ఆ అమ్మాయి..

దాదాపు రెండు సంవత్సరాలవుతుంది. ఆ అమ్మాయిని మాత్రం మరచిపోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడో గుర్తొస్తుంది. కళ్ళు మూసుకోవచ్చు. చెవులు మూసుకోవచ్చు. మనసెలా మూసుకుంటాం చెప్పండి. అందుకే ఆ అమ్మాయి మాటిమాటికీ గుర్తుకొస్తుంది. మనసును కప్పెట్టే మూతలేమైనా ఉన్నాయేమో అని ఆ అమ్మాయి కారణంగానే చాలా సార్లు ఆలోచించాను. సిస్టమ్ ని షడ్డవున్ చేసినట్టు మనసుక్కూడా లాగవుట్ లాగిన్ సిస్టం వుంటే ఎంత బావుండు. ఇలాంటి ఆలోచన ఆ అమ్మాయి గుర్తుకొచ్చినప్పుడే కలుగుతుంది. రెండు సంత్సరాల నాటి ముచ్చట ఇప్పుడెందుకు అంటారా? వాడొచ్చాడు కదా అందుకు. ఎవడు వాడు అంటారా? వాడి గురించి చివర్లో చెప్తాను.  ప్రస్తుతానికి ఆ పిల్ల గురించి వినండి.

అప్పుడు నేనో న్యూస్ ఛానల్ లో ప్రోగ్రామింగ్ హెడ్ గా పనిచేస్తున్నాను. ఒక రోజు ఏదో పని ఉండి లేట్ నైట్ దాకా క్యాబిన్ లో కూర్చోవాల్సి వచ్చింది. పది కావస్తోంది. పని కూడా పూర్తి కావస్తోంది. ఇంతలో నన్ను కలవడానికి ఎవరో అమ్మాయి వచ్చిందని కింద రిసెప్షన్ నుంచి ఫోను. పైకి పంపమని నా పనిలో నేనున్నాను. కాసేపటికి క్యాబిన్ తలుపు మూసే వున్నా..ఎక్కడెక్కడ సందు చేసుకుని దూరిందో కాని గుండెల్లోకి ఎకాఎకిన అదేదో అద్భుత పరిమళం దూసుకొచ్చింది. గుండెనిండా కమ్ముకుంది. బహుశా ఆ వచ్చే అమ్మాయిదే అనుకుంటా. ఏ పర్ ఫ్యూమో అడగాలి అనుకుంటూ వుండగానే  ‘మే ఐ కమిన్ సర్’? అన్న సన్నని అతి మెత్తని కంఠం వినిపించింది. ఆ కంఠం ఎలా వుందంటే గులాబీ రేకు గొంతు విప్పి మాట్లాడిందా అన్న డౌటు ఎవరికైనా కలగాల్సిందే.  సిస్టంలోనే తల దూర్చి కమిన్ అన్నాను. కళ్ళప్పగించి ఎదురుచూస్తున్నట్టు ఉండకూడదు అందుకే ఆ బిల్డప్.  సుడిగాలిలా సుగంధం గుండెల్లో సుళ్ళు తిరుగుతూనే వుంది. కళ్ళెత్తి చూడాలని వుంది కాని అంత కంగారెందుకులే కాసేపు ఆ గాలి మత్తుని అనుభవిద్దాం అనుకున్నాను. కబుర్లలో పడితే ఆ మత్తు మాయమైపోవచ్చు కదా.

“ సర్..”  వినిపించింది గొంతు. సర్రుమని గమ్మత్తుగా ఏదో పాకినట్టుంది.

ఇంక తప్పలేదు. కూర్చోండి  అంటూ తల పైకెత్తి ఓసారి చూశాను. అంతకు ముందొచ్చిన పరిమళం కంటె ఆమె కళ్ళు ఇంకా మత్తుగా వున్నాయి. డ్రెస్సింగ్ చూస్తే పెద్ద దాపరికాలేమీ లేవనే అనిపించింది. ఈ వేళప్పుడొచ్చారెందుకు? పగలొస్తే సరిపోతుందిగా? ఏంటి పని? ఇలాంటి ప్రశ్నలేమీ వేయలేదు. ఆమె కుర్చీలో సర్దుకుని కూర్చుంటే నా చూపుల్ని అటూ ఇటూ సర్దుకున్నాను. కళ్ళు తిప్పలేనంత అందమేం కాదు కాని కళ్ళు తిప్పుకోవాల్సినంత తక్కువ క్వాలిటీ కూడా కాదు.  సిస్టంలో పని వున్నట్టు మాటిమాటికీ తల దూరుస్తూ ఏదో మర్యాద కోసం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు కాసేపు నటన సాగించాను కాని అదంతసేపు కుదరలేదు. కారణం ఆ అమ్మాయే. ఆలస్యం తట్టుకునేట్టు లేదు.

“సార్..ఏమైనా యాంకర్ పోస్టులు ఖాళీ వున్నాయా?” నా లోపలే కాదు. కిటికీలోంచి బయటకు చూస్తే రాత్రి మొత్తం మత్తుగా కనిపించింది. మళ్ళీ తల తిప్పి ఆమెను చూశాను. భుజాల మీద నిలవనంటున్న వొత్తయిన జుత్తును కుడి చేత్తో వెనక్కి సవరించుకుంటూ, వైబ్రేట్ మోడ్ లో వున్న సెల్ ఫోను చుట్టూ వేళ్ళు కదిలిస్తూ నన్నే చూస్తోంది. వేళ్ళలోంచి మొలిచాయో సరాసరి గుండెల్లోంచి మొలిచాయో కాని గోళ్ళు భలే మెరుస్తున్నాయి. ఆ పాలిష్ వేయకపోయినా అవి అలా మెరిసేవే కాబోలు. పైన వేసుకున్న టాప్ మీద పువ్వులు అప్పుడే వికసించినట్టు నవ్వుతున్నాయి.  అయిదున్నర అడుగుల కంటె ఎక్కువే ఎత్తుంటుంది. బాడీ మొత్తం పొందికగా బిగువుగా వుంది. కూర్చున్న కుర్చీలో జారబడ లేదు. ముందున్న టేబుల్ వైపు కొంచెం వొంగి నా వైపు అలాగే చూస్తోంది. టేబుల్ కి అందాలు టచ్ అవుతున్నాయి. కావాలనే చేస్తోందా? ఆమె శరీర భాషను చదవడం కొంచెం కష్టంగానే వుంది. మనిషి ఫిట్. మనసే చొరరాని చిట్టడవిలా అనిపిస్తోంది. బహుశా నేనేమైనా ఆశిస్తున్నానేమో కాని అలాంటి చలనాలేమీ ఆమె నుంచి కనిపించడం లేదు.  యాంకర్స్ డిపార్ట్ మెంట్ నా అండర్ లో వుందని ఈ అమ్మాయికి ఎవరు చెప్పారో కనుక్కోవాలనిపించింది. టైమ్ వేస్ట్ కదా. సరాసరి మేటర్ లోకి వచ్చేద్దామనుకున్నాను.

“ఉన్నాయి కాని పగలు వస్తే టెస్ట్ కట్ చేయించేవాడిని. ఇప్పుడెవరూ స్టూడియోలో వుండరు” అన్నాను.

“మీరు కావాలంటే నా వీడియోలు చూడొచ్చు సర్.” అవయవాల నుంచి..కళ్ళ నుంచి ఎలాంటి సంకేతాలూ లేవు. కేవలం ఆ ఒక్క మాటే పెదాల చివర్ల నుంచి జారిపడినట్టుంది.

చూపించండి అన్నాను ఆమెనే చూస్తూ. ఆ ఛానల్ లో చేరి సంవత్సరమే అయింది అప్పటికి. రోజూ ఎవరో ఒకరు యాంకర్ పోస్టు కోసం వస్తూ వుంటారు. ఎడిటర్ గారు నా దగ్గరకు పంపుతారు. రెజ్యూమేలు చూడ్డం. సీనియర్లు అనుకుంటే అంతకు ముందు చేసిన న్యూస్ బులిటెన్స్..లేదా ప్రోగ్రాంలు చూడ్డం.. డెసిషన్ తీసుకోవడం.. అంతే వుంటుంది. కొత్తవారైతే టెస్ట్ కట్ చేయిస్తాం. ఈ అమ్మాయిని వేరే ఛానెల్లో ఎక్కడా న్యూస్ ప్రెజెంటర్ గా కాని, ఏదైనా ప్రోగ్రాం యాంకర్ గా కాని చూసినట్టు లేదు. అమ్మాయి బాడీ లాంగ్వేజ్ మాత్రం బాగా ఎక్స్ పీరియన్స్డ్ గా వుంది. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసినట్టుంది. ఏమాత్రం అదురూ బెదురూ లేదు. చాన్నాళ్ళుగా తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నట్టే ఫ్రీగా వుంది. నేను నాకు తెలియని అమ్మాయి గురించి ఏమైనా చులకనగా ఆలోచిస్తున్నానా? నాకే ఎందుకో నా మీద అనుమానం.

“యూట్యూబ్ లో నా పేరు టైప్ చేస్తే లాట్సాఫ్ వీడియోస్. యు కెన్ వాచ్ దెమ్” అంటూ పైకి లేచి ఫోనులో చూపించడానికి నా వైపు రాబోయింది. అప్పుడు ఆమె వేసుకున్న టాప్ కొంచెం పైకి జరిగింది. వెంటనే కిందకి లాక్కుంది. నాకేం చూపించాలనుకుందో?అప్పుడు ఇంకాస్త తీరుబడిగా  తేరిపార చూశాను. ఎక్కడో చూసినట్టే వుంది. ఆ కళ్ళల్లో ఎలాంటి కంగారూ లేదు. నేను చూస్తే సూటిగా నన్నే చూస్తోంది. చూపుల్లో ఏదో మార్దవం వుంది. కవ్వింపులేమీ లేవు కాని చాలా రొటీన్ గా ఏదో షాపులో వస్తువు బేరమాడుతున్నంత మామూలుగా వుంది తను. అవసరం లేదు. కూర్చోండి. నా సిస్టంలో చూస్తానని అన్నాను. పేరు చెప్పింది. దాదాపు ఒక సెవన్టీ పర్సెంట్ కన్ ఫం అయింది. ఈమె ఆమే అని ..ఆమె ఈమే అని. సిస్టంలో యూట్యూబ్ లోకెళ్ళాను. పేరు టైప్ చేశాను. యస్. తనే. అగ్లీ..అశ్లీల..అపవిత్ర..వీడియోల్లో అమ్మాయి. అందరూ ఆబగా..ఆకలిగా..ఆత్రంగా చూసే వీడియోల్లో అమ్మాయి. హాఫ్ సెక్స్ .. హాఫ్ పోర్న్ వీడియోలు..అబ్జెక్షనబుల్..అన్ వాంటెడ్ కంటెంట్. వెంటనే తనను చూశాను. ఆమె నిశ్చలంగా నన్నే చూస్తోంది. ఏంటీ అమ్మాయి ధైర్యం? అవి చూపించి..నన్నేదో ఊరించి..ఉద్యోగం రాబట్టాలన్న వ్యూహమా?కానీ తన చూపుల్లో ఎలాంటి తొట్రుపాటూ లేదు. నా రియాక్షన్ తెలుసుకోవాలన్న కుతూహలం కూడా కనిపించలేదు. జస్ట్ నా ఒపీనియన్ కావాలి. తను యాంకర్ గా పనికొస్తుందా లేదా అన్న నా నిర్ణయం కావాలి. అంతేనా ఇంకేం లేదా? ఉంటే బావుండునని అనుకుంటున్నానా?

నాకైతే ఏం మాట్లాడాలో ఆమెను ఎలా చూడాలో అర్థం కావట్లేదు. నన్ను తదేకంగా చూస్తోంది. ఆట పట్టించాలని వచ్చిందా? ఆట కోసమే వచ్చిందా? అంతు చిక్కడం లేదు. ఆట కోసమే అయితే నేను రెడీనా? అమ్మో ఆ భావనే చెమటలు పట్టించింది. ఏమైనా ఇలాంటి విషయాల్లో పిరికి సన్నాసినే.  ఇక ఉద్యోగం కోసమే అయితే ఆమె కోరుకునే ఉద్యోగానికి ఆమె చూపించిన వీడియోలకీ సంబంధం లేదు. ఉద్యోగానికి కావలసిన అనుభవం ఆమెకు లేదు. ఆమెకున్న అనుభవం ఈ ఉద్యోగానికి క్రయిటీరియా కాదు.  ఇక్కడ కావలసిన టాలెంట్ వేరు. ఆమెకున్న టాలెంట్ వేరు. ఈ మాటలనే కొంచెం తిప్పితిప్పీ అనేశాను. ఆమెను చూస్తున్న నా చూపుల్లో ఏదో తేడా వచ్చింది. అది నాకు అర్థమవుతోంది.

“మాకు కావలసింది వేరు..మీకున్నది వేరు.” అన్నాను. ఆమె కళ్ళలో అప్పుడు కాస్త చురుకుదనం చూశాను. నేనింకేదో వెదుకుతున్నానేమో . ఆమె చూపుల్లో అది దొరకడం లేదు.

“మీకేం కావాలి? నాకేం లేదు?” చాలా సునాయాసంగా అతి మామూలుగా అడిగింది. నేను నిజంగా తడబడ్డాను. మాటల్లో పొరబడ్డానేమో అనిపించింది.

“ఐ మీన్..యూ డోంట్ హావ్ ద న్యూస్ ఛానల్ ఎక్స్ పీరియన్స్ . యూ హావ్ అనదర్ ఎక్ప్ పీరియన్స్ .” ఈ సారి కళ్ళను ఎటో తిప్పి అద్దంలో కనిపిస్తున్న ఆమె నీడను  చూస్తూ అన్నాను.

“ఒక ట్రయల్  తీసుకోండి. నచ్చితే ఓకే. లేకపోతే లేదు. నో ప్రాబ్లమ్ సర్.” ఎంతో మామూలుగానే అనేసింది. ఈ సారి మాత్రం ఆమె ఉద్యోగం కోసమే వచ్చిందని రూఢిగా అనిపించింది. మరో ఉద్దేశం అయితే ఇది చాలా విలువైన సమయం కదా ఎందుకు వేస్టు చేసుకుంటుంది అనుకున్నాను.

“ఓకే ఓకే.. అలాగే రేపు వస్తే ఒక ట్రయల్ బులెటిన్ చేద్దురుగాని. మీరు ఇంతకు ముందు కనీసం ఎప్పుడైనా ఏదైనా ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలోనైనా యాంకరింగ్ చేశారా?” నా ప్రశ్నకు పెదాలు అదోలా విరిచింది

“చేయలేదు. ఈ మధ్యనే చేయాలనిపిస్తోంది. ఫస్టు ఫస్టు మీ దగ్గరకే వచ్చాను. నా ఫ్రెండ్ ఒకరు మీ పేరు సజెస్ట్ చేశారు.”

ఎవరతను? నాకూ ఈమెకూ కామన్ ఫ్రెండ్ ఎవరబ్బా అనుకుంటూ. అంతలోనే లక్ష అనుమానాలు. వాడేమైనా నా శీల పరీక్ష కోసం పంపాడా? ఇలా ఏవో సందేహాలు. కాని ఆమె ఆ ఫ్రెండ్ పేరు చెప్పలేదు. నవ్వి ఊరుకుంది. నవ్వింది కదా కొంచెం మాటలు కలిపాను. ఎందుకో ఆమెను ఇంటర్వ్యూ చేయాలనిపించింది. జర్నలిస్టు బుద్ధి పోనిచ్చుకుంటామా .  ఇలాంటి ఘటనా ..ఇలాంటి మనిషీ  జీవితంలో ఎప్పుడూ తారసపడలేదు మరి.

“మీరింత ఫ్రీగా వున్నారు కదా మీతో కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చా ?” తడబడుతూ అడిగాను.

“అయ్యో అదేం లేదు. పర్వాలేదు మాట్లాడండి.” ఎంత క్యాజువల్ గా అన్నదో ఈ మాట.

“మరేం లేదు. ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు?” చాలా చెత్త క్వశ్చన్ కదా. అవును నాకూ తెలుసు. కానీ మనసులో పురుగు అలాంటిది. నేను వెలగబెడుతున్న జర్నలిస్టు నేచర్ అలాంటిది. ఏం చేద్దాం అడిగేశాను.

“ ఏదో ఒక ఉద్యోగంలోకి అందరూ ఎలా వెళతారో నేనూ అలాగే ఈ ఫీల్డ్ లోకి ఎంటరయ్యాను. అంతే సార్ మరింకేం లేదు.”

నేనేదేదో ఊహించేసుకున్నాను. ఏ సినిమాల్లోకి రావాలనుకుని ఎవరి వలలోనో చిక్కుకుని ఎవరి దాహాలకో ఆవిరై చివరికిలా ఇందులో తేలానని చెప్తుందేమో ఆ కథ విందామనకుంటే మొదట్లోనే ఖంగు తినిపించింది. నేనడిగిన ప్రశ్నకూ తను ఇబ్బంది పడలేదు. జవాబివ్వాడానికీ ఇబ్బందిపడలేదు. ఈ పిల్ల భలేగా వుందే అనిపించింది. ఈమెలో ఏదో విషయం వుందనిపించింది. లాగాలని కూడా అనిపించింది.

“అదేమిటి? నీకిష్టపూర్వకంగానే ఈ ఫిల్మ్స్ లో  యాక్ట్ చేస్తున్నావా?” ఇప్పుడు మాత్రం ఆమె కళ్ళల్లో కనపడని రంగుల కోసం వెదుకుతూ అడిగాను. “సారీ..నువ్వేదో పనిమీద వచ్చావు. నేనేదో అడిగి నీ టైమ్ వేస్టు చేస్తున్నాను కాబోలు.”

“నోనోనో..అదేం లేదు సార్. మీ టైం వేస్టు చేస్తున్నానేమో అని నేననుకుంటున్నా.”

ఆమె మాటలు చూస్తే ఎందుకిలాంటి పిచ్చి ప్రశ్నలతో టైం వేస్టు చేస్తారని అంటున్నదేమో అనిపించింది.

“ఐ నో వాటయామ్ డూయింగ్ సర్. ఇష్టం కష్టం అనేం లేదు. అంతే అలా మొదలైంది. ఇలా సాగుతోంది. కొంచెం ఛేంజ్ కోసం చూస్తున్నాను.”

నాకైతే ఆమె మనసులో మరింకేమీ వేరే ఉద్దేశాలు ఉన్నట్టు అనిపించలేదు. ఉంటే బావుండునని అనుకుంటున్నానా? నాకే తెలీదు. కాని అడగాల్సినవి అడగాలనే అనుకున్నాను.

“మరి మీ పేరెంట్స్..? మీ రిలేటివ్స్ ఎవరూ ఏమీ అనలేదా?” మరో వేస్ట్ క్వశ్చన్ ఆమెకు. నాకు మాత్రం విలువైందే.

“అమ్మా నాన్నా తప్ప ఇంకెవరితోనూ నాకు పనిలేదు. వాళ్ళు మొదట్లో ఎవరెవరో చెప్తే విని చాలా బాధపడ్డారు. ఇది కూడా ఒక ఉద్యోగమే కదా అన్నాను. ఒప్పుకోలేదు. పరువు పోయిందని క్రుంగిపోయారు. హాస్టల్ కి మారిపోయాను. అన్నయ్యా అక్కా మాట్లాడరు. అమ్మానాన్నా అప్పుడప్పుడూ వచ్చి చూసి పోతుంటారు.”

“ మీ హాస్టల్లో ఎవరికీ తెలియదా?”

“తెలుసు. చెవులు కొరుక్కుంటారు. కొరుక్కోనియ్ వాళ్ళ చెవులే కదా అనేసుకుంటాను.” ఇలా అంటూ గలగలా నవ్వేసింది. అప్పుడామె బాడీలో ప్రతి పార్టుతో నవ్వినట్టనిపించింది. నాక్కూడా నవ్వొచ్చింది. అసలేమిటీ అమ్మాయి? ఇంత లైట్ గా తీసుకుంది జీవితాన్ని? ఏడవలేక నవ్వుతోందా? కోపం అణచుకోని నవ్వుతోందా? అసలు ఉద్యోగానికే వచ్చిందా నన్ను పరీక్షించడానికి వచ్చిందా? ఈమెను ఎవరైనా జాబ్ లో పెట్టుకుంటారా? ఆ విషయం ఈమెకు తెలీదా? ఇన్ని తెలిసిన అమ్మాయి ఇంత ఇన్నోసెంట్ గా ఏంటిదంతా? నాకేంటో గందరగోళంగా అనిపించింది. ఆ అమ్మాయి నవ్వాపి సీరియస్ గా నన్నే చూస్తోంది.

“ఏమీ అనుకోవద్దు. అవుటావ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. నువ్వు కలిసి ఈ చిత్రాల్లో నటించే వ్యక్తులతో అంటే మేల్ పార్టనర్లతో ఎలాంటి ఇబ్బందులూ ఉండవా?” నసుగుతూ అడిగేశాను.

“ఉండవా అంటే ఉంటాయి. లేవా అంటే లేవు. సినిమాల్లో హీరో హీరోయిన్లు డ్యూయెట్లేసుకున్నప్పుడు ఎలా వుంటుంది. ఇక్కడా అంతే. వారికున్న ఫీలింగ్సూ రిస్కూ..నాకూ ఉంటాయి.” మెత్తని ఆమె కంఠం ఇక్కడ కొంచెం కరుకుగా మారింది.

“అయినా హీరోయిన్లు చేస్తే నటన..మేం చేస్తే వ్య..భి..అదేంటి..అదా? వాళ్ళకి సన్మానాలు..మాకు అవమానాలు..వాటే పిటీ సర్..” సూటిగా నా కళ్ళలోకి చూస్తూ ఆమె నిలదీసినట్టు అడిగింది. ఆమెతో పెద్దగా వాదించాలనిపించలేదు కాని అడిగాను మరో మాట.

“ సినిమా పబ్లిగ్గా చూస్తారు. ఇది ప్రయివేటుగా చూస్తారు. అందుకే అది ఒప్పు ఇది తప్పు అనుకుంటాను. మీకేమీ తప్పనిపించడం లేదా?”

“లేదని చెప్పాను కదండీ. ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం. అంతే మరేం చేయడం లేదు.” మరేమీ అన్న మాట బాగా నొక్కి సాగదీసి అంది. “అయినా కొన్ని సినిమాలు రెండుమూడు రోజుల్లో కుప్పతొట్టికి చేరుకుంటాయి. మా వీడియోస్ కి  రోజులు గడిచే కొద్దీ వేలల్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి. దీనికేమంటారు? తప్పయితే ఎందుకింత ఆదరణ? నిజంగా తప్పే అనుకుంటే వాటిని నిషేధించలేదు ఎందుకు? చట్టానికి లేని తప్పు..అందరూ చూట్టానికి లేని తప్పు నేను చేస్తే వచ్చిందా? చెప్పండి. మీరు చెప్పలేరు. మీరేవయితే తప్పుడు వీడియోలు అనుకుంటున్నారో వాటిని దొంగచాటుగా చూసే వాళ్ళలో మీరు కూడా వుండొచ్చు.” ఆమె లేచింది. కోపం లేదు. ఉద్రేకం లేదు. ఎలా వచ్చిందో అలాగే అంతే కూల్ గా వుంది. మాటలోనే నేను చూసిన మెత్తదనం పదునెక్కింది. నేనిప్పుడామెను సూటిగా చూడలేకపోతున్నాను. గౌరవం..మర్యాద..సభ్యత..సంస్కారం..శీలం..పవిత్రత..ఇలాంటివి ఏమీ ఆమె దగ్గర మాట్లాడ్డానికి వీలుకాని పదాల్లా అనిపించాయి.

“ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం కోసం వచ్చాను సార్. రేపు రమ్మంటారా వస్తాను. అని నవ్వుతూ అడిగింది. ఇదేమిటీ పిల్ల ఇంతలోనే మళ్లీ ఇంత కూలైపోయింది? నాకాశ్చర్యం. నేనలా నిలువుగుడ్లు వేసుకుని చూస్తూనే వున్నాను వెనక్కి తిరిగి మళ్లీ నా వైపు ఓసారి చూసింది.

“చూడమ్మాయ్ . తప్పొప్పుల మాట అలా వుంచుదాం. నాకు తెలిసీ ఏ ఛానల్ వాళ్ళూ నిన్ను  పెట్టుకోరు. పరువు పోతుందని భయపడతారు.” నా మాటకి ఆమె నవ్విన తీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడామె మొహం చూడలేక పాదాల వైపు చూశాను. పల్చటి రేకుల్లాంటి చెప్పుల్లోంచి పాదాలే నవ్వుతున్నాయా అనుకున్నాను.

“ ఒక్కమాట అడగమంటారా సార్?”

“అడుగమ్మా..” నా కంఠంలో సన్నని  వణుకు నాకు మాత్రమేనా ఆమెకు కూడా వినిపించిందా తెలీదు.

“మీ మీడియా వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు చెప్పండి సర్.  రేటింగ్స్ కోసం మీరు చేసే మాయలేంటో ఎవిరిబడీ నోస్. శ్రీదేవి బాత్ టబ్ లో పడిపోయినా..పిల్లోడు బోరు బావిలో పడ్డా..ఇంకెవరో మేన్ హోల్ లో పడ్డా అబ్బో ఇంక మీ హడావుడి అంతా ఇంతానా. ఎందుకులెండి రేటింగ్ కోసం జనాల బీటింగ్ పెంచడంలో మీరెంత ఎక్స్ పర్టులో ఎవరికి తెలీదు చెప్పండి. మమ్మల్ని అంటారు కదా ప్రజల ఎమోషన్స్ తో  ఆడుకోవడంలో మీకంటె దిట్టలున్నారా?  కోతికి కొబ్బరికాయ దొరికినట్టు చిన్న పనికిరాని క్లిప్ ని పట్టుకుని రోజంతా చూపించి సొమ్ము చేసుకోడానికి  ఎన్ని తంటాలు పడతారండీ. ఒక్క పెయిడ్ న్యూస్ చాలు మీరు చేసే పని ఎంత పవిత్రమైందో చెప్పడానికి. వీధి రౌడీల్లో కూడా ఉండే కొన్ని మంచి లక్షణాలు కొందరు నాయకుల్లో ఉండవు. అలాంటి వారి దగ్గర డబ్బులు గుంజి వాళ్లని ఇంద్రుడూ చంద్రుడూ అని పొగుడుతారు. పరువుగల వాళ్ళు చేసే శీలవంతమైన పనులు ఇలాగే వుంటాయా? అప్పుడు పరువుకి  మీనింగ్ మారిపోతుంది కదా సార్. ఏమైనా సరే పరువు అనే మాటని మాట్లాడ్డానికి మీకు మాత్రం రైట్ లేదనుకుంటా. మీరేమంటారు? నేను ఉద్యోగిని మాత్రమే అంటారంతేనా? అదే నేనూ అంటున్నా. నేను కూడా ఉద్యోగమే చేసేది. వస్తానండి. ఏమీ అనుకోవద్దు. ఎంతో మందితో ఎంతో చనువుగా వుండడం నా వృత్తి. అంతే చనువుగా మీతో మాట్లాడేశాను. ఆ చనువు వృత్తి కోసం..ఈ చనువు ఉద్యోగం కోసం. అదీ నటనే ఇదీ నటనే అనుకున్నా ఏం పర్వా లేదు.”

ఇలా అనేసి వెంటనే వెనక్కి తిరిగి డోర్ తోసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె నుంచి ఎలాంటి సువాసనా రాలేదు. నాలోంచి నాకే ఒక జుగుప్సాకరమైన వాసన వచ్చింది. ఆ రోజు నుంచి ఏదో గిల్టీ ఫీలింగ్. అప్పటి నుంచి నీతిమంతుల లోకంలో ఏది తప్పు ..ఏది ఒప్పు అనే చర్చ ఎవరితోనూ పెట్టుకోలేదు. ఆ అమ్మాయి స్టూడియోలో కెమెరాలకి శరీరాన్ని మాత్రమే అప్పగిస్తుంది. నేను ఇంకెవరికో ఏకంగా నా ఆత్మనే అప్పగించినట్టు ఆ అమ్మాయి గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె గిలగిల్లాడుతుంది.

ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే వాడొచ్చాడన్నాను కదా. వాడంటే నా శిష్యుడే. రాం గాడు. పేరు రామేశ్వరప్రసాద్. నాతో చాన్నాళ్ళు అసోసియేట్ అయ్యున్నాడు. నిన్నొచ్చాడు. ఏంరా బావున్నావా అంటే బావున్నాను సార్ మీ ఆశీస్సుల కోసం వచ్చానన్నాడు. ఏంటి సంగతి అని ఆరా తీస్తే పెళ్ళిచేసుకున్నాడట. జంటగా వచ్చాడు. ఆ అమ్మాయిని లోపలికి రమ్మన్నాడు. వచ్చింది. అదే అమ్మాయి. అదే చూపు. నిశ్చలం..నిర్మలం..నిర్మోహం. కూర్చోమన్నాను. ఈ అమ్మాయిని అప్పుడు నా దగ్గరికి పంపింది వీడేనన్నమాట. అర్థమైంది. సరిగ్గా అప్పుడు నా క్యాబిన్ లో ఉన్న టీవీలో ఒక నాయకుడి వీర గాథ అన్న టైటిల్ తో స్టోరీ నడుస్తోంది. అసలే ఎన్నికల సమయం కదా. ఏ గజదొంగో కథా నాయకుడైపోయాడు. ఛానల్ వాళ్ళకి ఎంత ముట్టిందో మరి.  ఆ అమ్మాయి అది చూడ్డం..నేనామె కళ్ళలోని ధిక్కారపు పరిహాసాన్ని చూడ్డం ఒకేసారి జరిగింది. వెంటనే టీవీ బంద్ చేశాను. ఇంతకీ దొంగ ఎవడూ నేనా..?లేక తెర మీదకొచ్చిన వాడా? ఈ రహస్యం ఆ పిల్ల వంకర తిప్పిన పెదాల మధ్య ఇరుక్కుని వుంది. ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టడం బావుండదని అనుకుంది కాబోలు.

“ రామ్ కి మీరంటే చాలా ఇష్టం..గౌరవం సార్. ఇప్పుడా పని మానేశాను.” అంది.  అంటే అది తప్పని తెలుసుకున్నావా అని నేను అడగబోతున్నట్టు.. ఆమె గమనించినట్టు.. ఠక్కున ఇంకో మాటంది.

ఆ పని తప్పో ఒప్పో లెక్కలు తెలీవు. నేను చేసింది మాత్రం తప్పు కాదు. అంతే నిలకడగా అంది. ఆమె వేసుకున్న లిప్ స్టిక్ ఏమిటో తెలీదు గానీ ఆ పెదవుల్లో వెన్నెల తొణికిన శబ్దం వినిపించింది. అమ్మో పిల్ల సామాన్యురాలు కాదు. నా ఊహలు నావి. అవి ఆమెకేం తెలుసు.

“ఇప్పుడైనా ఉద్యోగం ఇస్తారా సార్?” ఆమె నన్నే చూస్తూ అడిగింది. నేను రామ్ వైపు చూశాను. ఒక్కసారిగా ముగ్గురం నవ్వుకున్నాం. కథలో కొసమెరుపు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారట. ఆ మాట అనగానే నేను షాకయ్యాను. నా అనుమానం గమనించి రామ్ అన్నాడు. “అలాంటివి కాదు సార్. మీరు తప్పక మెచ్చుకుంటారు. మొదటి ఫిల్మ్ మీ ఇద్దరూ మొదటిసారి కలిసినప్పుడు  జరిగిన సంభాషణ మీద తీశాం సార్. చూడండి” అని నాకు వాట్సాప్ లో ఆ షార్ట్ ఫిల్మ్ పంపాడు. వాళ్ళనలా ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను. ఇద్దరూ నవ్వుతూ సెలవు తీసుకున్నారు. నా ఆశీస్సులు వాళ్ళకి తప్పక ఉంటాయన్న నమ్మకంతో వెళ్ళారు. నమ్మకం కాదు అది నిజమే.

ప్రసాద మూర్తి

పూర్తి పేరు రామవరప్రసాదమూర్తి. జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు గ్రామం. ప్రసాదమూర్తి అనే పీరుతో రాస్తుంటారు. ‘’కలనేత ‘’, ‘’మాట్లాడుకోవాలి’’, ‘’నాన్నచెట్టు’’, ‘’పూలండోయ్ పూలు’’, ‘’చేనుగట్టు పియానో’’, ‘’మిత్రుడొచ్చిన వేళ’’ కవితా సంపుటాలు ప్రచురించారు. ఇప్పుడు ‘’దేశం లేని ప్రజలు’’ సంపుటి ఆవిష్కృతమవుతోంది. ‘’ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం’’ అనే పరిశోధన గ్రంధం అచ్చయింది. త్వరలో కథా సంకలనం రానున్నది. వృత్తి జర్నలిజం. ప్రస్తుతం ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఉద్యోగం. నూతలపాటి గంగాధరం, సోమసుందర్, స్మైల్, ఫ్రీవర్స్ ఫ్రంట్, విమలా శాంతి, ఉమ్మడిశెట్టి,ఢిల్లీ తెలుగు అకాడెమీ, రొట్టమాకురేవు మొదలైన సాహితీ పురస్కారాలు పొందారు.

11 comments

  • తెలుగులో పోర్న్ తీసే స్టూడియోలు ఉంటే ఈ కథవాస్తవానికి దగ్గరగా ఉండేది. నాకు తెలియదు గానీ ఉన్నాయా ? అదే ఒక అమెరికా లోని అమ్మాయి గురించి అయితే సన్నీలియోన్ ని ద్ర్రష్టిలో ఉంచుకుని రాసారెమో అనిపించేది. Anyway ఒక గొప్ప వ్యక్తిత్వం గల ఆమ్మాయిని create చేశారు.

    • వీడియోలు ఉన్నాయంటే మరి అవీ ఉన్నట్టేగా . మీకు నా కథ నచ్చినందుకు ధన్యవాదాలు సార్.

  • చాలా మంచి కథ ప్రసాదమూర్తి గారూ, అభినందనలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.