కాలం సేతిలో సంటోడి పొద్దు

కార్తీక మాసంలో, గోదాట్లో ములిగే  ఆడోలు తడిసిన బట్టలతోనే ఇల్ల కొత్తారు..అందుకే నొరే.. ఆడోల గుండెలు సెంచలం అన్నోడు సచ్చెదవ” ! (శీతకట్టు). ఏమిటీ వాక్యం ? ఎదో వింత పరిమళాన్ని హృదయంలోపలికి ఒంపుతోంది కదూ?”కొబ్బరినూని సిక్కగా పేరకపోయి, పేరుకున్న నెయ్యినాగా ముద్దగట్టుక పోనాది, పొయ్యికాడెడ్తే మల్లీ పేనం పోసుకుంది, ఆత్తోరింటికాడ ముడ్సుక పోయిన బుల్లి అమ్మగోరింటికాడ కల్విడిగా తిరిగినట్టు” — ఏమిటీ అభివ్యక్తి ? చదువరిని కొత్తగా  తాకి గిలిగింతలు పెడుతోంది కదూ? ఎందుకని ? కవితలో వస్తువు  వల్లనా ? స్టైల్ వల్లనా ? అయితే గియితే ఎం చెప్పాడు, ఎలా చెప్పాడనే రెండు విషయాలలోనే కవిత్వం మనల్ని హత్తుకుంటుంది కదా ? మరివొంటి సొంపులు మార్సుకో పొతే కోకలైన మార్సుకొండని కవ్వించి సెప్పింది మాసెడ్డ మాయదారి సిత్రాంగి వోన ! ఎన్నెన్ని కొన్నా కోకో (కొక + ) కోకో అంటారు, వోయసులో ఉన్నది మొగుడో మొగుడో అనుకున్నట్టు” (వానాకాలం) లాంటి వాక్యాలు చదివినపుడు కవితలోని భాష మనకి ప్రేత్యేకంగా కనిపిస్తుంది. కాదు కాదు వినిపిస్తుంది. అందమైన భావ సంచయాల్ని మనకి పరిచయం చేసిన కవి రంధి సోమరాజు. పుస్తకం పేరు పొద్దు. తొల్తొలి, విశాఖమాండలికంలో కవిత్వం రాసిన అపురూపమైన కవి. లైన్ చదివినా జీవితంలోని మాధుర్యమేదో మనల్ని తప్పకుండా తాకిపోతుంది. ఒసేయ్ ఒరేయ్ అని ఇంట్లో వాళ్ళని తిడుతున్నపుడు, వాళ్ళతో కలసి నవ్వుతున్నపుడు, ఏడుస్తున్నపుడు, గొడవాడుతున్నపుడు మనం వాడే పదాలు, చదివే కవిత్వంలో చూస్తున్నపుడు ఎంతో సరదా గా ఉంటుంది. ఆలాంటి చాలా సరదా సన్నివేశాల్ని పొద్దు పుస్తకంలో మనం చూడవచ్చు. పొద్దంటే కాలం. దీంట్లో పుస్తకంమొత్తాన్నీ వోనాకాలం, శీతకట్టు, యేసంగి పొద్దులుఅనే మూడు పెద్ద కవితలుగా విభజించి రాయడం జరిగింది. ప్రకృతే మూల కవితాంశం. సొగసంతా ఆయన వాడిన భాషా మాండలికాల వల్లనే అబ్బింది. మాండలికంలో కవిత్వంరాయొచ్చా ? పద్యాలు అర్థంగావని వాటి నడువుల్ని వచన కవిత్వమనే దుడ్డు కర్రలతో ఇరగ్గొట్టామ్ కదా. శ్రీ శ్రీ మొదలు నేటి శివారెడ్డి దాకా ఆధునిక కవిత్వమంతా వచనాన్ని చాలా అందంగా రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాంకదా. మాండలికం ఎక్కడా కవిత్వంలో తగల్లేదే ?సోమరాజెందుకు భాష వాడాడు ? అహనాపెళ్లంట సినిమా లో కోట శ్రీనివాస రావ్గట్లైతే బిడ్డా, రామాయణం సెప్తా ఇనుకొండ్రై, రాముడు సీతకి మొగుడన్నట్టుఅని ఒక డైలాగ్చెప్తాడు. బ్రహ్మానందానికి ఏమీ అర్ధం కాక జుట్టు పీక్కుంటాడు. అలాగే ఖుషి అనే సినిమా లో పవన్ కళ్యాణ్బాబయ్యే బంగారూ రమణమ్మ, బాయీ సెరువుకాడ బంగారూ రమనమ్మా, నువ్వొచ్చే వారం పదిరోజులకీ, నిలువూటద్దాలేరమనమ్మఅంటూ శ్రీకాకుళ మాండలికంలో ఒక పాట పాడతాడు. అవి ప్రేక్షకులకి వింత అనుభూతిని కలిగిస్తాయి. మనకి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో , కోస్తా, తెలంగాణా, రాయలసీమ, కళింగాంధ్ర మాండలికాలు వాడుకలో ఉన్నాయి. దురదృష్టవశాత్తూ తెలంగాణా, కళింగాంధ్ర మాండలికాల్ని హాస్య సన్నివేశాల్ని పండించేందుకే ఎక్కువుగా వాడటం జరిగింది. దేవరాజు మహారాజు, రావిశాస్త్రి, కాళోజీ  లాంటి సాహిత్య కారులు ప్రజలు మాట్లాడే భాషని సాహిత్యంలోసజీవం చేసేందుకు ఏంతో కృషి చేశారు. మనం రంధి సోమరాజు పొద్దు కవితా సంకలనాన్ని కూడా అదే కోవలోకి చూడాలి.

మనకి తెల్సి రుతువులు ఆరు. గ్రీష్మమూ, వర్ష, వసంత, శరద్, హేమంత శిశిరాలు.కానీ సోమరాజు కేవలం సంవత్సరంలోని మూడు కాలాల్ని తీసుకుని అనన్యసామాన్యంగా కావ్య రచన చేస్తాడు.

పుస్తకంలోని భావచిత్రాలు చాలా సురుగ్గా ఉంటాయి. “ఇల్లార్పడానికి నీల కార్లెట్టినట్టు ఇళ్ళెండెయ్యడానికి  యెండ కార్లెట్టినా బావుండేది, పెబుత్తమోరుఅన్నప్పుడు మన పెదాలమీద అసంకల్పితంగా చిర్నవ్వు మొలుస్తుంది. “సెమటతో తడ్సి నొల్లు వోనలో తగలడే పెట్రోలు బంకునా మండుద్ది. వోడు సయించగల్డు తాటాకుల మంటఅంటాడు. అలాగే యెండాకాలం బాధని ఎంత బాగా చెప్తాడు కవి.  “సెట్లు తెల్లార్లూ ఏడుత్తాయి గుండెలు బాదుకోనిముక్కుసీదు కోని కొడుకు తన్ని తోలేసినట్టు వొకటే గోలఅన్నప్పుడూ అతని కవిత్వ రచనా పటిమకి అచ్చెరువొందుతాం.

వోన పిల్ల  పూటుగా కల్లుతాగినట్టు, గాలి తిప్పినట్లెల్ల గరగానా గెంతులేత్తే తాటేక్కొంపల కప్పుల్లెగిసిపోయి అయ్యీ గెంతులేసినాయి, సినేమాల్లో గుడ్డలొల్చేసుకోని కుర్రది గెంతులేత్తా ఉంటే, సూత్తున్న కుర్రోల్లు, వొంకర్లోయి నట్టుఅనిరాసినప్పుడు వానాకాలం సొగసుని కళ్ళక్కట్టడం ఎంత సులువైన కష్టమో అర్ధమవుతుంది. అసలు ప్రకృతిని, దాంతో పాటు శృంగారాన్ని, హాస్యాన్నీ కలగలపి వర్ణించడమంటే నన్నె చోడుడి ప్రబంధాలు ప్రసిద్ది గాంచినవని చదువుకుంటాం. కానీ

కవిత్వంలో ప్రబంధ స్థాయి అలంకారాలు ఎంత గొప్పగా ఒదిగిపోయాయో ఆశ్చర్యమేస్తుంది. ఉపమలో, ఉపమేయాలో, ఉత్ప్రేక్షలో ఏమన్నా చెప్పండి, వెతుక్కోపనిలేదు. అంత రమణీయమైన కవిత్వం పొద్దులో కనిపిస్తుంది.

రచన వర్ణనల్లో ; సామాన్యుడి బాధలు, నవ్వులు, సరదాలు, సరసాలు, ఇంకా కొన్ని సత్య ప్రభోధాలూ కనిపిస్తాయి. కవికి కాళిదాసు రాసిన శృంగార ఋతుసంహారం కవికి తెలుసో లేదో మనకి తెలియదు కానీ, ఋతువుల్లో అసలుసిసలు మానవ జీవితాన్ని మన కళ్ళకి గట్టడంలో కవి వంద శాతం సక్సస్ అవుతాడు. “ఎంత యిట్టమైతే మాత్తరం వొదల కుండా వోన కురిత్తె వొద్దు మొర్రో అనిపిత్తాది, తినగా తినగా తీపి సేదెక్కినట్టుఅంటాడు. “సేనాసేపు ఎండలోకూసుండిపోతే యికారం ఎత్తుద్ది. పెల్లాం కాడైనా ఆట్టే కూసుంటే సికా కెత్తదేటిఅనేస్తాడు. నవ్వొస్తుందా ? లోపలెక్కడో సలుపుతుందా ? మనసుని పులకరింపజేయడంలో ఒక్క పదం కూడా వెనుకాడదు. కవితా వాక్యాల్లో అంతటిఆత్మీయత మనల్ని కట్టిపడేస్తుంది.

అలాగే అక్కడక్కడా గుచ్చుతుంది కూడా. ఎందుకీ గుచ్చుడు ? మనిషి కాలంతో కలసి ప్రయాణం చేస్తున్నపుడు ఎండకి ఎండి, వానకి తడిసినపుడు, అలాగే చలికి వొణికినపుడూ ఆతను ఎన్నెన్ని అనుభూతులకు గురవుతాడు. ఎన్నెన్నిజీవన సత్యాల్ని కనుగొంటాడు. అనుభవ సారాంశాల్లోని విషయమంతా కవిత్వ పంక్తుల్లో వొదిగిపోతుంది. కాలికి సిన్ని బెడ్డముక్క తగిల్తే సాలు, పేనం లెగిసెల్లిపోద్ది. ఆడబొడ్సు సిన్ని మాటంటే బుల్లి పేనం గిల గిల్లాడినట్టు” “మొగుడు బుగ్గలు కొరికేత్తే, అలిగి దూరంగా బబ్బో వొచ్చు, సలి కొరికేత్తే యెటెల్లాలో తోసనేదు బుల్లెమ్మకిఅంటాడు. ఎక్కడా ప్రేత్యేకంగా పాత్రలుండవు. పరిచయాలు, ఉపసంహారాలుండవు. కానీ కవితా ప్రవాహ సందర్భంలోనేజీవిత సన్నివేశాలన్నీ కళ్ళ ముందు కదలాడతాయి. ఇంతకన్నా కవిత్వ వస్తువేముంటుంది.

పొయెట్రీలో అమలిన శృంగారం భలేగా ఉంటుంది. “పొద్దుటేల ఎండ మాసైతుగా ఉంటాది, బెమ పడ్డ ఆడదాని ముందే కూసుండి పోయినట్టు, య్యెండలో సతికిల పడాలనిపిత్తాదిఅంటాడు. లేదాకొత్త బియ్యంతో అమ్మ తాజాబెల్లమేసి పాలజావొండితే వొలసిన సిన్నదాన్ని కట్టేసుకున్నట్టుందిఅంటాడు. ఏసంగి పొద్దులు కవితలోయిల్లల్లో  పెల్లాలు పాముల్ని సూసినట్టు దూరంగా సత్తారు. పున్నెముండి వోనొత్తే సాలు, పేనాలు పేనాలు కలేసుకోని యెయ్యేళ్ళసుకం యెన్నె లౌద్ది! యేటో అంత ఉడికి సత్తేగాని ఇంత సుకం కల్సి రాదేమో !” అంటాడు. ఇంతకన్నా అర్ధం కాకుండా పోయే రొమాన్సేమన్నా ఉందా ? వ్యావహారిక భాష ని ఎంతో సమర్ధవంతంగా కవిత్వంలో వాడతాడు కవి. 2002లోతెలంగాణ రచయితల వేదిక మహాసభలో అధ్యక్షో పన్యాసం చేస్తూ, కాళోజీతెలంగాణ యాసను, భాషను వెక్కిరించే వాళ్ళకు చాలా ఘాటుగా సమాధా నమిస్తాడు. ఇంకానేను ఇంతసేపు చెప్పిన దాంట్లో అక్కడక్కడ సభ్యత లేదనేసంగతి నాకు ఎర్కే, కాని నా భాష విషయంలో, నా యాస విషయంలో సభ్యత పాటించని వాని విషయంలో నాకేం సభ్యత. వ్యావహారానికి లేని శిష్టత భాషకెక్కడినుంచి వస్తది అంటాడు. ఇట్లా కాళోజీ, ప్రాంతంవాళ్ళు ప్రాంతం భాషయాస రాయాలని అనేవాడు. ఇంకా ఏమన్నాడంటే, మనం మన యాసలో రాస్తే తెలుస్తదా అంటే, అందరి దస్తూరీలు ఒక్క తరీఖ ఉండవు గదా. కాని అక్షరజ్ఞానం ఉంటే అవతలవాడు ఏం రాసిండో తెలుసుకోవాలనే సహృదయత, జిజ్ఞాస ఉంటే దస్తూరి ఎట్లావున్నా విషయం అర్థమైతది గదా, అట్లనే శబ్దం జ్ఞానం, సహృదయత వుంటే యాసయినా అర్థం అయితది. (కాళోజి పలుకుబళ్ల భాషరామశాస్త్రి ) అంటాడు. శుద్ద వ్యవహారికాన్ని కవిత్వం చేయడంసాహసమే. సోమరాజు గారు పుట్టింది 1927 రాజమండ్రి లో. మరతనికి భాష మీద అంత పట్టు ఎలా చిక్కిందో అర్ధం కాదు. అయితే పూర్వీకులు అవిభక్త విశాఖ జిల్లా అలమండ కు చెందిన వారు కావడం, స్వయానా కవి కవితారచన చేసిన 1972 లో అదే ప్రాంతం చుట్టుపక్కల జీవనం చేయడం అందుకు కారణమయ్యి ఉంటుంది. కానీ ప్రతీ కవితలోనూ గోదావరి ప్రస్తావన తీసుకురాకుండా కవి ఉండలేనితనం మనం గమనించవచ్చు. అది రెండు ప్రాంతాల్ని ఒకచోట సంగమం చేసిన నేర్పరితనంగానే మనం భావించాలి. గోదావరి జిల్లాల్లో యాస గురించి ఎంత చెప్పినా తక్కువు కాదూ ?

యేలెట్టి ఆకాశం కంట్లో పొడిస్తే కారే నీల్లలా వొకటే వోనఅన్నప్పుడు దేన్ని దేంతో పోల్చాడో చూసి ఆశ్చర్యపోతాం. “బొయిలెర్లో నడిసెల్తున్నట్టుంది. రామసేన్ద్ర పెబో ఎండలో నడకలాంటి పద్య పాదాల్లోకూడా అతని అలంకారప్రయోగాలు సర్వజనామోద భాషలో దేదీప్యమానంగా వెలిగిపోతాయి. “ భాషలోనే దీనికి పీఠిక వ్రాయలేనందుకు నిజానికి సిగ్గుపడాలి”  అంటాడు ముందు మాట రాసిన మల్లంపల్లి శరభేశ్వర శర్మ. ఎందుకో కాదనలేం. అలా రాయడంసులువుగా కనిపిస్తుంది గానీ, పెన్ను పట్టుకుంటే గానీ, ప్రాణం గిజగిజ తెల్సి రాదేమో !

అభివ్యక్తిలో నవీనత ఉందని చెప్తే, అది, చెప్పిన కావ్య భాషలోనే ఉంది. ఇలా ప్రయత్నం చేయడంలోనే కొత్తదనం ఉందని చెప్పుకోవాలి. అలవోకగా వాడిన ప్రతీకల్ని, నేపధ్యాల్నీ చదివిన మనకి ఒక రకమైన జలదరింపు కలుగుతుంది. కవి వాడే అధిక్షేపమూ, ప్రేమ, హాస్య ప్రియత్యమూ అలానే ఉంటుంది. “పీక మొయ్య మెక్కి, కాళ్ళు సాపుకోని వూసులాడుకునే ఆడోల్లలాగ సెర్వుకాడ వో బెక బెక లాడ్తాయి కప్పలు తెల్లార్లూ..”అన్నపుడు ఇంకేం చెప్పాలి అనిపించక మానదు. అలాగే సరసం విషయానికొస్తేవొలంగా బల్సినోలు తొడలు కొట్టుకపోయి సవాయి తగులుకున్నోల్లా నడుత్తారు. ఆల్ని సూత్తే వుత్తినే నవ్వొత్తాదిఅనడంలోని చతురత ఇట్టే ఆకట్టుకుంటుంది.

అలాగే ఆయా రుతు వర్ణన చేస్తున్నప్పుడు కూడా మనం అతను అందంగా చెప్పే మాయలో ఇట్టే పడిపోతాం. “ఎన్ని సీతాపల్లు తిన్నా అదేటో, ఇట్టానికిట్టమే గానీ మరో అడ్డుండదు. పానకంలో పుడకనాగ పిక్కలొక్కటే అడ్డు! ఆటినితిని తిని ఇన్ని నీలు తాగితే సాలు వొంటికేటీ సెయ్యదు” “నిప్పుల మీద కాల్సి నేత మొక్కజొన్న పొత్తులిత్తే, అమ్మాయి జెబ్బలు కొరికేత్తున్నట్టు కొరికి నమిలేత్తారుఅంటాడు. వోనాకాలంలో ఇంకోచోట “డబ్బుండాల గానీ కోడి మాంసంగారెలు తింటా ఉంటే వోనాకాలం సొరగమెహే” అనేస్తాడు. అలాగే శీతకట్టు లోఎంతకీ తెల్లారదు, తొంగోనేక తొంగోనేక నడుం పచ్చి పుండై పోనాదిఅన్నప్పుడూ, అలాగేఏటీ రుసిగా నేదు ఎదవ కాలం అని నోకం శోకాలు తీత్తే సెరకుముక్కిచ్చి సూసుకో నా మజాకా అంది సలిఅన్నప్పుడూ; ఆ కవిత్వ ప్రతిభను చూసి నిశ్చేస్టులవడం సాధారణమైపోతుంది. ఏ కాలంలో ఏం దొరుకుతాయో మనకి తెలియజెప్తుదీ కవిత్వం.

“తాటి ముంజి లెన్ని తిన్నా ముద్దులేనా వొద్దంటాది గానీ, ఆటినొద్దనదు పేనం” అని ఎండాకాలాన్ని గురించి చెప్పినపుడు మాండలికంలో రాసే వాళ్ళపట్ల ఎనలేని ప్రేమని పెంచుతుందీ పుస్తకం. అంతకన్నా సాహిత్యం ఏం చెయ్యాలి ?

పుస్తకంలో మానవతా దృశ్యాలు, చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. “పేదోళ్ల గుండెలు కబుర్లకి; మట్టిళ్ళు వోనలకే  కరిగి జావ జావై పోతాయిఅని పేదవాడి మనసుని వర్ణిస్తాడు. “తెల్లారేతలికి ఇల్లంతా పొక్కిపోయిఅంతాపనేఇంటిది మట్టి మెత్తి మెత్తి  అలకనేకలకనేక సచ్చిందిఅంటాడు. అలకడానికి ఆమెంత ఇబ్బంది పడిందో గానీ, కవి మాత్రం ఆమె కష్టాన్ని చూసి నీరు నీరైపోతాడు. “కడుపుతో ఉన్నోల్లకి రేగుబళ్ళ వొడియాలిచ్చి పొట్టలోనిపాపాయిలికి సలి రుచులు మప్పిందిఅన్నపుడు రేగుబళ్ళ పులపుల్లదనం మన హృదయ జిహ్వ మొనలకి తాకకుండా ఉండదు. అలాగే ఎండాకాలం పోలీసోళ్ళ బట్టలగురించిఎట్టా ఇట్టా పడ్తున్నాడో యేమో కానిట్టేబులయ్య. గొడ్డుసెర్మంనాటి కాకి గుడ్డలు. అంతేనే, తిండికోసరం సీదర మొయ్యకేటి సేత్తాడుఅని కవిత్వీకరిస్తాడు. ఎంత జాలి చూపిస్తాడో ? జీవితంమీద మనిషి ప్రేమని, ప్రేమలోని అపారమైన నమ్మకంతో కూడిన మమతని ప్రకటించడంలో కవిసఫలీకృతుడవుతాడు.

సిన్ని తువ్వాలు తడిపేసి డైవోరు సెవులికి సుట్టుకుంటే సెనంలో అది పూతరేకునా మొర మొర లాడి పోనాదిఅంటాడు ఎండా కాలంలో బస్ డ్రైవర్ల బాధలు చూసి.బేల్దారి పనిచేసే వాణ్ణుద్దేసించిబెడ్డ బెడ్డకి సెంబుడి నీళ్లు తాగి తాపీవోడు ఇల్లు కడతావుంటే గోడలకి నీలు సాల్డం నేదని అలో పోలో మన్నాడాసామి! పేనాల కన్నఇల్లే సిరకాలం మన్నుద్ది గా మరిఅంటాడు. ఈ అధిక్షేపం ప్రాణాల విలువ మర్సిపోతున్న పోగాలాన్ని అద్దంలో చూపెట్టడంలా నే భావించాలి.

మామిడి పళ్ళు మా రాజులకే;వాటి ఖరీదు సూరీడునా మండుద్దిఅనోసలిలో పడవలు నాగేవాల్లని  సూసి సలిదేవుడే సలెత్తి పోనాడుఅన్నప్పుడో కవి అభివ్యక్తిలో మామిడిపళ్ళు పేదవాడికందుబాటులో లేవనీ, అలాంటి కాలావస్థల్లోనూ కష్టాలకి ఎదురీదే మనిషి శ్రామిక తత్వంలోని గొప్పదనాన్ని మనకు కళ్ళగ్గడతాడు.

కవిత్వంలో మానవ జీవన స్పర్శలకన్నా వేరు తడిదనం ఏముంటుంది. అలా అని కవి అభ్యుదయ కాంక్షని ఎక్కడా విడిచిపెట్టడు. “సెక్కరవొర్తిని తగిలేసి పెజా సామియం తలెత్తినట్టు మంచును సూరీడు సీల్సేత్తే” లాంటి ప్రతీకలు ఆసక్తిగా ఉంటాయ్. కవి బాధలు పడుతున్న వర్గం పక్షాన గొంతు వినిపిస్తాడు. “ఏరుసెనక్కాయలు తింటూ సినేమా కట్టాలు సూసి, కన్నీలెట్టుకునే కుర్రోలకి; ఈదిలో గేటు ముందల సలిలో కూసోని శెనక్కాయలమ్మే ముసిలి ముద్ద, వొక్కసారీకల్లల్లోకి రానేదదేటి సిత్రమోఅన్నపుడు గానీ  “సెప్పుల్లేకుండా రోడ్డేసేవోల్ని సూసి తారుతో కరిగి డబ్బాలోంచి సుక్కలు సుక్కలుగా రాలి ఏడ్సింది ఎండఅన్నప్పుడు కానీ, కవి కష్టజీవి పక్కన నిలబడ్డ ఉనికి మనకి తెలిసిపోతుంది. “సల్లని గాలి తాకిడికి సుకంగ కరిగిపోద్ది మబ్బు. గొప్పోల్లు అలా పేదోల గుండెల్ని కరిగిత్తే నోకమంతా ఔద్దొరే వొకటే సేమంతి పువ్వు” లాంటి భావ ప్రకటనలు సమ సమాజం ఏర్పడ్డం పట్ల తన ఆశలు మనకి తెలుస్తాయి.

అయిసు పూటు లమ్ముతూ సిట్టి తండ్రి అమ్మ కడుపులో సిచ్చెట్టి, వొడ దెబ్బకు రాలి పోనాడుఅన్నపుడు మనకి మనసు దుఖ్ఖముతో నిండి పోతుంది. “ కుర్రోడు సరదాకి సానింటికెల్తే ఏటో సుకంగా నేదు పొమ్మందట. వొల్లమ్ముకునేవోలికీ కట్టంగానే ఉంది కాలంఅని కూడా అంటాడు. కాలం ప్రజల్ని పెడుతున్న కష్టాలు కాలానివి మాత్రమే కాదని సమాజంలోని అసమానతలవనీ చెప్తాడు. అవి డబ్బున్నోళ్ల అడుగులుకి మడుగులొత్తే విధానంకూడా తన పద్యపాదాల్లోఅద్భుతంగా రాస్తాడు.

గేస్ పొయ్యిమీద కూడొండుకోని, ఆడోల్లు గవ్వలాట లాడుకుంటూ గువ్వల్లా కులుకుతారు. సద్వుకున్నాడోల్లు పుత్తకాలేపె సూత్తూ ముత్తేలల్లే మెరుత్తారు. పేదోల్లు మాత్తరం  తడ్సిన పుల్లల్ని రాజేసే నిప్పురవ్వనేకకళ్ళుబ్బి దవళ్ళు నొప్పిపడతారని ఒక హృదయ క్లేశ దృశ్యాన్ని ఆవిష్కరిస్తాడు.కలిగిన వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు, యెటొచ్చీ సమస్యల్లా పేదవాడికేనని కవి చాలా చోట్ల చెప్తాడు. మనం ఒప్పుకుంటాం కూడా.

వచన కవిత్వం పుట్టిన్నాటి నుండీ ఎన్నెన్ని హొయలు పొయిందీ ఈలాంటి సంకలనాల్ని చదివితే అర్ధమవుద్ది. “పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా అని ఒక మహాకవి ఎందుకన్నాడో తెలీదు కానీ వోన బురద లో ఉండే జీవితాల్నికళ్ళక్కట్టిన అపురూప కావ్యం పొద్దు.”ఎండలు పేనాలు తీత్తే వానలు పేనాలిత్తాయి. అందుకేనోరే ఎండలు ఎములోలు; వానలు సల్లని తల్లులుఅని అనగల్గిన మనసున్న కవి రంధి సోమరాజు. 1993 లో తెలుగు యూనివర్సిటీ వాళ్ళుగేయ సాహిత్యానిగ్గానూ సోమరాజుగారికి ప్రతిభా పురస్కారం కూడా ఇచ్చారు.

ఇంతకీ మూడు కాలాల్లో నీకేది బాగా నచ్చిందో సెప్పు సెప్పుమంటే ఏటి సెప్పగలవ్ ? నీకు నువ్వే ఈ ప్రశ్న వేసుకున్నాక, శీతకట్టు మనల్ని ఎక్కువుగా ఆకట్టుకుందేమో అనిపిస్తుంది.”సినేమా వొదలగానే రిక్సాలో కూసోని మొగుడూ పెల్లాలు సలెత్తి పోతూ “ఉహూ..ఉహూ.. అని దగ్గరపడి పోతావుంటే, రిక్సావోడి గుండెల్లో తాపం పేట్రేగిపోయి లెగిసిన మంటలు ఆడి సలిని తోలేసి ఉంటయ్. నేకపోతే అంత సలిలో రిక్సా తొక్కగల్డేటి? ” లాంటి వాక్యాలు వేరే కాల వర్ణనల్లో దొరకవు గాక దొరకవు. అయితే ఆ తర్వాత వోనాకాలమే.

పుస్తకం నిండా సామాజిక వాస్తవికత కనిపిస్తుంది. రచనా విషయమంతా వర్తమాన జీవితాల్లోదే. సెక్యులర్, మానవత్వ స్పృహతో కూడిన ఛాయలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకోటి సహజత్వం. అన్యాయాల్ని అన్యాయంగచెప్పటానికి కవి వెనుకాడ్డు. సంజీవ్ దేవ్ అందుకేసోమరాజు కవిత సామాజిక సెటైర్అని కితాబిస్తాడు. ఇందులో చాలా సామెతలు కనిపిస్తాయి. వాటిని విలక్షణంగా వాడిన తీరు కనిపిస్తుంది. మామూలుగా ఒక ప్రాంతం వాళ్ళమాండలిక భాష ఇంకో ప్రాంతం వాళ్ళకి అర్ధం కావడం సులువు కాదు. దీంట్లో సమస్య లేదు. అతని భాషలోని సుకుమారపు శైలి వల్లో, నిర్మాణం వల్లో, పొద్దు మనల్ని గాఢంగా వశపరుచుకుంటుంది. కాలానికివోడేనా తలొగ్గ వొలిసిందే నొరే ! అన్న చిన్న మాట చాలా అనల్పార్ధంలో తెలియజేస్తాడు కవి. దీన్ని వైయుక్తికమనలేమూ, అణగారిన సామాజిక జీవన చైతన్యమూ అనలేము. అయిరెండూ కల్సిపోయిన ఇంకోటేదో ఉందొరే ! “కూత్తున్న కోయిల, సెట్టుకాడనిలేత్తాది. యిని యిని వో సెట్టైతే సాలనిపిత్తాది“. “ఇల్ల కప్పులమీద దారి తెలియనట్టు పొగ నిల్సిపోనాది. ఏ ఊరెల్లాలో మరి ఆ పొగ పిల్ల.”  సెట్టయి పోయి కోయిల పాట ఇనాలో, పొగ పిల్లతో కల్సి ఏ ఊరెల్లిపోవాలో అదిక నీ పనహే. ఆనకొరే, నేనేటీ సేయనేను.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

29 comments

 • చక్కని పదవిన్యాసం,మాండలికంతో మనసు చూరగొన్న రచనకు వందనం అభివందనం

 • అలవోకగా మూడు కాలాలను ఒక‌ పొద్దులోనే అతి సహజంగా చూపించి కవితాహృదయాలను గెలుచుకున్న కవి సోమరాజు గారు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో…తనప్రాంత మాడలికంలో రాసిన ఈ కవిత్వం నిండా సటైర్ లు,సరదాలతో ఆలోచనాత్మకంగా ఉండటం కూడా విశేషం… శ్రీరామ్ గారు ఈ ‘పొద్దు’ మీ సమీక్ష చాల బాగుంది…. అభినందనలు..

 • బాగుంది…మీ… ఈ దృష్టితో మళ్లీ ఒక సారి చదవాలనిపిస్తుంది.

  • ఈ పుస్తకం ఇచ్చిందే మీరు. ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి మీకు. పాత పుస్తకాలు దొరకడం ఎంత కష్టమో తెలుస్తోంది. మీ లాంటివాళ్ళుండబట్టి మేలు జరుగుతోంది….లేకపోతే ఈ వ్యాసాలెక్కడివి ? థ్యాంక్యూ సార్.

 • అమేజింగ్ పోయెట్రీ. రెఫ్రెషింగ్. నైస్ ఇంట్రడక్షన్.

 • బాగా రాసావ్. ఆయన చమత్కారం బాగా చూపినావ్. ఇలాంటి కవులు ముందే పరిచయమైవుంటే బాగుండు.

  • థ్యాంక్యూ సర్. థ్యాంక్స్ ఫర్ యువర్ సో కైండ్ హార్ట్ అండ్ సో లవబుల్ వర్డ్స్.

 • సాహిత్య కారులు ప్రజలు మాట్లాడే భాషని సాహిత్యంలోసజీవం చేసేందుకు ఏంతో కృషి చేశారు. మనం రంధి సోమరాజు పొద్దు కవితా సంకలనాన్ని కూడా అదే కోవలోకి చూడాలి.
  నేను ఇంతసేపు చెప్పిన దాంట్లో అక్కడక్కడ సభ్యత లేదనేసంగతి నాకు ఎర్కే, కాని నా భాష విషయంలో, నా యాస విషయంలో సభ్యత పాటించని వాని విషయంలో నాకేం సభ్యత. వ్యావహారానికి లేని శిష్టత భాషకెక్కడినుంచి వస్తది అంటాడు.
  “పేదోళ్ల గుండెలు కబుర్లకి; మట్టిళ్ళు వోనలకే కరిగి జావ జావై పోతాయి” అని పేదవాడి మనసుని వర్ణిస్తాడు. “తెల్లారేతలికి ఇల్లంతా పొక్కిపోయిఅంతాపనే…ఇంటిది మట్టి మెత్తి మెత్తి అలకనేకలకనేక సచ్చింది” అంటాడు.
  “సెక్కరవొర్తిని తగిలేసి పెజా సామియం తలెత్తినట్టు మంచును సూరీడు సీల్సేత్తే”
  “సల్లని గాలి తాకిడికి సుకంగ కరిగిపోద్ది మబ్బు. గొప్పోల్లు అలా పేదోల గుండెల్ని కరిగిత్తే నోకమంతా ఔద్దొరే వొకటే సేమంతి పువ్వు”
  “గేస్ పొయ్యిమీద కూడొండుకోని, ఆడోల్లు గవ్వలాట లాడుకుంటూ గువ్వల్లా కులుకుతారు. సద్వుకున్నాడోల్లు పుత్తకాలేపె సూత్తూ ముత్తేలల్లే మెరుత్తారు. పేదోల్లు మాత్తరం తడ్సిన పుల్లల్ని రాజేసే నిప్పురవ్వనేక” కళ్ళుబ్బి దవళ్ళు నొప్పిపడతారని ఒక హృదయ క్లేశ దృశ్యాన్ని ఆవిష్కరిస్తాడు.కలిగిన వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు, యెటొచ్చీ సమస్యల్లా పేదవాడికేనని కవి చాలా చోట్ల చెప్తాడు. మనం ఒప్పుకుంటాం కూడా.
  ఈ పుస్తకం నిండా సామాజిక వాస్తవికత కనిపిస్తుంది. రచనా విషయమంతా వర్తమాన జీవితాల్లోదే. సెక్యులర్, మానవత్వ స్పృహతో కూడిన ఛాయలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకోటి సహజత్వం. అన్యాయాల్ని అన్యాయంగచెప్పటానికి కవి వెనుకాడ్డు. సంజీవ్ దేవ్ అందుకే “సోమరాజు కవిత సామాజిక సెటైర్” అని కితాబిస్తాడు.
  ఆయన ఎంత బాగా రాశారో, మీరంత బాగా విశ్లేషించారు శ్రీరామ్ గారూ… మీరూ ఒక్కోసారి మాండలికంలోకి ఒలికిపోయినట్లన్పించింది. మీరూ పరవశించిపోయినట్లూ.. మీ అనుభూతులు జోడించిన సమీక్ష చెప్పకనే చెప్తోంది.. మీ సమీక్షలో మరో మంచి ముత్యంలాంటిదే ఇది… అభినందనలు..

  • మీ అభిమానానికి థ్యాంక్స్ చెప్పే పదాలు నా దగ్గర లేవు. అంతే. యు ఆర్ సచే వండ్రఫుల్ ఫ్రెండ్. రియల్లీ. సో గుడ్. సో…..

 • కవిత్వంలో యాస,మాండలికం కలిస్తే ఎంత అద్భుతమయిన జీవ కవిత్వం సృజించవచ్చొ ఇది ఒక ఋజువు

  • థ్యాంక్యూ సత్యా…నీ అందమైన వాక్యాలు గుర్తొస్తున్నయ్…తెలంగాణా మాండలికం నువ్ బాగా పలికించావ్

 • పలుకుబడుల భాషనే పుస్తక భాష కావాలి అని చెప్పిన కాళోజీ మాటలను “పొద్దు” లో వాస్తవమై కనబడటం చాలా సంతోషం…. యాస ను అర్థం చేసుకోవడం ఇబ్బంది అయినప్పటికీ …తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే తెలుసుకోవచ్చు…. మాట్లాడే యాసలో చదువుకోవడం,రాయడం అనేది ఒక తీయని అనుభూతి…. మీరు యాసను పసిగట్టి సమీక్షించిన విధానం చాలా బాగుంది శ్రీ రామ్ సార్….అభినందనలు…..

  • థ్యాంక్యూ రాధిక గారు. కాళోజీ ని భుజానేసుకుని ఇష్టపడుతున్నందుకు..

 • చాలా మంచి కవిత్వాన్ని పరిచయం చేసారు…నిజంగానే చాలా సహజమైన మాటలలొనే అద్భుతమైన భావాలు పలికించారు.. సోమరాజు గారిని చదివి తీరాల్సిందే…tq శ్రీరామ్ సోదరా 💐💐💐

  • సాయి, ఈ కవితలు మనిద్దరం కల్సి చదవాలి…నీ గిలిగింతల నవ్వుల మధ్య…

 • ఇది నవ కవితే,
  సోమరాజు వాడిన యాస
  అనుభూతులకు ఆవిరి పట్టినట్లుంది
  పలుకులన్నీ చెణుకు లైనట్లు యాస కొత్త పుంతలు తొక్కింది.సోమరాజు ను ఈ తరానికి పరిచయం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది.కంగ్రాట్స్ శ్రీరామ్.

  • సర్. ధన్యవాదములు. మీ ఆశీర్వచనానికి సదా కృతజ్ఞుణ్ణి.

 • చదవడం మొదలెట్టగానే ముడుచుకున్న పెదవులపైకి అలవోకగా చేరిన చిరునవ్వు హాయంటే ఏంటో చెప్తుంది.
  ఒకో వాక్యం నుండీ కళ్ళు కిందికి జారుతున్న కొద్దీ.. మదిలో పేరునెయ్యి లా పేరుకుంటుంది.
  అసలే ఇప్పుడు (శీ)సీతాకాలమాయే..
  కొబ్బరినూనె ఎండలో ఎట్టాలి.
  పేరునెయ్యి పొయ్యి మీదెట్టాలి.
  ఎండా, పొయ్యి లేకుండానే
  మనసునెచ్చబెడుతుంది ఈ కవిత్వం.

  చిక్కటి చిరునవ్వు చివరవరకూ సాగింది.
  ఏ ఒక్క కవిత ను ఇక్కడ ఉదాహరించినా మరో కవిత విస్తుపోవడం ఖాయం.
  చమత్కారి ఈ కవి.
  నిజ జీవితంలో జరిగే సామాన్యమనబడే అనేక విషయాలు సైతం ఆకట్టుకునేలా చెప్పారు.
  చాలా బావుంది వారి కవిత్వ శైలి.
  మీ మాటల్లో ఈ కవిత్వం మరింత బావుంది. ఇద్దరికీ అభినందనలు 💐 💐

  • హాయంటే చెబ్తోంది…మీ మంచి వ్యాఖ్య. థ్యాంక్స్ యామినీ గారు.

 • మీ శైలి లో కాస్త మార్పు..
  కవి మూడ్ నుండి భాష సౌందర్యం…విలక్షణత వైపుగా…

  కవితా వాక్యాల్ని పేర్కొంటూ అందులోని సౌందర్యాన్ని ఇంజెక్ట్ చేసినట్టుగా ఎప్పటిలాగే.. మరో ఆణిముత్యం కోసం ఎదురు చూసేట్టుగా ఉంది సర్..
  కవితల్లో వాక్యాలను చెప్పాల్సిన అవసరం ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాలి..సహజంగా వాక్యాలు రాసి విశ్లేస్జిస్తారు..మీరు ఆ వాక్యాలు ప్రసంగీకత.. కవి ఆలోచనల్ని పద విశేషనల్ని రమ్యతని కవిత్వం లోకి తీసుకొచ్చిన విధానం అందంగా చెప్పారు..

  ఇంకో విషయం ఈ ఆర్టికల్ లో అంశాల్లో బహుశా కవి ఆలోచనలు.. మీ దృక్పధాన్ని కూడా కలిపి చూపుతున్నాయి
  బహుశా కవి అనుభూతులని లోతుగా స్వీకరించే విద్యేదో మీకు అబ్బింది..ఎన్నుకునే పుస్తకాలు..కవులు ఎంత ఆసక్తికరంగా వుంటాయంటే..మరో ఒకటో తారీకు కోసం ఎదురు చూసేట్టుగా..అక్కడ అకౌంట్ నిందుతుందేమో కానీ..ఇక్కడ మంచి సాహితీ పరిచయం తో మనసుమాత్రం తృప్తి పడేట్టుగా…అభినందనలు.. సర్..

  • ఎంతటి సునిశిత చూపుతో చూస్తున్నారు మీరు. నాకు చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. మీ అబ్జర్వేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి. థ్యాంక్స్. మనం ఇవన్నీ చదవాలని నా అభిలాష. చదవడం వలన కవిత్వావగహన చాలా వరకు డెవలప్ అవుతుందని తెలుస్తోంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.