దగ్ధ కధా స్వరం

మాట ఎంత చెప్పినా తరిగిపోని గనిమనిషికి మాత్రమే ఉన్న ఒకేఒక లక్షణం మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడేలా చేయడం, కొందరు మాటలకి సానుకూలంగా స్పందిస్తారు, మరికొందరు మౌనంగా ఉంటారు , ఇంకా చాలా మంది వాదిస్తారు , మరికొంతమంది పోట్లాడతారు ఎలా అయినా సరే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, మనుషుల్లోనే మరో రకం వారు ఉంటారు, మనుషులతో తక్కువ మాట్లాడతారు , కాగితాన్ని తమ ముందు పరుచుకుని మాటలన్నీ కుప్పగా పోసి మాటల్లో ప్రపంచానికి ఒక కొత్తదారి చూపెడతారు , దారి ఒక కొత్త నిర్మాణాన్ని చేసుకుంటూ పోతుంది అలా రాసిన వారిని కొందరిని రచయితలు అన్నాం , అలాంటి ఒక రచయిత డా.వి.చంద్రశేఖర్ గారు .

మానవులు పుట్టుకతోనే మిగతా కొన్ని జంతువులకంటే చాలా బలవంతులు , కొనాళ్ల కి అదే బలం మనిషి మరో మనిషి మీద ప్రయోగించాడు , విజయం సాధించాడు , తనకన్నా తక్కువ వాడు అని ఒక పేరు పెట్టి దానికి సాక్ష్యంగా వేదాల్ని , పురాణాల్ని , ఇతిహాసాలని, ప్రబంధాలని, తనకి అనుకూలంగా ఉన్న అన్ని చోట్ల అణగదొక్కబడే వాడి జీవితాన్ని మరింత చిన్నాభిన్నం చేయడానికే యత్నించాడు , ప్రయత్నం ఇప్పటికి నిరాటంకంగానే కొనసాగుతూ ఉంది , దీని గురించి చాలామంది మాటలాడారు , రాశారు , పాడారు , చంపబడ్డారు , సహాయం కోసం కేకలు వేశారు , అదంత తేలిగ్గా దొరికేది కాదని అర్ధం చేసుకుని తమ పంధా మార్చుకున్నారు , అయినా ఇప్పటికి కొన్ని కేకలు ఆగలేదు అలాంటి అరుపులు , ఆర్థనాదాలు ఇక్కడి కధల్లో మళ్లీ మళ్లీ మనకి వినబడతాయి.

కధల్లో రాజకుమార్తెలకోసం వేటకెళ్లే రాజకుమారులుండర , వెన్నెల్లో ఉబుసుపోక కాళ్ల పట్టీలు సవరించుకుంటూ ఏదో ఒక తెలియని నంబర్ కి కాల్ చేసే అల్లరి అల్లరిగా మాటలాడే హస్కీ వాయిలుండవు, పట్టు చీరల మధ్యన నలిగిపోయే అచ్చమైన వాయిల్ చీరల వ్యధలుంటాయి.

ఎవరో వచ్చి ప్రతీరోజు కొన్ని సమస్యలని పత్రికలా ఉండచుట్టి మన గుమ్మం ముందు పడేసి పోతుంటారు . కొన్నింటిని చూసి మనం విచలితులం అవుతాం , మరికొన్నింటిని గురించి కాస్త ఆలోచిస్తాం , ఇంతాజేసి రేపటి ఉదయం పత్రిక రాగానే మళ్ళీ మనదైనందిన వ్యవహారాల్లో మునిగిపోతాం . కానీ విసీఆర్ గారు పాత్రలని పట్టుకున్నారు , ఎవరూ చూడని కొత్త కోణాలని స్పృశించారు . “అభినవ కాలిపోతుంది!” తెలుసా నీకు అనే వాక్యంతో మొదలవుతుంది.   పార్వతికల అనేకధ , చాలా చిన్న నిడివి ఉన్న కధ , కాని ఒక పెనుసవాల్ ని మన మనసుల్లోకి వదిలి పార్వతి ప్రేమని అజరామరం చేసే కధ. ప్రేమ మనసుకి సంబంధించినదా, శరీరానికి చెందినదా లేక కాసేపలా మనసు విప్పి మాట్లాడుకొవడానికి మాత్రమే చెందినదా అనే  మీమాంస చాలా పెద్దదిడాక్టర్ అనబడే ఒక చిత్రకారుని లాగానే మనం కూడా ఎదుటి వ్యక్తిని అంచనా వేయడంలో పొరబడతాం, తప్పులో కాలేస్తాం, మనమూ పాత్రనే సమర్ధిస్తూ కాసేపు నడుస్తాం కూడా, అలా జారిపోతూ చివరకు లోయ చివరంచు మీద నిలబడి పెనుకేకలేస్తూ అలమటించినా ప్రయోజనం ఉండదు. ఆత్మీయతను కొలవడానికి మనిషి హృదయం చాలదని నిరూపించిన కధ ఇది. ఇలాంటివి మరికొన్ని కాకపోతే ఇంకొన్ని ఏవైనా దగా పడిన హృదయాలే. నిద్ర అనే మరో కధలో అంతా మధ్య తరగతి నలిగిపోయిన జీవితాల గురించే, చీకు చింతాలేకుండా నివసించే చిన్నకుటుంబం కధ , చాలీ చాలని గదిలో ముగ్గురు నివాసం ఉండే గదిలో ఒక పిల్లవాడిని చదివించుకునే కుటుంబం కధ , ఉన్నంతలోనే కాస్త ఖరీదైన పరుపుని తెచ్చి దాన్నే మార్చి మార్చి వేసికుంటూ తంటాలు పడి నిద్రపోయే ఒక సాధారణ మహిళ కధ , వయసులో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు ఉద్యోగ ఒత్తిడి, పిల్లల ఉద్యోగాల సమయం లో ఇంట్లో పని ఒత్తిడి, కుటుబం పెరిగినా నిద్ర ఆమెకి అందని ద్రాక్ష, ఇంటిపని నుంచి అన్ని పనులకు ఆమె కావాలి , ఆమెకి విశ్రాంతి నిద్రలోనే చివరకి అదే వంట గదిలో పైటకొంగు పరుచుకుని శాశ్వత నిద్రకి వెళ్ళిపోతుంది , బహుశా మనిట్లోనే , పక్కింట్లోనో ఎక్కడో ఇలాంటిదే కాకపోయినా, మరోలాగనో జరిగి ఉంటుంది , ఏముంది చూస్తాం , వదిలేస్తాం , మహా అయితే పోజు కొడుతూ ఒక సుదీర్ఘ నిట్టూర్పు విడుస్తాం , ఒకవేళ అలాంటి సమస్య మన ఇంట్లో ఉన్నా సరే మనం కూడా వినం , మొద్దుబారి పోయాం , సాకులు వెతుక్కుని మరీ సాఫీగా జీవితాన్ని వెళ్లదీస్తున్నాం, ఇవన్ని చర్చిస్తారు రచయిత. ఇంకా కధల్లో ఒక్కసారి

కాదు కాదు ప్రతీ సారి ప్రేమ పేరుతో మోసపొయేపూర్ణ లుంటారు. వాళ్లని వాళ్లలా ఉంచే మనోహర్ లాంటి పాత్రలుంటాయి , కరుణ కుమార్‌ భార్య కాంతం (నల్లమిరియం చెట్టు) లాంటి పచ్చి వ్యక్తిత్వం గల మనుషులు నమ్ముకున్న ఆశయం కోసం బలం గా నిలబడగలిగే మనుషులు ఇంకా మనమధ్యనే ఉన్నారని రుజువులు చూపిస్తాయి, అలాంటి కధల్లో జనం వారిని వారు వెతుక్కుంటారు. అంత తేలిగ్గా ఎలా మాట్లాడి నా హృదయన్ని ముక్కలు చేస్తారు మీరు అంటూ పడికట్టు పదాల నాటకీకరణ ఉండదు. వాస్తవాన్ని సర్రున కోస్తూ పోయే చురుకైన కదలిక ఏదో అలా పదాల మధ్యన మనల్ని పరిగెత్తుకు పోయేలా చేస్తుంది , స్త్రీ ని తన పాత్రల్లో ఉన్నతీకరించేలా రాయడం ఆయన అలవాటు , నగరంలో ఒక యువతి తాను పోగొట్టుకున్న ప్రియుని గురించి వినే వారు లేక తనకి కాబోయే భర్త మొదటి భార్య చనిపొతే తన వ్యధ మొత్తం మృతదేహానికి చెప్పుకునే సన్నివేశం ఎవరమూ ఉహించలేం.  సెంటు పూసుకుని తిరుగుతున్న పట్టణ ప్రజల మధ్యన అచ్చమైన పల్లె వాసనల మనుషులుని మనం చూస్తాం. అది చంద్రశేఖర్ గారంటే.

రచయితలు అన్నా కవలు అన్నా మన సమాజంలో ఒక హాస్యమైన ధోరణిలో మాట్లాడతారు, రాస్తారు, రాసినట్టుగా జీవించరు అని. నిజమే కావొచ్చు వ్యక్తికి సంబంధించిన వ్యక్తి గతమైన పరిధికి మనం పోలేము గానీ , రచయిత కూడా అలా ఉంటే బాగుండు అనే అనుకుంటాం. నిజానికి ఇలాంటి కధే ఒకటి రాస్తారు వీసీఆర్, రచయిత్రి పట్ల ఆమే కొడుకుకి ఉండే అనుభవాల్ని వారిద్దరి మధ్యన ఉండే భావ సారూప్యతని చాల సునిసితంగా రాస్తారు. కొడుకుక్కి వాస్తవికత ఇష్టం. మరణించిన తండ్రి ఆశయాలని భుజాన వేసుకుని పోవాలని చూస్తూ ఉంటాడు. కాని తల్లి ఇవేమి పట్టనట్టు ఉంటుంది అప్పుడే టీనేజ్  లో నుంచి యవ్వన ప్రాయంలోకి అడుగుపెడుతున్న యువ రక్తం దాన్ని సహించలేక ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు, చివరికి ఆమె చేసే త్యాగం అతనికి ఆమెకొచ్చిన అవార్డు రూపంలో తెలుస్తుంది. భళ్ళున తనకి తానుగా పగిలిపోతాడు. ఇలాంటి వ్యధా భరిత దృశ్యాలని కాస్త వాస్తవిక దృక్పధంలో రాయడం అనేది రచయిత ఎంచుకున్న పద్దతి , పద్దతిని సూటిగా సుత్తిలేకుండా తనదైన శైలిలో మనకి చూపిస్తారు రచయిత. ఇలా చెప్పుకుంటూ పొతే ఒక జీవని , ఒక లెనిన్ ప్లేస్ , చిట్ట చివరి రేడియో నాటకం, ద్రోహవృక్షం లాంటి కధలు గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వాస్తవానికి రచయిత వైద్యుడు, కాని ఆతరవాత తాను చేస్తున్న పని వదిలి అఖిల భారత సర్వీసులకి వెళ్ళి అక్కడ రైల్వే జీ ఎంగా పనిచేసారు.  విపరీతమైన పని ఒత్తిడి మధ్యన కూడా తాను రాయడానికే మొగ్గు చూపుతానని ఒక సందర్భంలో చెప్పారు.  నిజానికి దళితుల్లో బాగా స్థిరపడిన వారిమీద,  సహ దళితుల్లో కాస్త భయం పాలు ఎక్కువగా ఉంటుంది, వాళ్లకేం వాళ్లు బాగానే స్థిరపడ్డారు అనే మాటలు వినబడతాయి , అలాంటి మాటల్ని ఎన్నో విన్నారు రచయిత చాలా సందర్భాల్లో. చాలా పాత్రల ద్వారా అది నిజం కాదని చెప్పి చూశారు, తన గుండెలో మంట ఉన్నవాడు ఎప్పటీకీ నెగడులా తనలో తాను మండుతూనే ఉంటాడని అనేకానేక పాత్రల్ని సృష్టించారు.  కొందరు విన్నారు కొందరు వినలేదు , వినకపోగా,  చాలా అమానుషంగా మాట్లాడారు, కాపీ కధలన్నారు, అచ్చు ఇలాంటిదే ఎక్కడో చదివామే అని హేళన చేశారు , అయినా నవ్వుల్ని చిరునవ్వుతోనే కనబడే వీసీఆర్ గారు పట్టించుకోలేదు.

భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చదువు చెప్పవలసిన ప్రొఫెసర్లే కులంగాళ్లని ప్రోత్సహిస్తూ దేశంలో అసమానతలు రేపుతుంటే ఒక ప్రొఫెసర్కి డిసెంబర్ ఆరునుంచి దేశం అల్లకల్లోలంగా ఉన్నట్టు కనిపిస్తుంది అంతా గందరగోళంగా ఉన్న మనుషుల మధ్యన తాను ఉన్నట్టు అనుకుంటాడు, పిల్లలని అలా మౌనంగా ఎలా ఉండగలుతున్నారని నిలదీస్తాడు రోడ్ మీద జనాల్ని మరి ముఖ్యంగా ఏమి పట్టనట్టు నడిచే జనాల్ని కదిలించాలనే ప్రయత్నం చేస్తాడు , చివరకి ఒక చిన్న పిల్లాడిలో తన భవితవ్యం అంతే దే భవితవ్యం చూస్తాడు. ఇలాంటి యధార్ధతను రాయాలంటే చేవ కావాలి అలాంటి చేవ ఉన్న రచయిత వీసీఆర్ గారు.

దళిత చరిత్రలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఒక చరిత్ర , దానిని ఆధారంగా చేసుకుని ఒక నవల రాశారు దాని పేరే నల్ల మిరియం చెట్టు , ఒక సాధారణ యూనివర్సిటీ కుర్రవాడి లోచనలు అతని జాతి అభ్యుదయం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అతనికి ఎక్కడైనా పాట వినబడితే కాలు ఆగదు తనకున్న వాయిద్య పరికరాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్లతో శృతి కలుపుతాడు , స్లోగన్లు ఇస్తాడు , కరపత్రాలు పంచుతాడు , ప్రణాళికలు గీయడంలోను పాలు పంచుకుంటాడు , ఇవన్ని తండ్రికి నచ్చవు , తండ్రి కూడా దళితుడే కాని, దళిత బాధలు పట్టని వాడు, దళిత వాదాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటూ, తన ఇస్త్రీ చొక్కా నలగకుండా అన్ని సౌఖ్యాలనీ రిజర్వేషన్ ముసుగులో అనుభవిస్తూ ఒక అతిపెద్ద రాజకీయ పార్టీ నీడలో సేదదీరుతూ ఉంటాడు, కాని కుర్రవాడు అమ్మని కొట్టినా, అక్కని కొట్టినా తనని గాయపరిచినా, తానేమి చేయదలుచుకున్నాడో ఒక లక్ష్యం కలవాడుగా సాగుతూనే ఉంటాడు అతని పేరు రూమీ. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి , పాదయాత్రలు అన్నిటికీ మూలమై నిలిచిన ఒక చారిత్రాత్మక ఉద్యమం అది యావత్ దేశం ఒక్కసారిగా మళ్ళి కుదుపుకు లోనైన సన్నివేశం, చాలా పెదవి విరుపుల మధ్యన మొదలైన ఉద్యమం అనేకానేక ద్రోహాల మధ్యన ఇంకా సజీవంగా కొన ఊపిరితో ఉన్నట్టు లేనట్టు సాగుతుంది, నల్లమిరియం చెట్టు నవల అంతా ఉద్యమం మీదనే నడుస్తుంది ,ఇందులో దళిత అయిడెంటిటీ కోసం పెద్ద కులాల వద్ద సాగిలపడుతూ, పైకి అభ్యుదయ భావాల్ని వల్లె వేస్తూ, ఇంట్లో కర్కశంగా వ్యవహరించే రాజసుందరం లాంటి వ్యక్తుల్ని ఆనాడే కళ్లకి కట్టినట్టు చూపించారు విసీఆర్, దళిత మహిళకి ఆత్మస్థైర్యం o ఉండాలో నవల చదివితే మనకి తెలుస్తుంది, ఒక వర్గంలో మొదలైన ఉద్యమాన్ని అణగదొక్కడానికి అదే వర్గం మనుషులని రాజ్యం ఎలా ఉసిగొలుపుతుందో ఒక్కో సన్నివేశం విడమర్చి మరీ చెబుతుంది , చివరకి తండ్రిని నలుగురు ముందే నిలదీస్తాడు రూమీ. దాని తరవాత పరిణామాలు అతనికి ముందే తెలుసు అయినా భయపడడు , అంబేద్కరిజం ఎంత దగా పడుతుందో, ఎంత స్వార్ధానికి వాడుకోబడుతుందో నవలని చదివితే తెలుస్తుంది , నిజానికి చాలా మంది నవలని తమకి ఇష్టమైన కోణంలో నుంచి చూశారు, కాని చూడవలసిన కోణం రూమి నుంచి , రూమి అక్క నుంచి , రూమి తల్లి కోణంనుంచి చూడాలి, రూమీ బాబాయి పాత్ర చివరిదాకా ఎంత అభ్యుదయ భావాలని తీసుకు వస్తుందో రచయిత చాలా నేర్పుగా తీసుకు వెళతారు. నిజానికి రచయిత ఒక దళిత వర్గాన్ని ఉద్దరిస్తుంది అనుకున్న ఉద్యమం కాస్తా ఉసూరనిపించే సరికి ఆయన సహించలేక పోయారు, దళిత ఉద్యమ సారధులు కేవలం స్వలాభాల కోసం రాజకీయ నాయకుల దగ్గర మోకాళ్ళూని ఊడిగం చేస్తే సహించలేకపొయారు, ఇదే కొంతమంది దళితుల్లో ఆయన పట్ల ఒక ద్వేష భావాన్ని పెంపొందించింది, అది ఎంతవరకు వెళ్ళింది అంటే ఆయన మరణాన్ని సైతం సానుకూలంగా మాట్లాడేలా సాగింది, తప్పు ఎవరిదీ కాదు ఆడించే రాజ్యానిది, ఆడే మనుషులది.    

” నేను నా వచనాల ద్వారా సృష్టింపబడ్దాను, నా కధల్లోని పాత్రలన్నీ నేనే, నేనే మోహన సుందరాన్ని, నేనే లలితని నేనే మోహిని నీ అంటూనే తన శరీరం పై తానే గాయాలు చేసుకుంటున్న కాలం నేనే ” అని నిర్భయంగా చెప్పుకున్న రచయిత. అలా చెప్పి ఊరుకోలేదు ఆయన బాగా  అభివృద్ధి  సాధించామని గర్వంగా చెప్పబడే ఆంధ్రా ప్రాంతంలో కోస్తా జిల్లా భాగమయిన ప్రకాశం జిల్లా లోపలి తండాల గురించి రాశారు. గొట్టిపడియ గ్రామం లో ఉన్న నవమణి అనే దళిత ఉద్యమకారిణీ గురించి రాస్తారు, ఎన్జీ వో ల తరపున పని చేస్తున్న స్వప్న అనే యువతి కున్న మూడు భయాలు మనల్ని కదిలించేస్తాయి, మొదటి రెండూ పెద్దగా బాధించవు మనల్ని మనతో పాటు స్వప్నని. కాని మూడో కారణం మాత్రం గగురుపాటు కల్పిస్తుంది. అలా దేహన్ని ఫణంగా పెట్టి ఆరిపోయిన జీవితాల్ని పట్టు పట్టి మరీ లాక్కొచ్చి మన ముందు నిలబెట్టి ఇదిగో వీళ్ళు మన మధ్యనే నివసిస్తున్నారు, వీళ్లని కూడా పట్టించుకోండి అని గట్టిగా మన చెవి మెలిపెట్టి మరీ చెబుతారు, మధ్యలో వర్ణనలు మనల్ని ఊపిరి తీసుకోనివ్వవు, చెప్పాలంటే కధల్లో ఒక కొత్త ఒరవడి కనబడుతుంది ఎప్పుడూ మనం చదవని ఒక కొత్త వాక్యం మనముందు వళ్ళు విరుచుకుని నిలబడుతుంది , అది మనమీద కాస్త ఆధిపత్యం చెలాయించినా మనమే కాస్తంత నిమ్మళపడి సర్దుకుంటాం , అలా చాలా సెటిల్డ్ గా వాక్యాన్ని చదివిస్తూ పోతారు , ఎక్కడో పాశ్చాత్య దేశాల నవలలో ఉండే జీవం ఇక్కడ కూడా అలా కాగితాల మీద పరుచుకుని ఉంటుంది, దాదాపు ప్రతీ రచనలో పదాల వెంట కవిత్వం పరుగులు తీస్తూ పోతూనే ఉంటుంది. మొత్తం ఆ కధ లేదా నవల చదివిన తరవాత కవిత్వం వాక్యాలని మనం మార్క్ చేసికుంటూ పొతే ఖచ్చితంగా అన్ని వాక్యాల కిందా మనం గీతలు గీయాల్సిందే, అంతటి కవితా మహత్తు గలిగిన వాక్యం ఈయనది, కవిత్వంలో ఖచ్చితంగా  మోహన్ ప్రసాద్ గారు ఎలాంటి విప్లవాత్మకమైన ఒక ఒరవడిని తీసుకు వచ్చారో అదే అలాంటిదే  వీసీఆర్ గారు కధల్లో తెచ్చారు. సాంప్రదాయాన్ని కాస్త పక్కన పెట్టి వరుసల మధ్యన కొత్త కొత్త పాత్రలని పరిచయం చేస్తూ కాస్త గందరగోళానికి గురిచేసినా మళ్లా ఆ దారాన్ని మనమే దొరక బుచ్చుకుని దాని వెంట వెళ్లే దారి చూపెడతారు.

చంద్ర శేఖర్ గారిని చదువుతున్నంత సేపు బైబిల్ లో విలాపవాక్యాలు రాసిన యిర్మియా ప్రవక్త (ప్రొఫెట్ జెర్మియా) గుర్తుకు వస్తాడు , బానిసత్వంలోకి వెళ్ళిన తన ప్రజలని తమ రాజ్యం వైపు ళ్ళించడానికి ఆయన పడే తపన చాలా హృద్యంగా ఉంటుంది , ఏడుస్తాడు , రోదన చేస్తాడు, రోజుల తరబడి ప్ర్రార్ధనలో గడుపుతాడు, ఎక్కడో తన మీద నిషేదం ఉంది అని వినబడగానే ఎత్తైన ఒండమీదకి వెళ్లి తాను చెప్పదలుచుకున్న వార్తని ప్రజలందరికీ వినబడేలా ఎలుగెత్తి ప్రకటిస్తాడు, జనం పిచ్చివాడన్నా పట్టించుకోడు లాగే వీసీఆర్ సార్ కూడా తన జాతికి చెందిన ప్రజల బాగు గురించే మాట్లాడారు, ప్రతీ కధలో ఒక అభ్యుదయ భావాన్ని కలిపి చెప్పారు. ప్రజలకి ఉండే సాంస్కృతిక స్పేస్ ని ప్రభుత్వం లాగేసుకుని గొంతు నొక్కుతుంటే ఆవేదన చెందారు , దారీ తెన్ను లేకుండ పర్వెడుతున్న జనాలకి ఒక చౌరస్తాలో ఎదురైన స్నేహ హస్తం వీసీఆర్ గారు . అయితే కధల్లో చాలా చోట్ల మార్మికత కనబడుతూ కాస్త అప్పుడప్పుడు పాఠకుడు గందరగోళంలో పడతాడు. అక్కడక్కడా సాగతీత ధోరణి కాస్త కలవరపెడుతుంది, అనుకొకుండా పాత్రలు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తూ ఉంటాయి . ఆకుపచ్చ దేశం నవలలో కాస్త కాల్పనికతని కూడా రంగరించడం వలన అప్పటి వరకు చదువుతున్న ఫ్లేవర్ పోయి కాస్త ఆసక్తి తగ్గుతుంది. ప్రజలు ఇం హోప్ లెస్  లైఫ్ ని అనుభవిస్తూ ఉన్నారా అని అనిపిస్తూ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాక సామాన్య ప్రజలకి పట్టణ వాతావరణం అంత రుచించదు, కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ని కధల్లోకి ఎక్కించడం వలన రచయిత తానుఎక్కడ నివాసం ఉంటున్నాడో ఒక క్లూ ఇచ్చినట్టు అవుతుంది అందువల్ల ఈయన కేవలం పట్టణానికే పరిమితమైన కధా రచయితగా అనుకుంటారు దీనికి రచయితకి సంబంధం ఏమీ లేకపోయినా దాన్ని రచయిత భరించవలసిందే. రచయిత చాలా చోట్ల , ఒక చేత్తో కమ్మ్యూనిజాన్ని మరో చేత్తో దళిత వాదాన్నీ మోసుకుని తిరిగారు అయితే అటు వాదాన్ని ఇటు వాదాన్ని సంతూకం చేయలేకపోయారేమో అని కూడా అనిపిస్తుంది , లేని మంత్ర దండాన్ని పట్టుకోవడం కోసం చేతిలో ఉన్న కర్ర ముక్కని వదిలేసారేమో అనికూడా అనిపిస్తుంది.

మరిన్ని కధలు రాయవలసినవారు, ఎన్నో మెట్లు ఎక్కవలసిన వారు. నల్లమిరియం చెట్టుకి కి ప్రముఖ కవి శివారెడ్డి గారి చేత ముందుమాట రాయించుకున్నారు, తద్వారా తనకి నిబద్దత గలిగిన కవుల పట్ల ఎంత నమ్మకం ఉందో చెప్పారు , తన చివరి రోజుల్లో కూడా శివారెడ్డి గారి మాటల వలన స్వాంతన పొందానని ఆయనే చెప్పుకున్నారు, కధకి, కవిత్వానికి ఉన్న బంధాన్ని మరోసారి ఇలా వ్యక్తం చేసారు. ఠాత్తుగా ఉద్యోగ విరమణతో పాటుగా జీవితానికీ విరమణ ప్రకటించారు, ఒక ముందు చూపు కలిగిన రచయిత మన మధ్య నుంచి వెళ్ళిపోవడం ఒకింత బాధగానే ఉంటుంది కాని మనం నివాళి ప్రకటించడానికి మాత్రం సరైన మార్గం ఒకటి ఉంది. అది ఆయన రచనలు చదివి మనం ఆయన కోరుకున్న దారిలో మనం నడుస్తూ మరికొంతమందిని నడిపించాలని కోరుకోవడం మాత్రం అత్యాశ  కాబోదు. ఇప్పుడు మరింత సంక్షోభ కాలం నడుస్తుంది. రోహిత్ వేముల మరణం తరవాత దళిత ఉద్యమాలు మరో కొత్త మలుపు తిరిగాయి. ఇలాంటి కాలంలో కనక వీసీఆర్ గారుంటే మరో కొత్త మార్గం చూపెట్టే వారు. ఏది ఏమైనా కాలం వీరులని మరలా పుట్టిస్తుంది అని ఆశతో సాగుదాం .

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

9 comments

  • కొందరు మనుషులు వెళ్ళిపోయాక, వాళ్ళనెలా కలవాలా అనే ఒక పిచ్చి ఆలోచన కలుగుద్ది. పిచ్చిదని తెలిసి కూడా. అనిల్ ఆ పిచ్చి ఆలోచన ని కలిగించినందుకు ఉండబట్టలేక థ్యాంక్స్ చెప్తాను.

    చాలా బాగా రాశావు అనిల్. చదవాల్సినవి చాలా ఉన్నాయని గుర్తు చేస్తూ…

  • రివ్యూ చాలా బాగుంది. చంద్రశేఖర్ గారి కథలలోని మాజిక్ రియలిజం విభ్రమ పరుస్తుంది. థాంక్యూ

  • మంచి ఆర్టికల్ అన్నా..వి. చంద్రశేఖర్ రావు గారిది నేను ఒక్కటే కథ చదివాను. కథ-2016 లో వచ్చిన ‘నేనూ, శివం’ అన్న కథ. అవును, చంద్రశేఖర్ రావు గారిని చదవాలి.. thank you for this write-up.

  • చాలా అద్భుతంగా రాసారు అనిల్. ఈ పుస్తకం లోని కధల గురించి మీ విశ్లేషణ చదివాక ఇప్పుడే కొని చదివేయాలి అనిపిస్తోంది. చాల బాగా raasaru

  • నల్లమిరియం చెట్టు నవల అంతా దళిత ఉద్యమం మీదనే నడుస్తుంది..అన్న ఈ ఒక్క వాక్యంతోనే ఆ పుస్తకాన్ని చదవాలనే జిజ్ఞాసను కలిగించారు…మనసులు పోయాకే వాళ్ళ విలువ తెలుస్తుంది అందరికి..వీసీఆర్ గారు ఇప్పుడు ఉంటిఉంటే జరుగుతున్న దారుణాలపై తనదైన శైలిలో స్పందించేవారు….రివ్యూ చాల బాగుంది అనిల్ గారు..అభినందనలు

  • “నల్లమిరియం చెట్టు” పై మీ సమీక్ష బాగుందండి. కొందరు వి.చంద్రశేఖర రావు గారి రచనల్లోని మార్మికత అంటే హడలిపోతారు. ఆయన రాతలు అర్థం కావాలంటే ముందు ఆయన మన మనసుకు దగ్గరవ్వాలి. అప్పుడు కాని ఆ అంతరంగంలోని అలజడి అర్థం కాదు. నవలలోని ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరించారు మీరు. ధన్యవాదాలు అనిల్ గారూ !

  • తన గుండెలో మంట ఉన్నవాడు ఎప్పటీకీ నెగడులా తనలో తాను మండుతూనే ఉంటాడని అనేకానేక పాత్రల్ని సృష్టించారు….నల్ల మిరియం చెట్టులాంటి అనేక నవలలపై మీ విశ్లేషణ ఇలాగే సాగాలని ఆశిస్తున్నాను.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.