ప్రవాహం వెనక్కి నడిచొస్తుందా ?

చారిత్రిక విభాత సంధ్యల మానవ కధ వికాసమెట్టిది ? అన్నాడొక మహాకవి. అంటే జీవన పరిణామక్రమంలోమానవుడు సాధించిన పురోగతి ఏమిటన్నది ఆతని ఊహ కావొచ్చు.  నిజమే మనిషి ప్రయాణాన్ని మించిన వికాస రహస్యం ఇంకెక్కడ దాక్కుంటుంది ? ఏ జీవికైనా జాతి పుట్టుక, దాని పురోగతీ అత్యంత సంభ్రమాశ్చర్యాలకి గురిచేయగల ప్రధానాంశం. అక్కడ మన ముఖకవళికల్లోని ఆధారాలు కనిపిస్తాయి. పూర్వీకులు తారసపడతారు. ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారటానికి చేస్తున్న ప్రయాస కనిపిస్తుంది. ఆ రూపాంతర నిర్మాణంలో ఒక్కో దశ దాటుతున్నప్పుడు సరిగ్గా మనిషెంత ఒత్తిడికి గురయ్యాడో గుర్తుచేస్తాడు ఒక కొత్త కవి సత్యోదయ్. అతని కవిత్వంలో ఎంత సీనియారిటీ ఉందో వెతకబుద్దికాదు. అసలతనికి కవిత్వ బలం ఒంటబట్టిందా లేదా అన్న ఆలోచనే రాదు. ఒక నాగరికత సుదీర్ఘ కాలానుగత ప్రభావాన్ని వదల్లేకపోయిన శుద్ద అమాయకత్వం కనిపిస్తుందంతే. ప్రవాహమెప్పుడైనా ముందుకే వెళ్తుంది. ఇతగాడు దాన్ని వెనక్కు మళ్ళిన సందర్భాన్ని కాంక్షిస్తున్నాడు. ఇదొక వ్యతిరిక్త దిశ.

సంచారి అనే కవితలో ” మజిలీ మారుతున్నప్పుడల్లా ఎలా అడగను ? తన ఊరేదని ? అని అంటాడు.ఋతువు మారిపోయాక పక్షి  ఎటో ఎగిరిపోతుంది. మరి మనిషిని నువ్వెక్కడిదాకా ? అని అడగాలనుకుంటాడు. అతి సంక్లిష్ట సమూహంలో చుట్టూ నిర్మించుకున్న అనేకానేక నియమాలూ, షరతులూ మధ్య బతికే మనిషిని ఎడ తెగకుండా అన్వేషిస్తూనే ఉన్న వెతుకులాట ఈ కవిత్వంలో నాక్కనిపించింది. “పుస్తకాల్లో దాక్కున్న చరిత్రని ఎవరో బయటకు  తీసి బేరానికి పెట్టారు, చరిత్ర ఇప్పుడు రోడ్డు పక్క చీకట్లో విటుల కోసం ఎదురుచూసే వేశ్య” (చరిత్ర) అంటాడు. ఏంటీతని ధైర్యం? ఓ మనిషీ నీవు నదిని నిర్మించగలవా అనడుగుతున్నాడు. నగరాలు నిర్మించినంత సులువుగా చరిత్రని నిర్మించలేమని చెప్తాడు. కవి కొత్త కుర్ర వాడు. కవిత్వ ప్రేమికుడు. మనమెవరన్నా నీ పేరేమిటి అని అడిగితె “నిజం చెప్పనా, చైతన్యపు సమాజాన్ని నిద్ర పుచ్చినప్పుడల్లా రగిలించే తర తరాల నిప్పు కణికని…అబద్దపు వ్రాతలతో నిజాన్ని కప్పెట్టినప్పుడల్లా చిగురించే నిలువెత్తు నీ భయాన్ని…అనామధేయుణ్ణి” అని కాలరెగరేస్తున్నాడు. అతనువెళ్ళిన స్వీడన్ ప్రస్తావన చాలా చోట్ల తెస్తాడు. వంటి రంగును బట్టి తనని సెపరేట్ చేస్తున్న సమాజాన్ని అసహ్యించుకుంటాడు. స్వీడన్ లో ఎప్పుడూ బస్సుల్లో అన్ని సీట్లూ నిండి చివరకి నా పక్క సీటు ఖాళీగా నన్ను వెక్కిరిస్తున్నపుడల్లా రేసిస్ట్ నా కొడుకులు అని లోలోపల తిట్టుకుంటూ ఒదిగి ఒదిగి కూర్చున్నప్పుడు కూడా నేను సావలె–కానీ ఇవ్వాళ హైదరాబాదులో ఒక నల్లోడి పక్కకి కూసోక నిల్సుని పోయినందుకు సావాలనిపిస్తోంది” అంటాడు. మనిషి ఇంకో మనిషికి ఎడం ఎడంగా వెళ్తోన్న అంతర్కారణాన్ని వెక్కి వెక్కి ఏడ్చి చెప్తాడు. చదివే వాళ్ళకి ఇతని భాషలో సొంత మాండలిక స్పర్శ కమ్మగా తాకుతుంది. కూసోక, నిల్సుని, సావలె, ఊంచినా, బరువాత లాంటి పదాలు పుస్తకమంతా ఉంటె బాగుండుననిపిస్తుంది.

పిల్లి అనే కవితలో “పక్క ఇంటిలోంచి ఆకలి తీర్చని చేపల వాసన…ఉట్టికి ఎగరలేని పిల్లి పొయ్యిలో పడుకుని ఉంది. పొయ్యి అంటుకోదు, పిల్లి లేవదు” అని తన ఆకలిని చిత్రిస్తాడు. బాగుంటుంది. ఇతనిలో ఒక వింత కొత్త గొంతు వినపడుతుంది. చాలా అగోనీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. “శవం గల్లీలోంచి రోడ్డెక్కాక ఘంటసాల వాన్ లోంచి గొంతు సవరించాడు, డప్పు,దూరంగా ఉన్న స్మశానాన్ని తిట్టుకుంటూ అక్కడిదాకా వెళ్ళలేక కోపంతో సారా సుక్కని, ఏడుపుని మింగుతోంది” అని చచ్చిన తర్వాత కూడా మనిషి సంస్కృతీకరణ చెందుతున్న నిస్సహాయతని కళ్ళక్కడతాడు. మనిషెంత అనలిటికల్ డాటా లా తయారయ్యాడో చెప్పే కవిత పోస్టుమార్టం. దాంట్లో “శరీరంలోని ప్రతీ రక్త కణం బొట్టు బొట్టుగా గుండెలోంచి జారిపోయి బైట్ లు బైట్ లు గా పరివర్తనం చెంది నా ఉనికిని పూర్తిగా డాటా లోకి మార్చాక, నన్నూ నా అస్తిత్వాన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మెల్లగా ఆక్రమించేస్తుంది” అని రాస్తాడు. వళ్లు జలదరిస్తుంది. డాటా అనే కవితా అంతే. అలాగే ఇంకో చోట (డిస్టెన్స్ లవ్) “మాట్లాడే మనుసులు కరువైనప్పుడు వర్చువల్ గా ప్రేమించాలి, స్పర్శ కోసం ఎదురు చూస్తున్న వేడి మాలోకం, టచ్ స్క్రీన్ లో శరీరాన్ని ఎలా స్పర్శించాలో నేర్చుకో …బీ వైల్డ్” అని మనిషి ఇప్పుడు వర్చువల్   ఒంటరితనంలో  ఎలా కూరుకుపోతున్నాడో చెప్తూ కవి మూడో కన్ను తెరుస్తాడు.

ఇతగాడి కవిత్వం బాగుంది. పసి పిల్లాడు ముద్దు ముద్దు మాటలాడినట్టు. సీరియస్ గా ఉన్న సరదాతనం ఆకట్టుకుంది. కొన్ని సబ్జక్ట్లని చాలా బాగా కవిత్వీకరిస్తాడు. ఆట్టే కవిత్వం చదివిన ప్రభావాలేమీ కనపడవు. భాష పచ్చిగా ఉంటుంది. నిర్మాణ కౌశలం అంతగా ఆకర్షించదు. కానీ అతని వ్యక్తీకరణ అతను తీసుకెళతానన్న లోకాల్లోకి నిన్ను నిక్కచ్చిగా లాక్కెళ్ళిపోతుంది. అతను మాత్రమే మాత్రమే రాయగలిగినట్టుండే ప్లాన్ బీ, దేశం, చౌరస్తా, యుద్దం, అప్పుడప్పుడు… కవితలు చాలా బాగుంటాయి.గెట్ టుగెదర్ అని ఒక పోయంలో ఆడ పురాణ పాత్రలన్నీ సమావేశం పెట్టిన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాడు. ఇవేమీ తెలీని రాజ్యాన్ని ఏలిన పాదుకలు లక్క ఇంటిలో నెత్తురు చేతులతో కత్తులు దూసుకుంటున్నాయి అని ముగిస్తాడు. ఫెమినిజం కోణంలోంచి ఈ ఆలోచన అభివ్యక్తికి సొగసును తెస్తుంది. దేశమంటే ఎండిన స్తన్యం. ఊదు ఊదు నీ ఊపిరి ని తిత్తిగా చేసి అని మొరపెట్టుకుంటున్నాడు. కేరళలో మధూని చంపేసిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. నాకు తెలుసు అడవంటే మీకు భయమని;వాలు తిరిగిన భూమిని దూరంగా నక్షత్ర మండలంలోకి విసిరి కొట్టాలి: ఎవరో ఏడుస్తున్నారు, చెప్పండి వారికి , నేను నినాదమై తిరిగొచ్చాను. ఇలాంటి ఎన్నో వాక్యాలు సత్యోదయ్ అంతరంగాన్ని కెనడియన్ కవీ, పాటగాడూ లియోనార్డ్ కోహెన్ లా (డాన్స్ మీ టూ ది ఎండ్ ఆఫ్ లవ్, బర్డ్ ఆన్ ది వైర్ పాటలు ప్రసిద్దం) మ్రోగిస్తాయి. ప్రతీ కవితా తనదైన ఇస్టైలుతో మనల్ని చుట్టుముడుతుంది. కాలం లోలోపల మనం పుట్టినప్పటి చీకటి గుహలోంచి వెలిగిన దీపమై వత్తినలుపుకుని వాసన వేస్తుంది.లూసీ లిటిల్పుట్ పాడిన పాటలాగా వినిపిస్తుంది. ట్రాన్సెక్ట్ వాక్ అని, ఎత్నోగ్రఫీ అనీ కొన్ని శాస్త్ర నామాల్తో రెండు కవితలు రాసాడు. బహుశా అవి ఆంత్రపోలజీ లో మెథడ్స్ కావొచ్చు. కానీ ఆ సబ్జెక్టివ్ పోయెట్రీ కూడా హృద్యంగా ఉంది. జయధీర్ తిరుమలరావ్ ఎంతో ప్రేమగా కవి పరిచయం చేస్తాడు. కవర్ డిజైన్ ఆసక్తిగానే ఉంటుంది కానీ మేకప్ ఇంకాస్త శ్రద్దగా చేస్తే బాగుండేది. అయితే అన్నింటికన్నా పోయెట్రీనే డామినేట్ చేస్తుంది.

కొత్త తరం వచ్చినపుడు కొత్త పదం పుడుతుంది. కొత్త వాక్యం రెక్కలల్లాడిస్తుంది. వస్తూ వస్తూ కొత్త భావాల్నీ, కొన్ని సవాళ్ళనీ పరువులెత్తిస్తుంది. ఆ ప్రవాహ గమనం ముందుకు ఉరకలెత్తుతున్నట్టే ఉంటుంది. కానీ వెనగ్గా, అది తడిపిన హృదయోపరితలాల్లోని సుఖ దుఃఖాల్ని కూడా మర్చిపోకుండా అపేక్షతో వెంట తెచ్చుకుంటుంది. వ్యతిరిక్తంగా(వెనగ్గా) ప్రవహించడమంటే మూలాల్ని క్షణ క్షణమూ మునివేళ్ళతో మర్చిపోకుండా తాకుతుండటమే. ఏం బ్రదర్ ! వరంగల్లో నువ్వూ, రాజమండ్రిలో నేనూ దొబ్బించుకున్నప్పుడు (?), మనకి మనమే తురుం రా. పోయెట్రీ ప్రాణవాయువువేరా మిత్రుడా, నువ్వే చెప్పినట్టు ఆకలి వెన్నెలంతా ఉప్పు ఉప్పు…నిన్ను కౌగిలించుకోవాలని ఉంది, అవును కొందరికి విప్లవం నాస్టాల్జియా. మరి నువ్ లెఫ్టా ? రైటా ? త్వరగా ఇంకాస్త స్పష్టంగా చెప్పేయ్. స్పందనలు మరచిన సుతిమెత్తని మనసుకి ద్రాక్ష సారా తాగించావ్. శిలాజమంటే మాటలు రాని పాత బొమ్మ కాదు. అమ్ముడుబోయే కళా ఖండమంతకన్నా కాదు. అది ఉరివేసుకుంటున్న కలలెక్కడ బతికుంటాయో ఇట్టే చెప్పేస్తుంది, బహుమోహన పరిమళంగా, సత్యోదయ్ అక్షరాలు చెప్పినట్టు.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

36 comments

 • ఫెంటాస్టిక్ రివ్యూ శ్రీరామ్ గారు. నీట్ అండ్ క్లీన్. సత్యోదయ్ కవి. మంచి కవిత్వం వ్రాస్తున్నాడు.

 • వ్యతిరిక్తంగా ప్రవహించడమంటే మూలాల్ని క్షణ క్షణమూ మునివేళ్ళతో మర్చిపోకుండా తాకుతుండటమే..నిజమే సత్యోదయమ్ గారు అన్నది అక్షరసత్యం….కాలంలోతుల్లోకి మనల్ని నిక్కచ్చిగా లాకెళ్ళగ శక్తి ఈ కవితలకు ఉందనే నమ్మకం కలిగింది శ్రీ రామ్ గారు మీ సమీక్ష చదివాక…..ఒక మంచి రైటర్ ని పరిచయం చేసిన మీకు అభినందనలు…

 • శ్రీరామ్ గారు సత్యోదయ్ గారిని బాగా అర్థం చేసుకున్నారు.మీ భాష బాగుంది.వాక్యం బాణపు కొన లా ఉంది.భావం హృదయం లోకి దూసుకెళ్తోంది.

 • చుట్టూ నిర్మించుకున్న అనేకానేక నియమాలూ, షరతులూ మధ్య బతికే మనిషిని ఎడ తెగకుండా అన్వేషిస్తూనే ఉన్న వెతుకులాట ఈ కవిత్వంలో నాక్కనిపించింది… బాగా పట్టుకున్నారన్నా వ్యతిరక్త ప్రవాహాన్ని. నిజమే, సీనియారిటీ లేకపోయినా సిన్సియారిటీ ఉన్న కవిత్వం ఇది. సత్యోదయ్ నుంచి మరింత నాణ్యమైన కవిత్వం రావాలని కోరుకుంటున్నాను

  • నవీన్, థ్యాంక్స్ ఫర్ యువర్ రీడింగ్ హేబిట్. చాల చక్కగా స్పందిస్తావ్.

 • మిత్రుడా…కవిత్వాన్ని ఇంత ప్రేమగా ఆలింగనం చేసుకోవడం ఏ గురువును ప్రతిమలా చేసి నేర్చకున్నావయ్యా… నీ వచనం నీ వదనం లాగే ఎంత అపురూపం..నేను కమెంట్ పెట్టడానికి కొంచం సంయమనం పాటిద్దామనిపించే ఆలోచన రానివ్వని పరిచయమిది…సత్యోదయ్ కు అభినందనలు

  • మురళీ, చాలా చాలా ధన్యవాదాలని నీకు చెప్పను. నన్ను సహాధ్యాయిని చేసుకున్నావ్ !

 • సత్యోదయ్ ఎవరో తెలియదు..తన కవిత్వంతో పరిచయం లేదు..కానీ ఈ సమీక్ష చదివాక ఆ కవితా సంపుటి అర్జన్ట్ గా కొని చదవాలని అనిపిస్తుంది సోదరా..సమీక్ష గొప్పగా ఉంది..పొగడ్త కాదు గాని మీ సమీక్షలు చదువుతుంటే చే.రా మాస్టారు గారి స్పర్శ కనిపిస్తుంది..సాగిపో వీరుడా!

  • అన్నా, వంట చెడగొట్టకు. ఇప్పటికింకా ఉప్పేదో, కారమేదో తెలియట్లేదు.

 • మనిషి వెంట జీవితం నడిచొచ్చినపుడే.. నాగరికత నిర్మాణంతోపాటు, నవనాగరిక జీవన వేగాన్ని కాలం అందుకుంటుంది.ఇది చారిత్రక వాస్తవమో,జీవన సంఘర్షణ వ్యక్తిగత చిత్రమో కాదు.వర్తమాన కాలానికి కవిత్వం కొలబద్ద.ఈ ఊపునీ వేగాన్ని అందుకుని రూప నిర్మాణాన్ని చేపట్టడం వాస్తవికతకు నిలువెత్తు ప్రతిరూపం.పొరలు పొరలుగా విప్పారే చూపు కదలికలను అందిపుచ్చుకుని ముందడుగు వెయ్యడం.. సహజత్వంలోంచి సామూహికత్వంలోకి కాలు మోపడం లాంటిదే.ఆ దిశగా సాగుతున్న నిర్మాణ వైశిష్ట్యాన్ని దర్శించడమే కొత్తచూపుకి పదును పెట్టడం లాంటిది.ఒడిసి పట్టుకోవడమే సామాజికతలోంచి రూపుదిద్దుకోవడం లాంటిది.ఈ చైతన్యాన్ని స్తబ్దతను బడ్డలుకొట్టినపుడే.. నిజం బట్టబయలై, విషయం తేటతెల్లమవుతోంది.”Confusion is a real mistake to provide a new generation construction between the humanism and behaviorism ” అని సార్త్రే ఓ చోట అభిప్రాయపడినట్టే.. మనల్ని మనమే జీర్ణించుకొని తవ్వితీసుకోవాలి.సరిగ్గా అలాంటి సందర్భాలనే ఈ కవి తవ్వితీసి,పాతరేయడం ఓ అనిబద్ద నిబద్ధతకు నిదర్శనం.ఇలాంటి అన్వేషణ లోంచే సంఘర్షణని ఒంటబట్టించుకోవడం మామూలుతనంలోంచి అలవాటైపోతుంది.ఇది నాస్టాల్జియా అంతకంటే కాదు.ప్రవాహ వేగంలో గమనాన్ని చిత్రీకరించడంలోని ఒక భాగమే.దీని అత్యంత ఒడుపుగా,నేర్పుతో రాసిన కవిగారికి.. తులనాత్మక పరిశీలనతో విశ్లేషించిన మీకు నా మనస్ఫూర్తి అభినందనలు శ్రీరాంజీ…!

 • good రివ్యూ శ్రీరాంజీ. కొత్త తరం కొత్త భావాలు బాగున్నాయి . నూతనోతేజం కలిగిస్తున్నాయి. ఆశాభావం పెరుగుతోంది.

  • థ్యాంక్యూ శాంతి. మీరు ప్రతీ వ్యాసమూ చదివి ప్రతిస్పందించడం నాకు నచ్చుతుంది.

 • శ్రీరామ్, చాలా ఫోర్స్ తో రాశాడు. కొత్త కవీ అతని కవిత్వం లాగే కొత్త పరామర్శ కూడా వైవిధ్యంగా వుంది. ఈ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నా.ఇప్పుడే చదివేయాలనిపించేలా వుంది…. ఈ పరిచయం. అభినందనలు సత్యోదయ్….

  • థ్యాంక్యూ సర్. మీరు అభినందించడం మాకు ఆశీస్సులే

 • మూలాల్ని మరిచిపోకుండా మునివేళ్ళతో స్పృశించాలన్న భావం కలిగేలా ఉన్నా సత్యోదయ్ గారి కవిత్వంలో ఆ చాయలేమీ కనిపించవు.. అంతా ఓ కొత్తవరవడి..కొంత అధివాస్తవిక ఛాయలు..కవిసంగమమ్ లో వారి కవితలు చదివినప్పుడు..”ఏదో కొత్తగా చెప్తున్న అనుభూతి కి లోనయ్యా.. వారి కవిత్వం ఒకటికి రెండు సార్లు చదివింప జేసేది!! మంచి విద్వత్తు ఉన్న కవి సత్యోదయ్!!లోతైన విశ్లేషణ చేసిన శ్రీరామ్ గారికి శుభాభినందనలు..సత్యోదయ్ కు శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐

 • సత్యోదయ్ గారి “వ్యతిరిక్త ప్రవాహం” కాల చక్రాన్ని వెనక్కి తిప్పి కొన్ని ప్రశ్నలడిగి మరికొన్ని జవాబులు చెప్పే విధంగా ఉంది… తన భావాలను సూటిగా ఎదుటి మనిషికి తగిలేలా చక్కగా కవిత్వీకరించారు….శ్రీ రామ్ సార్ మీ సమీక్ష చాలా బలాన్నిస్తుంది.లోటుపాట్లను నిర్మొహమాటంగా ఎత్తి చూపుతూ కొత్తతరం కవులలో ఉత్తేజిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఈ సమీక్ష చెప్పకనే చెప్పుతుంది….మీ ఇరువురికి ధన్యవాదాలు…

 • మెదడుకు పదును పెట్టే విశ్లేషణ రాశావు శ్రీరామ్.అభినందనలు నీకు ఆ కవికి

 • కవితా దృష్టిని పాఠకుని పట్టిచ్చే పంక్తుల్ని ఎన్నుకొని సమీక్షించారు సత్యోదయ్ కవిత్వంపై ప్రేమ పెంచుకునేలా రాశారు.

 • కొత్త గొంతుని ఇలా చెప్పడం బాగుంది మీ శైలి రోజు రోజుకి పదునుగా మారుతుంది , వ్యతిరిక్త ప్రవాహం పుస్తకం చదివించేలా రాసారు తెప్పించుకుంటా పుస్తకం ఎలా గైనా చదవాలని ఉంది . అభినందనలు ఇద్దరు మిత్రులకి

 • అన్న….కొత్త కవిత్వం…కొత్త అభివ్యక్తి….వర్తమానంలో ఉంటూనే కొంచెం ముందుకెళ్లి ఈ కవి మాట్లాడుతున్నాడేమో అనిపిస్తోంది…
  మీరు పరిచయం చేసిన తీరు అంతే …
  ఇప్పటికిప్పుడే ఈ కవిని చదవాలి…అనిపిస్తుంది…
  రేపటి కవితా ప్రపంచంలో చెరగని సంతకం చేయబోతున్న. ..ఏ కవికి శుభాకాంక్షలు…

 • పరిచయం బాగుంది. సత్యోదయ్ గారికి మీకు అభినందనలు

 • తెలుగు నేలకు కొత్తకవి దొరికినట్టే….గొప్ప విమర్శకుడు దొరికాడు.

 • గొప్ప సమీక్ష శ్రీరాం గారు కృతజ్ఞతలు ..పుస్తక సమీక్షపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు .

 • అద్భుతమైన రివ్యూ శ్రీరాం గారూ.. అభినందనలు ఇద్దరికీ..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.