చియ్యకూరల పాట

ఎర్రని ఎండలో
పెయ్యినిండ సల్లని చెమటలు పట్టంగ
ఎన్నో ఈదులను దాటివచ్చిన
పచ్చి ఈతబరిగెల మోపువైతవు

ఈతకర్రల తలలను
పెద్దకొడవలితో
రెండుపాయలుగ దువ్వడం
తాతలకాలం నుండి వస్తున్న విద్దె నీకు

నువ్వు సిగ ముడిచి
నెత్తిన కొప్పుపుల్ల చెక్కితే
నలుపులోని అందమంతా
నీ కొప్పులోనే కనవడ్తది

లింగక్కా…
బతుకులోని చీకటిని కమ్మడానికి
రాత్రిళ్ళు! పగళ్ళు
ఎన్ని అంచు తట్టలుగ, గుల్లలుగ, జల్లలుగ మారిపోతివో!

కాయితం, మెంతులను మెత్తగా నూరి
కొత్త గుల్లలకు పూత పూసినట్లే
“ఎందుసోరు తిండ్రిదే” నని
మా గుండె గంపల్ల ప్రేమను నింపుతవు.

ఎవరన్న తిని పారేసిన అన్నమో
బియ్యం కడిగిన నీళ్ళనో
కుడితి కుండ నోటి నిండా దాసుకోనొచ్చి
గూచి…గూచి అని కూతేసుకుంట
పంది పిల్లల కడుపు జూసేది నువ్వే.

పిల్లలు జేసిన పైదిగుంట
పొద్దూకినా గాని గూటికి రాకపోతే
తావుతావున కలెజూసుకుంటూ
ఊరంతా దిరిగే కందిలి దీపానివి.

షికారుకోయిన మావ
కొంగనో, ఎంటువనో
ఉడుముతోనో, ఉడతతోనో
కౌజు పిట్టతోనో తిరిగొచ్చినపుడు
రామచంద్రి మావ నోట
కమ్మని చియ్యకూరల పాటవైతివి.

ఎరుకోయమ్మ ఎరుకని
రేపటి కాలాన్ని కళ్ళ ముందు జూపే తల్లీ…
కుల మతాల బురద గుంటలోంచి
ఈ లోకం ఎప్పుడు బయటపడుతదో
జర ఎరుకజేయి
నిన్ను ముట్టు బట్ట లెక్క జూసిన
ఈ పాపిష్టి లోకం మీద దయదలిచి
దీవెనార్తులు జల్లు
నీ ఒరువు సల్ల ఇక్కోటు మగిలె.

(ఎందు సోరు తిండ్రిదే=ఏం బువ్వతిన్నవు,
పైది గుంట=ఆడపంది
నీ ఒరువు సల్ల ఇక్కోటు మగిలె=నీ కడుపు సల్లగుండాలి )

తగుళ్ల గోపాల్‍

4 comments

  • ఈ కవిత గోపాల్ మాత్రమే రాయగలడు. అంతే. ఎన్ని అభినందనలు చెప్పాలి. ఎరుకజేసిన విషయం అంత గొప్పగా ఉంది గోపాల్.

    • మీ ప్రేమకు అనేక నమస్కారాలు సార్ .చాలా సంతోషం.పండుగపూట కవితను ప్రచురించిన రస్తా కు,దీని గురించి చెప్పిన శ్రీరామ్ సార్ కి మరీమరీ ధన్యవాదాలు

  • Great poet , great words, each word came from villege envirment , from villlege soil. Hatsoff gopanna

    • మీ ఆత్మీయతకు ఆలింగనం అన్న.ధన్యవాదాలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.