కధా రచనలో మహా మాంత్రికుడు ఓ.హెన్రీ

థ అనగానే మనకు టాల్స్టాయ్, చెహోవ్, ఎడ్గర్ ఏలన్ పో, ఆస్కార్ వైల్డ్, సాకి, మపాసా, హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్  లాంటి కధకులు గుర్తొస్తారు. కధ లాటి జీవితాన్ని అనుభవించి కొత్త తరహా కధను అందించిన ఓ.హెన్రీ (1862–1910) అసలు పేరు ‘విలియం సిడ్నీ పోర్టర్’ . అనేక మలుపులతో, అనూహ్యమైన ముగింపులతో ఈయన కథలు మన మనసులను ఎప్పుడో  దోచుకున్నాయి.  20వ శతాబ్దంలో గొప్ప కథకుడుగా పేరుపొందిన ఓ.హెన్రీ మధ్యతరగతి పేద ప్రజల గురించి, న్యూయార్క్ కష్ట జీవుల గురించి, జీవితంలోని ఉత్థానపతనాల గురించి, చాలా కథలు   వ్రాశాడు.  మనుషులు అనుకోని విధంగా బాధల్లోకి కూరుకుపోవడం, బాధల ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడం,  బాధల నుంచి బయట పడటం, జీవితం పట్ల వేదాంత  ధోరణి, ఆనందం, అసూయ , ఒక ప్రత్యేక హాస్యం – ఇవన్నీ ఈయన కథలలో వచ్చే మెరుపులు.

చిరపరిచితమైన పెద్ద తరం వారికి హెన్రీ కధాప్రపంచం కొత్తగా అనిపించకపోవచ్చు కానీ మొదటిసారి చదివేవారికి ఓ.హెన్రీ కధలు తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కధాగమనం లాగే జీవితం పట్ల పరిశీలన కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథలో ముందుగా పాత్రల్ని పరిచయం చేసే తీరు, పరిసరాలను వర్ణించడం , దేనినైనా కథావస్తువుగా తీసుకుని రంజింప చేయడం కధా రచయితగా హెన్రీ తాంత్రిక రహస్యం. నవలా రచయిత పరిధి చాలా ఎక్కువ. వర్ణించడం, విశదీకరించడం వంటివి చాలా ఎక్కువగా చేయవచ్చు. కానీ కధా రచయిత తక్కువ నిడివిలో నవలా రచయితలాగా చెప్పాలి. వస్తువుని ఎన్నుకోవడం, దాని పరిమితి వంటి వాటిని కథా రచయిత చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. పాత్రలకు న్యాయం చేయాలి. కథని ఆసక్తికరంగా ప్రారంభించి, వర్ణించి, ముగించాలి. ఇది నిజంగా పెద్ద సవాలే!

బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న సిడ్నీ పోర్టర్ తండ్రి ఒక వైద్యుడు. పోర్టర్ కి చిన్నతనం నుంచి బాగా చదివే అలవాటు. ఏ పుస్తకం కనిపిస్తే ఆ పుస్తకాన్ని చదివేస్తూ ఉండేవాడు. అరేబియన్ నైట్స్ కథలు ఎన్నో వందల సార్లు చదివాడు. ఫార్మసిస్ట్ గా తన చదువును పూర్తిచేసిన హెన్రీ తన మామయ్య మందుల దుకాణంలో పనిచేసి అక్కడికి వచ్చి పోతూ ఉండేవారిని చిత్రీకరిస్తూ ఉండేవాడు. తన ప్రయాణాలలో కొంచెం జర్మనీ, స్పానిష్ నేర్చుకున్నాడు. క్లాసికల్ సాహిత్యాన్ని బాగా చదివాడు. తన జీవితం గడపడం కోసం అప్పుడప్పుడు కథలు కూడా రాయడం మొదలుపెట్టాడు. చాలా చమత్కారంగా మాట్లాడడం, కధలు బాగా చెప్పడం, అలాగే సంగీతాన్ని- ముఖ్యంగా గిటార్, మాన్డలిన్  బాగా వాయించడం చేసేవాడు. మనం ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి అంటే సిడ్నీ పోర్టర్ జీవితం కూడా ఒక కథ లాగే ఉంటుంది. తన జీవితంలో ఎదురైన అనేక సన్నివేశాలు, వ్యక్తులు ఈ కథలలో మనకి తారసపడతారు. దొంగలు, అల్లరి ప్రేమికులు, చిత్రకారులు, రోగ గ్రస్తులు, ఇలా హెన్రీ పాత్రల గాలరీ అంతారక్తమాంసాలున్న పరిపుష్టి గల పాత్రలతో నిండి ఉంటుంది.

హెన్రీ ఒక ధనిక కుటుంబానికి చెందిన అటల్ అనే అమ్మాయిని ప్రేమించాడు. అయితే అటల్ క్షయ వ్యాధితో బాధపడుతూ ఉండటంతో ఆమె తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. ఆమెతో పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. స్నేహితుడు జనరల్ లాండ్ ఆఫీస్ లో ఉద్యోగం కుదిర్చాడు. దీంతోపాటు కధలు రాయడం మొదలుపెట్టాడు. తరువాత ఒక బాంక్లో క్లర్క్ గా చేరాడు. పుస్తకాలు నిర్లక్ష్యంగా భద్రపరచడం వంటి విషయాల వల్ల , ఉద్యోగంలో అప్రమత్తత వల్ల ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బాంక్ ను మోసగించిన అభియోగం కింద హెన్రీని అరెస్ట్ చేశారు. అతని మామ అతనిని విడిపించే సమయానికి హెన్రీ పారిపోయాడు. హోండురాస్ లో ఆరు నెలలు గడిపాడు. అయితే అక్కడ జెన్నింగ్స్ అనే ఒక భయంకరమైన రైలు దోపిడీ దొంగతో పరిచయం ఏర్పడింది. ఒక  హోటల్ ని ఆశ్రయించి అక్కడ ‘క్యాబేజస్ అండ్ కింగ్స్’ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ లోపు అతని భార్య మరణించిందని తెలిసి తిరిగి అక్కడికి పోయాడు. భార్య మరణించడంతో కోర్టుకు లొంగిపోయాడు.

తనకు విధించబడిన ఐదు సంవత్సరాల శిక్షా కాలంలో హెన్రీ రాత్రిపూట ఆస్పత్రిలో పని చేసేవాడు. రకరకాల మారు పేర్లతో ఆ కాలంలో 14 కథల్ని ప్రచురించాడు. న్యూ ఓర్లీన్స్ లో ఉన్న తన మిత్రునికి కథల్ని పంపి అతని ద్వారా ప్రచురణకర్తలకు పంపించేవాడు. ఈ కథలు ఎలా వస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఓ.హెన్రీ అనే పేరుతో మాత్రమే ప్రచురించబడేవి. మూడు సంవత్సరాల తర్వాత అతని మంచి ప్రవర్తనకి అతనిని విడుదల చేశారు. తర్వాత కాలంలో చాలా గొప్పకధలను వ్రాశాడు హెన్రీ. హెన్రీ అనే పేరు వెనకాల కూడా ఒక ఆసక్తికరమైన కధ వుంది. అందరు తమకిష్టమైన వారి పేర్లు కలం పేరు గా పెట్టుకుంటారు. కానీ కలం పేరుకి వెతుకుతూ న్యూస్ పేపర్ లో కన్పించిన హెన్రీ అనే పేరు స్వంతం చేసుకున్నాడు ఓ.హెన్రీ.

ప్రతి రచయితా/త్రి మీద ‘జాతి, పరిసరాలు, రాస్తున్న సమయం’ – ఈ మూడు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అతని వ్యక్తిగత జీవితం, అనేక వ్యక్తులు ప్రభావాలు – ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేక రచయితగా నిలబెట్టాయి. పరిసరాలను, మనోభావాలను చిత్రీకరించడం, పరిస్థితులను ఆకట్టుకునేలా అనూహ్యంగా కధ  చెప్పడం హెన్రీ కి వెన్నతో పెట్టిన విద్య. చిన్న కథలను చెప్పడం, హాస్యం, వ్యంగ్యం, అనూహ్యమైన ముగింపు – ఇవి ఓ హెన్రీ కధా లక్షణాలు. ఉన్నట్లుండి ఇతర భాషా పదాలు వాడి ఆసక్తిని కలగచేస్తాడు. జీవితం గడిచేందుకు కధలు రాసినా వాటిలో ఒక విలక్షణత, వైవిధ్యం వుంటాయి.

దాదాపు ఆరు వందల పైగా వున్న ఇతని కధలలో బాగా ప్రాచుర్యం పొందినవి చాలా వున్నాయి. ‘విస్లింగ్ డక్స్ క్రిస్టమస్ స్టాకింగ్’ అనేది మొదటి కధ.   ‘ది గిఫ్ట్ ఆఫ్ ది మాజై, ద రాన్సం ఆఫ్ రెడ్ ఛీఫ్, ద కాప్ అండ్ ద ఏంతం, అ రిట్రీవ్ద్ రిఫార్మేషన్ , ద రొమాన్స్ ఆఫ్ ఏ బిజీ బ్రోకర్, ద థర్డ్ ఇంగ్రీడియంట్, ద లవ్ ఫిల్టర్ ఆఫ్ ఐకే షోయన్స్తీన్, ఆఫ్టర్ నూన్ మిరకిల్ , వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. హెన్రీ కధలు నాటకాలుగా సినిమాలుగా రూపొందించ బడ్డాయి.

ఓ హెన్రీ రచనలు అందులోని పాత్రలు పాఠకుని కట్టిపడేసే ముఖ్య కారణం వాటి మానవత్వ కోణం, విశ్వజనీనత. చాలా కధలు ఒకటి రెండు పాత్రలతోనే నడుస్తాయ్.  హాస్య కధలు కాక నిజ జీవితాన్ని ప్రతిబింబించే శకలాలు, వాటి పాత్రలు, అతి సామాన్యమైన మానవ నైజం, కోరికలు, బలహీనతలు, స్వార్ధం, ఎంత సుపరిచితంగా ఉంటాయంటే వాటిని మనం అనుభవించడమే కాక ‘ఈ లక్షణాలు మనుషులలో సర్వసాధారణం కాబట్టి వాటిని తీవ్రంగా పరిగణించి అతి దుర్లభమైన తప్పులుగా భావించాల్సినవి కావు’ అనిపించేలా చేస్తాడు. అతని కథలలోని ఈ అతి సాధారణ అంశాలకు అసాధారణత్వం చేకూర్చేవి అతని కథనం మరియు ముగింపులే. వైవిధ్యమైన ముగింపుల కోసం ఓ.హెన్రీ నాలుగు రకాల పద్ధతులను అవలంబిస్తాడు. 1. వివరాల్ని దాచిపెట్టడం, 2. వివరించే కోణాన్ని ముగింపు వరకు తెలియ చేయకపోవడం, 3. మభ్యపెట్టడం, 4. ఒకదానికి బదులు ఒకటి జరిగేలా పొరపాటు పడేట్లు చేయడం. దీంతో ఓ.హెన్రీ కధలు ఎక్కువగా అనుకున్నదానికి భిన్నంగా జరిగే ఉదంతాలతో ముగుస్తాయి.

బాల్యం నుంచి ఆంగ్ల భాష పాఠ్యాంశాలుగా ఇక్కడ ప్రస్తావించ బోయే కథలు  పాఠకులకు దాదాపు సుపరిచితం. ‘చివరి ఆకు”(ద లాస్ట్ లీఫ్) అయినా “మాజై బహుమతి”(ద గిఫ్ట్ ఆఫ్ ద మాజై) అయినా,  పాఠకుల మనఫలకంపై చెరగని ముద్ర వేస్తాయి. ఈ రెండు కథలు మానవ సంబంధాలలోని భావోద్వేగాలను ఓ హెన్రీ తరహా ముగింపు తో  పాఠకులను కట్టిపడేసే విధంగా ఉంటాయి.

‘మాజై బహుమతి’ అనే కధ సామాన్య వర్గానికి చెందిన యువ దంపతులకు ఒకరిపై ఒకరికి గల అనురాగాన్ని,  క్రిస్మస్ కు వారిద్దరూ ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే బహుమతులలో అవతలి వారి కోసం స్వార్ధపూరితమైన ‘నేను-నాది’ అనే భావనను త్యాగం చేయగల అపురూప బంధాన్ని చూపిస్తుంది.  తన భర్త ఎంతో ప్రాణపదంగా చూసుకునే వంశపారంపర్యంగా వచ్చిన బంగారపు గడియారానికి ముచ్చటైన గొలుసు కొనడానికి తన దగ్గర ఉన్న డబ్బు చాలదు. దాంతో తాను ఎంతో అపురూపంగా చూసుకునే తన పొడవాటి జుట్టును అమ్మి , వచ్చిన డబ్బుతో భర్త కోసం  బహుమతి కొని ఆశ్చర్య పరచాలనుకుంటుంది. భర్త కూడా తన ప్రియమైన భార్యకు క్రిస్మస్ కానుకగా ఆమె శిరోజాలను అలంకరించుకోడానికి ఆమె ఎంతో ముచ్చట పడిన అతి ఖరీదైన అలంకరణ దువ్వెనలు బహుమతిగా ఇవ్వాలనుకుంటాడు.తన బంగారు గడియారాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో  దువ్వెనలు తీసుకు వస్తాడు. ఒకరికొరకు ఒకరు తెచ్చిన బహుమతులు నిరుపయోగమైనా ఆ యువ జంట కు ఒకరిపై ఒకరికి కల నిస్వార్ధ నిరుపమాన అనురాగం మనలను ఆనంద పరుస్తుంది.

ఈ కథ వివాహబంధంలో ని గాఢత ని తెలియచేస్తే ‘చివరి ఆకు’ కధ  మానవ బంధాల అవసరాన్ని, త్యాగాన్ని తెలియజేస్తుంది. ఈ కథలో న్యుమోనియా బారిన పడిన ఒక యువతి తన మంచానికి ఎదురుగా ఉన్న ఒక కిటికీలోంచి కనబడే ఒక తీగ లోని చివరి ఆకు తో  తన ఆయుష్షుని ముడి పెట్టుకుంటుంది. ఆ తీగ లోని చివరి ఆకు రాలిపోయిన పుడు తాను కూడా చనిపోతానని విశ్వసిస్తుంది. చిత్రంగా ఆ తీగ లోని చివరి ఆకు రాలదు. దాంతో ఆ యువతి తిరిగి ప్రాణం పోసుకుంటుంది.  అయితే ఆమెకు అనూహ్యంగా తన పొరుగు వాడు అయిన ఒక ముసలి చిత్రకారుడు చనిపోయాడని తెలుసుకుంటుంది. అతను డిసెంబర్ చలిలో ఒకే ఆకు తో ఉన్న ఐవీ తీగను రాత్రంతా చలిలో మంచులో తడిసి చిత్రీకరిస్తూ ఆ భరించరాని చలికి న్యుమోనియా బారిన పడి చనిపోయాడని తెలుసుకుంటుంది. తానెంత మూర్ఖంగా విలువైన జీవితాన్ని పోగొట్టుకోబోయిందో తెలుసుకుంటుంది. ఒక గొప్ప చిత్రాన్ని ఎప్పటికైనా గీస్తానని చెప్తూ ఉండే అతని త్యాగపూరిత మరణం మనల్ని కలిచి వేస్తుంది.

తానొకటి అనుకుంటే దైవమొకటి సంకల్పిస్తాడని తెలియ చేసే కధ ‘రాన్సం ఆఫ్ రెడ్ చీఫ్’. ఈ కథలోని బిల్ మరియు అతని స్నేహితుడు ఒక బాలుని   అపహరిస్తారు. అతని తండ్రి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని తలుస్తారు. అయితే వారి ఆలోచనలకు విరుద్ధంగా ఆ ఆకతాయి చిచ్చరపిడుగు వారిని పెట్టే ఇబ్బందులకు బెదిరి వదిలించుకోవడానికి ఎదురు డబ్బు ఇచ్చి మరీ అతని తండ్రి దగ్గర బలవంతంగా అతనిని విడిచి పెట్టే హాస్యభరితమైన కథ ఇది.

ఇలాటిదే అనూహ్య పరిణామాలతో కాలంతెచ్చే మార్పులతో 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రుల కధ ‘20 ఏళ్ల తరువాత’ (ఆఫ్టర్ ట్వెంటీ ఇయర్స్). ఇరవై ఏళ్ళ తరవాత ఒక సంకేత స్థలంలో కలుడ్డామనుకున్న ఇద్దరు మిత్రులు  ఏ పరిస్థితులలో కలిశారు అనే ఇతివృత్తాన్ని తెలిపే కధ ఇది. తమ తమ జీవితాలలో ఎంత ప్రగతిని సాధించారో చెప్పుకునే క్రమంలో ఆ ఇద్దరి లో పోలీసు అధికారి అయిన జిమ్మీ, తన బాల్య స్నేహితుడు బాబ్, చికాగోలో పోలీసు వారు వెతుకుతున్న వ్యక్తిగా గుర్తించి, తన స్నేహితుని తానే అరెస్టు చేయలేక, సివిల్ దుస్తులలో  వచ్చిన మరియొక అధికారి ద్వారా బంధింపచేసి తన విధిని నిర్వర్తించే కధ. ఓ.హెన్రీ కధన శక్తిని ప్రతిబింబించే కధ ఇది.

‘స్కై లైట్ రూమ్’ ‘ఫర్నిష్డ్ రూమ్’ అనే రెండు కధలు హేన్రీకి మంచి పేరు తెచ్చాయి. ఇవి తీవ్ర జనసాంద్రత కలిగిన పట్టణాలలో నివాస వసతికై సామాన్య మానవుడి వెతలను తెలియ చేస్తాయి.  ఈ కథల విషయ నేపథ్యము ఒకటే అయినా ఈ రెండు కథలను తనదైన శైలిలో ఒక ప్రత్యేక భావోద్వేగంతో చెప్పీ చెప్పకుండానే పాఠకుని హృదయఫలకంపై పాఠకుడు ఆ భావోద్వేగ సందర్భాన్ని మరలా మరలా తిరిగి సందర్శించేలా చేస్తాడు.

‘స్కైలైట్ రూమ్’ అనే కథలో ఇంటి యజమానురాలు అద్దెకు వచ్చే వారందరికీ అద్దెకు ఇచ్చే అతి ఖరీదైన గదుల నుంచి మొదలెట్టి చివరకు చాలా తక్కువ అద్దె లో దొరికే వాటిని చూపుతుంటుంది. పై అంతస్తులో ఉన్న స్కైలైట్ రూమ్’ని చూపించడం  ఆమెకు ఎపుడూ ఆనవాయితీ. అలాటి ఆనవాయితీ ప్రదర్శనలో ఒక సారి ఒక సామాన్యమైన చిన్న ఉద్యోగి ఆ స్కైలైట్ రూమ్’ ని చూసి ఆ గదిని అద్దెకు తీసుకుంటుంది. ఇతర గదులలో అద్దెకు ఉండే స్త్రీలు, చురుకుగా చలాకీగా ఉండే ఈ యువతి పట్ల ఈర్ష్యగా ముభావంగా ఉన్నట్లు ఉంటే,  పురుషులు మాత్రం ఆకర్షితులైనట్లు మోహితులైనట్లు ఆమె ప్రతి చర్యా చాలా అపూర్వమైనది గా కీర్తిస్తూ ప్రవర్తిస్తారు. ఈ రెండు కథలలో ఇంటి యజమానురాలు పాత్ర వర్ణన, అద్దె గదులు ఉండే భవనాలు, వాటిలోని వసతులు, లోని సామాను, పరిసరాల వర్ణన, నగర జీవన యాంత్రికత, మనుషుల మరియు పరిసరాల ఇరుకుతనం,  ఏదీ మారని తనం కనిపిస్తుంది.

‘స్కైలైట్ రూమ్’ లో లీసన్  ఉద్యోగం పోగొట్టుకొని, కొత్త ఉద్యోగం దొరకక, తిండి లేక ఆ స్కైలైట్ రూమ్ లో నీరసంతో స్పృహతప్పి పడిపోయినప్పుడు, ఆమెతో నివసించే వారందరూ ‘ఏ కారణం చేతనో ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఉంటుందని’ విమర్శిస్తారు తప్ప ‘తమ మధ్యనే ఒక వ్యక్తి ఆకలితో దయనీయ స్థితిలో ఉంద’నే మానవీయతను చూపలేక పోతారు. ‘ఒక వ్యక్తి సంతోషంగా తిరిగినప్పుడు పట్టించుకున్నంతగా బాధలలో ఉన్నపుడు పట్టించుకోర’న్న విషయాన్ని చూపుతాడు.

అలాగే కొందరు ఇంటి యజమానుల్లో ఉండే ఆశపోతుతనం, అబద్ధాల గుణాన్ని ‘ద ఫర్నిష్డ్ రూమ్’ అనే కధలో చూపుతాడు. ఒక నగరంలో ఇలాంటి అద్దెకు ఇచ్చే ఇంటి వద్ద తన ప్రియురాలిని వెతికే ఒక సామాన్యుని  కథ ఇది. ఒక నాటక కంపెనీలో పనిచేసే తన ప్రియురాలు కనపడకుండా పోయిన తరువాత ఆమె జాడ కోసం ఆరు నెలలుగా వెతుకుతూ ఒక అద్దె గది మార్చి మరి ఒక అద్దె గదిలో చేరి వెతుకుతూ ఉంటాడు కధానాయకుడు. ఈ విధమైన పరిస్థితులలో క్రొత్తగా చేరిన ఒక గదిలో తన ప్రియురాలి తలపును గుర్తుకు తెచ్చే ఒక పరిమళం ఆ గదిలో అతనిని రారమ్మని పదేపదే పిలిచినట్టుగా అనిపిస్తుంది.  ఆ ఇంటి యజమానురాలుకి తన ప్రియురాలి పోలికలన్నీ వివరించి ‘ఆ విధమైన పోలికలతో ఎవరైనా నటి ఆ గదిలో ఉన్నదా’ అని అడిగినప్పుడు, ఆవిడ ‘దాదాపు సంవత్సరం పాటు ఆ గదిలో ఉన్న వారికి ఎవరికి ఆ పోలికలే   లేవు’ అని చెప్తుంది. నిరాశగా తిరిగి గదికి వచ్చిన అతనికి ఆ పరిమళపు జాడే లేక తీవ్ర మనోవ్యధకు గురి అవుతాడు. ఓ.హెన్రీ ముగింపు చిహ్నం ఈ కథలో ఆ ఇంటి యజమానురాలు తన స్నేహితురాలితో అనే ఈ మాటల్లో కనిపిస్తుంది.  అలాటి అమ్మాయి ఆ గదిలో చనిపోయిందని తెలిసినా ‘ఆ ఇంటిలో ఇతని కంటే ముందు ఉన్న, అతను వివరించిన పోలికలు ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది’ అని చెప్పి తన ‘జీవన ఉపాధి పోగొట్టుకునే వెర్రి దాన్ని కాదు’ అని అంటుంది ఆ యజమానురాలు.

‘రిట్రీవ్డ్ రిఫార్మేషన్’ ఒక దోపిడీ దొంగ కథ.  తాను ప్రేమించిన యువతి కోసం స్వచ్ఛందంగా నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకుంటాడు. అయితే  ఆమెను వివాహమాడ బోయే తరుణంలో ఒక బ్యాంకు లాకర్ లో చిక్కుకున్న పసిపాప ప్రాణాలను కాపాడడానికి దొంగగా తన నైపుణ్యాలను వాడవలసి వస్తుంది. అయితే మానవత్వంతో దొరికిపోవదానికీ సిద్ధపడతాడు. ఆ దొంగ చూపిన మానసిక పరిణితి,  అతనిని వెతుక్కుంటూ వచ్చి సాక్ష్యాధారాలతో సహా అరెస్టు చేయడానికి అవకాశం కల ఒక పరిశోధన అధికారి అతని గుర్తించడానికి నిరాకరించడం లో చూపిన మానవత్వం చదువరులను ఒక ఊహించని సహానుభూతి మరియు మనుషులలోని నిబిడీకృతమైన మంచితనం పట్ల ఆశను రేకెత్తిస్తాయి.

ఆధునిక నగర  జీవి అయిన మానవుడు ఒక ప్రదేశంతో భావోద్వేగ పూరితమైన అనుబంధం పెంచుకుంటాడు. తద్వారా ఆ ప్రదేశం పట్ల మానవుడు ఒక  పక్షపాత ధోరణి ప్రదర్శిస్తాడు. వీటన్నిటికీ తావు లేని మనిషే విశ్వ మానవుడు అనే అభిప్రాయాన్ని తెలిపే కధ ‘కాస్మోపోలైట్ ఇన్ ఎ కఫే’ (Cosmopolite in a Cafe).  ఈనాటి ఆధునిక ప్రపంచంలో మనిషి ప్రదర్శన కొరకే జీవిస్తున్నాడనే సత్యాన్ని, ఇలాటి మనుషులు అంతరాలలో నిజాయితీకి నిలబడలే ని నకిలీ మూస మనుషులు అని వ్యక్త పరుస్తుంది.  రష్ మోర్ కోగ్లాన్ అనే కథానాయకుడు తాను ప్రపంచం మొత్తం చుట్టి వచ్చిన వ్యక్తినని, తనకు తరతమ భేదాలు ఉండవని, తను ఏ ఊరిని కేవలం ఒక ప్రత్యేకత కు అన్వయించి చూడలేడని చెప్తుంటాడు. తనని తాను ఏ ఒక్క నగరానికో,  పట్టణానికో, గ్రామానికో ప్రతినిధిగా భావించనని బాజా కొట్టుకుంటాడు . సర్వ ప్రపంచము తనకు సమానము అని తాను రోజు వెళ్లే రెస్టారెంట్లో అతిధులు అందరితో చెబుతూ ఉంటాడు. అతని ఆధునికతని, ప్రపంచ పరిజ్ఞానాన్ని నమ్మిన కధా వ్యాఖ్యాత కోగ్లాన్ ఎంత మాటకారో , మాటలతో ఎలా బురిడీ కొట్టిస్తాడో తెలుసుకు నివ్వెర పోతాడు. ఇలాటి బురిడీ మాటల వ్యక్తులు మన జీవితాల్లో కోకొల్లలు.

ఓ  హెన్రీ  కధా ప్రపంచం సమాజమంత వైవిధ్యమైనది.  ఎక్కువగా నగర జీవనాన్ని కేంద్రీకరించినప్పటికీ నగర జీవనం లోని అన్ని వర్గాల ప్రజలనూ  తన పాత్రలలో ప్రతిబింబిస్తాడు. ఆయన కధలలో స్త్రీ పాత్రలు కూడా సమాజం లోని అన్ని వర్గాలను ప్రతిబింబిస్తాయి. ‘స్ప్రింగ్ టైం అలా కార్ట్’ కధలో కథానాయిక సారా ఒక టైపిస్ట్.  ఆమెకు జీవన ఉపాధి ఈ టైపింగ్. ఆమె ఒక రెస్టారెంట్ కి మెనూ కార్డ్ టైప్ చేసే ఫ్రీలాన్సింగ్ పని చేసుకుంటూ తనకు కావలసిన ఆదాయం సమకూర్చుకుంటూ ఉంటుంది గత వేసవి కాలంలో ఒక గ్రామంలో వేసవి విడిది కి వెళ్లినప్పుడు అక్కడి ఒక రైతు తో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ వసంతకాల మొచ్చాక వివాహమాడాలని నిర్ణయించుకుంటారు. సారా నగరానికి వచ్చి వసంతకాలం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. వారిద్దరి మధ్య అనుకోకుండా ఉత్తరప్రత్యుత్తరాలు జరగక పోవడం వలన ఒకరి సమాచారం ఒకరికి ఉండదు. నిస్పృహలో ఉన్న ఆమె తాను టైప్ చేసేటప్పుడు ఆ రెస్టారెంట్ యజమాని ఇచ్చిన వివరాలు  పర ధ్యాసగా టైప్ చేస్తుంది. దానికి కారణం ఆ మెను కార్డు లోని డండీలియన్ అను కూరగాయ లాంటి పదార్థం ఆమెకు తన ప్రియుడు వాల్టర్ తన శిరస్సును అలంకరించిన చామంతి (dandelion) పువ్వులను గుర్తు చేస్తుంది. ఆమెను కార్డ్ రెస్టారెంట్ కు చేరిన కొన్ని గంటలకు వాల్టర్ ఆమె ఇంటికి వస్తాడు. ఆశ్చర్య చకితురాలయిన ఆమె, ఇన్ని రోజులుగా అతను రాకపోవడానికి కారణం అతను న్యూయార్క్ నగరంలో ఆమె చిరునామా పట్టుకోలేకపోవడం అని తెలుసుకుంటుంది. మరి ఇప్పుడు మాత్రం తన చిరునామా ఎలా పొందగలిగాడని అడగగా అతను ఆమె టైప్ చేసిన మెను కార్డు ఆమె చేతిలో పెడతాడు. అందులో  ‘ప్రియమైన వాల్టర్ ఉడకబెట్టిన గుడ్లతో’ అని ఉంటుంది. ఇలా అనూహ్యమైన మలుపులు హెన్రీ కధలలో కోకొల్లలు. ఈ మలుపులు మనకు కృత్రిమంగా అనిపించవు సరి కదా వాటి లోని మానవ సంబంధ భావాలు మనల్ని కట్టిపడేసి పాత్రలతో జతచేస్తాయి.

కధ వ్రాయడం అంటే వైవిధ్య భరిత భావనామయ జీవిత శకలాన్ని ప్రతిబింబించడం. ఆ శకలాల్లో కొంచెం సంతోషమూ, కొంచెం బాధా, కొంచెం వ్యంగ్యము, కొంచెం హాస్యం, కొంచెం ఉత్కంఠ సమపాళ్ళలో కలప గలగడమే ఓ.హెన్రీ రహస్యం. కధలు చదవాలనుకునే వారు, కధా రచయితలవాలనుకునే వారు కూడా తప్పక చదవాల్సిన రచయిత ఓ హెన్రీ.

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

10 comments

 • పరిచయం,కథల పరిచయమూ ఆసక్తిగా వుంది. ధన్యవాదాలు.

 • చక్కని వ్యాసం. ధన్యవాదాలు

 • ఓ హెన్రీ కథల గురించి చక్కని విశ్లేషణ!
  ఆయన రచనల సారం వివరించిన తీరు బావుంది.

  ‘ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్’ నాకిష్టం. అందుకే దాని గురించి ఇంకొంచెం రాసివుంటే బాగుండేది అనిపించింది.:)

  • అన్ని కథలూ అలాగే వుంటాయి గదా. వున్నంతలో ఎక్కువ అందించాలని… ధన్యవాదాలు. 🙂

 • వీటిలో రెండు కధలు మనకి చిన్నప్పటి పార్యాంశాలు కదండీ. ఆర్టిస్ట్ మరియు రాన్సమ్ ఆఫ్ రెడ్ చీఫ్. బంగారు గడియారం కథ రచయిత పేరు లేకుండా వాట్సప్ లో తిరిగింది ఈమధ్య.
  చాలా మంచి పరిచయ వ్యాసం. ఆగకుండా చదివేసేలా ఉంది.

 • ఓ హెన్నీ పరిచయం కూడా ఒక కథలాగా సాగింది. బాగుంది

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.