క‘వనం’లో కొత్త కోయిల

చిన్నపిల్లలు అల్లరి చేయడం మనకు తెలుసు. కొంత మంది బొమ్మలు గీయడంలో, ఆటలు, క్రీడల్లో ఉంటూ చురుగ్గా వుండడం చూస్తూనే ఉంటాం. మనో సంబంధమైన కవిత్వం జోలికి పిల్లలు అంత త్వరగా పోరు, అది కేవలం భాషకి సంబందించినదనో లేక వారికి అంత లోక పరిజ్ఞానం ఉండదనో భావిస్తూ సాధారణంగానే సాహిత్యానికి దూరంగా ఉంటారు. కొంతమందికి జన్మతః గొప్ప ఊహా శక్తి   ఉంటుంది, తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఊహలు చేస్తారు. ఎలా ఉండాలో ఒక గీత గీసుకుని దాన్ని ఇతరులకి చెప్పాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి  ఒక ప్రయత్నమే చేసింది కవయిత్రి కూరెళ్ల శ్రీశ్రేయ. తను ఇప్పుడు ఇంజనీరింగ్ మొదటి ఏడాది చదువుతోంది. దాదాపు ఎనిమిదో తరగతి నుంచి కవిత్వం పట్ల ఆసక్తి కనపరిచి ఒక సంకలనం కూడా తీసుకు వచ్చింది. దాని పేరు “ఎంత బాగుంటుందో” .
సాధారణంగా పిల్లలకు అమ్మతోనే అనుబంధం ఎక్కువ. చాలా మంది పెద్ద పెద్ద రచయితలు కూడా అమ్మను, ఆమెతో కలిసి వుండే బాల్యం  గుర్తులను నెమరేసుకున్నవారే. ముందుగా మన మదిలోకి వచ్చే భావాల వరసలో అమ్మ తప్పక వుంటుంది. శ్రేయ తన మొదటి కవితను “అమ్మ” అని మొదలు పెట్టింది. ఎంతమంది రాసినా ఆ అక్షరానికి అమ్మ విలువ చేరిస్తే వచ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది.

” మొదటి అక్షరం అ కదా
అ అంటే అమ్మే కదా
మన మొదటి మిత్రుడు అమ్మే కదా
కనిపించే దేవుడు అమ్మే కదా”.

చాలా మామూలు భావాలని అనిపించొచ్చు. భవిస్యత్ లో తను మోయవలసిన పాత్ర కూడా కావడం వల్లనేమో తన మొదటి కవితని మొదటి భావనని, అలా మొదటి అక్షరంతో మొదలెట్టింది. అలా అని కవితా సంపుటి అంతా ఇదే అనుబంధం ఆత్మీయతల మీదనే తిరిగిందా అంటే కాదు.
పిల్లలూ దేవుడూ చల్లని వారే అని ఒక కవి రాసినట్టు… పిల్లలు విరబూస్తున్న పువ్వుల వంటివారు. వారికి ఈ ప్రపంచం మకిలి ఏమీ అంటదు. ఈ కోపతాపాలు, రాగద్వేషాలు, ఈ హిపొక్రసీ ఏమి లేని ఒక వాతావరణంలో పిల్లలు తిరుగుతూ ఉంటారు.  మనమే ఒక్కోసారి వాళ్లను తక్కువ అంచనావేస్తూ వాళ్ల ఆలోచనల కాళ్ళకి అడ్డం పడుతూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే మనం వాళ్లను అసలు పరిగణనలోకి తీసుకోం. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు, లోతైన ఆలోచనలున్నవాళ్ళు. మనమే స్వార్ధపరులం. అదే విషయాన్ని ఇలా ఒక చిన్న కవిత లో రాస్తుంది శ్రీశ్రేయ.
” పిట్టలకి స్వార్దం లేదు
జంతువులకి స్వార్దం లేదు
మొక్కలకు స్వార్దం లేదు ….

అని చెప్పుకుంటూ పోతూ, మనవులను… అంటే తెలివిడి ఉండి, ఉండవలసిన తీరుగా ఉండని మనుషులను కాస్త కోపంగా కటువుగా “ఈ మనుషులకు ఎందుకింత స్వార్దం’ అంటుంద. తను రాసిన ఆ నాలుగు మాటల్లో భావం బహుశా తాను ఎక్కడన్నా చూసిన వ్యక్తుల వలన తాను పొందిన అనుభవం కావొచ్చు. కాని ఆవేదనను ఇలా కవిత్వంలోకి ఒంపడం హర్షించదగిన విషయం. పెద్ద పెద్ద కవులు కూడా మనిషిని ‘మోస్తూ’ ఉన్న ఈ కాలం లో ఎటువంటి భేషజాలకీ పోకుండా ఈమె మనిషి స్వార్ధాన్ని ఎండగడుతుంది. ఇది ఒక్కటి చాలు భవిష్యత్ వాగ్దానానికి.
రైలులో నీళ్ళు అమ్ముకునే అబ్బాయిని చూసి స్పందించి రాసిన కవిత:
“గొంతెండిపోయేలా  అరుస్తూ
తన చెమటలో తాను స్నానం చేస్తూ
ప్రయాణీకుల గొంతులో చల్లటి
నీటి చుక్కలు వొంపుతున్నాడు .”
……………………………
“అతని ప్రతీ అడుగునూ
గమ్యం చేరడానికే ఉపయోగిస్తున్నాడు
ఆగలేదు
అతని ప్రయాణం సాగుతూనే ఉంది ”

శ్రమజీవులను  గుర్తించడం కవుల ప్రాధమిక కర్తవ్యం. శ్రేయ చిన్నవయసులోనే ఒక శ్రామికుడిని చూసి కవిత్వం రాయడం అభినందించ దగ్గ విషయం. అదే కదా సమాజాన్ని మేల్కొల్పే వ్యక్తులకు… ముఖ్యంగా కవులకు కావలసింది.

ఇప్పుడు పిల్లలు నిజంగా పెద్దల చేతిలో ఆట వస్తువులయ్యారు. చదువులలో, ఇతర లోక విషయాల్లో, వారితో అభిప్రాయాల్ని పంచుకునేప్పుడు పెద్దలం కాస్త ‘అతి’ ప్రదర్సిస్తూ ఉంటాం. పిల్లల మనసుకి దగ్గరగా ఉంటున్నామనే అనుకుంటాం గాని, చాలా దూరం మనమే పెంచేసుకుంటున్నామో  ఆలోచించం. దానికి సమాధానంగా ఒక కవిత ఉందీ ఈ పుస్తకంలో. అలాగే మన ఇంట్లో  పెంచుకునే కుక్కలను కుటుంబ సభ్యులుగానే చూస్తాం. అవి కూడా మనతో పాటే తిరుగుతూ చాలా నమ్మకంగా ఉంటాయి. అలాంటి నమ్మకం కలిగిన జంతువు ఉంటే మనం ఎప్పటికి  ఒంటరి అవ్వం అని చెబుతుంది .

ఆకలీ, పేదరికం మన దేశంలో కవల పిల్లలు. ఆ రెండూ ఎప్పుడూ ఒకదాని పక్కన ఒకటి చేయి చేయి పట్టుకుని నడుస్తూనే ఉంటాయి. అలాంటి స్థితిని చాల హృద్యంగా రాసింది ఈ కవయిత్రి. ఒక స్త్ర్రీ  ఎలాంటి ఆసరా లేకుండా తన కుటుంబాన్ని నడపడానికి పడే శ్రమ, పిల్లల పాలకోసం పడే పాట్లు, డబ్బులేని తనం, మౌనంగా ఉండాల్సిన సమయాలు, కన్నీటి చారలు చంపల మీదనే ఆరిపోయిన సందర్భాలు, ఇలా నిరంతరం నిరుపేదల జీవితాలను కవిత్వం చేసింది ఈ రచయిత్రి. సున్నిత మనస్కులకు కన్నీరు తెప్పించే ఈ కవిత ఈ పుస్తకం మొత్తానికే హైలైట్. ఈ కవిత ముగింపులో ఇలా అంటుంది.

” ఆ దేవుడికి కొన్ని వందల చీరలు
ఆ రాతి బొమ్మకి
రోజుకో పట్టుచీర
భక్తులకు భగవంతుడు తప్ప
అన్నార్తులు కనబడరు కదా ”

అని పెద్ద నిందారోపణ చేస్తుంది భక్తి మీద, దేవుడి మీద. భక్తులు దేవుడి మీద ఆధారపడినంతగా దేవుళ్లెవరూ భక్తులను పట్టించుకోరు అని ఆ చిన్న మనసుకు ఎలా అనిపించిందో ఆశ్చర్యం వేస్తుంది. అందుకైనా మనం ఈమెని అభినందించాలి.
బాల్యం ఒక వరం, ఎవరైనా మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలని ఆరాటపడతారు. అలాంటి తన ఒక అనుభవానికి అక్షర రూపం ఇచ్చింది కవయిత్రి “ఎంతబాగుంటుందో’ అనే కవితలో…

‘వేసవి సాయంకాలం  ఆటలాడితే ఎంతబాగుంటుందో
అనుకోకుండా సెలవిస్తే ఎంత బాగుంటుందో
చుట్టాలందరూ ఒకేసారి ఇంటికి వస్తే ఎంత బాగుంటుందో
మనకు పక్షిలాగ రెక్కలొచ్చి ఎగరగలిగితే ఎంత బాగుంటుందో’

అంటూ, ఇవన్ని ఊహలేనని చెబుతూ, నిజంగా ఇవన్ని జరిగితే ఎంతబాగుంటుందో అని నేటి వాస్తవికతను మన కళ్లముందు ఉంచుతుంది. ఎంత విజ్ఞత? ఊహకీ వాస్తవానికి మధ్యన ఉన్న సన్నని దారం లాంటి దాన్ని ఎంతో సూక్ష్మంగా పట్టుకుంది. అది కదా బాల్యం, అదే కదా మన చేతికందని అనుభూతి, అపార్ట్మెంట్ల సంస్కృతిలో చెట్లెక్కడ? తరిగిపోతున్న మానవీయ కోణాలలో  చుట్టాలూ బంధువులు ఎక్కడ? ఇదే ఒక సినిమా కవి రాస్తే కళ్లనిండా నీళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా మనం ఈ చిన్నారిని మనహ్పూర్వకంగా అభినందన చెప్పి తీరాల్సిందే.
ఊరు మొత్తానికి సందడి ఎప్పుడూ అంటే పండగ వచ్చినప్పుడు. ఆ పండగ ఉగాది అయితే మరీ సంతోషం. ప్రకృతి పండగ అది. లేత మామిడి చివురు, వేపపూత, కోయిల పాటలు పండగ శోభని తెస్తాయి. అలాంటి ఒక  ఉగాది మా ఇంటికి వచ్చింది అని రాస్తుంది శ్రేయ. తాను మరీ చిన్నగా ఉన్నప్పుడు అనుభవించిన ఉగాది కావాలంటూ మారాం చేస్తే, కలుషితం అవుతున్న ఈ ప్రపంచంలో అది దొరకడం కష్టమైన చోట, వాళ్ల మామయ్య ఆ శబ్దాలను, ఫొటోలను ఇంటర్ నెట్లో చూపించడం తో ఈమె మనసు చిన్నబోవడం, ఊరు మారిపోవడం… లాంటివి చాలా నేరుగా చెబుతుంది ఈ కవితలో. బహుశా అందుకనేనేమో ఆకాశవాణి కూడా ఈ కవితను ప్రసారం చేసింది.

ఎక్కడా కవయిత్రి  నేల విడిచి సాము చేయలేదు. అందుకే ఉత్తరాంధ్రా  సీనియర్ కవులు అందరూ ఈమెను ఆశీర్వదించారు. గంటేడ గౌరినాయుడు, మానపురం రాజా, చాగంటి తులసి లాంటి పెద్దవాళ్లు ఈమెను, ఈమె కవిత్వాన్ని ప్రసంశించారు. వారి నమ్మకం  వృధా పోనివ్వదు ఈ కవయిత్రి. సాధారణంగా చిన్నపిల్లలు కవిత్వం రాస్తున్నారు అంటే కాస్త ముద్దు చేయడం మనకు అలవాటే. చాలామంది ఆ మురిపెంలోనే ఉండి పోతూ కవిత్వాన్ని అంత్య ప్రాసలతో, సినిమా డైలాగుల అనుకరణలతో నింపేస్తారు. సెకనుకో పంచ్ డైలాగు పేలుతున్న కాలంలో ఉన్నాం మనం. అలాంటి వాటిని కూడా కవిత్వంలోకి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. చిన్నతనం అని సమర్ధించుకో చూస్తారు. ఈ కవితా సంపుటిలో ఎక్కడా ఒక్క మాట కూడా అదనం అనిపించదు, తాను చూసిన బిచ్చగాడి ని కవిత్వం చేయడం, నాన్నని కేవలం నాన్నలా కాకుండా చూడడం, జనాల డబ్బు జబ్బుని గుర్తించడం చాల బాగున్నాయి. ‘మౌనబంధం’ కవితలో ఇద్దరు స్నేహితుల మధ్య మౌనాన్ని, వారు ఎన్నుకున్న మార్గాన్ని ఎంత చక్కగా చెప్పారో.. వీటన్నిటి కోసం ఈ సంపుటిని చదివితీరాల్సిందే. చాల మంది కవిత్వం రాస్తారు గాని ఇతరుల కవిత్వాన్ని చదవరు. కనీసం ఇలాంటి పిల్లల నుంచి వచ్చిన నాలుగైదు కవితలని చదివితే మనం ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు.

ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో కవిత్వం రాయడమే గొప్ప. అలాంటిది సమాజాన్ని ఆ వయసులోనే తనదైన చూపుతో చూస్తున్న ఉన్న ఇలాంటి కవిత్వ సంపుటాలను భుజాలకెత్తుకోవలసిన అవసరం ఉంది.

ఈమె తల్లి ప్రముఖ కవయిత్రి చెళ్ళపిళ్ళ శ్యామల. తనతో వెళ్ళి, కవిత్వం వినడం వల్ల శ్రీశ్రేయ అటువైపు ఆకర్షించబడింది. ఆ ఆకర్షణ బలమైనది. తాత్కాలిక స్పందనా అనేది తేల్చుకుని కవిత్వంగా రాయడానికి శ్రేయ కు ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే ఈ భావాలు అంత తాజా గా ఉన్నాయి.

చాలా కవిత్వాలే వెలుగు చూడలేని ఈ రోజుల్లో, ఒక మంచి కవిత్వాన్ని, చిన్నపిల్ల ఏదో రాసిందిలే అని వదిలేయకుండా పుస్తక రూపంలో తెచ్చిన విజయనగరం సాహితీ స్రవంతి వారిని … చీకటి దివాకర్ గారిని, చంద్రికా రాణి గారిని… అభినందించాలి.

సుమారు ఏడేళ్ల క్రితం కొత్తగా కవులు పుట్టడం లేదని మహా ఆవేదన చెందారు అప్పటి కొందరు పెద్ద కవులు. కొత్త తరం రాయడం మొదలు పెట్టాక, అబ్బే ఇది అసలు కవిత్వం కాదన్నారు , ఇంకా ఆగకుండా రాస్తూ పోతుంటే, వీళ్లని ఎలా ఆపడం అని తలలు పట్టుకుంటున్నారు. ఎలా రాయాలో కొత్త కవులకు ఎవరూ చెప్పనక్కరలేదు. ఎలా రాయకూడదో కూడా చెప్పనవసరం లేదు. అసలంటూ వాళ్ళకొక భావం ఉంటుంది. దాన్ని కాగితం మీదకి చేర్చడానికి వాళ్లు పడే తాపత్రయాన్ని గమనించాలి. అప్పుడే శిల్పం, వస్తువూ అంటూ వారి వెంట పడకూడదు. సమాజాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే కవిత్వం రాయొచ్చు. అలా రాసిన కవిత్వం ఎవరికి చెందుతుంది అనేది కాలం చెప్పేస్తుంది. శ్రేయ కాలానికి ఎదురొడ్డే కలంగా ఎదగాలని ఆశిద్దాం.

రాయడం అనేది ఒక కళ. ఒక ఆల్కెమీ. అది పట్టుబడితే అంత తేలిగ్గా వదిలిపెట్టదు. ఎలాగూ కవిత్వం రాస్తున్నాం కదా అని అలసత్వం పాటించకుండా నిత్యం సమాజాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అవసరం. అది ఈ కవయిత్రి గుర్తించాలి. తన వెనక ఉన్న పెద్దలు వెన్ను తట్టి ప్రోత్సహించాలి. వాళ్లు ఆ పని ఎలాగూ చేస్తారు  కాబట్టి ఆమెకు చాల మంచి భవిష్యత్ ఉంటుంది.

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

18 comments

 • నువ్విలా రాస్తే ఎంత బాగుంటుందో చెప్పలేను అనిల్. ఆ అమ్మాయి ముఖం నాకింకా కళ్ళముందే కనబడుతోంది. ఈమె కరుణశ్రీ రాసిన కవితా కుమారికి నెచ్చెలి. తనకి ఆశీర్వచనాలు. నీకు బాలోత్సవాలు తిరిగి తిరిగి ఆనంద పరవశడవుతున్నావు. నీకు అభినందనలు మిత్రమా.

  • అవును సార్ బాలోత్సవ్ లు నాకొక ఎనర్జీ డ్రీమ్క్ లాంటివి ఎప్పటికప్పుడు పిల్లలతో గడిపే ఆ రెండు రోజులు చాలా బాగుంటాయి . పిల్లలు కొత్త కొత్తగా మాట్లాడతారు మనం వాటిని అభివ్యక్తి అని రాసుకుంటాం కానీ వాళ్లకి ఏవేని తెలియదు వారిది నిష్కల్మష మనసులు , ఈ పుస్తకం చూడగానేఅ ఒక మంచి వేదికపై పరిచయం చేయాలి అనిపించింది అందుకే ఇక్కడ రాసా . మీకు నచ్చింది పాసైనట్టే .

  • కొత్తతరాన్ని మోసిన మీ వ్యాసానికి నా పాదాభివందనం

 • చాలా బావుంది అన్న..చక్కటి ఊహతో రాస్తున్న కవయిత్రి కి శుభాకాంక్షలు

 • ఓ మంచి స్నేహితురాలు…..ఏది ఏమైనా వీడలేని బంధం….నీ మాటలు కూడా ని కవితల్లా తీయగా ఉంటాయ్….. చిట్టి పొట్టి మాటలతో ని ఆధరాల పై చిరునవ్వు అలానే వుందని…..

 • చిన్నతనం నుండే సమాజాన్ని దగ్గరగా చూసే నీ లాంటి
  కవులు,కవయిత్రులు..పుట్టు కొస్తే..
  …. ఎంత బాగుంటుందో…

  ..

 • Congratulations sreya..this is so huge.. And i wish u all the success for your future work.. Looking forward for reading this book.

 • మంచి విశ్లేషణ డ్యానీజీ.. కవిత్వానికి గొంతే తప్ప.. కళ్ళు లేని.. కొంతమందికి.. ఈ వెసులుబాటు నిజంగా.. ఒక అధ్యయన సంబంధాన్ని గుర్తుచేస్తుంది.ఇది నిజంగా ఒక ఆవశ్యకత కూడా.. కూరెళ్ళ శ్రీశ్రేయ తపన అలంటిదే.. అక్షరాల్లో తడుస్తూ.. అనుభూతుల్లో మునిగి తేలుతూ
  .. చిట్టచివరికి సామాజిక లోతుల్ని పరిశీలించడం.. అనుభవపూర్వక అధ్యయనమే.. లోచూపుని మనసుతో తడిమి.. మనిషిగా స్పందించే గుణం.. నిజంగా ఎంతమందికి ఉంటుంది.. ఈ కవయిత్రికి.. విమర్శకుడికి తప్ప.. అదే ఇక్కడ విడమర్చి చెప్పబడింది.. బహుముఖ పార్శవాలను తడమడంలో.. వయసురీత్యా.. ఈ కవయిత్రి దృష్టి కోణం.. ఇంకా ఎదగాల్సివుంది.. తపన.. తాపత్రయానికి అంతులేదు.. డ్యానీ మాటల్లో.. చెప్పారానంత గాఢత తొంగిచూసింది.. సామాజిక దిశానిర్దేశం కనిపించింది..కవయిత్రిగా ఎదిగే క్రమాన్ని.. ఆవశ్యకతను తేటతెల్లమ్ చేసింది.. యీ స్పూర్తితో ముందుకి అడుగెయ్యాల్సిన బాధ్యత.. ఇక శ్రీశ్రేయదే.. మంచి కవిత్వ పంక్తులను ఉదాహరించిన ఈ విమర్శకుడి దృక్పథానికి స్వాగతం.. అభినందనలు అనిల్ డ్యానీగారికి..!

 • సుపెర్బ్… ఊహలకు అక్షర రూపం ఇస్తే అందమైన కవిత్వం…అది చిన్నా పెద్దా అనే బేధం చూపించదు…అమ్మలా అక్కున చేర్చుకోవటమే తెలుసు అక్షరానికి.. చక్కని కవిత్వానికి చిక్కని పరిచయం…. wow

 • గుడ్..శ్రీ శ్రేయ కవిత్వ పరిచయం నీ లోపలి సుతి మెత్తని మృదువైన మనసును తెలుపుతోంది…. నీ ఆలోచనలకు రూపం వస్తే…బుజ్జి బుజ్జి కవులు,కవయిత్రులు ఈ సాహిత్యంలోకి జొచ్చు కొని వచ్చి పిట్టల్లా వాలిపోతారు..పిట్ట గోడలు దిగి నీ చుట్టూ చేరి నిన్ను వాళ్ళ ల్లోకి లాగేసు కుంటారు..కొత్తతరం కవయిత్రి కి ఆమెను ,ఆమె కవిత్వాన్ని పరిచయం చేసిన అనిల్ డానీ లకు హృదయ పూర్వక అభనందనలు.

 • “గొంతెండిపోయేలా అరుస్తూ
  తన చెమటలో తాను స్నానం చేస్తూ
  ప్రయాణీకుల గొంతులో చల్లటి
  నీటి చుక్కలు వొంపుతున్నాడు .”
  ఎక్స్ల్లెంట్ ***

  ” ఆ దేవుడికి కొన్ని వందల చీరలు
  ఆ రాతి బొమ్మకి
  రోజుకో పట్టుచీర
  భక్తులకు భగవంతుడు తప్ప
  అన్నార్తులు కనబడరు కదా ”

  వండర్ఫుల్ ఫీలింగ్స్ ప్రెసెంటెడ్ వెల్… కాంగ్రాట్యులేషన్స్ అనిల్ జి …. యువర్ narration is వెరీ గుడ్ అండ్ మోటివేటింగ్

 • భవిష్యత్తులో గొప్ప కవిత్వానికి పునాది అని చెప్పొచ్చు ఈ ఎంత బాగుంటుందో అనే కవిత్వ సంపుటి..god bless you sreya…మీరు పరిచయం చేస్తున్న కవుల కవనాలను చదవడం మాకెంత బాగుంటుందో అనిల్ గారు అభినందనలు మీకు..

 • సోదరుడు అనీల్ కు
  మీ సమీక్ష చదివాక నాకు మళ్ళీ
  శ్రేయ కవిత్వం చదవాలనిపిస్తోంది.ప్రతీ కవితని
  లోతుగా అధ్యయనం చేస్తే గానీ సమీక్ష యింత
  అద్భుతంగా రాయడం కష్టం
  మీ సమీక్ష శ్రేయకు…. మరింత ఎదగడానికి దోహదపడుతుంది.
  విజయనగరం లోని సాహితీ వేత్తలు సాహితీ సంస్థ లు శ్రేయనెంత గా నో ప్రోత్సాహించాయి.మీ సూచనలు సలహాలు కూడా మీ సోదరికిలాగే అందించాలని కోరుకుంటూ…..

 • Dear Shreya,
  My hearty blessings to you.May God bless you.Your writings are really laudable and praiseworthy.It is highly difficult to get such broad ideas in one’s mind.But you got them and exhibited them in a magnonimus and magnificent way.I strongly believe that you would reach the achem of poetry(Telugu).And take it as your first step but not last.Keep it up.

 • ముందు తను బాగా రాయగలిగితెనే కదా ఎవరమైనా సమీక్ష చేయగలిగేది అండీ, తనలో అక్షరం పట్ల అవగాహన మక్కువా ఉన్నాయి కాబట్టి కవిత్వం వైపు చూపింది రాయనివ్వాలి ఇలాంటి వారిని రాయనిస్తే కొత్త కొత్త భావాలు బయటకి వస్తాయి.తనకి మన అందరి సహకారం అవసరం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.