క్రూరత్వం

జానకీ,
నువు చాలా కష్టపడి పంపించిన ఉత్తరం చదివాను. ఇన్నేళ్ళయినా నువు నన్ను మర్చి పోలేదు. నా గురించి ఎలాగోలా తెలుసుకున్నావు. నేను ఇక్కడ ఉన్నానని అమ్మ చెప్పిందన్నావు. కనీస సౌకర్యాలు అంటే కనీసంగా కూడా తెలీని గిరిజన ప్రాంతం ఇది. ఇక్కడి పిల్లలందరూ “ఒకటో తరగతి తెలుగు వాచకం’’ చదివేలా చేయడమే నా పని.

నా పెళ్లి మూన్నెళ్ళకే ముక్కలయిందని అమ్మ రోజూ తల బాదుకుంటుంటే భరించలేక అక్కడినించి ఇక్కడికి వచ్చేసాను.
మా విడాకులకు కారణం అడిగావు కదా! కారణం నా క్రూరత్వం. అవును. నా క్రూరత్వమే. అప్పట్లో నా కేసులో కోర్టు అదే చెప్పింది మరి. “భర్త తో శృంగారానికి భార్య ఒప్పుకోకపోతే దాన్ని క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయ వచ్చు’’ అని తీర్పు చెప్పింది. కోర్టే కాదు, నా అత్తింటి వాళ్ళూ, పుట్టింటి వాళ్ళూ, నేనెరిగిన వాళ్ళూ.. అందరూ అదే తీర్పు. నన్నెరిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప. అసలు ఏం జరిగిందో నేను నీతో చెప్పుకోనే లేదు. అంతా విన్నాక నువ్వేం ‘తీర్పు’ చెపుతావో!
అసలు నా ‘పెళ్లి’ ముచ్చట్లు కూడా నీకు సరిగా తెలీవు కదా! అతను నన్ను ఏదో పెళ్ళిలో చూశాడట. వెంటనే నచ్చానట. వాళ్ళ నాన్నా, మా నాన్నా చిన్ననాటి స్నేహితులని తేలింది. అమ్మా వాళ్ళ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. వారంలో నిశ్చితార్ధమయిపోయింది. అదే నెలలో పెళ్లి పెట్టుకున్నారు. ఇల్లంతా ఒకటే సందడి. చాలా మంది అమ్మాయిల లాగానే నేను కూడా పెళ్ళంటే “పందిళ్ళూ… సందళ్ళూ …., తాళాలూ … తలంబ్రాలూ …, మూడు ముళ్ళూ …ఏడడుగులూ ..” అనుకునే దాన్ని.

పెళ్ళికి ముందు అతను అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చి వెళ్తుండే వాడు. అతనొచ్చినా, అతని ప్రసక్తి వచ్చినా చాలా సిగ్గు పడేదాన్ని. “నువు మరీ పాత కాలపు పిల్లవి. ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్ళికి ముందే సినిమాలకీ, షికార్లకీ తిరుగుతూ ఉంటే, నువ్వేమో మాట్లడడానికే సిగ్గు పడుతున్నావు.” అని చుట్టూ పక్కల అమ్మలక్కలు వేళాకోళం చేసేవారు, అలా తిరిగే అమ్మాయిలని బరితెగించేస్తున్నారని తిట్టిన ఆ నోళ్ళతోనే.

నన్ను చూసి పెళ్ళికొడుకు అక్కేమో “డిగ్రీ చదివిన పిల్ల లాగా లేదు. డ్రెస్సుల సెలక్షన్ అస్సలు బాగా లేదు. ముసలమ్మలాగా ఒళ్ళంతా కప్పుకునే డ్రెస్సులు వేస్తోంది.” అంటూ పగలబడి నవ్వింది. “సిటీ కి వచ్చాక మోడ్రన్ గా మార్చేస్తాలే” అక్క నవ్వుతో జత కలిపాడు తమ్ముడు. అందరూ నవ్వారు, నేను తప్ప.
పెళ్లి ఇంకా నాలుగు రోజులు ఉందనగా ఒక రోజు సాయంత్రం ఒక్కడే వచ్చాడు. అమ్మానాన్నా ఊళ్ళో లేరు. చెల్లిని తీసుకుని పత్రికలు పంచడానికి వేరే ఊరు వెళ్ళారు.

అతనికి వంట చేసి పెట్టాను. తిన్నాడు. నిద్రపోతానన్నాడు. ఒక గదిలో పక్క సిద్దం చేశాను. నిద్దర రావడం లేదన్నాడు. “కూర్చుని కబుర్లు చెప్పుకుందాం” అంటాడేమో లేకపోతే నాతో పాటలు పాడించు కుంటాడేమో అనుకున్నాను. అతి కష్టమ్మీద ఆ మాటే పైకి అనేశాను.

“ఇంత తెలివి తక్కువ దానివా! కాబోయే పెళ్ళాం ఒంటరిగా దొరికితే టైం వేస్టు చేసుకుంటానా!” అంటూ దగ్గరకొచ్చి బట్టలు విప్పేయడం మొదలు పెట్టాడు. “ఒద్దు, ఒద్దు“ అన్నాను చాలా భయంగా. నా భయం అతనికి పట్టలేదు.

“ఇంతందంగా ఉన్న నిన్ను ఏమీ చేయకుండా ఉండడానికి నేనేమైనా బొమ్మనా?” అన్నాడు అదో మాదిరిగా నవ్వుతూ.

“నాకిష్టమో కాదో తెలుసుకోకుండా ఇలా మీద పడిపోతే ఊరుకోవడానికి నేను మాత్రం బొమ్మనా?” అని అడగొచ్చని నాకు అప్పుడు తెలీదు. అందుకే కనీసం మనసులో కూడా అలా అనుకోలేదు. కొయ్యబారి పోయాను. నన్ను మంచం మీదకు తోసి మీద పడ్డాడు. కొద్దిసేపటి వరకూ నిజంగా బొమ్మనే అయ్యాను. నేను బొమ్మని కానని గుర్తు చేసింది నొప్పి. నెమ్మదిగా మూలిగాను.

“ముసలమ్మలా మూలుగుతావెందుకు?” విసుక్కున్నాడు. ఆ పది నిమిషాల్లో అతను మాట్లాడిన ఒకే ఒక్క మాట అది. ఆ మాటతో పూర్తిగా చచ్చిపోయాను. అతను నిద్ర పోయాడు. ఎంతసేపు ఏడ్చానో, ఎలా ఏడ్చానో మాటల్లో చెప్పలేను. “అతన్ని గట్టిగా వారించి ఉంటే ఈ బాధ తప్పేది కదా!” అనే ఆలోచన కూడా రాలేదు. “ఇలా జరిగిందేమిటీ” అని ఏడవడం తప్ప ఏమీ ఆలోచించ లేకపోయాను.

అతనెప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. నేను దిగులుగా, పరధ్యానంగా ఉండడం చూసి “ పెళ్ళి అనగానే ప్రతీ అమ్మాయి ఇలాగే ఉంటుంది” అన్నారు కొందరు, నా మనసు లోకి తొంగి చూసినట్టుగా.

పెళ్ళికొడుకు హోదాకి తగ్గట్టుగా, ‘గొప్ప’గా జరిగింది పెళ్లి. ఏ గొడవలూ లేకుండా పెళ్లి ప్రశాంతంగా జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు అమ్మావాళ్ళు. నాకేమో అసలు పెళ్ళే పెద్ద గొడవగా అనిపించింది. కానీ పెళ్ళిలో అమ్మాయిలు లక్షలు లక్షలు డబ్బులిచ్చి మరీ అమ్ముడు పోతారని నేను అప్పుడు గ్రహించలేదు. అప్పుడు నాకున్న తెలివికి వ్యభిచారం అనే మాటకి అర్ధమే తెలీదు. ఇక సమాజమంతా ఆమోదించి పెళ్లి పేరుతొ చేయించే వ్యభిచారం గురించి నాకెలా తెలుస్తుంది.

అత్తగారింట్లో వ్రతాలూ , ముహూర్తాలూ, అలంకారాలు…ఎవరేం చెప్పినా తలొంచుకుని వింటున్నాను. నేనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో తెలీదు. ప్రతీది నా ప్రమేయం లేకుండానే జరిగిపోతోంది. అతను ఉన్న గదిలోకి పంపారు.

“ ఆ రోజు నిన్ను తొందరగా వదిలేశాను. ఈ రాత్రంతా నిన్ను వదిలే ప్రసక్తే లేదు” అన్నాడు ఉత్సాహంగా. నేను మరింత ముడుచుకుపోయాను. మొదటి సారిలా ఒక్క మాటతో సరిపెట్టకుండా, ఆ రాత్రి పక్క మీద చాలా మాటలే మాట్లాడాడు. “నడుం కింద దిండు వేసుకో…కాళ్ళు పైకెత్తు.. ఇంకా పైకెత్తు… …. కూర్చో… నిల్చో.. వంగు…బోర్లా పడుకో..పైకి రా…కిందికి రా.. అటు జరుగూ.. ఇటు జరుగూ”. ఆ రాత్రంతా నేను కీ ఇచ్చిన బొమ్మనే అయ్యాను.

కొద్ది రోజులకి అమ్మ దగ్గరికి వెళ్ళాను. అక్కడికీ వచ్చేశాడు. “శారదని వదిలి ఉండలేను” అని మా వాళ్ళ దగ్గర గారాలు పోయాడు. “మా పిల్ల ఎంత అదృష్టవంతురాలో” మురుసుకున్నారు మా వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడా, ఎప్పుడు పడితే అప్పుడూ గిచ్చుతూ, పిసుకుతూ “ నీకు సరదాలూ, సరసాలూ ఏవీ అర్ధం కావెందుకు!” అని నవ్వుతూ విసుక్కునే వాడు.

“చదువుకున్న దానివే కానీ, నీకు జ్ఞానం తక్కువే” అని నా జ్ఞానాన్ని పెంచడానికి కంప్యూటర్ లో బూతు వీడియోలు చూపించేవాడు. వాటికి జుగుప్స అనే మాట చాలా చిన్నది. అంతకన్నా లక్ష రెట్ల తీవ్రమైన పదం వాడినా సరిపోదు. ఆ రోతంతా భరించినందుకు ఇప్పుడు నా మీద నాకే అసహ్యం.

ఒకసారి అక్కతో నా బాధ చెప్పాను. “నువు భరించ లేకపోవడానికి నీ మొగుడేమైనా సిగరేట్లతో కాలుస్తున్నాడా.. బ్లేడుతో కోస్తున్నాడా…” అని కొట్టిపారేసింది. “నా ఒంటి మీద బ్లేడు గాట్లు లేవేమో గానీ, నా మనసు మీదున్న రంపపు కోతల మాటేమిటీ?” అని అడగడానికి నోరు రాలేదు. “పక్క మీద అతనికి నచ్చినట్టు ఉండు. మిగతా విషయాల్లో అతను నీ మాట వినేల చేసుకో” అని వేశ్యరికం భోధించింది. “తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు. చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు” అని హెచ్చరించింది.

అవమానాన్నీ, దుఃఖాన్నీ అదిమి పెట్టుకుని అతనికి లొంగి ఉండడానికే చూశాను. ఎప్పుడైనా నేను నోరు తెరిచి “ఇక చాలు” అంటే అది వింత అయిపోయేది.” అదేంటి, ఆడవాళ్ళు ఒక్కసారి కూర్చుని లేస్తే మళ్ళీ “సిద్ధం” అయిపోతారంటారు, నువ్వేమో ఎప్పుడు చూసిన నీరసం మొహం పెట్టి మూడు పోగొడతావు.” అంటూ చివాట్లు.

ఆడవాళ్ళ గురించి అలాంటి వాగుళ్ళు నేను ఏ ఆడవాళ్ళ దగ్గరా వినలేదు. “ఇలాంటి మగ ముండా కొడుకే ఆ కూత కూసి ఉంటాడు.” అని కసిగా తిట్టుకున్నాను మనసులో.

నా శరీరం సరిగా స్పందించడం లేదని దాన్ని బాగు చేయించడానికి డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాడు. అక్కడ మందులతో పాటు, కౌన్సిలింగ్ పేరుతొ హితబోధ కూడా చేసారు. “ఆకలీ, దప్పికా లాగానే ‘’ఇది’’ కూడా ఒక తప్పని సరి భౌతిక అవసరం…. ఇది ప్రకృతి సహజమైనది… తప్పు అనుకోవద్దు….” ఇలా చాలా చాలా చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల మీద నా అభిప్రాయం ఎవరూ అడగలేదు. కాని నాకు వాళ్ళతో వాదించాలనిపించింది.

నీళ్ళు తాగకుండా, ఆహారం తీసుకోకుండా ఉంటే కొంత కాలానికి చనిపోతాం. కాని ఇది లేకపోతే చనిపోతారా!! పసితనం లోనే వితంతులుగా మారి జీవితాంతం పురుష స్పర్శ ఎరగకుండా బతికినా ఆడ వాళ్ళ గురించి తెలుసు నాకు. వాళ్ళని ఆ పరిస్థితికి బలవంతంగా నెట్టేశారు. కానీ ప్రేమించిన మనిషి దూరమయితే ఊపిరి ఉన్నంత వరకు మరో మనిషిని తాకకుండా ఉన్న వాళ్ళు లేరా! కళలంటే ప్రాణం పెట్టి మరో ఊసు లేకుండా బతుకుతున్న వాళ్ళు ఉండరా! ఉన్నత ఆశయాల సాధనకి అంకితమై వ్యక్తిగత వాంఛల గురించి ఆలోచించని వాళ్ళు కూడా కొందరు ఉంటారు.

ఒకప్పుడు నేను ఇవన్నీ మాట్లాడగలిగే దాన్ని కాదు. కానీ నేను నా సమస్య గురించి చాలా ఆలోచించాను. దాన్ని అర్ధం చేసుకోవడానికి చాలా పుస్తకాలు చదివాను. నా చుట్టూ బతుకుతున్న చాలామంది ఆడవాళ్ళ జీవితాలను అతి దగ్గర నుండి చూసాను. అందుకే ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను.

ఆకలీ, దప్పికా విషయంలో రెండో వ్యక్తీ ప్రమేయం అవసరం లేదు. కాని “ఇది” ఇద్దరికీ సంబందించిన విషయం. ఇక్కడ ఇద్దరి మనసులూ, మమతలూ, ప్రేమానురాగాలూ చాలా అవసరం. ఇవేమీ లేని సంబంధం జంతు స్థాయిలో ఉన్నట్టే. కానీ నేను ఆలస్యంగా గమనించిన ఒక వింత విషయం ఏమిటో తెలుసా! చాలా మంది మనుషుల సంబంధాల తో పోలిస్తే జంతువుల సంబంధాలు ఎంతో ఉన్నతమైనవి. ఒక మగ నెమలి పురి విప్పి ఆడి ఆడ నెమలితో జత కడుతుంది. అంతేగానీ ఆసక్తి చూపించని ఆడ నెమలి మీద అత్యాచారం చేయదు. అంతే కాదు, జంతువులు కట్నాలు తీసుకోవు. ఆస్తులకి ఆశ పడి పక్కలో పడుకోవు. అధికారాలు నెరపవు. అవమానాలు చేయవు. ఈ భూమ్మీద శరీరాలతో సహా అన్నిటినీ అమ్ముకోవడం, కొనుక్కోవడం చేసేది మనుషులు మాత్రమే.

ఎప్పుడయితే “భార్యాభర్తల మధ్య ప్రేమ బంధమే కానీ, అధికార బంధం ఉండకూడదు” అనే అమృత వాక్యాలు నా చెవిన పడ్డాయో అప్పటినుంచి నేను అతనికి లోబడలేదు. భర్తకి ఉండే హక్కులని గుర్తు చేశాడు. భయపెట్టాడు, బెదిరించాడు. పెద్ద వాళ్లకి చెప్పి నాకు గడ్డి పెట్టించాడు. ఆఖరికి విడాకుల కాగితం పంపాడు. వెంటనే సంతకం పెట్టేశాను. నా “క్రూరత్వం” కారణంగా విడాకులు తొందరగానే వచ్చాయి.

“స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది. దానికి అనుభవం ఇవాలి” అన్న చలం మాటలు ఇప్పటికీ పూర్తిగా అర్ధం చేసుకోని వారికి నాది ఎప్పటికీ క్రూరత్వమే.

శారద

రచయిత్రి శారద ‘అసలు పేరు- సరస్వతి. వృత్తి- తరగతి గదిలో పాఠాలు చెప్పడం. ప్రవృత్తి- జీవితపు చెరలో గుణ పాఠాలు నేర్చు కోవడం. నా గురించి చెప్పడానికి ఇంతకన్నా వివరాలూ, విశేషణాలూ లేవు.’.

6 comments

 • కధ బాగుందండీ. బాగా రాసారు. ముగింపులో చలం మాటలు అర్థవంతంగా ఉన్నాయి. మిత్రురాలి పేరు జానకి కావడం యాధృచ్చికమేనా?

  • . ‘జానకి విముక్తి ‘ నవలలో జానకి అంటే ఇష్టం. అందుకే ఆ పేరు.

 • I do not really know that you are a professional writer or not, but somehow I felt that you have reflected a known woman or some female related to you. Although it has been written as a letter, the narration is good and sentences and expressions are very well constructed..

  • Thank you. I am not a professional writer . This is my first published story . It is semi-autobiographical .

 • శారద గారూ , కథ లేఖ రూపంలో ఉన్నా క్లారిటీగా ఉంది. మీది చక్కటి వచనం. సాదా మాటలతోనే ఆమె అంతర్మథనాన్ని గొప్పగా ఆవిష్కరించారు.
  “నీళ్ళు తాగకుండా, ఆహారం తీసుకోకుండా ఉంటే కొంత కాలానికి చనిపోతాం. కాని ఇది లేకపోతే చనిపోతారా!! పసితనం లోనే వితంతులుగా మారి జీవితాంతం పురుష స్పర్శ ఎరగకుండా బతికినా ఆడ వాళ్ళ గురించి తెలుసు నాకు. వాళ్ళని ఆ పరిస్థితికి బలవంతంగా నెట్టేశారు. కానీ ప్రేమించిన మనిషి దూరమయితే ఊపిరి ఉన్నంత వరకు మరో మనిషిని తాకకుండా ఉన్న వాళ్ళు లేరా! కళలంటే ప్రాణం పెట్టి మరో ఊసు లేకుండా బతుకుతున్న వాళ్ళు ఉండరా! ఉన్నత ఆశయాల సాధనకి అంకితమై వ్యక్తిగత వాంఛల గురించి ఆలోచించని వాళ్ళు కూడా కొందరు ఉంటారు…”
  పదే పదే చదువుకున్న వాక్యాలివి, ఎంత అర్థవంతంగా రాసారో –
  అయితే ఒకమాట .. జీవితాంతం ఆమె పై మాటలకు కట్టుబడి కూడా ఉండక్కరలేదు. పురుషులందరూ ఒకేలా ఉండరు కదా. కథ చివరలో మీరు ఉటంకించిన మాటలు రాసింది కూడా పురుషుడే (చలం). మనసు పరిస్థితులని బట్టి మారుతుంది. అప్పుడే మనం మనముగా జీవిక సాగించినట్టు.
  మంచి కథని అందించారు , అభినందనలు.

 • కథనంలో ఒక జీవితపు తాలూకు స్పర్శ వుంది. నిజమైన అనుభవాల సాంధ్రీకరణే కథ గానీ కవిత్వం గానీ.. సాధారణ సామాజిక స్ధాయి లో పెరిగిన స్త్రీ వీటిని తీసుకోవడం లో తేడా ఉంటుంది.. ఆ పురుష పుంగవుడి రసికత ని కీర్తించే అమ్మ వుంటుంది.. అత్త ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది..బిడ్డలు కన్న అక్క ఉంటే ఇంట్లో , ఒకవేళ బట్టలు ఉతికి ఇచ్చే మహిళ వినే అవకాశం ఉంటే..వీళ్లంతా ఆ పురుషుడి కాముకతని రసికత గా వివరించి నచ్చచెబుతారు తప్ప అది తప్పు అనరు.. ఇలాంటివి మగ మహానుభావుల చెవికి చేరవు..
  అమ్మాయి కి ఉండాల్సిన స్త్రీ త్వం అనే గుణం ఏమైనా miss అయిపోలేదుగదా కొంపదీసి అనే మహిళలు చుట్టూతా వున్న సందర్భాల్లో ,సమాజంలో ఇలాంటి వారికి “జాలి” మాత్రమే ఉదారంగా లభిస్తుంది.. ఒక్క వేటగాడితో సరిపెట్టుకున్నా పోయేది.. ఇందరి వేటగాళ్ల తో వేగడం ఎంత కష్టం అనిపించే స్థాయికి దిగజార్చుతారు మామూలు వ్యక్తిత్వం ఉన్న స్త్రీ మూర్తి నైతే…అయితే ఈ చైతన్య మూర్తి “జానకి విముక్తి” చదివిన స్త్రీ కాబట్టి.. జీవితం అంటే పురుషుడి సాహచర్యం తోబతకడం వల్లే ఫలవంతం కాదు..నిజమైన వ్యక్తిత్వం తో బతకడం సాధ్యమే…అని bold గా చెప్పిన కథ ఇది..ఎందరో ఇలా తమ భావాల్ని, హృదయాల్ని కాపాడుకుంటూ వచ్చే ఎందరో స్త్రీలకు ఇదొక గొప్ప భరోసాను ఇస్తుంది…

  VVIJAYAKUMAR

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.