నీ ఉనికి నేరం కాదని తెలిసినప్పుడు

ఎప్పటిలాగే ఆఫీసు పని ముగించుకుని తిరిగి రూంకి వెళ్లడానికి బస్ ఎక్కాడు ప్రమోద్. టికెట్ తీసుకున్నాక అలవాటుగా ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్ నుంచి మెసేజ్ “సెక్షన్ 377” విషయంలో రేపే తీర్పు అని. చాలా రోజుల నుంచీ ఎదురుచూస్తున్నాడు ప్రమోద్ ఆ తీర్పు కోసం. అప్పటివరకూ ట్రయల్ లో జరిగిన వాద ప్రతివాదనలూ, సుప్రీంకోర్టు లాయర్లు, జడ్జిల అబ్జర్వేషనన్స్ గమనించాక పాజిటివ్ జడ్జిమెంటే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ, రేపే తీర్పు అనగానే తనలోనూ సందేహాలు, గుబులు పుట్టుకొచ్చాయి. ఇలా ఆలోచనల్లో ఉండగానే తన స్టాప్ రావడంతో దిగిపోయాడు ప్రమోద్.
రూంకి ఐతే వచ్చాడు గానీ ఆలోచనలన్నీ గతంలోనే ఉండిపోయాయి. ప్రమోద్ కి ఇంకా బాగా గుర్తు తాను చిన్నప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా, ఇంట్లోనే కూర్చుని కాలం వెల్లదీసే బిడియస్తుడై ఉండడం వల్ల, మాట తీరూ, నడకా కాస్త స్త్రీలని పోలి ఉండడం మూలాన తన క్లాస్ మేట్స్, ఇంకో తెలుగు మాష్టారు “ఆడంగోడు”,”చెక్కా గాడు” అని వెకిలిగా మాట్లాడడం. తన తప్పేమిటో అర్థం కాక ఎన్నో దేవుళ్లని క్షమించమని ప్రాధేయపడుతూ, చాలా వేదన అనుభవించిన రోజులూ గుర్తొచ్చాయి. వీధిలో అందరూ తమ ఇంటికే వచ్చి టీవీలో “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా చూస్తున్నప్పుడు శ్రీదేవి అందం గురించి ఒక్కొక్కరూ అతిశయంగా మాట్లాడుకుంటుంటే తనకి మాత్రం చిరంజీవినే చూడాలనిపించిందప్పుడు. అందరూ ఎవరిళ్లకి వారు వెళ్లిపోయాక రాత్రి పడుకునే ముందు అందరిలా మామూలుగా ఆలోచించలేకపోతున్నందుకు, తనలో కలుగుతున్న తప్పుడు ఆలోచనలకి తనలో తానే ఎంతగానో కుమిలిపోయేవాడు. పదో తరగతి పూర్తయ్యే వరకూ ఇదే పరిస్థితి. ఐతే ఇంటర్ చదివేందుకు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కాలేజీలో చేరాక తన జీవితం మలుపు తిరిగిందనే చెప్పుకోవచ్చు. అప్పటివరకూ పెరిగిన పల్లెటూరి వాతావరణంతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్. అంతేకాక మంచి పుస్తకాలూ, ప్రపంచ సినిమాతో పరిచయం మూలంగా ఇన్నాళ్లూ బాధపడినట్టు తనలో నిందించుకోవాల్సినంత తప్పులేవీ లేవనీ, తాను కేవలం డిఫరెంట్ సెక్సువల్ ఓరియెంటేషన్ ని మాత్రమే కలిగి ఉన్నానని, తనదే కాక ఇలా హెటెరోసెక్సువాలిటీకి భిన్నమైన ఆలోచనలు గల వారందరినీ ” LGBT” అంటారనీ, వారు కూడా ప్రస్తుతం హక్కుల కోసం పోరాడుతున్నారని తెలుసుకున్నాడు. తనలో అప్పటివరకూ ఉన్న గిల్ట్ కాంప్లెక్స్ కొద్ది మేరకైనా తొలిగిపోవడంతో స్టడీస్ పై కాన్సన్ట్రేట్ చేసి ఐదేళ్లలో సిటీలోనే మంచి ఉద్యోగం సంపాదించాడు. అప్పుడు తనకి లభించిన ఆర్థిక స్వాతంత్య్రం, కాన్ఫిడెన్స్ తో తనకీ ఓ తోడు కావాలని అన్వేషణ మొదలుపెట్టాడు. ప్రతీ మెట్రో సిటీలోనూ గేలు, లెస్బియన్లు కలుసుకునే కొన్ని సీక్రెట్ ప్లేసులు, బార్లూ ఉంటాయి అని కొన్ని ఆన్లైన్ పరిచయాల ద్వారా తెలుసుకుని కొందరిని మీట్ అవడం మొదలుపెట్టాడు. అప్పుడే తనకి బయట ప్రపంచానికి తెలియని చాలా భయంకర విషయాలు తెలిసాయి. కలిసిన ప్రతిసారీ ఎన్నో జాగ్రత్తలు పాటించేవారు, ఎందుకంటే  ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న సెక్షన్ 377 కారణంగా పోలీసులూ, కొంతమంది బ్లాక్ మెయిలర్స్ నుంచి మనకి చాలా హాని ఉంటుందని ఒకతను చెప్పాడు.
ప్రమోద్ కి తాను ఒక అల్ట్రా రిచ్ ,అర్బన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడితే బావుండేది, తన ఓరియెంటేషన్ ని అర్థం చేసుకోగలిగే వారైనా ఉంటే, ఎంత బావుండేది అని రోజూ అనిపించేది. ఒక విధంగా ఎక్కువ డబ్బులు సంపాదించి, ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ కి వెళ్తే తనకెలాంటి పరిమితులూ ఉండవేమో అనే పిచ్చి ఆశ కూడా తను పట్టుబట్టి మరీ చదివి, టాప్ కాలేజ్లో అడ్మిషన్ తెచ్చుకుని మంచి ఉద్యోగం సాధించడానికి కారణమైందని చెప్పొచ్చు. ఐతే ఆ బార్లో కలిసినవారితో సాగే ముచ్చట్లలో ఈ చింతలేవీ అతనికి గుర్తుండేవి కావు. ఫేమస్ హాలీవుడ్ మూవీ “The Wizard of Oz” లో లీడ్ క్యారెక్టరు పేరు డొరొతీ.  ఆ పాత్ర ఓ ఫేమస్ ఎల్జీబీటీ ఐకన్. ప్రమోద్ కి తనతో పాటు, ఆన్లైన్ లో కలిసిన  ఇంకో ఎనిమిది మంది ఎల్జీబీటీ పీపుల్ అంతా కలిసి తమ గ్యాదరింగ్ కి “డొరొతీ గ్యాంగ్” అని పేరు పెట్టుకుని ప్రతి నెలా రెండో ఆదివారం గానీ, మూడో ఆదివారం గానీ కలుద్దామని నిర్ణయించుకోవడం ఇంకా నిన్న,మొన్ననే జరిగినట్టుంది.
ఆ గ్యాంగ్ మీటైన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా ఎల్జీబీటీ హక్కుల పోరాటాలతో పాటుగా తమ వ్యక్తిగత జీవితాల్లో అంశాలూ చర్చకు వచ్చేవి. గ్యాంగ్ అందరిలోకీ మాటకారీ, గడసరి ఐన ముప్పై ఐదేళ్ల స్రవంతికి అన్ని విషయాలపైనా మంచి పట్టు ఉండేది. కొత్తగా కమ్యూనిటీలో జాయిన్ ఐన ప్రమోద్ లాంటి వారికి తనే గైడెన్స్ ఇచ్చేది. బ్లాక్ మెయిల్ నుంచి తప్పించుకోవడం గురించి సేఫ్టీ మెజర్స్ గానీ, క్లోసెట్ నుంచి బయటకి రావాలనుకునేవాళ్లకి సలహాలూ, సూచనలు గానీ తనే చెప్పేది. స్రవంతి గ్యాంగ్ మీటింగ్స్ లో మొదటిసారి ఇచ్చిన స్పీచ్, అందులో ప్రతి పదమూ తనకింకా గుర్తే.  “మన లాంటి గే, లెస్బియన్లందరూ ఎదుర్కునే అతిపెద్ద సమస్య మ్యారేజ్. ఓ నిర్దిష్ట వయసు రాగానే ఇండియాలో ఇండ్లలో పెళ్లి గోల మొదలౌతుంది. స్ట్రైట్ పీపుల్ కే అస్సలు వీలు కాదు తప్పించుకోవడం, ఇంక మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవంటే ఓరియెంటేషన్ గురించి చెప్పాలి, చెప్పినా అర్థం చేసుకుంటారన్న హోప్ అస్సలుండదు. ఏదో నూటికో, కోటికో ఒక్క సందర్భం మినహాయిస్తే. ఇష్టం లేకపోయినా బలవంతంగా హెటెరోసెక్సువల్ మ్యారేజ్లోకి ఎంటరయ్యి జీవితాంతం క్షోభించేవారు చాలా మందే. ఐతే ఈ మధ్య “మ్యారేజ్ ఆఫ్ కన్వీనియెన్స్” కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటోంది. ఇందులో ఒక గే, ఒక లెస్బియన్ ముందస్తు ఒప్పందం చేసుకుని పెళ్లి చేసుకుని, పెళ్లి గోల నుంచి తప్పించుకుని తమకి నచ్చిన విధంగా బ్రతుకుతున్నారు. ఇండియా లాంటి కన్జర్వేటివ్ మైండ్సెట్ ఉన్న దేశంలో ప్రస్తుతానికి మనకి ఉన్న ఏకైక సేఫ్టీ ఆప్షన్ ఇదొక్కటే, మొక్కుబడే ఐనా తప్పని తంతు. ఎవరినో మోసం చేసి మనస్సాక్షిని చంపుకునే మొదటి ఆప్షన్ కంటే మోసానికి తావులేని ఇదే బెటర్ ఆప్షన్. సో మీకు వీలైంది చూస్ చేసుకోండి” అని.
“సెక్షన్ 377 ఇండియన్ పీనల్ కోడ్ నుంచి తీసేసేంత వరకూ మనకి ఈ పరిస్థితి తప్పదు, ఒకవేళ అది తీసేసినా మ్యారేజ్ రైట్స్ ఐతే మన జీవితకాలంలో వచ్చే సూచనలు కనిపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికి మ్యారేజ్ ఆఫ్ కన్వీనియెన్స్ ఒకటే దారి” అన్న తన మాటలు ఇంకా చెవిలో మార్మోగుతున్నాయి. పరిస్థితి చూస్తే అలాగే ఉంది. మతాల గురించీ, కులాల గురించీ కొట్టుకునే రాజకీయ పార్టీలున్న దేశంలో సేమ్ సెక్స్ మ్యారేజ్ లాంటి ఇష్యూస్ని సపోర్ట్ చేయడం కాదు కదా కనీసం ఊసైనా ఎత్తరనేది అవగతమైంది. ఒక మనిషి తనకి నచ్చిన లైఫ్ తాను లీడ్ చేయలేకపోతే అందువల్ల కలిగే అసంతృప్తి, బాధ ఎంత దారుణంగా ఉంటాయో కేవలం అవి అనుభవించేవారికే తెలుసు. ఎన్ని ఉన్నా ఏదీ లేనట్టనిపిస్తుంది, ఒంటరితనం ప్రతి రాత్రీ పక్కలో చేరి వెక్కిరిస్తుంది. డిగ్నిఫైడ్ లైఫ్ కోసం బహుశా ఒకప్పుడు నల్లజాతీయులు ఎదుర్కొన్న వివక్ష, చేసిన పోరాటం కంటే రెండింతలు ఎదుర్కోవాలేమో, పోరాడాలేమో మన దేశంలో. అంత ఓపిక ఉన్నదా మరి అని తనని తాను ప్రశ్నించుకున్న ప్రమోద్ కి నిశ్శబ్దమే సమాధానమైంది.
ఒకవైపు అమెరికా లాంటి దేశాల్లో ఎల్జీబీటీలకి ఏకంగా మ్యారేజ్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్ కూడా ఇచ్చేస్తుంటే ఇక్కడేంటి ఇంత వెనకబడిపోయున్నాం అని చాలా బాధేసేది. ఎప్పటికైనా ఆ సెక్షన్ కొట్టివేసి, తమకీ మిగతా వారితో సమానంగా అన్ని హక్కులూ వస్తే బావుండేది అని ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఊహించుకుని పడుకున్న రోజులు ఇంకా మదిలో తాజాగా ఉన్నాయి. అలాంటిది ఆ ప్రాసెస్లో మొదటి స్టెప్ ఐన డీక్రిమినలైజేషన్ గురించి డిసైడ్ చేయబడే రోజు రేపే అని తెలిసినప్పటి నుంచీ ఏం జరగబోతోందో అని భరించలేనంత ఉత్కంఠతో సతమతమైపోతూ ఆ రాత్రి సరిగా నిద్రే పోలేదు తను.
మరుసటిరోజు ఆఫీసుకైతే వెళ్లాడు గానీ మైండ్ అంతా లంచ్ బ్రేక్ ఎప్పుడొస్తుందా, జడ్జిమెంట్ గురించి ఎప్పుడు వింటానా అనే ఆలోచనలతోనే నిండిపోయి ఉంది. తీరా ఆ సమయం రానే వచ్చింది. సుప్రీంకోర్టు సెక్షన్ 377 ని రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించి, ఎల్జీబీటీలకి క్షమాపణలు చెప్పి, స్వలింగ సంపర్కాన్ని నేరం కాదు అని ప్రకటించింది అన్న ఆర్టికల్ చదవగానే ఏళ్ల తరబడి మదిలో గూడు కట్టుకున్న అభద్రతాభావం, గిల్టీ ఫీలింగ్ అన్నీ మైమరిచిపోయేంత సంతోషం కలిగింది. రోజంతా తనకి నచ్చినవి తిని, ఫ్రెండ్స్ తో ఓ సినిమా చూసి భలే ఎంజాయ్ చేసాడు. తిరిగి రూంకి వచ్చి పడుకునేముందు, ఇన్నాళ్ల లాగా ఇప్పుడైతే ఎలాంటి టెన్షనూ లేదనే రిలీఫ్ కంటే ఇంకో డిస్టర్బింగ్ థాట్ వచ్చింది. సరే కోర్టులైతే తీర్పులిచ్చాయి, న్యాయపరంగా రక్షణైతే ఇవ్వగలవు గానీ అవేవీ సామాజిక నైతికతని గానీ, సామాన్య ప్రజల ఆలోచనా విధానంలో ఇన్స్టెంట్ మార్పులైతే తీసుకురావుగా మరి?,అప్పటివరకూ తనకి ఈ సమాజంలో పూర్తి స్వేచ్ఛ, డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడం మరీ అత్యాశే కదూ? అని. కాలమే సమాధానం చెప్పాలి ఆ ప్రశ్నకి అని సర్దిచెప్పుకుని నిద్రలోకి జారుకున్నాడు ప్రమోద్.

రాజశేఖర్ ఎ ఆర్

రాజశేఖర్ ఎ ఆర్: ప్రీవియస్ రచనలూ,వ్యాసాలూ లేవు. ఫేస్బుక్లో మంచి సినిమాలూ,పుస్తకాల పరిచయం, రివ్యూలు తప్పిస్తే‌. ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిక్షన్ మోస్ట్లీ.

4 comments

  • సహజమైన ఫీలింగ్స్ ను వ్యక్తపరచడానికి సమాజము అడ్డుపడటం సమంజసము కాదు.

    వాళ్ళ ఫీలింగ్స్ నచ్చకపోతే దూరముగా ఉండాలి కానీ వాళ్ళ హక్కులను భంగపరిచే విధముగా ప్రవర్తించకూడదు.

    మంచి కథను అందించినందుకు థాంక్స్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.