పాఠ్యాంశం

సీ…ముసురు

సీకటి…సీకటి

ముసురు…ముసురు…

సీముసురు…

మూత పెట్టి కప్పీసిన గంగాళం నాగుంది…భూగోళం సీకటి సీకటిగ.        ప్రెపంచంలోని మనుషులే కాదు జీవజాలమంతా కలిసి కారస్తన్న కన్నీళ్ల లాగ ఆకాశిం ధారగా కురస్తంది! ముసురు ముసురు.

సీముసురు…

వొళ్ళెరగని ఆగ్రహంతోటి బుసలు కొట్టి ఇరుచుక పడే ఇసనాగుల మంద లాగ హోరు గాలి…

గుండెకాయలు…పిడికిళ్ళలో పట్టుకున్నారు జనం! +++ +++

టక్ సర్దుకొని మరోసారి అద్దం లో చూసుకొని రూం బయటకు వచ్చారు కమీషనర్ నారాయణశర్మ సార్. రూం బయట కాపలా కాసిన బిళ్ళబంట్రోతు జంగమయ్య- సార్ బయటకు రాగానే రూం లోకి వెళ్ళి సార్ తాలూకా బేగ్ ఒక చేత్తో, వాటర్ కేన్ ఇంకో చేత్తో పట్టుకొని బయటికి వచ్చి రూం లాక్ చేసాడు.

సార్…రూం నుంచి లిఫ్ట్ లో కిందకు దిగి పార్కింగ్ లో ఆగిన కారులో కూచున్నారు. – సెల్ రింగయ్యింది – యా…స్టార్టెడ్. యెనదర్ టు అవర్స్ లో ఐ విల్ బి దేర్. మే..బి. సీయెం కమ్స్ టుమ్మార్రో…అనంటున్నారు. అవతల వ్యక్తి యేదో అన్నట్టుగుంది – సార్ ఇంగ్లీషు నుంచి తెలుగులోకి దిగి ‌– వొచ్చేది సీయెమ్మయ్యా. వెల్ కం బోర్డులు పెట్టాలా? వొద్దా? అనడుగుతావా? బుధ్దుందా నీకు? తుఫానుతో పాటూ సీయెం – అని బేనర్ పెట్టు. స్వాగతం…సుస్వాగతం పెద్ద బేనర్ లు దోవ పొడుగునా … రకరకాల ఫోజుల్లో సీయెం ఫోటోలు పెట్టు. రాగానే ఫ్రెష్ అప్ అవడానికి గెస్ట్ హౌస్ డెకరేట్ చేయించి ఉంచు. వాట్ ? కరెంట్ లేదా? స్తంభాలు పడిపోయాయా? అయితే? సో వాట్ ? వచ్చెడి వాడు ఫల్గుణుడు..! జెనరేటర్లు పెట్టించు. యేసీలు పనిచేయాల. అండర్ స్టాండ్? తుఫాన్ ప్రాంతం సమస్యలు తర్వాతయ్యా…తుఫాన్ కాదు ఫల్గుణుడు మన తిత్తి తీసీగలడు,అతనికి యే ఇబ్బందీ లేకుండా చూడు. ఓకే? యెస్. ఐ విల్ బి దేర్ యెట్ లంచ్ టైం…   తింటా…నో అబ్జెక్షన్…నాన్ వెజ్ కెన్ డూ…

ఈలోగా జంగమయ్య వచ్చేసాడు. జంగమయ్య తలూపేడు. డ్రైవర్ కార్ ఊపేడు. కారు పట్నం దాటింది. సార్ ఫోన్ మాటాడుతూనే వున్నారు. ఇంగ్లీషూ, తెలుగూ భాషల్లో యెపుడేది సూటబుల్లో అది మాటాడుతున్నారు. కారు జాతీయ రహదారి నుంచి తీరప్రాంతం వేపు మలుపు తిరిగింది. రోడ్డు బాగాలేదు. తుఫాను తర్వాత కాదు ముందరే కాంట్రాక్టర్కి  బిల్ అందిన ఆరో వారానికే రాళ్ళూ, తారూ విడాకులు తీసుకొని వేరయిపోయాయి. గంతలూ, గోతులూ కాపురాలు పెట్టాయి. జాగ్రత్తగా నడుపుతున్నాడు డ్రయివర్. జంగమయ్య రోడ్డుకిరువేపులా చూస్తున్నాడు.

మనుషులు పగబడితే, దాడికి దిగితే… ప్రత్యర్ధుల ధనమాన ప్రాణాలే పోతాయి. ప్రకృతి దాడికి దిగితే – ధనమాన ప్రాణాలే కాదు సమస్త జీవరాశీ, సమస్త పరిసరాలూ నాశనమయిపోతాయి. రోడ్లకిరువేపులా అశోకుడు చెట్లు నాటించెను…(పుస్తకాలలో చదివితిమి) తితిలీ తుఫాను రోడ్లకిరువేపులే కాదు కనుచూపు మేర …కొబ్బరి, అరటి, మునగ, జీడి, పనస మామిడి సకల చెట్లనూ తోటలనూ పెకలించెను. (పత్రికలు ఇలానే రాయును) ఆకుపచ్చ ఉద్దాన తీరమంతా కాటిదిబ్బ లాగయిపోయింది. (యెలగ బతకతారు ? యేటి దిక్కు? అని మనిసన్న వాడు గుండె కొట్టుకుంటాడు)

కారు యేదో ఊరు మీదుగా పోతోంది. కారు స్లో చేసేడు డ్రయివర్. రోడ్డుకిరువేపులా ఇళ్ళ పైకప్పులు లేవు…యెగిరి ఊరవతల పడ్డాయి. వీధుల్లోని విద్యుత్ స్తంభాలు నడుముకి వొంగిపోయి నేలను చూస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఊరి జనాలు గుండెలు బాదుకు యేడుస్తున్నారు. పిల్లలు బిక్కుబిక్కుమని నిల్చున్నారు. మోరలెత్తి కుక్కలెవరినో దూషిస్తున్నాయి. పైకప్పుల్లేని సాలల్లో మేకలూ, పశులూ రాటల చుట్టూ గింగిర్లు కొడుతున్నాయి. కట్టు తెంపుకున్న ఆవుదూడ ఒకటి నాలుక్కాళ్ళెత్తి పరిగెత్తి…కారుకి అడ్డ మొచ్చింది. కారు ఆగింది.

సెల్ మోత ఆగింది.  కారెందుకాపేవు? పోనీయ్. పోనీ – అన్నారు సార్. డ్రయివర్ – కారుముందరి ఆవుదూడని చూపేడు.

ఆగిన కారు దగ్గరకి ఆర్తిగా పిడికిట్లో గుండెల్ని పట్టుకు దుఖించే జనం వచ్చేరు. సార్ కారు దిగలేదు. జంగమయ్య దిగినాడు. జనం దండాలు పెట్టారు. జంగమయ్య ఆ దండాల్ని కారు లోపలి సారుకెట్టాలి, నాకు గాదు. నీను బంట్రోతుని…ఇదిగో బిళ్ళ అని బిళ్ళ చూపేడు.

జనం కారు లోపలికి దండాలు పెట్టారు. సార్ చిరాకు పడ్డారు. రేప్రొద్దున్నకు సీయెం వచ్చేస్తాడు. యేర్పాట్లు యేమి లోటు జరిగినా… తితిలీ వల్ల ఈ జెనాలకి జరిగిన మొత్తం నష్టం కంటే యెక్కువ నష్టం తనకి సీయెం వలన జరిగిపోద్ది…

నిన్న ఇలాగ తుఫాను వార్తలొస్తున్నాయి, పేషీ నుంచి ఫోన్- అర్జెంట్ గా వెళిపోయి, సీయెం విజిట్ కి యేర్పాట్లు చూడమని ఆర్డర్. అర్జెంట్ గా బయల్దేరా. బట్..ఫ్లయిట్ దొరకాలా? ఆ తర్వాత ఫ్లయిట్ దిగి కారు పట్టుకొని రావాలా? ఈ వెనకబడ్డ యేరియాకి నూటా యాభయ్ కిలోమీటర్ల అవతల విమానాశ్రయం ఉండిపోయింది. కొత్త విమానాశ్రయాలు వొద్దంటారీ ప్రజలు. కొత్త పరిశ్రమలు  వొద్దంటారు. ఈ తోటలు, ఈ పంటలూ, ఈ ఇళ్ళూ, వాకిళ్ళూ పోతాయట? ఇపుడు -పోలేదా? ఉండిపోయాయా? ఉండవ్. ఈ తోటలుండవ్.ఈ పంటలుండవ్.ఈ ఇళ్ళూ,వాకిళ్ళేవీ ఉండవ్. కంపెనీల్ని అడ్డేయడం కాదు… తుఫాన్ని అడ్డారా? కంపెనీల్ని కూడా అడ్డలేరు. మీరు దేన్నీ అడ్డలేరు…ముందుముందున్నాయి ముసళ్ళ పండగలు… చిరాకు చిరాకుగ ఆలోచనలు కదుల్తున్నాయి.

సార్ కి సిరాకు మారాకు వేసింది. సీట్లో సిరాగ్గా అటూ ఇటూ కదిలేరు. సెల్ ఫోన్ ని టిక్ టిక్ నొక్కేరు. కారులో నుంచి బయటికి జంగమయ్య వేపు సిటపట చూసేరు. జంగమయ్య సార్ వేపు చూడడం లేదు, జనంతో మాటాడతండు – తుఫాను తుడుసుకు పోయినట్లుందే. యేమీ మిగిల్సినట్లా లేదే. ఇట్లా ముంచుకొస్తది సుమా అని ముందుగాల యెవురూ యెచ్చరించినట్లా లేదే…అని క్రిష్ణాజిల్లా పేద గొంతుతో  దీర్ఘాలు తీసి విచారించుతున్నాడు!

అగపడతంది కాదా…యెలాగ తుడిస్సిందో? యేటి మిగిల్సిందో? మ్రుత్యు దేవత ముందగాల సెప్పతాదేటి – అని ప్రశ్నించేడు కళింగ పేద గొంతుతో  మునకాల కడియాడు. మ్రుత్యుదేవత కాదు గవర్మెంట్ హెచ్చరించలేదా – అనడిగేడు జంగమయ్య. కడియాడు నోటిలో ఉమ్మిని ఊసి, గావంచాతో నోరు తుడుసుకొని- ఇంతక ముందర రోజుల్ల ఇళ్ళల్ల రేడియోలుండీవి. ఊరందరికీ ఇనబడినట్టగ పంచాయితీ రేడియో ఉండీది. ఇపుడవేవీ ఉన్నాయేటి? టీవీలు వొచ్చినాయి కావేటి? టీవీలు వోతావరణం బోగట్టాలు సెప్తాయేటి? సిలీమాలూ, సీరియల్లు బోగట్టాలు సెపతాయిగానీ? అదిగాక కరంటొకటి ఉండాలా?…ఉంతాదేటి…ఉండదు. ఇక యెలాగ యెచ్చరిస్తారెవుళేనా – అన్నాడు.

కడియాడు పక్కనున్న నెయ్యిల పండుగొప్పగాడు అంత విషాద వాతావరణం లోనా సన్నగా నవ్వేడు. పండుగొప్ప గాడి పేరు…దశకంఠుడు. పండుగొప్ప చేపలా తెల్లగా, దిబ్బ పెదవులూ, మొహంతో ఉంటాడని అందరూ పండుగొప్ప అని పిలుస్తారు. పండుగొప్ప నవ్వి, జంగమయ్యకి దగ్గరగా వొచ్చి – ఇంతక మునపటి రోజుల్ల రేడియోలేనా సెప్పీవని మా కలియాడు అంతండు గానీ యేటి సెప్పీవోళు వోతావరణ శేక వోళు…? వొస్తే రావొచ్చు… గాలీవోనా! పడితే పడొచ్చు పిడుగులు!! కురిస్తే కురొచ్చు…బారీ వోన!!! యెందుకేన మంచిది…సేపలోళు సముద్రం లోకీ, రైతులు పొలాలమీదకీ, కూలినాలోలు పనీ పాట్లుకీ యెళ్ళకండా ఇళ్ళలోన యెచ్చగా ఉండడం మంచిదని సెప్పీవోరు. వొస్తాదో? రాదో? కరాకండీగా సెప్పలేక పోయీవోళు. అదిగాక …మా పొయ్యిల్లోన పిల్లులు తొంగొంతాయి గాని  ఇళ్ళల్లోన యెచ్చగా తొంగొనే బతుకులా మాయి?  

పండుగొప్ప ఇంకా యేదో చెప్పబోతుంటే – కారు హారన్ మోగించేడు డ్రయివర్. బిళ్ళ సర్దుకొని డ్రయివర్ డోర్ దగ్గరకి వచ్చేడు జంగమయ్య. కోపగించిన కంఠంతో-    దున్నపోతా? మీటింగ్ పెట్టావా? ఆ పశివినీ, పశువుల్నీ కారుకి అడ్డంగా లేవమను. దోవ ఇమ్మను. సీయెం వస్తారు, వారికి యేర్పాట్లు చూడాలను. దోవకి అడ్డం లేవమను…దున్నపోతా – సార్ కేకలేసేరు. నేను దున్నపోతునయితే…నువ్వు యముడువా…అని మనసులో గొణుక్కొని యముని ఆగ్యను శిరసావహించేడు జంగమయ్య. కారు కదిలింది. +++ +++

“నాయినా, నువ్వాగు. నీకేటీ తెల్దు. ఈ రోజుల్లో లీడరెలగుండాల? ఊరంతా దీపాలారి పోయి సీకట్ల ఉంతే, నీ ఇంట్ల దేదీప్యంగా దివ్వలెలగాల. ఊరంతా ఉసూరుమని యేడస్తంతే నువ్వు ఉయ్యాల మీద ఊగతండాల. ఊరంతా బిక్కుబిక్కుమని సూస్తంతే … నువ్వు దిక్కులాగ ఆళ కళ్ళకి అగపడాల.

అలగగపడవు నువ్వు. బియ్యిం మూటలు, గుడ్డలు, మందూమాకులు… గవర్నమెంటో, యెవుళెవులో ఇస్తారు…అవన్నీ ఊరి మధ్యని పెట్టి పంపిణీ సేస్తావా?  ఆ యెంపీ గానీ మినిష్ర్ట్ గానీ గడ్డి పూస పంచలేదు, సీయెం యెనకాల, సిన బాబెనకాలా తిరగతండ్రు. యేది పంపిణీ సెయ్యాల, యెవుళికి పంపిణీ సెయ్యాల, యెంత పంపిణీ సెయ్యాల…లెక్కుంతాది. నీకు తెల్దు. యెళ్ళు…సీయెం యెనకాల నిలబడు. నీ కోడలు చూసుకుంతాది మిగతావన్నీ…” నాయినకు  పావుకోళ్ళు తెచ్చి అందించేడు కొడుకు. కోడలు వచ్చి పాదాలకు నమస్కరించింది. నాయిన ఇంట్లోమ్చి అడుగు బయటకు పెట్టాడు. ఇంటిముందర కారు డోర్ తీసి సిధ్దంగా ఉన్నాడు పేడాడ విష్ణు. నాయినకు కుడి భుజం..విష్ణు.  నాయిన , కుడిభుజం కూర్చున్నారు. కారు కదిలింది.

కిందటి యెలక్షన్ కి మీ నాయినకి బై పాస్ సర్జరీ సాయం చేసింది. ఈసారి కష్టం…గెలవడం సానా కష్టం. యేమంటావూ – వెళ్తోన్న కారు వేపు చూస్తూ అడిగింది – నాయిన కొడుకును యేదో ప్రణాళిక వేసిన కోడలు. నువ్వు లేవా? అన్నాడు నాయిన కొడుకు. నేను నీ భార్యనేనా? నీ నాయిన కోడలినేనా?  ఇది నా మెట్టినిళ్ళేనా?  

ఈమధ్య రోజులో పగటిపూట ఓసారీ, రాత్రి పూట ఓసారీ యీ ప్రశ్నలు వేస్తుందామె. నిన్ను పెళ్ళాడేను. నీకు పిల్లల్ని కన్నాను. ఇంకా నా పుట్టిన ప్రాంతం, నా కులం అడ్డు పెడతారేమండీ మీ ప్రాంతం వోళ్ళు? అడ్డు తొలగించాల- అని ముగిస్తుంది . +++ +++ “యెందుకు బయిల్దేరిపోయేరు? యెక్కడికి యెళ్తాం? సీయెం కాన్వాయ్ లో మిమ్మళ్ని రానివ్వద్దన్నరట – యెస్పీ చెప్పేడు. ఇపుడెక్కడికి యెళ్దాం?” అడిగింది కుడిభుజం.      నాయిన తల వాల్చి సుదీర్ఘంగా ఆలోచనల్లో మునిగేడు. ఇదే నేలలో యెన్నెన్నో ఉద్యమాలు నడిపిన తండ్రి గుర్తొచ్చేడు. జమీందారీలకి వ్యతిరేకంగా రైతాంగ  పోరాటాలు, స్వాతంత్రపోరాటం చివరి రోజులు…తండ్రి ఒక స్పూర్తి. నాయకుడుగా జేజేలు. చదువుపూర్తి చేసి తాను తండ్రి బాటలో నడవడం. తండ్రి చనిపోయాక నాయకుడు కావడం…

“ … తుఫానుకి తుడుసుకు పోయింది యేరియా. ఇలాటపుడు జెనాన్ని ఆదుకోకపోతే…యెలాగవోయ్ ?” ఆలోచనల్లోమ్చి తేరుకొని బదులిచ్చేడు నాయిన. కుడిభుజం ఆ మాటకు సన్నగా ఒక నవ్వు నవ్వి – “…యెలా ఆదుకోవాల? యెవుళ్ని ఆదుకోవాల? యెంత ఆదుకోవాల – అవన్నీ మీ నాయకుడు చూసుకుంటాడు. తుఫాను ఇలగెళ్ళింది, అలగ దిగిపోనాడు కదా. వొక్కడు దిగినాడా? మంత్రుల్ని దించినాడు. ఆఫీసర్లని దించినాడు. గవర్మెంటు మొత్తం తుఫాను సాయాన్నందిస్తాందన్నట్టిగ మీ నాయకుడు సూసుకుంతండు. జెనానికి ఆదుకోడమెలాగని బెంగ ఇంక మీకేల?”

“… ఔనువోయ్ నిజింగ జెనాలకి సాయిం అందినట్టగ సూస్తండా మా నాయకుడు? నిజిం సెప్పిమీ…”అనడిగేడు నాయిన. “.. కారు గెస్ట్ హౌస్ కి పోనీయిరా బమ్మిడీ..” చెప్పింది కుడిభుజం. నాయిన కోపంగా చూసేడు. “.. గెస్ట్ హవుస్ కి ఈ యేళప్పుడు యేల వోయ్?” అనడిగేడు నాయిన                                     “… ఈ యేళప్పుడు యెళ్ళి యేర్పాట్లన్నీ సేస్తే గానీ ఆ యేళకి వొచ్చీ వోళ్ళకి అమరాల్సినివి అమరవు. యెమ్మెల్యే ఇంటికి గాని, గెస్ట్ అవుసుగ్గాని తుఫానెళి పోయి నలభై గంటలైనా కరంట్ లేదు. జెనరేటర్ తోటి మేనేజ్ చేస్తన్నాం…”

“…జెనానికి జెనరేటర్లు లేవు కదరా? సీకట్ల ఉన్నారు కదరా?” నాయిన   “…ఆళకి అలవాటే లెండి…ఆకలీ, సీకటీ “ కుడిభుజం      “…యెవుళొస్తారు? ”   “…అవన్నీ సెప్తారేటండీ కోడలు గారు? మీరు నన్ను నమ్మినట్టగ కోడలమ్మ నమ్మరండీ నన్ను..” “…ఇంతకీ నువ్వు నా కుడిభుజానివేనా?” “… అలాంటి ప్రెశ్నిలెయ్యికండి. సమాధానం సెప్పడం కష్టిం. మీరు సుబ్బరంగ రెస్ట్ తీసుకోమ్డి. కోడలు పిల్ల మీద అన్నీ వొదిలీయండి. కిష్ణాజిల్లా పిల్ల! మీ కంటా బాగా నియోజికవొర్గాన్ని సూసుకుంతాది. రెస్ట్ తీసుకోమ్డి…” అని నాయినను కారు దించింది కుడిభుజం. +++ +++         సాయంత్రం లీడర్లందరూ గెస్ట్ హవుస్ చేరేరు. తుఫాను సహాయక చర్యల మీద సమీక్ష చేసేరు. ప్రతిపక్ష ఆరోపణలను యెలా తిప్పి కొట్టాలో నాయకుడు బోధించేడు. కూలిన చెట్లకు, పడిపోయిన ఇళ్ళకు, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు యెంతెంత సహాయం అందించాలో నాయకుడు ప్రకటించాడు. నష్టపరిహారం ఇవ్వడానికి విధివిధానాలు రూపొందించమని అధికార్లకు చెప్పేరు.      నిన్ననే విమానం లోనే డ్రాఫ్ట్ తయారుచేసాను సార్- అని డ్రాఫ్ట్ చూపేరు టక్ సర్దుకుంటూ ఆఫీసర్ సార్…జంగమయ్య దగ్గరి ఫైల్ తీసుకొని చూపిస్తూ.       

నాయిన ఒక మూల కూర్చున్నాడు. కోడలు వచ్చింది. నాయిన కాళ్ళకు దండం పెట్టింది. ఆ తర్వాత నాయకుడి కాళ్ళకు నమస్కరించింది. నాయకుడు ఆమె భుజాలను పట్టుకొని నిలబెట్టి – నియోజకవర్గాన్నీ, నాయిననూ చక్కగా చూడగల బంగారం – అని అందరికీ చూపించేరు.

నాయిన కళ్ళతో కుడిభుజం కోసం వెదుకుతున్నారు. కుడిభుజం హడావిడిలో ఉన్నాడు…ప్రెస్ పీపుల్తో.         +++            +++          ఆ పాఠశాల గేటు అటు ఒక ముక్కా, ఇటు ఒక ముక్కా విరిగి పోయింది. తరగతి గదుల పైకప్పులు విస్తరాకులు పెనుగాలికి యెగిరినట్టు యెగిరిపోయాయి యెక్కడికో. ఆవరణలోని కొబ్బరిచెట్లూ, అరటి మొక్కలూ, పూల మొక్కలూ…యెవరో కక్ష గట్టి నరికేస్తే తెగిపడినట్టు తలలు తెగి పడిపోయాయి. ఆ ఆవరణలో ఓ మూల వంటల యేర్పాట్లవుతున్నాయి. హెడ్మాస్టారూ, ఇద్దరు ఉపాధ్యాయులూ, సీయెస్సెఫ్ ఒకావిడా పర్యవేక్షిస్తున్నారు. వరండాలో ఆకలి కడుపుల  ఆ వూరి జెనం వంటల వేపు చూస్తున్నారు. తుఫాను వొచ్చిన మర్నాటి నుంచీ ఆ పాఠశాల ఆ జనానికి ఇంత కూడు పెడుతోమ్ది. కొందరు విద్యార్ధులు – పాఠశాల ఆవరణ అంతా ఒక వరసలో రకరకాల మొక్కలు నాటేరు. నీళ్ళు పోసేరు. నిన్నటి కూలిన తోటని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం అది! అప్పటిదాకా తాము చేసిన పనిని త్రుప్తిగా చూసి,హెడ్మాష్టర్ గారికి చూపించి సెభాష్ అనిపించుకోవాలని హెడ్మాష్ట ర్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. మాష్టారికి ఆశ్చర్యం, ఆనందం! అభినందనగా పిల్లల్ని హత్తుకున్నారు. అలా వార్ని వరండాలో ఆకలిగా, దిగులుగా కూచున్న జనాల వద్దకు నడిపించేరు. జనాలతో – చూసారా, మా విద్యార్ధులు యేమ్ చేసారో? కూలిన తోటల్ని మళ్ళీ నిలబెట్టడానికి మొక్కలు నాటేరు. కూలిపోయాయని యేడుస్తూ కూచోలేదు. రేపటి కోసం మొలకలు వేసారు. మనుషులు ఆశలను యెప్పటికప్పుడు మొలకలెత్తించుకోవాల… చెప్తున్నారు.       

సరిగ్గా ఆ వేళకు ఆ పాఠశాల ఆవరణలోకి కారు వచ్చి ఆగింది. జంగమయ్య గభాల్న దిగి ‌- ఈ స్కూల్ హెడ్మాస్టారెవురూ? కమీషనర్ సారొచ్చేరని… యెదురు పడిన యెవర్నో అడిగేడు. యెదురుపడిన ఆయన – కారునీ, కమీషనరునీ అనుమానంగా చూసి ‌– అల్లక్కడ వొంటలొండిస్తండు సూడు, అతగానే యెడ్మాస్ట్రు. యేమీ…కమీషనరికి కూడు కావాలా? అని ప్రశ్నించేడు. జంగమయ్య భయపడి పోయేడు…సార్ విన్నారేమోనని. సార్ వినలేదు. కారూ దిగలేదు.

కమీషనర్ సార్ స్కూల్ వేపు విజిట్ కి వెళ్తున్నారని, నాయినను తీసుకొని వెళ్ళమని కోడలమ్మ కబురు తోలడంతో పేడాడ విష్ణు కూడా నాయినను తీసుకొని కారులో దిగబడ్డాడు అప్పుడే.

జంగమయ్య వంటల దగ్గరకు నడిచేడు. వంటల వాళ్ళు వరండా వేపు చూపేరు. వరండాలో జనం మధ్య నున్న హెడ్మాష్టర్ని సారొచ్చేరని పిలిచేడు. హెడ్మాష్టారు గభాల్న విద్యార్ధుల్ని తోడు తీసుకొని కమీషనర్ని కలిసారు. జంగమయ్య డోర్ తీస్తే, సార్ కారు దిగేరు. కళ్ళతో ఆవరణంతా తణిఖీ చేసారు. దుమ్మూ, ధూళీ, చెత్తాచెదారం కనిపించింది-       

“..హెడ్మాష్టర్…వాటీజ్ దిస్. ఇలాగే స్కూల్ ఉంచుతావా? స్వచ్చ్ భారత్… ఇదేనా?ఇలా ఉంటే జబ్బులు రావా?ఈ పరిసరాలే కారణమయ్యా తుఫాన్లకి..” అని ఇంగ్లీషూ, తెలుగూ భాషల్లో కోపగించేరు. ఆ మాటలు విన్న విద్యార్ధుల్లో ఒక విద్యార్ధి – చెట్లను పెంచక పోవడం, పెంచిన చెట్లను నరికేయడం వలన తుఫానులొస్తాయి సార్. మా పాఠం లో ఉంది. తీరం ఒడ్డు పొడుగునా పెద్దపెద్ద వ్రుక్షాలు దట్టంగా పెంచితే సముద్రమ్మీది తుఫాను ప్రమాదాన్ని ఆ వ్రుక్షాలు అడ్డుకుంటాయి.

అందుకే అదిగో మేము చాలా మొక్కల్ని మళ్ళా పెంచుతున్నాం…రండి చూద్దురు…”అని వాళ్ళు నాటిన మొలకల వేపు నడిపించేరు. నాయిన కూడా ముచ్చటగా ఆ విద్యార్ధులను చూస్తూ వాళ్ళ వెనక నడిచేడు.

పాఠ్య పుస్తకాలలోని తుఫాన్ నివారణ పాఠాన్ని – ఇటువంటి అధికార్ల కూ, రాజకీయ నేతలకూ మళ్ళీమళ్ళీ బోధించాలన్పించింది ఆ హెడ్మాష్టర్ కి.

***

అట్టాడ అప్పల్నాయుడు

16 comments

 • అక్షరంఅక్షరము వాస్తవం అప్పలనాయుడు గారు మీ కధ బాగుంది అధికారుల పనితీరు , పాలకుల ప్రచార యావ అన్ని కలిసిపోతాయి వాళ్లకి సామాన్యుల కడగండ్లు పట్టవు , వాళ్ళు తుపానులని జయిస్తారు , కరువుని తరిమేస్తారు కాని కన్నీళ్లు మాత్రం కనపడవు

 • పెద్దలికీ, పెద్ద పెద్దో ల్లికీ శానాబాగా పాటం సెప్పీసినాదంది ఈ కత. రచీ తకి దండా లండి.

 • చేతులు కాలాక ఆకులు పట్టే
  ఘటాలు మన నేతలు. బెపొక
  దగ్గర బెడ్డొక దగ్గర పుణికి
  పుచ్చుకుంటారు.అందుకే అసలు
  కార్యం నెరవేర్చలేక ఆపద కలిగాక
  నానా తంటాలు పడతారు.కథలో ఒక చిన్న విద్యార్ధి తుఫాను తీవ్రత
  ఎందుకు ఎక్కువయిందో సింపుల్
  గా చెప్పడం కథలో కొస మెరుపు.
  ఈ విషయం నాయకులకు
  తెలియదా? తెలుసు! కాని నిర్లిప్తత !
  ఆ నిర్లిప్తతను జయించినప్పుడే
  అన్ని రకాల తుఫాను తీవ్రతలు
  తగ్గగలవు.సందేశాత్మకమైన
  కథను అందించిన అట్టాడ గారికి
  అభినందనలు. కథ కాదండీ జీవితం.

 • బావూ…మీదైన శైలిలో సమయానుకూల స్పందన ఈ కథ

 • తి తి లీ . పెజల్ని దిక్కులేని పచ్చి ల్ని సెసింది.పెబువుల.పెచారాలకి…ఆళ్ళ ఎలెక్షన్ల ఓట్లకు పనికొచ్చింది…ఉద్దానం ఒక తరం జీవనానికి గండి కొట్టింది…నిజాలను నిర్భయంగా కథ లు చేయటం అప్పలనాయుడు గారికి కొట్టిన పిండి…ఉత్తరాంధ్ర సూరీడు అప్పలనాయుడు గారికి ధన్యవాదాలు

 • కథ అసంపూర్తిగా ఉన్నట్టనిపించింది.ధన్యవాదాలు

 • ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో అధికారులు, రాజకీయ నాయకులు ఎట్లా వ్యవహరిస్తారో కళ్లకు కట్టించారు. ఇంకా కథ ఉండాలే.. అనిపించింది.

 • వస్తు గాఢత, నిర్వహణా చాతుర్యం మీ సొత్తు. మంచి చదువరితనం ఉన్న వాక్యాలు గల కథ.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.