నేరమెవరిది? శిక్షలెవరికి?

సోమవారం సాయంత్రం ఆఫీస్ లోంచి బయటపడబోతూ పర్సనల్ ఈ-మెయిల్ తెరిచి చూస్తే, ‘న్యూ యార్క్‘ నగరంలో దక్షిణ ఆసియా ప్రజా సమస్యల గురించి పని చేస్తున్న స్వచ్చంద సంస్థ నుంచి వచ్చిన ఒక ఫార్వర్డెడ్ మెసేజ్ కనిపించింది: “Urgent: someone needed to drive family to Missouri”.  న్యూ యార్క్ నుంచి మిస్సోరీకి వెళ్లడానికి కారులో రెండు రోజులు పడుతుంది. ‘హండూరస్’ దేశానికి చెందిన 8 ఏళ్ల పిల్లవాడిని ‘న్యూ యార్క్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ సంస్థ’ (NYCLU), ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ నుంచి విడిపించి అతడి తల్లికి అప్పగించగలిగిందనీ, ఆ తల్లీకొడుకులను మిస్సోరీ రాష్ట్రంలో ఉన్న తండ్రి దగ్గరకు ఎవరైనా కారులో ఆ వారాంతంలోనే తీసుకెళ్లగలరా అన్నది ఆ ఈ-మెయిల్ సారాంశం. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఫార్వర్డ్ అవుతూ నన్ను చేరడానికి ఆ ఈమైల్ కు రెండు రోజులు పట్టింది. నేనుండేది న్యూ యార్క్ దగ్గర్లోనే. “అప్పటికే ఎవరైనా ముందుకు రాకపోయి ఉంటే నేను తీసుకెళ్తాన”ని రిప్లై ఇచ్చేసి ఇక ఎటూ కదల్లేక కూర్చుండిపోయాను, “ఎనిమిదేళ్ల పిల్లవాడు, తల్లిదండ్రులకు దూరంగా, అపరిచిత దేశంలో ఎంత భయపడిపోయి ఉంటాడు? ఎంతటి క్షోభ అనుభవించి ఉంటాడు?”

ఈ సంవత్సరం మే నెలలో అమలులోకి వచ్చిన ‘జీరో టాలరెన్స్’ పాలసీ పేరిట అమెరికా సరిహద్దుల వద్దకు శరణార్థులుగా వచ్చిన రెండువేల మంది పిల్లలను తమతో వచ్చిన తల్లిదండ్రుల నుంచి వేరు చేసి దేశంలో నలుమూలలా డిటెన్షన్ సెంటర్లలో బందీలుగా ఉంచింది అమెరికా ప్రభుత్వ శాఖ ICE.

“అమెరికాలోకి చట్టబద్ధంగా రండి. అక్రమంగా దేశంలోకి వచ్చినవారిపై ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుకాడం.” అంటూ తన ‘జీరో టాలరెన్స్ ‘ పాలసీని సమర్థించుకున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పసిపిల్లలను తల్లిదండ్రులనుంచి వేరు చెయ్యడమన్న అమానుష చర్యనూ, కేవలం మోడల్ గా పని చేసిన ఆయన భార్య మెలానియా ట్రంప్ మేధావులకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయించిన ‘ఐన్ స్టీన్ వీసా’ పేరిట అమెరికన్ సిటిజన్ అయిన హాస్యాస్పద/అనుమానాస్పద విషయాన్నీ పక్కన పెడితే, ట్రంప్ అన్న మాటలో తప్పేముంది అని అనిపిస్తుంది.

అది ఎంత తప్పో తెలుసుకోవాలంటే కొన్ని ప్రశ్నలు వేసుకోవలసిందే.

గత కొన్నేళ్లుగా సంవత్సరానికి కొన్ని వందల వేల మంది శరణార్థులుగానో, దొంగచాటుగానో ఎందుకని అమెరికా సరిహద్దులు దాటి వస్తున్నారు? అదీ అధిక శాతం ‘గ్వటెమాల’(Guatemala), ‘ఎల్ సాల్వడోర్’ (El Salvador), ‘హండూరస్’ (Honduras) దేశాల నుంచే ఎందుకు వస్తున్నారు?

“వాళ్ల దేశాల్లోని పేదరికాన్నీ, దౌర్జన్యాన్నీ, అపరిమిత హింసనూ తప్పించుకోవడానికి.” అన్న సమాధానం, దేశాన్ని కదిలించిన ఈ విషయం గురించి కొంచెం తెలిసిన వారి నుంచి వస్తుంది. కానీ ఆ దేశాల్లో జీవితం అంత దుర్భరంగా ఎందుకు ఉంది???

*

1980, అమెరికా, క్యాలిఫోర్నియా రాష్టృంలో,  ‘లాస్ ఏంజిలస్’ నగరం:

మార్క్సిస్టు గెరిల్లాలకూ, అమెరికా నియమించిన నిరంకుశ సైనిక పాలకులకూ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధాన్ని తప్పించుకునీ, ప్రాణాలకు తెగించి ఎన్నో కష్టాల మధ్య సుదూర ప్రయాణం చేసీ అమెరికాకు శరణార్థులుగా వచ్చారు ‘ఎల్ సాల్వడోర్’ దేశస్థులు. కొత్త దేశం, కొత్త భాషల మధ్యా, చాలీ చాలని జీతాలతో, అప్పటికే గ్యాంగులకు సంబంధించిన నేరాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న నల్ల, మెక్సికన్ జాతులకు చెందిన ముఠాల మధ్య వాళ్లు జీవితాన్ని వెతుక్కోవలసి వచ్చింది. త్వరలోనే వాళ్లూ ఒక ముఠాను ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. అదే ఈ మధ్య ‘ట్రంప్’ తన ‘జీరో టాలరెన్స్’కు మద్దతుగా, అమెరికా వాసులను భయపెట్టడానికి పలుమార్లు ఉటంకిస్తున్న ‘MS-13’ ముఠా.

మొదట్లో ఆత్మరక్షణ కోసం ఏర్పడినా, కాలక్రమేణా అతి దూకుడుతో, నిరంకుశంగా వ్యవహరించడం మొదలెట్టారు ముఠా సభ్యులు. తమ ముఠా సరిహద్దులను నియంత్రిస్తూ, దోపిడీలతో డబ్బు సంపాదించడం నేర్చుకున్నారు. ఇతర ముఠాలతో గొడవల్లో హత్యలు, మాదకద్రవ్యాల వ్యాపారం కూడా మొదలుపెట్టారు. పోగొట్టుకున్న ఆత్మగౌరవాన్ని ఆ నేర సమాజంలో వెదుక్కున్నారు. ఇలాంటిదే మరో పెద్ద ముఠా, ‘M-18’ లేదా ‘బార్రిఓ 18’ (Barrio 18). ‘మెక్సికో’ నుంచి వచ్చిన కాందిశీకులు ‘MS-13’ కంటే కొన్నేళ్ల ముందు ఈ ముఠాను ప్రారంభించారు.

1996 – బిల్ క్లింటన్ ప్రభుత్వం హయాం:

నేరాలు చేసి జైళ్లల్లో ఉన్న ‘MS-13’, ‘బార్రిఓ 18’ సభ్యులను ఎంతో మందిని వారి దేశాలకు తిప్పి పంపింది క్లింటన్ ప్రభుత్వం. ఇందులో ఎంతోమంది తమ దేశాలు వదిలిపెట్టి దశాబ్దాలు దాటింది, మరి కొంతమంది అమెరికాలో పుట్టడం వల్ల పూర్తిగా అపరిచిత దేశంలోకి అడుగుపెట్టినవాళ్లు. అప్పుడప్పుడే గెరిల్లాలకూ, నిరంకుశ ప్రభుత్వ సైనికులకూ మధ్య జరిగిన అంతర్యుద్ధం ముగిసింది కానీ ఎలాంటి అదుపాజ్ఞలు లేకుండా, అవినీతితో అల్లకల్లోలంగా ఉన్నాయి ఆ దేశాలు. అసలు ఆ దేశాల్లో అంతర్యుద్ధాలకు కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమధానంలోనే ఇప్పటి ఇమిగ్రేషన్ సంక్షోభానికి కారణం దాగుంది:

దాదాపు మూడు వందల ఏళ్లు స్పానియార్డుల పాలనలో మగ్గిన ‘మధ్య అమెరికా’ దేశాలు 19వ శతాబ్దంలో స్వాతంత్ర్యం సంపాదించుకున్నాయి. అది పేరుకు మాత్రమే స్వాతంత్ర్యం.  అప్పటికే ‘లాటిన్ అమెరికన్ ‘ దేశాల్లో తమ వ్యాపార కలాపాలు ప్రారంభించాయి అమెరికన్ సంస్థలు. అందుకోసం ఆయా దేశాల్లో తమకూ, తమ దేశ వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది అమెరికా ప్రభుత్వం. అందులో భాగంగా ‘మధ్య అమెరికాలోని’ ‘గ్వటెమాల’, ‘హండూరస్’, ‘ఎల్ సాల్వడోర్’ దేశాలను ‘బనానా రిపబ్లిక్’ గా వ్యవహరిస్తూ, ఆ దేశాల సహజ సంపదనూ, స్థానిక పేద ప్రజల కాయకష్టాన్నీ దోచుకుంది. చాలీచాలని జీతాలతో, అవమానాలతో స్థానికులు తమ దేశాల్లోనే బానిసలైపోయారు. చివరికి ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో, మిగతా లాటిన్ అమెరికన్ దేశాల్లో లాగే, ఈ మూడు దేశాల్లోనూ పేద ప్రజలు ప్లాంటేషన్లపై తిరగబడ్డారు. వియత్నాంను తలపించేంత తిరుగుబాట్లు జరిగాయి. ఆ తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం ఆయా దేశాలకు ఆయుధ సామాగ్రి సరఫరా చేయడంతో పాటు,ఆ దేశాల సైనికులకు తర్ఫీదునూ ఇచ్చింది. ప్రభుత్వానికి చెందిన సైనికులు, ఊరి జనాల ముందు గెరిల్లాలనూ, వాళ్లకు మద్దతునిచ్చిన వారినీ తలలు నరికి, మృతదేహాలను ఊరి మధ్యలో అందరూ చూసేట్లు వదిలేసేవారు. ప్రజలకు నిరంకుశ ప్రభుత్వం నుంచి స్వేచ్చ లభించలేదు గానీ ఆ అంతర్యుద్ధాల్లో కొన్ని వేలమంది హతమయ్యారు, కొన్ని లక్షలమంది కాందిశీకులుగా వేరే దేశాలకు వెళ్లిపోయారు. ఇందులో చాలామంది అమెరికాకు వలస వెళ్లారు.

1990ల్లో ఎడతెగని అంతర్యుద్ధాలతో వేసారిపోయిన ప్రభుత్వాలూ, గెరిల్లాలూ శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని స్థిరపడుతున్న సమయంలో ప్రపంచ దృష్టి ఆసియా మధ్యప్రాచ్యం వైపు పడింది. గత రెండు దశాబ్దాలుగా మరుగున పడిన ఈ మూడు దేశాల్లోని సంక్షోభాన్ని ‘జీరో టాలరెన్స్’  పేరిట తల్లీ పిల్లలను విడగొట్టి ప్రపంచ దృష్టికి తెచ్చాడు ట్రంప్.

ఒప్పందాలు ఎన్ని జరిగినా ఈ దేశాల్లో శాంతి ఎప్పుడూ నెలకొనలేదు. ‘క్లింటన్’ ప్రభుత్వం కాలంలో దేశ బహిష్కరణకు గురైన గూండాలు బతకడానికి మరోదారి లేక ఈ మూడు దేశాల్లో తమ ముఠా కార్యకలాపాలను  ఉధృతం చేశారు. ఈ మూడు దేశాలకూ పేరుకే సరిహద్దులు. హింసకయినా, శాంతికయినా ఈ సరిహద్దులు ఒక లెక్కలోకి రావు. దొంగతనం, మాదక ద్రవ్యాల సరఫరా, వ్యభిచారం, బలవంతపు వసూళ్లూ, ముఠా కక్ష్యలతో హత్యలూ ఇలా ఎన్నో నేరాల మధ్య సామాన్య ప్రజల జీవితం దుర్భరమైపోయింది. ‘MS-13’, ‘బార్రిఓ -18’ ముఠాలకు చెందిన ఉప నాయకులను ఎంతోమందిని జైళ్లలో వేసినా, వాళ్లు జైళ్ల నుంచే సభ్యులకు ఆజ్ఞలు ఇచ్చేవాళ్లు. ఆఖరికి 2012 లో అప్పటి ‘ఎల్ సాల్వడోర్’ ప్రభుత్వం ‘MS-13’, ‘బార్రిఓ-18’ ముఠా నాయకులను శాంతి ఒప్పందం కోసం ఒకచోటకు రప్పించింది. అప్పటికే అంతులేని హింసలో పెరిగి, తమ పిల్లలకు ముఠా కక్షల వారసత్వం ఇవ్వకూడదని కోరుకుంటూనే ఆ హింసలోంచి బయటకు రాలేకపోతున్న ముఠా నాయకులు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ ఒప్పందాలతో హింస పూర్తిగా తుడిచిపెట్టుకుపోకపోయినా, నేరాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇతర దేశాలకు వలసలు కూడా బాగా తగ్గిపోయాయి.

ఇంత మార్పు జరిగినా, ముఠాలతో కుమ్మక్కయిందని ప్రభుత్వం అన్ని వైపులనుంచి విమర్శలు ఎదుర్కొంది. ఆఖరికి 2014లో ప్రభుత్వ మార్పిడి జరిగింది. శాంతి ఒప్పందాల్లో భాగంగా విడుదలైన ముఠా నాయకులందరిని మళ్లీ జైళ్లలో వేశారు. ఇక మూడు దేశాల్లోనూ ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా నేరాలు మొదలయ్యాయి. వాటితో పాటే వేల సంఖ్యల్లో వలసలు కూడా.

తమ దేశం నుంచి అమెరికా చేరడానికి చేసిన కొన్ని వందలమైళ్ల ప్రయాణంలో దాదాపు 80 శాతం మంది మహిళలు రేప్ కు గురయ్యారని అంచనా. పిల్లలను ఎత్తుకుపోయి అంతటి పేదల నుంచీ డబ్బు గుంజడానికీ, అది కుదరకపోతే బలవంతంగా తమ గుంపులో చేర్చుకునే ముఠాల మధ్య నుంచీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వచ్చి అమెరికా సరిహద్దులు చేరారు. అలా వచ్చిన వాళ్లకు అమెరికాలో ఎదురైంది నాజూకైన, ఆధునిక దోపిడీ. ‘అక్రమంగా’ లాటిన్ అమెరికన్ దేశాల కార్యకలాపాల్లోకి చొరబడుతూ, ఆ దేశాలను దోచుకుంటూనే, లాటిన్ అమెరికా నుంచి వచ్చిన కాందిశీకులు హత్యలూ, దోపిడీ, మానభంగాలు చేస్తారనీ, పన్నులు కట్టకుండా ప్రభుత్వం ఇచ్చే సోషల్ సర్వీసులు తేరగా ఉపయోగించుకుంటారనీ, వాళ్లను తిరిగి తమ దేశాలకు పంపించెయ్యాలనీ ఓట్ల కోసం అమెరికన్ ‘జాతీయవాదుల్ని’ మభ్య పెడుతున్నాడు ట్రంప్.  మళ్లీ వాళ్లనే ‘ట్రంప్ హోటల్స్’ తక్కువ జీతాలకు పనికి పెట్టుకున్నాయి.

సరిహద్దుల దగ్గర శరణార్థిగా అప్లికేషను దాఖలు చేసుకుని అమెరికాలోకి అడుగుపెట్టడం చట్టబద్ధమైనదే. అయినా పిల్లలనూ, పెద్దవాళ్లనూ వేరు వేరు డిటెన్షన్ సెంటర్లలోకి తోశారు. ఆ సెంటర్లను ప్రైవేటు కాంట్రాక్టర్లకు కొన్ని మిలియన్ డాలర్లు చెల్లించి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అదీ ఒక పెద్ద వ్యాపారం. డిటెన్షన్ సెంటర్లలో బందీలకు ఒక్కొక్కరికి దాదాపు రోజుకి $130 ఖర్చవుతుందని లెక్కల్లో రాస్తున్నారు. కానీ ఆ బందీలకు సరైన సదుపాయాలూ ఉండవు. బందీలతోనే వంట నుంచి, బాత్రూములు శుభ్రం చేసేదాక అన్ని పనులు చేయించి రోజుకి ఒక్క డాలరు జీతం ఇస్తారు. ఈ డిటెన్షన్ సెంటర్లు నడిపే కంపెనీలకు సంవత్సర లాభం మిలియన్లలో ఉంటుంది. ఆ కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చినందుకు ట్రంప్ ఎలక్షన్ ఫండుకు విరాళం అందుతుంది. ఇదీ ఈనాటి బానిసత్వ అసలు స్వరూపం.

“నిజ్జంగా, మనుషులుగా బతకడం ఇంత కష్టమా? ఇతర్లను పీల్చి పిప్పి చేసి మరీ బిలియన్లు గడించేంత దురాశా?” ఇలాంటి అతిసామాన్యమైన తెలివి తక్కువ ప్రశ్నలు ఒక వైపు, మరోవైపు మానవత్వంపై నమ్మకం సడలనివ్వకుండా, అహోరాత్రులు పని చేస్తున్న NYCLU లాంటి సంస్థలూ, వాళ్లకు చేదోడుగా అటూ ఇటూ ఆలోచించకుండా సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చే ఎంతో మందీ! అపరిచిత దేశంలో తల్లిదండ్రుల నుంచి వేరు పడిన పిల్లల దీన స్థితినీ, తల్లిదండ్రుల పరిస్థితినీ చూసి చలించి, ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ పాలసీని రద్దు చేసేట్టు అమెరికా సామాన్య ప్రజానీకంలో పోరాట చైతన్యం వెల్లువెత్తింది.

కొడిదెల మమత

1 comment

  • మాకు తెలవని ఎన్నో విషయాలని ఈ వ్యాసంద్వారా తెలుసుకొన్నాం.ధన్యవాదాలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.