రిస్క్

నంబూరు – కాకాని – నంబూరు – కాకాని.
ఆటో బస్టాండ్ దగ్గర ఆపి అదే పనిగా అరుస్తున్నాడు కుమార్. ఆటో లన్ని అటుఇటుగా ఆపి తోటి డ్రైవర్లు కూడా అరుస్తున్నారు. వచ్చే పోయే బస్సులు, వాహనాలు- మనుషులు, రద్దీగా ఉంది రోడ్డంతా. ‘దీనెమ్మ జీవితం ఒక్కొకరోజు బోణీ కూడా కాదు’ అనుకుంటున్నాడు. ఆటో వెనక లౌడ్ స్పీకర్ లో ‘రత్తాలు రత్తాలు’ పాట బాగా వినపడుతుంది. నంబూరు – కాకాని నంబూరు – కాకాని, కాకాని మళ్ళీ పల్లవి అందుకున్నాడు. ఇద్దరు మహిళలు ఎక్కారు. ఇంకో యూనివర్సిటీ కుర్రాడు కూడా. ‘కొంచెం సదురుుకోండి’. రోడ్డు మీద నుంచుని ఇంకో పెద్ద మనిషిని పిలుస్తున్నాడు. ‘సార్ రండి . రండి నంబూరు- యూనివర్సిటీ- కాకాని’. ఇంకొక తనువచ్చాడు.  ‘అన్నా త్వరగా పోనీ’ యూనివర్సిటీ కుర్రాడు.  ‘వెళ్దాం వెళ్దాం’ ఇంకొక్కిరాయి.  నంబూరు – కాకాని యూనివర్సిటీ’.
‘ఇంకా పది వేలు అయితే గాని చిన్నదాని కాలేజీ ఫీజు పూర్తి కాదు. పెద్దాడు పుట్టినరోజు కి మంచి సెల్ కొనమంటున్నాడు. రెండు నెలలు మంచి కిరాయిలు దొరికితే చాలు’.
రాత్రంతా జ్వరం -వద్దన్నా వచ్చాడు పనిలోకి ‘సార్ నంబూరు- కాకాని.  ఆటో వెనక 8 మంది తో నిండుకుంది. ఆటోలో వాళ్లు ఫోన్లో మాట్లాడుకుంటూ బాగా బిజీగా ఉన్నారు . ‘వచ్చేస్తున్నా ఆటో బయలుదేర లేదు .ఇంకో పావుగంట’ చెబుతోంది ఒక  ఒక స్త్రీ. ‘వస్తున్నా బే పావుగంట’ చెబుతున్నాడు యూనివర్సిటీ కుర్రాడు ఫ్రెండ్ తో . ‘ఏం బాబు కదలరా’ అడుగుతోంది ఇంకొక ఆమె.  ఇంకో బేరం ఎక్కించుకుని పక్కకి జరిగాడు కుమార్.  ఆటో బయలుదేరింది. పక్కనుంచి వెంట్రుకవాసిలో దూసుకుపోయింది ఆర్టిసి బస్సు.  ‘వామ్మో’ అందుకుంది ముసలామె.భద్రంగా తీసుకెళ్లు బాబు. మనవడి బారసాల కి పోవాల. అంది. ‘మీరు నిమ్మలం గా ఉండండి . అంతే’.  ఆటో వేగం అందుకుంది. బ్రిడ్జి దగ్గర ఇంకొక అతను ఎక్కాడు.  ముందు ఒక్కడి సీటు నలుగురు పంచుకున్నారు. కుమార్ కుడివైపు చివరకు జరిగి ఎడం చేతిని చాచి  హ్యాండిల్ పట్టుకుని నడుపుతున్నాడు.
 ‘ఎందుకు ఇంతమంది కష్టం కదా.’ అడిగాడు ఒకాయన.  ఏదో నాలుగు రూపాయలు బాబు. ఇల్లు కిరాయి. బండి కిరాయి. పిల్లల ఫీజులు. నడవాలి గా ఆటో తోపాటు బతుకు.’ నవ్వుతూనే పోనిస్తున్నాడు. రిస్క్  కదా అన్నా ఇంకొకతను.  రిస్కే సార్ ఏం చేస్తాంం. మీది నాది ఇద్దరి అవసరం. జీవితమే రిస్కు.  ‘అచ్చా అచ్చా’ అంటూ పాట మారింది. ఆటో పరిగెడుతోంది వేగంగా. పెట్రోల్ బంక్ జంక్షన్ వచ్చింది. అటు ఇటు ట్రాఫిక్.  ఒళ్ళు ఎందుకో బాగా వేడెక్కింది. తల నొప్పి తో పాటు కళ్లు తిరుగుతున్నట్లు ఉన్నాయి. నంబూరు లో టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోవాలి. రెస్ట్ తీసుకో కుండా వచ్చేసాడు.
ఎట్లైన ఈనెల పిల్ల దాని ఫీజు కట్టాలి. ఆటో బాకీ అవగొట్టాలి.  ఆ కానిస్టేబుల్ రాములు, అబ్రహం పట్టుకోకపోతే ఇంకా 500 మిగిలేవి.  కొడుకులు కాగితాలు అన్నీ ఉన్నా ఏదో ఒక వంక.  లైట్ పగిలిందని పట్టుకున్నారు.  ఆలోచనల ట్రాఫిక్ . బయటి ట్రాఫిక్.  రోడ్డు సైడ్ న ఆడీ కారు రాంగ్ పార్కింగ్.  ఆటో పక్కకి నడిపాడు. ఓవర్ టేక్ చేస్తూ ఒక బస్సు.   నిజంగానే రిస్క్.  ఇంతలో నలుగురు కుర్రాళ్ళు ఒక బైక్ ఎక్కి స్నేక్ డ్రైవింగ్ చేస్తూ ముందుకొచ్చి టర్న్ తీసుకున్నారు.  సడెన్ బ్రేక్ .
ఈ వైపే తిరుగుతున్న ఒక లారీ వేగంగా డీ కొట్టింది. గాల్లోకి లేచింది ఆటో.  మూడు పల్టీలు కొట్టి డివైడర్ను కొట్టుకుంంది.  ఏమవుతుందో తెలియదు. అరుపులు కేకలు.  కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చిన్నదానికి ఫీజు. పెద్దాడికి మొబైల్ .ఇల్లు కిరాయి.
ఎడంచెయ్యి ప్యాంట్ జేబు మీద .  డబ్బు అవును ఆటోలో సంచీలో డబ్బు ఉంది. శబ్దాలు దూరంగా వినిపిస్తున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. కళ్ళమీదకి తడి.  మెదడు మొద్దెక్కుతోంది. రిస్క్. నిజంగానే రిస్క్. ఏమీ తెలియడం లేదు. నల్లగా చీకటి కమ్ముతోంది. మెదడు శూన్యం అయిపోతోంది. ఆటోలో డబ్బు. కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. చెయ్యి ప్యాంట్ జేబు  మీదే బిగుసుకు పోయింది.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.