నీ దారే నా దారీ!

మధ్యాహ్నం వచ్చాను హైదరాబాదు నుంచి. సూట్ కేసులు హాల్లోనే పెట్టి,  స్నానం చేసి, భోజనం చేసి, కాసేపు కునుకు తీద్దామనుకుంటే, ఏకంగా నాలుగు గంటలు నిద్రపోయాను.  లేచే సరికి సాయంత్రం అయింది. అది కూడా అనన్య స్కూల్ నుంచి వస్తూ ఇంట్లో అడుగుపెట్టిందో లేదో సూట్ కేసులు చూసి “ అమ్మమ్మ వచ్చిందోచ్చ్!” అనే కేకలు విని  మెలకువ వచ్చింది.

మా అమ్మాయి రజనీ టీ చేసి ఇస్తే తాగి, సూట్ కేసు ముందు కూర్చున్నాను. అందులోంచి వస్తువుల్ని తీసిపెడదామని.

ఒక్కోటే బయటికి తీసి పక్కన పెడుతున్నాను.  బుక్స్ ఒక పక్కన, స్వీట్లు, పొడులు, కుక్కర్ గాస్కెట్ల లాంటి వంట సామాను ఒక పక్కన. ఏడాదికి సరిపడా నా మెడిసిన్స్ ఒక పక్కన,  అనన్య కోసం, రజనీ కోసం తెచ్చిన గిఫ్ట్స్ పాకెట్లు ఒక పక్కన పెట్టాను. సూట్ కేస్ లో నా బట్టలు మాత్రమే ఉండనిచ్చి జిప్ లాగి పక్కన పెట్టాను,  నా బెడ్ రూంలోకి వెళ్లినప్పుడు తీసికెళ్లవచ్చు అని.

ఈ పనులు నేను చేస్తుండగా, మా అమ్మాయి రజనీ  బుక్స్ పక్కన కూర్చొని ఆబగా ఒక్కో టైటిల్ చదివేసి, “ఓ నాలుగైదు నెలలు మెదడుకు మంచి మేత” అంది.

మనుమరాలు అనన్య మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర  కూర్చొని స్నాక్ తింటూ బుద్దిగా హోం వర్క్ చేసుకుంటున్నది.

రజని బుక్స్ టైటిల్స్ చూశాక, తనకు, అనన్యకు తెచ్చిన బట్టల పాకెట్లు ఓపెన్ చేసింది, తనకు తెచ్చిన టాప్స్ చూసి, గ్రీన్, ఎల్లో కలర్ టాప్స్ బాగున్నాయి అని సంబరపడింది. ‘అనన్య కోసం మూడు ఫ్రాకులు మాత్రమే తెచ్చాను, మరేమీ తీసుకరాలేకపోయాను’ అన్నాను చిన్నబుచ్చుకుంటూ.

Art by: కిరణ్. బి.

రజనీ ఒక  పాకెట్ ఓపెన్ చేసి, ఫ్రాకులు చేతుల్లో పట్టుకొని, “అనన్యా! నీ కోసం అమ్మమ్మ తెచ్చిన ఫ్రాకులు చూడు ఎంత బాగున్నాయో” అంది. హోం వర్క్ బుక్ లోంచి తల పైకెత్తి ఫ్రాకులు చూసి, “థాంక్స్ అమ్మమ్మ” అంది ముఖంలో ఏ ఆనందం లేదు. తన కోసం ఎక్కువ గిఫ్ట్స్ తేలేదని అలిగిందేమోనని అనుకున్నాను.

“నీ కోసం ఎక్కువ గిఫ్ట్స్ తీసుకరాలేదు రా బుజ్జికన్నా! ఈ ఫ్రాక్స్ కోసం కూడా బాగా తిరగాల్సి వచ్చింది. నీకోసం కొనడానికి ఏం దొరకలేదు అక్కడ” అన్నాను

హోం వర్క్ చేయడం ఆపేసి దగ్గరకొచ్చి నా మెడ చుట్టూ రెండు చేతులు చుట్టి, నా చెంపకు తన చెంప ఆనించి,”ఇట్స్ ఓ.కే. అమ్మమ్మా!. కాని ఇవి కూడా తీసుకరావలసింది కాదు, నువ్వు షాపింగ్ కు వెళ్ళాల్సింది కాదు ‘’ అంది.

“అదేం రా! నీ కోసం ఏం తీసుకరాకుండా ఎలా రాను?”

“నువ్వు రావడమే నాకు మంచి గిఫ్ట్. అవెందుకు “ అంది.

“ ఒకసారి ఈ ఫ్రాకు వేసుకొని చూడు, నీ కెలా వుంటుందో చూద్దాం” అన్నాను.

“నాకిప్పుడు ఫ్రాక్ వేసుకోవాలని లేదు” అంటూ, టేబుల్ దగ్గరకు వెళ్లి, హోం వర్క్ లో మునిగిపోయింది.

ఈ లోగా రజనీ, ఎల్లో టాప్ వేసుకొని వచ్చి చూపించింది. “అమ్మా, జీన్స్ మీదకు ఇది భలే బాగా సరిపోయింది, కొలతలిచ్చి కుట్టించుకున్నట్టు బాగా సరిపోయింది నాకు” అని సంబరపడింది,

“కొత్త బట్టల మీద నీకున్నంత మోజు అనన్యకు లేదు. ఈ కొత్త ఫ్రాకులు ఎప్పుడు వేసుకుంటుందా అని ఎదురుచూడాలి”

“మనం వత్తిడి చేస్తే ఒప్పుకోదు. తన క్లాజెట్ లో పెడతాలే, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వేసుకుంటుంది” అన్నది రజనీ

“నీ బట్టల కోసం ఎక్కువ తిరగలేదు. మన గల్లీలోనే  మనింటికి దగ్గర్లోనే వనజ అనే అమ్మాయి టైలరింగ్ షాప్ పెట్టింది. తనకు సహాయంగా మరో నలుగురు అమ్మాయిలను పెట్టుకుంది, అంటే నాలుగు కుట్టుమిషన్లు నడుస్తున్నాయి. దీనికి అనుబంధంగా కొన్ని డ్రస్సులు, చీరెలు అమ్ముతూ వుంటుంది. అవి చూసీ ఆ అమ్మాయిని అడిగాను, “వనజా! కాటన్ టాప్స్ కావాలి,’’ అని.

“ఎలాంటివి కావాలో చెప్పండి తెస్తాను” అంది

“ఏ నగిషీలు, ఎంబ్రాయిడరీ వుండొద్దు. సింపుల్ గా, కాజువల్ గా వుండాలి. చేతులు మోచేతుల వరకో, మోచేతుల కిందివరకో వుండొచ్చు. కాని, భుజాలు కనిపించేట్టు చీలికలో, అసలు లేకుండానో వద్దు. టాప్స్ మరీ పొడుగ్గా వుండొద్దు. జీన్స్ మీద వేసుకోడానికి వీలుగా అంటే మోకాళ్ల పైకి వుండాలి” అని చెప్పాను.

“అలాగే ఆంటీ! తెస్తాను. మూడు రోజులు టైం ఇవ్వండి” అని అడిగింది.

“మూడు రోజుల తరువాత వెళితే డజన్ టాప్స్ చూపించింది. నీకు నచ్చే కలర్స్ వున్న టాప్స్ 6 తీసుకున్నాను. నీ బట్టలు కొనడం ఇంత సింపుల్ గా జరిగిందా? అనన్య బట్టల కోసం చందన, బొమ్మన, మెట్రో, కళాంజలి, అబిడ్స్ లో చర్మాస్, అక్కడే మరి రెండు షాపులు తిరిగాను. సగం రోజు పోయింది. ఎనిమిదేళ్ళ పాపకు ఎంబ్రాయిడరీ వర్క్ లేని కాటన్ డ్రస్సులు కావాలి, కనీసం ఫ్రాకులు కావాలి” అంటే దొరకలేదు.  కళ్ళు జిగేల్ మనే ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్లతో వుండే సింథటిక్ క్లాత్ తోనో, సిల్క్ క్లాత్ తోనో తయారైన డ్రస్సులు ఉన్నాయి. అవి కూడా భుజాలంతా కనిపించేట్లు, లేదా చేతుల మీద చీలికలు, ఆ బట్టలు పట్టుకొంటే కూడా ఎలాంటి మెటల్ తీగలతో ఎంబ్రాయిడరీ చేశారో కానీ ఆ డ్రస్సులు చాలా బరువున్నాయి. అవి వేసుకున్నప్పుడు ఆ ఎంబ్రాయిడరీ డిజైన్లు గుచ్చుకుంటు వుంటే పిల్లలు ఎలా భరిస్తారు. అలా డిజైన్లు ఎలా చేస్తారు, పిల్లల లేత చర్మాలకు గుచ్చుకుంటాయని ఇంగితమన్నా ఉండదా? అనిపించింది  ఆ డ్రస్సులు చూస్తే.”

“అమ్మా వాళ్లు ఇవన్నీ అలోచిస్తారా? వాళ్లకు కావలసింది డ్రస్సులు అమ్ముడుపోవడం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఫ్యాషన్ కావాలి జనాలకి కూడా? బట్టలు అవసరమై బట్టలు వేసుకుంటుంటే ఇన్ని రకాల ఫ్యాషన్లు రావు. పెద్దవాళ్ల బట్టల్లాగే  చాల ఎబ్బెట్టుగా చిన్న పిల్లల, టినేజ్ పిల్లల డ్రస్సులు వుంటున్నాయి.” అంది

“నా మాటలు వింటే నన్నో పాతకాలం మనిషంటారేమో కాని, నడిమి వయసు స్త్రీలు కూడా జుట్టు విరబోసుకొని, భుజాల మీద చీలికలున్న బ్లౌజులు వేసుకుంటున్నారు. వీపంతా కనిపిస్తూ వుంటుంది. నా చిన్నతనంలో వచ్చిన సినిమాల్లో హీరో చెల్లి అత్యాచారానికి గురైందని చెప్పడానికి సింబాలిక్ గా ఆ అమ్మాయి భుజం మీదనో వీపు మీదనో జాకెట్ చిరిగినట్టు చూపించేవాళ్లు. ఇప్పుడు ఇవేం ఫ్యాషన్లో, అవి చూస్తుంటే కడుపులో దేవినట్టు వుంటుంది” అన్నాను

“ఈ ఫ్యాషన్ల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్” అంది రజనీ.  డ్రస్సులపై చర్చను అంతటితో ఆపేశాను.

అనన్య కూడా తన హోం వర్క్ పూర్తి చేసుకుంది. స్నాక్ తినడం కూడా ముగించి, ఆరెంజ్ జూస్ తాగింది. ఇక ఆడుకోడానికి వెళుతుంది అనుకొని “ ఆడుకోడానికి వెళుతున్నప్పుడు ఈ కొత్త ఫ్రాక్ వేసుకొని వెళ్లు. నీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. రేపు స్కూల్ కు పోతున్నప్పుడు మరో కొత్త ఫ్రాక్ వేసుకొని వెళ్ళు” అని అనన్యకు గుర్తు చేశాను.

“ఈ రోజు వెదర్ చాలా బాగుంది అమ్మమ్మా! నాకు ఆడుకోవాలని ఉంది. ఫ్రాక్ ఇప్పుడు వేసుకోను” అంది

“అదేం, ఎందుకు?” అన్నాను.

“ఫ్రాక్ వేసుకొని ఆడుకునేది ఎలాగా?” అంది.

“ ఏం ఎందుకు ఆడుకోకూడదు?” అన్నాను.

“పిచ్చి అమ్మమ్మా, ప్లే ఏరియాకు వెళ్లాలా ఆడుకోడానికి? సైకిల్ మీద వెళతాను కదా! ఫ్రాక్ వేసుకొని సైకిల్ మీద ఎలా వెళ్లను చెప్పు? అక్కడికి వెళ్లాక, పరుగెత్తుతాం, జారుడుబండెక్కి జారుతాం, లేకపోతే మంకీబార్ పట్టుకొని ఆడతాం. ఆడుతూ ఆడుతూ కార్ట్ వీల్ వేయాలనిపిస్తే వేస్తాం. సోఫియా జిమ్నాస్టిక్స్ కు వెళుతుంది, కనుక నాకు కార్ట్ వీల్ ఎలా చేయాలో నేర్పించింది. నేను ట్వైకాండో పోతాను కదా తనకు నేను ఫ్రంట్ కిక్, బ్యాక్ కిక్, రౌండ్ కిక్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. ప్లే ఏరియా నుంచి ఇంటికి తొందరగా వస్తే, మన ఇంటి ముందున్న చెట్టు ఎక్కి, కొమ్మలు పట్టుకొని వూగాల్సి రావొచ్చు. ఎన్ని ఆటలు ఆడుకోవాలి నేను. ఫ్రాక్ వేసుకొని, రెండు కాళ్లు దగ్గర పెట్టుకొని, కదలకుండా కూర్చోవాలా? చూడూ, నా ప్యాంట్,  షర్ట్. ఈ డ్రెస్ తో బాగా ఆడుకోవచ్చు” అంటూనే చేతులు నేల మీద మోపి కాళ్ళు గాల్లోకి లేపి మూడు సార్లు కార్ట్ వీల్స్ వేసింది.

“అయితే రేపు స్కూల్ కు వెళ్ళేప్పుడు ఫ్రాక్ వేసుకుందువులే, నీవు కార్ట్ వీల్స్ వేస్తుంటే చూశాను కదా ఫ్రాక్ వేసుకోవడం బాగుండదులే. “ అన్నాను.

“కదలకుండా ఓ ఐదు నిముషాలు ఒక చోట కూర్చోలేను. తూనిగల్లే ఎగురుతూ వుండాలనిపిస్తుంది. చిల్డ్రన్ హావ్ ది రైట్ టు ప్లే! ” అంది అనన్య.

పిల్లలు ఇష్టమొచ్చిన ఆటలు ఆడుకోడానికి అనువుగా డ్రస్ వేసుకోవాలి కానీ. చూడ్డానికి ఆడంబరంగా ఉండాలని డ్రస్సులు వేసి, వాళ్లను ఆడుకోనీయకుండా, పరుగెత్తనీయకుందా కాళ్ళూ,చేతులూ కట్టిపడేసే దుస్తులు వేయడం మంచిది కాదు అనిపించింది.  అనన్యను ఫ్రాక్ వేసుకోమని వత్తిడి చేయకూడదు అనుకున్నాను. .

“సరే నీ కెప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకో! లేకపోతే మానేసెయ్, ఫ్రాకులు నీ క్లాజెట్ లో వుంటాయి’’ అన్నాను

డోర్ బెల్ మోగింది. హోం వర్క్ అయిపోయిందంటూ ఒక్క వుదుటన కేకలు వేస్తూ, పరుగులు తీసింది డోర్  తెరవడానికి. వచ్చింది పక్కింటి పిల్లలే. ఆడుకుందామని పిలవడానికి వచ్చింటారు అనుకున్నాను.

వచ్చింది సోఫియా, ఎమ్మా. సైకిల్ తీసికెళుతున్నాను. ప్లే ఏరియాకు పోతున్నాం ఆడుకోడానికి అని కేక వేసి వెళ్లిపోయింది అనన్య,

నేను మొండిగా బలవంతం చేస్తే ఫ్రాక్ వేసుకునేది. కాని ఇట్లా ఫ్రెండ్స్ రాగానే, తన డ్రస్ మార్చుకొని వెళ్ళేది. డ్రస్ మార్చుకోడానికి ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయ్యాయని కోప్పడేది, అలిగేది. ఒక్కోసారి నిస్సహాయంగా కన్నీళ్ళు పెట్టుకోనేది. ఇలాంటి ఉద్వేగాలు, ఉద్రేకాలు వెల్లడయినప్పుడు వికారంగా కనిపించడమే గాక, నన్ను దెప్పిపొడవడం వల్ల పిల్లకు గొడవపడడం నేర్పిస్తున్నానేమో, మాట వినకుండా తయారవుతుందేమోనని దిగులుపడేదాన్ని. ముఖమంతా ఆనందం నిండగా, కేరింతలతో, చెంగున పరుగులు తీస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో అనుకొన్నాను.

ప్లే ఏరియాలో ఒక గంట ఆడుకొని ఇంటికి వచ్చింది సైకిల్ మీద. సైకిల్ గరాజ్ లో పెట్టి, వేగంగా బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసి, నైట్ డెస్ వేసుకొని, తన పొట్టి జుట్టు తనే దువ్వుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. “డిన్నర్!” అనుకుంటూ.

అప్పటికే నేను, రజనీ కలిసి వంట చేసి, డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దాం.

“డిన్నర్ టైం మీన్స్ ఫామిలీ టైం కదా, కాకరకాయలు చెప్పుకుందాం ఇప్పుడు” అంది అనన్య.

“అవును కబుర్లు కాకరకాయలు చెప్పుకుందాం ‘’అన్నాను తనకు వంతపాడుతూ.

“కాకర కాయలు అంటే బిట్టర్ గార్డ్స్. నిజంగానే బిట్టర్ గా వుంటాయి” అన్నాను. వింతగా చూసింది.

‘’ఫర్ ఎగ్జాంపుల్- తొమ్మిదికంతా నిద్రపోవాలి. స్టోరీ బుక్స్ చదువుతూ మేల్కోవద్దు . మార్నింగ్ తొందరగా లేచి నీ పనులు చకచకా చేసుకొని స్కూల్ కు వెళ్ళాలి అంటాననుకో. ఈ మాటలు నీకిష్టముండదు. ఇవే కాకరకాయలు అంటే” అని నవ్వింది రజనీ.

“అమ్మమ్మా! చూడూ!! ఇదే సమయమని నాకు లెక్చర్ ఇచ్చేసింది  అమ్మ. ఇదేం బాగూలేదు. డిస్కషన్ వదిలేసి, ఎస్కలేటర్ ఎక్కేసింది అమ్మ. అమ్మ చేప్పేది నాకేం వినిపించలేదు’’ అంది గొంతు పెంచి.

“ఇదేమిటీ, కొత్తగా ఉంది. అమ్మ ఎస్కలేటర్ ఎక్కేయడం ఏమిటీ?” అన్నాను.

“సైడ్ బై సైడ్ వాక్ చేయడం లాంటిది డిస్కషన్ అంటే. నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి అంటే ఎస్కలేటర్ ఎక్కేసి పారిపోవడం. కిందున్నవాళ్ళు వినిపించుకోరు”.

“భలే ఉందిరా ఈ అబ్జర్వేషన్. నాకు అరవై ఏళ్లు వచ్చాక తెలుస్తోంది. నీకు ఎనిమిదేళ్లే! మూడోక్లాసుకో తెలిసిపోయింది” అన్నాను.

“కాదు, నాకు ఆరేళ్లప్పుడే తెలుసు. నేను ఫస్ట్ గ్రేడ్ లో ఉన్నప్పుడే మిస్ బ్రునటీ చెప్పింది.’’నెవర్ గివప్ డిస్కషన్. డోంట్ క్లైంబ్ అప్ ఎస్కలేటర్ అండ్ రన్ అవే” అని.

‘రెండేళ్ళ క్రితం చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్నావా’ అని అడిగాను.

“మిస్ బ్రునటీ చెప్పింది ఎప్పుడూ గుర్తుంటుంది నాకు, నా ఫ్రెండ్స్ తో మాట్లాడేప్పుడు మరిచిపోను ఈ విషయం. షి ఈజ్ ఏ గ్రేట్ టీచర్!” అంది.

 

ఏం తిన్నామో చూసుకోలేదు. అనన్య మాటలతో కడుపు నిండిపోయింది. చేతులు కడుక్కొని, వంటిళ్లు సర్దేసి నా బెడ్ రూంలోకి వెళ్ళాం. నేను మంచినీళ్లు తీసుకవెళుతుంటే, రజనీ  నా సూట్ కేస్  తెచ్చింది. నా వెనకాలే వచ్చిన అనన్య “నీ కొత్త శారీస్ చూపించు “అంది సూట్ కేస్ దగ్గరే నిలబడి. రజనీ కూడా నిలబడిపోయింది.

“శారీస్ ఏమీ కొనలేదు” అన్నాను.

“ఎందుకు తెచ్చుకోలేదు కొత్త శారీస్? చాలా కలర్ ఫుల్ గా, బ్యూటిఫుల్ గా వుంటాయి’’ అంది.

“నేను శారీస్ కట్టుకున్నప్పుడంతా ఏడిపిస్తావు. ఇప్పుడేమో శారీస్ కలర్ ఫుల్ గా, బ్యూటిఫుల్ గా ఉంటాయి అంటున్నావు” అన్నాను.

నా మాటలకు  రజనీకి నవ్వు ఆగలేదు. “ఏమని అమ్మమ్మను ఏడిపిస్తావు” అంది.

నా వైపు చిలిపిగా చూస్తూ, అంది” ఇండియన్ డ్రెస్ అదే శారీస్, డ్రెస్ వేసుకున్నట్టే వుంటుంది. బెల్లీ బటన్ కనిపిస్తుంటుంది. బ్లౌజ్ ఎంత టైట్ గా వుంటుందో, బాడీకి పెయింట్ వేసినట్టు’’ అంది.

“ఇండియన్స్ ఇళ్లకు ఎదైనా ఫంక్షన్ కు వెళుతున్నప్పుడు నా గదిలోకి వస్తుంది. నేను శారీ కట్టుకుంటున్నప్పుడు, “నేను చూస్తాను” అనుకుంటూ వస్తుందా, వచ్చి ఇదే ఇట్లా మాట్లాడుతూ వుంటుంది.  అందుకే ముందు ముందు ఇక శారీస్ కట్టుకోకూడదు అనుకుంటున్నాను. నీ టీజింగ్ భరించలేకనే కొత్త శారీస్ తెచ్చుకోలేదు” అన్నాను.

“సారీ అమ్మమ్మా! ఫన్ కోసమే టీజ్ చేశాను. నిన్ను హర్ట్ చేశాను. ఐ విల్ నెవర్ టాక్ టు యు లైక్ దట్” అంది.

“లేదు లేరా, బుజ్జి కన్నమ్మా! ఫన్ కోసమే అలా టీజ్ చేశావు. నేనూ నవ్వుకున్నాను. నీ అబ్జర్వేషనూ కరెక్టే. శారీ కట్టుకున్నవాళ్లకూ ఎంత ఇబ్బందిగా వుంటుందో తెలుసా? ఇక్కడికి వచ్చాక, వాకింగ్ కు వెళుతున్నప్పుడు, షాపింగ్ కు వెళుతున్నప్పుడు, అమ్మ షర్టులు, పాంట్లు వేసుకుని పోతుంటాను కదా! ఎంత ఫ్రీగా, హాయిగా వుంటుందో. అదే శారీ కట్టుకున్నప్పుడు, కాళ్లకు కుచ్చిళ్ళు అడ్డుపడుతూ వుంటే, మెల్లగా నడుస్తూ వుండాలి. కొంగు జారిపోకుండా సర్దుకుంటూ వుండాలి. శారీతోనే నిద్రపోయే వాళ్లు, నిద్రలో కూడా కొంగు చెస్ట్ మీది నుంచి చెదరిపోకుండా వుండాల్సిందే. ఎప్పుడూ కట్టుకున్న బట్టల మీదే దృష్టి వుంటుంది., ఫోకస్, కాన్సంట్రేషన్ అంతా కొంగు మీదే వుంటుంది.  పని చేస్తున్నప్పుడు పనికి తగ్గ డ్రెస్ వుండాలి.

డ్రెస్ విషయంలో ఇక నుంచి నీదారే నాదారీ!”

 

                                       *

 

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

7 comments

  • జయా..చాలా రోజుల తరువాత నిన్ను చూసినట్లు ఉంది..మంచి కథ..నిజంగానే డిజైనర్ దుస్తులు తప్ప సాదా సీదా డ్రెస్ లు కనిపించటం లేదు.కనీసం సౌకర్యం గా బతకటం కూడా మరచి పోతున్నారు..రాస్తూ ఉండు..అక్షరాల్లో ఐన కలుస్తూ ఉండాలి కదా..

  • మొత్తానికి అనన్యా వల్ల చాలా తెలుస్తున్నాయన్నమాట. బాగుంది.

  • ఎంత బాగుందండి ! నాకథ నేను చదువుకుంటున్నట్లుంది !!

  • జయా.. ఎన్నాళ్లకు మీరు .. మీకథ .. బాగుంది . పిల్లల పరిశీలనా శక్తి .. ఖచ్చితమైన అభిప్రాయాలూ ..పెద్దలు తమను తాము తెలుసుకొనటం.. అన్నిటినీ మించి మీ కథను హెచ్చార్కె పరిచయం చేసిన తీరు బాగుంది. …

  • బాగుంది. పిల్లలకున్న సృహ మనకీ రావాలి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.