ఒక ప్యాక్టరీ పొగ గొట్టం…

ఒరేయ్…

ఒకసారి ఏమయిందంటే-

వేసవి సెలవులప్పుడు… మేమందరం తాతయ్యగారింట్లో వున్నాం కదా?, నేనూ తమ్ముడూ చెల్లీ పెద్దత్తయ్య కూతురు పింకీ (డాంకీ అంటే ఏడుస్తుంది) చిన్నత్తయ్య కొడుకు చిట్టి (పొట్టి అంటే ఏడుస్తాడు) అంతా పెద్ద బెటాలియనే అయింది. ఈ బెటాలియన్ అన్నమాట నాది కాదు, ‘ఏంటి బెటాలియన్ ఎక్కడికి బయల్దేరింది?’ అని బాబాయ్ మేం ఎక్కడికి బయల్దేరినా అడిగేవాడు.

అందరం వున్నాం గనుక ఏదయినా ఆటాడుకుందామని అనుకున్నాం. ఏ ఆట ఆడితే బాగుంటుంది? అని అంతా ఆలోచనలో పడ్డాం.

క్రికెట్ ఆడితే తంతామన్నాడు అన్నయ్య. (వాడు మాత్రం ఆడుకోవచ్చు పేద్ద…). కోతి కొమ్మచ్చి అని చెట్లెక్కి మీకు మీరే కష్టపడి కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకోవడమెందుకు నేనే విరిచేస్తానంది పిన్ని. బిల్లాదండి ఆడితే కళ్ళుపోతాయి, ఆ ఆట మాత్రం ఆడొద్దన్నాడు మావయ్య. ఎండలో ఆడితే హాలీడేస్ కేన్సలయిపోతాయి వార్నింగు ఇచ్చేసింది అమ్మ.

‘పులీ మేకా ఆడదాం’ అన్నాడు చిట్టి. ‘నాకు రాదురా పొట్టీ’ అంది పింకీ. ‘మంకీ ఆడకపోతే ఏం?, మనమాడుకుందాం’ అన్నాడు చిట్టి. అంతే. ఇద్దరూ జుట్టులు పట్టుకున్నారు. నేను విడదియ్యబోతే వద్దన్నాడు తమ్ముడు. ఎందుకురా- అంటే, ‘డబ్ల్యూ డబ్ల్యూ యఫ్ చూడనీ అన్నయ్యా’ అన్నాడు. అమ్మ కేక వినిపించి అప్పటికప్పుడు అందరం బుద్దిమంతులమయిపోయి నోటిమీద వేలేసుకున్నాం.

‘వేలు నోటి మీదే ఎందుకు వేసుకోవాలి? నోట్లో ఎందుకు పెట్టుకోకూడదు?’ తమ్ముడు అడిగాడు.

‘నోట్లో వేలు పెట్టుకోరు, సిగరెట్ పెట్టుకుంటారు’ అన్నాడు చిట్టి.

ఆ మాటకు పింకీ చెవులు మూసుకోకుండా ‘అమ్మా’ అని ఉపద్రవం ముంచుకొచ్చినట్టు అరిచి, నోటికి అరచేతిని అడ్డం పెట్టుకుంది.

‘సిగరెట్ తాగితే మైండు యాక్టివ్ అవుతుంది’

అలా అని మేం అనుకోలేదు. నాన్నా పెదమావయ్యా అనుకోగా విన్నాం. హుషారొస్తుందని కూడా ఈ పెద్దాళ్ళే అన్నారు.

మా ఆయన రోజుకు రెండు పెట్టెలు కాల్చేస్తారంటే- మా ఆయనకు నాలుగు పెట్టెలు సరిపోవు- అమ్మా పిన్నీ గొప్పలు చెప్పుకుంటూ వుంటారు. డాక్టరు వద్దనబట్టి గాని- మా ఆయనకు స్టంటులు వెయ్యబట్టిగాని- అని ఇద్దరూ సర్ది చెప్పుకుంటూ కూడావుంటారు.

‘అలా ఆలోచిస్తూ మబ్బుల్లా పొగని వదలడం గ్రేట్’ అన్నాడు చిట్టి.

‘రింగు రింగులుగా పొగను వదలడం ఇంకా గ్రేట్’ అన్నాడు తమ్ముడు.

‘ప్యాక్టరీ పొగ గొట్టంలా ముక్కులోంచి పొగ వదలడం భలే తమాషా మేజిక్’ అంది చెల్లి.

పింకీ ఆ పొగ పీల్చలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు నోటితో పాటు ముక్కు కూడా మూసేసుకుంది. కనుగుడ్లు పెద్దవి చేసింది.

‘మనలో అలాంటి హీరో లేడా?’ చుట్టూ చూస్తూ అన్నాడు చిట్టి.

నాకు హీరో అయిపోవాలనిపించింది.

‘యువార్ అవర్ హీరో’ అన్నాడు చిట్టి.

అంతే. నాన్నా మావయ్యా తాతయ్యా జేబులు వెతికేశాం. సిగరెట్టూ అగ్గిపెట్టే పట్టేశాం. తోటలోకి వెన్యూ మార్చేశాం.

రెండు క్షణాల్లో రెడీ. స్టయిలుగా గాల్లోకి విసిరిన సిగరెట్టుని నోటితో క్యాచ్ పట్టాను.

‘రజనీకాంత్’ అన్నాడు చిట్టి చప్పట్లు చరుస్తూ. అంతే. అందరూ చప్పట్లు అందుకున్నారు. పింకీ మాత్రం చూడలేనట్టు తన రెండు అరచేతులూ ముఖానికి అతికించుకుంది.

అగ్గిపుల్ల ముట్టించాడు చిట్టి. నా నోట్లో సిగరెట్టుని వెలిగించాడు. అందరూ చాలా ఇంట్రెస్టుగా చూస్తున్నారు. నేనే హీరోని, అందరూ జీరోలు అనుకున్నాను. మొత్తానికి నాకు నేనే పెద్దోడినయిపోయినట్టు అనిపించింది.

‘తాతయ్యలా కాల్చు’

‘మామయ్యలా కాల్చు’

‘లేదు, నాన్నలా కాల్చు’

‘హే.. రజనీకాంతులా కాల్చు’

ఒక్కొక్కరిదీ ఒక్కో డిమాండ్.

నేను పొగ గాట్టిగా గుండెల్లోకి పీల్చాను. బాగా. కాని ఎలా వదలాలో తెలీలేదు. ప్చ్…

‘చెవిలోంచి వదులు’ మర్చిపోయింది అప్పుడే గుర్తుకొచ్చినట్టు కంగారుగా గుర్తు చేశాడు చిట్టి. ‘నువ్వు 2.0 కాదు, 3.0’ అని ఎంకరేజ్ కూడా చేశాడు.

నేను పొగని వదలబోయి పొలమారాను. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నోట్లోని సిగరెట్ జారి కింద పడిపోయింది.

‘ఛ…’ బాధగా విసుక్కున్నాడు చిట్టి.

నాకు గుండెల్లో మంటగా తలంతా దిమ్మెక్కినట్టుగా అయిపోయింది.

సిగరెట్ కిందపడి ఆరినా- రింగు రింగులుగా ప్యాక్టరీ గొట్టంలోంచి వస్తున్నంత వొత్తుగా వస్తోంది పొగ.

‘సిగరెట్ కింద పడేసి మరీ పొగ తీస్తున్నావంటే నువ్వు రజనీకాంత్ కంటే గ్రేట్రా…’ చిట్టిగాడు సర్టిఫై చేసేశాడు. పొగ నోట్లోంచి రాలేదు. మరి ఎక్కడ్నుంచి వస్తోంది? ఎవరు కాలుస్తున్నారు?- అని వెనక్కి తిరిగి చూస్తే- ఇంకెవరు?

నాన్నా మావయ్యా ఇద్దరూ నోట్లోంచి సిగరెట్ తీయకుండానే నా నోటి మీద ఒక్కో గుద్దు గుద్దారు. ఆపై నా వీపు చిట్లగొట్టేసారంతే.

అందరూ నోటి మీద వేలేసుకు బుద్దిగా వెనక్కు జరిగారు.

నా మూతి హనుమంతుడి మూతిలా వాచిపోయింది.

‘ఎవడు చెప్పాడ్రా సిగరెట్ కాల్చమని?’ నాన్నా మావయ్యా కూడబలుక్కున్నట్టు అడిగారు.

‘మీరే!’ అని మేమెవ్వరం చెప్పలేకపోయాం!

 

-వెంకటేశ్వర్లు,

ఆరో తరగతి, ‘సి’ సెక్షన్,

జిల్లా పరిషత్ హై స్కూల్.

 

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.