రంగు రాళ్ళు …

సాగర్ అనే చిన్న పిల్లోడు (10 వ క్లాస్ పాస్ అయి ఉండి ఉండవచ్చు) చదువు మానేసి ఆటో నడుపుతుండేవాడు. మా ఇంటి బుజ్జి పిల్లల్లో ముగ్గురిని భారతీయ విద్యా భవన్ కి తీసుకెళ్ళడానికి దాంట్లోనే ఇంకో 36 మంది పిల్లల్ని కుక్కి కుక్కి తీసుకెళ్ళినా కిక్కురుమనకుండా ఒప్పుకున్నాము. ఎందుకంటే ఆ పిల్లోడు చాలా నమ్మకస్తుడు, కల్లా కపటం తెలియని వాడు అని పరిచయస్తులు చెప్పడమే కాకుండా మాకూ అనిపించింది చూడగానే,. పిల్లలు 7AM  నించి 2PM వరకూ స్కూల్ అయిపోయి వచ్చేటప్పటికి, అత్త గారు ఆసుపత్రికి వెళ్ళాలనో, పిల్లల్ని తీసుకుని గుడికో గోపురానికో వెళ్ళాలనో ఒక మాట చెప్తే చాలు, మీరు రెడీ గా ఉండండమ్మా నేను వచ్చాక వెళ్దామని అనేవాడు. పిల్లలని దింపినప్పుడు రెడీ గా ఉండి, గబుక్కున పిల్లలకి బట్టలు మార్చి అదే ఆటో లో ఆవిడ కూచుంటే చక్కగా తీసుకెళ్ళి పనయ్యాక నిదానంగా తీసుకొచ్చి దింపేవాడు. మాకసలు ఏ నాడూ పిల్లలని దింపడం తీసుకెళ్ళడం గురించి చింత లేదు. అదీ కాక పొద్దున్న  పిల్లలని దింపేసాక తిరిగి వచ్చి నన్ను, మా పద్దు నీ రెండవ ట్రిప్ లో కాలేజీ దగ్గర దింపడమూ, సాయంత్రం మళ్ళీ తీసుకురావడం కూడా సాగరే, దానితో మాకు ఆ అబ్బాయి ఇంట్లో పిల్లడిలా అయిపోయాడు.

ఇలాంటి పిలగాడు సరిగా రావడం మానేసాడు. ఏందయ్యా అంటే, ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నా మేడం అన్నాడు. మరి మాకెలా అంటే బాబు అనే ఇంకో బుడ్డోడిని పంపడం మొదలెట్టాడు. బాబు కూడా సాగర్ లాగే నిదానమైన మంచి బాలుడు. సాగర్ ఆటో బాబు నడుపుతున్నాడన్నమాట.. అలా కొంత కాలం సాగగానే మళ్ళీ  గండాలు. అసలు రావడం మానేసారిద్దరూ. వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాము ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కలిసి! ఇంటి ముందు ఆటో లేదు . ఇంటి ముందు అంతా గోతులు తవ్వి ఉన్నాయి. రండి మేడం అని పిలిచారు ఇంట్లో వాళ్ళు. ఏంటీ ఇల్లు బాగు చేయిస్తున్నారా అని అడిగాము. అవును కాదు అని ఏదో అర్థం కానట్టు చెప్పిందో పెద్దావిడ తెలుగు తమిళం కలగా పులగం చేస్తూ. ఈ లోపు సాగర్ కి  కబురు పంపారేమో 10 నిమిషాల్లో వచ్చాడు.

‘మేడం చాలా సారీ..కొద్దిగా ఇంటి మీద ప్రాబ్లం వచ్చింది. అన్నదమ్ముల గొడవల్లో ఇల్లు రెండు భాగాలు చెయ్యాల్సొచ్చి  మరమ్మత్తులు చెయ్యాల్సి వచ్చింది. దానికోసం తీసుకున్న అప్పు ఎక్కువయ్యి, అప్పుల వాళ్ళు ఆటో కూడా తీసుకుపోయారు, ఎలాగో పాలు పోవడం లేద’ని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నాకు తోడొచ్చిన గీత నన్ను పక్కకి పిలిచి, “నా దగ్గర చాలా బంగారం పడి ఉంది ఖాళీగా.. దాన్ని బాంక్ లో పెట్టి వచ్చిన డబ్బుని ఎవరికైనా వడ్డీలకిద్దామని ఉంది.. నీకు తెలుసు కదా మా వారికి ఉద్యోగం సరిగా లేదు.. ఈ అబ్బాయి చాలా నమ్మకస్తుడు కాబట్టి ఇద్దాము”  అంది.. సరే అని విషయం సాగర్ కి చెప్పా.. సాగర్ ఆనందానికి అవధుల్లేవు. గీత డబ్బిచ్చిన మరుసటి రోజు నించీ కొన్ని రోజులు యధావిధిగా పిల్లలని మొదటి ట్రిప్పు లోను, నన్ను పద్దు నీ రెండవ ట్రిప్పు లోను, మధ్య అత్త గారికి కావలసిన చోటికి తీసుకెళ్ళడం లోను సహాయం చేసాడు. కొద్దిగా సంతోష పడేంతలో అవాంతరం. గీత ఆడపడుచు పెళ్ళి కుదిరిందిట. పెళ్ళిపిల్ల కి వెయ్యడానికి తన బంగారం తెమ్మని అడిగారుట. ఒక్కతే వదిన , కాదంటే బాగుండదు కాబట్టి అర్జెన్ట్ గా డబ్బు ఇచ్చెయ్యమని వత్తిడి తెచ్చ్చింది. ‘వడ్డీ సరిగ్గా కడుతున్నా కదమ్మా! మీరు చెప్పండి ,అసలు 6 నెలల్లో తీర్చేస్తా, నాకు వేరే చోట నించి వచ్చేవి ఉన్నాయి ” అన్నాడు సాగర్. గీత మాత్రం ‘నాకసలు సాగర్ తో కానీ, అతను ఇస్తున్న వడ్డీ తో కానీ, అతను అసలు మొత్తం ఇవ్వడన్న ఆలోచన తో కానీ ప్రాబ్లం లేదు…మా అత్తవారు అడగకపోతే అసలు అడిగి ఉండేదాన్ని  కాదు.. నిజానికి దీనివల్ల నాకూ రెండు రాళ్ళు వస్తున్నాయిగా హాయిగా, ఎందుకొదులుకుంటాను” అంది. అనడమే కాక “అటు వైపు చంద్ర కళ గారు మీకు బాగా తెలుసు కదా” అంది. అవునన్నా.. “మరి ఆవిడని అడుగుదాము సాగర్ కి ఒక నెల కోసం అప్పు ఇస్తుందేమో.. మా అత్తవారింట్లో పెళ్ళి అయిపోగానే నేను మళ్ళీ ఇస్తా తప్పకుండా, నాకసలు హాయిగా ఉంది నాలుగు పైసలు చేతిలో ఆడుతుంటే” అంది.. అవునమ్మోయ్ చక్కటి సలహా ఇచ్చావు అని.. చంద్ర కళ గారి దగ్గరికెళ్ళాము. ఈ పిల్లోడిని ప్రతి రోజు చూస్తూనే ఉన్నారు కాబట్టి, పెద్దగా సంభాషణ లేకుండానే, ఇదీ విషయమని నేను చెప్పగా, సాగర్ వడ్డీ ఇయ్యడం లో ఎంత నిజాయితీ పరుడో అంటూ గీత వాడి గుణ గణాలని కీర్తించింది. అప్పటికప్పుడు పాతిక వేలు సాగర్ చేతిలో పెట్టారు చంద్ర కళ గారు. మానవత్వం మంటగలిసిందని అరచి గీ పెట్టేవాళ్ళందరూ వచ్చి మా కాలనీ లో ఎంతటి మహా మహులున్నారో చూసి పొండని నేను మా ఇంట్లో వాళ్ళకి తప్ప అందరికీ చాటింపేసా..

మరో మూడు నెలలు చక్కగా గడిచాయి.. తదుపరి మళ్ళీ నాగాలు పెట్టాడు సాగర్. ఇంట్లో ఉన్న 3 మోటార్ సయికిళ్ళు, నేను  పిల్లలని స్కూల్లో దింపడంలో ఫెయిల్ అవుతున్నాము మాటిమాటికీ. నేను పని చేసేది ఒక వైపు , పిల్లల స్కూలు ఇంకో వైపు అవడం ఒక కారణమైతే , ఇంట్లో  మగవాళ్ళందరూ దూరాభారాల్లో పనిచెయ్యడం వల్ల 5.20 కి బయల్దేరి పోవడం ఇంకో కారణం. వీటివల్ల రాను రాను పిల్లలని సమయానికి స్కూల్లో దింపడం గగనమయి పోతోంది.. దురదృష్టానికి మాకు ఇంకో ఆటో కానీ స్కూల్ బస్ కానీ దొరకలేదు. బాబు కి,  సాగర్ కీ వరుసగా కబురు పెడుతూనే ఉన్నా, ఇద్దరూ అజా పజా లేరు. ఇంటికెళ్ళినా ఇంట్లో వాళ్ళు తెలియదన్నారు. ఒక వైపు పిల్లలని దింపడం , మేము వెళ్ళడం కష్టం గా ఉంటోంటే, ఇంకో వైపు చంద్ర కళ గారు మా ఇంటి ముందు తచ్చాడుతూ ఉండడం మా ఇంటికొచ్చి కూచోడం కాస్త భయం కలిగించాయి..అసలు నిద్ర పడితే ఒట్టు..!!

ఒక రోజు పొద్దున్నే పిలిచి పేపర్ లో ఆ రోజు వచ్చిన వార్త అత్త గారు చదివి వినిపిస్తుంటే విని ఖంగు తిన్నాను. ఒక రత్నాల వ్యాపారి / సైంటిస్టు /గురువు అని చెప్పుకునే  వ్యక్తి సాగర్ ఇంటికొచ్చి, ఈ ఇంట్లో పూర్వీకులు వజ్రాలు వైఢూర్యాలు దాచారని, అవి ఇంటి మధ్య నుండి జరుగుతూ కాంపవుండ్ వాల్ దాటబోతున్నాయనీ , ఇంకో సంవత్సరం ఆగితే అవి ఇటు రోడ్డు మీదకో, అటు పక్కింటి వాళ్ళకో జారిపోతాయని చెప్పాడుట. ఇంకా నమ్మకం లేకపోతే , ఆ పై అమావస్య రోజు చిన్న స్థలం తవ్వి  చూపిస్తాననీ. కానీ పూజలు చేసి మాత్రమే తియ్యాలనీ ఆ పూజ కి కొంత ద్రవ్యం అవసరమనీ చెప్పాడుట. సాగర్ కి తండ్రి లేడు, వాడే పెద్ద దిక్కు. చిన్నతనం కదా మరి ,చేసేద్దాం అన్నాడుట. అతను అమావాస్య రోజు వచ్చి పూజ చేసి, ఇంటి ముందు కొద్ది భాగాన్ని పరిశీలించి తవ్వి తీయగా 3 వజ్రాలొచ్చాయిట. ఆ వజ్రాన్ని ఇంటి దగ్గరున్న ఒక వజ్రాల వ్యాపారికిన్నీ, ఆ గురువు చెప్పిన ఇంకో వ్యాపారికిన్నీ చూపించగా ” ఈ వజ్రం ఎక్కడిదయ్యా దీన్ని నాకు ఇస్తే 40 వేలు ఇప్పటికిప్పుడు ఇస్తాన’న్నారుట. వజ్రాల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి 1 నెల ఆగగలిగితే ఒకో వజ్రం 45 వేలు పలుకుతుందనీ  ఈ లోపు నగదు సమకూర్చుకుని, మూడు వజ్రాలు తామే కొంటామని, ఇంకెవ్వరికీ అమ్మద్దనీ ప్రాధేయపడ్డారుట. ఇంకేముందీ, మన సారు ఇల్లు మొత్తం తవ్వమని ఆర్డరిచ్చేసారు. గురువు గారు మాత్రం ద్రవ్యం కావాలి, అది కావాలీ ఇది కావాలీ అని డబ్బు తెమ్మంటూనే ఉన్నాడుట`.

30 వేలు ఖర్చు పెడితే అప్పుడే 135 వేలొస్తున్నాయి… మరి అలాంటి రాళ్ళు ఇంకా ఎన్నున్నాయో ఎక్కడెక్కడ తవ్వాలో కొలతలేస్తున్నాడుట గురువు గారు . మాటల సందర్భం లో “బయట వాళ్ళకి ఎందుకు అమ్ముతావు సాగర్ , నేను కూడా రత్నాల వ్యాపారినని మర్చిపొయ్యావా.. ఆ మూడూ  వాళ్ళకి ప్రామిస్ చేసావు కాబట్టి ఇస్తే ఇయ్యి కానీ, ఈ పై దొరికిన రత్నాలన్నింటినీ నాకే ఇయ్యాలి వాళ్ళు అలా 45వేలు అన్నారు కానీ మనస్పూర్తిగా చెప్తున్నా అవి ఒక్కోక్కటీ రెటెయిల్ లో 71 వేల పైన విలువ చేస్తాయి. నువ్వు నాకే అమ్ముతున్నావు 49వేలు ఇస్తా ఒకోదానికీ, అదే  ఫయినల్.. నా మీదొట్టే” అనేసాడు.. మన సాగరు సారు కి అసలు కాళ్ళు నేల మీద ఆనట్లేదు.. కళ్ళకి ఒకో పిల్లాడికి ఆటో ఫీజ్ కోసం ఇచ్చే 500 రూపాయలు కనబడట్లేదు..ఎవరేమి చెప్పినా కుళ్ళు తో మాట్లాడుతున్నారని అనుకుంటున్నాడుట. అన్నీ అమ్మేసయినా సరే , ఇల్లంతా తవ్వించడం, పూజలు చేయించడం, కావలసిన ధనాన్ని సర్దడం లో ఆటోతో సహా చిన్నా చితకా ఆస్తులు అన్నీ అమ్మేసాడు సాగర్. ఇంట్లో అన్నీ లోతైన గుంటలు తవ్వేసి, రత్నాల వ్యాపారి పరారయ్యాడు.. ఇంట్లో నివాసముండటానికి లేదు కాబట్టి, ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నారు. మళ్ళీ ఇంటికి రావాలంటే గుంటలు పూడ్చి , ఇంటా బయటా బండలేయించాలి..బతకడానికి ఆటో లేదు.. తల్లికీ చెల్లెళ్ళకీ  అన్నం పెట్టాలి.. ఇవన్నిటి మధ్యా సాగర్ ఎక్కడికో మాయమయ్యాడు..!! చిన్న పిల్లాడు ఇలా మోస పోయాడేంటని అందరం బాధ పడ్డాము. మీరు కూడా బాధ పడుతున్నారని తెలుసు గానీ.. నన్ను మరచిపోతే ఇలా… చంద్ర కళ గారు ఇప్పుడు అప్పు తీర్చమని ఎవరిని అడుగుతారు.. నాకు వచ్చే మూడు వేల రూపాయలతో జీతంతో ఆ అప్పు ఎలా తీరుస్తాను.. ఇంట్లో చెప్తానా చెప్పనా.. ఇత్యాది విషయాలు మీరు తెలిసీ చెప్పక పోయినట్టయితే భేతాళుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి, మళ్ళీ అప్పుల కుప్పని పట్టుకుని పదురెండు సంవత్సరాలు పీడించుకు తిన్నాడని గమనించాలన్నమాట. ఇతి రంగురాళ్ళ కథ సమాప్తహా…

 

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

6 comments

 • ఎన్నెలమ్మా.. రత్నాల కధా కమా మీషు ఎరగకుండా పాపం చిక్కుల్లో చిక్కుకు పోయినవ్ బిడ్డా.. పాపమా సాగరు, బాబు ఏడ పోయిండ్రో..
  మంచి కథ లక్ష్మీ గారు మన అవసరాలు మనవి..వాళ్ళ ఆకలి,అవసరాలు,అమాయకత్వాలు ,ఆశలు వాళ్ళవి..రంగు రాళ్ళ వెనక పరుగులు..చివరికి చేతికి అందేవి చిల్ల పెంకులు..నిలవనీడ లేని బతుకులు..బాగా రాసారు ..అభినందనలు

 • మనుషుల మీద మీ విశ్వాసానికి నమస్సులు మేడమ్.. నిజ జీవితాలే మంచి కథగా మార్చిన మీ నిపుణతకు అభినందనలు..

 • చదివి చాలా బాధపడ్డాను. కష్టపడి బతికేవారికి అలాంటి ప్రలోభాలు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నవాళ్లనేమి చెయ్యాలి. ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటివారిని అత్యాశతో నమ్మి బతుకులు పణంగా పెట్టే మూర్ఖులనేమనగలం? ఇలాంటివారికి ఏ సంబంధం లేకుండా సాయంచేసి।, నిలువునా మునిగే మధ్యతరగతి వారిది మరో వ్యథ . చక్కని కధకు అభినందనలు లక్ష్మి.

 • హమ్మో ..పాపం ఇప్పుడామె పరిస్థితి ఏమిటంటారు? ఇలా ఎంతమంది ఆడవాళ్ళో చిక్కుల్లో ఇరుక్కోవడం చూస్తుంటాం.
  ఇక ఆటో డ్రైవర్ పరిస్థితి మరీ దయనీయం కాదండి?
  ఈ కథలో చాలా సందేశాలు కనిపిస్తున్నాయి నాకైతే!
  ఒకటి అప్పు ఇప్పించకూడదు. రెండు మూఢనమ్మకాలు ముంచేస్తాయి. మూడు దొంగ బాబాలుంటారు జాగ్రత్త. నాలుగు – వడ్డీ బాగానే కడుతున్నాడు కదాని ఆశ కొద్దీ డబ్బు ఇవ్వొద్దు అని. ఇతనకు మాలిన జాలి చూపితే చివరికి సమస్యలు తప్పవు..
  ఈ రోజుల్లో ఇంకా దారుణం గా వున్నాయండి మానవ సంబంధాలు. మనిషి పామునైనా నమ్మొచ్చుఁ కాని, పొరబాటున మనిషిని మాత్రం నమ్మకూడదు అన్నట్టు తయారైంది కాలం.
  అభినందనలు ఉన్న విషయాన్ని ఉన్నట్టు రాశారు. జైహో.

 • గుడ్ స్టోరీ .. ఇట్ ఇస్ వెరీ సాడ్ to know అబౌట్ that ఆటో ड्राइवर

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.