ఆదివాసుల గుండె చప్పుడు ఫాదర్ స్టాన్ స్వామి

ఆగస్టు 28, 2018 ఉదయం: సామాజిక, మానవహక్కుల కార్యకర్తల మీదా, ప్రొఫెసర్లూ, జర్నలిస్టుల మీదా దేశవ్యాప్తంగా తెల్లవారు ఝామున్నే జరిగిన దాడులతో ఉలికిపడి మేల్కొంది భారతదేశం. ‘నరేంద్ర మోదీ మీద హత్యాప్రయత్న’ ప్రణాళిక  అంటూ పోలీసులు సృష్టించిన ఉత్తరం ఆధారంగా ఇళ్లు సోదా చేసి, కొంతమందిని అరెస్టు చేశారు మహరాష్ట్ర పోలీసులు.

ఆ అబద్ధాన్ని ఎంతోకాలం నిలబెట్టలేక చివరికి భీమా-కోరెగావ్ అల్లర్లకు దారితీసిన ఎల్గార్ పరిషత్ సభలో పాల్గొన్నారని నేరం మోపారు. అరెస్టు అయి, వెంటనే విడుదలయిన వారిలో ఒకరు జార్ఖండ్ నివాసి, జెస్యూట్ మతబోధకుడు ఫాదర్ స్టాన్ స్వామి. విడుదల అయ్యారే కానీ, అరెస్ట్ ముప్పు ఆయన మీద ఇంకా ఉంది.

ఈ దాడికి ముందు 82 ఏళ్ల స్టాన్ స్వామి గురించి జార్ఖండ్ బయట చాలా తక్కువ మందికి తెలుసు. అరెస్టు తరువాత ఆయన గురించీ, కొన్ని దశాబ్దాలుగా ఆదివాసుల కోసం నిర్విరామంగా ఆయన చేసున్న పని గురించీ ప్రపంచానికి కొంచెమైనా తెలుస్తోంది.

జార్ఖండ్. ‘ల్యాండ్ ఆఫ్ ద ఫారెస్ట్స్’. అడవుల దేశం. ఆ అడవుల్లోని  చెట్టూ పుట్టాలో భాగమైన మూలవాసికి ఆ నేల పవిత్రమైనది. ఆ నేల బువ్వ నిచ్చేదే కాదు, అది వాళ్ల  గుండె. ఆ గుండె చప్పుడులో మమేకమైనవాడు ఫాదర్ స్టాన్ స్వామి.

జెస్యూట్లలో కలిసిన ప్రారంభ దినాల్లో దేశంలో ఏ ప్రాంతంలో  తన అవసరం వుంటుందో నిర్ణయించుకుంటున్నప్పుడు, దేశ మధ్య భాగంలో ఉండే ఆదివాసి తెగల గురించి విని అడవి లోతట్టులో ఉండే ఒక ఊరిలో రెండు సంవత్సరాలు గడిపారాయన. “అక్కడే మూలవాసుల జీవన విధానాన్ని అర్థం చేసుకున్నాను… ఒకరిపట్ల ఒకరికి సమానత్వ భావనా, సహకారం, లెక్కలు వేసుకోని భాగస్వామ్యం, సమాజ-బాంధవ్యం, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం, ప్రకృతితో సాన్నిహిత్యం. అదే సమయంలో, బయటి నుంచి వచ్చిన దుర్మార్గులు మూలవాసులను ఎంతగా దోచుకుంటున్నారో, ఎంతలా అణిచివేస్తున్నారో చూశాను. ఆత్మగౌరవం కోసం వాళ్లు చేస్తున్న అన్వేషణలో ఇసుమంతైనా ఉపయోగపడేందుకు ఏదైనా చేయాలని అనుకున్నాను.” అని తాను ఎంచుకున్న మార్గం గురించి చెప్తారు స్టాన్ స్వామి.

చెట్లూ పుట్టలే కాదు, బొగ్గూ, ఇనుమూ, బాక్సైట్, యురేనియం, బంగారం, వెండి, రాగి, గ్రాఫైట్, మైకా వంటి ఎన్నో సహజ వనరులూ, ఖనిజాలూ ఈ భూమిలో ఉన్నాయి. భూమి పొరల్లో ఉండే ఖనిజాల గురించి జార్ఖండ్ మూలవాసులకు ఏం పట్టలేదు. ఉపరితలం మీద భూమి ప్రసాదించే ‘జల్ జంగల్ జమీన్’ (నీరు, అడవి, నేల) కోసమే వాళ్ల తపన అంతా. ఆదివాసుల గౌరవమూ, ఆత్మగౌరవమూ అంతా భూమితో ముడివడి వుంటాయి. భూమి గురించి ప్రపంచంలోని అన్ని ఆదివాసి తెగల్లో ఉండే పవిత్ర భావమే మన దేశంలోని మూలవాసుల్లోనూ ఉంది.

సహజ వనరులనూ, ఖనిజాలనూ కొల్లగొట్టడానికి భూమిపై దాడిచేస్తున్న పాలకులపై  బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడక ముందు నుంచే పోరాటాలు చేశారు ఇక్కడి మూలవాసులు. ఆ నేపథ్యంలో, సంతాల్ హూల్ స్వాతంత్ర్య పోరాటం, బిర్సా ముండా ప్రతిఘటన వంటి ఎన్నో ఉద్యమాలను బ్రిటిష్ పాలన చవిచూసింది. స్వాతంత్ర్యం వచ్చాక పారిశ్రామిక వేత్తల దాహానికి ఆర్చుకుపోయింది ఈ భూమి. పారిశ్రామిక వేత్తలతో కమ్ముక్కైన ప్రభుత్వం మూలవాసుల నుంచి నయానో భయానో భూమిని లాక్కుంటోంది. గనులూ పరిశ్రమల కోసం భూసేకరణ పేరిట నలభై లక్షల మందికి పైగా మూలవాసులు నిర్వాసితులయ్యారు. అందుకు వాళ్లకు లభించిన నష్టపరిహారం దాదాపు శూన్యం. నష్టపరిహారం కోసం, అడవి హక్కుల కోసం ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి.

వేల సంవత్సరాలుగా జార్ఖండ్ ప్రాంతంలో నివసిస్తున్న మూలవాసులు ఎన్నో పోరాటాల తరువాత గత 2000 లో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. బిర్సా ముండా వంటి అడవి వీరులు జల్ జంగల్ జమీన్ పై హక్కుల కోసం వందల ఏళ్లుగా సాగించిన ప్రతిఘటన ఫలితం ఈ ప్రత్యేక రాష్ట్రం.

మూలవాసుల ప్రయోజనం పేరిట ఏర్పడ్డ రాష్ట్రంలో, ఇక తమ అడవుల్లో తాము బతకొచ్చని ఆశ పడ్డ వాళ్లు ఒకట్రెండు సంవత్సరాల్లో తమది ఎంత అత్యాశో తెలుసుకున్నారు. ‘అభివృద్ధి’ పేరిట మూలవాసుల మీద హింస ఎంత ఉధృతమైందో, ప్రభుత్వం మీదా, పరిశ్రమల మీదా మూలవాసుల ప్రతిఘటనా అంతే ఉధృతమైంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది ఆదివాసీ యువకుల మీద ‘నకలైట్ల’ ముద్ర వేసి జైళ్లల్లో పెట్టింది ప్రభుత్వం.

ఎన్నో ఏళ్లుగా జార్ఖండ్ లో ఆదివాసుల మధ్యే ఉంటున్న స్టాన్ స్వామి, వాళ్లు ఎదుర్కుంటున్న సమస్యల గురించి పత్రికల్లో రాస్తూ, సభలనూ ర్యాలీలనూ నిర్వహిస్తూ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భూపరాయీకరణకూ, మానవ హక్కుల ఉల్లంఘనకూ, తప్పుడు నిర్బంధాలకూ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో ముందుండి పాల్గొంటున్నారు. ఇంకో ఏడుగురితో కలిసి జార్ఖండ్ జైళ్లలో అండర్ ట్రయల్స్ లో ఉన్న ఆదివాసుల గురించి పరిశోధించి, ‘Deprived of rights over natural resources, impoverished Adivasis get prison’ (సహజవనరులపై హక్కులు కోల్పోయి, జైళ్లపాలవుతున్న పేద ఆదివాసులు) అనే  పుస్తకాన్ని వెలువరించారు. సోషియాలజీలో ఎం.ఎస్ చేసి, ‘లిబరేషన్ థియాలజీ’ చదివిన స్టాన్ స్వామి, సామాన్యులకు అర్థమయ్యే భాషలో, ప్రభుత్వం పరిశ్రమలతో కమ్మక్కై ఆదివాసుల నుంచి భూమిని ఎలా లాక్కుంటుందో వివరించారు.

జార్ఖండ్ లోనే కాక దేశం మొత్తం పేద రైతులూ, దళితులూ, ఆదివాసులకు చెందిన భూమిని ఆక్రమించుకుంటున్న ప్రభుత్వాన్నీ, పరిశ్రమలనూ ఎదుర్కొనడం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థలన్నిటినీ ఒక్క గొడుగు కిందికి తెచ్చే వుద్దేశంతో ‘విస్తాపన్ విరోధి జార్ఖండ్ జన్వికాస్ ఆందోళన్’ అనే వేదికను స్థాపించారు.

ఇంతకీ స్టాన్ స్వామికీ, భీమా-కోరెగావ్ అల్లర్లకూ ఏమిటి సంబంధం?  

‘ఇల్లు సోదా చేస్తున్నప్పుడు పోలీసులు ఆయన రాసిన వ్యాసాలను పట్టుకెళ్లారు. వాటిని పరిశోధించి ఎలాంటి నేరం మోపాలో నిర్ణయించుకుంటారేమో’ అని NDTV ఇంటర్వ్యూలో ఆయన నవ్వుతూ అంటారు. తనకే కాదు, తనతో పాటు పోలీసు దాడికి గురైనవాళ్లెవరికీ భీమా-కోరెగావ్ అల్లర్లకు సంబంధం లేదని ఆయన అంటారు. నిజానికి భీమ-కోరెగావ్ అల్లర్ల వెనక మాస్టర్ మైండ్స్ మిలింద్ ఎక్బోటే, సంభాజి బీడేలు అని సాక్ష్యాధారాలున్నా,- వాళ్లు బెయిలు మీద జైలు బయట తిరుగుతున్నారు. అల్లర్లకు సంబంధంలేని సామాజిక కార్యకర్తలను కనీస సౌకర్యాలు లేని జైళ్లలో నిర్బంధిస్తున్నారు లేదా అరెస్ట్ ముప్పుతో వేధిస్తున్నారు. ఇందుకు కారణం, భాజపా భారత ప్రజల్లో తమ పట్టు కోల్పోవడమేనని, రాబోయే ఎన్నికల్లో గెలవడం సులభం కాదనే భయానికి లోను కావడమేనని, అందుకే, పేద, దళిత, ఆదివాసీ, ముస్లిం ప్రజల మీద, పౌరహక్కుల కార్యకర్తల మీద నిర్బంధం ప్రయోగిస్తోందని అంటారు స్టాన్ స్వామి.

పీడిత ప్రజలకోసం ఇన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న స్టాన్ స్వామి మీద ఇది మొదటి కేసు కాదు. పధల్ గడి ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన మీద ‘దేశ ద్రోహం’ కేసు వేశారు. ఆ కేసుకు సమాధానంగా ఆయన రాసిన స్టేట్ మెంట్ అందరూ చదవదగినది: ,

‘ఆదివాసుల హక్కులకోసం ప్రశ్నలు లేవనెత్తినందుకే నేను ‘దేశ ద్రోహి’ నవుతానా?

గత రెండు దశాబ్దాలుగా, నేను ఆదివాసీ ప్రజలతో కలిసి జీవిస్తూ,  ఆత్మగౌరవం కోసం వారు చేస్తున్న పోరాటాలను నా పోరాటాలుగా చేసుకున్నాను. రచయితగా, వారు ఎదుర్కొన్న వివిధ సమస్యలను విశ్లేషించడానికి ప్రయత్నించాను. ఈ క్రమంలో, భారత రాజ్యాంగం ముసుగులో  ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎన్నో చట్టాలపై నా అసమ్మతిని స్పష్టంగా వ్యక్తం చేశాను. ప్రభుత్వమూ, పాలక వర్గమూ తీసుకున్న ఎన్నో నిర్ణయాల చట్టబద్ధతనూ, న్యాయబద్ధతనూ ప్రశ్నించాను.

ఇక పథల్గడి సమస్య గురించి, “ఆదివాసీలు ఎందుకు ఇలా చేస్తున్నారు?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను, వారు దోపిడీకీ, అలివి గాని అణచివేతకూ గురయ్యారు. వారి భూమిలో నుంచి తవ్వి తీసిన ఖనిజాలు బయటి పారిశ్రామికవేత్తలనూ, వ్యాపారవేత్తలనూ మరింత ధనవంతులను చేశాయి. ఆదివాసీ ప్రజలు ఆకలితో అలమటించి చచ్చిపోయేంత పేదరికానికి గురయ్యారు. ఉత్పత్తుల్లో వారికి ఎలాంటి వాటా లేదు. వారి బాగోగుల కోసం ఏర్పరచిన ఏ చట్టాలనూ, విధానాలనూ ప్రభుత్వం అమలుచేయలేదు. ఆదివాసులు అణిచివేత ‘ఇక చాలు’ అనుకునేంతగా సహనం కోల్పోయారు. తమ గ్రామ సభలను పథల్గడీ ఉద్యమం ద్వారా సాధికారికంగా తిరిగి గుర్తించాలని కోరుతున్నారు. ఇలా పథల్గడి ఉద్యమం వెనక కారణాలను అర్థం చేసుకోవచ్చు.

నేను(స్టాన్ స్వామి) లేవనెత్తిన ప్రశ్నల్లో కొన్ని:

1) రాజ్యాంగం యొక్క 5 వ షెడ్యూల్, ఆర్టికల్ 244 (1) ను ఎందుకు అమలు చెయ్యడం లేదనేది నా ప్రశ్న. ఈ ఆర్టికల్ ప్రకారం, మూలవాసులు మాత్రమే  సభ్యులుగా ఉన్న ‘గిరిజన సలహా మండలి’ (TAC), ఆదివాసీ ప్రజల రక్షణా, శ్రేయస్సూ, అభివృద్ధి గురించిన సలహాలను రాష్ట్ర గవర్నరుకు తెలియజెయ్యాలి.

ఆదివాసీ ప్రజల రాజ్యాంగ  సంరక్షకుడు అయిన గవర్నర్, ఆదివాసీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని,  తానే స్వయంగా చట్టాలు చెయ్యగలడు. అవసరమైతే పార్లమెంటూ, రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన ఇతర చట్టాలను రద్దు చేయవచ్చు. కానీ గత ఏడు దశాబ్దాల్లో ఏ ఒక్క రాష్ట్ర గవర్నరు కూడా తన  రాజ్యాంగ వివేచనాధికారాన్ని ఎప్పుడూ ఆదివాసీ ప్రజల బాగుకోసం వినియోగించలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసికట్టుగా పని చెయ్యడం అందరికీ మంచిదనే కారణం చెబుతారు. TAC సమావేశాలు చాలా అరుదుగా జరుగుతాయి. వాటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించి, అధ్యక్షత వహిస్తారు. ఇలా సమావేశాలను పాలక వర్గాలు నియంత్రిస్తాయి. ఇలా ఆదివాసీ ప్రజలకు మోసపూరిత రాజ్యాంగ పాలనే దక్కుతోంది.

2) 1996 లో అమలులోకి వచ్చిన పంచాయితీలు (షెడ్యూల్డ్ ప్రాంతాలు పొడిగింపు) చట్టాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని అడిగాను. భారతదేశంలోని ఆదివాసీ తెగలు  గ్రామసభల ద్వారా స్వయం పరిపాలన శక్తి కలిగి ఉన్నాయనీ, వారిది గొప్ప సామాజిక సాంస్కృతిక సాంప్రదాయమని మొట్టమొదటి సారి ఈ చట్టం వల్ల ప్రపంచానికి తెలిసింది. కానీ, ఈ చట్టాన్ని తొమ్మిది రాష్ట్రాల్లో ఉద్దేశపూర్వకంగా అమలుచెయ్యడం లేదు. అంటే  ఆదివాసీ ప్రజలు స్వయం-పరిపాలనా శక్తి కలిగి ఉండకూడదని పెట్టుబడిదారీ పాలకులు కోరుకుంటున్నారు.

3) 1997 లో సుప్రీం కోర్టు సమతా జడ్జిమెంటు ఇచ్చింది.  ఆదివాసీ వర్గాలకు ఎంతో ఉపశమనం కలిగించిన ఆ తీర్పు గురించి  ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉందని ప్రశ్నించాను. గ్లోబలైజేషన్, సరళీకరణ, విక్రయీకరణ, ప్రైవేటీకరణ, జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల పాలన ఫలితంగా ఖనిజ సంపదను దోచుకునేందుకు భారతదేశ మధ్యప్రాంతంలోని ఆదివాసీ భూములను ఆక్రమించుకోవడం మొదలయిన సమయంలో ఆ తీర్పు వెలువడింది.  ప్రభుత్వ యంత్రాంగం ఈ సంస్థలకు పూర్తి సహకారం అందిస్తూ ఆదివాసీ ప్రజల ప్రతిఘటనలను ఉక్కుపాదంతో అణిచివేసింది. ఆదివాసీ భూముల్లోని ఖనిజాల తవ్వకాన్ని నియంత్రించడానికీ, ఆదివాసులు ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికీ, ఆదివాసీలకు కొన్ని అత్యవసర భద్రతా ప్రమాణాలను అందించడానికీ ఈ తీర్పు ఉద్దేశించబడింది.

వాస్తవానికి, దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నిర్లక్ష్యం చేసింది రాజ్యం. ప్రభావితమైన కమ్యూనిటీలు అనేక కేసులను దాఖలు చేశాయి, కానీ ఆదివాసీలను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టి  ఖనిజ సంపదను దోచుకోవటానికి వలస పాలకుల కాలంలో ఏర్పాటు చేసిన డొమైన్ చట్టాన్ని ఉపయోగించారు.

4) 2006 లో అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం మొక్కుబడిగా అమలు చెయ్యడాన్ని ప్రశ్నించాను. “జల్, జంగిల్, జమీన్” అనేవి ఆదివాసీ ప్రజల ఆర్ధిక జీవితానికి ఆధారమని మనకు తెలుసు. అడవిలో వారి సాంప్రదాయిక హక్కులను కొన్ని దశాబ్దాలుగా క్రమపద్దతిలో ఉల్లంఘిస్తున్నారు. ఆదివాసీలకూ, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులకూ చారిత్రాత్మక అన్యాయం జరిగిందని ఎట్టకేలకు ప్రభుత్వం గ్రహించింది. ఈ అసాధారణతను సరిచేయడానికి, ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

కానీ నిజంగా జరిగిన దానికీ, ఆదివాసులు కోరుకున్న దానికి ఎంతో వ్యత్యాసముంది. 2006 నుండి 2011 వరకు, భూమి పట్టాల కోసం 30 లక్షల దరఖాస్తులు దేశవ్యాప్తంగా దాఖలా అయ్యాయి. వీటిలో 11 లక్షల దరఖాస్తులు ఆమోదించబడ్డాయి కాని 14 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకో ఐదు లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. గ్రామ సభలకు తెలియకుండా పక్కదారిలో పరిశ్రమల కోసం అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి జార్ఖండ్ ప్రభుత్వం ఈ మధ్య ప్రయత్నిస్తోంది.

5) ‘భూమి యజమానే ఆ భూమి లోపలి పొరల్లోని ఖనిజాల యజమాని’ అన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఎందుకు అమలు చెయ్యటం లేదని  ప్రశ్నించాను. ఈ తీర్పు ఇచ్చే క్రమంలో, కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది, “భూమి లోపలి ఖనిజ సంపద మీద రాజ్యానికి అధికారమున్నదని ఏ చట్టంలోనూ లేదని అభిప్రాయపడుతున్నాము. మరేదైన చట్టబద్ధమైన కారణం వల్ల భూమిపై హక్కులను పోగొట్టుకుంటే తప్ప, భూమి యొక్క యజమానే, ఆ భూమి లోపలి పొరల్లోని ఖనిజ సంపదకు యజమాని.” ఆదివాసుల భూముల్లోని ఖనిజ సంపదను ప్రభుత్వమూ, ప్రైవేటు కంపెనీలూ దోచుకుంటున్నాయి. దేశంలో ఉన్న 219 బొగ్గు గనుల్లో 214 గనులు అక్రమమైనవని సుప్రీంకోర్టు ప్రకటించింది, ఆ గనులను మూసెయ్యాలనీ, అక్రమంగా తవ్వకాలు జరిపినందుకు జరిమానా విధించారు. అయితే, ఈ చట్టవిరుద్ధ గనులను వేలం ద్వారా తిరిగి కేటాయించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గనులను చట్టబద్ధం చేసే విధానాన్ని కనుగొన్నాయి.

6) “హింసకు పాల్పడకుండా, హింసాకాండకు ప్రజలను ప్రేరేపించకుండా కేవలం నిషేధిత సంస్థలో సభ్యతం కలిగి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి నేరస్తుడు కాజాలడు” అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిర్లక్ష్యం చేసిన కారణాలను ప్రశ్నించాను. ఎంతో మంది యువతీ యువకులు “నక్సలైట్ల సహాయకులు” అనే అనుమానంతో అరెస్టయి జైళ్లలో ఉన్నారు . వాళ్లను మొదట అరెస్టు చేసి, తర్వాత వాళ్ల మీద ఇంకొన్ని నేరాలని మోపుతారు. పోలీసులు ఎవరిని పట్టుకోవాలనుకున్నా వాళ్లకు  సులభంగా తగిలించే లేబుల్ అది. ఆ లేబుల్ తగిలించడానికి ఏ రుజువూ, సాక్ష్యమూ అవసరం లేదు. నిషేధిత సంస్థలో సభ్యత్వం ఉన్నా ఒక వ్యక్తి నేరస్థుడు కాదని సుప్రీం కోర్టు చెబుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన శక్తులకూ న్యాయవ్యవస్థకూ మధ్య ఎంత దూరముందో?

7) ఆ 2013 నాటి భూ సేకరణ చట్టానికి సవరణలు చేసి ఆదివాసీ సమాజానికి చావుగంట మోగిస్తున్న  జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించాను. పర్యావరణ సాంఘిక సంబంధాలనూ, ప్రభావిత ప్రజల సాంస్కృతిక విలువలనూ కాపాడేందుకు ఉద్దేశించిన “సోషియల్ ఇంపాక్ట్ అసెస్ మెంటు” అవసరాన్ని ఈ సవరణ పక్కన పెడుతుంది. అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే సారవంతమైన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించడాన్ని ప్రభుత్వం అనుమతించగలదు.

8) “ల్యాండ్ బ్యాంక్” అనేది ఆదివాసీ ప్రజల నిర్మూలనకు తాజాగా చేస్తున్న కుట్ర అని నేను నమ్ముతున్నాను. ఫిబ్రవరి 2017 లో ‘మొమెంటం జార్ఖండ్’ అనే అంశాన్ని ప్రతిపాదిస్తూ  21 లక్షల ఎకరాలను ‘ల్యాండ్ బ్యాంకు’లుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం., వీటిలో 10 లక్షల ఎకరాల భూమి పారిశ్రామికవేత్తల కేటాయింపు కోసం సిద్ధంగా ఉంది.

ఇప్పటి వరకు బీడు భూములు ప్రైవేట్ లేదా అందరికీ చెందిన భూమిగా ఉండేది. భూమి మీద తెగలోని ఒక్కో కుటుంబానికో, లేక తెగ అందరికో హక్కులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఆ పట్టాలన్నింటినీ రద్దు చేసీ, ఆ భూములన్నీ ప్రభుత్వానికి చెందినవిగా ప్రకటించింది.  ప్రభుత్వం ఇక చిన్నాపెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎవరికైనా (అంటే పారిశ్రామికవేత్తలకు) కేటాయించగలదు.

వాళ్ల భూములను బయటి వాళ్లకు ధారాదత్తం చేస్తున్నారన్న విషయం ప్రజలకు తెలీదు. భూమి మీద హక్కులు చేతులు మారడానికి TAC ఆమోదం ఇవ్వలేదు, PESA చట్టం ప్రకారం గ్రామ సభలు అంగీకారం తెలపలేదు, భూమి అమ్మకాల చట్టం ప్రకారం ఆదివాసీ ప్రజలు తమ సమ్మతిని తెలపలేదు.

ఇవీ నేను నిరంతరం లేవనెత్తిన ప్రశ్నలు. ఇలా ప్రశ్నించడమే ‘దేశ ద్రోహమైతే’, అలాగే కానివ్వండి!”

ఇండియా సివిల్ వాచ్

https://indiacivilwatch.org/

Committed to upholding the democratic rights of all peoples in India.

1 comment

  • స్టాన్ స్వామి గారి గురించి మంచి విశ్లేషణాత్మక వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదములు. చట్టాల ఉల్లంఘన నిరాటంకంగా పుణ్య భూమి వేదం భూమిలో .

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.