పొగమంచు

చలికాలం కావడం వలన ఆరు దాటి అరగంటైనా, ఇంకా సూర్యోదయం కాలేదు. గులాబీ రంగు కాంతి ఆకాశానికి అంటుకొని, సముద్రమూ ఆకాశమూ కలిసే చోటంతా పొగమంచుతో నిండి పోయి, ఆ మొత్తం దృశ్యం నీటిలో ప్రతిబింబించి, కళ్లెదురుగా ఉన్నది రోజూ చూసే భూమేనా? లేక  వేరే లోకమా? అన్నట్టుగా ఉంది. సమయం గడిచే కొలదీ ఆ గులాబీ రంగు ఎరుపు లోకి మారుతూ, పొగ మంచు పలచబడటం మొదలైంది. ఏడు గంటల సమయంలో, నీటి ఉపరితలం కంటే బాగా ఎత్తులో, పొగమంచు మధ్యలో నుండి సూర్యుడు కొద్దికొద్దిగా కనిపించసాగాడు. అప్పటి నుండి మొదలై మరో అరగంట సేపు సముద్రం నిమిషానికో కొత్త రంగు పులుముకుంటూ మెరిసిపోతూ ఉంది.

ఆ రంగు పలచబడ్డాక, ఎండకు శరీరం వేడెక్కాక, సముద్రంలోకి దూకి రెండు గంటలు ఈత కొట్టి బయటకు వచ్చేసరికి తొమ్మిది దాటింది. మెల్లిగా రోడ్డు వైపు నడుచుకుంటూ పోతుంటే, దూరంగా ఇద్దరు పోలీసులు బైక్ మీద బీచ్ వైపే వస్తూ కనిపించారు. సాధారణంగా పోలీసులు సాయంత్రం ఏడు దాటాక వచ్చి, బీచ్ లో ఉన్న వారిని బయటకు పంపించేయడం చాలా కామన్. కానీ ఇప్పుడు, పట్టపగలు ఎందుకు వస్తున్నారో అర్థం కాలేదు. తుఫాన్ హెచ్చరిక ఏమైనా ఉందేమో? న్యూస్ ఫాలో అవ్వకపోవడం వలన నాకు తెలియలేదా? అనుకున్నాను. కానీ ఆకాశంలో మబ్బులూ లేవు,  గాలిలో కదలికా లేదు, చలినంతా మింగేస్తూ ఎండ మాత్రం వెచ్చగా, ప్రకాశవంతంగా ఉంది. మరి పోలీసులు ఎందుకు వస్తున్నట్టు?

ఇంతలో పోలీసులు బైక్ ఆపారు. వెనక కూర్చున్న కానిస్టేబుల్ కిందకు దిగి, చెయ్యి పైకెత్తి ఎవర్నో పిలుస్తున్నాడు. అతని చెయ్యి ఉన్న వైపు చూసాను. పక్కనే నాలుగు స్థంబాల పైన రౌండ్ షేప్ లో కాంక్రీట్ రూఫ్ వేసి, కింద సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసి, అన్ని వైపులా ఓపెన్ వ్యూ ఉండేలా ఏర్పాటు చేసిన షెల్టర్ లో కూర్చున్న అమ్మాయి, అబ్బాయి కనిపించారు. ఆ అబ్బాయి కానిస్టేబుల్  దగ్గరకు వెళ్ళాడు. పోలీసులు ఇద్దరూ అతనితో ఏదో సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నారు. దూరంగా ఉండటం వలన వారి మాటలు వినిపించడం లేదు కానీ ఆ అబ్బాయి భయపడుతున్నాడని మాత్రం తెలుస్తూ ఉంది.

నడక వేగం పెంచి, వాళ్ళ దగ్గరకు వెళ్ళాను.  “మీ ఇంటికి ఫోన్ చేసి, మీ నాన్నగారి చేత మాట్లాడించు. అలాగే, ఆ అమ్మాయిని కూడా ఇలా రమ్మను” అంటున్నాడు బైక్ మీదే కూర్చున్న పోలీసు.

వాళ్ళ దగ్గరకు వెళ్లి “ఏమైంది? ప్రోబ్లం ఏమిటి?” అని అడిగాను.

దానికి ఆ పోలీస్ సమాధానం. “మిమ్మల్నెవరు పిలిచారు? మీకు సంబంధం ఏమిటి?  వెళ్లి పని చూసుకోండి.’

“మీరేదో సీరియస్ గా మాట్లాడుతున్నారు. అసలు సమస్య ఏమిటో తెలుసుకుందామని. చెప్పండి ప్రోబ్లం ఏమిటి?”

“మీరెవరు?”

“నేను పబ్లిక్. As a citizen, బయట నాకు ఏదైనా తేడాగా కనిపిస్తే అడిగే హక్కుంది”

“వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర పేరెంట్స్ కి తెలియకుండా, ఇక్కడ తిరుగుతున్నారు. అందుకే పేరెంట్స్ కి ఫోన్ చేయమంటున్నాం” అని నాతో చెప్పి, మళ్లీ ఆ అబ్బాయి వైపు తిరిగి, “ఇంటికి ఫోన్ చెయ్” అంటున్నాడు.

ఆ అబ్బాయి వైపు తిరిగి “నీ ఏజ్ ఎంత?” అని అడిగాను.

“ఇరవై రెండండి”

“ఆ అమ్మాయిది?”

“ఇద్దరం క్లాస్ మేట్స్. తన ఏజ్ కూడా ఇరవై రెండేనండి”

“నీకు పద్దెనిమిది ఏళ్ళు దాటి, మేజర్ అయ్యావంటే, దాని అర్థం ఏమిటి? You are an individual. ఎక్కడికి వెళ్తున్నావ్, ఎవరితో మాట్లాడుతున్నావ్ వంటి విషయాలు పేరెంట్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు.  Inform చేయొచ్చు. అది నీఇష్టం. కానీ పర్మిషనయితే అవసరం లేదు. సో.. ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమిటి?”

ఆ అబ్బాయి అవునన్నట్టు తలూపాడు.

అప్పుడు పోలీసు కలగజేసుకొని, “మేజర్లయితే అయి ఉండొచ్చు. కానీ, వీళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు”

“అమ్మాయి, అబ్బాయి కలిసి తిరగడానికో, కూర్చుని మాట్లాడుకోవడానికో పెళ్లయి ఉండాల్సిన అవసరం లేదు”

“అదంతా కాదండి. చుట్టూ ఎవరూ లేకుండా, ఇలా ఒక అమ్మాయీ, అబ్బాయీ మాత్రమే బీచ్ లో  తిరుగుతుంటే పట్టుకోమని SP గారి ఆర్డర్”

“అవునా? అయితే SP గారికి ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడి, ఆ రూల్ ఎప్పుడు పెట్టారో  తెలుసుకుంటాను”

“SP గారు అంత ఖాళీగా ఉంటారనుకున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడానికి?”

“ఓ పని చేయండి. నేను facebook LIVE రికార్డింగ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన ముక్కే మళ్లీ చెప్పండి. పెళ్లికాని అమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగితే పట్టుకోమని SP గారు  ఆర్డర్ వేసారు అని రిపీట్ చేస్తే చాలు. నేను ఇంకో ముక్క మాట్లాడకుండా, ఆ డైలాగ్ ఒక్కటీ రికార్డ్ చేసుకొని వెళ్ళిపోతాను. మీరు వీళ్ళిద్దరినీ ఏం చేసుకుంటారో కూడా నాకు అనవసరం”

“కలిసి తిరిగినా తప్పు కాకపోవచ్చు.  ఇక్కడ ఏం చేస్తారో మీకేం తెలుసు?

“మీక్కూడా తెలియదు కదా? వాళ్లిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అనవసర ఐడియాలు ఇవ్వకండి. అయినా ఈ షెల్టర్ అన్ని వైపులా ఓపెన్ గా ఉంది. పక్కనే రోడ్ ఉంది. ఏం చేసేస్తారు? ఒక వేళ నిజంగానే ఇద్దరు ప్రేమికులు కూర్చున్నా, చేతిలో చేయి వేసుకొని కూర్చొని మాట్లాడుకోవడమో, లేదా హగ్ చేసుకోవడమో, మహా అయితే ముద్దు పెట్టుకోవడమో చేస్తారు. అవేమీ నేరాలు కాదే. పబ్లిక్ న్యూడిటీ, పబ్లిక్ సెక్స్ మాత్రమే నేరం. ఇక మీకు ప్రాబ్లెమ్ ఏమిటి?”

“ప్రాబ్లెమ్ మాకు కాదండి. వాళ్ళకే. వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరైనా వచ్చి ఎటాక్ చేయొచ్చు. ఇంతకు ముందు ఇదే బీచ్ లో అబ్బాయిని కొట్టేసి, అమ్మాయిని రేప్ చేసి,  వంటి మీద ఉన్న బంగారం పట్టుకొని పోయారు”

“నిజంగా ఆ కారణం వలనే మీరు ఆపి ఉంటే, అదే చెప్పండి. జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ సేఫ్టీ వాళ్లకూ ముఖ్యమేగా? మీరా విషయం ఒక్కసారి కూడా ఎత్తనేలేదు”

“అలా చెబితే వీళ్ళకు అర్థం కాదండి. అందుకే పేరెంట్స్ కి కాల్ చేయమన్నాం.”

“అసలు విషయం చెప్పకుండా, భయపెడితే మిమ్మల్ని తప్పించుకొని, ఎవరికీ కనిపించనంత దూరం పోతారు. అప్పుడే నిజంగా ఎటాక్ జరగచ్చు. ఎప్పుడూ వెహికల్స్ వెళుతూ ఉండే రోడ్ నుండి క్లియర్ గా కనిపిస్తూ, ఇరవై అడుగుల దూరంలో ఉండే ఈ షెల్టర్ లో పట్టపగలు ఏదో జరిగే సీన్ అస్సలు లేదు. మీరు అనవసరంగా భయపెడితే, నెక్స్ట్ టైం వీళ్ళిద్దరూ ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి పోతారు. అప్పుడు ఏదో ఒక ఎటాక్ జరగొచ్చు. దానికి మాత్రం మీరే భాద్యులు. అందుకే సమస్యను స్పష్టంగా చెప్పండి. అవసరమైతే, ఇక్కడొక  బోర్డ్ పెట్టించండి”

“ఆల్రెడీ పెట్టించాం. అది పోయింది”

“మళ్లీ పెట్టించండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం కదా?” అని ఆ అబ్బాయి వైపు తిరిగి, “పోలీసులు మీ మంచి కోసమే చెబుతున్నారట. జనాలు ఎవరూ లేని ప్లేసుల్లో కూర్చోకండి. ఇప్పుడు మీరు వెళ్లిపోవచ్చు” అన్నాను.

వాళ్లిద్దరూ వెళ్లిపోయారు.

పోలీసు మళ్లీ మొదలు పెట్టాడు “వాళ్ళ కోసమే చెప్పినా,  వాళ్లకు అర్థం కాదు. పేరెంట్స్ కి చెప్పడమే కరెక్ట్ పని”

“మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఒక విషయం అర్థమైతే వారి బాధ్యత వారే తీసుకుంటారు. అర్థం కాకపోతే, నిరంతరం కాపలా కాయడం మీ పోలీసుల వల్లా కాదు. వాళ్ళ పేరెంట్స్ వల్లా కాదు. ఏదేమైనా రూల్స్ & అఫీషియల్ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయో, అలానే ఫాలో అవ్వాలి. ఒకొక్కరూ ఒక్కో పద్ధతి ఫాలో అయితే కన్ఫ్యూజన్ తప్ప, ఉపయోగం ఉండదు. పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయి కూర్చొని మాట్లాడుకోవడం తప్పు అన్నట్టు సాధారణ జనం బిహేవ్ చేయడం కంటే, పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న మీరు ప్రవర్తిస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతీ మాట రూల్ ప్రకారం ఉంటుందని జనాలు నమ్ముతారు. అది తప్పుడు సంకేతాల్ని ఇస్తాయి. దాని వలన ఏ పోలీసుల నుండైతే రక్షణ కోరుకుంటామో, ఆ పోలీసులంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. అది మరింత ప్రమాదకరం. తమ గురించి, లేనిపోనివి కల్పించి చెబుతాడేమో అని పక్కింటి అంకుల్కి భయపడితే ఒక అర్థం ఉంది.  ఎందుకంటే, ఆ అంకుల్ ‘law’ తెలియని సాధారణ మనిషి కాబట్టి. కానీ, ఎవరి నుండయితే రక్షణ ఆశిస్తామో ఆ పోలీసులంటే భయపడి, వారి నుండి తప్పించుకొని పోయి ప్రమాదంలో పడే పరిస్థితులు వస్తే మాత్రం అది వంద శాతం మీ తప్పే”

“రూల్స్ అన్నీ సరే సార్. ఇలా అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి తిరిగితే వాళ్ళ చదువులు పాడైపోతాయి”

“సరిగ్గా చదవని స్టూడెంట్స్ లో  ప్రేమ పేరుతో తిరిగేవారు ఉంటే ఉండొచ్చు. అంతమాత్రాన అమ్మాయి, అబ్బాయిల  స్నేహం వలనే మార్కులు రానట్టు కాదు. సరిగ్గా చూస్తే, మార్కులు రానివారిలో కూడా ఏ లవ్ స్టోరీలూ లేనివారూ ఉంటారు. అలాగే అమ్మాయి, అబ్బాయిల మధ్య ఆకర్షణలో ఉంటూనే, బాగా చదివేవారూ ఉంటారు. ఆ వయసులో వాళ్ళ లోపల హార్మోన్స్ పొంగు ఉన్నప్పుడు, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొనే అవకాశం ఉండటం వలన ఎమోషన్స్ అదుపులో ఉంటాయి.  అలా కాకుండా బలవంతంగా కంట్రోల్ చేస్తే మాత్రం ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్టు ఫీలవుతారు. ఆ ప్రెజర్ ని తప్పించుకొని పోయే సమయంలో బోలెడంత టైం వేస్ట్ చేసుకుంటారు. ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.”

పోలీసుల దగ్గర నిశ్శబ్దం మాత్రమే సమాధానంగా రావడంతో,  బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వచ్చేసాను.

కొంత దూరం వచ్చాక, రోడ్డు పక్కన ఆ అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకుంటూ కనిపించారు. వారి దగ్గర బైక్ ఆపాను.

“థాంక్స్ అండి” అన్నారు.

“థాంక్స్ దేనికి? నేను మీకు ఫేవర్ గా మాట్లాడలేదు. రూల్ ప్రకారం ఏం చేయాలో అదే చేయమన్నాను. అయినా ఎవరి సపోర్టో తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరే అడగొచ్చుగా?” 

“లేదండి. పేరెంట్స్కి ఫోన్ చేయమని బెదిరించి, చివరికి డబ్బులు తీసుకొని పంపించేస్తారు. పోలీస్ స్టేషన్ వరకూ వెళితే, మా స్టడీస్ కి ప్రాబ్లెమ్ అవుతుంది కదా? అని మేమూ మాట్లాడలేము”

“నేరం జరిగినట్టు అనుమానం ఉంటేనే అరెస్ట్ చేసే సీన్ ఉంటుంది. పెళ్లికాని అమ్మాయి, అబ్బాయి కలిసి తిరగడం నేరం కాదు. ఊరికే బెదిరిస్తారంతే. Next time ఇలాంటివి జరిగితే, మీకు రూల్స్ తెలుసన్న విషయం వారికి తెలిసేలా స్పష్టంగా మాట్లాడండి. మీ భయం మాత్రమే మోరల్ పోలీసింగ్ చేసేవాళ్ళ ధైర్యానికి పెట్టుబడి. మీరు భయపడకపోతే, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. పేరెంట్స్ కి తెలిస్తే మీరు భయపడతారన్న  కారణంగానే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. పేరెంట్స్ కి తెలిసినా పర్లేదు అన్నట్టే ఉండండి. కానీ, ఫోన్ చేయాల్సిన అవసరం లేదని, మీరు మేజర్లని ఖరాఖండిగా చెప్పేయండి. పోలీసు యూనిఫామ్ లో ఉన్నా కూడా వీళ్ళూ మనుషులే. సాధారణ జనాల్లో ఉండే మోరల్ పోలీసింగ్ నైజం వీరిలో కూడా ఉండొచ్చు. పోలీసులై ఉండి, రూల్ ప్రకారం పనిచేయకపోవడం నేరం అన్న విషయం మీకు తెలుసని వారికి తెలియజేయడం ముఖ్యం. ఇవన్నీ జరగాలి అంటే, అసలు చట్టం ఏం చెబుతుందో మీకు తెలిసి ఉండాలి. దాన్ని వారికి తెలియజేయాలి.  అయినా వినకపోవచ్చు, బెదిరించడానికి ట్రై చేసి, వాళ్ళ సొంత రూల్స్ చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు, వాళ్ళు మాత్రమే కనిపించేలా, వారి బెదిరింపులు, డబ్బులు అడగటం స్పష్టంగా వినిపించేలా, సీక్రెట్ గా వీడియో తీసి, మీ క్లోజ్ ఫ్రెండ్ కి వాట్సాప్ చేసి, మెల్లిగా ఆ విషయం పోలీసులకు చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఏం చేసినా, ఆ వీడియో మీడియాకి ఇస్తామని చెప్పండి. పోలీసులు వదిలేసినా కూడా ఆ వీడియో మీడియాకి ఇచ్చేయండి. కాస్త కంట్రోల్లో ఉంటారు.”

“ఈసారి జరిగితే మీరు చెప్పినట్టే చేస్తాం”

“జనాలు లేని ప్రదేశాలకు పోతే, నిజంగానే ఎటాక్ జరగొచ్చు. అందరూ సివిలైజ్డ్ పీపుల్ ఉండరు. జనం మధ్యలో ఉంటూనే, మీ రైట్స్ కోసం పొట్లాడండి. పార్కులోనో, బీచ్ లోనో నలుగురూ ఉండే ప్లేస్ లోనో కూర్చుంటే రూల్స్ & రేగ్యులేషన్స్ తెలీని ఈ మోరల్ పోలీసింగ్ చేసే జనాల వలన, యూనిఫామ్ వేసుకొని కూడా మోరల్ పోలీసింగ్ చేసే పోలీసుల వలనా ఇబ్బందులు వస్తున్నాయని, జనాలు లేని ప్రాంతాలకు వెళితే మాత్రం ఏదైనా ఎటాక్ జరగొచ్చు. అప్పుడు, ఏ మోరల్ పోలీసులైతే మిమ్మల్ని అటువైపు నెట్టారో, వాళ్లే కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తారు. ఇదో పిచ్చి ప్రపంచం”

“నిజమే”

“ఇంకో నిజం ఏమిటి అంటే, పద్దెనిమిది ఏళ్ళు దాటాక, మనకు నచ్చినట్టు బ్రతికే హక్కు ఎలా వస్తుందో, మన అవసరాలను మనమే సాధించుకోవాల్సిన బాధ్యత కూడా అలాగే వస్తుంది.  హక్కులు మాత్రమే కావాలి బాధ్యతలు వద్దు అంటే, ఇంటిలో నుండి తన్ని తరిమేసే హక్కు కూడా పేరెంట్స్ కి ఉంటుంది. బతకడానికి కావాల్సిన లైఫ్ స్కిల్స్ నేర్పడం మాత్రమే పేరెంట్స్ బాధ్యత. పిల్లల కోసం ఆస్తులు సంపాదించి పెట్టడం, జీవితాంతం సాకడం వాళ్ళ బాధ్యత కాదు.  నీ బాధ్యత నువ్వు ఎంత తీసుకుంటే, అంతే స్వేచ్ఛ నీ సొంతం. నీ పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవడం ఒక్కటే, స్వేచ్ఛగా బతకడానికి ఉన్న ఏకైక మార్గం”

ఈసారి వెంటనే సమాధానం రాలేదు. లోతైన ఆలోచనలో మునిగిపోయారని, వాళ్లిద్దరి చూపులూ చెబుతున్నాయి. బాయ్ చెప్పి, బైక్ స్టార్ట్ చేసుకొని వచ్చేసాను.  సూర్యకిరణాల తీవ్రత పెరిగే కొలదీ మంచు కరిగి దారి కనిపించినట్టే, సత్యశోధన యొక్క తీవ్రత పెరిగే కొలదీ ఊహాలూ, అపోహలూ తొలిగిపోతాయి

రాంబాబు తోట

5 comments

  • బావుంది. టైటిల్ కి తగ్గట్టుంది. ఓ మాదిరి దిశా నిర్దేశం గా కూడా ఉంది.

  • # బాధ్యతగా ఉండటం అంటే(responsibility అంటే)ఏమిటో నేటి తరానికి చాలా మందికి తెలియదు..

    #హక్కు right అంటే ఏమిటో మాత్రం అందరికి తెలుసు.కేవలం హక్కుల కోసం మాత్రమే ప్రశ్నిస్తూ బాధ్యత ఎరగని వ్యక్తులకు కుటుంబంలోనైనా,సంఘంలోనైనా విలువ తక్కువగానే ఉంటుంది.శక్తి తక్కువగానే ఉంటుంది,శక్తి వల్లనే స్వేచ్ఛ కూడా ఉంటుంది.
    ఆ శక్తి #బాధ్యత నుండి మాత్రమే వస్తుంది…

  • Wonderful article man. Loved it. Poetic and philosophical musings added great beauty to your write up. It’s as fresh and pleasant as a beautiful morning. Keep writing man. ❤️

  • చాలా బాగా రాసావు.స్వేచ్ఛ గురించి నువ్వు ఎంత చెప్పినా వినాలనిపిస్తుంటుంది 🙂

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.