సవరణ ?

జనం సుడులు తిరిగి పోతుంటారు
ఖాళీ పాదాలతో వట్టి చేతులతో
సామ్రాజ్యాలనిండా
తిండి కోసమే బతుకుతుంటారు
ఇది ఎంతకీ అభివృద్ది చెందని దేశ పటం

పేరు రాయబడిన గింజలన్నీ
రాబందుల కోసమే
ఆకలి కనబడని వోటు  వస్తువు
ఇది ఖద్దరు వ్యాకరణం

సమయాన్ని భుజాన వేసుకుని పోతూ పోతూ
కాళ్లు కొన్ని కొన్ని చోట్ల ఆగుతాయి
ఊరి నడి మధ్య బారు పాక వద్దనో
అచ్చంగా అయిదు రూపాయలకు
దొరికే అన్నం వద్దనో
అదిలించబడుతూ కనబడతాయి
ఇది రాజకీయ చతురత

ఎంత జీతమూ …. ఎంత చెట్టూ
ఎంత ఆకలి… ఏమంత పొట్ట… ఎంత గాలి
పీల్చినంతమేరా విషాన్నే పీల్చుకుని
నిద్రకి ఉపక్రమించినప్పుడు
కలలనిండా రంగు రంగుల నోట్ల ప్రపంచం
అవధులు లేని పేదవాడి ది ఆశ

రోజు కో సరికొత్త నోటు
రెప రెపలాడే  ఆరు రంగుల జండా కిందకి రా
నిన్ను దోచుకుంటున్న వాడిని దించేద్దాం
ఉచితంగా ఇస్తున్న ఈ మత్తుసీసా అందుకో
నువ్వు నా దైవానివి
మైకు లెప్పుడూ అబద్దాలు చెప్పవు
పొంతనలేని అయిదు వేళ్ళ మధ్యన
శృతి  కలవని చప్పట్ల మోత

రండి బాబు రండి  మీకొక్కళ్లకే చేతనైన
స్వయం వంచనను మీరే జయప్రదం చేయండి
ఒక్క మీట నొక్కండి
మేము  పండించిన మేము  మీ కలలకి గుర్తుగా
చూపుడువేలు మీద సిరాచుక్క వేయించుకోండి
బయటకెళ్ళి  ప్రజాస్వామ్యాన్ని బ్రతికించానని
సగం కనపడేలా వేలొకటి ఫోటో తీసి
లైకులు , షేర్ల కోసం అస్తమానం తడిమి చూసుకోండి
సాయంత్రానికి కాకిలెక్కల పండితుడొకడు నీ ఆశని ఆర్పేస్తాడు
కళ్ళు తెరిచేసరికి నీ నెత్తిమీద కూర్చోడానికొకడు
సిద్దమయి నీకో నమస్కార బాణం పడేస్తాడు
నీ అమ్ముడుపోయినతనం
ఎప్పుడో తాకట్టు పెట్టిన పుస్తెల తాడుకు
జమ అవుతుంది

లైకుల దండలేసి
నిన్ను నిప్పుల గుండం లోనికి తోసిన వాళ్లు
ఏవో పదవులు భుజానేసుకుని బయలుదేరతారు
షేర్ చేసిన పోస్టులు అడుక్కి తోక్కేయబడతాయి
ఎప్పటిలానే మోసపోయిన నువ్వు
ఆ తప్పులకు సవరణ ఎలాగా అని
ఊరి మధ్యలో కులం దిమ్మ కు   తలబాదుకుని ఆలోచిస్తుంటావు

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.