పిరమిడ్ మీద ‘నరసింహం’

ప్రపంచ వ్యాప్తంగా ఈజిప్ట్ అంటే మొదట స్ఫురణకు వచ్చేది పిరమిడ్స్, ఆ తరువాతే నైలు నది తదితరాలు. ప్రాచీన ప్రపంచ వింతల్లో ఈజిప్ట్ పిరమిడ్స్ కున్న స్థానం మరే వింత కు లేదు.  కోట్ల మందికి పిరమిడ్స్ చూడటం జీవితం లోని ఒక కల. ఉత్సుకతతో మనం వాటిని చూసిన తరువాత కూడా అంతే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. అంత గొప్ప కట్టడాలు.         

పిరమిడ్స్ ఒక్క ఈజిప్ట్ లోనే కాదు మిడిల్ ఈస్ట్ లో ఇంకా కొన్ని దేశాలలో వున్నాయి  కానీ అవేవి మనం ప్రపంచ వింత గా చూడాల్సినంత గొప్పగా వుండకపోవడం ఈజిప్ట్ లో వున్న వాటినే నిజమైన పిరమిడ్స్ అని భావిస్తుంటారు. ఈజిప్ట్ రాజధాని కైరో చుట్టప్రక్కల (దాదాపు యాభయి కిలోమీటర్స్ దూరంలో) చాలా పిరమిడ్స్ వున్నాయి అవి కాకుండా కైరో దక్షిణ ప్రాంతంలో కొన్ని పిరమిడ్స్ వున్నాయి కానీ అవి కైరోకు పాతిక కిలో మీటర్ల దూరంలో వున్నా గిజా పిరమిడ్ అంత పెద్దవి కాదు. ఈ రోజుకు మనం ప్రపంచ వింతలుగా చెప్పుకొనేది ప్రతి చోట మనకు చూపించేది గిజా పిరమిడ్స్ నే. గిజా పిరమిడ్ వున్న ప్రాంతం లోనే… మన నరసింహునికి రివర్స్ లో సింహం ఆకారం, మనిషి తల కలిగిన ఆకారం వున్న  స్ఫింక్స్ పిరమిడ్ కూడా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పిరమిడ్స్ అంటే మనం చెప్పుకొనేది వీటి గురించే.

మూడో ప్రపంచ దేశాలలో పిరమిడ్ల కన్న ఎక్కువ చారిత్రక ప్రాధాన్యం కలిగిన స్థలాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వాటిని చూడటానికి వచ్చే వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. దీనికి మన దేశం  కూడా మినహాయింపు కాదు. చారిత్రక స్థలాల దగ్గర ఇలాంటి పరిస్థితికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపం , ఆ సమాజాలలో పేరుకు పోయిన పేదరికం, అవినీతి వీటికి కారణాలు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ( ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో) క్రమ పద్దతి నిర్వహణ వుంది,. అందుకు తగినట్లు వారు మన దగ్గర వసూలు చేసే రుసుములు కూడా ఎక్కువగానే ఉంటాయి. యూరోపియన్ దేశాలలో ఏ దేశం లోను (ఇటలీ లోని రోమ్ మినహా) ఈజిప్ట్ పిరమిడ్స్ కు దీటైన చారిత్రక ప్రదేశాలు లేవు, వారి నిర్వహణ తీరు వల్ల సాధారణ ప్రదేశాలు కూడా సందర్శకులు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలుగా మారాయి. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబ్స్ కు గురైన చర్చిలను కూడా చారిత్రక ప్రదేశాలుగా మార్చి వేశారు. చివరకు బెర్లిన్ లో ఇటీవల కొంత మంది  టెర్రరిస్టులు బస్సు నడిపి పదిమందిని  తొక్కి చంపితే దానిని కూడా ఒక ప్రదేశంగా మార్చి సాయంత్రం కాగానే కొంత మంది అక్కడికి వచ్చి సంతాప సూచకంగా పూల బొకేలను ఉంచి పోతారు.

మనం మాత్రం ప్రపంచాన్ని అబ్బురపరిచే ప్రాచీన సంపద వుండి  కూడా, వచ్చిన వారి నుంచి అందినంత దోచేయాలని చూసి, భయపెడుతుంటాం. ఈ నేరానికి ప్రజల కంటే ప్రభుత్వాలదే బాధ్యత . ఉదాహరణకు పిరమిడ్స్ దగ్గర, కైరోకు భారత దేశం లోని  నగరాలకు పెద్ద తేడా ఉండదు. విపరీతమైన ట్రాఫిక్. దానికి తోడు రోడ్స్ నిర్వహణ, ట్రాఫిక్ జంక్షన్స్ దారుణంగా ఉంటాయి. కైరో ఎయిర్పోర్ట్ నుంచి యాభై కిలోమీటర్స్ దూరంలో వున్న గిజా పిరమిడ్ చేరడానికి మూడు, నాలుగు గంటలు పట్టవచ్చు. కైరో నుంచి అలెగ్జాండ్రియా పోయే దారిలో పిరమిడ్స్ ఉండటం వల్ల మిగతా వాహనాలతో కలిసి పోవలసి ఉంటుంది. గిజా పిరమిడ్ పోవడానికి బస్సు సౌకర్యం కూడా వుంది గాని, చాలా సమయం పడుతుంది.  క్యాబ్ మొదలు అందరూ ఏదో విధంగా మన దగ్గర పిండుకోవాలని చూస్తారు.

పిరమిడ్స్  చూడటాన్ని రెండు భాగాలుగా విభజించాలి. ఒకటి పగటి వేళ పిరమిడ్స్ ను చూడటం, రెండు రాత్రి వేళ  వుండే “లైట్ అండ్ సౌండ్ షో (light and sound show ). రెండూ “అరే ఎందుకొచ్చాం రా బాబు ” అంటూ నిరుత్సాహపడేలా వుండవు. రెండూ బాగానే ఉంటాయి.  

పగటి వేళలో పిరమిడ్స్ వున్న ప్రాంతానికి టికెట్  ఆరువందల వరకు ఉంటుంది. అదే పిరమిడ్ లోపలికి పోవాలంటే దాదాపు రెండు వేలు వుంటుంది, కానీ పిరమిడ్ లోపల ప్రస్తుతం ‘మమ్మీ’ లు (భద్రపరరిచిన ప్రాచీనన శవాలు) లేవు. వాటిని ఎప్పుడో  మ్యూజియంలకు మార్చేశారు. వాటిని ఉంచిన అరలు మాత్రం చూడవచ్చు. పగటి వేళ ఆ ఎడారి లో లిబియా లాంటి దేశాల వైపు ఒంటెల మీద పోతున్న వారిని కూడా చూడవచ్చు. ఒంటె లేదా గుర్రం మీద పిరమిడ్స్, స్ఫింక్స్ (sphinx )చూపిస్తామంటూ మనల్ని  చాలా మందే వెంబడిస్తారు. మన గైడ్ మంచోడైతే సరే లేక పొతే మనం ఒంటెకు కట్టే ఛార్జ్ లో కూడా వారి దగ్గర భాగం తీసుకొని వారితో ఎక్కువ రుసుం డిమాండ్ చేయిస్తాడు. పిరమిడ్స్ తరువాత నైలు నది మీద పడవలో విహారం, ఆ తరువాత మ్యూజియం కూడా చూడవచ్చు. మ్యూజియం లో  ‘మమ్మీ’ లను చూడవచ్చు.

రాత్రి వేళ వుండే షో ధర కూడా దాదాపుగా రెండు వేల వరకు ఉండవచ్చు గాని, చాల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లైటింగ్ లో ఆ పిరమిడ్ లలో ఒకటైన స్ఫింక్స్ తన కథ చెబుతున్నట్లు షో మొదలవుతుంది. పిరమిడ్ ల చరిత్రంతా ఆద్యంతం చాల ఆసక్తిగా సాగే ప్రెజెంటేషన్ తో ఆకట్టుకొంటుంది. ఒక షో ఇంగ్లీష్ లోను కొన్ని షోలు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ తదితర భాషలలో ఉంటుంది. మన గోల్కొండలో మాదిరి కొన్ని ప్రైవేట్ ఫంక్షన్స్ కోసం అద్దెకు కూడా ఆ ప్రాంతాన్ని ఇస్తారని విన్నాను.

నా అనుభవం ప్రకారం మనం ఉదయం ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా వెళ్లి వస్తే అంత మంచిది, పది గంటలు దాటితే సందర్శకులు పెరుగుతారు, దానికి తోడు ఎండ కూడా ఉంటుంది. కొంత మంది గైడ్స్ మంచి వాళ్ళు వున్నారు కానీ ఎక్కువ మంది ఫ్రాడ్స్ అని గుర్తుంచుకోవాలి. దానికి తోడు పిరమిడ్ చుట్టుపక్కల ఇళ్లు వున్న వాళ్లు పురాతన కాలం నాటి  తాళపత్ర గ్రంధాలను చూపిస్తామని చెత్త అంతా చూపించి టోపీ వేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈజిప్ట్ పోలీసులకు ఇండియన్ పోలీస్ కు పెద్దగా తేడా లేదు. అక్కడా ఫ్రాడ్ చేసే వారికి పోలీసుల మద్దతు బాగానే ఉందని విన్నాను. మనము ట్రాన్సిట్ ప్యాసెంజర్స్ (transit passengers ) అయితే ఎయిర్పోర్ట్ లోనే మనకు వంద డాలర్ల లోపే చెల్లింపుతో పిరమిడ్  మరియు ట్రాన్సిట్ వీసా ఇస్తారు.

పిరమిడ్స్, తాజ్ మహల్ లాంటి స్థలాలు నిస్సందేహంగా గా ప్రపంచం అద్భుతాలు, ఒకనాటి వైభవాలకు ఆనవాళ్లు. వాటిని  కాపాడుకోవడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ విషయం లో యూరోపియన్ దేశాలను చూసి మన ప్రజలు, ప్రభుత్వాలు చాలా నేర్చుకోవాలి.

 

 

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.