‘అడోనిస్’ పద్యాలు మూడు

దారి

 

మంచుతో, అగ్నితో

జీవితం

పంచుకోవాలనుకున్నాన్నేను.

మంచు అగ్ని

రెండూ

తమ లోనికి తీసుకోలేదు నన్ను.

అందుకే

ఇలా వుండిపోయాను,

పువ్వుల్లాగ ఎదురు చూస్తూ,

శిలల వలె పడి వుంటూ.

ప్రేమలో

నన్ను నే పోగొట్టుకున్నాను.

నేను విడిపోయి

నేను కల గన్న జీవితానికీ

నేను జీవించిన

మారిపోయే కలకూ మధ్య

ఒక అల వలె వూగిసలాడే దాక

నిరీక్షించాను.

 

(అరబిక్ నుంచి ఇంగ్లీషు: శామ్యూల్ హజో)

 

 

అగ్ని వృక్షం

నదీ తీరంలో ఆ చెట్టు

ఆకులను విలపిస్తోంది

కన్నీటి చుక్క తరువాత కన్నీటి  చుక్కను

ఒడ్డు మీదికి వెదజల్లుతోంది

అగ్ని గురించి తన జోష్యాన్ని

నదికి చదివి వినిపిస్తోంది

నేను ఎవరూ చూడని చివరి

ఆకుని

నా జనం

చనిపోయారు, మంటలు

ఆరిపోయినట్టు_ ఏ అనవాలు వొదలకుండా

(అరబిక్ నుంచి ఇంగ్లీషు: శామ్యూల్ హజో)

 

 

చీకట్లోని మనిషి పాట

 

అధిరోహించడమా? ఎలా?

ఈ పర్వతాలు కాగడాలు కాదు

ఉన్నత హిమ శిఖరాల్లో

నా కోసం ఏ మెట్లూ లేవు

 

అందుకే నీ కోసం

ఇక్కడి నుంచి___

ఈ విషాద సందేశాలు

నేను పైకి లేచిన ప్రతిసారీ

నా రక్తం లోని పర్వతాలు

వొద్దని చెబుతాయి, ఇక, చీకటి

తన సంకుచిత విషాదాల్లో బంధిస్తుంది

 

(అరబిక్ నుంచి ఇంగ్లీషు: శామ్యూల్ హజో)

అడోనిస్‍

(లెబనాన్ (జననం 1930)
అసలు పేరు అలీ అహ్మద్ సయీద్. సిరియాలో పుట్టారు. అక్కడే చదువు. యువ రచయితగానే ‘అడోనిస్’ అనే కలం పేరుతో రాశారు. తన రాజకీయ అభిప్రాయాలకు గాను 1956 లో వేధింపులకు గురయ్యారు, చెర వాసం రుచి చూశారు. తరువాత బీరూట్ కు మారి నాలుగేళ్లయ్యాక లెబనీస్ పౌరసత్వం తీసుకున్నారు. 1958 లో ‘మవాఖిఫ్’ అనే పత్రికను స్థాపించి అరబిక్ సాహిత్య సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని వుద్యమించారు. అరబిక్ ప్రపంచలో ‘అడోనిస్’ చాల ప్రభావం నెరపుతున్న కవీ, విమర్శకుడు....)
(అడోనిస్ దీర్ఘ కవిత ‘ఎలిజీ ఫార్ ది టైమ్‍ అట్ హ్యాండ్’ ను ‘వర్తమానం కోసం ఒక స్మృతి గీతం’ పేరుతో అనువదించి, చాల కాలం క్రితం ‘ప్రాణ హిత’ అనే వెబ్ పత్రికలో, తరువాత నా ఇటీవలి కవితా సంపుటి ‘ఆకుపచ్చ వెన్నెల’లో ప్రచురించాను- హెచ్చార్కె).

2 comments

  • సారీ సర్ , ఈ “ఆకుపచ్చ వెన్నెల” సంపుటి ఎప్పుడు తెచ్చారు?
    నకులుడి ఆత్మకధే మీరు వెలువరించిన వాటిలో చివరి కవితా సంపుటి అనుకున్నాను.
    అనువాదాలు చక్కగా,సరళంగావున్నాయి.
    ధన్యవాదాలు అందజేసినందుకు.

  • చీకట్లోని మనిషి పాట…అనువాదం బాగుంది. సర్!💐ధన్యవాదాలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.