కవితలు చెప్పే అమ్మాయిలు ఆకాశమెత్తు హర్మ్యాలు

 

సెయింట్ బాసిల్స్ కెతీడ్రల్

యాస్నా పోల్యానా లోని టాల్ స్టాయ్ ఎస్టేటుకు పోలేక పోయినా ఆయన నివసించిన ఇంటిని చూశామన్న ఆనందం తో అక్కడినుండి బయలుదేరి షాపింగ్ కు వెళ్దామని అడగగానే మా గైడు క్రెమ్లిన్ పక్కన నడక దూరం లోనే ఉన్న ఒక పురాతన షాపింగ్ కాంప్లెక్స్ కు తీసుకెళ్ళింది. దాని పేరు పెత్రోవ్ స్కీ పాసేజ్ , 1906 లలో నిర్మించిన ఆ షాపింగ్ కాంప్లెక్స్ పొడుగ్గా కళాత్మకంగా కట్టారు. వ్లాదిమీర్ షుకోవ్అనే ఇంజనీర్ ఈ షాపింగ్ సెంటర్ ను నిర్మించాడు. ఈయనే ‘గమ్’ అనే ఇంకొక షాపింగ్ సెంటర్ కూడా నిర్మించాడు. పొడుగ్గా ఉండే ఆర్కేడ్ రెండు అంతస్తుల సెమీ సిలిండరికల్ పై కప్పు తో అత్యంత కళాత్మకం గా ఉంది. షాపులను చూస్తూ కొద్దిసేపు తిరిగి అక్కడ మంచి ఐస్ క్రీం అమ్ముతారు అని గైడ్ చెప్పడం తో దాన్ని రుచి చూసి బయటకు వచ్చాము. బయట కొంత దూరం వెళ్ళాక కొంత మంది యువతీ యువకులు తమ ఆర్కేష్ట్రా తో ఎడ్ షెరాన్ ట్రాక్ షేప్ అఫ్ యు పాడుతున్నారు ‘ఐ యాం ఇన్ లవ్ విత్ యువర్ బాడి’ అని పాడుతుంటే చుట్టూ యువతీ యువకులు వారిని ప్రోత్సహిస్తూ ఈలలు చప్పట్లతో అరుస్తూ కనిపించారు అక్కడినుండి రెడ్ స్క్వేర్ దగ్గరలోనే ఉన్న ఒక పార్కుకు వెళుతుంటే పురాతన రంగు రంగుల సెయింట్ బాసిల్స్ కాతడ్రల్ కనిపించింది 1561 లో నిర్మిత మయిన ఈ చర్చ్ ఇప్పటికీ కొత్త దానిలా ఉంది. ఒక జ్వాల పైకెగుస్తున్నట్టు నిర్మించిన ఈ కట్టడం రష్యన్ బైజాంటిన్ పద్దతికి వ్యతిరేకంగా కట్టారు. ఎక్కడా ఇటువంటి కట్టడపు చాయలు రష్యాలో లేవు. సంప్రదాయ వాదులనుండి రష్యన్ రెడ్ ఆర్మీ అప్పట్లో స్వాధీనం చేసుకొని చాలా కాలం దాన్నొక చారిత్రిక మ్యూజియం గా నిర్వహించారు. ఈ చర్చ్ కు మ్యూరల్ ఆర్టు పద్దతిలో ఎర్ర ఇటుకలతో కట్టిన కట్టడం మీద అందం గా రంగులు వేశారు. చర్చి ముందుకు వెళ్లి నిలుచుంటే మన కళ్ళు వేరే ఎటువైపు చూడలేవు. అంత సుందరం గా ఈ కట్టడాన్ని నిర్మించారు. అక్కడ నుండి దగ్గరలోనే వున్న ఒక పార్కు లోకి వెళ్ళాము. ఆ పార్కు చాలా విశాలం గా ఉంది. పార్కు పక్కనే ఒక పురాతన కోర్టు ఉంది దాని చరిత్ర చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది అది పదహారవ శతాబ్దానికి చెందిన కట్టడం. జారిస్టు రష్యా,  ఇంగ్లాండు పాలకులు ఆ పురాతన భవనం లోనే రెండు దేశాల వ్యాపార లావాదేవీల చర్చించే వారట. ఇరవయ్యవ శతాబ్దానికల్లా ఆ భవనం ప్రాధాన్యతను కోల్పోయినా తిరిగి 1960 లో ఆ భవనాన్ని మరమ్మతులు చేయించి ఉంచారు. 1994 లో క్వీన్ ఎలిజబెత్ ఈ “ఓల్డ్ ఇంగ్లీష్ కోర్టు” ను సందర్శించారు.

ఓల్డ్ ఇంగ్లీష్ కోర్టు

కోర్టు లోపల అనేక చారిత్రక పాత్రలూ, రక రకాల పురాతన వస్తువులూ ఉన్నాయని చెప్పారు, సమయాభావం చేత లోపలి వెళ్ళలేక పోయాము. పార్కునుండి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళుతున్న మాకు ఇరవై ఏడూ ఫ్లోర్లతో 172 మీటర్ల ఎత్తుతో 1948 లో నిర్మించిన సెవెన్ సిస్టర్ల ని పేరు పడ్డ భవంతుల్లో ఒకటయిన మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్ మెయిన్ బిల్డింగ్ కనబడింది అక్కడకు వెళ్లి చూశాము. దానికి దగ్గరలోనే ఇంకొక స్కై స్క్రాపర్ కుర్దిన్స్కాయా స్క్వేర్ బిల్డింగ్ ఉంది. ఈ స్కై స్క్రాపర్ నిర్మాణాల వెనుక ఒక చరిత్ర ఉంది. 1947 – 1953 మధ్య ఎత్తైన భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 1941 లో జర్మన్లు చాలా భవంతుల్ని కూల్చి వేశారు విపరీతమైన ఉక్కు పోగు పడింది. అదీ గాక కృశ్చెవ్ మాటల్లో చెప్పాలంటే స్టాలిన్ ఇలా అనుకున్నాడట “ మనం యుద్ధం లో గెలిచాం మన ప్రదేశాల్ని చూడటానికి విదేశీయులు వస్తారు. మిగతా క్యాపిటలిస్ట్ దేశాలతో మనల్ని పోల్చుకుంటారు. ఒక్క ఆకాశ హర్మ్యం కుడా లేక పోతే వాళ్ళ దృష్టిలో మనం పలుచనయి పోతాము. అందుకని ఇక్కడ కూడా ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరగాలి “ అనుకున్నాడట. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ “ ప్యాలెస్ ఆఫ్ ద సోవియట్స్” స్టాలిన్ ఆలోచనే. పేరు ఉన్న ఆర్కిటెక్టు లనందరినీ పిలిపించి ప్లాన్లు సిద్దం చేశారు కానీ అన్నిటినీ తిరస్కరించారు. 1946 లో స్టాలిన్ తన సొంత ఆలోచనతో అంత పెద్ద

ఎత్తు లేకుండా కొమింటర్న్ (ఇంటర్నేషనల్ కమ్మ్యూనిస్టు) గుర్తు గా నిర్మించాలని నిర్ణయించాడు. ఆ ప్రాజెక్టుకు ‘వైసోత్కి’ అని పేరు పెట్టారు. ఏడు ఆకాశ హర్మ్యాల నిర్మాణం చక చకా జరిగి పోయింది. అవి 1. మాస్కో స్టేట్ యూనివర్సిటి , 2. హోటల్ ఉక్రేనియా ,3. కుర్దిన్ స్కాయ స్క్వేర్ బిల్డింగ్ 4. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ , 5. లెనిన్ గ్రాడస్కాయ హోటల్ ,6. రెడ్ గెట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 7. కొతెల్ని చెస్కాయ ఎంబాంక్మెంట్ బిల్డింగ్. మేము బిల్డింగ్ ముందు నిలబడి మొత్తం తల ఎత్తితే కుడా కనబడనంత ఎత్తుగా ఉంది. ఒక్క మాస్కో యూనివర్సిటీ ప్రధాన టవర్ నిర్మించడానికే ( 240 మీటర్ల ఎత్తు ) నలభై వేల టన్నుల ఉక్కు వాడారంటే దాని నిర్మాణాన్న ఊహించొచ్చు. ఇటీవలి వరకు(1990 వరకు ) యూరప్ లో అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఇదే. ఇప్పటికీ ఎత్తైన విద్యా రంగ భవంతులలో ప్రపంచం లోనే ఇదే ఎత్తైనది. మేమున్న భవంతి ముందు కొన్ని ఫోటోలు దిగి అక్కడినుండి మేము నడుచుకుంటూ పురాతన అర్బాత్ స్ట్రీట్ కు వెళ్ళాము. పురాతనమైన ఈ బజారు ఇప్పటికి అందిన చరిత్ర ప్రకారం 15 వ శతాబ్దికి చెందినది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ వీధి లో కొన్ని ఉప వీధులు ఉన్నాయి ప్రత్యేకంగా నైపుణ్యం గల పనివాళ్ళకు కేంద్రంగా కొన్ని ఉప వీదులున్నాయి ఉదాహరణకు

అర్బాత్ వీధి

‘ప్లోన్టికొవ్ పెర్యులోక్’ అనేది వడ్రంగుల వీధి. అలాగే జార్ నాల్గవ ఇవాన్ ( ఈయనను ఇవాన్ ది టెర్రిబుల్ అని పిలిచే వాళ్ళు ) కాలం లో ఆయన క్రూరమైన బాడి గార్డుల హెడ్ క్వార్టరు కూడా ఇదే వీధిలో ఉండేది. తీవ్రమైన శిక్షలు ఇక్కడి నుండే అమలు చేసే వాళ్ళు. అలెక్సీ టాల్ స్టాయ్ నవల ఇవాన్ ది టెర్రిబుల్ లో ఇలా వర్ణిస్తాడు News of the fearsome plans had spread throughout Moscow, and a deathly silence reigned. The shops were closed, the streets empty, and only occasionally one heard the galloping horses of the messengers of the Tsar, who had come down to the Arbat, to his favorite palace.” 

మొదట ఈ వీధి లో కులీనులైన జమీందారులూ, గొప్ప పదవుల్లో ఉండే రాజుద్యోగులూ ఉండేవారు, మొదట మాస్కో కు దూరంగా ఉన్న ఈ వీధి క్రమ క్రమం గా ఊరి మధ్య లోకి వచ్చేసింది. 19 శతాబ్దానికల్లా అర్బాత్ వీధి ఆలోచనాపరులకు, కళాకారులకు, కవులకూ, సంగీత కళాకారులకూ నివాసమై పోయింది. పూష్కిన్ తన పద్దెనిమిదేళ్ళ భార్య నటాలీ ని వివాహ మాడాక తన హానీ మూన్ ఇక్కడే జరుపుకున్నాడు ఆమె తో కలిసి ఇక్కడే కొంత కాలం నివాసమున్నాడు, తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ కు ఆమెతో కలసి తరలి వెళ్లి అక్కడే నివాస మేర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటిని చిన్న మ్యూజియం గా మార్చారు, ఆయన ఇంటి ముందు పూష్కిన్ ఆయన భార్య నటాలీ విగ్రహాలున్నాయి. జేమ్స్ జాయ్స్ కీ , వర్జీనియా వూల్ఫ్స్ వంటి ఆ కాలపు రచయితలూ, కాఫ్కా వంటి నవీన రచయితలకూ ప్రేరణ నిచ్చిన అద్భుత నవల ‘ పీటర్స్ బర్గ్’ నవలా రచయిత ఆండ్రే బేలే నివాసముండేవాడు. 1935 లో ఈ వీధికి దగ్గరగా మెట్రో స్టేషన్ ‘అర్బాతాస్కాయా’ ను నిర్మించారు. 1980 లో బాగా రద్దీ పెరగడం తో ఈ వీధిని నడిచే వీధిగా (pedestrian zone) మార్చారు. 1986 లో పెరిస్త్రోయిక ప్రభావం తో ఈ వీధులన్నీ యువతీ యువకుల ప్రదర్శనల తో నిండిపోయేవని గైడు చెప్పింది. ఆ రోజులకు గుర్తు గా అక్కడ త్సోయ్ వాల్ అని ఒక గోడ లాంటిది నిర్మించారు అక్కడ ఇప్పటికీ యువతీ యువకులు ప్రత్యేక సందర్భాలలో గుమికూడుతుంటారు. ఒక చోట లెనిన్ వేషధారి, స్టాలిన్ వేష దారి నిలబడి అభివాదాలు చేస్తూ కనబడ్డారు. ఆ వీధిలో నడుస్తున్న మాకు అనేక చోట్ల యువతీ యువకులు ఒక ఎత్తైన ప్రదేశం మీద నిలబడి పెద్ద గొంతుకలతో పద్యాలు చదవడం, వాటిని ప్రజలు శ్రద్దగా వినటం కనిపించింది. అనేక చోట్ల పాటగాళ్ళు, ఒక్కొక్క వాయిద్య నిపుణులు వారి ప్రత్యేకతను చాటుతూ వాయించడం, పెయింటింగులు గీస్తున్న కళాకారులూ వీధి వీధంతా ఒక కళా క్షేత్రం గా కనిపించింది. అర్బాత్ వీధి గురించీ , అనేక సమస్యల మీదా జానపద గీతాలను రాసిన ప్రఖ్యాత రష్యన్ కవి ‘బాబ్ డిలాన్ ఆఫ్ రష్యా’ గా పేరు గాంచిన ‘బులాత్ ఒకుజ్జావ’ విగ్రహం ముందు నించొని ఒక యువతీ బిగ్గరగా ఆయన రాసిన కవితలను పెద్ద గొంతుకతో చదువుతోంది ( చదవడమంటే పుస్తకం పట్టుకుని కాదు ) అక్కడ చాలామంది ప్రజలు ఒక పద్యం ఆమె చదవగానే పెద్దఎత్తున చప్పట్లతో హర్ష ధ్వానాలు చేస్తున్నారు. ఆయన 1958 లో రాసి పాడిన song about Arbath’ లో ఒక చరణం ఇలా ఉంటుంది

“ నదిలాగా ప్రవహించే ప్రవహించే నీ దొక వింత పేరు

నీ పై పరచిన అద్దం లాంటి మొరుసూ నీరూ

ఓ అర్బాత్ నా అర్బాత్ నువ్వే నా సమస్తానివీ

నాకు సంతోషానివీ, బాధవూ….”

మే తొమ్మిది విక్టరీ డే ను పురస్కరించుకొని ఎక్కడ చూసినా రెండవ ప్రపంచయుద్దపు ఫోటోల తోరణాలు ఆ వీధంతా వేలాడ తీశారు. మేము అక్కడ కొన్ని షాపుల్లో కొన్ని గిఫ్ట్లు కొన్నాం. ఆ వేధిలో చాలా రకాల రెస్టారెంట్లు కనబడ్డాయి త్రిభుజాకారం గా ఉన్న ప్రఖ్యాత ప్రేగ్ రెస్టారెంట్ కనబడింది( చెకోవ్ తన త్రీ సిస్టర్స్ నాటకాన్ని ఈ హోటల్లోనే మొదటి సారిగా 1901 లో ప్రదర్శింప చేశాడు) మన తాజ్ రెస్టారెంటు కూడా అక్కడుంది అయితే అందులో మన ఇడ్లీ దోశల్లాంటివేమీ లేవు ఏవో లోకల్ తినుబండారాలే. ఒక మూలగా ఫార్మర్ మెడికల్ సెంటర్ అనే పేరు గల ఇల్లు కనబడింది దాన్ని ఎప్పుడో 1826 కట్టారు తర్వాత దాన్ని రష్యన్ మిలిటరీ డాక్టర్ల నివాస ప్రదేశం గా వాడారు అందులోనే ఒక చిన్న ప్రదేశాన్ని ఒక ఆర్ట్ స్కూల్ గా కూడా ఉపయోగించారు ప్రఖ్యాత పెయింటర్ ఆలేక్జాండర్ కుప్రిన్ ఈ ఆర్ట్ స్కూల్ లో నుండి వచ్చిన వాడే. అక్కడినుండి బయలు దేరి మేము మళ్ళీ మెట్రో ద్వారా మా బసకు చేరుకున్నాం.

వేణుగోపాల రెడ్డి

వేణు గోపాల రెడ్డి: కర్నూల్ జిల్లా వడ్ల రామాపురంలో జన్మించారు. వృత్తి రిత్యా హై కోర్ట్ లో న్యాయవాది. ప్రవృత్తి వామపక్ష సాహిత్య అధ్యయనం, ప్రచారం. రెండు దశాబ్దాల కింద కర్నూల్ కేంద్రంగా పని చేసిన LEAP (లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఎయిడ్ పర్ పూర్) వ్యవస్థాపకుడు. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా మొదట కర్నూల్ లో ఇప్పుడు హైదరాబాద్ లో అనేక సాహిత్య సాంస్కృతిక వ్యాపకాలలో ఉన్నారు. ‘ప్రజ్వలిత’అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వామపక్ష సైద్దాంతిక అంశాల మీద పలు జాతీయ దిన పత్రికలలో వ్యాసాలూ సమీక్షలూ రాశారు.  ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోడానికి​,​ వ్యాఖ్యానించడానికీ, మార్చడానికీ వామపక్ష రాజకీయాలు మినహా మరేదీ లేదనే అచంచల విశ్వాసం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.