ధిక్కార ‘నాగ’ స్వరం! 

కొన్ని మార్చలేమండి, ఇప్పటివా  ఆచారాలు వ్యవహారాలు , పెద్దవాళ్లు ఏదీ ఊరికనే పెట్టలేదండీ, అన్నింటికి కొన్ని హద్దులుండాలి , మనుషుల్లో కూడా కొన్ని రకాల వారిని దూరం పెట్టాలి, మనం జన్మతహా చాలా పెద్ద పెద్ద వంశాలలో పుట్టాం అని ఇప్పటికీ బోర విరుచుకు తిరిగే మనుషులున్నారు , రక్తం కావాలంటే వాళ్ల కులం వాళ్లదే కావాలని అడిగి మరీ ఎక్కించుకునే విద్యావంతులున్నారు. స్వాతంత్ర్యమూ దానివెనకనే రాజ్యాంగమూ వచ్చి దాదాపు ఎనభైఏళ్లు అవుతున్నా ఎక్కడ దేశపు చూపులో తేడా మాత్రం మిగిలే ఉంది .

నాగప్పగారి సుందర రాజు

వేదాలు మనుషులను నాలుగు వర్ణాలుగా విభజిస్తే , అధికారం మరో వర్ణాన్ని తయారు చేసింది, రంగు లని అడ్డంపెట్టి ఒక బలమైన చేయి వేసి నొక్కి పెట్టి మళ్లా లేవకుండా కొన్ని తరాలని తొక్కి పెట్టింది. అది మరీ మరి ముదిరిపోయి ఇప్పటికి వదలని  ఒక జాడ్యంగా పరిఢవిల్లుతూ ఉంది. ఎక్కడికెళ్ళినా అప్ప్లికేషన్ పూర్తి చేసినా ఎక్కడ చూసినా అదే గోల మీరెంటీ …..? ఇదొక వేల టన్నుల బరువున్న ప్రశ్న , నేనెవరైతే వీళ్లకేంటి  వాళ్లలాగే ఉన్నాను కదా రెండు కాళ్ళు , రెండు చేతులూ, అలాగే మాట్లాడే నోరు వాళ్లకన్నా ఎక్కువ ఆలొచనా పరిధి అయినా సరే నువ్వేంటి  అనేది ఒక సార్వజనీన ప్రశ్న. సమాధానం చెప్పాక ముడ్చుకున్న  నొసలు మరలా ఎప్పటికోగాని వదులవ్వదు. ఇలాంటి మనుషులని తన రచనా ధిక్కారంతో ఎండగట్టిన కవి, దళిత ధిక్కార కవి నాగప్పగారి సుందర్రాజు. ఆయన రాసిన సంపుటిచండాల చాటింపు’

అసలే ఉండేది ఊరు చివర, అన్నిటిలోనూ చివరే. చివరికి బోరింగు పంపు దగ్గర కూడా చివరే. అందరూ నీళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయాక అప్పుడు బోరింగు దగ్గర నీళ్లు కొట్టుకుని పోవాలి. లేకపోతే ఊరు మైలపడుతుంది. కాని దాహం తీరాలి కదా మరి అందుకని అందరూ బోరింగు దగ్గరే దాహం తీర్చుకోవాలి. ఇలాంటివి సామాజిక సమస్యలు దాన్నే ఒక మహిళకి ఆపాదిస్తూ రాసిన కవిత దాహం తీరుస్తుంది మనకి , అసలు దాహం అనేది ఎవరికి ,ఎందుకు, ఎవరు ఎలా వాడుకోబడుతున్నారో అని కవిత వివరిస్తుంది , పచ్చి నిజాల పలవరింతలన్నీ మాండలికంలోకి మార్చి రాసారు

మాదిగోళ్ళ బోరింగుని మాములుగానే వాడుకుంటున్నారు /

ప్రేమకై  తపించాను / పెళ్ళికి సిద్దపడ్డాను/ ఊర్లోవాడు ఎవడు చేసుకున్నా …?

/ మీ మాటకి మర్యాద ఉండేది / పెద్దింటిదానా ! నిన్నెవడు చేసుకుంటాడే …?

అని బ్యాగారోడు అన్నప్పుడు  /బతకరాదు అనుకున్నా / అప్పటికి కాని నాకు అర్ధంకాలేదు /

దేశంలో నేను మనిషిని కానని .” ఇది కత కాదు ఎన్నాళ్ళ నుంచో తరమబడుతున్న ప్రజల వ్యధ .మామూలుగానే వ్యవస్థలో ఒక గౌరవం ఉండదు అందునా ఆడవారిని మరీ మరో రకంగా , అందునా కూలి పనులకి వెళ్లే స్త్రీలని కేవలం అదే దృష్టితో చూడడం అనేది అనేకానేక  ఏళ్ళుగా వస్తున్న దురాచారం , అలాగే కాస్త కంటికి నదురుగా కనబడిన స్త్రీలని మాతంగులుగా మార్చి వారిని ఊరి ఉమ్మడి భార్యలుగా  చేసి ఊరెగించిన ఘనతా మనకి ఎలాగో ఉండనే ఉంది , అదిగో లాంటి ఒక స్త్రీ వ్యధ కవిత .

సామూహిక మానభంగాలు రోజున దిన పత్రికల్లో కొత్తగా ఏమి చూడడం లేదు తరానికి కొత్తగాని పాత తరానికి మామూలే , సమాచార విప్లవం ఇంకా పురుడు పోసుకోని ఆరోజుల్లో పల్లెల్లో , పొలిమెరల్లో దొరికిన శవాల పంచనామాల రిపొర్ట్లన్నీ ఎలా మాఫీ చెయబడ్డాయో కాలం నిటారుగా పెరిగిన తాడి చెట్లకే తెలుసు , అలాంటి ఒక దారుణాన్ని విని చలించిపొయీ రాసిన కవితలో పూర్తిగా తన ఆగ్రహాన్ని  బాదిత మహిళ కోణంలో రాస్తారునేను చెరచబడ్డ  దాన్నే ..!

/ నా మానం  పోయాక …../

మీ మంచి గురించి మాట్లడలేను /

సరే…! నేను తెగించిన దాన్నే ….చూస్కో/

గ్లోబుగదికి తాళం పెట్టి / గబ్బిలం తో “………….”స్తా

అని రాస్తారు . ఇది పూర్తి స్థాయి ఆగ్రహ ప్రకటన. అక్కడ జరిగిన అత్యాచారాన్ని ఆ సంఘటన లో  బహుశా ఆమెను  వేశ్యగా  చిత్రీకరించి, మానభంగం చేసిన అయిదుగురిలో ఇద్దరు  పోలీస్ కానిస్టేబుళ్ళు ఉంటే  ఇంక చట్టం  అక్కడ ఖచ్చితంగా కళ్ళు మూసుకునే ఉంటుంది , అలాగే ఉంది , ఎవరూ చెప్పకపొతే ఇలాంటి వ్యధాభరిత గాధలు మిగతా ప్రపంచానికి ఎలా తెలుస్తాయి. అదుకే ఇలా కలం పట్టాడు ఎవరేమనుకున్నా  కులం తక్కువని కీర్తించకపొయినా, దళిత దొరలు అవమానించినా చివరికి తన మనసు చెప్పిన దానివైపే మొగ్గుచూపాడు. దళిత సాహిత్యం లో తనకంటూ ఒక మార్గాన్ని వేసుకున్నారు

మనం ఇప్పుడు యునివర్సిటీల  దురాగతాల్ని రోహిత్ వేముల బలిదానం తో తెలుసుకున్నాం, కాని దానికన్నా వెనక ఇంకా ఎన్నో కధలు బయటకి రాకుండా  అక్కడే నాలుగు గోడల మధ్యనే ముగిసిపోయాయి , అలాంటి ఘటనే ఒకటి సుందర్రాజు జీవితంలోను జరిగింది , అలానే మరికొందమంది యువకుల విషయంలోనూ జరిగింది, కేవలం దళితుడు అనే నెపం తో యునివర్సిటీ నుంచి బయటకి పంపడం, ఇంటర్వ్యూలలో కావాలని తక్కువ మార్కులు వేసి అడ్మిషన్ రాకుండా చూడడం, దళిత సాహిత్యం మీద పీహెడీ చెయాలనుకున్న యువకులకి పేరుతో అంశాలని ఇవ్వకపోవడం వంటి పనులు గత ఇరవై ఏళ్లక్రితమే  చాలా మంది అనుభవించారు. మొట్టమొదటగా  నోరు విప్పి అక్షరాలలో అగ్రహాన్ని పట్టి పేల్చిన కవి నాగప్పగారి సుందర్రాజు. ఇప్పటికి కొంతమంది యువకులు   ఇంకా రిజర్వేషన్లు ఎందుకండి ఎప్పుడొ మా నానలు తాతల కాలం లో జరిగిన అవమానాలకీ , ఇప్పటికి ఆయా కుటుంబాలు ఇంకా లబ్ది పొందాలా అని వాదిస్తూనే ఉన్నాయి. అది నిజానికి వారి బుర్రలో రాజ్యం వేసిన విత్తనం., అది రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అలా పెరిగి పెరిగీ దాడులకి పురికొలుపుతూ ఉంది, అదే ప్రశ్న వాళ్లు ఇంత భూమి మా చేతుల్లో ఉంది కదా దాన్ని మరలా మనం తయారు చేయలేం కదా అది లేనివారికి మనం దాన్ని ఎందుకు కాస్తైనా పంచకూడదు అనే మాట రాదు. అంటే దీని వెనక ఎవరున్నారు అనే విషయం అర్ధ చేసుకొవచ్చు, దీన్ని కేవలం తరతరాల అణిచివేయబడిన  అంశంగా చూడాలే తప్పా పండక్కి కొత్తబట్టలేసుకున్నారని , వాడకి ఒకడు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నారని ఏడవడం సరికాదు , ఇదే తన మాటగా కూడా చెప్పాడు సుందర్రాజు .

కడుపు నిండిన వాడి కవిత్వం అంతా శిల్పాల చుట్టూ, ఆకులు అలముల చుట్టూ తిరుగాడుతూ  ఉంటది.  ఊర్వశి జఘనాల గురించిన ఊహలు, రంభోరుతలాల గురించిన వర్ణనలు ఉంటాయి. రాయొచ్చు అదేమి తప్పుకాదు.  కాని నాకూ రాయాలనే ఉంది కాని నా నాలుకకి పండిత భాష  రాదే, నేర్చుకుందామమంటే  చదువు చెప్పే నాధుడు లేడే, అయినా దినాము లేస్తే గొడ్డు కూరా రాగిసంగటి ఎండు తునకలు తినే నోటికి శుద్ద సంస్క్రుతం ఎలా అబ్బుతుంది , కాబట్తే నేను నా జీవ భాష రాస్తాను, నలిగిపోతున్న నా పల్లె మాట రాస్తాను, పోగులుగా కోయబడిన నా ఆదివారపు పొద్దుటి పూటని కవిత్వంలోకి ఒంపుతాను, నన్ను నన్నుగా చూడకుండా నిమ్నం అన్నారు కాబట్టే, నేను వలసొచ్చిన ఆర్యవాదులపైన నా కోపాన్ని చూపుతాను, నా డప్పు అనేకమమందిని మేల్కొలుపుతుంది ఇంకా అనేక మందిని శిక్షిస్తుంది  అని నిర్భయంగా చెప్పాడు సుందర్రాజునల్లొడికేక’ అనే కవితలో. ఎంత స్పష్టత, ఎక్కడా గిరిగీసుకున్న దాఖలాలు ఉండవు అంతా స్పష్టమైన రాత. కెరియర్ ఏమవుతుందో  నా జీవితం ఎక్కడ బుగ్గిపాలైపొతుందో అనే లోలోపల కుమిలిపోతలు ఎమీ లేని మధురంగా పాడిన కోయిల దళిత సాహిత్య విప్లవకారుడు .

వాస్తవానికి దళితులు దేశపు మూలనివాసులు  పెరియార్ రామస్వామి దగ్గరనుంచి రాహుల్ సాంక్రుత్యాన్ వరకు ఇదే విషయాన్ని ఎంత సూటిగా చెప్పినా, కొన్ని సంఘాలు, ఆధిపత్య కులాలు దాన్ని ఒప్పుకోలేదు , ఒప్పుకొకుండా చదువుని , వైద్యాన్ని , గృహాలని , ఇంకా అనేక నిత్య అవసరాలని కొన్ని వర్గ ప్రజలకి దూరం చేసిందనే వాస్తవం మెల్లి మెల్లిగా అందరకీ తెలిసినా దాన్ని మిగతా ప్రంపంచానికి తెలియజేయడంలో దళితకవులు సఫలీక్రుతం అయినంతగా మిగతా వారు కాలేదని చెప్పాలి. వారి కుల వృత్తులు వారికి దూరమైనపోయిన బాధ, వారి పని,ముట్లు వారికి దూరమై పోయిన బాధ, వాళ్లు పోగొట్టుకున్న  సామాజిక స్థాయిల గురించిన బాధని వారు నిక్కచ్చిగా రాసి పెట్టారు. అయితే ఇక్కడే మరొ సమస్య ఎదురైంది, అదే ఆధిపత్యపు పోరు.

మనం దళితులం సరేనబ్బా మళ్ళీ మనలో ఎవరు గొప్ప , నువ్వా నేనా , కులా పంచాయితీలో నీ కులం  కింద నాపేరు రాశారా నాకులం కింద నీపేరు రాసారా , ఇద్దరమూ అదే బుట్టలో ఉన్నా నేను నీకంటే కొంచం పైన ఉన్నా కాబట్టి నువ్వు నాకిందకి రా అనే సంస్కృతి దళితుల్లో కూడా వచ్చింది , నిజానికి ఇది మొదట్లో లేదు , కొన్ని వర్గాలు వీరిద్దరు కలిసి ఉంటే తమ భావజాలలకి గండి పడుతుందని భావించి మాల పల్లె లుగాను, మాదిగ వాడలుగాను విభజించి అక్కడ మనసుల్లో కూడా ఒక విభజన విత్తుని నాటారు. నాటినుంచి ఐక్యంగా ఉండాల్సిన అరుంధతి పుత్రులందరూ విడిపోయి ఎవడి గూడు వాళ్లు కట్టుకుంటే చూడలేకనేమీ, అరుంధతి ఆకాశంలో నక్షత్రమైపొయింది. అందుకే సుందర్రాజు ఇలా అన్నాడు మిత్రుడా

నీ నిజాయితీకిది ఫైనల్ వైవా /

మాదిగ జీవితం మరీ మరీ కనిపిస్తుంటే /

నిజంగానే మేము మోసపొయాం /

మాలలు మాకంటే పై వారని మరిచిపోయాం / .అంటూ తన ఆవేదనని  మొత్తాన్ని మాదిగ కూత అనే కవితలో రాస్తారు. ఇది నిజమా అబద్దమా అనే ప్రశ్న మనం వేసుకునే ముందు  మన ఊరిలో ఉండే పల్లెలోకో, వాడల్లోకో వెళ్ళి బాగా చదువుకున్న యువకులని అడిగితే ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తాయి. నిజం అనిపిస్తే ఏం చేయాలో మనకు తెలుసు. అబద్దం అనిపిస్తే ఎలా ఒకటిగా చేయాలో  ఆలొచించుకొవాలి. ఇప్పుడు మన మనసాక్షికి ఒక పెద్ద పరిక్ష. దిగులు చెందకండి ఇప్పుడు మీ నిర్ణయం ఎక్కడా బహిరంగంగా గోడలమీద చెప్పనక్కరలేదు. మన ఎదురుగా మనువున్నాడు వాడికి మనదెబ్బ చూపిస్తే చాలు అందుఏ ఒక చోటమనువాదమా మాకు తెలియకుండానే మమల్ని మనువాడావే” అని బిగ్గరగా రోధిస్తూ అడుగుతాడు తప్పిపోయిన దళిత కుమారుడు . `

తెల్లవాళ్ళు  ఒక పెద్ద పదాన్ని భారత దేశానికి ఇచ్చిపొయారు అదే దేశద్రోహం. ఆనాడు భగత్ సింగ్  ని ఉరితీసినా ఆ తరవాత అనేకమందిని జైళ్లలో పెట్టినా అదే మాటని వాడింది రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం . వాళ్లు వెళ్ళిపోయినా వాళ్ల తొత్తులు మాత్రం పదాన్ని వదల్లేదు. మా గీతల్లోనే నువ్వు బతకాలి లేకపొతే నువ్వు దేశద్రోహివే, ఆవుని జంతువుగా కాదు దేవతగా పూజించాలి లేకపొతే నువ్వు దేశద్రోహివే అంటూ ఒక కొత్త జాబితాని తయారు చేసి  దానికి మొక్కమంటే, యువకులు ఎలా ఊరుకుంటారు, తిరగబడ్తారు నా మీదా నా తిండి మీదా నీ పెత్తనం ఏంటని ఉరిమి ఉరిమి చూస్తారు , అది రాజ్యానికి నచ్చదు. అందుకే వాడి మీద దేశద్రోహి అనే ముద్ర వేస్తుంది, పత్రికలన్ని పతాక శీర్షికల్లో  దీన్ని రాస్తారు. దేశం ఫక్కున నవ్వుతుంది , అలా నవ్వి నవ్వి రోహిత్ వేములని పోగొట్టుకున్నాం, సునీతని చంపేసుకున్నాం. అదే కోవలోకి వస్తాడు సుందర్రాజు 1994 లో పీహెడీ  ఇంటర్వ్యూ లో ఒకానొక ఆచార్యుడు తనకివ్వబడిన అధికారంలో నుంచి, దాన్ని అతిక్రమించి మనవాడిని దేశద్రోహి అని తిట్టి అవమానించాడు, మనిషి లెకుండా పోవడం అంటే చనిపోవడం ఒకటే కాదు , ఇంకా చాలా చెయొచ్చు అతడిని మానసికంగా హింసకి గురిచేయవచ్చు రాజ్యానికి అది బాగా తెలుసు. ఎక్కడ ఎలా ఎవరిని రానివ్వకుండా చూడాలో ఎక్కడ వస్తే తమ చరిత్ర మరుగునపడి అసలుకే మోసం వస్తుందో అని ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు తన ఆయుధాన్ని తీసి పదును పెడుతూ ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పటికీలానే ఉండి ఉంటుంది, ఉంటూనే పోతుంది. ఎన్ని కలల ఉత్తరాలు రాసున్నా  మరలా ఈ దేశ దాస్య శృంఖలాలు నల్ల దొరల చేతిలోనుంచి పోయే వరకు ఒక మహాసంగ్రామం జరుగుతూనే ఉంటుంది

ఇతను ఒక మానసిక బలవంతుడు , తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎక్కడా వేడి తగ్గకుండా రాస్తాడు. తన పుట్టిన ఊరిని మరిచిపోకుండా అక్కడ మాండలికాన్ని  పట్టుకుని రాశాడు. అది చాలా గొప్ప మేలు చేసింది అతని కవిత్వానికి కధలకి. చాలా మంది దళత కవులు తిట్లని  చాలా మామూలుగా ప్రయొగించారు సరే అది వారి ఆవేదన అని వదిలేసినా, వారిలో కొంతమందిలో  తెచ్చి పెట్టుకున్న మాటలు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి , వంకతో కొంతమందిని తిట్టడమూ  మనం చూశాం. అయితే ఇక్కడ  అచ్చ తెలుగు కర్నూలు ఆదోని ప్రాంత  ప్రజలు మాట్లాడే భాషని చూస్తాం , యాస చదువుతున్నప్పుడల్లా మనం అక్కడే ఉన్నట్టు మనల్ని మనం మర్చిపోతాం. అది ఒక పెద్ద ఆస్థి గా మనం భావించాలి. అది ఎవరికి ఒంటబట్టని కవితా రహస్యం . ఇతను కేవలం కవితలు మాత్రమే కాదు చాలా చక్కని కధలూ రాశారుమాదిగ కధలుఅనే పేరుతో మాదిగల దుస్తితిని అద్భుతమైన బాషా సొబగులతో చెప్పారు , కాని సమాజం ఎలా చూస్తుంది అంటే అక్షరాలకీ , పుస్తకాలకీ , కాస్తో కూస్తో ఇంగువ వాసన ఉంటే తప్పా  వాటికి విలువ ఇవ్వరు , దళితుల్లో కూడా ఎలాగు అగ్రహారాలు వచ్చేసాయి కాబట్టి , ఇప్పుడు అక్కడ కూడా ఎప్పటినుంచో తిష్టవేసుకుని కూర్చున్న కలాకారుల పేర్ల మీదనే వ్యాసాలు వస్తాయి , అవార్డులూ వెలుస్తాయి , పుంఖానుపుంఖాల సంతాప సందేశాలు వచ్చి తరిస్తాయి , కాని నిజం ఎక్కడో ఇదిగో ఇలా నాగప్పగారి సుందర్రాజులానో మరో కవి లానో మరుగున ఉండిపోతుంది. నాగప్పగారి సుందర్రాజు కాలానికి అవ్సరమైన కవి. మన మూలాల్ని మనం మరిచిపోతున్న తరుణం లో దొరికిన అమూల్యమైన ఆణిముత్యం . అంబేడ్కర్ నీ కూడా ఇంటి వాసాలకి కట్టేసుకున్న దొరలకి ఇతను కూడా  మనతో పాటే అనేకకానేకవమానల్ని పొంది, నిమ్న వర్గం అనిముద్ర వేయించుకున్న ఒక దళితుడనే స్పృహ వస్తే బాగుండు. సరే రక్తమాంసాల శరీరాలకి బలహీనతలు తప్పవు , తాను ఒక మార్గాన్ని నమ్మాడు అదే మార్గంలో జనం నడవాల్ని అనుకున్నాడు, కాని శరీరాన్ని గెలవలేకపోయాడు, లోకం అందమైన వల విసిరితే పడని వాడు మనిషి కాదు. పెద్ద పెద్ద కవులకీ, కళాకారులకీ ఉన్నాయి బలహీనతలు, వాటిని మనం బలహీనతలు అనుకుంటే రాబొయే తరం వాటిని సాధారణం అనుకోవచ్చు అప్పుడు మనం అయ్యో వీటి వలన మనం అతడిని దూరం చేసుకున్నామా అని వాపోవచ్చు. కాబట్టి అతని కధలు కవిత్వం మన చేతుల్లోనే ఉన్నాయి చదువుదాం, అతడిని స్మరించుకుందాం. మధ్యనే మిత్రులు అతని కవితల పుస్తకం వెలుగులోకి తెచ్చారు. అది చాలా గొప్ప పని, ఏముంది ఎంత రాసిన ఆదే గోల తప్ప మరేమీ ఉండదు అని అనుకునే వారికి ఒక్క విన్నపం. చాలా మటుకు మీరు చూసిన దళిత జీవితాలు వేరు ఇది వేరు ఇది అనుభవించిన వాడి బాధ, ఘోష. మీరు గొంతు కలపండి మా పోరాటం వ్యక్తులమీద కాదు కులాల మీద కాదు. వాటి భావజాలాల మీద. ఇదే నాగప్పగారి సుందర్రాజు ధిక్కార చాటింపుగా చెప్పాడు. రేపు ఇంకొకరు చెబుతారు మనం మారనంత వరకు చెబుతూనే ఉంటారు .

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

7 comments

 • లవ్యూ చిన్నోడా…. పదునైన వ్యాసం… మనం తప్పితే మరొకళ్ళు రాయడానికి కనీసం తలుచుకోని పెద్దింటి మాదిగ కలాన్ని ఇలా పరిచయం చేసినందుకు దండాలు.

 • బాగుంది అనిల్. ఒక దళిత, అందునా మాదిగ జీవన పోరాటాల్ని కళ్ళకి కట్టావు. కొన్ని కవితాత్మక వాక్యాల్లో కవి విశ్వరూపం కనపడింది. ఇంకొన్ని కవితల్ని ప్రెసెంట్ చేస్తే చాలా బాగుండేది. ఈ పుస్తకం అరువియ్యరాదూ మిత్రమా !

 • కులం పేరుతో, మతం పేరుతో అణగదొక్కబడిన గాధల్ని వెనుకటి చరిత్రలో చాలా విన్నాను.
  అంతరిక్షం లోకి మనిషి ప్రయాణం చేస్తున్నా ఆలోచనలు ఇంకా అదఁపాతాళం లోనే కనిపిస్తున్నాయి.
  తప్పెవరిదైనా తరతరాలూ నలిగిపోయిన చరిత్రలే… మనిషి పట్ల చిన్న చూపు మరో మనిషే చేయగలడేమో..
  నా చిన్నప్పుడు ఓ ఇద్దరు మిత్రురాళ్ళు మాదిగపల్లె నుండి వచ్చేవారు . వారి ద్వారా నాకు ఇలాంటి అనేక విషయాలు తెలిసాయి.
  ఆరోజు ల్లో ఇలాంటి తేడాలెందుకో తెలీక అయోమయం చెందిన సందర్భాలు అనేకం.
  అలాంటి ఆవేదనలు, ఆర్తనాదాలు ఇండస్ గారి కటికపూలు లో చూశాను. ఇప్పుడు మీ వ్యాసం మరలా చెప్తుంది. ఆ వేదన వ్యక్తికి మాత్రమే చెందినది కాదని అర్థం చేసుకుంటే వ్యవస్థ లో మార్పు వేగవంతం అవుతుంది.
  చాలా ఆవేదన వ్యక్తం చేశారు వారి కవితల్లో.. మీ వ్యాసం లో.. చాలా బావుంది అనీల్. ఆవేదనంతా మీ అక్షరాలు అద్దుకున్నాయి.

  • నిజమే యామిని గారు ఇలాంటి కవిత్వం అందరు చదివి అర్ధం చేసుకోవాలి మీ కామెంట్ బావుంది ధన్యవాదాలు

 • దళిత జీవితాల్లో బాధ ,ఘోష ఏంత అనుభవించి ఉంటారోనంటానికి ఈ కవిత్వంలోని అక్షరాలే నిలువెత్తు సాక్ష్యం..అందున మాదిగ బ్రతుకు పోరాటాల్ని ,మానసిక సంఘర్షణను చండాలచాటింపు ద్వార కళ్లకు కట్టినట్టు చూపించిన రచయితకు వందనాలు…. మీ పదునైన వ్యాసంతో ఆ ధిక్కార నాగ స్వరాన్ని మాకందించిన అనిల్ గారికి అభినందనలు…..

 • అన్న….సుందర్రాజు అన్న వాక్యాలను గుండెకి హత్తుకుని చెప్పారు…అన్న కతలు కవిత్వం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి..
  నిజమే అన్న వున్నా.లేకున్నా అన్న వాక్యాలు అణచివేతను ప్రశ్నిస్తూనే ఉంటాయి…
  మీ సమీక్ష అద్బుతంగా ఉంది…

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.