స్వప్నాక్షరాలు 

(శివలెంక రాజేశ్వరీ దేవి గురించి మరోసారి) 

పశ్చిమ క్రిష్ణా జిల్లా , కృష్ణా నది ఒడ్డున చారిత్రాత్మక గ్రామం జగ్గయ్యపేట, ఎక్కడా సాహిత్య వాసనలు అంతగా తగలని  అప్పటి మారుమూల గ్రామంఅద్భుతం ఎప్పుడూ అంతే తన పని తాను చాలా సాదాసీదాగా చేసుకుంటూ పోతుంది , సమయంలో ఎవరూ దాన్ని గ్రహించలేరు , అలాంటి గ్రహింపు కవిత్వంలో చాలా కాలానికి ఊరుకి కూడా వచ్చింది   గ్రహింపు కల్పించింది  కవి శివలెంక రాజేశ్వరీ దేవి. అద్భుతం ఒక కవితా సంకలనంసత్యం ఒద్దు స్వపమే కావాలి”

ఎందుకలా వర్షంలో తడుస్తావ్ఊరికనే“, ఎందుకలా పాట వింటావ్ఊరికనే“,  ఎందుకని టెలీఫోన్ మాట్లాడతావుఊరికనే” , ఎందుకలా కలల్ని పలవరిస్తావూఊరికనే” . అన్ని ఊరికనే అయినప్పుడు మరెందుకు ఇవన్ని చేస్తున్నావంటే సమధానం తెల్లని పసిపిల్లలా ఉన్న ఆమె  నవ్వు తెరలు తెరలుగా పరుచుకుని మన ముందుకు వస్తుంది. నిజమే ఈమెని ఊరికనే చదవలేం . గుండెల నిండా బోలేడంత  ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి , ఎదుటి మనిషిని అర్ధం చేసుకునే మనిషి తనం ఉండాలి . మనిషి తనం ఉండడం అనేది ప్రధానాంశం

ఎవరండీ ఈమె ఇలా అర్ధం కాకుండా రాస్తారు. అసలు కవిత్వానికి రీడబిలిటీ ఉండాలని వాదించే వారికి అంతర్లీన వాక్యాల మధ్య పాఠకుడు పట్టుబడే విషయం అర్ధంకాదుతెలుగు  వచన కవిత్వం అంతా వస్తువుల చుట్టూరా, పాత్రల చుట్టూరా  తిరుగుతూ ఉన్న కాలంలో, ఒక చిన్న నావలో తన సముద్రాన్ని ఈదుకుంటూ కవిత్వ ప్రయాణం  మొదలు పెట్టారు రాజేశ్వరీ దేవీ .

  ” చిక్కుపడిన  మస్తిష్కపు  ముడి వీడి  ఒఖ్ఖ వాక్యమైనా తెగడంలేదు 

ఇక అక్షరాన్ని అగ్ని స్నానం చేయించి కల్లోల నీలి తరంగాలుగా పట్టిన కవిత 

ఎన్నటికీ సమన్వయం కుదరని ఈక్వేషన్” .

మీరు ముందుగా అడుగుపెట్టాలనుకుంటే వాక్యన్ని తాళం చెవిలా చేసుకుని మొదలవ్వాలి. వాక్యాలు తెగవు  తరతరాల సాంప్రదాయపు పడి కట్టు పదాల ప్రవాహంలో పడి కాగితం మీద కవిత్వమై కొట్టుకుపోయి చివరకి సాగరంలోనో ఒక నీటి బిందువులా కలిసి పోవడం ఆమె నైజం కాదు . లోకం మొత్తం గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు తీరం వెంబడి నడుస్తూ రాలుతున్న లెక్కకు మించిన నక్షత్రాలని చెమటోడ్చి వెతుక్కుని తన సంచిలో వేసుకుని  సంపాదించుకున్న పదాలవి. సంక్లిష్టత అనేది తెచ్చి పెట్టుకుని రాస్తే , పాఠకుడు గందరగోళంలో పడతాడు. కవి తన పాండిత్యం అంతా తనమీద ఒలకబోస్తున్నాడనే భ్రమిస్తాడు. అర్ధంకాని పద ప్రయోగాలు, అసందర్భ సిమిలీలు, పదాల మధ్యన ఆకర్షణీయమైన గాంభీర్యత ఉండడం వలన కవిత్వం హంగు పెరుగుతుందే తప్పా దాని ఒరిజినాలిటీ పెరగదు. అలా ఒరిజినాలిటీ ఉన్న కవిత్వం పాఠకుడిని నిలబడనీయదుమళ్లా ఇక్కడ ఒరిజినాలిటీ అనే పదం చాలా కీలకమైనది, నిజానికి ఒక భావ పరంపరలో ఒక కవి తన భావాలన్నీ రాసుకుంటూ పోతున్నప్పుడు అందులో కనుక నిజాయితీ ఉంటే ఖచ్చితంగా పాఠకుడు కవిని వెంబడిస్తాడు, తనకి కావాల్సిన దాన్ని కవి దగ్గర నుంచి తీసుకుని తదనుభూతి పొందుతాడు. అది కవికి పాఠకుడికీ మధ్యన ఉండే ఒక కళాత్మక సంబంధం, దాన్ని చాల నేర్పుగా చేశారు రాజేశ్వరీ దేవి, ఆవిడ పడిన ప్రతీ బాధని మనమూ పలవరిస్తాం, మన నిస్సహాయత, ఒకానొక దిగులు భావం అన్నీ మన కళ్లముందు అలా పరచుకుని మనమూ అయ్యో ! ఇది నా కవిత్వమే కదా అని అందులో మునుగీత వేస్తో అక్కడే కాసేపు ఉండిపోతాం.       

మనకి కొన్ని సాంప్రదాయ కొలబద్దలుంటాయి అన్నింటిని వాటి పరిధిలోకి తెచ్చి వాటిని చాలా జనరలైజ్ చేసి మాట్లాడతాం. అలా చేయడం తప్పని మనకీ తెలుసు. అయినా  మనం మారం. వాటిలో ఆడపిల్లల అభిప్రాయం తెలుసుకోవడం వంటి పెద్ద పెద్ద అంశాలు కూడా ఉంటాయి .వాటిని మనం పెద్దగా పట్టించుకోం. ఎందుకలా విపరీతంగా మాట్లాడతావు  ఆడపిల్లవి కాస్త అణిగిమణిగి ఉండరాదూ అని తీర్మానం చేస్తాం. ఉంటే ఎట్లా అబ్బా మౌనంగా ఉంటే మనసెలా ఉండనిస్తుంది, గుండెల్లో గూడు కట్టుకున్న అక్షరాల పాల పుంత పగిలి కాంతి బయటకి రాకుండా ఒక గుప్పిట బంధిస్తామంటే ఎలా, అయినా శూన్యాన్ని మోయడం అంత సుళువేం కాదు, మనమొక్కళ్ళమే కాదు  మనలానే చాలా మంది మోస్తున్నారు, చాలామంది తమ తరపున వేరే వాళ్ల    శూన్యాన్ని మోస్తున్నారు, అలా మోయడం  ప్రేమ, అది సహానుభూతి , ఒకింత జాలి, ఎంత కవిత్వం కురుస్తుంది అప్పుడు , ఎంతటి లాలిత్యం పదాలనిండా పర్చుకుంటుంది, ఎలాంటి కవితాత్మక హృదయం ఉంటుంది అప్పుడు మనకి. అవును ఒక పదం నచ్చితేనో, ఆమెలాంటి వాక్యం మరొకటి కనబడితేనో, మనో ద్వారం తెరవబడినప్పుడో  ఆమె ఖాళీగా తన హాబీని వెతుక్కోలేదు. అర్ధరాత్రైనా ఆమె తన టెలీఫొన్ మీదుగా వారి దగ్గరకి చేరుకునేది ,మాటలన్ని కుమ్మరించేసి, మరలా తన స్థానంలో తాను రాసుకుంటూ ఉండేవారు. అయినా పలకరింపులో కూడ ఏదో తెలియని బంధం ఉంటుందని తెలిసిన వ్యక్తి ఆవిడ. అదే ఆమె కవిత్వం నిండా కనబడుతుంది

స్వేచ్ఛ కావాలి , ప్రేమ కావాలి 
రెండూ కళాత్మక స్వప్నాలు 
వాటి వెంట పడటమంటే 
ఎండమావుల వెంట పడటమే 
పెనుగాలికి బయటా ఊపిరాడదు 
ఉక్కపోతకు లోపలా ఊపిరాడదు 
రక్షణ మాత్రమే నీడ్ అఫ్ ది హావర్ “

కవిత్వం నిండా ఆవిడ మాట్లాడిన భావం అంతా ఈ సాదాసీదా చిన్న వాక్యాల్లో  పొదిగినట్టు అనిపిస్తుంది , సాంప్రదాయ స్త్రీ వాదనల్లోని కవిత్వం ఇక్కడ వినపడదు . స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరించే  ఒక కొత్త ప్రతిపాదనని ఆమె తెరపైకి తీసుకొచ్చారు , మానసిక సంఘర్షణలో ఒక మహిళ తనని తాను వెతుక్కునే క్రమంలో తనకి కావాల్సిన స్వేచ్చని , తాను పొందాల్సిన ప్రేమని తనకి కావాల్సిన చోట దొరకనప్పుడు తానే తనకి తానుగా కొన్నింటిని తీసుకుని ఒక స్థిత ప్రజ్ఞతతో ఉండడం అనే సాధారణ విషయం కాదు , బహుశా ఈ ఒక్క కోణమే మిగతా స్త్రీ వాద కవుల నుంచి రాజేశ్వరీ దేవిని వేరు చేస్తుంది , అంటే ఆమే సత్యాలకోసం వెంపర్లాడలేదు, అది తాత్కాలిక వ్యామొహం అని ఆమెకి తెలుసు. ఆ మోజు పోగానే మరలా తాను ఎక్కడ నిలబడ్డానో అక్కడికే  రావాలనీ తెలుసు. అందుకే కేవలం కలల్లోనే ఆమె తాను ఉండిపోవడానికి నిశ్చయించుకుంది , ఆ నిశ్చయమే ఆమె చేత సత్యం వద్దు స్వప్నమే కావాలి అని అనిపించి ఉండొచ్చు. కాదని మనమూ అనలేం. అవుననీ ఆవిడా చెప్పదు, కేవలం ఇదంతా ఒక చిత్కళ.

బహుశా ఆమె కవిత్వాన్ని చదివి కరుడు కట్టింది కనుక ఆ మాటల ప్రవాహం నుంచి బయట పడి తనని తాను నిభాయించుకుని బయటపడి పోయి  మనకిలా కవిత్వమై మిగిలి పొయారుకాబట్టే రాత్రుళ్ళు చాలా సుదీర్ఘమైనవి అన్నారు , చల్ల దనాన్ని పంచుతూనే లోపల్లోపల ఏదో తెలియని ఒక భావావేశం ఆమె కవిత్వం రగిలిస్తుంది . కవిత్వం చదువుతూ ఉన్నంత సేపు ఒక పాటో లేక ఒక శృతి చేయబడిన సంగీత పరికరమో మనతో కాసేపలా ఉండి మనల్ని స్వాంతన పరిచి వెళ్ళిన భావన కలుగుతుంది , అన్నింటా  ఎంత హృద్యత, ఎన్ని భావాలు , ఎన్ని కన్నీళ్లు తనలో తాను ఒంపుకుని ఎంత కవిత్వాన్ని మనకోసం పూయించారు అనిపిస్తుంది , ఎవరి దాకానో ఎందుకు అప్పుడప్పుడూ మనకే మన మనసు ఒక్కొసారి ఎంత భారంగా అనిపిస్తుంది , కాలం బహు భారంగా గడుస్తుంది కదా, ఎవరో హటాత్తుగా  ఊహల్ని పోగేసుకుని వచ్చి మన మీద దాడి చేసి పోతారు. మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతాం , స్వాంతన కోసం ఎక్కడో ఒక చోట ఆశ్రయం పొందుతాం , ఆమెకూడా ఆశ్రయం పొందారు , అక్షరాల్లో పొందారు , కవిత్వంలో పొందారు , ఎన్నొ రాత్రులలో అనెకానేక లాంతరు దీపాలని ముందేసుకుని కూర్చుని తనని తాను కుమ్మరించేసుకుని ఇలా కవిత్వమై వెలిగిపోతున్నారు , అంత భావం తనలో ఉంది కాబట్టే ఈకింది వాక్యాలు మాత్రం ఉదహరిస్తాను ఆమె తపన మొత్తం నాలుగు పాదాల్లో కనబడింది 

నా సుదీర్ఘ రాత్రి వలన నేను పగలు మెలకువగా ఉండలేను 

  రాత్రిని ఇవాళ వెన్నెల వెలిగిస్తోంది 

  వెలుగులో నేను వెలిగి పగటిని చీకటిని చేసి  

  నేను వెలవెలబోతాను 

  నా రాత్రి  సుదీర్ఘమైన రాత్రి 

  జాగరణ రాత్రి  స్నేహరాత్రి ,స్నిగ్ధ రాత్రి” 

మహా ఉద్వేగాన్ని తనలో పెట్టుకుని కాలానికి తన కవిత్వాన్ని కాపలాగా పెట్టారు . వాస్తవానికి మనకి ఉన్న జీవితానికి మనం అనుభవించే జీవితానికి మధ్యన అంతో ఇంతో వైరుధ్యం ఉంటుంది , అయితే వైరుధ్యం తాలుకా లక్షణాలు మనల్ని కనుక బాగా ప్రభావితం చేస్తే మనం సంఘర్షణలో , ఆశ్రయం పొందడానికి యత్నిస్తాం. ఇలా మనలో రెండు భావనలు యుద్దం చేస్తున్న సమయంలో రెండు గొంతుకల్ని కాగితం మీద ఒలికించడం గొంతుక కవిత్వం అయితే , దుఖము తాను కూడా అనుభవిస్తూ ఉంటే ఎవరి పూడిక వారే తీసుకోవాలని ఒక  స్వానుభవ వాక్యాన్ని రాసుకున్న కవి ఈమెసుదీర్ఘ వ్యధాభరితమైన వాక్యాల్ని , కవిత్వాన్ని రాసుకున్న ఈమె ఎందుకు సత్యా న్ని వద్దన్నారో అనే మీమాంశ కలుగక మానదు, సత్యం పైకి  కనబడేంత  మృదువైనదేం కాదు దాని వెనక కావల్సినన్ని లోతులూ, కన్నీటి చారికలు, మాట ఇవ్వడాలు , ఇచ్చినమాట తప్పడాలు, ఇలా ఒకటేమిటీ పైకి కనబడే సత్యం వెనక అంతా గాయాల పలవరింతలు , గాయాలకి లేపనం రాస్తూ సత్యాన్ని నిజం అని భ్రమలో ఆవిడ బతకదలుచుకోలేదు, తన జీవితంలో దోసిలి ఒగ్గి స్నేహ హస్తం చాచినప్పుడల్లా ఆమె సత్యం నిజ స్వరూపం చూశారు కాబట్టే స్వప్నంలోనే ఉండాలని ఆశించారు, బతికిన రోజులన్నీ మాట కోసం పరితపించారుచాలమంది విసుక్కున్నారు, ఫోన్ లు కట్ చేశారు , నస భరింపలేమని భ్రమలో బతికారు , మాట్లాడితే ఎక్కడ బరువైన బంధాలలోకి మారాల్సి వస్తుందో అని తెగ హడావిడి పడ్డారు , కాని ఆమే తన బాధనంతా కవిత్వంలో ఒంపుకుందని వారికి తెలియలేదు తాను ఉన్నప్పుడే ఒక సంకలనంగా తీసుకువస్తే బాగుంటుందని మిత్రుల ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారు , బహుశా రాయబడిన ప్రతీ మాటమీద తనకున్న అమితమైన మమకారాన్ని ఒకే పొత్తంలా చూసుకోవడం ఆమెకి నచ్చి ఉండకపోవచ్చు , నా బాధ ప్రపంచపు బాధ అవుతుందా అనే భావనా  ఆవిడకి అనిపించి ఉండి ఉండవచ్చు .

ఒంటరిగా బతకడం హాబీగా మారుతున్న రోజుల్లో తానెప్పుడో జీవితాన్ని హాయిగా గడిపానని రుజువులతో సహా చూపించారు. పొరబాటున అర్ధరాత్రో మీ ఇంటి తలుపు చప్పుడైతేనో, మీ ఫోన్ మోగితెనో, తెలతెలవారుతుండగానే మీ ఇంటి ముందుకు ఒక అపరిచిత వ్యక్తి కవిత్వమై వస్తే  ఆ వచ్చింది ఆమే అని చాలామందిలా  బెంగపడిపోకండీ……..ఆమే లోకమనే సత్యాన్ని వదిలి తనదైన స్వప్నంలోకి చేరుకుని చాలా కాలమైందికాలం తన చిరునామాని మన  దగ్గర వదిలేసి పోయింది ….. రాత్రి చాలా సుదీర్ఘమైనది….ఆమెకు మాత్రమే కాదు మనకి కూడా. 

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

8 comments

 • ఈ చిక్కుపడిన మస్తిష్కపు ముడి వీడి ఒక్క వాక్యమైనా తెగడంలేదు…నిజమే‌ఈ వాక్యమేమీ ఊరకనే అనలేదు రాజేశ్వరి గారు…తనలోని బాధనెంతగా కవిత్వంలోకి ఒంపుకుందో అవగతమవుతుంది…
  ఊరనకే కవిత్వాన్ని చదవటం కాదు ఆ భావాల లోతులను పసిగట్టి పొందుపరచడం అభినందనీయం
  మీ సమీక్ష చాలా బాగుంది అనిల్ గారు

 • మనసుతో చదివారు..మీకావిడ అర్థమయ్యారు. కొన్ని కవిత్వాలని ఏ తూనికరాళ్ళతోనూ కొలవకూడదని నమ్ముతాను, వ్రాయడంలో కొందరు కవులకుండే ఆశలు వేరు. చదవడంలో మనం పొందే అనుభవాలు, పాఠాలు వేరు.

  రాజేశ్వరీదేవి కవిత్వాన్ని ఇంకా ముందు చదివి ఉంటే ఎలా ఉండేదో నాకు తెలీదు, కానీ ఆ పుస్తకమూ అందులో లేఖలూ, ఆ కవిత్వమూ, ఆవిడ మరి లేరన్న వార్తతో కలిపి చదవడం చిత్రమైన బాధని మిగిల్చింది నాకు. ఆ లేఖలు లేకుండా ఉంటే బాగుండనిపిస్తుందొక్కోసారి. కానీ బహుశా ఉండాలేమో అని కూడా నేనే సరిపెట్టుకుంటాను.

  లోకం మీదా, కవిత్వం మీదా రాజేశ్వరి పెంచుకున్న నమ్మకం చూస్తే..కొంచం అట్లాంటి మనిషినీ, అట్లాంటి కవినీ, నాలో మిగుల్చుకోవాలన్న తపన కలుగుతూ ఉంటుంది.

  మీ మాటలు బాగున్నాయండీ..చాలా సంతోషాన్ని కలిగించాయి. థాంక్యూ.

  • మీలాంటి వారు రాసిన వ్యాసాలూ కూడా చదివాను , అందరం ఒకే దారిలో ఉన్నాం అనిపించింది . కానీ అక్షరాలా నిండా ప్రేమ నింపుకున్న కవిత్వం ఇది , మీ అభినందనకి ధన్యవాదాలు

 • బాగుంది అనిల్. నువ్వు బాగా రాస్తావని నాకు తెలుసు. వచనాన్నీ కవిత్వాన్నీ కలగలిపకుండా మనమెప్పుడు రాయగలమంటావ్ ? సత్యంలోనా ? స్వప్నంలోనైనానా ?

  • ఇదిగో మీరు ఈ పక్షం వ్యాసం రాసినట్టే ఉంటది మరి

 • ఈ మధ్యనే ఈమెని చదివాను. బాధను మోసాను చాలారోజులు. మళ్ళీ స్వప్నం కూడా సత్యమే కదా అనుకుంటూ మీ సమీక్ష చదివాను. కవిత్వంలాగే వ్రాసారు. అభినందనలు డానీ..

 • చాలా మంచి పుస్తక పరిచయం చేసావు అనీల్..
  నిజానికి నేను చదువుతాను కానీ త్వరగా మర్చిపోతా..
  అయితే సత్యం వద్దు స్వప్నమే కావాలి చదివాక ఆవిడ పేరు మర్చిపోలేక పోయా.. ఆ అక్షరాల్ని కూడా… ఆమె రాసుకున్న వాక్యాలు మనల్ని మరచిపోనివ్వవు.
  మనమే అక్కడ ఉన్నామన్న అనుభూతిని పొందగలిగి
  గుండెల్లో తడి తగలక మానదు.. కనురెప్పలను ఆ తడి చేరకా మానదు.
  పనిగట్టుకు రాసినట్టుకాకుండా మనసుని తెచ్చి అక్కడ వొలకబోసినట్టుంటుంది.
  ఆ మనసు నాక్కూడా చెందినదే అనిపిస్తుంది.
  నేను చాలా ఇష్టపడి చదివిన ఓ మనసు కవిత్వం అది.
  ఆ పుస్తకం గురించి మీ వ్యాసం మరలా గుండె గదిలో తిరగదోడమని చెప్తూ ఉంది.
  అభినందనలు అనీల్ 💐 💐 ఈ మనసు పరిమళాన్ని అందరికీ చేర్చినందుకు ధన్యవాదాలు 💐💐

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.