లెక్క తప్పింది!

వాడు పెగ్గు తర్వాత పెగ్గు తాగుతాడు
తాగి ఊయలలూగుతాడు
ఊగి నేలపై పొర్లుతాడు
వాడికి పగలూ రాత్రీ తేడా లేదు
ఆమెకు మనసు మనసులో ఉండదు
ఫోన్ చేస్తుంది
మాట్లాడేది వాడు కాదు
వాడి ఆనుపానులు ఎవరో చెబుతారు
ఆమె బలవంతాన అలల్ని కంట్లోనే నిలిపి
అతడి కోసం వెళ్తుంది
అతడు స్పృహతెలీకుండా పడివుంటాడు
ఉచ్చతో ప్యాంటు తడిసి మట్టి అంటి
అసహ్యంగా వాసనేస్తుంటాడు
స్పృహలో లేని అతడ్ని
అతి కష్టమ్మీద లేపుతుంది
అతడి చేయి తన భుజమ్మీద వేసుకొని
అతడి నడుంచుట్టూ చేయివేసి
నవ్వుతున్న ఎన్నో చూపుల్ని
సానుభూతి చూపుతున్న ఇంకెన్నో ముఖాల్ని
తప్పించుకోడానికి గబగబా అడుగులేస్తుంది
ఆమె చేతుల్లో బలం తక్కువ
అతడి బరువును మోయడం వాటికి మహా కష్టం
పంటి బిగువున బాధని నొక్కిపెట్టి
ప్రేమించిన పాపానికి అతడిని మోస్తుంది
ఒళ్లు గుల్ల చేసుకొని అతడిని కొడుకల్లే సాకుతుంది
అతడు ఆమె బలహీనత
ఆమె అతడి బలం
తాగొచ్చిన ప్రతిసారీ
అతడికి ఆమె గొడ్డులా కనిపిస్తుంటుంది
ఇకనైనా తన జీవితాన్ని తన చేతుల్లోకి
తీసుకోవాలని అడుగెయ్యబోతుంది
తాగి తాగి అలసిసొలసిన అతడి మొహంలో
ఏం కనిపిస్తుందో
అడుగు ఆగిపోతుంది
రేపటికి మళ్లీ అదే సన్నివేశం కోసం
ఈ రాత్రికి నిద్రపోకుండా కళ్లు కాయలు చేసుకుంటుంది
జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది
లెక్క ఎక్కడో తప్పుతున్నట్లు ఉంటుంది

యజ్ఞమూర్తి బుద్ధి

స్వస్థలం ప్రకాశం జిల్లాలోని వేటపాలెం గ్రామం. సాహిత్యంపై అనురక్తి కలగడానికి అక్కడి ప్రఖ్యాత లైబ్రరీ సారస్వత నికేతనం ప్రధాన కారణం. 1996 నుంచి హైదరాబాద్ లో నివాసం. అరవై మించి కథలు ప్రచురితమయ్యాయి. అడపాదడపా కవిత్వమూ రాస్తుంటారు. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో పనిచేసి, ప్రస్తుతం మనం దినపత్రిక ఆదివారం అనుబంధం 'మకుటం' ఇన్చార్జిగా అసిస్టెంట్ ఎడిటర్ హోదాలో ఉన్నారు.

23 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.