మరణం అతని చివరి శ్వాస కాదు

తెలంగాణా రాష్ట్రం 12.02.2015 జగిత్యాల అంగడి బజార్లో అంతా కోలాహలం గా ఉంది . అది రాజకీయ సభకాదు, అక్కడకి వచ్చేది ఓట్లు కొనుక్కున నేతలూ కాదు, మరి ఎవరికోసం ఆ జన సందోహం అంటే ఒక కవి కోసం. అభిమానులు ఎంతో ప్రేమగా , అజరామరమైన అక్షర యోధుడికి కానుకగా, ఆయనకి గుర్తుగా స్థాపించుకున్న ఆయన విగ్రహం ఆవిష్కరణ  ఆ రోజు. ఆ కవి “అలిసెట్టి ప్రభాకర్ “. నూతన కాలపు జన బాహుళ్య కవిత్వ సిద్దాంత కర్త.

ఎప్పుడో ప్రాచీన కవులకి, ఆ తరవాత  కవిత్వాన్ని భూమార్గం పట్టించిన శ్రీ శ్రీ కీ, కొంచం ముందుగా దళిత వాదాన్ని హైందవ నాగరాజు మెడలమీద నాట్యం చేయించిన జాషువా లాంటి కవులకి తప్పా ఎవరికీ దక్కని ఈ అపురూప గౌరవం అలిసెట్టి కి మాత్రమే ఎందుకు దక్కింది? బహుశా ఆకలిని కాగితం మీద అజరామరం చేసినందుకు కావచ్చు, లేదా నెత్తుటిలో ముంచిన కుంచెతో  సమాజం కాన్వాసు మీద సామాన్యుడి బాధని గీసినందుకు కావొచ్చు, ఏది ఏమైనా కవి కాబట్టే ఈ రోజున జనం నాలుకలమీద అతని పదాలు తేలియాడుతున్నాయి, కవిత్వం ఏమి చేస్తుంది అనే వారికి చూపదగిన ఒక బలమైన కవితా విగ్రహం అలిసెట్టి ప్రభాకర్.

ముందుగా అతనిది కుంచె. కలం కాదు. మెదడు మూలల మడతల్లోంచి అతను తన చిత్రాలను వెలికి తెచ్చేవాడు చాలా కాలం గీస్తూ పోయాక, వాటికి చిన్న చిన్న క్యాప్షన్ల లాగా ‘ద్విపదలని’ రాసేవాడు . అలా అలా కుంచెకి అక్షరమూ తోడైంది. చిన్నగా సాహితి స్నేహం  దొరికింది. కవుల కవిత్వాలకి బొమ్మల్ని గీసి వాటికి సార్ధకత ఇచ్చేవాడు. ఈ సమయంలో “సాహితీ మిత్ర దీప్తి” అనే సంస్థ తో కలిసి చాలా కాలం ఉన్నారు. కలం ఒక్కటిగా ఉంటేనే ఖడ్గం కన్నా గొప్పది దానికి కుంచె కూడా తోడైతే అణిచి పెట్టబడి ఉన్న భావజాలం అంతా ఒక్కసారిగా బయటకి విరజిమ్మితే, ఆ పరిమళాలు ఎవరు మాత్రం కావాలనుకోరు. అలా అనుకుంటూ సాగుతున్న తరుణంలోనే అతను తన అక్షరాలకు మెరుగుపెట్టుకున్నాడు .

ఒక వాక్యాన్ని చదవగానే ఫెళ్ళున ఒక చెంపదెబ్బ తాకి వెళ్లిపోతుంది. తేరుకునే లోపే మరో వాక్యం వచ్చి మరిక లేవనివ్వదు. కవిత్వమా పెద్ద పెద్ద లైన్లు ఉండవు, దీర్ఘ నిట్టూర్పులు, చిరకాల సిమిలీ లు, మెరుపులు, మరకలు లాంటివి ఉండవు . వాదాలు, పిడివాదాలు ఉండవు. ఒక సామూహిక వేదన అక్షరాల్లో పరుచుకుని ఉంటుంది .

వర్తమానం అనే కవితలో ఇలా అంటాడు

దాదాపు నగ్నంగా ఉన్న
వృక్ష ప్రపంచం లోకి
చిక్కిన ఆకుల శరీరాల్లోంచి
నరాల ఈనెలు
కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి
ఇది
ప్రకృతి శిశిరం కాదు
సమాజ శిధిలం చూడు
అవి ఈనెలు కావు ఈటెలు నేడు“. ఎంతటి అద్భుతమైన  భావ వ్యక్తీకరణో . అసలు చెట్టు ని నుంచి ఆయుధాలు తీయమనడం ఏ శివసాగరుడో  అలిసెట్టిలాంటి వాళ్లో తప్పా ఇలాంటి వ్యక్తీకరణ చెయలేరేమో అనిపిస్తుంది. అలాంటి అనేకానేక మైనవి రాశాడు. “నా చూపులు శూన్యం అరణ్యంలో చిక్కుకున్నాయి /నా అజ్ఞాత హస్తాలు ఏదో రూపాన్ని చెక్కుతున్నాయి  /వేళ్ళు రక్కుకు పోతున్నాయి/ , క్రిక్కిరిసిన జనం తొక్కిడిలో /చిక్కిన చిన్న పిల్లాడిలా హృదయం బావురు మంటుంది” అంటాడు ఒక చోట. ఎంతగా హృదయం ద్రవిస్తేనో కదా ఓ కవి అంత మాట రాయగలడు. అతనికి తెలిసింది ఒక్కటే అతని కెదురుగా కనబడిన ప్రతీ వేదనాత్మక దృశ్యాన్ని కవిత్వం చేయాలి అని. కాబ ట్టే ప్రజా కవి అయ్యాడు, ప్రజలు కూడా అలిసెట్టి అంటే అంతే గౌరవం చూపించారు, నిజంగా జాషువా అ న్నట్టు జనం నాలుకలమీద నడయాడిన కవి అని చెప్పొచ్చు. కాబట్టే అతను అక్షరానికి ఒక బలమైన నిర్వచనం గా ఒక కవిత రాసుకున్నాడు తన “జ్వలించే అక్షరం ” అనే కవితలో “అక్షరం / కపాలం కంతల్లోచి వెలికి వచ్చే / క్షుద్ర సాహిత్యపు కీటకమూ కాదు / సౌందర్యం చర్మ రంధ్రాల్లో తలదూర్చే ఉష్ట్ర పక్షీ కాదు” అని మొదలు పెట్టి “అక్షరం  కాలం చేతిలో ఎదిగి చరిత్ర భుజస్కందాలకందివచ్చే ఆయుధం అన్నాడు”. నాలుగు ముక్కలు రాయగానే స్టార్ స్టేటస్ వచ్చేసిందని భావించే రచయితలకు, సౌందర్యాన్ని ఆరాధిస్తూ అందానికి దాసోహం అనే మరి కొంతమంది రచయితలకి, రచన పేరుతో వాళ్ల మెదళ్లలో కూరుకుపోయిన ఒక భావ దారిద్ర్యాన్ని జనం మీద కి వదిలే కుహానా రచయితులందరూ చదవవల్సిన పద్యం ఇది. బహుశా ఇంతటి వేడి పీల్లలకు అవసరం అనిపించైందేమొ కొన్ని విశ్వవిద్యాలయాలు ఈతని కవితల్ని పిల్లలకి పాఠాలుగా ఎక్కించాయి , కొంతమైందైనా ఈ కవితా సూర్యుని కిరణాలు పడి చందమామలుగా మారితే సాహిత్యానికి అంతకన్నా ఒనగూరే ప్రయోజనం మరొకటి ఉండదు .

1974 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలొ మొట్టమొదటి కవిత “పరిష్కారం ” అచ్చయింది. ఆ తరవాత వెను తిరిగి చూడలేదు . తన అక్షరాల్లో లోపలి దారంలా ఆకలి ఉన్నా అన్ని అంశాల మీదా అతను స్పందించాడు  ఆకలి మీద మాత్రం ఇలా అంటాడు.

ఆకలి
నగరాల్లో /
అత్యధికంగా /
అత్యద్భుతంగా /
అస్తిపంజరాల్ని /
చెక్కే ఉలి ఆకలి అంటాడు.

అనుభవించినవాడికి తప్ప ఇంకెవరికి అర్ధం కానంత బావుంటుంది కదా, అదే ఇతని వాక్యం. మరో చోట ఆకలి గురించే “ఆకలి మండి పోతున్నప్పుడు / ఎదుట ఎంతటి మనొహర ద్రుశ్యం  ఉన్నా దగ్దమై పోవాల్సిందే ……………… ఆకలి/ పూటకో దరిద్రుణ్ణి వేపుకుతిని అది ఉమ్మేసే తొక్కలే / అసంఖ్యాకపు అస్తిపంజరాలు. అతని కార్చిచ్చు ఆకలి, అతని అక్షరం ఆకలి, అతని బాధ ఆకలి, అతని వేదన ఆకలి.

అలాగే మరోకవితలో దారిద్ర్యం గురించి రాస్తూ“దొంగిలించబడితే నోటి కాడికూడు ఆకలి దారిద్ర్యమే అజ్ఞాత హంతకుడు”

అతను చాలా నికచ్చి మనిషి, ఎలా ఉండాలి అనుకున్నాడో అలాగే ఉన్నాడు, పై పై ఆడంబారాలని   అసలు లెక్కలోకి తీసుకోలేదు. మనిషిని బతికితే ఆ పూటకి అయిదు వేళ్లు లోపలికి పోతే చాలు అనుకున్నాడు, కాబట్తే తన చేతిలో అంత కళ ఉన్నా ఎవరిని ఏనాడు చేయిచాచలేదు. తన కాన్వాసులకి లక్షలు ఇస్తా అన్నా తనలోని జీవ కళని అమ్ముకోలేదు, చాలా మందికి ఇది పిచ్చితనంలా అనిపించ వచ్చు కాని అది అతని వ్యక్తిత్వం, నిరంతరం తనలా బతికితే తప్పా తన జీవితం పరిపూర్ణం కాదని నమ్మిన వాడు, అందుకే తన మాటల నిండా బొమ్మల నిండా దాన్నే గీసి రాసి చూపిన వాడు అందుకే ‘పెయింటింగ్’ అనే పోయంలో ఇలా చెబుతాడు ” నీ లైఫ్ ని / బ్యూటిఫుల్   పెయింటింగా మార్చుకోవడానికి / అట్రాక్టివ్ కలర్ రెడ్ కొరకు /రక్తం మాత్రం/ ఎవరిది ఉపయొగించకు . ఇదే కదా ఎన్నాళ్లుగానో ఎన్నేళ్ళుగానో అనేకానేక మంది “సామ్యవాదం రావాలని , అందరికీ సమాన హక్కులు రావాలని కల గంటున్నది దాన్నే ఇలా అక్షరాలలొ ఇమిడ్చి చెప్పడం  ఇతనికే మాత్రమే వీలైంది. అభ్యుదయం పేరుతో పుంఖాను పుంఖాలు గా రాస్తూ ఉన్న కవుల మధ్య ఇతను నిజంగా తన స్వంత నూనెతోనే వెలిగిన దీపం అని చెప్పొచ్చు.

పిల్లల  చదువుల మీద ఆనాడే “ఈతరం క్రీస్తు” అనే కవిత రాసాడు, “పుస్తకాలకి శిలువేసి సంవత్సరాల మేకులు దిగేసి వొదిలేస్తే ఈ విద్యా వ్యవస్తలో ఇంకెందరు క్రీస్తులో” అంటాడు. ఏది వాస్తవం కాదు అనలేని తనం మనకి కనిపిస్తుంది  అందుకే అలిసెట్టి అంటే ఒక జంఝామారుతం. “ప్రతీ మనిషి ముఖమూ పఠనీయ గ్రంధమే’ అన్నాడు  అలా అంటూనే ‘మరి నీ బతుకు పేజీలని తిరగెసేదెవరో “అంటూ మనకి ఎప్పటికి సాల్వ్ కాని ప్రశ్నని సుతారంగా మన మెదళ్లలో నాటి పోతాడు, కవిత్వం అంతకు మించిన పని మాత్రం ఏం చేయాలి. అది కవిత్వానికి ప్రాధమిక లక్షణం కూడా, సమాజ శ్రేయస్సు కోసం రాయబడనిది కవిత్వం కాబోదని కూడా ఎంతమంది చెప్పినా మళ్ళీ మళ్ళీ చెపాలనిపించే సత్యం. కాబట్తే నా కవిత అనే కవితలో తన కవితా స్వరూప స్వభావాలని ఇలా చెప్పుకున్నాడు “నా గుప్పిట్లో మండుతున్న ఎన్నో గుండెలు / ఒక్కో దాన్లో  దూరి / వాటిని చీరి / రక్తాశ్రువులు ఏరి పరిశీలిస్తాను నేను ” అన్నారు. ఎంతమంది కవులకి ఇంత స్పష్టత ఉంటుంది. ఏదో నాలుగు పదాలు తెల్సినంత మాత్రాన, నాలుగు పీహెడీలు చేసినంత మాత్రాన, రోజూ బోధించినంత మాత్రాన కవిత్వం వంట బట్టదు, కవిత్వం కాలానికి దారి చూపే కాగడా లాంటిది, అది ఎప్పటికి అసమర్ధుల చేతిలో బగ బగ మండదు. ఒకవేళ మండించాలని చూసినా ఒక్కసారి భగ్గున వెలిగి ఆరిపోతుంది. మరలా మండించే  అవకాశం ఇవ్వదు గాక ఇవ్వదు. అలిసెట్టి దీపధారి ఒక తరం కవిత్వాన్ని తనతోపాటు తిప్పుకున్నవాడు .

సాహిత్య సభల్లో ఫోటొలు తీసే ఒకానొక సన్నని వ్యక్తి, తీక్షణమైన చూపులతో ఉన్న ఓ వ్యక్తి…  బహుశా కొంత మందికి అతను గుర్తుండి ఉండవచ్చు. అతను సామాన్యుడు కాదని అక్కడున్న అందరికీ తెలుసు , అవును అతను సముద్రం అంటే తెలియని భాగ్యనగరానికి కవితా సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు , కోకొల్లలుగా సాహిత్య కారులతో పరిచయం ఉన్నవాడు . అతను మరణించిన రోజున అతను నివాసం ఉంటున్న వాడ వాడంతా జనమై ప్రవహించింది . బహుశా ఆ వాడలో కూడా అంతకుముందు ఆ తరవాత అంత జన ప్రవాహం ఉండి ఉండదు . 1975 లో తన స్తూడియోని  జగిత్యాలలో ప్రారంభించారు దాని పేరు “పూర్ణిమ”. కలర్ ఫొటో లు ఇంకా అందుబాటులోకి రాని కాలంలో ప్రభాకర్ స్టూడియో అతని పని తెరు వలన బాగా ప్రసిద్ది పొందింది . అతని స్నేహం , అతని మాట తీరు నచ్చి చాలామంది పని లేకపోయినా అక్కడే ఉంటూ ఉండేవారు . అతనో మిత్ర సముద్రుడు కూడా.

ఎందుకు ఇంత క్రేజ్ అతనంటే, ఏం రాశాడని అలిసెట్టి గురించి మాట్లాడుకోవాలి, ఒక పక్కన శ్రీ శ్రీ ప్రభావం తో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న వచన కవిత్వాన్ని దాటుకుని ఏదైన మరొ కొత్త  ప్రక్రియ రాగలదా వచ్చినా ఆ ఉద్రుతి ముందు ఆగ గలదా అనే ప్రశ్నలకి ఒకే ఒక సమాధానం తన రాతల ద్వారా ఇచ్చాడు

దశ అనే కవితలో ఒక ఆకు రౌడీ మంత్రి అయ్యే దశని చాలా ఘాటుగా రాస్తాడు బ్లేడు / చాకు/ గండ్ర గొడ్డలి అనే సామాన్య పదాలు జనాలని ఎలా లొంగదీసుకుంటున్నాయో రాశాడు. మనం బతికున్నాం అని అనుకుంటాం కాని చచ్చిపొయాం అని మేధావులు అనే మాటని నిజంగా ఒక కవితలో ఇలా రాశాడు “వెండి తెరమీద నువ్వు వ్యభచరిస్తున్నప్పుడో / క్రికెట్ క్రిమి నీ మెదడుని తొలిచేస్తున్నప్పుడో/ బురద రాజకీయం నీ ముఖం నిండా పులుముకున్నప్పుడో …తప్ప లేనే లేదిక  నువ్ బతికున్న దాఖలా” అంటాడు. మనిషిని నిలువెల్లా దహించే మాట కదూ ఇది. ఈ మాయా ప్రపంచంలో నుంచి బయటకి రమ్మని అతను వేసిన కేక మామూలుది కాదు, నిజానికి ఇంతటి అక్షర మంత్రజాలికుణ్ణి సిని ప్రపంచం వాసన పట్టకుండా  ఉంటుందా, పసిగట్టి పిలిచింది, మాయ తెరని అతని కళ్ళముందూ పరిచింది. ఒక రోజున రోడ్ మీద తన చిత్ర పఠాన్ని తానే మొసుకుని వెళుతుంటే దాన్ని చూసి ముచ్చట పడిన ఒక సిని ప్రముఖుడికి పెద్ద మొత్త ఇస్తానన్నా సరే తన కళని అమ్ముకోని నిప్పు కణిక ఇతగాడు. సిని వ్యామొహం మీద ఒక చోట ఇలా అంటాడు “ప్రతీ సినిమా / నెత్తుటిలో తడిసి / వెండి తెరలన్నీ / ఎర్ర జండాలైతే/ విప్లవాలన్నీ /వినొద భరితాలే అన్నాడు , అతనికి ఈ రంగుల ప్రపంచం మీద ఏనాడు వ్యామోహం లేదు, కాబట్టే సినిమా సమాజాన్ని మార్చే ఆయుధం కాదు అన్నాడు అలిసెట్టి. చాలా చిన్న పదాలు, చాలా చిన్న వాక్యాలు. కాని వాటిలో భావం మాత్రం భాస్వరం. బాగా తుపాకి మందు దట్తించి పేల్చిన ఒక తూటా చేసే విద్వంసం కన్నా  ఆ మాట చేసే కకావికలం ఎక్కువ అందుకే యావత్ తెలుగునాడు సాహో అంది , ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ దినపత్రిక తన సిటీ టాబ్లాయిడిలో “సిటీ లైఫ్ ” పేరుతో ఒక కాలం రాయడానికి ఈ చిత్రకారుడైన కవికి చోటుని కల్పించింది .

ఒక రోజున రోడ్డు మీద వెళుతుంటే తాను చూసిన దృశ్యాన్ని చూసి తట్టుకోలేక్ ఆశువుగా  ఒక కవితా వచనాన్ని అప్పటికప్పుడు రాశారు, అది ఇప్పటికి ఎవరూ చెరపలేని, ఎన్నటికి చెరిగిపోని ఒక ముద్రని సాహితీ లోకంపై వేసింది అది

తను శవమై
ఒకరికి వరమై
తనువు పుండై
మరొకరికి పండై
ఎప్పుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై
బహుశా మహా కవి పద్యాల కన్న ఎక్కువగా జనాల నోళ్లలో నాట్యం చేసిన  కవితా వాక్యాలివి నాలుగు లైన్లలో ఒక జీవితాన్ని చెప్పడమనేది అతి తక్కువమందికి సాధ్యం అయ్యే విషయం , అప్పటికప్పుడు చెప్పడం, అందులో ఆలంకారిక వ్యవహారాలున్నాయా, ప్రాసలున్నాయా అని కూడా చూడడు. తాను రాయల్సిన వచనం గుండెల్లో మండుతున్నపుడు  అతను చూసింది కేవలం జనం గుండెల్లో బాధని , రాసింది వాస్తవాన్ని .

దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం  ఒక పక్క తన హోరుగా వీస్తున్న సమయంలో ఇలా బహుజన గొంతుకని వినిపించిన గొంతు అలిసెట్టిది. ఆకలికి వ్యసనాలకి కులాలుండవు అని చెప్పేవాడు. ‘మొదలు భలే కలిగించి ఎంజాయ్/ ఆ పిదప కొంప ముంచేదే గంజాయి” ఇలాంటి వ్యసనాలు  ఎంతోమంది జీవితాలని నాశనం చేశాయి. వాటికి తన, మన బేధం ఉండదు. అలాంటి వాటిమీద తన తిరుగుబాటు జండాని ఎగరేశాడు. అంతమంది మిత్రులతో సావాసం చేశాడు .మిత్రులు అతనితో అలాగే ఉన్నారు. ఒక మిత్రుడు పిల్లలు ఇద్దరికి చదువు చెప్పించాడు. మరో మిత్రుడు క్షీణిస్తున్న అతని ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అహరహరం శమ్రించాడు . అతడిని మెరుగైన వైద్యం కోసం జగిత్యాలకి తరలించారు. అతను చివరి నిముషం వరకు కూడా నిటారుగా నిలబడ్డాడు. ఆఖరి  మాటగా తనకు తెలిసిన విద్య అయిన కవిత్వం లో కొన్ని మాటలు రాసుకున్నాడు.

గుండెనిండా బాధ , కళ్లనిండా నీళ్ళున్నప్పుడు
మాట పెగలదు కొంత సమయం కావాలి …….

అంటూ… తన జీవిత గమనాన్ని ఆ కవితలో తన వేదనా భరిత జీవితం మొత్తాన్ని అక్షరీకరించాడు.  కవితను ఇలా ముగిస్తాడు “చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు / సంసారం బరువెంతో సమీక్షించగలిగినవాణ్ని / పగలూ రాత్రి యాస్బెస్టాస్ సిమెంట్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా / మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి / నరకప్రాయమైన నగర నాగరికతను నర నరాన జీర్ణించుకునవాణ్ణి /రోజుకో రెండు కవితా వాక్యాలు రాయలేనా ” అంటూ ముక్తాయిపు ఇస్తాడు. ఒక రూపాయి బిళ్ళ ఉంటే చూపుడు వేలుపై నిలిపి విష్ణు చక్రంలా  తిప్పుతా అన్న వాడు డబ్బుని ఏనాడు లెక్క చేయని వాడు. ఒక నిజమైన సామ్యవాది ఎలా బతకాలో చూపినవాడు. అతని వ్యాది అతణ్ని బలికోరుతుందనీ తెలుసు. తాను నిలువెల్ల కాలుతున్న దీపశిఖననీ తెలుసు. దహించుకుపోవడం తన అవసరమని కూడా తెలిసిన వాడు ఇతడు. ఇతనంటే ఒక ” చిత్రాలయ స్టూడియో ” అతనంటే మిత్రులకి ఒక సమావేసపు ఆసరా జనవరి 12 1993 నాడు ఆఖరి పుట్టినరోజుని కేకుని చూసి మురిసిపోయి అలా అలా నిప్పులు చిమ్ముకుంటూ నెత్తురు కక్కుకుంటూ లోపల జబ్బు ప్రాణాణ్ని నలిపి నలిపి తీసుకెళ్ళి పోయింది. తన తొలి ఊపిరి తీసిన రోజునే తన ఆఖరి శ్వాసనూ విడిచాడు. బహుశా తనకి తెలుసనుకుంటా  అందుకే మరణం నా ఆఖరి శ్వాశ కాదన్నాడు . అతను అజరామరుడు. ఇప్పటికీ అతను పుస్తకం తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక హాట్ కేకు. కాస్తంతం కవిత్వం తెలిసిన పెద్ద మనుషులు, సిని పెద్దలు కూడా అడిగి మరీ తెప్పించుకు చదివే పుస్తకం. మరో కొన్ని రోజులకి అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా కూడా మిగలొచ్చు. అతని మరణాన్ని ఆ చివరి సన్నివేశాన్ని చూసిన కవి ఆశారాజు కవి ఇలా కవిత్వాన్ని రాశారు ఇది ఖచ్చితంగా చదివి తీరాల్సిన కవిత

కవి మరణించాకే

అంతమంది చేరిన గుంపులో
ఎవ్వరూ మాట్లాడ్డం లేదు
అంతటి గంభీర నిశ్శబ్దమ్లో
అందరితో, శవమొక్కటే బతుకుని గురించి మాట్లాడుతుంది
తల దగ్గర వెలుగుతున్న దీపమొక్కటే మాట్లాడుతుంది
బహుశా, మరణించిం తర్వాతే
కవి బతకడం మొదలుపెడతాడనుకుంటాను

 

 

 

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

13 comments

 • మిత్రమా.. అలిశెట్టిని అద్భుతంగా చిత్రించావు.. రుణం తీర్చుకున్నావు..

  • మీరు ఇచ్చిన ప్రోత్సాహమే సార్ నాకు చదవడానికి పుస్తకాలు పంపారు చాలావిషయాలు పంచుకున్నారు ఇందులో సింహ భాగం మీదే

 • అలిశెట్టి కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది… అలతి పదాలతోనే తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ధీశాలి అలిశెట్టి..కుంచెకు కలం తోడైతే ఇక ఆ పదచిత్రాలు పవర్ఫుల్ మెరపులై, ఊహాలకనైనా అందని ఉరుములై ప్రతి ఒక్కరి గుండెల్లో గర్జన చేస్తాయి…మరణం తరుముతుందని తెలిసీ పరపతి కోసం, కాసుల కోసం ఏనాడూ తన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అమ్ముకోని సిసలైన మనీషి అలిశెట్టి….
  నిజమే మరణం అతని చివరి చరణం కాదు…ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినవాడికి మరణం ఒక లెక్కా….
  అనిల్ గారు అలిశెట్టి కవితను పరిచయం చేసిన తీరుకు అభినందనలు మీకు..

 • చాలా బాగా రాశావు అనిల్. ప్రభాకర్ సెగ తగిలింది. కవిత్వ పంక్తుల ఎంపిక, వాటి ప్రయోజనాత్మక విశ్లేషణ వ్యాసానికి సొబగు చేకూర్చింది.

  అయితే, అప్పుతచ్చులు గుచ్చుకుంటున్నాయి మిత్రమా. సరిచూసుకోగలవు.

 • అలిశెట్టి ప్రభాకర్ గురించి మంచి వ్యాసం మిత్రమా

 • అతను అక్షరానికి ఒక బలమైన నిర్వచనం గా ఒక కవిత రాసుకున్నాడు తన “జ్వలించే అక్షరం ” అనే కవితలో “అక్షరం / కపాలం కంతల్లోచి వెలికి వచ్చే / క్షుద్ర సాహిత్యపు కీటకమూ కాదు / సౌందర్యం చర్మ రంధ్రాల్లో తలదూర్చే ఉష్ట్ర పక్షీ కాదు” అని మొదలు పెట్టి “అక్షరం  కాలం చేతిలో ఎదిగి చరిత్ర భుజస్కందాలకందివచ్చే ఆయుధం అన్నాడు”. నాలుగు ముక్కలు రాయగానే స్టార్ స్టేటస్ వచ్చేసిందని భావించే రచయితలకు, సౌందర్యాన్ని ఆరాధిస్తూ అందానికి దాసోహం అనే మరి కొంతమంది రచయితలకి, రచన పేరుతో వాళ్ల మెదళ్లలో కూరుకుపోయిన ఒక భావ దారిద్ర్యాన్ని జనం మీద కి వదిలే కుహానా రచయితులందరూ చదవవల్సిన పద్యం ఇది. 

  ఆకలి గురించి ఎరిగిన ఇలాంటి వారి కవిత్వం నుండి మేము చాలా నేర్చుకోవాలని తెలుసు.
  కానీ,
  మేమే సూపర్ స్టార్లం అని బాలయ్యబాబు అన్నట్టు మా మేకపోతు గాంభీర్యం మాత్రం మానం.

  superb essay anna

 • కవి లోకం నిర్లక్ష్యం చేసిన కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ కూడా ఒకరిని చెప్పాలి. పిడుగులకంటే శక్తివంతమైన అతని కవిత్వానికి రావాలిసినంత కీర్తి ప్రతిష్టలు రాలేదనే చెప్పచు. తెలంగాణ కవితా ప్రపంచంలో ఇద్దరు
  సూర్యుళ్లు జన్మించారు. ఒకరు చెరబండ రాజైతే ఇంకొకరు అలిశెట్టి ప్రభాకర్. వీరిద్దరి కవిత్వం చదివితే చాలు అసలు కవిత్వం ఎలా వ్రాయకూడదో తెలుస్తుంది. అలిశెట్టి ప్రభాకర్ చనిపోయి 20 సంవత్సరాలదాకా ఏ సాహిత్య సంస్థ ఆయనను పట్టించుకున్న దాఖలా లేదు 2013 నుండి కాస్త పట్టించుకోవడం మొదలైంది.ఆనిల్ డానీ పరిచయం బావుంది కానీ 1978 జగిత్యాల జైత్రయాత్ర ప్రస్తావన ఉంటే బావుండేది అలిశెట్టి కవిత్వానికి పునాది జగిత్యాలలో పడింది.

  • మీ సూచన బాగుంది సార్ , జగిత్యాల తరవాత ఆటను విశ్వ కవిగా ఎలా ఎదిగాడు అని చెప్పాలనుకున్నాను , విపులంగా రాయడానికి మిత్రుల పుస్తకంలో చాలా విషయం ఉంది , పాఠకులు అది కొని చదవగలితే బాగుంటుందని నా అభిప్రాయం

 • అలిశెట్టి ప్రభాకర్ గురించి ఎంతమంది ఎన్ని రాసినా అతడి నాలుగు లైన్ల కవితకు సరికాలేవు.
  అంత గొప్ప వ్యక్తిత్వం అంత గొప్ప కవిత్వం.

  అయినా చాలా బాగా రాశావు డానీ. భవిష్యత్తులో నువ్వు రాసే నాలుగు మాటలు కోసం నీ వైపు చాలా మంది చూస్తారు. ఇది నిన్ను పొగడడం కాదు. సాహిత్యం పట్ల నీ కమిట్మెంట్ ని గుర్తు చేసుకోవడం.

 • నిట్టూర్చిన ఆకాశం ఏకాకితనంలోంచి.. ఎప్పుడో ఒకప్పుడు పొద్దు పొడుస్తుంది.. అది సుడులు తిరిగిన అనుభవాల్లోంచి ఊహల్ని పాలకరించినప్పుడల్లా.. ఒక మౌన సంఘర్షణ లోలోపట రాజుకుంటుంది.అలా ఆవేశంతో మొలకెత్తిన నిప్పుకణిక ముఖచిత్రమే.. అలిశెట్టి ప్రభాకర్.కవిత్వాన్ని లోచూపుతో పెనవేసుకొని.. హృదయాన్వేషణ చేస్తున్న స్ఫురద్రుపి కలం ఆనవాళ్ళే..కాలంగుండెపై విచ్చుకున్న ఈ కవితా పుష్పం.. నిజానికది ఒక జ్వలితనేత్రమే.. కళ్ళు తెరిచి మూసేలోపే.. ఒక మహా విస్ఫోటనం జరిగిపోతుంది.. ఆరా తీస్తే.. అడుగడుగునా ఒక యుద్ధ ప్రవాహమే.. బతుకు గుండెచప్పుడు వినబడుతుంది.. పొరలు పొరలుగా.. అతని కలం ఆనవాళ్ళను కదిపితే.. బహుశా ఈ కవికి బాహ్యనేత్రమే కాదు.. అంతరనేత్రం కూడా అక్షరాల ఉలికిపాటే.. అందుకే సమాజాన్ని స్థూలదృష్టితో అంచనా వెయ్యగలిగాడు…ఏదైతేనేం.. విమర్శకుడు కూడా కవివర్యుడే.. అందుకనే అలిశెట్టి అడుగు.. భావితరానికి వరం.. ఈ నిశ్శబ్దాన్ని ఇప్పుడే బద్ధలు కొట్టాల్సిందే.. డానీ.. రెడీ ఫర్ గో..!

 • అలిశెట్టి కవిత్వం ఎన్నో సార్లు చదివాను. అసలు కవిత్వం రాయాలన్న ఆలోచన వచ్చిందే అలిశెట్టి కవిత్వం చదివిన తర్వాత..!
  చక్కని వ్యాసం… అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.