బ్లాక్ బోర్డ్స్ – An Image of Surrealism.

ఎక్కడ చూసినా ఒక్క గడ్డి పోచ కూడా కనిపించనంతగా ఎండిపోయిన బంజరు భూములూ, రాతి కొండలూ. ఆ కొండల మీదుగా కాలి నడకన పయనిస్తూ ఇరాన్ నుండి తమ మాతృదేశమైన ఇరాక్ కి తిరిగి వెళ్ళి అక్కడే  చచ్చి పోవాలనుకునే ముసలి సంచార జీవులు, చావు ఎపుడు మీద విరుచుకు పడుతుందో తెలియక, తమను తాము “గాడిదలం” అని చెప్పుకుంటూ వీపుల మీద స్మగుల్డ్ గూడ్స్ ను మోస్తూ ఒకరికి ఒకరు తోడుగా బతుకుతూ సాగుతున్న చిన్న పిల్లల గుంపు, బతుకు తెరువు కోసం వీపు మీద నల్లబల్లలు మోస్తూ “మీకు చదువు చెబుతాం మాకేమైనా తినటానికి ఇవ్వండి” అని అడుగుతున్న టీచర్లు, ఆ పర్వత సానువుల మధ్య అపుడపుడూ వినిపిస్తూ ఉండే బాంబుల మోతలు,‌ వీళ్ళందరిలో నెత్తి మీద ఎపుడు ఏ బాంబు వచ్చి మీదపడుతుందోననే భయం, ఇరాన్ ఇరాక్ ల యుద్ధంలో సరిహద్దుల్లో రెండింటికీ మధ్య నలిగిపోతున్న కుర్దిస్తాన్.. టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్ ల సరిహద్దుల్లో ప్రపంచం మరచిపోయిన ప్రాంతమే కుర్దిస్థాన్. ఇక్కడి ప్రజలందరు దాదాపు సంచార జీవులే. కానీ వీళ్ళకు తమదంటూ చెప్పుకోవడానికి ఏ దేశమూ లేదు. సరిహద్దుకు ఇటువైపు ఉండేవారు తమది ఇరాన్ అనీ అటువైపు ఉండేవారు తమది ఇరాక్ అనీ చెప్పుకుంటారు. కానీ మాది ప్రత్యేక అస్తిత్వం కలిగిన కుర్దిస్తాన్ అనేవాళ్ళూ ఉంటారు. ఇటువంటి ఒక సరిహద్దుల సంక్షోభం ఉన్న ప్రాంతంలో కాలినడకన సాగిపోయే సంచార జీవుల జీవితాలే ఈ సినిమా ఇతివృత్తం. అసలు ఇటువంటి ఒక కథ ఉంటుందని నమ్మటం కూడా కష్టమే,  కాని అటువంటి కథనే మన ముందు ఉంచుతుంది ఈ ఇరానియన్ సినిమా బ్లాక్ బోర్డ్స్.

సినిమా మొదలు కావటమే ఒక సర్రియలిస్టిక్ ఇమేజ్ తో మొదలవుతుంది. వీపుకు నల్ల బోర్డులను తగిలించుకుని ఎర్రటి పర్వతాల మీద నడుస్తూ వస్తున్న ఒక గుంపు. దూరం నుండి చూస్తే వాళ్ళంతా ఎగరటానికి సిద్దంగా ఉన్న పక్షుల గుంపులాగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న నల్ల బోర్డులు జ్ఞానాన్ని పంచుతాయా? ఆ జ్ఞానం వాళ్ళను స్వేచ్ఛ గా పక్షుల్లాగా ఎగరనిస్తుందా?. అందుకే వాళ్ళు దూరంనుంచి వీపులమీద నల్లబల్లలతో పక్షుల్లాగా కనిపిస్తున్నారా అనిపిస్తుంది. కానీ సినిమా చివరకు వచ్చే సరికి జ్ఞానం స్వేచ్ఛ ను ఇవ్వదు, అది మనిషికి అనవసర బరువవుతుందని తెలుసుకుంటాం. ఎందుకు బరువవుతుంది అని తెలుసుకోవటమే ఈ సినిమా. ఈ టీచర్ల గుంపులో ఒక్కొక్కరు ఒక్కో వైపుకి తమ స్టూడెంట్ లను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అందులో ఇద్దరు మిగులుతారు. వాళ్ళు కూడా చెరో దారి పడతారు. సయీద్ ఒక వైపుకి రెబోర్ ఇంకో వైపుకీ సాగుతారు.
రెబోర్ ఒక పిల్లల గుంపుని కలుస్తాడు. వాళ్ళు తమ వీపుల మీద స్మగుల్డ్ గూడ్స్ ని మోస్తూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఆ కొండల మీదుగా నడుచుకుంటూ పోతుంటారు. రెబోర్ వాళ్ళను అడ్డగించి తనను టీచర్ గా అంగీకరించమని ప్రాధేయ పడతాడు. బోధించినందుకు బదులుగా తనకు రొట్టె ముక్కలివ్వాలని బేరమాడతాడు. ఆ పిల్లలు మాకు చదువు అవసరం లేదని చెబుతారు. రెబోర్ వాళ్ళ వెంటే నడుస్తూ చదువుకోవటం వలన ఉపయోగాలేంటో కంఠ శో‌షగా అరుస్తూ ఉంటాడు. ఎవరూ వినరు. చదువుకుంటే సొంతంగా తమ పేరు రాసుకోవచ్చనీ పుస్తకాలు చదవవచ్చనీ, వాటిల్లో బోలెడు కథలు ఉంటాయనీ ఆశపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ సంచార జీవులైన తమ దగ్గరే బోలెడు కథలు ఉంటాయని చెబుతారు. ఇంతలో ఆ గుంపులో ఒక పిల్లగాడు కాలు విరగ్గొట్టుకుంటాడు. రెబోర్ తన వీపు మీదున్న బ్లాక్ బోర్డ్ లోంచి ఓ ముక్కను నరికి ఆ అబ్బాయి కాలుకి సపోర్టింగ్ స్ప్లింట్ లాగా కడతాడు.

ఇక సయీద్ కూడా తన జీవనాధారమైన టీచింగ్ వృత్తి ని నమ్ముకుని తన స్టూడెంట్లను  వెతుకుతూ బయలుదేరుతాడు. తన విద్యార్థులను డాక్టర్ లను చేసి ఆ ప్రాంతంలో రోగాలు లేకుండా చేయాలనుకుంటాడు. దారిలో ఒక తండ్రి తన దగ్గరున్న లెటరును చదివి చెప్పమంటాడు. ఇరాక్ జైలులో బందీగా ఉన్న తన కొడుకు రాసిన ఉత్తరం అది. పర్షియన్ లో కాక అరబిక్ లో రాసి ఉన్న ఆ ఉత్తరాన్ని చదవలేక టీచర్ ఇబ్బంది పడతాడు. ఉత్తరంలో  అందరి క్షేమ సమాచారాలు అడిగాడని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. అటునుండి కదిలి ఒక ముసలి వాళ్ళతో నిండిన సంచార జీవులను కలుస్తాడు. వాళ్ళంతా ఇరాక్ దేశస్తులు. తమ దేశంలోనే చనిపోవాలని ఇరానియన్  కుర్దిస్తాన్ నుండి బయలుదేరిన వారు. సరిహద్దు కనుక్కోలేక సతమతమవుతూ ఆ కొండల్లో తిరుగుతూ ఉంటారు. సయీద్ తాను చదువు చెప్పే టీచరునని చెబుతాడు. వాళ్ళకు అతడి అవసరం లేదని తెలుసుకుంటాడు. చివరకు వాళ్ళకు సరిహద్దుకు దారి చూపుతానని నచ్చజెప్పి నలభై అక్రూట్ కాయలకు బేరం కుదుర్చుకుంటాడు. ఆ గుంపులో ఒక ముసలాయనకు మూడు రోజులుగా మూత్రం రాని పరిస్థితి ఉంటుంది. అతని సహచరులు అతడిని మూత్రం చేయించటం కోసం తిప్పలు పడుతుంటారు. సయీద్ మోస్తున్న నల్లబల్ల ఈ ముసలాయనను మోయడానికి స్ట్రెచర్ లాగా పనిచేస్తుంది. ఆ ముసలాయనకు ఒక కూతురు ఉంటుంది. ఆమె భర్త ఇరాక్ ఇరాన్ యుద్ధంలో చనిపోయి ఉంటాడు. ఇరాక్ ప్రయోగించిన కెమికల్ బాంబుల వలన ఆమెకు ఈ వైధవ్యం దాపురించి ఉంటుంది. ఆమెకు మూడేళ్ళ కొడుకు ఉంటాడు. ఆ గుంపులో ఉండే ఓ పెద్దమనిషి సయీద్ కు ఈమెనిచ్చి పెళ్ళి చేస్తాడు. కన్యాశుల్కంగా అతడు ఆ నల్లబల్లను ఆమెకు ఇవ్వాలనే ఒప్పందం కింద పెళ్ళవుతుంది. ఆమె మనసు గెలుచుకోవటానికి సయీద్ కష్టపడతాడు. ఆవిడతో ఏకాంతం కోసం బ్లాక్ బోర్డును అడ్డంగా నిలబెట్టి కాసేపు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. తన విద్యను ప్రదర్శించి ఆమెను తన స్టూడెంట్ గా చేసుకోవాలనుకుంటాడు. మొదట లెక్కలు వేయటం నేర్పాలనుకుంటాడు. ఆమె ఆసక్తి చూపటం లేదని తెలుసుకుని అక్షరాలు రాయటం పలకటం ఎలాగో నేర్పుతానంటాడు. “ఐ లవ్ యూ” అని రాసి ఆమెతో పలికించే ప్రయత్నం పదే పదే చేస్తాడు. కానీ ఆమెనుంచి ఉలుకూపలుకూ కూడా ఉండదు.  పిల్లవాడు తప్ప మరో లోకం తెలియని ఆమె అతడిని పట్టించుకోదు.

చివరకు అక్కడ రెబోర్, ఎలాగోలాగా ఒక విద్యార్థిని పొందగలుగుతాడు. ఆ పిల్లవాడు తన పేరుని ఆ నల్లబల్ల మీద రాసుకోగలుగుతాడు. కానీ కాంట్రాబాండ్ ను వీపు మీద మోసే ఆ పిల్లలు బార్డర్ సెక్యూరిటీకి దొరికి చంపేయబడతారు. రెబోర్ కూడా చనిపోతాడు. ఇక్కడ సయీద్ ముసలి వాళ్ళను సరిహద్దు వద్దకు తీసుకుని పోతాడు. తనతో నడిచిన భార్య తనను వదిలి వెళ్ళడానికి నిశ్చయించుకుంటుంది. ఆ గుంపు పెద్దమనిషి వాళ్ళకు అక్కడే విడాకులు ఇప్పిస్తాడు. సయీద్ తన దేశమైన ఇరాన్లోనే ఉండిపోతాడు సరిహద్దుకు ఇవతలి వైపు. తన కొడుకును తీసుకుని కట్నంగా వచ్చిన ఆ నల్లబల్లతో ఆమె వెళ్ళిపోతుంది. ఆ నల్లబల్లమీద సయీద్ రాసిన “ఐ లవ్ యూ” అలాగే కనిపిస్తూ ఉంటుంది.

సమీరా మఖ్మల్బా

ఈ కథలో రెండు దేశాల  రాజకీయాల మధ్య, యుద్ధాల మధ్య నలిగిపోతున్న అమాయక కుర్దిష్ ప్రజల సంచార జీవితాలను చూపించటం జరిగింది. ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుందీ చిత్రం. కుర్దిస్తాన్ లో పర్షియన్, కుర్దిష్ భాషలు వాడటం నిషిద్ధం. కనీసం ఉత్తరం రాసుకోవడానికి కూడా ఆ భాషలు వాడకూడదనే నిబంధనలుండేవి. సంచార జీవులకు జీవితం గడవటమే కష్టమైనపుడు చదువు వాళ్ళకు అనవసర బరువే తప్ప మరేమీ కాదనే సత్యం మనకు కంటి ముందు సాక్షాత్కరమౌతుంది. బ్లాక్ బోర్డ్ చదువుకోవటానికి కాక వేరు వేరు కారణాలకు ఉపయోగపడటమనేది కథను నడిపించే అంతస్సూత్రం. 1988 లో కుర్దిష్ నగరం హాలెబ్జా మీద సద్దాం హుస్సేన్ బాంబుల వర్షం ‌కురిపించాడు. కెమికల్ బాంబులవటం వలన దాదాపు ఐదువేల సాధారణ పౌరులు చనిపోవటం కూడా జరిగింది. విధవరాలైన భార్య పాత్రలో ఆ గాయం తాలూకు మానసిక స్థితి కనబడుతుంది. 2000సంవత్సరం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జూరీ అవార్డుతో పాటు మరెన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించింది “సమీరా మఖ్మల్బా” అనే పంతొమ్మిదేండ్ల ఇరానీ అమ్మాయి అంటే ఆశ్చర్యం కలుగకమానదు. కుర్దిస్తాన్ జీవితాన్నంతా ఒక మెటఫర్ లాగా తీర్చిదిద్దడమే కాక, మ్యాజిక్ రియలిజాన్ని శక్తివంతంగా సినిమా కళలోకి పట్టుకొచ్చిన ఘనత ఆ అమ్మాయిది. సెకండ్ వేవ్ ఇరానియన్ సినిమాను విపరీతంగా ప్రభావితం చేస్తున్న గొప్ప దర్శకుల్లో సమీరా ముందు వరుసలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

4 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.