర్సుకుండ్య. నా సెయ్యిని తన సేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమరబట్య. ‘అమెరికాకు పొయ్యి మంచివి తెల్లబన్యావ్ బ్బీ . తటిక్కెన కనుక్కోల్యాక పోతి’ అన్య ఏందో తప్పు చేసినోని మాదిరి. ‘ దాందేముంది లేన్నా…శాన్నాల్లాయ కదా సూడక’ అంటి.

‘యాడన్నా పనిమీద పోతనావా బ్బీ..?’ అని అడిగ్య. ‘అవ్ న్నా, వేరే ఆయ్బిని కలుజ్జామని పోతనా’ అంటి. ‘అర్జెంటు గాకుంటే మా షాపులోకొచ్చి రోంచేపట్ల కూచ్చోని పోదురా బ్బీ’   అన్య. దాదాపు 17 ఏండ్ల తర్వాత కనపచ్చిన మనిషిని ఇర్సిపెట్టబుద్ది కాల్య. అవతల అంత మించిపోయే పనేం లేదులే అనుకుని ‘పదాంపాన్నా…’ అని ఇద్దరం షాపు తిక్కు నడిచ్చిమి.

అప్పటికే షాపు తెర్సిండ్య. రెండు మూడు బేరాలు కూడా జరుగుతాండ్య. ‘ అబ్బీ…నువ్వు రోంచేపీడ కూచ్చో. వాళ్లను పంపిచ్చి వచ్చా’ అని నాకు స్టూలేసి  వాళ్ల కాడికి పాయ. వాళ్లకు రకరకాల గుడ్డలు సూపిచ్చా రేట్లు సెప్పబట్య. నేనట్లనే నడపన్న తిక్కు సూచ్చా ‘యాడ కొత్తిమిట్ట సేను, యాడ తిమ్మప్ప తోట, యాడ నడిపన్న, యాడ నేను’ అనుకుంటా పాత కతంతా తలపోసుకుంటి.

నేను డిగ్రీ తొలి సమత్సరం సదివేటప్పుడు మా కొత్తిమిట్ట సేండ్లో రెండెకరాలు డిసెంబర్ కాయ పెట్టింటిమి. మేం తోటకట్టు పెట్టడం అదే తొలి దప. ఎకరాకు తడికింతిచ్చామని మా పక్క తోటోల్లతో మాట్లాడుకుంటిమి. అప్పటికే అప్పుల్లో కూరుకపోయింటిమి. ఇంట్లో ఇత్తనం కాయలుంటే (సెనిక్కాయలు) మళ్ల తిప్పలు మళ్ల పడచ్చులే అనుకుంటిమి. మా సేనికి ఇంగో తిక్కు మా పక్కూరు వెంకటాపురం తిమ్మప్పన్న వాళ్ల తోటుండ్య. వాళ్లది 15 ఎకరాల భూమి.. దాంట్లో 7 ఎకరాల తోటకట్టు మిగతాది ఎలి భూమి.

ఆయన్నకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ. బిడ్డను ఊర్లోనే ఇచ్చిండ్య, సిన్న కొడుక్కు తప్ప మిగతా ఇద్దరికీ పెండ్లిల్లు అయిండ్య. అల్లుడూ , అందరూ కలిసి  తోట సేచ్చాండ్య. బలె కష్టజీవులు. ఒళ్లు దాసుకోకుండా రేయింబవళ్లు పన్జేచ్చాండ్య. ఒక్కోతూరి ఇంటిగ్గూడా పోకుండా తోట పట్టునే వారం రోజులు ఉంటాండ్య. ఆన్నే ఒక కొట్టం బేసుకుని వండుకుంటా, తినుకుంటా, పన్జేసుకుంటా, పనే ప్రపంచంగా బతుకుతాండ్య.

తిమ్మప్పన్న బలే ఉషారైన మనిషి. శానా దృఢమైన మనిషి కూడా. అవతల అది ఎంత పనైనా సరే, వంగినారంటే దాన్ని వంగగొట్టే దాక సల్లుకుండే రకం గాదు. పని సెయ్యడం కూడా శానా వాటంగా, మట్టగ జేసేటోడు.  నెత్తిన రుమాలు ల్యాకుండా ఆయన్నను సూసిందిల్యా. అట్నే ఆయన్న గోసె సెదిరింది కూడా నేనెప్పుడూ సూల్య.

నేను వాళ్ల తోట్లోకి పోతే ‘అది సీకాంత… ఇది సీకాంత’ అని ఏదైనా బో ఇడమర్సి సెప్తాండ్య.  బువ్వ తినేటప్పుడు యా గట్టునున్యా సెయ్యూపి ‘బువ్వ తిన్నాంరా..’ అని నన్ను కేకేసి పిలుచ్చాండ్య.

నడిపి కొడుకు నడిపన్న తోట కాడ నీళ్ల పారకం సూసుకుంటాండ్య. పెద్దన్న మిగతా సేండ్ల కాడ పన్జూసుకుంటాండ్య. అందరి కంటే సిన్నాయ్న సదువుకుంటాండ్య. ఆ మనిసి ఎప్పుడన్నా ఊరికొచ్చినప్పుడు తోట కాడికొచ్చాండ్య. అల్లుడు బాలన్న కూడా బలే మంచి మనిషి. ఆయప్పకు గూడా తోటే లోకం.

అప్పుడు కరెంటు తో శానా ఇబ్బందిగా ఉంటాండ్య. ఎప్పుడో మొబ్బులో పదకుండు కనంగా  వొచ్చే మళ్లా తెల్లార్జామున ఐదుకంతా పోతాండ్య. ఇంగో వారం పగటి పూట 11 కొచ్చే మాయ్టాల 5 వరకు ఉంటాండ్య. గాలిలో దీపం మాదిరి అది గూడా నమ్మకంగాల్యా. ఇంగ మొబ్బులో యాడన్నా పీజులు గనకా ఎగిరిపోతే అంతే సంగతులు. నేను, నడిపన్న టార్చిలైటు బేసుకుని ఆ మొబ్బలో పురుగనక పుట్టనక టాంచ్పారం కాడికి పోయ్ పీజులేచ్చాంటిమి. ఏసిన పీజులు నిలబడక బో అగసాట్లు పడ్తాంటిమి..

మా తోటకు నేను మాయన్న మడవ గట్టను పోతాంటిమి. మాయన్నకు పానం బాగల్యాకుండ్య. తలకాయ నొప్పి తో బాగ ఇబ్బంది పడ్తాండ్య. దానిగ్గాను రాత్రి మాత్తర్లేసుకున్యాక ఎక్కువ సేపు నిద్ర మేలుకోల్యాక పోతాండ్య.  ‘ అబ్బీ…నాకు నిద్దరొచ్చాంది బ్బీ. నువ్వు 12 దాక కట్టు బ్బీ. మళ్ల నన్ను లేపు నేను కడ్తా’ అని పండుకుంటాండ్య. 12 ఆ మద్దెలాల మాయన్న బాగ గురక పెట్టి నిద్రపోతాండ్య. అజ్జూసి నాకు నిద్ర లేపాలంటే మనసొప్పేది గాదు. నేను కయ్యకు నీళ్లిర్సి నడిపన్న కాడికి పోడమో ల్యాకుంటే  మడవ దిప్పి ఆయన్నే నాకాడికి రాడమో జరుగతాండ్య. అట్లా మా ఇద్దరికీ బలె సవ్వాసమాయ.

ఆ పొద్దు నాకు బాగ్గుర్తు. దినం కరెంటు ఉండ్య. నేను కయ్యకు మడవతిప్పి, నడిపన్న కాడికి పోతి. ఆయన్న కయ్యలో అటుపక్క గెనుం తెగింటే సగేచ్చాండ్య. నేను ఇటుపక్క కాలవ తట్టుంటి. ‘ బ్బీ.. బ్బీ… ఏమనుకోకుండా దీన్ని మూసి రోంతట్ల పక్క కయ్యకు మడవ తిప్పు బ్బీ’ అన్య.

నేను నగి ‘అనుకోడానికేముంది న్నా ఆడ’ అని కాల్వ పక్క నుండే పార దీసుకుని మడవ మూసి పక్క కయ్యకు మడవ తిప్పుతాంటి. అప్పుడు నాకండ్లు ఆ పార మీద పడ్య. నున్నటి కట్టెతో అదేందో గానీ అది బలె వాటంగా ఉండ్య. తూకమనేదే ల్యాకుండా బెండు ముక్క మాదిరి శానా అలకాంగ, సేతిలో పారున్నెట్లే ల్యాకపాయ. దాన్ని ఒంటి సేత్తో ఉలకాంగ పట్టుకుని మట్టి పెరికి ఇంగో సేత్తో పలకపై తడి మట్టి కారకుండా ఆపుకు పెట్టి కాలవకేచ్చాంటే పని ఆట్లాన్నెట్లుండ్య.

మడవ తిప్పినాక పారను కాల్వ నీళ్లతో కడగడం నాకు బాగ అలవాటు. ఏం ల్యా పార మట్టగుంటాదని. అప్పుడు దాన్ని మళ్లా ఒక తూరి సూచ్చి. పట్టుకోని పట్టుకోని అరసేతి రాపిడితో కట్టె అరిగి పోయి బలె నునుపు తేలిండ్య. పార పలక అంచులు గూడా అరిగిపోయి నీళ్ల మీది ఎన్నెల మాదిరి తెల్లగ నిగనిగలాడ్తాండ్య. ఎంతుండాల్నో అంత కట్టె. ఎంతుండాల్నో అంత పలక. తక్కెక్కువల్లేకుండా ఎంతుండాల్నో అంత పార.

అంతలోకే నడిపన్న ఆ పక్క నుంచి ఈ పక్కకొచ్చ. నేనుండి ‘న్నోవ్… మీ పార బలుంది న్నా…’ అంటి. ఆ మాటకు  రోంతట్ల నగుతా ‘అబ్బీ… ఆ పారకో కతుంది బ్బీ…’ అన్య. నాకు బలె సిత్రమనిపిచ్చ. మళ్లా ఆయన్నే ఉండి ‘ మా నాయన వయసులో ఉన్నెప్పుడు ఆ పారకు కట్టేసినాడంట బ్బీ. బేసిన కట్టె బేసినట్లే ఉంది. ఆ కట్టె ఇప్పటి దాంకా ఊడిపోల్య బ్బీ’ అన్య.

‘ఏందిన్నా…’ అంటి నమ్మబుద్ది గాక. ‘అవు బ్బీ…నిజం’ అన్య . ఆ పారను మళ్లా ఒకతూరి తీసుకుని తేరిపార జూచ్చా ‘ ఎన్నేండ్లయ్యింటాది న్నా…’ అంటి. ‘అటు ఇటుగా 35 ఏండ్లైంటాది బ్బీ…’ అన్య.

ఆ మాటల్తో వాళ్ల నాయన తిమ్మప్పన్న నా కండ్ల ముందు  మెదలాడ్య. ఆ కష్టజీవి పని ఎంత వాటంగా జేసేటోడో ఆ పార గూడా అంతే వాటంగా ఉందనుకుంటి. తిమ్మప్పన్న ఉషారు ,  కట్టే గోసె తీరు, నెత్తికి సుట్టే రుమాలు , మడకను తొక్కి పట్టి తోట దున్నే తీరు, ఎద్దలపై సూపే మురిపెం అన్నీ లీలగా సినిమా రీలు మాదిరి గిర్రున తిరిగ్య. ఎప్పుడు తోట కాడికొచ్చినా  ఆయన్న పడే యంపర్లాట మతికొచ్చ. పార కత రోంత సిత్రమనిపిచ్చినా ఆయన్న సేతివాటం ముందర అది దిగదుడుపే అనిపిచ్చ.

బేరం అయిపోతానే వచ్చి క్యాస్ కౌంటర్లో కూచ్చుండ్య నడిపన్న. ‘ఏ మనుకోగాకు బ్బీ అంటా. ‘ఏంగాదులేన్నా…’ అని ‘బాగనే జరుగుతాంద్యా న్నా’ అంటి. ‘పరవాల్య బ్బీ ఖర్చులన్నీ పోను అంతో ఇంతో .. ‘ అన్య.

షాపులో పిల్లగాన్ని పిలిపిచ్చి ‘టీ నా కాఫీ నా బ్బీ’ అన్య. ‘కాఫీ న్నా …’ అంటి. రెండు కాఫీలు తెమ్మని పంప్య.

‘ మీ నాయన యాడన్నా అదాటు పడ్తే అడుగుతంటా బ్బీ …’ అన్య. నేనుండి ‘ఊరికాడెట్లుండారు న్నా ‘ అని అడిగితి.

‘మా నాయన సచ్చి పాయ అబ్బి. బాలన్న బావకు మోకాళ్ల నొప్పులొచ్చ. పిల్లోల్లకు పెళ్లిల్లు అయిపోతానే యాసంగం తగ్గిచ్చుకుండ్య. అన్నట్లనే ఎద్దల్ను పెట్టుకోని ఇగ్గుకలాడ్తనాడు. సిన్నోడు ఈన్నే ప్రయివేటు స్కూల్లో పన్జేచ్చనాడు. నాయన సచ్చిపోతానే మేం కడగా పోతిమి బ్బి. తోట నా భాగానికొచ్చ. దాన్నమ్మి ఈ షాపు పెట్టుకుంటి’ అని రోంతసేపు గమ్ముగుండి మళ్లా ‘యాడబ్బీ పల్లెల్లో బతకాలంటే శానా కష్టమైపాయ. ఇంతకు ముందు మాదిరి వానలు రామండ్ల్య. ఇదైతే ఏదో అట్ల గడ్సిపోతాంది బ్బీ. నువ్వు బాగుండావు కదబ్బీ?’ అన్య.

‘ మేం బాగుండాం న్నా.’ అంటి. మళ్లా ఆయన్నే ఉండి ‘నేనప్పుడప్పుడు మతికి జేసుకుంటాంటా బ్బీ … ఆ దావన ఊరికి పొయినప్పుడు .. మా తోటను జూసినప్పుడు.. మీ సేను తిక్కు సూసినప్పుడు నువ్వు మతికొచ్చావు బ్బీ. అయ్యట్లనే ఉండాయి బ్బీ. మనమే ఎటొకరం పోతిమి,  సెట్టుకొకరం పుట్ట కొకరం’ అన్య. ‘ అప్పుడు తోట్లో ఎన్ని తిప్పలు పన్యా కాన్రాకుండా పోతాండ్య బ్బీ. ఇప్పుడట్ల గాదు. ఏదో నీడపట్టునుండామనే మాటే గానీ దీంట్లో శానా ఇబ్బందులుండాయిబ్బీ. యాది పట్న్యా లెక్కే. అప్పుడట్ల కాదుబ్బీ. ఆ తోట, ఆ పని, ఆ ఊరు….’ గొంతు రోంత బొంగురు పాయ. మాట రోంత తడబడ్తన్నెట్లనిపిచ్చ. బాయిలో నుంచి నీళ్ల మాదిరి మాటల్ని సేదినట్లు అనిపిచ్చ.

’ప్చ్… తోటమ్మినాక రెండ్రోజులు ఇంట్లో ఎవ్రే గానీ బువ్వ ముట్టింటే ఒట్టు బ్బి. అంతా మా నాయన్ను తల్సుకోని బో ఏర్సినారుబ్బి’ అన్య. నా మనసు మెలిదిప్పినట్లాయ.

అంతలోకే పిల్లగాడు కాఫీ తెచ్చ. కాఫీ తాగుతా నేనుండి ‘న్నా…పారెట్లుంది న్నా…?’అని అడిగితి.

 

ఆ ప్రశ్న  ఆయన్న మనసులో యా మూల గుచ్చుకున్యాదో ఏమో తెల్దు గానీ ‘ అబ్బీ… నీకింగా ఆ పార గుర్తుంద్యా బ్బీ’ అన్య. ఆయన్న మాటల్ని లోపల్నుంచి తోడినట్లు, శానా భారంగా ఉండ్య. ఆయన్న కండ్ల సుట్టూ నీటిపొర కమ్ముకుండ్య. మళ్లా ‘ నాయన సచ్చి పోయినప్పుడు ఆ పారతోనే గుంత తీచ్చిమి బ్బీ. ఆ పారనట్లనే, మా నాయనతో పాటే , కట్టెతోనే  గుంతలో పెట్టి బూడిచ్చిమి’ అన్య.

అప్పటికే మోడాలు కమ్ముకోనుండ్య. అది షాపని కూడా మర్సిపోయి ఇద్దరం ఎప్పుడో తోటలో మొబ్బులో మడవ కాల్వ గట్టున కూచ్చున్యట్లు …ఆ పార మాకు ఏదో తోట కతను సెప్తన్యట్లు…, తిమ్మప్పన్న గోసె కట్టి రుమాలు సుట్టి మడవ గడ్తన్యట్లు… మా కండ్లే కయ్యలైపొయ్నట్లు…పారె …పారె… కన్నీళ్లు గెనెమలు తెంచుకుని పారె.

 

********

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

5 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.